స్వర్ణాంధ్రలో సంక్రాంతి స్వర్ణాంధ్ర అంటే వర్తమాన స్వర్ణాంధ్ర ప్రదేశ్ కాదు. వర్తమాన స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఎంత నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉందో అందరికీ తెలుసు. నేను చెప్పే స్వర్ణయుగం 500 సంవత్సరాల క్రిందట అంటే 1510 లో శ్రీ కృష్ణదేవరాయలు పరిపాలనకి వచ్చినప్పటి కాలంలో సంక్రాంతి జరుపుకొన్న, ఒక ఊర్లో పిల్లల గురించి. ఆ పిల్లల విషయం నీ కెలా తెలుసు అని అడగకండి. ఎందుకంటే ఇది కలలో చూసిన కథనం, కాకపోతే కల్పితం. ఇంకా ఎక్కువగా నిలదీస్తే మిమ్మల్ని నవ్వించాలని, మీతో సరదాగా సంక్రాంతి సంబరాలని పంచుకోవాలని చేసిన ప్రయత్నం. మీరు మెచ్చుకొన్నా, నొచ్చుకొన్నా, తిట్టినా, దీవించినా, దేనికైనా సిద్ధం! ఒక ఊఁర్లో తొమ్మదిమంది పిల్లలు ఆడుకోవడానికి ఆరు బయటికెళ్లారు. వాళ్లలో ఆడా-మగా ఇద్దరూ ఉన్నారు. ‘ భువన-విజయం’ ఆట ఆడాలని అనుకొన్నారు. ‘భువన విజయం అంటే శ్రీ కృష్ణదేవరాయల సభా భవనం. తన ఆస్థానంలోని అష్టదిగ్గజాలతో రాయలవారు సాహిత్య చర్చలు చేసే స్థలం. ఇంకేముంది, వాళ్లలో చిన్నదే అయినా చురుకైనది, పొడగైనది అయిన అమ్మాయి