{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.} అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’. “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’. “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త...
Comments
Post a Comment