Skip to main content

నీల గ్రహ నిదానము 8

నీల గ్రహ నిదానము 8

( తృతీయాంకము )

(శేష దృశ్యము )

( రోహిణీ నక్షత్ర మండలం__ గమనిక : రోహిణీ నక్షత్రం శకటాకారంగా ఉండే అయిది నక్షత్రాల కూటమి )

( రోహిణి పాన్పుపై కూర్చొని దశరథుని రాకకు ఎదురు చూస్తూ ఉంటుంది )

( దశరథుడు ధనుర్భాణములు చేత బట్టి, పూర్తి యుద్ధ వేషంలో వస్తాడు. )

( రోహిణి దశరథుని రాక చూసి, దోసిలతో పూలని తీసుకొని పాన్పు దిగి వస్తుంది,)

రోహిణి ---- ఆగుమాగుము అకళంక కీర్తిచంద్ర, అయోధ్యా పురీ రమేంద్రా !

(దశరథుడు ఆగిపోతాడు )

రోహిణి ---- శశాకుని ప్రియ భామిని అయిన ఈ రోహిణి నీకు స్వాగతము చెప్పుతున్నది.

( దోసెట్లో పూలు దశరథుని పాదాల మీద పోస్తుంది )

రోహిణి ---- స్వాగతం ! దశరథ రాజేంద్రా ! సుస్వాగతం !

దశరథ ---- మాతా ! మీ నక్షత్ర మండలమున నా యందలి ప్రీతితో, మీ రిచ్చిన స్వాగతము నా జీవితమున ఒక మధురానుభవము ! ఈ అల్పుని ప్రణామము స్వీకరించెదరు గాక !

రోహిణి ---- ( ఆశ్చర్యంతో ) ఇది యేమి అజ కుమారా ! నేను నీ శరణాగతను !! శరణార్థులు స్వాగత సత్కారములు చేయుటకే గాని స్వీకరించుటకు తగరు. నీవు నాకిట్లు నమస్కరించుట పాడి కాదు.

దశరథ ---- కొడుకెంత గొప్పవాడైనను, తల్లి కడ వినమ్రుడగుట పాడికాదనుట చెల్లునా ? పరమేష్ఠి సృష్టిలో మీ నక్షత్ర మండలమును ప్రజా రక్షణకై నిర్మించెనని సౌమ్య గురువరేణ్యులు సెలవిచ్చినారు. నేనును ప్రజా హిత రక్షా దీక్షా కంకణుడను ! సృష్టి క్రమమున మీరు ముందు నేను వెనుక, గనుక మనము మాతా _ పుత్రులమే ! కాదందురా తల్లీ ?

రోహిణి ----- ఆహా ! దశరథా ! నీ వెంతటి సౌజన్య మూర్తివి ! నీ అనునయ వినయ వార్తాలాపములు నా మనసుని పాశము వలె బంధించి, నీపై పుత్ర వాత్సల్యమునకు గురి చేయుచున్నవి !

దశరథ ---- ధన్యోస్మి మాతా ! నన్ను పుత్రునిగా నెంచిన నీ కఢ, నే నొక వరమడుగ వచ్చునా ?

రోహిణి --- కుమారా ! అవశ్యము ! నా శక్తికి చాలిన దేదైనను ఇచ్చెదను, కోరుకొనుము !

దశరథ --- తల్లీ ! శనైశ్వరుడు నా యభీష్టము మన్నించి నిన్ను విడిచి పెట్టి, కథ సుఖాంత మైనప్పుడు వేడుకొనేదను !
రోహిణి ---- అటులనే కానిమ్ము కుమారా !

దశరథ --- ( దనుర్ధారియై ) తల్లీ ! శనిదేవుడు వచ్చు దిక్కు ఎక్కడ ?

( రోహిణి ఫకాలున నవ్వుతుంది )

దశరథ ---- ( ఆశ్చర్యంతో ) పరిహాసమేల తల్లీ ?

రోహిణి --- ( నవ్వును ఆపుకొంటూ) దశరథా ! కాంతుల సముదాయమైన శనిదేవుడు, దుర్నిరీక్ష్యుడు సుమా ! చూడ గలిగిన వారికి అతడు, వలయాకారమగు నీలిరంగు మంటల చేత పరివేష్టితుడై కన్పట్టువాడు. శని వచ్చు దిశ ఏదియైనను, నీవు చూడ గలిగి నప్పుడు గదా ! ఆ బాణమును వదల గలవు ?

దశరథ --- ( దెబ్బ తని ) తల్లీ ! నా లక్ష్యము దృశ్యమైనను అదృశ్యమైనను శబ్దమును బట్టి -- శబ్దవేధిని సంధించ చీల్చ గలను !

రోహిణి ---- భళి ! సౌజన్యమునకే గాక సాహసమునకు కూడా నీలో లోటు లేదన్నమాట !-- ఇంకను నీ కడ ఏమేమి ఆయుధములు కలవు రాజా ?

దశరథ ---- ధనుర్వేద పారంగతుడైన నా తండ్రి వద్దను, కుల గురువు వశిష్ట మహర్షుల వద్దను, నేర్చిన అగ్ని, వరుణ, ఇంద్ర, వాయు, స్తంభన --- సమ్మోహనాది దివ్యాస్త్రములు చాల వరకు ఉన్నవి.

రోహిణి ---- ఎట్టి దివ్యాస్త్రములైనను , శనిని చుట్టుముట్టి ఉండే నీలి మంటలలో భస్మము కావలసినదే కుమారా ! నీ ధనుర్భాణములు కరవాలము అన్నియు నిరర్థకములే !

దశరథ ---- రవి తేజమును చూచుటకు మసి పూసిన కటకము నుపయోగించు చందమున , శని తేజమును చూచుటకు ఏవైన కటకములను సంపాదించ వలెనని అర్థమయినది. తల్లీ ! శస్త్రాస్త్ర ప్రయోగమునకు కూడ ఏదైన ఉపాయముండక పోదు !!

రోహిణి --- ( ప్రశంసా పూర్వకంగా చూస్తుంది ) అవును దశరథా ! అట్టి కటకముల నెట్లు సంపాదింతువు.?

( దశరథుడు ధనుర్భాణములు విడిచి, ప్రార్థనా భంగిమలో కూర్చొంటాడు )

దశరథ ---- తల్లీ ! నీ మనో విభుడైన శీత కిరణుని కడ అర్థింతును .--- (అని ధ్యానిస్తాడు )

దధి శంఖ తుషారాభం, క్షీరార్ణవ సముధ్భవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం

( దశరథుడు చంద్ర స్తోత్రం చేస్తూ ఉండగా , రోహిణి కూడ కృతాంజలియై చంద్రున్ని ప్రార్థిస్తుంది )

రోహిణి ---- ప్రాణ నాథా ! అమిత దుస్సాహసముతో నా రక్షణకై అరుదెంచిన ఈ రాజన్యుని , అభీష్టము నెరవేర్చెదరు గాక !!

( ప్రవేశం _ చంద్రుడు )

చంద్రుడు ---- ( దశరథుని దగ్గరగా వచ్చి ) అజ కుమారా ! నీ అభీష్టము మేరకు --- ప్రజ్వలిత జ్యోతిర్మయ తారకా గ్రహములు వేటినైనను చూడగల దివ్య చక్షువులను, నీ కొసగుచున్నాను. ( ధశరథుని కనులను స్పృశించి ) ---( రోహిణితో ) ప్రియే ! రోహిణీ ! లోహ , దారు , అస్థి , నిర్మితములగు శస్త్రములను విద్యుత్కాంతి ప్రభల తొడుగులో ప్రతిష్టించి ప్రయోగించిన యెడల అవి శని వలయమును ఛేదించుకొని పోగలవు ! ఈ రాజన్యుని శస్త్రములను అట్టి తేజో పూరితములు, చేయుటకు కుమార_ మంగళుని ప్రార్థింపుము .

రోహిణి ---- నాథా ! మంగళుడు మీ మిత్రుడే కదా ! మన మండలమునకు , మన అవసరార్థము విచ్చేసిన దశరథునికి సహకరించుట మనకు కర్తవ్యమన్న మాట మరిచితిరా ?

చంద్రుడు--- దేవీ ! అటులనే కానిమ్ము ! మన మందరము సామూహికముగ ప్రార్థించెదము గాక !

Comments

Popular posts from this blog

వాశిష్ఠ చెప్పిన వేదంలో కథలు---౩—ఛిన్నమస్త

{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని  ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’. “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’.   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త...

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...