గతించిన ఏడేళ్లలో జగన్నాధం రైలు స్టేషనుకి రావడం అదే ముదటి సారిగా చూసిన పోర్టర్ దాలయ్య .“ బండికేనా బాబూ ?” అని ప్రశ్నించాడు అపనమ్మకంతో. “ అవును.” “ ఎక్కడికి బాబూ ?” “ చిన్న పనుండి బయలుదేరాను పట్నానికి.” “ ఏ పట్నానికి బాబూ ?” అని దాలయ్య అడగనూ లేదు, జగన్నాధం చెప్పనూ లేదు. ‘ ఈ స్టేషన్లో కూడా ఆగవలసి వచ్చింది కదా’ అని నిట్టూర్చి గట్టిగా కూత వేసి, ఆగింది రైలుబండి. జగన్నాధం తోలు సంచీ దాలయ్య చేతికిచ్చి బండీలో ఎక్కాడు. దాలయ్య అతి కష్టం మీద జగన్నాధాన్ని, సంచీని ఒక పెట్టెలో కూరి, “ బాబూ !” అంటూ చేయి చాపాడు. జగన్నాధం అదేదీ గమనించకుండా ప్రయాణీకుల మధ్య తలదాచుకొన్నాడు రైలుబండి ఆలస్యాన్ని భరించలేని దానిలా కదిలింది. కనీసం టీ డబ్బులన్నా దొరుకుతాయని ఆశించిన దాలయ్య నిరాశతో వెనుతిరిగాడు. ‘ ఏం చేస్తాం ! యుగధర్మం, ఇకమీదెప్పుడూ తెలిసిన వాళ్లకి సాయం చేయకూడదు’ అనుకొంటూ. జగన్నాధం కూర్చొన్న రైలు దిగవలసిన పట్నం చేరుకొంది. స్టేషన్లోనే దిగి, పరిచయస్థులెవరైనా కనబడతారేమోనని చుట్టూ కలయ జూసాడు..దూరంగా ఒక పోర్టర్’తో మాట్ళాడుతూ నిల్చొన్న ‘సర్వాయి ’ కనబడగానే, జగన్నాధం అతనిని ఆశ్చర్యంతోనూ, కుతూహలంతోనూ బిగ్గరగా పిలిచాడ