Skip to main content

యుగధర్మం 2

గతించిన ఏడేళ్లలో జగన్నాధం రైలు స్టేషనుకి రావడం అదే ముదటి సారిగా చూసిన పోర్టర్ దాలయ్య .“ బండికేనా బాబూ ?” అని ప్రశ్నించాడు అపనమ్మకంతో.

“ అవును.”

“ ఎక్కడికి బాబూ ?”

“ చిన్న పనుండి బయలుదేరాను పట్నానికి.”

“ ఏ పట్నానికి బాబూ ?” అని దాలయ్య అడగనూ లేదు, జగన్నాధం చెప్పనూ లేదు.

‘ ఈ స్టేషన్లో కూడా ఆగవలసి వచ్చింది కదా’ అని నిట్టూర్చి గట్టిగా కూత వేసి, ఆగింది రైలుబండి. జగన్నాధం తోలు సంచీ దాలయ్య చేతికిచ్చి బండీలో ఎక్కాడు. దాలయ్య అతి కష్టం మీద జగన్నాధాన్ని, సంచీని ఒక పెట్టెలో కూరి, “ బాబూ !” అంటూ చేయి చాపాడు.

జగన్నాధం అదేదీ గమనించకుండా ప్రయాణీకుల మధ్య తలదాచుకొన్నాడు

రైలుబండి ఆలస్యాన్ని భరించలేని దానిలా కదిలింది. కనీసం టీ డబ్బులన్నా దొరుకుతాయని ఆశించిన దాలయ్య నిరాశతో వెనుతిరిగాడు. ‘ ఏం చేస్తాం ! యుగధర్మం, ఇకమీదెప్పుడూ తెలిసిన వాళ్లకి సాయం చేయకూడదు’ అనుకొంటూ.

జగన్నాధం కూర్చొన్న రైలు దిగవలసిన పట్నం చేరుకొంది. స్టేషన్లోనే దిగి, పరిచయస్థులెవరైనా కనబడతారేమోనని చుట్టూ కలయ జూసాడు..దూరంగా ఒక పోర్టర్’తో మాట్ళాడుతూ నిల్చొన్న ‘సర్వాయి ’ కనబడగానే, జగన్నాధం అతనిని ఆశ్చర్యంతోనూ, కుతూహలంతోనూ బిగ్గరగా పిలిచాడు.

‘ తననీ పట్నంలో పిలిచేవారెవరా’ అని ఆశ్చర్యపోతూ సర్వాయి వెనక్కి తిరిగి, జగన్నాధాన్ని గుర్తించాడు.

ఇద్దరూ కలిసి ఫ్లాట్’ఫారం దాటి బయట పడ్డారు. జగన్నాధం ఆత్రాన్ని అణచుకోలేక, “ అయితే సర్వాయ్---” అన్నాడు.

అతని ఆంతర్యాన్ని అర్థం చేసుకొన్న సర్వాయి చిరునవ్వు నవ్వి, “ నేను పాపాయి కలిసి ఒకేసారి మాయమవటం ఆశ్చర్యాన్ని కలగ జేసింది కదూ ?” అని అడిగాడు.

“ అవును.”

“ నేను ఊరు విడిచిపెట్టే చివరి క్షణం వరకూ, అలా చేద్దామనుకోలేదు. ఇప్పుడదంతా తలచుకొంటూంటే --- ఆహా ! దైవ ఘటన అనిపిస్తుంది, అంతే కదా ?”

“ అసలు నీకు ఊరు విడిచి పెట్టాల్సిన అవసరమేం వచ్చింది ?”

“చెబుతా విను , దీనికంతటికీ మూల కారణం పోలయ్య.”

“ పోలయ్య ఎవరు ?”

“ వాడే ఆ గజదొంగ ! జైలునుంచి బయట పడినా వాడికా దుర్భుధ్ధి పోలేదు. ఎవరినో దారిన పోయిన వాళ్లని దోచి, మూడు వందల రూపాయలు సంపాదించాడు. ఆ వైనం కాస్తా ఒక పోలీసు కంట పడింది. వాడు పోలయ్యను తరుముకొంటూ వచ్చాడు. పోలయ్య వాడి కంట్లో కారం కొట్టి, మన ఊరు చేరుకొని, తన దగ్గర డబ్బుంటే ప్రమాదమని, ఒంటరిగా ఊరి బయట కూర్చొని ఉన్న నాకు ఇచ్చి దాచమనీ, ఒకటి రెండు రోజులలో వచ్చి తీసుకొని పోతాననీ , ఆ డబ్బు కాజేయాలని పథకం వేస్తే, ప్రాణల మీద ఆశ వదులుకోవాలనీ, హెచ్చరించాడు. అలా దాచి ఇస్తే నా కేదో కొంత సహాయం చెస్తానన్నాడు. నేను మొదట అంగీకరించక పోయినా, పోలయ్య బలవంతం మీద ఒప్పుకొన్నాను.--- ”

“ తరువాత ?”

“ ఆ డబ్బు సందూకు పెట్టెలో దాచాను. అందులోంచి ఎలా పోయాయో, ఏభై రూపాయలు పోయాయి ! దాన్ని చూసి నా గుండె దడదడలాడింది. రేపో ఎల్లుండో పోలయ్య వచ్చి ,
“నా డబ్బు నా కివ్వమంటే ఏం చెయ్యాలి ? ఒక వేళ వాడే నా భర్య కూలికి వెళ్లినప్పుడు రహస్యంగా వచ్చి, దానిని కాజేసాడేమో అని సందేహం కలిగింది !.”

‘కాదు, ఆ డబ్బు సీత తీసింది’ అని చెప్దామనుకొని, ’ మౌనం వహించాడు జగన్నాధం.

సర్వాయి క్షణం సేపు జగన్నాధం ముఖం వంక పరిశీలనగా చూసి, “ అప్పటి నా పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించు. పెట్టెలోని డబ్బు మూడు వందలు కావాలంటే , ఏభై రూపాయలు తెచ్చి భర్తీ చెయ్యాలి. రోజుకి ముప్పావలా కూలికి ఠికాణా లేని నేను , ఏభై రూపాయలు ఎలా సంపాదించ గలను ? ఆ డబ్బు తీసుకొని ఎవరికీ తెలియని చోటికి పారిపోవాలని అనుకొన్నాను. ఆ నిర్ణయానికి ఎలా లోబడ్డానో తలచుక్పొంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.”

“ మరి పాపాయి సంగతో ?”

“ అదే చెబుతున్నా ! నేనా డబ్బుతో గుండాల చెరువు దాపుల్లోకి వచ్చేసరికి సన్న సన్నగా ఏడుపు వినిపించింది. “ నన్ను వదిలెయ్య మావా ! అన్యాయం చెయ్యకు, నువ్వు దర్జాగానే బతుకుతావు. కాని తరువాత నాకీ ఊరులోనే కాదు, ఈ దేశంలో కూడా బతకడం దుర్భరమవుతుంది.” అంటూ. నేను ఆశ్చర్యంతో ఆ వైపు చూసాను.

“ ఏం జరిగింది ?”

“ పోలాయి చేతుల్లో పాపాయి నలిగిపోతోంది ! ఆ దుర్మార్గుడి చెవులకి ఆమె దీనాలాపాలు వినిపించడం లేదు ! రాళ్లే కరగ వలసిన ఆమె విలాపాలకి నా మనస్సు కరగకుండా ఉంటుందా ? నేనింక ఆగలేక పోలాయి నా కన్నా బలాఢ్యు డనైనా లెక్క చేయక వాడితో దెబ్బలాటకి సిధ్ధమయ్యాను. అలా చాలా సేపు కుమ్ముకొన్నాం. చివరికి సమయం చూసి, పోలాయిని చెరువులోనికి తోసి వేయడానికి సిధ్జ్ధమయ్యాను,. పోలాయి భాయంకరంగా అరిచాడు ! తనను చెరువులోనికి తోయ వద్దని దీనంగా వేడుకొన్నాడు. చిన్నప్పుడు శాస్త్రులుగారు వాడికి ‘జలగండం’ ఉందని చెప్పారట ! అందుచేత నీరంటే భయమని, ఈతకూడా రాదని మొరపెట్టాడు.

‘‘ నేనట్టి అవకాశాన్ని జారవిడువదలచుకోలేదు. వాడు కాని బ్రతికి ఉంటే ఏనాటికైనా నాకు ప్రాణ భంగం, పాపాయికి మానభంగం కాక తప్పదు. అందుచేత నీకు జలగండం ఉందని ఉందని చెప్పిన శాస్త్రులెవరో గాని, నాకు మేలు చేసాడు” అంటూ వాడిని చెరువులోకి తోసాను.”

దూరం నుండి అంతా చూస్తున్న పాపాయి, తాను కూడా చెరువులోకి దూకడానికి ప్రయత్నించింది. నేను అడ్డు పడితే, హీనమైన బతుకు బతకలేనని, ఆ దుర్మార్గుడు అంటిన శరీరం తనకి అవసరం లేదనీ, తనని అడ్డుకోవద్దనీ ఏడ్చింది.

నేను పాపాయి సఛ్ఛీలానికి నిర్ఘాంత పోయాడు. అట్టి వ్యక్తి చనిపోతుందనే భయం వేసింది. ప్రాణతాగం పాపమని ఆమెకి సద్భోధ చేసాను.

అంతా విని, “ఈ సంగతి తెలిస్తే, నన్నెవరు ఏలుకొంటారు మావా ?” అని ప్రశ్నించింది.ఒంటరి జీవితం గడపలేనన్నది.

“ రాళ్లు కరగవలసిన , మోళ్లు చిగిరించ వలసిన ఆ మాటలకు నేను చలించిపోయాను. పాపాయిని గట్టిగా హృదయానికి హత్తుకొన్నాను, నేను ఉండగా నీకేం భయం లేదు,” అంటూ.,తరువాత మేమిద్దరం ఆ ఊరిలో ఉండడం ఇష్టం లేక ఈ పట్నం చేరుకొన్నాం.”

“ ఇక్కడ ఏం చేస్తున్నావ్ ?” జగన్నాధం సర్వాయి ముఖం వంక నిశితంగా చూస్తూ అడిగాడు.

“ ఇక్కడ నాతో పాటు చిన్నప్పుడు చదువుకొన్న మిల్లు యజమాని గారి అబ్బాయి ఉన్నాడు. అతని సహాయంతో ఇక్కడే ఫేక్టరీలో ఉద్యోగం దొరికింది. రోజుకి అయిదు రూపాయలు కూలీ ఇస్తారు.”

జగన్నాధం రెండు నిమిషాలు మౌనం వహించి, “ అంతా బాగానే ఉంది గాని సర్వాయి ! సీతని వదిలి పెట్టడమే తెలివి తక్కువ పని ! ఇప్పుడు దానికి ఏ మార్గం చూపిస్తావ్ ?” అని అడిగాడు.

సర్వాయి పిడికెళ్లు రెండూ అప్రయత్నంగానే మూసుకొని, బిగుసుకొన్నాయి.కళ్లల్లో కెంపు జీరలు తాండవమాడాయి. అతడు జగన్నాధం వంక తీవ్రంగా చూస్తూ, “ సీతకేం లోటు జగన్నాధం ! నువ్వున్నావుగా ఆమెని చూసుకోవడానికి ? ” అని గబగబా అడుగులు వేస్తూ, సందు మలుపు తిరిగిపోయాడు.

మెరుపు కొట్టినట్లయింది జగన్నాధానికి. అతని కళ్లు గిర్రున తిరిగ సాగాయి. తన ముందు మరొక జగన్నాధం నిల్చొని ఉన్నట్లుగా భ్రాంతి చెందాడు. “ ఎవరు నువ్వు ?” అని తీక్షణంగా ప్రశ్నించాడు.

“ నేనే నీ మనస్సుని !” మరో జగన్నాధం బదులిచ్చాడు.

“ చూసావా, సర్వాయి ఎంత మాటన్నాడో !” దీనంగా ధ్వనించింది అతని కంఠం.

“ అందులో అబధ్ధమేముంది ?”

“ నువ్వు కూడా అదే మాట అంటున్నావా ?”

“ అననా మరి ? నువ్వు వీరన్న పాలెంలో స్థిర పడడానికి మూడవదీ, ముఖ్యమయినదీ అయిన కారణం సీత కాదా ?”

“ అవును,” నీరసంగా బదులిచ్చాడు జగన్నాధం. మరో జగన్నాధం వికటంగా నవ్వాడు, “ హు ! జగన్నాధం ! ఆ నాడు సర్వాయి, పాపాయీ కలిసి లేచి పోయారంటే ,‘ యుగధర్మం’ క్రింద జమకట్టి హేళన చేసావ్ ! నీకూ సీతకీ గల రహస్య సంబంధాన్ని ఏమని వ్యాఖ్యానిస్తావు ? అదీ యుగధర్మమేనా ?”

“ నువ్వు ఫో ! దూరంగా ఫో !” జగన్నాధం గట్టిగా అరిచాడు.

“ ఏమిటో యుగధర్మం ! అందరూ పొమ్మనే వారే గాని, ‘కానీ’ ధర్మం చేసిన వారెవరూ లేరు,” అని గొణుగుకొంటూ, అంత వరకూ జగన్నాధం ముందు అంత వరకు నిల్చొని ఉన్న ఒక బిచ్చగాడు ముందుకు కదిలాడు.

(ఆంధ్రప్రభ 29.03.1967)

********************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ