గోవిందయ్య --- అదేంటమ్మా , అలా అంటావు, మనిషి చెట్టు అయిపోవడామేమిటి,నీకు మతి గాని పోలేదు కదా ?
ఆశ --- లేదు మామయ్యగారూ , నేను నిజమే చెబుతున్నాను. కావాలంటే మీరే పరీక్షించి చూడండి.
గోవిందయ్య – నిజమా, తమాషా చేయడం లేదు కద !
(అంటూ అశోక్ దగ్గరకు వెళ్తాడు. వెళ్లి అశీక్’ని కదిపి, కుదిపి చాల రకాలుగా ప్రయత్నం చేసి చూస్తాడు. అశోక్ నిరుత్తరుడై ,స్థిరుడై , కదలక, మెదలక ఉంటాడు )
ఆశ – చూసారా మామయ్యగారూ, ఎంత అన్యాయం చేసారో, చెట్టునయి పోతానని మనకి చెబ్తూనే ఉన్నారు, ఏ మందు మాకూ తిన్నారో ఏమో చివరకి అన్నంత పనీ చేసారు.
గోవిందయ్య --- అమ్మా, నేనొక కాలు, నువ్వొక కాలూ పట్టుకొని గట్టీగా లాగుదాం పద, కదుల్తాడో లేదో చూద్దాం !
ఆశ --- అలాగే మామయ్యగారూ !
( గోవిందయ్య, ఆశ అశోక్ చెరొక కాలూ పట్టుకొని లాగుతారు. అశోక్’లో చలనం ఉండదు, కాని వారిద్దరూ స్టేజి మీద బొక్కా, బోర్లా పడతారు , అది చూసి గౌరి ఏడుస్తూ వాళ్ల దగ్గరకు వస్తుంది )
( అశోక్ పైన గ్రీన్ స్పాట్ లైటు పడుతుంది. తక్కిన స్టేజి లైటింగు డిమ్ అవుతుంది. గోవిందయ్య, ఆశ , గౌరి ఫ్రీజ్ అవుతారు. అశోక్’లో చలనం వస్తుంది , స్టిల్’లో ఉన్న వాళ్ల చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తాడు. గోవీమ్దయ్య ప్రక్కగా వెళ్లి నిలబడతాడు)
అశోక్ ---- గ్రామం లోని సంతలో దొండకాయలు అమ్మి వచ్చావా నాన్నా ! పది కిలోల కన్న తక్కువగా ఉన్న సరుకుని గ్రామస్థులని బురడీ కొట్టి అమ్మేసావా ? గొప్ప పని చేసావు నాన్నా ! పెద్దవాడవయి ఉండి కోడలికి గుణ పాఠం చెప్పడం అటుంచి, దానికే వత్తాసు పలికి, అవినీతికి అమ్ముడు పొమ్మంటావా ? మీ దురాశా యఙ్ఞంలో సమిధనయి, ఇలా చెట్టుగా మారాను. ఇప్పుడేం చేస్తావు ? కాయ, పండు, కలప చివరికి ఆకులు కూడా ఇవ్వని చెట్టునయ్యాను. నాతో ఏం సంపాదిస్తావ్, ఎలా సంపాదిస్తావ్ ? చూడాలని ఉంది నాన్నా !
( ఆ మాటలన్నాక అశోక్ తిరిగి వచ్చి చెట్టులాగ నిలబడతాడు. గ్రీన్ స్పాట్ ఆరిపోతుంది. స్టేజి లైట్లు ఎప్పటిలాగే ప్రకాశవంత మవుతాయి )
( గోవిందయ్య, ఆశ, గౌరి లలో చలనం వస్తుంది )
గోవిందయ్య – ఆశా , చింతించకు, వాడు తిన్న మందూ మాకూ ఏదైనా సరే డాక్టర్ని పిలిచి ఇప్పుడే కక్కిస్తాను. నువ్వు గౌరిని తీసుకొని లోపలికి వెళ్లు, పిల్ల పాపం బెదిరి పోయింది
ఆశ --- అలాగే మామయ్యా,!
గౌరి --- తాతగారూ ! డాక్టరు గారు వచ్చి మందు వేస్తే నాన్నగారు తిరిగి మామూలుగా అయిపోతారా ?
( దుఃఖంతో అడిగిన గౌరిని ఆశ దగ్గరకి తీసుకొంటుంది. )
ఆశ – అవునమ్మా ! నాన్న తప్పక మళ్లీ మనిషి అయిపోతారు. పద, ముఖం కడుక్కొని తయారవుదువు గాని.
( అంటూ గౌరిని తీసుకొని పడక గదిలోకి వెళ్తుంది )
( గోవిందయ్య వీధిలోకి వెళ్తాడు )
( అశోక్ ఒక్కడే స్టేజి మీద నిలబడి ఉంటాడు )
( గోవిందయ్య ఒక డాక్టరుతో వీదిలోంచి వస్తాడు )
గోవిందయ్య --- డాక్టరు గారూ ! అడుగోనండి వాడే నా కొడుకు, పేరు అశోక్ , ఇప్పుడు చూడండి , అశీకిల్లు వృక్షంలాగ అయిపోయాడు.
డాక్టరు – గాబరా పడకండి, నా సర్వీసులో చాల మంది రోగుల్ని చూసాను, ఇలా జడంలాగ మారిపోయిన వాళ్లని -----
గోవిందయ్య – నిజమా డాక్టరు గారూ !!
డాక్టరు – నిజమే , కాని వాళ్లకీ , ఇతనికీ కొంచెం తేడా ఉంది.
గోవిందయ్య --- ఏమిటి డాక్టర్ ఆ తేడా ?
డాక్టరు --- వాళ్లలో కొంత మంది నా ట్రీట్’మెంటు పూర్తయ్యాక జడులయ్యారు.
గోవిందయ్య – తక్కిన వాళ్లు డాక్టర్ ?
డాక్టర్ –మరికొంత మంది నా బిల్లు చూసాక చేష్టలుడిగి పోయారు.
గోవిందయ్య --- అంటే మీ బిల్లు అంత ఘాటుగా ఉంటుందా డాక్టర్ !
డాక్టర్ --- అవును, అప్పటి నుంచి నేను రోగుల దగ్గర ఫీజు అడగడం మానేసాను.
గోవిందయ్య--- ఈ మాట నాకు చాల సంటోషం కలిగించింది డాక్టరు గారూ ! అంటే మీరు ఫ్రీగా వైద్యం చేస్తారన్న మాట ?
డాక్టరు --- అలాగని నేను చెప్పానా గోవిందయ్యగారూ !
గోవిందయ్య --- ఇప్పుడేగా ఫీజు అడగడం మానేసానన్నారు ?
డాక్టరు – రోగుల దగ్గర అడగడం మానేసానన్నాను గాని రోగి బంధువులని అడగడ లేదని అనలేదే ! నిజానికి నేను ఫీజు అడగను, కాగితం మీద వ్రాసి క్లయింటుకి చూపిస్తాను.
గౌరి ---- డాక్టర్ అంకుల్ ! మీరు రండి , నాన్న గారిని త్వరగా చూడండి.
( అంటూ గౌరి డాక్టర్ని అశోక్ దగ్గరకి తీసుకొని వెళ్తుంది . డాక్టరు అశోక్’ని రకరకాలుగా పరీక్షగా చూస్తాడు.)
డాక్టర్ --- రోగి హృదయ గతి, నాడి శ్వాస అన్నీ సరిగానే ఉన్నాయి ! రోగ లక్షణలేవీ లేవే !?
ఆశ --- డాక్టరు గారూ ! ఇతని రోగమేమిటంటే , ఇతను చెట్టులాగ నిలబడి ఉండిపోయారు. కేవలం ఇతని నడక , కదలికలు స్తంభించిపోయాయి !
గౌరి ---- డాక్టర్ అంకుల్ ! ప్లీజ్, మా నానగారికి నయం చెయ్యండి, ఏదైనా ఇంజక్షన్ ఇవ్వండి.
డాక్టర్ --- నిజమేనమ్మా, నువ్వు నిజమే చెప్పావు, ఒక ఇంజక్షన్ ఇచ్చి చూద్దాం !
( అంటూ ఒక ఇంజక్షన్ ఇస్తాడు , అశోక్’లో చలనం ఉండదు )
డాక్టర్ --- ఇతనికి రోగమేదీ లేదమ్మా ! శారీరికంగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కేవలం కదలికలు లేవు అంతే !
ఆశ --- ఎందుకు లేవు డాక్టర్ ?
డాక్టర్--- ఎందుకంటే ఇతను మానసికంగా బాధ పడుతున్నాడు. ఇతను తనని తాను చెట్టునని అనుకొంటున్నాడు .అందుకే కదలడం మానేసాడు.
ఆశ – ఎలా అనుకొంటే అలా అయిపోతారా డాక్టర్ ?
డాక్టర్ – అది ఆలోచనా స్థాయిని బట్టి ఉంటుంది ఆశాదేవి గారూ ! సాధారణంగా మన ఆలోచనలు ఒక బిందువు చుట్టూ కేంద్రీకరించవు, అలా గాని జరిగితే దానినే ధ్యానం అంటారు. అలా ధ్యానంలో గంటల తరబడి ఉండిపో గలిగితే సమాధి స్థితి కలుగుతుంది. ఆ స్థితిలోనే బాహ్య ప్రపంచ స్మృతులు ఉండవు. అలాంటి సమాధి స్థితిలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. సమాధిలోకి వెళ్లే ముందు తను చెట్టునని అతను అనుకొన్నాడు, అంతే ! చెట్టు అయిపోయాడు.
గోవిందయ్య--- డాక్టరు గారూ ! మీరు యొగపుంగవుల లాగ మాట్లాడుతున్నారు. ముందు ఈ సంగతి చెప్పండి, అశోక్ బాగవుతాడా లేదా ?
డాక్టరు – బాగయే అవకాశం ఉంది. నా లాంటి ఫిజీయన్లు ఇతనిని బాగు చేయలేరు ! మానసిక లేక న్యూరో సర్జన్లు ఇతనిని బాగుచేయవచ్చు !
గోవిందయ్య --- అలాంటి డాక్టర్లెవరైనా మీకు తెలిసిన వారెవరైనా ఉన్నారా ?
డాక్టరు --- ఈ పట్నంలో లేరనే చెప్పాలి. మీరు ఇతనిని డాక్టరు దగ్గరకు తీసుకొని వెళ్లలేరు కదా, డాక్టరే ఇక్కడికి రావాలి కదా ? అందులోనూ ఈ రోగిని బాగు చేసేందుకు కొంతమంది డాక్టర్ల సమూహం అవసరమవుతుంది ! అందరూ ఒకేసారి ఈ చోటుకి రావడం కష్టసాధ్యం అవుతుంది. అందుకని పేపర్లో ప్రకటన వేయించండి.
గోవిందయ్య --- అర్థమయింది డాక్టర్ ! మీ ఫీజు ఎంతో చెప్తే---
డాక్టరు – అవసరం లేదు, బిల్లూ లేదు, సొమ్మూ అక్కర్లేదు ! వింతల్లోకల్లా వింతని చూసాను ఈ రోజు ! మనిషి చెట్టుగా మారడమనే వింత , అదీ ఫ్రీగా ! వెళ్తాను గోవిందయ్యగారూ !
( అంటూ డాక్టర్ వెళ్లిపోతాడు )
గోవిందయ్య --- విన్నావా ఆశా , డాక్టరు గారు చెప్పిన మాట !
ఆశ --- విన్నాను మామయ్యగారూ ! ఏముంది అర్థం కాక పోవడానికి !?ఇంక ఇతనికి ఈ రోగం నుండి విముక్తి లేనట్లేనని తెలిసి పోయింది. ( అంటూ ఏడుస్తుంది )
గోవిందయ్య --- అలా నిరాశపడకమ్మా ! డాక్టర్ చెప్పినదేంటంటే అశోక్’కి వైద్యం కొంతమంది స్పెషలిస్టుల బృందం ద్వారానే సాధ్యమవుతుందని , వాళ్లమ్దరూ ఒకేసారి వచ్చి రోగిని చూడాలంటే పత్రికలలో ప్రకటన ద్వారానే సాధ్య మవుతుందని ! వింటున్నావా ఆశా ?
ఆశ ---- వింటున్నాను మామయ్యగరూ ! ( ఆంటూ ఏడుస్తుంది )
గోవిందయ్య --- నేను ఇప్పుడే ప్రెస్సుకి వెళ్లి, ఒక జర్నలిస్టుని తీసుకొని వస్తాను.
గౌరి --- తాతయ్యా ! జర్నలిస్టు వస్తే నాన్నకి బాగయి పోతుందా ? ( అమాయకంగా అడుగుతుంది )
గోవిందయ్య --- అవునమ్మా , అత్అను వచ్చి నానా ఫోటోలు తీసి పత్రికలలో ప్రకటన ఇస్తాడు. అప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు పట్ణాల నుండి వచ్చి, నాన్నని చూసి, పరిక్షించి బాగుచేస్తారమ్మా !
గౌరి --- అలాగయితే వెంటనే వెళ్లండి తాతయ్యా, నాన్న పాపం ! టిఫిన్ కూడా తీసుకోలేదు. ఇంకా రాత్రి అయితే చలికి నాన్నాకి జలుబు కూడా చేసేస్తుంది !
( ఆశ గౌరి మాటలు విని ఆమెని ఒళ్లోకి తీసుకొని ఏడుస్తుంది )
గోవిందయ్య --- ధైర్యంగా ఉండండమ్మా ! ఇప్పుడే వెళ్లి వస్తాను.
( గోవిందయ్య బయటికి వెళ్తాడు. స్టేజి మీద ఆశ, గౌరి ఒకరి నొకరు ఓదార్చుకొంటూ ఉంటారు. ఇంతలో బయటి నుంచి గొవిందయ్య దారి చుపిస్తూ ఉండగా చేతిలో కెమేరాతో జర్నలిస్టు ప్రవేశిస్తాడు )
జర్నలిస్టు --- గోవిందయ్యగారూ ! ప్రెస్సు వాళ్లని పిలవడానికి వెళ్లనక్కర లేదు, ఎక్కడ సమాచరముందో అక్కడికి ప్రెస్సు ప్రత్యక్షమవుతుంది !
గోవిందయ్య --- అప్పుడే మీకెలా తెలిసిపోయిందండీ !?
జర్నలిస్టు --- మీ డాక్టరుగారే నాకు ఫోనులో నాకు సందేశం ఇచ్చేసారు.
గోవిందయ్య --- అలాగా ! చాల సంతోషం ఇదుగో ఇలా వచ్చి నా కొడుకుని చుడండి. వాడు నిజంగానే చెట్టుగా మారి పోయాడు. ( అంటూ అశోక్’ని చూపిస్తాడు )
( జర్నలిస్టు అశోక్ దగ్గరకి వచ్చి చూస్తాడు. అశోక్’ని కుదిపి, కుదిపి చూస్తాడు. గ్రుచ్చి గిల్లి చూస్తాడు. కితకితలు పెట్టి చూస్తాడు. ఇంకా రకరకాలుగా హిమ్సించి చూస్తాడు, కాని అశోక్’లో చలనం ఉండదు )
జర్నలిస్టు --- గోవిందయ్యగారూ ! నాకయితే మీ అబ్బాయి చెట్టుగా మారాడన్న విషయం తెలిసింది. ఇది నిజంగానే సంచలన వార్త అవుతుంది ! కాని ఇతని ఫొటో పేపర్లో వేస్తె, చూసిన జనాలకి ----
గోవిందయ్య – (సంభ్రమంతో ) జనాలు ఎగబడి వస్తారా సార్ ?
జర్నలిస్టు--- రారు అనే అనిపిస్తోంది ! ఎందుకంటే ఏ కోణం లోంచి చూసినా ఇతను మనిషి లాగే కనిపిస్తున్నాడు తప్ప చెట్టులాగ కనిపించడం లేదు.
గోవిందయ్య --- జనాలు రావాలంటే ఏం చేయాలి సార్ ?
జర్నలిస్టు – చెప్తానుండండి—(అంటూ ఆశ వైపు చూసి ) ఆశాదేవి గారూ ! ఏదీ ఒక చీపురు కట్ట తీసుకొని రండి
ఆశ --- చీపురు కట్ట ఎందుకండీ ?
జర్నలిస్టు--- అబ్బ, ప్రశ్నలు వేసి విసిగించకండి, చీపురుకట్ట తెండి.
( గౌరి ఇంట్లోకి వెళ్లి చీపురు కట్టతో వస్తుంది )
( జర్నలిస్టు ఆ చీపురుకట్టని అశోక్ కుడి చేతి వంపులొ పెడతాడు. అలా పెట్టాక కెమేరాలొంచి చూసి )
జర్నలిస్టు --- ఇప్పుడొక బాల్చీ , తాడుతో సహా తీసుకొని రండి.
( ఆశ లోపలికి వెళ్లి ఒక బాల్చిని తాడుతొ సహా పట్టుకొని వస్తుంది )
( జర్నలిస్టు ఆ బాల్చిని అశోక్ రెండు కాళ్ల సందున నిలబెట్టి , తాడుని అశోక్ నడుము కేసి చుడతాడు. తిరిగి కెమేరాలోంచి చూస్తాడు )
జర్నలిస్టు --- ఇప్పుడు ఒక అలుకు గుడ్డని, చిరిగి పొయిన తట్టని పట్టుకొని రండి .
( ఆశ లోపలికి వెళ్లి ఒక చింకి తట్టని, అలుకు గుడ్డని తెస్తుంది )
( జర్నలిస్టు చింకి తట్టని అశోక్ తలమీద పెడతాడు, అలుకు గుడ్డని ఎడమ చేతి వంపులో ఆర వేస్తాడు. మళ్ళి కెమేరాలోంచి చూస్తాడు )
జర్నలిస్టు --- గోవిందయ్యగారూ , ఏదైనా పాము ఉందా మీ ఇంట్లో ?
గోవిందయ్య --- పామా ! పాములు ఇళ్లల్లో ఉండవండీ , బొక్కల్లో ఉంటాయి !
జర్నలిస్టు – అసలైన పాము కాదండి, నకిలీదైనా ఫరవాలేదు, చచ్చినదైనా ఫరవాలేదు, తెచ్చి ఇతని మెడలో వెయ్యండి
గోవిందయ్య --- గౌరి బొమ్మల బుట్టలో ఒక ప్లాస్తిక్ బల్లి ఉమ్దండీ, తెమ్మంటారా ?
జర్నలిస్టు --- సరే, తెప్పించండి !
( గౌరి ఇంట్లోకి వెళ్లి ఒక బల్లిని తెచ్చి అతని చేతికి ఇస్తుంది )
( జర్నలిస్టు ఆ బల్లిని అశోక్ ఛాతీ మీద అంటిస్తాడు. తిరిగి కెమేరా లోంచి చూస్తాడు )
జర్నలిస్టు --(తృప్తితో ) ఇప్పుడు అలంకారాలన్నీ పూర్తి అయ్యాయండీ ! ఏ మానవ మాత్రుడూ ఇలాంటి అలంకారాలతో ఫొటో దిగడు కాబట్టి , ఇప్పుడీయన ఫొటో తీసి , క్రింద చెట్టు అని వ్రాసినా ఎవరైనా నమ్ముతారు ఏమంటారు గోవిందయ్య గారూ ?
గోవిందయ్య --- ఇంత సేపటికి మీ ఆశయం , అభిప్రాయం అర్థమయ్యాయండీ , నిజమే చెప్పారు.
జర్నలిస్టు --- ఆశాదేవిగారూ , రండి ! ఇలా వచ్చి మీ ఆయన ప్రక్కనే నిల్చోండి. మీ ఫొటోని కూడా వెయ్యాలిగా మరి !
( ఆశ ఒక పువ్వుల మొక్క దగ్గర నిలబడుతుంది. )
ఆశ --- నా ఫొటో ఈ పూల చెటు దగ్గరే తీయండి. ఆ చెట్టుతో వద్దు.
జర్నలిస్టు --- ఏమండీ, అసహ్యంగా కనిపిస్తుందనా, సందేహిస్తున్నారు ?
( ఆశ జవాబివ్వదు )
జర్నలిస్టు – అర్థమయింది లెండి. సరే, అక్కడే నిల్చోండి
( అంటూ చెట్టునీ ఆమెనీ ఫొటోలు తీస్తాడు అతనా ఫోటోలు తిస్తూ ఉండగా, నేపథ్యం లోంచి భజగోవింద శ్లోకాలు వినిపిస్తాయి)
శ్లోకం --- భజ గోవిందం, భజ గోవిందం / గోవిందం భజ మూఢ మతే !
యావత్పవనో నివసతి దేహే/ తావత్పృఛ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే / భార్యా భిభ్యతి తస్మిన్ కాయే !
( తాత్పర్యం --- ఎప్పటి వరకు జీవిలో ప్రాణ వాయు సంచారం ఉంటుందో అప్పటి వరకు , లోకులు అతని కుశల సమాచారాలు అడిగుతారు. ప్రాణం పోయిన మరుక్షణం , అతని భార్య సైతం అతనిని అసహ్యించుకొంటుంది )
జర్నలిస్టు --- గోవిందయ్య గారూ మీరు కూడా రండి. ఫొటో తీస్తాను.
గోవిందయ్య --- నా ఫొటో మాత్రం నా చెట్టుతోనే తియ్యండి.
( అంటూ అశోక్ దగ్గరకి వెళ్లి నిలబడతాడు. ఆశ గౌరిని తీసుకొని ఇంట్లోకి వెల్లిపోతుంది )
( జర్నలిస్టు గోవిందయ్య ఫొటోని అశోక్’’తో తీస్తాడు )
జర్నలిస్టు --- గోవిందయ్య గారూ ! నాకు సెలవిప్పించండి. ఈ ఫొటో వెంటనే పేపర్లో వేయిస్తాను. ఫొటో చుసిన మరు క్షణం నుండే మీ ఇంటికి జనాలు తండోప తండాలుగా వస్తారు. ఎందుకంటే ఇది అలౌకిక ఘటాన కదా ! నా సలహా ఏమిటంటే మీరు టికెట్టు పెట్టి జనాలకి ఈ వింత వృక్షం చూపించండి.
గోవిందయ్య ---పదహరణాల మాట సెలవిచ్చారండీ ! ఇప్పుడె మీతో పాటు వచ్చి, బిల్లు బుక్కులు మీ ప్రెస్సులోనే వేయిస్తాను.
( అంటూ గోవిందయ్య బయటి ద్వారం దగ్గరకి వెళ్తూ స్టేట్యూ అవుతాడు .తెరలోంచి భజ గోవింద శ్లోకాలు వినిపిస్తాయి.)
శ్లోకం --- భజ గోవిందం, భజ గోవిందం,/ భజ గోవిందం మూఢమతే !
మూఢ జహీహి ధనాగమ తృష్ణాం / కురు సద్భుధ్ధిం మనసి విత్రుష్ణాం,
యల్లభసే నిజ కర్మోపాత్తం / విత్తం తేన, వినోదయ చిత్తం !
( తాత్పర్యం – ఓ మూఢ మానవుడా ! ధనాన్ని కూడబెట్టాలనే లాలసని విడిచిపెట్టు ! నీవు నీ మనస్సులో తృప్తిని సంతోషాన్ని నిలుపుకో ! ధనాగమం అనేది నీ కర్మ ఫలితసన్ని బట్టి కలుగుతుందని తెలుసుకో ! )
( గోవిందయ్య బయటికి వెళ్తాడు )
( గౌరి మధ్యద్వారం నుండి ప్రవేశిస్తుంది. అశోక వృక్షం దగ్గరకి వెళ్తుంది.)
గౌరి --- ఎంత అసహ్యంగా అలంకరించారో డాడీని ! ఇలా చెయ్యడానికి వీళ్లకి మనసెలా ఒప్పిందో !
( అంటూ గౌరి ముందుగా అశోక్ ఎడమ చేతి వంపులొ ఆరేసిన అలుకు గుడ్డని తీసేస్తుంది. తరువాత చీపురు కట్టని , బాల్చీని తీసేస్తుంది. దాని తాడుని విప్పేసి దూరంగా పెడుతుంది. ఆ తరువాత ఇమ్ట్లోంచి ఒక స్టూలు తెచ్చుకొని , దాని మిద ఎక్కి, అశోక్ తలమీద పెట్టిన తట్టనీ, ఛాతీకి అంటించిన బల్లినీ తీసేస్తుంది. తరువాత స్టూలుని లోపలికి తీసుకొని వెళ్లి, మరల ఒక కప్పు టీతో వస్తుంది.)
గౌరి --- నాన్నా ! నీకు టీ అంటే ఇష్టం కదా నాన్నా , తాగు నాన్నా, తాగు !
( అంటూ టీని అశోక్ కాళ్ల మధ్యలొ, చెట్టుకి నీళ్లు పోసే విధంగా పోస్తుంది. ఆ తరువాత ఖాళీ కప్పు పట్టుకొని లోపలికి వెళ్లిపోతుంది )
( గౌరి వెళ్లిన తరువాత అశోక వృక్షం మీద గ్రీన్ కలర్ స్పాట్ లైటు పడుతుంది. స్టేజి లైట్లు డిమ్ అవుతాయి. అశోక్ కదుల్తాడు, స్టేజి మధ్యకి వచ్చి ప్రేక్షకులని ఉద్దేశించి మాట్లాడుతాడు )
అశోక్ --- రండి , మహానుభావులారా రండి, మీ అందరికీ ఈ అశోక్ సుస్వాగతం ! ( నమస్కరిస్తాడు ) ఈ వింతని చూడడానికి పని కట్టుకొని, పరుగెత్తుకొని , టిక్కెట్లు కొనుక్కొని మరీ రండి. నాకు తెలియక అడుగుతాను, మీకూ నాకూ తేడా ఎక్కడుంది ? మీరు కాళ్లూ చేతులూ కదిలించే చెట్లు అయితే నేను కదలలేని చెట్టుని ! ఏం మీలో వృక్ష లక్షణాలు లేవంటారా ? మీ ఆత్మ ఘోషని అణచివేసి, ధనార్జన కోసం, ఈ ప్రపంచం లోని అవినీతి అనే విష వాయువులని పీలుస్తూ, నైతికత అనబడే ప్రాణ వాయువులని విసర్జిస్తూ సంచరించే చెట్లు మీరందరూ ! కారంటారా ? అలా చెయ్యలేక, చేతకాక ఫక్తు చెట్టుగా మారిన వాణ్ని నేను ! ఇందులో వింత ఏముంది ? ఒక చెట్టుని మరొక చెట్టు చూసేందుకు రావడం వినోదం కాదా ఏం ? రండి నేనూ చూస్తాను, మీలో ఎందరు జడులో ,ఎందరు మహానుభావులో రండి, నేను కూడా గమనిస్తాను. ఎవరో ఒకరు ,‘ అన్నా హజారే’ లాంటి వారు వచ్చి సందర్శిస్తే నెను ధన్యుణ్ని అవుతాను, ఆ రోజే తిరిగి మనిషిగా మారుతాను. రండి , బాబూ రండి !
( అంటూ పక పకా నవ్వేసి తిరిగి తన స్థానం దగ్గరకి వెళ్లి చెట్టులా నిల్చొంటాడు )
( అశోక్ వచ్చి నిల్చోగానే స్పాటు లైటు ఆరిపోతుంది. స్టేజి లైట్లు కూడా ఆరిపోతాయి. అవి తిరిగి ప్రకాశవంత మవుతాయి. )
( ఆశ ఒక కుర్చీ మీద కూర్చొని కనబడుతుంది. అశోక్ ఎప్పటి లాగే చెట్టులాగ నిల్చొని ఉంటాడు. గోవిందయ్య ఆశ దగ్గరకి వస్తాడు )
గోవిందయ్య – ఆశా ! ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడడానికని వచ్చాను.
( ఆశ లేచి నిలబడుతుంది )
ఆశ --- చెప్పండి మామయ్యగారూ !
గోవిందయ్య – ఫరవాలేదు కూర్చోమ్మా !
ఆశ--- ( కూర్చొంటుంది ) విషయమేమిటో చెప్పండి.
గోవిందయ్య – చూడమ్మా, వీడు చెట్టుగా మారి ఏడాది పైన అయిపోయింది కదా ! ఎంతో మంది డాక్టర్లు, స్వామీజీలు వచ్చి చూసి వెళ్లి పోయరు కదా ! అయినా ఎవరూ అశోక్’ని మనిషిని చెయ్యలేక పోయారు. కదమ్మా ?
ఆశ --- అవును మామయ్యగారూ ! ఎవరూ అతనిని మామూలుగా చెయ్యలేక పోయరు ( అని నోట్లో చెంగు క్రుక్కుకొని ఏడుస్తుంది )
గోవిందయ్య – అదేనమ్మా, నేను కూడా చెప్తున్నది, ఇక పోతే ఈ చెట్టు కూడా ఇక మనుష్యులని ఆకర్షించ లేక పోతోంది. జనాలు రావడం దాదాపు మానేసారు. అందు వల్ల మన ఆదాయం కూడా పడి పోయింది, అవునా ?
ఆశ – నిజమే మామయ్యగారూ ! చెట్టు ఆదయం పడిపోయింది.
గోవిందయ్య --- అందుకే నేనొక బేరం పెట్టి వచ్చానమ్మా !
ఆశ ---బేరమా ! ఎలాంటి బేరం మామయ్యగారూ ?
గోవిందయ్య --- ఈ చెట్టునే బేరానికి పెట్టాను. పూర్తిగా దీన్ని అమ్మేయాలని నిశ్చయించుకొన్నాను.
ఆశ --- చెట్టుని అమ్మేస్తారా మామయ్యగారూ ?
( అలా అంటూనే ఆశ సంభ్రమాశ్చర్యాలతో నిలబడుతుంది )
గోవిందయ్య --- కూర్చోవమ్మా ఆశా ! గాభారా పడకు , ముందు నేను చెప్పేది విను. అశోక్ చనిపోయినట్లే భావించి, మన ప్రభుత్వం , అతని యొక్క ప్రావిడెంటు ఫండు, పెన్షను కూడా మనకి ఇస్తున్నారు కదా ! ఇప్పుడు దీన్ని అమ్మేస్తే వచ్చిన తప్పేమిటి ?
ఆశ --- మామయ్యగారూ , మరి నా మంగళ సూత్రం, నా సుమంగళీ తనం, ఏమవుతాయి ?
గోవిందయ్య --- నువ్వు నిత్య సుమంగళివమ్మా , దానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. నేను అమ్ముతానన్నది కట్టెలు కొట్టే వాళ్లకి కాదు, వాళ్లకి ఈ చెట్టు పనికి రాదు కదా !
ఆశ – మరి ఎవరికి అమ్ముతారు మామయ్యగారూ ? దీన్ని కొనే వాళ్లు ఎవరు ?
గోవిందయ్య --- అదెనమ్మా ఈ గోవిందయ్య వ్యాపార రహస్యం ! ఈ చెట్టుని కొనేది లండన్ లోని ఒక మ్యూజియం అధికారులు. దీనిని ఇలాగే తిసుకొని వెళ్లి అక్కడ గాజు తొట్టెలో పెడతారు. దాని వల్ల నీకు వైధవ్యమూ రాదు, అంతే కాదమ్మా, ఈ చెట్టు వల్ల మనకి మేడ మీద గది వేసుకోవడం ఇబ్బందిగా ఉంది కదా ? అది కూడా నెరవేరుతుంది.
ఆశ ---సరే, మామయ్యగారూ ! మీకు ఎలా సమ్మతమని తోస్తే అలాగే చెయ్యండి, ఎంతైనా ఈ చెట్టుకి యజమాని మీరే కదా ?
గోవిందయ్య --- అలాగంటావేమమ్మా ! నేను చేసేది నాకు ఒక్కడికే కాదు గదా., మేడ మీద గది కట్టిస్తే మ్రింద ఇంటిని మనం అద్దెకి ఇచ్చుకోవచ్చు, ఏమంటావు ?
ఆశ ---- సరదాకి అన్నాను మామయ్యగారూ , ఇంతకీ చెట్టుకి ఎంత బేరం పెట్టారు ?
గోవిందయ్య --- పది లక్షలు ఇస్తారమ్మా ! ఈ గోవిందయ్య ఏది చేసినా లాభానికే చేస్తాడు.
ఆశ – పది లక్షలా ! బేరం బాగుంది మామయ్యగారూ ! ఆ డబ్బు గౌరి పెళ్లికి పనికొస్తుంది.
గోవిందయ్య – నాకు తెలుసమ్మా, నువ్వు అంగీకరిస్తావని, అందుకే కూలీని కూడా పిలిపించాను. వాడు ఈ పాటికి వచ్చి ఉండాలే ! ఏమయ్యాడు చెప్మా ?
( వీధి వైపు వింగు లోంచి కూలీ ప్రవేశం )
కూలీ --- వచ్చేసానండి, ఏ పని చేయలో చెప్పండి.
( గోవిందయ్య కూలీ వంక అనుమానంగా చూస్తాడు )
గోవిందయ్య --- నేను పంపించమని అడిగింది నిన్నేనా ?
కూలీ --- నన్నేనండి, నేను సామాన్యమైన కూలీని కానండి, కూలోళ్లందరికీ లీడర్నండి, నా పేరు నరసింహంమండి !
గోవిందయ్య --- ఏమిటీ నువ్వు కూలీలకి నాయకుడివా ?
కూలీ ---అవునండి, నేను సామాన్యమైన కూలీని కాదండి.
గోవిందయ్య --- అంటే ఏమిటి నీ ఉద్దేశం ? నీకు కూలీ ఎక్కువ ముట్ట చెప్పాలా ?
కూలీ --- నేను న్యాయంగా అడిగిన కూలీ ఇచ్చెయ్యాలండి,
గోవిందయ్య --- అడీగినంతా ఇచ్చెయ్యాలా ?
కూలీ --- చెప్పాను కదండీ , నేను న్యాయంగానే అడుగుతానండి.
ఆశ --- ముందు పనేమిటో చెప్పండి మామయ్యగారూ ! వాడు ఎంత అడుగుతాడో చూద్దాం !
గోవిందయ్య --- సరేనమ్మా ! పనికి ముందే బేరాలు ఆడేవాళ్లంటే నాకు గిట్టదు, అయినా నువ్వు చెప్పేవు కాబట్టి--- ఇదుగో నరసింహం , ఈ చెట్టు చూసావా, దీన్ని వేళ్లతో సహా పెకలించి వేయాలి, అర్థమయిందా ?
( కూలీ నలుదిక్కులా చూస్తాడు, చెట్టు కోసం ! )
గోవిందయ్య – అలా దిక్కులు చూస్తావేం ? నీ రేటు ఏమిటో చెప్పు.
కూలీ --- చెట్టు ఎక్కడుంది బాబయ్యా ?
గోవిందయ్య --- ఓహో నికు తెలియదు కదూ ! ఇదుగో చెట్టులా నిలబడ్ద మా అబ్బాయి అశోకే నువ్వు కూల్చాల్సిన చెట్టు.
కూలీ --- తెలుసు బాబయ్యా ! ఆయన చెట్టుగా మారాడని తెలుసు, నేను టిక్కెట్టు కొని కూడా చూసాను. కాని----
గోవిందయ్య – ఇంకా కానీ ఏమిట్రా ? ముందు పని కానియ్యి.
కూలీ --- డబ్బులు సంపాదించే చెట్టుని కూల్చి వేయడం ఏమిటండీ ? దీన్ని కూల్చేయడం కాదు , దీని చుట్టూ గుడి కట్టించండి.. గుడి కట్టి పూజ చేయండి. బంగారు గ్రుడ్లు పెట్టే బాతుని ఎవరైనా చంపుకొంటారేంటండి ?
గోవిందయ్య --- ఒరేయ్ ! ఎక్కువగా మాట్లాడకు, నువ్వీ పని చెయ్యకపోతే పో ! నేను మరొకరిని పిలుచుకొంటాను.
కూలీ ---- అది జరగని పని బాబయ్యా ! ఈ నరసింహం పని చెయ్యకుండా దిగిన గడపని ఇంకే కూలీ ఎక్కడండీ ! నేను ముందే చెప్పాను కదండీ, లీడర్నని !
గోవిందయ్య --- అంటే నువ్వు పని చెయ్యవు, ఇంకొకరిని చెయ్యనివ్వవు, అంతేనా ?
కూలీ --- పని చెయ్యనని అనలేదండి. నాకు న్యాయంగా తోచిన దాన్నిచెప్పాను, అంతే ! చెట్టు రూపంలో ఉన్నా ఆయన మనిషేనండి. మనిషిని కూల్చడం మర్డర్ అవుతాదండి, నేను మర్డర్లు చేయనండి.
గోవిందయ్య --- మనిషి కాదురా , అది చెట్టు !
కూలీ --- కాదండీ , మనిషేనండి !
గోవిందయ్య --- కాదు, చెట్టు
కూలీ – మనిషి
గోవిందయ్య --- చెట్టు
కూలీ ---- మనిషి
ఆశ --- ( కల్పించుకొని ) మీరు ఆగండి మామయ్య గారూ ! నేను మాట్లాడుతాను, బాబూ నరసింహం ! నువ్వు న్యాయం మాట్లాడుతావని తెలిసింది. చాల సంతోషం ! మేము ఈ చెట్టుని కూల్చాలనుకొన్నది అతన్ని మర్డర్ చేయడానికి కాదు
గోవిందయ్య --- వాడితో మాటలేమిటమ్మా ?
కూలీ --- మీరు చెప్పండమ్మా ! చెట్టుని కొట్టాలని అనుకోవడం దాన్ని మర్డర్ చెయ్యడమే కదమ్మా ?
ఆశ --- కాదు బాబూ ! ఈ చెట్టుకి మన దేశంలో వైద్యం జరగదు , అందుకని దీనిని సమూలంగా పెకలించి లండన్ పంపాలని అనుకొంటున్నాం, అక్కడయితే అతన్ని మ్యూజియంలో పెడతారు. ఎందరో శాస్త్రఙ్ఞులు అతన్ని చూసి ఏం చేస్తే తిరిగి మామూలుగా అవుతారో పరిశోధిస్తారు. ఇప్పుడు తెలిసింది కదా, పని చేస్తావో లేదో చెప్పు.
( గౌరి ప్రవేశం మధ్య ద్వారం లోంచి )
గౌరి ---- వద్దమ్మా ! నాన్నని చంపెయ్య వద్దు. నీళ్లు నేను పోస్తాగా, ఇక్కడి నుంచి ఎక్కడికీ పంపెయ్యొద్దు !
కూలీ --- చూసావమ్మా ! చిన్న పిల్లకి అర్థమయింది కూడా నీకు తెలియడం లేదు. చెట్టుని కూల్చేయడం దాన్ని మర్డర్ చేయడమే అవుతుంది. మర్డర్ జరిగాక దానిని ఎక్కడకి పంపినా అది నమూనా వే అవుతుంది గాని, అసలు సిసలు పంపించినట్లు అవదు. నమూనల పైన ప్రయోగాలు చెయ్యడం ఏమిటి తల్లీ ? అది జరగని పని.
( కూలీ మాటలకి ఆశ గోవిందయ్యలకీ ఇద్దరికి కోపం వస్తుంది )
గోవిందయ్య --- నీ ధర్మ పన్నాలు ఎవడికి కావాల్రా ? చేతనయితే చెయ్యి, లేదా వెళ్లి పో ! చెట్టు నాది , నరుక్కొంటానో నాటుకొంటానో నా ఇష్టం !
కూలీ --- అర్థమయింది బాబయ్యా ! ఈ చెట్టు నమూనాని విదేశాలకి పంపి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నావు. ఈ కూలీ నరసింహం అలాంటి తప్పుడు పనులు చెయ్యడు.
గోవిందయ్య --- అయితే ఇంకా నిలబడే ఉన్నావేం ?
కూలీ --- సర్లే, వెళ్తాను, ఒక్క విషయం గుర్తుంచుకో, నరసింహం పని చెయ్యనని దిగిన గడప ఇంకొక కూలీ ఎక్కడు ! కూల్చడానికయితే మాలో ఎవుడూ ముందుకు రాడు, మందిరం కట్టేటట్లయితే చెప్పు, వచ్చి ఫ్రీగా పని చేస్తాం.
( కూలీ వెల్లిపోతాడు. ఆశ, గోవిందయ్య ముఖాముఖాలు చూసుకొంటారు)
ఆశ --- కూలీ వెల్లిపోయాడు, ఇంకెవరూ రారు అంటున్నాడు, ఇప్పుడు ఏం చేస్తారు మామయ్య గారూ ?
గోవిందయ్య --- ఈ కూలీ వెధవలు చేసే పని నేను చెయ్యలేనని అనుకొంటున్నావా , కాకపోతే కాస్త సమయమ్ పట్టవచ్చు అంతే !
ఆశ--- అంటే మీరే కూల్చేస్తారా ?
గోవిందయ్య --- అవును.
( గోవిందయ్య గునపం అందుకొని చెట్టు మొదలుకేసి , గురి పెడతాడు . గౌరి ఆ దృశ్యాన్ని చూస్తుంది. చెట్టుని కౌగలించుకొని ఏడుస్తుంది )
గౌరి --- వద్దు తాతయ్యా, నాన్నని చంపెయ్యవద్దు,
గోవిందయ్య – అమ్మా ఆశా ! గౌరిని లోపలికి తీసుకొనొ పో ! ఇది ఇక్కడే ఉంటే పని జరగనివ్వదు.
( ఆశ గౌరి చెయ్యి పట్టుకొని లోపలికి ఈడ్చుకొంటూ వెళ్తుంది. గౌరి గింజుకొంటూ , “నాన్నని చంపొద్దు తాతయ్యా ” అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆశ ఆమెని బలవంతంగా తీసుకొని పోతుంది )
( గోవిందయ్య గునపాన్ని చెట్టు మొదలుకేసి కొట్టి త్రవ్వబోతాడు.)
( అదే సమయానికి చెట్టు పైన గ్రీన్ కలర్ స్పాట్ లైటు పడుతుంది. చెట్టులో చలనం వస్తుంది చెట్టు గోవిందయ్య చెయ్యిని పట్టుకొంటుంది)
అశోక్ --- ఆగండి నాన్నగారూ !
(గోవిందయ్య ఆశ్చర్యంతో అశోక్ వంక చూస్తాడు.)
గోవిందయ్య – నువ్వు బ్రతికే ఉన్నావా అశోక్ !!
అశోక్ – అవును నాన్నగారూ ! నేను చెట్టునుండి తిరిగి మనిషిగా మారిపోయాను నాన్నగారూ ! నేను మామూలు మనిషిగా మారడం మీకు సంతోషంగా లేదా నాన్నగారూ ?
( గోవిందయ్య అశోక్ మాటలకి క్షణం సేపు కొయ్యబారి పోయి, తిరిగి వెంటనే తేరుకొంటాడు)
గోవిందయ్య --- లేదురా నా కొడకా !! నువ్వు మనిషిగా మారేందుకు వీలులేదు. నీ చరిత్రకి చెట్టుగానే ముగింపు పెడతాను.
( గోవిందయ్య అశోక్ కాలికేసి గునపంతో త్రవ్వబోతాడు )
( అంతలో స్టేజి లైట్లు ఆరిపోతాయి. గ్రీన్ స్పాటు కూడా ఆరిపోతుంది. స్టేజి క్షణకాలం అంధకారంలో మునిగిపోతుంది )
( తిరిగి లైట్లు వెలగగానే అశోక్ యహ్తాప్రకారం చెట్టుగానే నిలబడి ఉంటాడు. గౌఇరి అశోక్ దగ్గరే నిలబడి ఉంటుంది. )
గౌరి --- నాన్నా, ఏమయింది నాన్నా ? ఆట పూర్తయి పోయింది నాన్నా ! మీరు మళ్లీ మనిషిగా మారిపోండి.
అశోక్--- అవునమ్మా, ఆట ముగిసి పోయింది ! ఈ ఆట ద్వారా కొన్ని జీవిత సత్యాలు నేర్చుకొన్నానమ్మా !
( ఆశ మధ్య ద్వారం నుండి, గోవిందయ్య బయటీనుంచి ప్రవేశిస్తారు. గోవిందయ్య చేతిలో ఖాళీ సంచీలు ఉంటాయి )
ఆశ – ఏమండీ మీరు అలా ఉండిపోయరేం ! కలగాని కనడం లేదు కదా ?
అశోక్ --- అవును ఆశా ! నిల్చొని నిల్చొని కలగన్నాను. ఆ కలలో జీవితంలో మరచిపోలేని నిజాలు చూసి న్బిలువునా వణికాను !! ( అని గోవిందయ్య వంక చూసి ) నాన్నగారూ, మీరు దొండకాయలు సంతలో అమ్మేసి వచ్చారా ? సంచీలు ఖాళీగా ఉన్నాయి ( అని అడుగుతాడు )
( గోవిందయ్య తల దించుకొంటాడు )
అశోక్ --- నాన్నగారూ ! ఇందులో తప్పేముంది, లంచం తీసుకొని ఆదాయం పెంచుకొనే దాని కన్నా, ఈ పని ఎన్నో రెట్లు ఆమోద యోగ్యమయినది . ఈ రోజు నుండి మనం మన కుటుంబ ఆదాయాన్ని నిజాయితీగా, పట్టుదలతో పని చేసి, పెంచుకొందాం.
గోవిందయ్య – అశోక్ ! ఏమయిందిరా, నీకు, ఏమేమో మాట్లాడుతున్నావు ?
అశోక్ – నాన్నా, ఆశా, గౌరీ అందరూ వినండి ! నా కల గురించి చెప్తాను శ్రధ్ధగా వినండి . అది విన్నాక నేను ఎలా మసలుకోవాలో, మనం ఎలా మనుగడ సాగించాలో తేల్చి చెప్పండి.
( అంటూ అశోక్ ఆశ , గోవిందయ్యల భూజల మీదుగా చేతులు వేసి, గౌరి అనుసరిస్తూ ఉండగా మధ్య ద్వారం వైపు వెల్తూ ఉండగా స్టిల్ --)
( తెరలోంచి భజ గోవింద శ్లోకాలు వినబడతాయి )
శ్లోకం --- భజ గోవిందం, భజ గోవిందం / భజ గోవిందం మూఢమతే !
సస్సంగత్వే నిస్సంగత్వం / నిస్సంగత్వే నిర్మోహిత్వం
నిర్మోహిత్వే నిశ్చల తత్వం / నిశ్చల తత్వే నిర్మల బుధ్ధిః
తాత్పర్యం --- సజ్జనులారా ! సత్సంగత్వం ద్వారా , జీవితంలో భ్రమలని తొలగించుకొని , నిశ్చల బుధ్ధిని పొందవచ్చు.
( తెర పడుతుంది )
*************
************
Oct 10, 2011
Sep 4, 2011
వృక్ష విలాపం--- ఏకాంక నాటిక --2
గోవిందయ్య --- అశోక్;లో మార్పు వస్తుందంటావా ఆశా ?
ఆశా --- పురుషుడికి స్త్రీ అవసరం చాల ఉంటుంది మామయ్యగారూ ! నా దగ్గరనుండి అవన్నీ పొందాలంటే అతను తనని తాను మార్చుకోక తప్పదు. మీరు చూస్తూ ఉండండి..
గోవిందయ్య --- నువ్వు ధైర్యంతో నిలబడి ,దానిని ఒక యఙ్ఞం లాగ నిర్వహించవమ్మా, నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది !
( అశోక్ మధ్య ద్వారం నుండి ప్రవేశిస్తాడు )
అశోక్ --- ఏమిటీ, ఏదో యఙ్ఞం అంటున్నారు ?
గోవిందయ్య – (గతుక్కుమంటాడు తరువాత సర్దుకొని) మరేం లేదురా అబ్బాయ్ ! మన ప్రక్క వీధిలో గాయత్రీ యఙ్ఞం నిర్వహిస్తున్నారు, అమ్మాయితో నేను ఆ విషయమే చర్చిస్తున్నాను.
అశోక్ ---- మీ ఇద్దరి మధ్య ఏ యఙ్ఞం నడుస్తోందో నాకు అర్థమయింది నాన్నగారూ ! ( అని భావుకతతో ) ఒక యజమానిగా నేనీ ఇంటి సుఖ సంతోషాలకి ఎలాంటి లోటు కలగనివ్వను. ఇది నా ప్రతిఙ్ఞగా తీసుకోండి నాన్నగారూ, నేనీ రోజు నుండి ఒక వృక్షంగా మారిపోతాను.
ఆశ --- ఏమంటున్నారండీ, వృక్షం లాగ మారడమేమిటి ?
అశోక్ --- ( గోలెంలో ఉన్న ఒక మొక్క దగ్గర నిలబడి ) అవును ఆశా ! నిజమే చెప్తున్నాను. ఈ మొక్కలని చూసావా ఆశా, ఇవి కార్బన్ డయాక్సైడ్ లాంటి విష వాయువులని పీల్చుకొని, ప్రాణ వాయువుని మనకి ఇస్తాయి కదా , అదే విధంగా నేను ఈ రోజు నుండి ఆఫీసు పనిలో విషవాయువులని సంగ్రహించి, మన ఇంట్లో సుఖ సంతోషాలని నెలకొల్పుతాను. నేను వృక్షంగా మారిపోయి, నీ కలలని సాకారం చేస్తాను ఆశా ! ( అని వీధిలోకి వెళ్లిపోతాడు )
( ఆశ, గోవిందయ్య కొంత సేపు మౌనంగా ఉండిపోతారు.)
ఆశ --- మామయ్యగారూ, ఈయన మన మాటలని విన్నట్లున్నారు.
గోవిందయ్య --- ఎప్పుడు ఎలా విన్నాడన్నది అప్రస్తుతం ఆశా ! ఈ రోజు నుండి మన ఇంటికి ----
ఆశ --- మంచి రోజులు వచ్చాయంటారా మామయ్యగారూ ?
గోవిందయ్య --- అందుకు సందేహ మేముందమ్మా ?
ఆశ --- నిజమే మామయ్యగారూ, మన ఇల్లు లక్ష్మీ ధామం కానుంది..
( ఇద్దరూ నవ్వుకొంటూ ప్రసన్న ముద్రలో స్టిల్ అయి విగ్రహాలలా నిలబడి పోతారు.)
( అదే సమయానికి నేపథ్యం నుండి కొన్ని శ్లోకాలు వినిపిస్తాయి )
శ్లోకం --- భజ గోవిందం, భజ గోవిందం / గోవిందం భజ మూఢమతే !
సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి ఢుంగృత్ కరణే !!
భజ గోవిందం, భజ గోవిందం / గోవిందం భజ మూఢమతే !
( ఇద్దరూ తెప్పరిల్లుతారు )
ఆశ --- మామయ్యగారూ ఈ శ్లోకాలు ఎక్కడ నుంచి వినిపిస్తున్నా యంటారు ?
గోవిందయ్య --- చెప్పాను కదమ్మా , మన ప్రక్క వీధిలో గాయత్రీ యఙ్ఞం జరుగుతోందని , ఆ శాలలో ఇలాంటి శ్లోకాలు వేయడం మామూలే !
ఆశ --- సరే మామయ్యగారూ, మీరు సంతకి వెళ్లే సమయమైంది.
గోవిందయ్య --- నిజమేనమ్మా, ( అంటూ రెండు సంచీలు పట్టుకొని వీధిలోకి వెళ్తాడు.
( ఆశ మధ్య ద్వారం లోకి వెళ్తుంది )
( సమయం గడిచిందనే సంకేతంగా స్టేజి మీద లైట్లు ఒక్కసారిగా డిమ్ అయి మళ్లీ వెలుగుతాయి )
( గౌరి స్కూలు బేగుతో వీధి ద్వారం లోంచి వస్తుంది )
గౌరి --- అమ్మా, అమ్మా !
ఆశ --- ( పడక గది లోంచి ప్రవేశించి ) ఏమిటమ్మా, అంట హడావుడి పడి పోతున్నావు, టిఫిన్ తింటావా?
గౌరి --- నాన్నగారు ఆఫీసు నుండి వచ్చే వేళ అయింది కదమ్మా, నేను నాన్నా కలిసే తింటాం.
ఆశ --- అరెరే నువ్వు మీ నాన్న కూచివన్న మాటే మరచిపోయానే, సరే లోపలికి వెళ్లి ముందు నీ స్కూలు యూనిఫారం మార్చుకో, పద--- ( అంటూ గౌరిని తీసుకొని మధ్య ద్వారం నుండి వెళ్తుంది )
( అశోక్ వీధిలోంచి ప్రవేశిస్తాడు , చేతిలో ఒక చీర పాకెట్ ఉంటుంది )
అశోక్ --- ఆశా. ఓ ఆశా !
ఆశ ---( ప్రవేశించి ) ఏం తెచ్చారండీ ?
అశోక్ --- నీ కోసం చీర తెచ్చాను.( అంటూ పేకట్టు ఆశ చేతికి ఇస్తాడు )
ఆశ – (దానిని విప్పి చూస్తుంది ) అరె, పట్టు చీరలాగ ఉందే, చాల బాగుంది, ఎంత అయిందండీ, ( అని లేబిల్ని చూసి ) వెయ్యి రూపాయలా !? ఎలా కొన్నారండీ, జీతం డబ్బుల్తో కాదు కదా-- ?
అశోక్ – (పర్సు ఆమె చేతికిచ్చి ) చూసుకో !
( ఆశ పర్సు తెరచి డబ్బులు లెక్కిస్తుంది )
ఆశ --- జీతం సొమ్ములు పూర్తిగానే ఉన్నాయే ! మరి ఈ చీర ఎలా వచ్చింది. మీ పై సంపాదనతోనా ?
అశోక్ – అవును నీతో చెప్పే వెళ్లాను కదా, నేను చెట్టునయి-- పోతానని---
ఆశ --- పొండి, హాస్యానికైనా హద్దు పద్దు ఉండాలి. --- ( అని ) గౌరీ – గౌరీ ---
( గౌరి ప్రవేశం స్కూలు దుస్తులు కాక వేరే బట్టలు కట్టూకొని వస్తుంది )
ఆశ --- గౌరీ !
గౌరి ---ఏంటమ్మా ?
ఆశ --- గౌరీ, నాన్నగారి పర్సు అలమారాలో పెట్టేయ్. నేను పక్కింటీ పిన్ని గారికి ఈ చీర చూపించి వస్తాను – అన్నట్లు నాన్నగారికి టీ పెట్టి ఉంచాను, అది గ్లాసులో పోసి ఇచ్చెయ్యి. సరేనా ?
గౌరి--- అలాగేనమ్మా ! ( అని పర్సు పట్టుకొని పడక గదిలోపలికి వెళ్తుంది )
ఆశ --- (అశోక్;తో) ఏమండీ !మీరు టీ త్రాగేసి గౌరితో మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను.
( అంటూ వీధిలోకి చీర పేకట్టుని తీసుకొని వెళ్తుంది )
( గౌరి ప్రవేశం, చేతిలో టీ గ్లాసు పట్టుకొని)
గౌరి ---- నాన్నగారూ, టీ తీసుకోండి.
( అశోక్ ఆమె చేతిలోని తీసుకొని త్రాగుతాడు )
గౌరి --- నాన్నగారూ, నా కోసం ఏం తెచ్చారు ?
అశోక్ ---- నీ కోసం లాజెన్సు తెచ్చానమ్మా !
గౌరి --- నేను ర్గు పళ్లు తమ్మని చెప్పాను కదా ?
అశోక్ – పొరపాటు అయిపోయిందమ్మా, కాని నేను తెచ్చిన లాజెన్సు రేగు పళ్ల రసంతో చేసినవే నమ్మా. తిని చూస్తే నీకే తెలుస్తుంది.
గౌరి – అలాగయితే ఆ లాజెన్సుని మీ జేబులోనే ఉండనివ్వండి.
అశోక్ ---- ఏమమ్మా , కోపం వచ్చిందా ?
గౌరి --- లేదు, నాన్నగారూ ! ఇవాళ ఒక చక్కటి ఆట ఆడుదాం, మీరు చెట్టులా మారిపోయి అలా నిలబడండి, నేను మీ మీదకి ఎక్కి, ఆ లాజెన్సుని తీసుకొంటాను, సరేనా ?
అశోక్ --- అలాగే ! ఈ చెట్టు ఆట నీకు ఎవరు నేర్పారమ్మా ?
గౌరి --- ఇవాళ క్లాసులో చెట్టు పాఠం చెప్పారు నాన్నా , చెట్లు మనకెన్నో రకాలుగా సహాయం చేస్తాయి తెలుసా ?
అశోక్ – సరేనమ్మా, నీ కోసం రేగు చెట్టుగా మారతాను, మరి ఎక్కడ నిలబడమంటావ్ ?
( గౌరి , అశోక్ చెయ్యి పట్టుకొని స్టేజి అంతా తిరుగుతుంది, చివరకి ఒక మూల ఎంచుకొని అశోక్’కి చూపిస్తుంది )
గౌరి – నాన్నా ! ఇదుగో ఈ మూల నిలబడండి.
అశోక్ --- చెట్టుగా నేనెప్పుడో అయుపోయానమ్మా గౌరీ , ఒక నడిచే చెట్టు;గా మారాను, ఈ రోజు నీ కోసం ఇక్కశ స్థిరమై పోతాను ( అంటూ ఔరి చూపించిన చోట నిలబడతాడు )
( అశోక్ చెట్టులా నిలబదతాడు. గౌరి అతని మీదకి ఎక్కి అతని జేబులోని లాజెన్సుని తీసుకొంటుంది. క్రిందకి జారి వాటిని తింటుంది )
గౌరి --- నాన్నగారూ, ఈ లాజెన్సు అచ్చు రేగు పళ్లలాగే ఉన్నాయి కొంచెం తియ్యగా, కొంచెం పుల్లగా !
( అంటూ అశోక్ వైపు చూస్తుంది, అశోక్ మాట్లాడడు )
గౌరి --- మాట్లాడవేం నాన్నా --- అన్నట్లు చెట్టుగా మారిపోయావు కదా, ఎలా ,మాట్లాడుతావ్ ? నాదే పొరపాటు, సరే ఎలాగూ చెట్టయు పోయావు కదా, కాసేపు నీతో ఆడుకొంటాను.
( గౌరి ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాట పాడుతుంది )
గౌరి పాట ---- ఓ నా వృక్షమా , చక్కని వృక్షమా ! పళ్లు పువ్వులూ ఇచ్చేటి వృక్షమా!
చల్లని నీడనీ , చక్కని గాలినీ ఎప్పుడూ ,ఆకు ఎడతెగక ఈయుమా !!
( ప్రవేశం ఆశ. చేతిలో చీర పాకెట్టుతో , వస్తూనే వాళ్లిద్దరినీ ఆ భంగిమలో చూస్తుంది.)
ఆశ --- గౌరీ ఏమిటే ఇది, ఏం చేస్తున్నావ్ ?
గౌరి --- అమ్మా , నాన్న నేను చెట్టు ఆట ఆడుతున్నామే, నాన్న చెట్టు అయిపోయాడే !
ఆశ --- అలాగా, నీ చక్కటి చెట్టుని అడగ వలసినవి పళ్లూ, పూవులూ కాదే, రా ! నాతో కలిసి పాట పాడు.
( ఆశ , గౌరి ఇద్దరూ అశోక్ చుట్టూ తిరుగుతూ, చప్పాట్లు కొడుతూ పాట పాడుతారు )
ఆశ + గౌరి – ( పాట )— ఓ నా వృక్షమా , చక్కని వృక్షమా ! చీరలూ దుస్తులూ సమకూర్చే వృక్షమా !
ధన ధాన్య సమృధ్ధి కలిగించే వృక్షమా , లక్ష్మీ ధామంగా ఇంటిని మార్చేటి వృక్షమా !
సుఖ శాంతి నిండేలా మమ్మల్ని దీవించు వృక్షమా !! ఓ నా వృక్షమా, చక్కని వృక్షమా !!
ఆశ --- గౌరీ, నీ చెట్టుని మళ్లీ నాన్నగా మార్చేయి.టిఫిన్ తినిపించేద్దాం, పాపం పొద్దున్న పప్పు ముద్ద తిని వెళ్లారు.
( ఆశ వంటింట్లోకి వెళ్తుంది )
గౌరి --- నాన్నా, ఓ నాన్నా ! ఆట ముగిసింది,
( అశోక్ మాట్లాడడు అలాగే నిల్చొంటాడు)
గౌరి – నాన్నగారూ , ఆట అయిపోయింది, రండి మళ్లీ మా మంచి నాన్నగా మారిపోండి.
( అశోక్ మాట్లాడడు అలాగే నిల్చొంటాడు)
గౌరి – నాన్నా, ప్లీజ్ రండి టిఫిన్ తిందాం.
( అశోక్ మాట్లాడడు అలాగే నిల్చొంటాడు)
గౌరి --- ( ఏడుస్తుంది ) అమ్మా ! నాన్న నిజంగానే చెట్టు అయిపోయాడే !!
ఆశ – (మధ్య ద్వారం లోంచి వస్తుంది ) ఏమయిందే ?
గౌరి -- ( ఏడుస్తూ ) అమ్మా ! నాన్న నిజంగానే చెట్టు అయిపోయాడే !!
ఆశ --- నాన్న చెట్టు అయిపోవడమేంటే ? ఏమండీ మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా ? ఆట ముగిసింది, మళ్లీ మనిషిగా మూరిపోండి.
(అశోక్ నిరుత్తరుడై స్థిరంగా ఉంటాడు )
ఆశ – గౌరీ, మీ నాన్న నిల్చొనే నొద్ర పోతున్నారే ! పద అతన్ని కుదిపి, కదిపి లేవనెత్తుదాం.
( ఆశ, గౌరి, అశోక్;ని పట్టుకొని తోసి లాగి కిత కితలు పెట్టి ప్రయత్నం చేస్తారు ).
(అశోక్ నిరుత్తరుడై స్థిరంగా ఉంటాడు )
ఆశ – ఏమండీ లెండి, ఎందుకలా మమ్మల్ని ఏడిపిస్తారు?
(అశోక్ నిరుత్తరుడై స్థిరంగా ఉంటాడు )
ఆశ --- గౌరీ, పదవే, నువ్వో కాలు నేనొక కాలు పట్టూకొని లాగుదాం. ఎలా కదలరో చూస్తాను.
( ఆశ గౌరి అశోక్ చెరొక కాలు పట్టుకొని లాగుతారు.అశోక్;లో చలనం ఉండదు. పైపెచ్చు వాళ్లిద్దరూ స్టేజి పైన బొక్కా బోర్లా పడతారు )
గౌరి – (కూర్చొనే )అమ్మా ! నాన్న నిజంగానే చెట్టు అయిపోయాడా అమ్మా ?
ఆశ --- ( కూర్చొనే ) గౌరీ , నీకేం జవాబు చెప్పాలో తెలియడం లేదే , నాకు ఏమీ అర్థం కావడం లేదు !
( చెట్టుగా మారిన అశోక్ పైన ఒక గ్రీన్ స్పాట్ లైటు పడుతుంది. తక్కిన స్లేజి లైట్లు డిమ్ అవుతాయి. ఆశ , గౌరి అలాగే కూర్చొన్న భంగిమలోనే స్టిల్ అవుతారు )
( గ్రీన్ స్పాట్ లైటు పడగానే అశోక్;లో చలనం వస్తుంది. అశోక్ ,ఆశ—గౌరిల చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి, వాళ్ల కి వెనకగా, ప్రేక్షకులకి ఎదురుగా నిలబడతాడు )
అశోక్ --- గౌరీ ! నువ్వు కాదమ్మా నన్ను చెట్టుని చేసింది. ఇదుగో ఈ మామా కోడళ్లు నన్ను ఇదివరకే చెట్టుగా మార్చేసారు. నువ్వింకా చిన్న పిల్లవమ్మా, నీకు అర్థం కాదు, నీకు అర్థమయే వయసు వచ్చినప్పుడు నేనెందుకు చెట్టుగా మారానో తెలుస్తుందమ్మా, అప్పుడు నన్ను క్షమించ గలవమ్మా !
( అశోక్ ఆశ దగ్గరగా వచ్చి నిలబడతాడు.)
ఆశ --- ఏమన్నావ్ ఆశా ! ఏమన్నావ్ , భార్య ప్రేమని పొందాలంటే , భర్త పై సంపాదన తేక తప్పదని అన్నావు కదూ! ఇప్పుడు చూపించు , ఇప్పుడీ చెట్టుని ప్రేమించ గలవా ఆశా ? ప్రేమ అనేది వస్తు వినిమయం ద్వారా కలిగేది కాదని ఎప్పుడు తెలుసుకొంటావు ? ఇప్పుడు చెయ్యి నీ ఇచ్చి పుచ్చుకొనే వ్యాపారం !!
( అని నవ్వుతూ తిరిగి తన గ్రీన్ స్పాట్ దగ్గరకి వెళ్తాడు.స్పాటు ఆరిపోతుంది అశోక్ తిరిగి చెట్టులాగ స్థిరమయి పోతాడు.)
( స్టేజి మీద లైట్లు బ్రైట్ అవుతాయి. ఆశ గౌరిలలో చలనం వస్తుంది )
( ప్రవేశం – గోవిందయ్య. చేతిలో ఖాళీ సంచులు ఉంటాయి )
గోవిందయ్య --- ఏమిటమ్మా, ఆశా ఏమయింది ?
ఆశ – ( దుఃఖంతో ) మీ అబ్బాయి --- మీ అబ్బాయి –చెట్టయిపోయారు మామయ్యగారూ !
Sep 1, 2011
వృక్ష విలాపం---ఏకాంక నాటిక---1
(అవినీతి నిర్మూలన కఠినాతి కఠినమైన చట్టం వల్ల కేవలం అదుపు లోకి మాత్రమే వస్తుంది., దాని అంతం మన మనసుల్లో పరివర్తన వల్లనే సాధ్యమవుతుంది . ‘అన్నా’ సందేశాన్ని చాటే నాటిక ఇది.)
ఇందులోని పాత్రలు ----- ౧ . అశోక్, ౨. ఆశ. ౩. గౌరి. ౪. గోవిందయ్య.౫. ఒక డాక్టరు. ౬. ఒక జర్నలిస్టు. ౭. ఒక కూలీ.
పాత్ర పరిచయం --- గౌరి --- ఎనిమిదేళ్ల బాలిక : అశోక్ --- గౌరి తండ్రి, మధ్య తరగతి గృహస్థు : ఆశ --- గౌరి తల్లి: గోవిందయ్య – అశోక్ తండ్రి : ఇక తక్కిన పాత్రలు--- డాక్టర్, కూలీ, జర్నలిస్టు
(దృశ్యం - అశోక్ ఇల్లు. కుడి వైపు వింగు వీధిలోకి , ఎడమ వైపు వింగు ఇంటిలోని పడక గది లోకి .మధ్య నుండే వింగు వంట గదికి దార తీస్తాయి. వేదిక ఆ ఇంటి చావడి. కొన్ని మొక్కల గోలేలు , వంట ఇంటి గుమ్మం దగ్గర ఒక దొండ పాదు ఉంటాయి )
( సమయం --- ఉదయం ఎనిమిది గంటలు )
( అశోక్ గడ్డానికి షేవింగ్ క్రీము రాసుకొని , పడక గది గుమ్మం ముందు నిలబడి క్షవరం చేసుకొంటు ఉంటాడు. ఆశ వంటింటి గుమ్మం దగ్గర కూర్చొని , తన కూతురు గౌరికి జడలు వేస్తూ ఉంటుంది. గౌరి చేతిలో పలక పట్టుకొని బలపంతో దాని మీద ఏదో బొమ్మ గీస్తూ ఉంటుంది. వీధి గుమ్మం దగ్గర గోవిందయ్య నిలబడి జంధ్యాన్ని వడుకుతూ ఉంటాడు. ఇలా మూడు వింగుల దగ్గరా నలుగురు పనిలో పడి దీక్షగా చేస్తూ కనిపిస్తారు)
ఆశ ---- ఒక్క నిమిషం స్థిరంగా కూర్చోలేవా గౌరీ ! ఆ పిచ్చి బొమ్మలేవో ఇప్పుడే వెయ్యాలా ? ఇలా అయితే నేను నీ జడలు ఎలా వేస్తాను ? ఆదరా బాదరాగా జడ వేసి పంపిస్తే , చూసిన వాళ్లు , మీ అమ్మ ఎలాంటిది బాబూ, జడలు కూడా వెయ్యడం రాదు అని అనడానికా ?
గౌరి --- నేనెక్కడ కదుల్తున్నానే , నువ్వే నా జుత్తు పట్టకొని ఇటూ అటూ గుంఉతున్నావు.
ఆశ --- అమ్మో , నువ్వు మాటలు కూడా నేర్చావే ! పలక కింద పెట్టి నోరు మూసుకొని చేతుల మీద చేతులు వేసి కట్టుకొని కూర్చో , నేనే జుత్తు పట్టుకొని లాగుతున్నానో, నువ్వే కదుల్తున్నావో తెలుస్తుంది..
గౌరి --- అంటే వివేకానందుడి లాగానా ?
ఆశ ---- అవును అలాగే !
గౌరి --- ఊ హు , నేనీ బొమ్మ వేసి టీచర్’కి చూపించాలి. తరవాత వేయడానికి టైము లేదు.
అశోక్ – గౌరీ ! ఏమిటమ్మా ఆ బొమ్మ ?
గౌరి --- ( ఉత్సాహంగా) ఒక చెట్టు బొమ్మ నాన్నా ! చెట్టు ముదలు , కాండము, శాఖలు, ఆకులు, ఇంకా పువ్వులు కాయలు అన్నీ వేయాలి. ( ఆ మాటలని గౌరి వివేకానందుని భంగిమలో చెప్తుంది. ఆశ అదే అదనని గౌరి జడ అల్లి, రిబ్బన్లు కడుతుంది )
అశోక్ --- ఇంతకీ ఏ చెట్టు బొమ్మ వేస్తున్నావమ్మా ?
గౌరి --- రేగు చెట్టు బొమ్మ వేస్తున్నాను నాన్నా, నాన్నా, నాన్నా, నువ్వు ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు నా కోసం రేగు పళ్లు తీసుకొని వస్తావా, అవంటే నా కెంతో ఇష్టం.
అశోక్ – అలాగే తల్లీ, తప్పక తీసుకొని వస్తాను.
ఆశ – గౌరితో పాటు మీ బుర్ర కూడా పాడయి పోయిందా ఏం ? శ్రీ పంచమి నాడు సరస్వతీ పూజ చేయందే , రేగు పళ్లు తినవచ్చా ? ( అని గౌరిని లేవనెత్తి ) తప్పమ్మా గౌరీ, సరస్వతీ దేవి పూజ చేయందే రేగు పళ్లు తింటే చదువు రాదు, తెలిసిందా ?
అశొక్ --- అరే ఆశా , నువ్వు లక్ష్మీ దేవి పూజారిణివి కదా ! హఠాత్తుగా సరస్వతీ దేవి నీ బుర్రలో ఎలా దూరింది ?
ఆశ --- ఏం చెయ్యమంటారు, మిమ్మల్ని కట్టుకొన్నాక ఎలా తప్పుతుంది ? ( అని గోవిందయ్యతో ) చూసారా మావయ్యగారూ, కొంచెమైనా లక్ష్మీ దేవి ధ్యాస లేదితనికి ! లక్ష్మి వారం నాడే గడ్డం గీసుకోవడం మొదలు పెట్టారు. ఇక లక్ష్మిని రమ్మంటే ఎలా వస్తుంది ? నేను చెప్తే ఎలాగూ వినరు, కాస్త మీరైనా చెప్పండి.
గోవిందయ్య -- నిజమేన్రా అశోక్ ! అమ్మాయి చెప్పిన దాంట్లో అర్థం ఉంది. లక్ష్మి వారం నాడు , అదీ జీతాలిచ్చే రోజు క్షవరం చేసుకొంటే సిరి ఇంట నిలవదు.
అశోక్ --- ఎందుకని నాన్నగారూ ?
గోవిందయ్య --- ఎందుకని ఎదురు ప్రశ్న ఏమిట్రా ? అలా చేస్తే లక్ష్మీ దేవిని అవమానించినట్లు అవుతుంది, ఇక ఇంట్లో నిలవమంటే ఎలా ---?
అశోక్ – అవన్నీ కట్టు కథలు నాన్నగారూ, నిజం చెప్పాలంటే గడ్డం పెంచుకొని అసహ్యంగా ఉండడమే దరిద్ర లక్షణం.
గోవిందయ్య – నువ్వన్న మాటా నిజమేన్రా అబ్బాయ్ , కాని దేనికదే కరక్టు. గడ్డం గీసుకోవలసిందే, కాని లక్ష్మి వారం నాడు కాదు.
అశోక్ --- ( గడ్డం గీసుకోవడం ముగించి, ముఖానికి అంటిన సబ్బుని టవల్’తో తుడుచుకొంటూ ) నాన్నగారూ ! ఈ మాటలన్నీ మనుష్యులకి , ధనం పట్ల ఎరుక కలిగి ఉండడానికి ఏర్పరిచినవి. ధనాన్ని అపవ్యయం చేయడమే దరిద్రానికి కారణమవుతుంది. అంతే గాని గడ్డం గీసుకోవడానికీ దీనికీ సంబంధం లేదు..
ఆశ ---( ఆమెకీ సంవాదం నచ్చదు, తన విసుగుని గౌరి మీద చూపిస్తుంది. గౌరి రెక్క పట్టకొని లాగుతూ --) గౌరీ, పదవే లోపలికి వెళ్లి అన్నం తిందువు గాని, -- ( అంటూ గౌరిని తీసుకొని వంటింటి ద్వారం నుండి లోపలికి పంపిస్తుంది ) (గౌరి వెళ్లాక ) – ఏమండీ, ధనాన్ని అపవ్యయం చెయ్యడం తప్పని మీరు ఒప్పుకున్నట్లే కదా ?
అశోక్ --- అవును ఆశా !
గోవిందయ్య --- అపవ్యయం మాట అలా ఉంచరా, మితవ్యయం గురించి నీ అభీప్రాయం ఏమిటి ?
అశోక్ --- మితవ్యయం మంచిదే అంటే , లోభిని ప్రశంశించినట్లే అవుతుంది నాన్నగారూ !
ఆశ --- లోభ గుణం కూడా మంచిదేనండి. కాని అది ఖర్చు పట్ల కాక ఆదాయం పట్ల చూపించ గలగాలి.
అశోక్ --- అంటే నీ ఉద్దేశం ఏమిటి ఆశా ?
ఆశ --- నెలంతా ఆఫిసులో రెక్కలు ముక్కలు చేసుకొని కేవలం జీతపు రాళ్లు మాత్రం తెస్తున్నారు మీరు ----
అశోక్ --- ( ఆశ మాట మధ్యలో అడ్డుపడి ) అవును నిజమే, జీతం కాక మరేం వస్తుంది, ఇంకా ఏం తెమ్మంటావ్ ?
ఆశ --- ( గోముగా ) నేను చెప్పే మాట సరిగా అర్థం చేసుకోండి, జీతం ఎలాగూ వస్తుంది అది కాక పై సంపాదన ఏదీ రాదంటారా ?
అశోక్ – (కోపంగా ) ఆశా నువ్వు మాట్లాడేదేమిటో, నీకు అర్థమవుతోందా ?
గోవిందయ్య – (కలగ జేసుకొని ) అది కాదురా అబ్బాయి, కోడలు ఇప్పుడు కాని మాట ఏం అందని అలా కోపగిస్తావ్ ? నీ ఆఫీసు సీటు , ‘కామధేనువు ’ లాంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కనక వర్షం కురిపిస్తుంది , కాదంటావా ?
అశోక్ --- మీ మాటలు ఇప్పుడు అర్థమయ్యాయి. ( భావుకతతో ) లంచం, లంచం—లంచం , లంచం తీసుకోవడమే దరిద్రానికి ముగింపు అంటారా ?
( గోవిందయ్య, ఆశ , అశోక్ చెరో ప్రక్కా చేరి నిలబడతారు. ఆ తరువాత ఇద్దరూ ఒకే సారి మాట్లాడతారు )
గోవిందయ్య + ఆశ --- అవును లంచం పాపం కాదు, సమాజానికి సేవ చేసే పుణ్య కార్యం , ఆ సేవలో ఇచ్చి పుచ్చుకోవడం అందరూ చేస్తున్నదే !
అశొక్ – కాదు , కానే కాదిది పుణ్య కార్యం, ఆత్మాభిమానాన్ని హత్య చేస్తేనే కాని వీలుకాని పని. లంచం చేపట్టడానికి నేను నడుం కట్టలేను.
ఆశ --- ( నిరాశ చెంది విసుగుతో ) అయితే మీరు కూడా వినండి, నేను కూడా నా ఆత్మాభిమానాన్ని చంపుకొని మీతో సంసారం చెయ్యలేను.
అశోక్ --- అంటే ?
ఆశ --- ఏముంది, పెళ్లాన్ని అయినందుకు మీకు వండిపెట్టి సేవలు చేస్తాను, కాని భార్య మాత్రమే ఇవ్వ గలిగే అమూల్యమైన ప్రేమాభిమానాలు అందించలేను, భార్య ప్రేమని పొందడమనేది భర్త యొక్క అదనపు సంపాదన అర్థమయిందా ?
అశోక్ -- ఆశా, నువ్వేమంటున్నావో తెలుసా ?
ఆశ – నేను మీ భాషలోనే మాట్లాడుతున్నాను. ఇకు ఏది ఆదర్శమో నాకూ అదే ఆదర్శం , లంచం లేనిదే నా ఆత్మార్పణ చేసుకోలేను.( అంటూ వంటింటి లోకి వెళ్లిపోతుంది )
( అశోక్ ఆమె మాటలకి స్తబ్ఢుడై నిలబడి పోతాడు )
( గౌరి ఆశ వెళ్లిన ద్వారం నుండే వెలుపలికి వస్తుంది, ఆమె వీపుకి స్కూలు బేగు తగిలించి ఉంటుంది )
గౌరి --- నాన్నా ! మీ కోసం ఈ రోజు వేడి నీళ్లు పెట్టలేదంట, చన్నీళ్ల తోనే స్నానం చెయ్యమని అమ్మ చెప్పమంది. ( అంటూ వీధి లోకి వెళ్లిపోతుంది )
అశోక్ – (తనలో ) సరే ఆశా, ఈ రోజు నీకు లొంగక, చన్నీళ్లతోనే నా ఆత్మని శాంతింప చేసుకొంటాను.
( అంటూ అశోక్ పడక గదిలోకి వెళ్తాడు. ఆశ వంటింట్లోంచి వస్తుంది. రెండు నిండు సంచీలని రెండు చేతులతోనూ పట్టుకొని వస్తుంది. ఆ రెండు సంచీల లోనూ దొండకాయలు ఉంటాయి. ఆశ ఆ సంచీలని గోవిందయ్యకి అందిస్తుంది. గోవిందయ్య వాటిని అందుకొని క్రింద పెడతాడు. ఒక సంచీ లోంచి కొన్ని దొండాకాయలు చేతిలోకి తీసుకొంటాడు )
గోవిందయ్య --- దొండాకాయలు లేతగా దోరగా ఉన్నాయమ్మా ! వీటిని ఈ పట్నంలోనే అమ్మితే మంచి లాభం వస్తుంది.
ఆశ --- ఏం చేస్తాం మామయ్యగారూ ! ఈ పట్నం లోనే అమ్మితే , అతనికి తెలియకుండా ఉండదు. పెరట్లో కాచిన కూరగాయలు అమ్మడం అతని ఆదర్శాలకి విరుధ్ధం కదా ! మీరు వాటిని ----
( ఆశ ఆ మాటలు అంటూ ఉండగానే వంటింట్లోంచి కుక్కరు విజిల్ వేస్తుంది.
గోవిందయ్య --- చింతించకమ్మా ! ఈ రోజు దగ్గరలోని పల్లెలో సంత ఉంది. అశోక్ ఆఫీసుకి వెళ్ళిన వెంటనే నేను వీటిని తీసుకొని బస్సులో అక్కడికి వెళ్లి వీటిని అమ్మేస్తాను. అన్నట్లు వీటీని తూకం వేయించావా ?
( మళ్లీ వంటింట్లోంచి కుక్కరు విజిల్ వేస్తుంది )
ఆశ – మామయ్యగారూ ! కుక్కరులో పప్పు , కూర రెండూ పెట్టాను. పప్పులో నీళ్లు ఎక్కువే ఉన్నాయి.కాని కూర అడుగంటి పోతుందేమో ! వెళ్లి చూసి వస్తాను—( అంటూ లోపలికి వెళ్తుంది )
గోవిందయ్య --- ( తనలో ) ఇవి అశోక్ కంట పడకుండా దాచాలి, లేక పోతే గడబిడ అవుతుంది. ( గోవిందయ్య ఆ సంచీలని తన పై పంచె ఉత్తరీయంతో కప్పి, మొక్కల మాటున దాస్తాడు)
( మధ్య ద్వారం నుండి ఆశ వస్తుంది. ఆమె చేతిలో చిన్న ఖాళీ సంచీ ఉంటుంది )
ఆశ – మామయ్యగారూ ! కూర నేననుకొన్నట్లుగానే కుక్కరు గిన్నెకి అంటుకొని పోయింది. ఉత్త పప్పుతో అతనికి భోజనం ఎలా పెట్టను ?
గోవిందయ్య – కాసిన్ని దొండకాయలు తీసి వేయించెయ్యవమ్మా !
ఆశ --- అవి పది కిలోలకి కొంచెం తక్కువగా ఉన్నాయి మామయ్యగారూ ! మరికొన్ని తీసేస్తే అవి ఇంకా తగ్గిపోతాయి, మీకు వాటిని అమ్మడం కష్టమవుతుంది.
గోవిందయ్య --- అయితే ఇప్పుడేం చెయ్యమంటావ్ ?
ఆశ --- మామయ్యగారూ ! మనం పప్పు, ఆవకాయతో తినెయ్యవచ్చు, కాని అతనికి కూర కావాలిగా , అందుకని కొన్ని బంగాళా దుంపలు ఈ సంచీలో పట్టుకొని రండి .
గోవిందయ్య --- అలాగేనమ్మా ! ఆ మాత్రం దానికి దుంపలు కొనడం దేనికి, ప్రక్క ఇంట్లో అప్పు అడిగి తెస్తాను.
( అంటూ ఖాళీ సంచీ తీసుకొని వీధి లోకి వెళ్తాడు )
ఆశ--- (తనలో) కోడలిని అర్థం చేసుకొనే మీ లాంటి మామయ్య దొరకడం నా అదృష్టం . మీ అబ్బాయికి మీ బుధ్ధులు రాలేదెందుకో మరి ! అయినా నేను ఓటమిని అంగీకరించను , అనుకొన్నది సాధించి తీరుతాను. అతనిని మన దారికి తెస్తాను.
( గోవిందయ్య బయటీ నుంచి దుంపల సంచీతో వచ్చి , దానిని ఆశ చేతికి ఇస్తాడు. ఆశ దానిని తీసుకొని మధ్య ద్వారం లోకి వెళ్తుంది. అశోక్ పడక గదిలోంచి వస్తాడు. ఆఫీసు డ్రెస్సులో ఉంటాడు. )
ఆశోక్ --- ఆశా , నేను రెడీ !
ఆశ ---- ( వంటింట్లోంచే జవాబిస్తుంది.) కాస్త ఆగండి, కూర ఉడకగానే అన్నం వడ్డించేస్తాను.
అశోక్ ---ఆలస్యం అయిపోతుంది, ఆశా ! ఇవాల్టికి పప్పుతోనే తినేస్తాలే,
( అంటూ వంటింటి ద్వారం లోకి వెళ్తాడు. ఆశ అక్కడినుంచే వస్తుంది. )
ఆశ --- మామయ్యగారూ , రండి మీకు కూడా వడ్డించేస్తాను.
గోవిందయ్య --- అదేంటమ్మా , అశోక్’కి కూర వండ లేదా ?
ఆశ --- అవును మామాయ్యా , ఈ రోజు అతనికి పాపుతోనే అన్నం పెడతాను. ఈ రోజే కాదు అతను ఉత్త పప్పుతోనే భోజనం చేయడాని అలవాటు పడేలా చేస్తాను. అతని ఆదర్శాలు, సిధ్ధాంతాలు అన్నీ మంట కలిసే వరకూ ఈ అంతర్యుధ్ధం నడుస్తూనే ఉంటుంది.
Jun 28, 2011
విరిసిన హరివిల్లు---( స్పెషల్ స్టోరీ ) 3
పది రోజులు తరువాత ఒక రోజు సాయంత్రం ఇంటికి వెళ్లే దారిలో ఒక కుర్రాడు నన్ను ఆపి, ఒక ఉత్తరాన్ని చేతికిచ్చి, పరుగు తీసాడు. ఆశ్చర్యంతో ఉత్తరాన్ని చూసుకొన్నాను, నా పేరే ఉంది దాని మీద!
కుతూహలంతో ప్రక్కనే ఉన్న మైదానం మీదకి వెళ్లి, లైటుస్తంభాన్ని ఆనుకొని ఉత్తరం తెరచాను.
‘ ఎలా వ్రాయమంటావు తమ్ముడూ! ఈ ఉత్తరాన్ని, ఏమని వ్రాయాలి ?
ఏదో ఒక దౌర్భాగ్యపు సంవత్సరం అది ! మధ్య తరగతి గ్రామం లాంటి ,‘ డొంకిన వలసలో’ ఆడపిల్లనై ,తల్లిని మ్రింగి పుట్టాను నేను.
అయినా నా వ్యధాపూరిత బాల్య జీవితాన్ని గురించి వేరే చెప్పడం దేనికి ? ఎంత వర్ణించినా అది నీ ఊహా శక్తికి క్రిందుగానే ఉంటుంది !
ఒకానొక పూర్ణిమా శరత్తులో, నా ఇరవై ఒకటవ ఏట, ఇల్లు విడిచి పరుగెత్తాను నేను ! ఒక కన్నెపిల్ల ఇల్లు విడిచి పోవడానికి కారణాలేముంటాయి గనుక ! సవతి తల్లి రాపిడి, తండ్రి ఏరికోరి తెచ్చిన ముసలి వరుడు, ఉబికే ఆశలు, ఉద్రేకాన్ని తీర్చలేని పేదరికం, --- వీటిలో ఏ ఒక్కటైనా చాలు.
కాని నా దౌర్భాగ్య స్థితి ఏమని చెప్పమంటావ్ ? ఇవన్నీ కలిపి చుట్టుముట్టాయి నన్ను.
పరిస్థితుల ఒత్తిడి నా మీద ఎంత తీవ్రంగా పని చేసిందంటే, రైల్వే స్టేషన్ వైపు నడిచాను నేను. ‘ రాయపూరు పాసింజరు’ వచ్చే సమయమయిందని, దాని విశ్రాంతి లేని చక్రాలు నాకు శాశ్వత విశ్రాంతి నివ్వగలవనే తృప్తితో !
వరిచేల మధ్యనుండి , సన్నని కాలిబాట ద్వారా, వడివడిగా పరిగెడుతున్న నన్ను, ఏదో బలమైన చెయ్యి చేల మధ్యలోకి లాగింది !
అంతే !
నా మెదడు ఆలోచించడం , నా కళ్లు చూడడం, నా చెవులు వినడం మానేసాయి. ఒకటేమిటి సర్వేంద్రియాలు స్తంభించి పోయాయి. ‘అచేతనావస్ఠ’ అంటే అదే కాబోలు !
తిరిగి నా ఇంద్రియాలు నా స్వాధీనం లోకి వచ్చేసరికి ‘ విజయనగరం’ ప్ర్రైవేటు ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్నను నేను. ! ఒళ్లంతా నొప్పులతో చితకగొట్టి నట్లుగా ఉంది !
నా బెడ్డుకి దూరంగా ఉన్న ఒక నర్సు , మరొకరితో మాట్లాడితోంది--- “ హారిబుల్ రేప్ కేసు ! చాలా రక్త స్రావం జరిగింది పుష్టి అయిన శరీరం కాబట్టి, తట్టికోగలిగింది—ఒకడు కాదు --- ”
ఆ పైన వినబడలేదు నాకు. ఏడ్చేందుకు కూడా వీలులేని స్థితి.
నేను కళ్లు తెరవడం చూసిన ఆ నర్సు, గబగబా నాకేసి వచ్చింది. “ మీ మామయ్యగారట ! ఎవరో చూడడానికి వచ్చారు. రమ్మనమని చెప్పేదా ?” అంటూ నా అంగీకారంతో నిమిత్తం లేకుండానే వార్డ్ బయటికి వెళ్లిపోయింది.
‘మామయ్యా ! ’ గుండె లొక్కసారిగా కొట్టుకొన్నాయి.‘ ఏ మామయ్య ?’
ఇంతలో పొడుగ్గా , బలంగా ఉన్న మనిషి ఒకరు నా బెడ్డు దగ్గరగా వచ్చారు. బెడ్ దగ్గరగా స్టూలు లాగి కూర్చొన్నాడు.
“ నా పేరు వెంకట చలం ! రైల్వేలో పని చేస్తున్నాను. నిన్న రాత్రి రాయపూరు పాసింజరు దిగిన నాకు, ‘ వరిచేల మధ్య అచేతనంగా పడి ఉన్న మీరు కన్పించారు. అక్కడనుండి విజయనగరం పోతున్న ట్రక్కుని ఆపి, ఈ ఆస్పత్రి అధికారులతో , నేను మీ మేనమామననీ, ఇల్లు విడిచి పోయిన మిమ్మల్ని ఆ స్థితిలో చూడగలిగాననీ, ఈ విషయం కోర్టు దాకా వెళ్తే, మీ జీవితం పాడై పోతుందనీ, చెప్పి ఒప్పించాను. ఈ నాలుగు గోడల మధ్య నుండి బయట పడేటంత వరకు నన్ను, ‘ మామయ్య’ అనే పిలవండి ! ఆ పైన కూడ, మీకు ఇంటికి వెళ్లడం ఇష్టం లేకపోతే నా తోటే వచ్చేయండి.”రుధ్ధమైన కంఠంతో ఎలాగో ఒకలాగ పూర్తి చేసాడు అతను.
నువ్వు నన్ను నమ్ము తమ్ముడూ ! అదే నాకూ, చలం బాబుకీ జరిగిన తొలి పరిచయం ! హాస్పిటల్ ఆవరణ విడిచిన తరువాత ఏ దిక్కులేని నేను,చలాన్నే అనుసరించి ఇక్కడకు వచ్చాను.ఇది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలైంది !
అయితే ఈ మధ్యకాలం అంతా ఒకే ఇంట్లో ఉంటూ, నిత్యావసరాలకి మించి మాట్లాడడం గాని, వ్యవహరించడం గాని చేయకుండా ఉండ గలిగామంటే, ‘ అదను దొరికితే చాలు అవాకులు, చెవాకులు’ పేలే లోకంతో పాటు, నువ్వు కూడా నమ్మవని నాకు తెలుసు !
కొన్ని కొన్ని పూర్ణిమా శరత్తులలో అతను, ఉద్రేకంతో నా గదిలోకి వచ్చిన రోజులూ ఉన్నాయి.
నిద్ర పట్టక ప్రక్క మీద దొర్లుతూ గదిలోకి వస్తూన్న అతనిని అడుగుల చప్పుడు విని, తెలియని ఆవేశానికీ, ఊహ కందని మధురానుభూతికీ లోనయి గట్టిగా కళ్లు మూసుకొనేదాన్ని !
కొద్ది సేపటికి అతను వచ్చి నా మంచం మీద కూర్చొనే వాడు.
‘అలాగే నన్ను దగ్గరకి తీసుకొని శ్వాస నిలిచిపోయేలా గట్టిగా నలిపేస్తే ఎంత బాగుండును !’ అనిపించేది.
కాని ఎలా వ్రాయమంటావు తమ్ముడూ? !
నా చెంపలకి చల్లగా తాకే అతని పెదాల తడి, మెడమీద మెల్లగా తగిలి, కితకితలు పెట్టే నిశ్వాసాల వేడి తప్ప, మరేదీ అనుభవంలోకి వచ్చేది కాదు !!
అంతే ! మూడు సంవత్సరాల కాలంలో ఇంతకన్న ఎక్కువ జరగ లేదు మా ఇద్దరి మధ్య !
అతని హృదయం నా మీద ప్రేమతో నిండినా, నేను నా సర్వస్వంతో అతనిని ఆరాధించినా, మా ఇద్దరి మధ్యా ఏర్పడిన మిథ్యా బాంధవ్యం ద్వారా వివాహమాడే అర్హత సమాజం ద్వారా ఉన్నా ---- ఎందుకో ఆ పని మాత్రం జరగ లేదు ఇంత వరకూ !!!
ఆడదాన్నీ, ఆశ్రయం లేని దాన్నీ అయియుండి, నన్ను పెళ్లి చేసుకోమని ఎలా అడగమంటావ్ తమ్ముడూ ?!
అయినా పౌరుషం గల మగవాడయి ఉండి, మలిన నయిన నన్ను, అతను మాత్రం ఎలా స్వీకరించగలడు ?
ఇదంతా ఎందుకో నీకు చెప్పాలనిపించింది తమ్ముడూ ! నువ్వు నన్ను అర్థం చేసుకోగలవనీ, నా కోసం కన్నీటి బొట్టు కార్చ గలవనీ నమ్మకంతో, ఈ ఉత్తరాన్ని ముగిస్తున్నాను.నా మనస్సులోని ఆలోచనల కల్లోలాన్ని , ‘చలం’ బాబుకి తెలియ జెప్పనని మాట మాత్రం నువ్వు ఇయ్యాలి తమ్ముడూ !
ఇట్లు నీ ప్రియమైన అక్క
పార్వతి.
ఉత్తరం చదవడం పూర్తి చేసి, ఆకాశం వంక ఒక్కసారి ఎక్కడ ఉన్నాడో తెలియని దేవుడి కోసం చూసాను. కన్నీరు నిండిన కళ్లలో దీప స్తంభం వెలుగు సూటిగా దిగి అంతా అయోమయం చేసింది.
*************
“ నువ్వు బదిలీ మీద ‘టాటా నగర్’ వెళ్లి, ఆరు ఏడు నెలలు అయిందని అనుకొంటాను?”
అవునన్నట్లుగా తల ఆడించాను నేను.
“ నీకు తెలిసే ఉంటుంది , ఈ మధ్యనే ‘ పార్వతి’ పోయింది.”
“ అవును, పని మీద టాటా వచ్చిన నారాయణ రావు చెప్పాడు. అలాంటి చావు సాధారణంగా ఎవరికీ రాదనీ, చనిపోయే ముందు ఆఖరి క్షణం వరకూ, ఆమె పుస్తకాల మధ్యనే గడిపిందని—”
“ పార్వతి నీకు ఒక ఉత్తరం వ్రాసిందట కదూ ?”
మౌనంగా తల ఆడించి, మనీపర్సులో భద్రంగా దాచిన ఉత్తరాన్ని, ‘చలం’ చేతికి ఇచ్చాను.
“ నాకు చదవడం రాదు, నువ్వే చదివి వినిపించు—” చిత్రంగా నవ్వుతూ అన్నాడు చలం !
ఉత్తరం చదివి పూర్తి చేసేసరికి , చంటి పిల్లాడిలాగ బావురుమంటూ ఏడ్చేసాడు చలం. నాకేం చేయడానికీ పాలుపోలేదు ! నిజానికి ఎవరు మాత్రం ఆ పరిస్థితిలో ఏం చెయ్యగలరు !
“ ఆమె నన్ను ప్రేమించిందన్న విషయం చూచాయగా నైనా నాకు తెలిసింది కాదు, తెలిసి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదేమో !?”
“ ఒక స్త్రీగా ఆమె ఆ విషయం ఎలా చెప్పగలదు ?” ఆ విషయంలో తప్పు మీదే అన్నట్లుగా మాట్లాడాను నేను.
“ నిజమే, కాని అలా అడిగే ధైర్యం నాలో లేక పోయింది.”
“ ఏం ఎందుకని ?” చలం వంక చురుకుగా చూసాను.
వెంకట చలం చాల సేపటి వరకూ నా వంక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. తరువాత ఏమనుకొన్నాడో ఏమో ! కుర్చీ లోంచి లేచి, కిటికీ ఊచలగుండా ఆకాశాన్ని వరించిన మేఘాల సంరంభం చూస్తూ అన్నాడు.
“ ఆ రాత్రి ‘ పార్వతిని’ దారుణంగా దోచుకొన్న నలుగురిలో నేను ఒకణ్ని---”
ఇంకా ఏమన్నడో ఏమో , ఒక్కటీ నాకు వినిపించలేదు’
నిజానికి వినిపించుకొనే స్థితిలో కూడా లేను నేను,
‘ భగవంతుడనే సృష్టికిరణం నుండి , విరిసిన హరివిల్లు లాంటి ఈ ప్రపంచంలో, ‘వెంకట చలం’ వంటి విచిత్ర వ్యక్తులు ఇంకా ఎందరున్నారో !!!
ఆ ఆలోచన నన్ను స్తబ్ఢుణ్ని చేసి వేసింది
************************
కుతూహలంతో ప్రక్కనే ఉన్న మైదానం మీదకి వెళ్లి, లైటుస్తంభాన్ని ఆనుకొని ఉత్తరం తెరచాను.
‘ ఎలా వ్రాయమంటావు తమ్ముడూ! ఈ ఉత్తరాన్ని, ఏమని వ్రాయాలి ?
ఏదో ఒక దౌర్భాగ్యపు సంవత్సరం అది ! మధ్య తరగతి గ్రామం లాంటి ,‘ డొంకిన వలసలో’ ఆడపిల్లనై ,తల్లిని మ్రింగి పుట్టాను నేను.
అయినా నా వ్యధాపూరిత బాల్య జీవితాన్ని గురించి వేరే చెప్పడం దేనికి ? ఎంత వర్ణించినా అది నీ ఊహా శక్తికి క్రిందుగానే ఉంటుంది !
ఒకానొక పూర్ణిమా శరత్తులో, నా ఇరవై ఒకటవ ఏట, ఇల్లు విడిచి పరుగెత్తాను నేను ! ఒక కన్నెపిల్ల ఇల్లు విడిచి పోవడానికి కారణాలేముంటాయి గనుక ! సవతి తల్లి రాపిడి, తండ్రి ఏరికోరి తెచ్చిన ముసలి వరుడు, ఉబికే ఆశలు, ఉద్రేకాన్ని తీర్చలేని పేదరికం, --- వీటిలో ఏ ఒక్కటైనా చాలు.
కాని నా దౌర్భాగ్య స్థితి ఏమని చెప్పమంటావ్ ? ఇవన్నీ కలిపి చుట్టుముట్టాయి నన్ను.
పరిస్థితుల ఒత్తిడి నా మీద ఎంత తీవ్రంగా పని చేసిందంటే, రైల్వే స్టేషన్ వైపు నడిచాను నేను. ‘ రాయపూరు పాసింజరు’ వచ్చే సమయమయిందని, దాని విశ్రాంతి లేని చక్రాలు నాకు శాశ్వత విశ్రాంతి నివ్వగలవనే తృప్తితో !
వరిచేల మధ్యనుండి , సన్నని కాలిబాట ద్వారా, వడివడిగా పరిగెడుతున్న నన్ను, ఏదో బలమైన చెయ్యి చేల మధ్యలోకి లాగింది !
అంతే !
నా మెదడు ఆలోచించడం , నా కళ్లు చూడడం, నా చెవులు వినడం మానేసాయి. ఒకటేమిటి సర్వేంద్రియాలు స్తంభించి పోయాయి. ‘అచేతనావస్ఠ’ అంటే అదే కాబోలు !
తిరిగి నా ఇంద్రియాలు నా స్వాధీనం లోకి వచ్చేసరికి ‘ విజయనగరం’ ప్ర్రైవేటు ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్నను నేను. ! ఒళ్లంతా నొప్పులతో చితకగొట్టి నట్లుగా ఉంది !
నా బెడ్డుకి దూరంగా ఉన్న ఒక నర్సు , మరొకరితో మాట్లాడితోంది--- “ హారిబుల్ రేప్ కేసు ! చాలా రక్త స్రావం జరిగింది పుష్టి అయిన శరీరం కాబట్టి, తట్టికోగలిగింది—ఒకడు కాదు --- ”
ఆ పైన వినబడలేదు నాకు. ఏడ్చేందుకు కూడా వీలులేని స్థితి.
నేను కళ్లు తెరవడం చూసిన ఆ నర్సు, గబగబా నాకేసి వచ్చింది. “ మీ మామయ్యగారట ! ఎవరో చూడడానికి వచ్చారు. రమ్మనమని చెప్పేదా ?” అంటూ నా అంగీకారంతో నిమిత్తం లేకుండానే వార్డ్ బయటికి వెళ్లిపోయింది.
‘మామయ్యా ! ’ గుండె లొక్కసారిగా కొట్టుకొన్నాయి.‘ ఏ మామయ్య ?’
ఇంతలో పొడుగ్గా , బలంగా ఉన్న మనిషి ఒకరు నా బెడ్డు దగ్గరగా వచ్చారు. బెడ్ దగ్గరగా స్టూలు లాగి కూర్చొన్నాడు.
“ నా పేరు వెంకట చలం ! రైల్వేలో పని చేస్తున్నాను. నిన్న రాత్రి రాయపూరు పాసింజరు దిగిన నాకు, ‘ వరిచేల మధ్య అచేతనంగా పడి ఉన్న మీరు కన్పించారు. అక్కడనుండి విజయనగరం పోతున్న ట్రక్కుని ఆపి, ఈ ఆస్పత్రి అధికారులతో , నేను మీ మేనమామననీ, ఇల్లు విడిచి పోయిన మిమ్మల్ని ఆ స్థితిలో చూడగలిగాననీ, ఈ విషయం కోర్టు దాకా వెళ్తే, మీ జీవితం పాడై పోతుందనీ, చెప్పి ఒప్పించాను. ఈ నాలుగు గోడల మధ్య నుండి బయట పడేటంత వరకు నన్ను, ‘ మామయ్య’ అనే పిలవండి ! ఆ పైన కూడ, మీకు ఇంటికి వెళ్లడం ఇష్టం లేకపోతే నా తోటే వచ్చేయండి.”రుధ్ధమైన కంఠంతో ఎలాగో ఒకలాగ పూర్తి చేసాడు అతను.
నువ్వు నన్ను నమ్ము తమ్ముడూ ! అదే నాకూ, చలం బాబుకీ జరిగిన తొలి పరిచయం ! హాస్పిటల్ ఆవరణ విడిచిన తరువాత ఏ దిక్కులేని నేను,చలాన్నే అనుసరించి ఇక్కడకు వచ్చాను.ఇది జరిగి ఇప్పటికి మూడు సంవత్సరాలైంది !
అయితే ఈ మధ్యకాలం అంతా ఒకే ఇంట్లో ఉంటూ, నిత్యావసరాలకి మించి మాట్లాడడం గాని, వ్యవహరించడం గాని చేయకుండా ఉండ గలిగామంటే, ‘ అదను దొరికితే చాలు అవాకులు, చెవాకులు’ పేలే లోకంతో పాటు, నువ్వు కూడా నమ్మవని నాకు తెలుసు !
కొన్ని కొన్ని పూర్ణిమా శరత్తులలో అతను, ఉద్రేకంతో నా గదిలోకి వచ్చిన రోజులూ ఉన్నాయి.
నిద్ర పట్టక ప్రక్క మీద దొర్లుతూ గదిలోకి వస్తూన్న అతనిని అడుగుల చప్పుడు విని, తెలియని ఆవేశానికీ, ఊహ కందని మధురానుభూతికీ లోనయి గట్టిగా కళ్లు మూసుకొనేదాన్ని !
కొద్ది సేపటికి అతను వచ్చి నా మంచం మీద కూర్చొనే వాడు.
‘అలాగే నన్ను దగ్గరకి తీసుకొని శ్వాస నిలిచిపోయేలా గట్టిగా నలిపేస్తే ఎంత బాగుండును !’ అనిపించేది.
కాని ఎలా వ్రాయమంటావు తమ్ముడూ? !
నా చెంపలకి చల్లగా తాకే అతని పెదాల తడి, మెడమీద మెల్లగా తగిలి, కితకితలు పెట్టే నిశ్వాసాల వేడి తప్ప, మరేదీ అనుభవంలోకి వచ్చేది కాదు !!
అంతే ! మూడు సంవత్సరాల కాలంలో ఇంతకన్న ఎక్కువ జరగ లేదు మా ఇద్దరి మధ్య !
అతని హృదయం నా మీద ప్రేమతో నిండినా, నేను నా సర్వస్వంతో అతనిని ఆరాధించినా, మా ఇద్దరి మధ్యా ఏర్పడిన మిథ్యా బాంధవ్యం ద్వారా వివాహమాడే అర్హత సమాజం ద్వారా ఉన్నా ---- ఎందుకో ఆ పని మాత్రం జరగ లేదు ఇంత వరకూ !!!
ఆడదాన్నీ, ఆశ్రయం లేని దాన్నీ అయియుండి, నన్ను పెళ్లి చేసుకోమని ఎలా అడగమంటావ్ తమ్ముడూ ?!
అయినా పౌరుషం గల మగవాడయి ఉండి, మలిన నయిన నన్ను, అతను మాత్రం ఎలా స్వీకరించగలడు ?
ఇదంతా ఎందుకో నీకు చెప్పాలనిపించింది తమ్ముడూ ! నువ్వు నన్ను అర్థం చేసుకోగలవనీ, నా కోసం కన్నీటి బొట్టు కార్చ గలవనీ నమ్మకంతో, ఈ ఉత్తరాన్ని ముగిస్తున్నాను.నా మనస్సులోని ఆలోచనల కల్లోలాన్ని , ‘చలం’ బాబుకి తెలియ జెప్పనని మాట మాత్రం నువ్వు ఇయ్యాలి తమ్ముడూ !
ఇట్లు నీ ప్రియమైన అక్క
పార్వతి.
ఉత్తరం చదవడం పూర్తి చేసి, ఆకాశం వంక ఒక్కసారి ఎక్కడ ఉన్నాడో తెలియని దేవుడి కోసం చూసాను. కన్నీరు నిండిన కళ్లలో దీప స్తంభం వెలుగు సూటిగా దిగి అంతా అయోమయం చేసింది.
*************
“ నువ్వు బదిలీ మీద ‘టాటా నగర్’ వెళ్లి, ఆరు ఏడు నెలలు అయిందని అనుకొంటాను?”
అవునన్నట్లుగా తల ఆడించాను నేను.
“ నీకు తెలిసే ఉంటుంది , ఈ మధ్యనే ‘ పార్వతి’ పోయింది.”
“ అవును, పని మీద టాటా వచ్చిన నారాయణ రావు చెప్పాడు. అలాంటి చావు సాధారణంగా ఎవరికీ రాదనీ, చనిపోయే ముందు ఆఖరి క్షణం వరకూ, ఆమె పుస్తకాల మధ్యనే గడిపిందని—”
“ పార్వతి నీకు ఒక ఉత్తరం వ్రాసిందట కదూ ?”
మౌనంగా తల ఆడించి, మనీపర్సులో భద్రంగా దాచిన ఉత్తరాన్ని, ‘చలం’ చేతికి ఇచ్చాను.
“ నాకు చదవడం రాదు, నువ్వే చదివి వినిపించు—” చిత్రంగా నవ్వుతూ అన్నాడు చలం !
ఉత్తరం చదివి పూర్తి చేసేసరికి , చంటి పిల్లాడిలాగ బావురుమంటూ ఏడ్చేసాడు చలం. నాకేం చేయడానికీ పాలుపోలేదు ! నిజానికి ఎవరు మాత్రం ఆ పరిస్థితిలో ఏం చెయ్యగలరు !
“ ఆమె నన్ను ప్రేమించిందన్న విషయం చూచాయగా నైనా నాకు తెలిసింది కాదు, తెలిసి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదేమో !?”
“ ఒక స్త్రీగా ఆమె ఆ విషయం ఎలా చెప్పగలదు ?” ఆ విషయంలో తప్పు మీదే అన్నట్లుగా మాట్లాడాను నేను.
“ నిజమే, కాని అలా అడిగే ధైర్యం నాలో లేక పోయింది.”
“ ఏం ఎందుకని ?” చలం వంక చురుకుగా చూసాను.
వెంకట చలం చాల సేపటి వరకూ నా వంక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. తరువాత ఏమనుకొన్నాడో ఏమో ! కుర్చీ లోంచి లేచి, కిటికీ ఊచలగుండా ఆకాశాన్ని వరించిన మేఘాల సంరంభం చూస్తూ అన్నాడు.
“ ఆ రాత్రి ‘ పార్వతిని’ దారుణంగా దోచుకొన్న నలుగురిలో నేను ఒకణ్ని---”
ఇంకా ఏమన్నడో ఏమో , ఒక్కటీ నాకు వినిపించలేదు’
నిజానికి వినిపించుకొనే స్థితిలో కూడా లేను నేను,
‘ భగవంతుడనే సృష్టికిరణం నుండి , విరిసిన హరివిల్లు లాంటి ఈ ప్రపంచంలో, ‘వెంకట చలం’ వంటి విచిత్ర వ్యక్తులు ఇంకా ఎందరున్నారో !!!
ఆ ఆలోచన నన్ను స్తబ్ఢుణ్ని చేసి వేసింది
************************
Jun 25, 2011
విరిసిన హరివిల్లు—( స్పెషల్ స్టోరీ ) 2
నేను వెళ్లేసరికి అతనేదో డిటెక్టివ్ పుస్తకం చదువుతున్నాడు. నన్ను చూసి మామూలు ధోరణిలో పలకరించి కూర్చో బెట్టాడు. నేను అడగకుండానే తనకి తెలుగులో విశేషమైన పరిచయం లేదనీ, డిటెక్టివ్ పుస్తకాలు చదవడం తప్ప మరొకటి చదవడం రాదనీ, ఒక చిన్న అల్మైరా నిండా నిండిన,‘శవ సాహిత్యం ’ చూపెట్టాడు.
నా పుస్తకం సంగతి అడుగుదామని అనుకొనే సరికి లోపలి నుండీ పిలుపు వినిపించింది.
వెంకటచలం కూడా కళ్లతోనే నిర్దేశించాడు,“ లోపలికి వెళ్లు” అని.
ఎన్నెన్నో ఊహలు వెంటాడుతుంటే లోపలికి వెళ్లాను.
ఎర్ర గులాబీ అంచు మల్లె రంగు చీరలో ‘శశికళ’ మూర్తీభవించి ఎదురై నా అంచనాలని తారుమారు చేసింది.
“ నీకా పుస్తకం అంత అవసరమా తమ్ముడూ ?” పెద్ద టేకు చెక్క బీరువా నుండి, నేనేనాడూ చూడ్డానికి కూడా నోచుకోని పుస్తకాల దొంతరల లోనుండి ,‘సాక్షిని ’ తీసి ఇస్తూ అడిగిందామె.
‘ ఇంత మంచి సాహిత్యాన్ని అభిమానించ గల ఈమె చరిత్రహీన ఎందుకవుతుంది ?’
“ ఫరవాలేదు, మీరు చదివిన తరువాతనే ఇయ్యండి,” అన్న మాటతో బయటపడ్డాను.
ఆ తరువాత చెప్పవలసినది ఏముంది? నాకూ ఆమెకీ సంబంధం సాహిత్యానికి చెందినంత వరకూ ధృడతరమయింది.
ఒకరోజు
ఎప్పటిలాగే ఆమె దగ్గరనుండి తెచ్చిన, ‘దశకుమార చరిత్ర’ చదువుతున్నాను. పుస్తకం మధ్యనుండి ‘నీలం రంగు కవరు’ బయట పడింది. తప్పు అని తెలిసినా ఆత్రాన్ని
ఆపుకోలేక తెరిచాను. అది ఎవరికి వ్రాయబడిందో వేరే చెప్పనక్కరలేదు. ఎవరు వ్రాసారో అందులో తెలియపరచ లేదు.
పోతే—
సమాజం దృష్టిలో చులకన అయిన ఆడదానికి, మనస్సులోని నల్లటి ఛాయలని పెద్ద మనిషి బురఖాలో దాచిపెట్టి తిరిగే మగాడు వ్రాసే ఉత్తరంలో ఏముంతుంది గనుక ?
‘ఫలానా చోట ఫలానా సమయానికి వచ్చి కలుసుకో’ అని అర్థం వచ్చే మాటలు తప్ప వేరేమీ లేవు.
వెంకటచలం మీద నిజానికి కోపమే వచ్చింది .అయినా అలాంటి రహస్య జీవనం గడప వలసిన అవసరం మాత్రం అతనికి ఏముంది ! ఇవాళ రేపు ఎంతమంది అక్క కూతురుని వివాహం చేసుకోవడం లేదు ! మరునాడు పుస్తకంతో పాటు, ఉత్తరాన్ని కూడా ఇచ్చాను ఆమెకి, “ ఇదుగో అక్కయ్యా నీ ఉత్తరం,” అంటూ.
కొన్ని క్షణాలపాటు నా వంక మౌనంగా చూసి, బీరువాలోంచి కొన్ని కట్టల ఉత్తరాలు తీసి, నా ముందు పెట్టింది ఆమె, “ ఆ ఉత్తరాన్ని కూడా వీటిలో చేర్చు తమ్ముడూ !” అంటూ.
మంఛుగడ్డతో నెత్తిన మొత్తినట్లయింది నాకు !
ఏమిటి ఈమె !
రకరకాల భావనలు సముద్ర తరంగాలలా హృదయపుటంచులు దాటి , నురగ పర్వతాలయ్యాయి.
ఆమె చల్లని హస్తస్పర్శ నుదుటి మీద పడి, తిరిగి ఈ లోకంలోకి తెచ్చింది. నన్ను.
“ చలం బాబుకీ, నాకూ మధ్య అడ్డుగోడలు ఎందుకని కదూ తమ్ముడూ , నీ మనసు నిండిన ఆవేదన ! చెబుతాను తమ్ముడూ, తప్పక చెప్తాను, చెప్పి నా మనసులోని బరువు కూడా దించుకొంటాను.కాని ఇప్పుడు కాదు,” ఏదో తెలియరాని ఆవేశంతో మాట్లాడింది ఆమె.
“ మరెప్పుడు ?”
“ నీఖు చెప్పాలని తోచినప్పుడు”, కళ్ల జాగాలో ఉన్న కాటుక పిట్టలు విచిత్రంగా నవ్వాయి ! “ ప్రస్తుతానికి ఈ మాత్రం తెలుసుకో తమ్ముడూ ! చలం బాబు నాకు మేనమామ వరస కాదు, నిజానికి నాకూ అతనికీ ఎలాంటి చిట్టరికమూ లేదు,” త్వరత్వరగా మాటలు ముగించి ఇంటిలోకి వెళ్లిపోయింది ఆమె.
ముంచెత్తిన ఆశ్చర్యం నుండి తేరుకొని చుట్టూ చూసే సరికి, అలవాటయిన పాదాలు ఇంటికి చేర్చాయి నన్ను.
ఆ రాత్రి అంతా కలత నిద్రతోనే గడిపాను. ‘చలానికీ ఆమెకీ ఎటువ్బంటి బాంధవ్యమూ లేకపోతే ఆమె అతని ఇంటిలో ఎందుకుంటుండది ? అన్న ఆలోచన ,కలయై, కల్లయై చాలా
తేలిక అంచనాలకి గురియై, నీచమైన అనుమానం కలగడానికి దోహదం చేసింది.
‘ ఛ ! ఇంకెప్పుడూ చలాన్ని గాని , ఆమెని గాని చూసిన పాపాన కూడ పోకూడదు’ ధృడమైన నిశ్చయానికి వచ్చాను.
*****************
నా పుస్తకం సంగతి అడుగుదామని అనుకొనే సరికి లోపలి నుండీ పిలుపు వినిపించింది.
వెంకటచలం కూడా కళ్లతోనే నిర్దేశించాడు,“ లోపలికి వెళ్లు” అని.
ఎన్నెన్నో ఊహలు వెంటాడుతుంటే లోపలికి వెళ్లాను.
ఎర్ర గులాబీ అంచు మల్లె రంగు చీరలో ‘శశికళ’ మూర్తీభవించి ఎదురై నా అంచనాలని తారుమారు చేసింది.
“ నీకా పుస్తకం అంత అవసరమా తమ్ముడూ ?” పెద్ద టేకు చెక్క బీరువా నుండి, నేనేనాడూ చూడ్డానికి కూడా నోచుకోని పుస్తకాల దొంతరల లోనుండి ,‘సాక్షిని ’ తీసి ఇస్తూ అడిగిందామె.
‘ ఇంత మంచి సాహిత్యాన్ని అభిమానించ గల ఈమె చరిత్రహీన ఎందుకవుతుంది ?’
“ ఫరవాలేదు, మీరు చదివిన తరువాతనే ఇయ్యండి,” అన్న మాటతో బయటపడ్డాను.
ఆ తరువాత చెప్పవలసినది ఏముంది? నాకూ ఆమెకీ సంబంధం సాహిత్యానికి చెందినంత వరకూ ధృడతరమయింది.
ఒకరోజు
ఎప్పటిలాగే ఆమె దగ్గరనుండి తెచ్చిన, ‘దశకుమార చరిత్ర’ చదువుతున్నాను. పుస్తకం మధ్యనుండి ‘నీలం రంగు కవరు’ బయట పడింది. తప్పు అని తెలిసినా ఆత్రాన్ని
ఆపుకోలేక తెరిచాను. అది ఎవరికి వ్రాయబడిందో వేరే చెప్పనక్కరలేదు. ఎవరు వ్రాసారో అందులో తెలియపరచ లేదు.
పోతే—
సమాజం దృష్టిలో చులకన అయిన ఆడదానికి, మనస్సులోని నల్లటి ఛాయలని పెద్ద మనిషి బురఖాలో దాచిపెట్టి తిరిగే మగాడు వ్రాసే ఉత్తరంలో ఏముంతుంది గనుక ?
‘ఫలానా చోట ఫలానా సమయానికి వచ్చి కలుసుకో’ అని అర్థం వచ్చే మాటలు తప్ప వేరేమీ లేవు.
వెంకటచలం మీద నిజానికి కోపమే వచ్చింది .అయినా అలాంటి రహస్య జీవనం గడప వలసిన అవసరం మాత్రం అతనికి ఏముంది ! ఇవాళ రేపు ఎంతమంది అక్క కూతురుని వివాహం చేసుకోవడం లేదు ! మరునాడు పుస్తకంతో పాటు, ఉత్తరాన్ని కూడా ఇచ్చాను ఆమెకి, “ ఇదుగో అక్కయ్యా నీ ఉత్తరం,” అంటూ.
కొన్ని క్షణాలపాటు నా వంక మౌనంగా చూసి, బీరువాలోంచి కొన్ని కట్టల ఉత్తరాలు తీసి, నా ముందు పెట్టింది ఆమె, “ ఆ ఉత్తరాన్ని కూడా వీటిలో చేర్చు తమ్ముడూ !” అంటూ.
మంఛుగడ్డతో నెత్తిన మొత్తినట్లయింది నాకు !
ఏమిటి ఈమె !
రకరకాల భావనలు సముద్ర తరంగాలలా హృదయపుటంచులు దాటి , నురగ పర్వతాలయ్యాయి.
ఆమె చల్లని హస్తస్పర్శ నుదుటి మీద పడి, తిరిగి ఈ లోకంలోకి తెచ్చింది. నన్ను.
“ చలం బాబుకీ, నాకూ మధ్య అడ్డుగోడలు ఎందుకని కదూ తమ్ముడూ , నీ మనసు నిండిన ఆవేదన ! చెబుతాను తమ్ముడూ, తప్పక చెప్తాను, చెప్పి నా మనసులోని బరువు కూడా దించుకొంటాను.కాని ఇప్పుడు కాదు,” ఏదో తెలియరాని ఆవేశంతో మాట్లాడింది ఆమె.
“ మరెప్పుడు ?”
“ నీఖు చెప్పాలని తోచినప్పుడు”, కళ్ల జాగాలో ఉన్న కాటుక పిట్టలు విచిత్రంగా నవ్వాయి ! “ ప్రస్తుతానికి ఈ మాత్రం తెలుసుకో తమ్ముడూ ! చలం బాబు నాకు మేనమామ వరస కాదు, నిజానికి నాకూ అతనికీ ఎలాంటి చిట్టరికమూ లేదు,” త్వరత్వరగా మాటలు ముగించి ఇంటిలోకి వెళ్లిపోయింది ఆమె.
ముంచెత్తిన ఆశ్చర్యం నుండి తేరుకొని చుట్టూ చూసే సరికి, అలవాటయిన పాదాలు ఇంటికి చేర్చాయి నన్ను.
ఆ రాత్రి అంతా కలత నిద్రతోనే గడిపాను. ‘చలానికీ ఆమెకీ ఎటువ్బంటి బాంధవ్యమూ లేకపోతే ఆమె అతని ఇంటిలో ఎందుకుంటుండది ? అన్న ఆలోచన ,కలయై, కల్లయై చాలా
తేలిక అంచనాలకి గురియై, నీచమైన అనుమానం కలగడానికి దోహదం చేసింది.
‘ ఛ ! ఇంకెప్పుడూ చలాన్ని గాని , ఆమెని గాని చూసిన పాపాన కూడ పోకూడదు’ ధృడమైన నిశ్చయానికి వచ్చాను.
*****************
Subscribe to:
Posts (Atom)









