Skip to main content

Posts

Showing posts from March, 2011

సింహాద్రి

సింహాద్రి లాంటి ‘ఓబులయ్య’ సాహసానికీ, అద్రి లాంటి ‘ముత్యాలు’ ఓర్పుకీ , పరీక్ష పెట్టాడానికే , ‘ సింహాద్రి’ పుట్టాడా ! ఏమో !! ************* ఊరికి నాలుగు మైళ్ల అవతల, నల్లటి తారు రోడ్డు మీద, కళ్లు తెరిచిన ,‘ సింహాద్రి’, ఏడుపు లంకించుకొనే సరికి, శర వేగంతో కదుల్తున్న , ‘లారీ’ చక్రాలు ‘ కంయ్యి’ మంటూ ఆగి పోయాయి. “ ఛ ! వెధవ సంత !” విసుగుకొంటూ లారీ నుండి క్రిందకి దిగాడు ‘ఓబులయ్య’. ‘ ఓబులయ్య’ అంటే లారీ డ్రైవర్ల భాషలో ,‘ సింహం లాంటి మడిసే,’ అయినా ఊరి చివర శివాలయం దగ్గర , మర్రి చెట్టు మొదట్లో నివసించే, ‘ముసలమ్మకి’ మాత్రం ,‘ఎర్రినాగన్నే’!ఓబులయ్య ఎవరో ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకోవడం మాత్రం, నిజానికి అసాధ్యమనే చెప్పాలి. అంతెందుకు- “ ఓబులయ్యా, ఓబులయ్యా ! నువ్వెవెరివి ? ఎక్కడి నుంచి వచ్చావ్ ?” వగైరా ప్రశ్న ఎవరైనా అడిగితే, వచ్చేది--- సగం విడీ విడని పెదాల మధ్య మెరిసే చిన్న ‘హాసరేఖ’ మాత్రమే . “పోతే అతనెలాంటి వాడు ?” అన్న ప్రశ్నకి మాత్రం, “ అమ్మ బాబోయ్ !” అని వాపోయి నలుద్రిక్కులూ చూసి, మెల్లగా జారుకొంటారు ఆ వాడలోని జనం. చిన్న_ పెద్ద , పిల్లా _ పిచికా , అందరికీ అతనంటే అంత భయం అతనంటే ! అలాగని ‘ ఓబులయ్య’

గాలి వాన

చిట్టమ్మి వరి ఓవులని విసురుతోంది. బండి పైన ఉన్న నారన్నాయుడు వాటిని అందుకొంటున్నాడు. ఆ విసురులోని వయ్యారం , ఆ ఊపులోని కదలిక, గురిచూడడం లోని మురిపించే చూపులు వెనక్కి వంగి ఒక్క ఉదుటున విసిరేటపుడు కదిలే స్తనాల అన్యోన్య కర్కశత్వం , నారన్నాయుని మదిలో మధుర భావనల్ని గుప్పిస్తున్నై. చిట్టమ్మి పేద పడుచు, తల్లి తండ్రులు లేని పిల్ల. ఈ సువిశాల ప్రపంచంలో ఆమెకున్న ఒక్కగా నొక్క దిక్కు తాత సోమినాయుడు ఒక్కడే ! సొమినాయుడు డెబ్భై సంవత్సరాల వృధ్ధుడు.దౄష్టి మందగించినందున దేనికీ పనికి రాడు. నారన్నాయుడు గ్రామంలో పెద్ద రైతు. కండలు తిరిగిన భుజదండాలు , నల్లసాని రాతి వలె మిలమిల మెరిసే గుండెల వైశాల్యం, వాని యౌవనం యొక్క పరాకాష్టకి నిదర్శనాలై నిలిచి ఉన్నై. “ నాయుడు మాఁవా ! గబగబా ఓవుల్ని అందుకోలేకున్నావ్ !” అని చిట్టెమ్మి కిలకిలా నవ్వింది. ఆ నవ్వు నాయుని హృదయంలో తియ్యని స్పందనని పుట్టించింది. ‘‘ ఆ నవ్వుల జల్లు కోసమెనే పిల్లా, నేను ఆలస్యం చేస్త !” అని చిరునవ్వు నవ్వాడు నారన్నాయుడు. చిట్టమ్మి కపోలాలు అరుణ రాగంతో కెంపెక్కాయి. సిగ్గుతో ఆమె శరీరం వణికింది. “ పిల్లా ! బండికి బరువు అగ్గజమయింది. పడుగుని లాగి పట్టుకో,

చదువు

గుమ్మం దగ్గర, మోకాళ్ల మీద తల ఆన్చి కూర్చోన్నదల్లా, ఏదో నిర్ణయానికి వచ్చినదాన్లా, గభాలున లేచి, గాజులు గలగలమనేలా చీర కుచ్చెల్లు సర్దుకొంది రాజ్యలక్ష్మి. గదిలో టేబుల్ మీద, లాంతరు వెలుగులో, లావుపాటి బైండ్ పుస్తకం చదువుతున్న, లెక్చరర్ భాస్కరం దృష్టిని ఆమె చర్యలేవీ అలరించ లేక పోయాయి. ఆమెకి తెలుసు, తన హొయలు, తన వయ్యారాలు, నయాలు, అనునయాలు ఏవీ అతనిని పుస్తకం ముందు నుంచి కదిలించలేవని, అయినా ఆమె తన ప్రయత్నం మాన దలచుకొలేదు. పది రోజుల నుంచి, ప్రతీ రోజూ ఆమె అనుకొంటోంది, ‘ ఈ రోజు ఎలగైనా అతనితో మాట్లాడాలని !’కాని తొమ్మిది రోజులూ ఆమెకి చుక్క ఎదురయింది. ‘ అందుకే ఈ రోజు చెప్పెయ్యాలని’, గట్టిగా నిర్ణయించుకొని లేచిందామె. గది తలుపులు గభాలున మూసి, బోల్టు బిగించింది. టేబిల్ దగ్గరగా వెళ్లి, అతని ఎదురుగా ఉన్న కుర్చీని జరాల్మని లాగి, అర చేతుల మధ్య ముఖాన్ని ఇమిడ్చి, టేబిల్ అంచు మీదుగా వంగి, తపో భంగం చేయడానికి వచ్చిన అచ్చెరలా కూర్చొంది. భాస్కరం ఏకాగ్రతకి ఈ సారి భంగం కలిగింది. అతని దృష్టి సులోచనాల మీదగా . పేజీ ఫ్రంటు లైను నుండి, ఆమె .మీదకి మరలింది. ఎర్రని చివర్లతో, విచ్చుకొన్న తెల్ల కలువల్లాంటి అర చేతులని , ముద్

మరలు మమతలు

మరలు మమతలు అది ఒకానొక పేరు మోసిన ప్రైవేటు కంపెనీలోని ‘టూల్ రూమ్’ .ఆధునిక పధ్ధతిలో డిజైన్ చేయబడి అందంగా, నీట్ గా ఉంది. లేత్, మిల్లింగ్, ప్లేసర్, షేపర్, బోరింగ్, గ్రైండింగ్, డ్రిల్లింగ్ లాంటి బేసిక్ మిషన్లతో పాటు, మరికొన్ని ప్రత్యేకమైన పనులు చేసే ప్రత్ర్యేకమైన మిషన్లు కూడా కలిగి, సాంకేతిక విధ్యార్థులకీ , ఇంజనీర్లకీ కనుల పండుగ చేసేలాగుంది ! ఆ యంత్రాంగం ,‘ ఫుల్ స్వింగుతో ’పని చేసేటప్పుడు చూడాలి. యంత్రాల మీదుగా అమర్చబడిన ‘ పుల్లీలు’ గిరగిరా కళ్లు చెదిరిపోయేలా తిరుగుతూ, తమని బెల్టులతో బిగించిన యంత్రాలలో కొన్నిటిని ,తమలాగే గిరగిరా తిప్పుతూ, మరి కొన్నింటిని క్రిందకీ, మీదకీ, ముందుకీ, వెనకకీ ఊగేలా చేస్తూ, రకరకాల కదలికలని వేటివి వాటికి అనుగుణంగా మార్చి, ప్రదర్శిస్తూ ఉంటాయి.ఒక్కోచోట నిప్పురవ్వలు పుట్టించే గ్రైండర్లూ, తమకి కట్టర్ కీ మధ్య చుట్టలు చుట్టలుగా పాములు లాగ సాగిపోయే లోహపు రజనుని సృష్టించే ‘లేత్ లు’ దళసరి ఇనుప పేట్లని ఒకే ఒక బ్రహ్మాండమైన శబ్దంతో ముక్కలు ముక్కలు చేసే,‘ షీట్ కటింగ్’ యంత్రాలతో పాటు, నున్నని ఫినిష్ ని ఇచ్చి, నిశితమైన గ్రూవులూ, స్లాట్ లూ,తయారు చేసే ,‘ మిల్లర్లూ’ , ఒకే

ఎడమ చేతి బొటన వ్రేలు

ఎడమ చేతి బొటన వ్రేలు ( ఈ కథానిక స్వాతి మాస పత్రిక , సెప్టంబరు 2011 సంచికలో ప్రచురిత మయింది). “ అమ్మా ! పది లక్షల రూపాయలు ఇస్తాను, అది తీసుకొని ఎక్కడికైనా వెల్లిపో !” కొడుకు మాటలు విని నిర్ఘాంతపోయింది రాజ్యలక్ష్మి. ఆమె వయసు 73 సంవత్సరాలు, ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పని చేసి, పదిహేనేళ్ల క్రిందట పదవీ విరమణ చేసింది.ఒక్కగానొక్క కొడుకుతో దక్షిణ ముంబయిలో, సంపన్నవర్గాల కాలనీలో నివసిస్తోంది.మూడేళ్ల క్రిందట వివాహం కూడా చేసింది. మనవల కోసం ఎదురు చూస్తూ, ఆ విషయమేదో చెప్తాడనుకొన్న కొడుకు హఠాత్తుగా ఆ మాటనే సరికి, తల దిమ్మెక్కిపోయింది ఆమెకి. “ మరి నువ్వూ, కోడలు పిల్లా ?” ఎట్టకేలకి గొంతు కూడగట్టు కొని అడిగింది. “ మేమిద్దరం లండన్ వెళ్లి పోతున్నాం. మాకు అక్కడ మంచి జాబ్ దొరికింది. వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు జరిగి పోయాయి.వచ్చే వారం లోనే ప్రయాణం.”’ “ అలాగా చాల సంతోషం నాయనా ! నేనెక్కడికి పోతాను ? ఈ ఇల్లు---” “ఇది అమ్మేసాం అమ్మా ! ఆ డబ్బులోంచే నీకు పదిలక్షలు ఇస్తానంటున్నది. ఇంత పెద్ద ఇంట్లో, ఇలాంటి పోష్ కాలనీలో నువ్వు ఉండ లేవు. నీకు ఈ ముంబయి మహానగరం బాగా తెలుసుకదమ్మా! ఏదైనా చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని కా

మంటల్లో మైకా గని ౩

మంటల్లో మైకా గని ౩ ( ప్రవేశం సక్లేచా. విష్ణుప్రసాద్ ) సక్లేచా ---- మిస్టర్ ప్రసాద్ ! మీరు చెప్పింది నిజమే ! డ్రిల్సులో నిద్ర పోతున్న డైనమైట్లు ప్రేలినట్లయితే, గని దారులు మూసుకొని పోయే ప్రమాదం ఉంది. పరిస్థితి నిజంగానే ప్రమాదకరంగా ఉంది. నీకేమైనా ఉపాయం కనిపిస్తోందా ? విష్ణుప్రసాద్ --- కార్మికులు వీలయినంత త్వరగా పనిలో చేరడమే దీనికి తరుణోపాయం ! సక్లేచా --- అవును అదొక్కటే తరుణోపాయం ! కార్మికులు అతి త్వరలో పనిలో ప్రవేశించాలి. నేను యూనియన్ నాయకులని వెంటనె పిలిపిస్తాను. మీరు వాళ్లతో కాంప్రమైజు అయిఫోండి. విష్ణుప్రసాద్ ---- ( బాధతో ) నిజమే సర్ ! మీరు చెప్పింది చాల బాగుంది. వర్కర్సుతో సంఘర్షణ తెచ్చుకొని సమ్మె చేయించమన్నది మీరే ! తిరిగి వాళ్లతో కాంప్రమైజు అయిపోయి సమ్మెని ఆపేయమన్నదీ మీరే ! మీరు పెద్దలు, ఎప్పుడేం మట్లాడినా మీకే చెల్లింది. మేము మీ చేతిలో కీలుబొమ్మలం, ఆడించినట్లల్లా ఆడాలి, హు ! మేనేజిమెంటులో ఒక భాగమయిన నన్ను కూడా, మీరు సామాన్య కార్మికునిలాగే ట్రీట్ చేసారు. మీలాంటి ఎం.డిల దగ్గర పని చేసేకన్న స్వతంత్రించి పని చేసుకోవడం చాల మంచిది