Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—12

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—12

( దృశ్యము 57 )

( చోళరాజు సువీరుని ఉద్యాన వనం )

( మహారాజు సువీరుడు, రాణితో పాటు కూర్చొని ఉంటాడు. ఇద్దరు రాజభటులు ముందు దారి చూపుతూ ఉండగా లక్ష్మి ఆవు దూడలను తోలుకొంటూ వస్తుంది. లక్ష్మి మహారాజుకి నమస్కరిస్తుంది )

లక్ష్మి -- మహారాజులకు జయమగు గాక ! మహారాణులకు మంగళమగు గాక !

సువీరుడు--- యాదవ వనితా !

లక్ష్మి -- మహారాజా ! నా పేరు రుక్మిణి !

సువీరుడు--- రుక్మిణీ ! నీ గురించి, యీ గోవత్సముల గురించి, మా భటులు చాల విషయాలు చెప్పారు ! అవన్నీ నిజమేనా ?

లక్ష్మి --- మహారాజా ! మీ భటులు ఏం చెప్పారో నాకు తెలియదు ! ఈ ఆవు దూడలు మాత్రము సామాన్యమయినవి కావని చెప్పగలను !

రాణి --- రుక్మిణీ ! నీ ఆవు జ్యోతిషం చెప్తుందట కదా !

లక్ష్మి ---- జోస్యం చెప్పదు మహారాణీ ! ధర్మ సందేహాలు తీరుస్తుంది.

సువీరుడు--- అవి మాకెలా తెలుస్తాయి ? ఈ గోవు వ్రాసే వ్రాత మేము చదువలేము కదా !

లక్ష్మి --- నుదుటి వ్రాత చదివే దైవజ్ఞులు, యీ గోవు వ్రాతలు చదవగలరు మహారాజా !

రాణి --- అదికాదు రుక్మిణీ ! ఈ ఆవుతో పాటు నువ్వు కూడ మాతోపాటు ఉండి పోవాలి.

లక్ష్మి --- క్షమించండి మహారాణీ ! ‘ పతి ఆనతి’ లేనిదే నేను పరాయి చోట ఉండలేను. నా పతి తపో దీక్షలో ఉన్నారు గనుక , అనుజ్ఞ తీసుకొనే అవకాశం లేదు.

సువీరుడు--- సరి, సరి ! ఇంతకీ ఈ ఆవు కొరకు, చెల్లించాల్సిన మూల్యం ఏమిటి రుక్మిణీ ?

లక్ష్మి --- మహారాజా ! ముందుగానే చెప్పాను గదా ! ఈ గోవత్సములు సామాన్య మయినవి కావని ! అటులనే అవి అమూల్యమయినవి ! ఆ గోవుకి మీ గోశాలలో ఉండడం ఇష్టమో కాదో అడిగి తెలుసుకోండి. ఇష్టం కాని చోట అది ఉండదు !

సువీరుడు--- అలాగా !

( అని గోవు దగ్గరకి వెళ్లి, దాని గంగడోలు ప్రేమగా నిమిరి అడుగుతాడు )

సువీరుడు-- గోమాతా ! నమోనమః !

( గోవు తల ఆడిస్తుంది )

సువీరుడు--- గోమాతా ! మా గోశాలలో , మా రక్షణలో ఉండడం నీకు సమ్మతమేనా ?

( గోవు అంబా అని అరిచి తల ఊపుతుంది )

లక్ష్మి--- మహారాజా ! గోవు తన సమ్మతిని తెలియ జేసింది !

సువీరుడు-- అలాగయితే, నేను చెల్లించాల్సిన మూల్యం ఏమిటి రుక్మిణీ ?

లక్ష్మి --- మహారాజా ! మూల్యము క్రింద నాకు ఇవ్వ వలసింది ఒకే ఒక మాట !

సువీరుడు-- ( ఆశ్చర్యంతో ) మాటా !?

లక్ష్మి --- అవును మహారాజా !

సువీరుడు అలాగే ఏమిటా మాట ?

లక్ష్మి --- అనాలోచితంగా , తొందర పాటుతో ఏ విధమయిన నిర్ణయము తీసుకోనని మాట ఇవ్వండి !

సువీరుడు-- ఓహో ! ఇది సర్వ సాధారణమయిన నియమమే ! ఇదేమంత కష్టము ! ఇంత వరకు నేను అనాలోచిత నిర్ణయము చేయనే లేదు ! ఇకపైన కూడ చేయనని మాట ఇచ్చుచున్నాను

లక్ష్మి --- మహారాజా ! అయిన నా మూల్యము చెల్లించినట్లే !! ఇక నాకు సెలవు ఇప్పించండి !

( అని ఆవు దూడలను ఒక సారి లాలించి వెళ్లిపోతుంది. )

********************* .

( దృశ్యము 58 )

( వేంకటాచలం దగ్గర ఒక పచ్చిక బయలు )

(ఒక గొల్లవాడు, ఆల మందలను ఆక్కడికి తోలుకొస్తాడు. మాయా-గోవు , దూడ కూడ వాటిలో ఉంటాయి )

( గోవుల్ని మేతకి వదిలి, గొల్లవాడు ఒక చెట్టు దగ్గర విశ్రమిస్తాడు. ఆ సంగతి గమనించిన గోవు మందను విడిచి, కొండ ఎక్కుతుంది. దూడ కూడ వెనక పడుతుంది )

*****************

( దృశ్యము 59 )

( స్వామి పుట్ట )

( గోవు అక్కడికి చేరి, ‘అంబా’ అని అరుస్తుంది. ఆ తరువాత పుట్ట దగ్గరకి చేరి, పుట్ట లోపలికి ‘క్షీరధారలు’ వదులుతుంది. పుట్టలోని విష్ణువు గోవు అరుపుకి తెప్పరిల్లి, ఆ క్షీరధారలను ఆప్యాయంగా త్రాగుతాడు )

( విధాత తనయొక్క , శివ శంకరుని యొక్క బల, వీర్య, తేజో, జ్ఞానములను, క్షీరధారల రూపమున విష్ణువుకి అందిస్తాడు )

****************

( దృశ్యము 60 )

( మహారాజు సువీరుని గోశాల )

( గొల్లవాడు పాలు పిండేందుకు పాత్ర తీసుకొస్తాడు. గోవు పాలివ్వదు ! సామాన్యమైన పాలా అవి !! )

( గొల్లవాడు ఆవు వంక ఆశ్చర్యంతో చూస్తాడు )

గొల్లడు --- ( తనలో ) ఇదేంటబ్బా ! ఆవు పాలివ్వదేంటి ? దూడగాని తాగేసిందా ? రేపు దూడను దాని దగ్గర లేకుండా చేయాలి !

******************

( దృశ్యము 61 )

( వేంకటాచలం దగ్గర ఒక పచ్చిక బయలు )

( గొల్లవాడు దూడను తన దగ్గరే కట్టి పడేసి, ఆ తరువాత విశ్రమిస్తాడు. గోవు సమయం చూసుకొని పారిపోతుంది )

*******************

( దృశ్యము 62 )

( స్వామి పుట్ట )

( గోవు అక్కడకు చేరి అంబా అని అరస్తుంది. ఆ తరువాత పుట్ట దగ్గరకి చేరి, పుట్ట లోపలికి క్షీరధారలు వదుల్తుంది. పుట్టలోని విష్ణువు గోవు అరుపుకి తెప్పరిల్లి, ఆ క్షీరధారలను ఆప్యాయంగా త్రాగుతాడు )

( ఆ విధంగా గోవు రూఫంలోని బ్రహ్మ , శివుడు తప్ప, తక్కిన దిక్పాలకుల మరియు , సకల దేవతా సమూహముల యొక్క,, బల, వీర్య, తేజో, జ్ఞానములను తన క్షీరధారల ద్వారా విష్ణువుకి తపో ఫలంగా సమర్పిస్తాడు )

*******************

( దృశ్యము 63 )

( మహారాజు సువీరుని గోశాల )

( గొల్లవాడు ఆవు పాలు పితికేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తాడు. ఆవు పాలివ్వదు. ఎందుకిస్తుంది? సామాన్యమైన ’క్షీరధారలా’ అవి !! )

గొల్లడు --- ఇదేమిటిది ? ఇవాళ కూడ పాలివ్వదేంటి ? ఏమయిందీ గొడ్డుకి ? దూడను నా దగ్గరే కట్టి వేస్తిని కదా ! రేపు దీని సంగతేదో కనిపెట్టి చూడాలి !

********************

( దృశ్యము 64 )

( వేంకటాచలం దగ్గర పచ్చిక బయలు. గొల్లడు చెట్టు దగ్గర పడుకొన్నట్లే నటిస్తూ, గోవును ఒక కంట కనిపెఢుతూనే ఉంటాడు. )

( మాయా గోవు మందను వదలి, దారితీస్తుంది )

*********************

( దృశ్యము 65 )

( స్వామి పుట్ట.! గోరూపంలోని బ్రహ్మ పుట్టలోకి క్షీరధారల ద్వారా, ముగ్గురమ్మల యొక్క తక్కిన సకల మాతృకా గణాల యొక్క, బల, వీర్య, తేజో, జ్ఞానములను, తపో ఫలముగా విష్ణువుకి సమర్పిస్తుంది )

( పుట్ట బయటినుంచి గొల్లనికి , విష్ణువు కనిపించడు . గోవు అలా పుట్టలో పాలు వదలడం చూసి, అతను నిర్ఘాంతపోతాడు. )

గొల్లడు -- అమ్మ ! మాయదారి గొడ్డా ! ఇదా నువ్వు చేస్తున్న పని ! పాలంతా పుట్ట పాలు చేస్తున్నావా ? ఉండు నీ పని చెప్తాను. ( అని తన చేతిలోని గండ్ర గొడ్డలిని , ఆవు పైకి విసురుతాడు )

( పుట్టలోని విష్ణువు గభాలున పైకి లేచి, గోవును రక్షింప బోతాడు. గొడ్డలి విష్ణువు తలకి తగిలి, గయమయి రక్తం ధార కడుతుంది. గొల్లవాడు ఆ దృశ్యం చూసి భయంతో మూర్ఛ పోయి ప్రాణాలు వదులుతాడు ! ఆ వెంటనే గోవు అంబా అని అరుస్తూ, మహారాజు దగ్గరకు బయలు దేరుతుంది )

********************

(దృశ్యము 66 )

( మహారాజు సువీరుని ఉద్యానవనం )

( సువీరుడు, రాణి కూర్చొని ఉంటారు. గోవు అంబా అని అరుస్తూ, పరుగు పరుగున వస్తుంది. రంకె వేసి ముందు కాలితో నేలని తవ్వుతుంది. తరువాత వెనక్కి తిరిగి నడుస్తుంది )

రాణి -- మాహారాజా ! ఏమంటుంది యీ గోవు ?

సువీరుడు-- మహారాణీ ! ఏదో అవాంతరము జరిగినదని అనిపిస్తోంది ! గోవు తనతో రమ్మనమని చెప్తోంది. ( అంటూ గోవు వెనకనే వెళ్తాడు )

*******************

( దృశ్యము 67 )

( స్వామి పుట్ట )

( గోవు దాని వెనకగా సువీరుడు అక్కడికి వస్తారు )

( గొల్లవాడు చనిపోయి ఉంటాడు.. విష్ణువు తలకి తగిలిన గాయాన్ని చేతితో అదుము కొంటూ, చింత చెట్టుని ఆనుకొని కూర్చొంటాడు .)

( సువీరుడు ఆ దృశ్యాన్ని చూస్తాడు. గొల్లని దగ్గరగా వచ్చి శ్వాస ఆదుతున్నాదీ లేనిదీ చూస్తాడు .అతడు చనిపోయాడని తెలుసు కొంటాడు )

( ఆ ప్రక్కనే ఉన్న రక్తసిక్తమయిన గొడ్డలిని కూడ చూస్తాడు )

సువీరుడు-- ( తనలో ) ఓహో ! ఈ యువకుడెవరో మన గోపాలుని కొట్టి, అతని మృత్యువునకు కారణమయ్యాడు !

( అనుకొని సరాసరి విష్ణువు దగ్గరకు వస్తాడు. రాజు విష్ణువుని తట్టి లేపుతాడు )

సువీరుడు-- ఏమయ్యా ! మా గోపాలుని మృతికి కారణమయిన వాడివి నీవేనా ? వాడు ఏ అపచారం చేసాడు !?

విష్ణు -- ఈ వల్మీకములో తపము నాచరించుచున్న నా క్షుదార్తిని, యీ గోవు తన క్షీరధారలతో తీర్చు చుండగా, మీ గోపాలుడు, వచ్చి, తన పరశువుతో గోవును దండించ బోయాడు ! అడ్డుపడిన నన్ను ఆ పరశువు గాయ పరచినది ! అంతకు మించి ఏమయినది నాకు తెలియదు ! అయినను, మీరెవరు ? ఆ గోపాలునకు యజమానులా ?

సువీరుడు-- గోపాలునకు , ఆ గోవుకు, యీ రాజ్యమునకు, ఈ పర్వత రాజమునకు, అంతటికీ నేనే యజమానిని ! ఈ దేశపు మహారాజును ! గోవు తన క్షీరమును తన యజమానికి గాక, తమకి సమర్పించుట దండనీయమైన నేరము కాదా ! గోపాలుడు దానిని దండించబోగా, అడ్డుపడి, గాయపడుట మీ అజాగ్రత్తయా, లేల వాని అపరాధమా ? పాపము యీ మాత్రము దానికి శాపమిచ్చి, వాని ప్రాణములు బాపుట తాపసులగు తమకు తగిన పనియేనా ?

విష్ణు --- రాజా ! పూర్వాపరములు తెలుసుకొనక ఊఁహా జనిత భావనతో ఏమి న్యాయనిర్ణయము చేసితివి !! గోపాలుని మృతికి నేను కారణమని నన్ను దూషించితివి ! సత్యశోధన చేయక తొందర పాటు తనముతో నాపై నేరము మోపినందుకు నీకు శాపమిస్తున్నాను ! నీవు తక్షణము పిశాచమగుదువు గాక !!

( సువీరునికి, యాదవ వనిత తన దగ్గర తీసుకొన్న మాట జ్ఞాపకానికి వస్తుంది. గతం అతని కళ్ల ముందు ధృశ్యమవుతుంది ! అతనికి జ్ఞానోదయం అవుతుంది )

( గోవు బ్రహ్మ అని, యాదవ వనిత రుక్మిణి మహాలక్ష్మి యని, తనకి శాపమిచ్చినది మహావిష్ణువని అర్థమవుతుంది )

సువీరుడు-- ప్రభూ ! దేవదేవా ! నారాయణా ! వాసుదేవా ! గోవిందా ! శరణు ! మీరన్నట్లు నేను తొందర పాటు తనముతో సత్య శోధన చేయక, చేయించక తప్పు చేసాను ! శ్రీమహాలక్ష్మికి ఇచ్చిన మాట తప్పాను ! నాకీ పిశాచ జన్మ సరియైన శిక్ష ! ప్రభూ ! నా యందు దయయుంచి శాప విమోచన మార్గము తెలియ జేయుము ! ( అని విష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు )

విష్ణు --- సువీరా ! నీ పిశాచ జన్మనుండి, స్వామి పుష్కరిణీ , స్నాన మహిమచే కాలక్రమమున విముక్తి నంద గలవు ! నీ కుమారుడు సుడర్మునికి రాజ్య పట్టాభిషేకము చేయుము ! నీ మనుమడు ఆకాశరాజుకు లక్ష్మీ అంశతో కలుగబోవు కన్యను నేను పరిణయ మాడినప్పుడు, నీకు పుణ్యలోకములు కలుగ గలవు !!

( సువీరుడు పిశాచంగా మారిపోతాడు )

( గోవు బ్రహ్మగాను, మందలోని దూడ శివునిగాను మారి తమ తమ లోకాలకు వెళ్లిపోతారు.)

( విష్ణువు , తలమీద గాయాన్ని చేతితో అదుముకొంటూ, స్వామి పుష్కరిణి వైపు దారి తీస్తాడు )

*******************

Comments

Popular posts from this blog

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౩—ఛిన్నమస్త

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’. “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’.   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త...

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...