Skip to main content

ఆత్మ సాక్షాత్కారం

అదొక డాక్ బంగళా.

దానికి దగ్గరలో ఉన్న గ్రామం, దరిద్రానికి కూడా దగ్గరగానే ఉంది. అయినా బక్క చిక్కిన శల్య పంజరాల లాంటి ప్రాణులు, ముఖ్యంగా మనుష్యులు, కుక్కలతో మాత్రం సుసంపన్నంగా ఉంది.

కుక్కల్ని మినహాయించినా, ఇంకా ఎంతో ప్రాణ శక్తి నిండిన ఆ గ్రామంతో సహజంగానే ఒక మంత్రిగారికి పని పడింది. అలా అవసరపడి వచ్చిన మంత్రిగారు, అంతకన్న అవసరపడి వచ్చిన చీకటి వల్ల, ఆ రోజు రాత్రికి, పాపం డాక్ బంగళా లోనే విశ్రమించారు.

మంత్రిగారి రాక ఆ ఊరి ప్రాణికోటికి, కనీసం కాకైనా చెప్పలేదు ! వార్తా పత్రికలు చెప్పాయి గాని, అవి ఆ ఊరి పొలిమేరలకి కూడా రావు. అందుచేత వాటిని చదివే పాటి మనుష్యులకి గాని, చించి తూర్పారబెట్టే కుక్కలికి గాని, అతని రాక తెలియలేదు.

అయినా అవి ( కుక్కలు ) బారులు తీరి, డాక్ బంగళా చేరుకొన్నాయి. కారణం వాటి పసిగట్టే స్వభావం వల్ల కాదు, చీకటి పడే సరికి అక్కడికి చేరుకొనే అలవాటు వల్ల ! అలా
చేరుకొన్న ఆ కుక్కలు ప్రసన్న గంభిరమైన ఆ వాతావరణంలో బంగళా గచ్చు మీద తీరుబడిగా విశ్రమించి వంతుల వారీగా ఆనంద భైరవిని ఆలాపించ సాగాయి.

భొవ్, వ్, వ్, వ్, వ్--- భౌవ్

కేంవ్, వేవ్, వేవ్, వేవ్, వేవ్ --- కేంవ్

గుర్, కుర్, కుర్, కుర్ కుర్---- గుర్ అంటూ సాగిందా ఆలాపన.

మాగన్నుగా పడుకొన్న మంత్రిగారు అదిరిపడి లేచారు. కిటికీ తెరచి చూసేసరికి, శ్వాన సైన్యం చేస్తున్న ఆనంద లాస్యం, సంగీత సాధన , కనులు వీనులు రెండింటికీ కఠోరమైంది.
మంత్రిగారు కిటికీ రెక్కలు మూసేసారు. కాని ప్రకృతిలో ధ్వనించి, రమించి, ప్రతిధ్వనించిన ఆ భైరవ నాదాన్ని ఎలా ఆపెయ్యగలరు !

పాపం ! నిద్రకి కరువయింది.

ఆ రోజే కాదు, అంతకు ముందు రెండు రోజుల్నించీ అతను నిద్రకి కనుమరుగయ్యారు.

నిద్ర అతనికి చాలా అవసరం.

‘ కనీసం కొన్ని గంటలు, కాకపోతే ఒక గంట నిద్రిస్తే చాలు, మర్నాటి కార్యక్రమం హుషారుగా నడిపించ వచ్చు.’ అతను పక్క మీద లేచి కూర్చొని, నిద్రా ప్రణాళికను తిరగెయ్య సాగారు.

చెవుల్లో ముఖమల్ గుడ్డ దట్టించడం.

నిద్ర మాత్రలు సేవించడం. మొదటి దాని వల్ల శబ్దం శాంతించ లేదు. రెండో పనికి అలవాటు పడిన ప్రాణం, ఈ రోజు సహకరించడం లేదు. ఎక్కువగా సేవించడానికి భయం !ఇక పోతే ----

కుక్కల్ని తరమడం.

భగవధ్యానం , మంత్ర జపం. మూడోది అమ్మబాబోయ్ !

నాలుగోది వెల్లకిలా పడుకొని, సాధించడం మొదలు పెట్టారు.

“ ఆపదాం అపహతరిం, దాతారం స్వప్నదుర్లభం, లోకాభిరామం శ్రీ రామం, భూయో భూయో నమామ్యహం .”

“ ఆపదాం--- ఔవ్, వేవ్, వేవ్ --- అపహతరిం,---- కేంవ్, వేవ్, వేవ్ ---”

మరింక పక్క మీద పడుకోలేక పోయారు.మంత్రిగారు. గది బయటికి వచ్చి, కుక్కల వంక చూసారు. టార్చిలైటు వెలుగులో, ఒకటి, రెండు, మూడు ---’ అమ్మబాబోయ్ ! ఇరవైకి పైనే ఉన్నాయి !

ఇరవైల సంఖ్యలో ఉన్న కుక్కలు కూడా అతని వంక అపోజిషన్ మెంబర్లలా, మిర్రి, మిర్రి చూసి, కొంత దూరం వాకౌటు చేసి, తిరిగి అరుపులు లంకించుకొన్నాయి.

‘ ఇప్పుడేం చెయ్యాలి ?! ’ తీసుకు వచ్చిన జీపు డ్రయివరుని వెంట వచ్చిన అంగ రక్షకులనీ, తనే తిరిగి పంపించేసారు. మర్నాటి కార్యక్రమం కోసం జండాలు, దండలు, నినాదాలిచ్చే గొంతుకలు, వగైరా ఏర్పాట్లతో తెల్లారే సరికి వచ్చి తోడ్చుకొని పోవడానికి.

‘ఆ డ్రైవరే గాని ఉండి ఉంటే, ఈ దిక్కుమాలిన కుక్కల మీదుగా, జీపు తోలించి ఉండేవాడు ! కాని ఇప్పుడు ఒంటరి వాడయి పోయాడు ! --- అరే ! చౌకీదార్, - బ్లడీ బాస్టర్డ్, -- ఏమయ్యాడు ?!’

“ చౌకీదార్, ఓ చౌకీదార్ !”

జవాబు ఔటుహౌసు నుంచి రాలేదు , అపోజిషన్ నుంచి వచ్చింది ! ‘ భౌవ్, వౌవ్, అంటూ. మంత్రిగారి కోపానికి పిడికెట్లో టార్చిలైటు బిగుసుకొంది. చౌకీదారు కోసం ఔటుహౌసు వైపు దారితీసారు అతను.

ఔట్ హౌస్ వరండా గచ్చు మీద , తుంగ చాప పరచుకొని, తల క్రింద ఒక బట్టల మూట పెట్టుకొని, పలచటి దుప్పటి కప్పుకొని, గాఢ నిద్రలో ఉన్నాడొక మనిషి !

ఎంత హాయిగా నిద్ర పోతున్నాడు !

టార్చిలైటు వెలుగు ఆ వ్యక్తి ముఖం మీద నుండీ, కాళ్ల వరకు జారి తిరిగి, ముఖం పైన నిలిచింది. కాషాయ రంగు దుప్పటి, సగం సగం నెరిసిన గుబురు గడ్డం, తల పక్కనే దండం, కమండలం, ఎవరో సాధువులా ఉన్నాడు. ఎంత హాయిగా నిద్ర పోతున్నాడు !

“ చౌకీదార్ !” గట్టిగా పిలిచారు మంత్రిగారు.

సాధువుకి తెలివి వచ్చింది. లేచి కూర్చొన్నాడు. “ రాత్రి పూట చౌకీదారు ఇక్కడ ఉండడు బాబూ ! ఊర్లోకి పోతాడు, అతనికి బదులు నేనుంటాను. ఏదైనా పని ఉంటే చెప్పండి, నేను చేస్తాను.”

“ స్వామీజీ ! మీరు !! మీరు చేస్తారా ఆ పనిని ?”

“ ఏం పని బాబూ ! ఆ కుక్కల్ని తరిమెయ్యడమేనా ?”

“ అవును స్వామీజీ ! వింటున్నారు కదా, అవి ఎంత చేటుగా అరుస్తున్నాయో, ఆ గోలలో నిద్ర ఎలా పడుతుంది ?”

“ అలాగే తరిమేస్తాను బాబూ ! కాని మరి కాసేపటికి అవి మళ్లీ వచ్చి మొదలుపెడితే ఏం చేయాలి ? వాటిని తిరిగి రాలేనంత దూరం తరిమెయ్యమంటారా,లేక వాటి అరుపుల్ని వినిపించనంత దూరం ( ఫ్రీక్వెన్సీ ) పెంచెయ్యమంటారా? అలా చేస్తే నిద్రించ గలరా ?” స్వామి తన కమండలాన్ని చేతిలోకి తీసుకొన్నాడు.

మంత్రిగారికి స్వామి ప్రశ్నలో తిరకాసు ధ్వనించింది. “ మీకు కావలసినది ఏమిటి, నిద్రా, లేక ఆ కుక్కల పైన పగా ?’ వాటి రాజ్యం నుంచి వాటిని తరిమెయ్యడం గాని, లేక అరుపులు మూసేసి, సెకండ్ క్లాసు సిటిజెన్ లాగ, మార్చడం గాని, ఎంత వరకు సబబు ? ” అన్నట్లుగా ఉంది ఆ తిరకాసు.

“ స్వామీజీ నాకు కావలసింది నిద్ర ---”

మధ్యలోనే అందుకొన్నారు స్వామీజీ.“ ఆ నిద్రని చౌకీదారు గాని, నేను గాని, లేక ఇంకో మనిషి గాని ఎలా ఇవ్వగలరు బాబూ ? అలా ఇవ్వగలిగిన పక్షంలో, నా నిద్రని మీకు ధారపోసి ఉండేవాడిని.”

ఈ సాధువుని ఏదైనా ఎంక్వైరీ కమీషన్ హెడ్ చేయవచ్చు, అనిపించింది మంత్రిగారికి. ‘ కుక్కల పైన తన కోపంలో అర్థం లేదని తనే గుర్తించేలా చేసాడు. ఇప్పుడు నిద్ర మరొకరు తెచ్చి ఇవ్వలేరనే ప్రాథమిక సత్యాన్ని మరచి పోయినట్లు నిరూపించేసాడు. గడుసు పిండమే ! అయినా కానీ ---- లాంటి తన దగ్గరా కుప్పిగెంతులు !’

“ స్వామీజీ ! మీ నిద్రని త్యాగం చేయనక్కర లేదు. ఒక వేళ ఇవ్వగలిగినా ఆ ఇచ్చే నిద్రాదానం స్వీకరించే హీన స్థితిలో లేను నేను. నాకు స్వశక్తి మీదా, ఆత్మబలం మీదా చాల నమ్మకం ఉంది. ఈ కర్ణ కఠోరమైన అరుపుల మధ్య మీరు ఎలా నిద్ర పోగలుగుతున్నారో చిట్కా చెప్పండి.”

“ గోసాయి చిట్కా చెబితే చాలా బాబూ ! విప్పనక్కర లేదా ?” ముఖ్యమయిన విషయంలో తనని పిలిచి, సలహా అడిగినప్పుడు బదులడిగే ప్రతిపక్ష నాయకుడులాగ ఫోజు కొట్టాడు స్వామి.

“ ముందు చిట్కా చెప్పండి స్వామీజీ !” మంత్రిగారు కూడా తన రాజకీయ జీవితంలో ఏనాడూ తొందర పడలేదు.

స్వామి తన చిట్కాని ఇలా చిటపటాయించాడు. “ ఈ కుక్కలు మీ నిద్రని పాడు చేసే ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు బాబూ ! మీరిలా వస్తారని వాటికి తెలియదు. వాటి పని అవి అలవాటుగా చేసుకొంటున్నాయి. ఆ అరుపుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారే గాని, అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు.”

“ మీ తర్కం నాకు అర్థమయింది స్వామీజీ ! వాటి అరుపులు ఎంత స్వాభావికమైనవే అయినా, నేను వాటి స్వాతంత్ర్యాన్ని మన్నించి, ఎలా ఇబ్బంది పడకుండా ఉండగలను ? ఒకరి హక్కు, ఇంకొకరి స్వేఛ్ఛకి అంతరాయం కలిగించేలా ఉండకూడదు కదా ?”

“ నిజమే బాబూ ! కాని వచ్చిన చిక్కేమిటంటే ఆ కుక్కలు సివిక్సు చదువుకోక పోవడమే ! ఆ కుక్కలే కాదు, నగరంలో మీరు పెట్టిన పరిశ్రమలు, మీరు నడిపే వాహనాలు, యంత్రాలు వాటి పని అవి చేస్తూ, మీ లాంటి నాగరికుల నిద్రలని పాడు చేస్తూనే ఉన్నాయి ! మరి వాటి సంగతి ఏమిటి ? ఈ యంత్రాలు, జంతువుల రణగొణ ధ్వనిని మనకి అనుకూలంగా మార్చుకోవడమో, లేక మనమే వాటికి అనుగుణంగా మారిపోవడమో , అదే ఇప్పుడు చెయ్యాల్సిన పని.”

‘అమ్మ బైరాగి ముండాకొడకా ! కుక్కలకి, యంత్రాలకి ముడి పెట్టేసావా ?’ మనసులోనే స్వామిని దీవించేసారు మంత్రిగారు. “ స్వామీజీ ! మీరన్న మొదటి పాయింటు జరగని పని. రెండోది సబబుగానే ఉంది కాని --- ”

“ మీరా కుక్కల అరుపులతో దెబ్బలాడవద్దు. అలా చెయ్యబట్టే ఇబ్బంది పడుతున్నారు. వాటి అరుపుల్ని నిమిత్తం చేసుకొని మీకు మీరే చిరాకు పడిపోతున్నారు. అవి అరవకుండా ఉంటే మీరు పడుకోగలరు ! అదే కదా మీ షరతు ! అవి మీ మాట వినవు. అవి కుక్కలు జాబట్టి వినవు. అందుచేత మీరు మీ షరతుని విరమించుకొని వాటి అరుపుల్ని స్వీకరించండి. అవి ఆగితే గాని నిద్ర పోలేనన్న భావనకి దూరం కండి. వాటి ఆక్రోశాన్ని అసహ్యించుకోకండి. వాటిని వినకుండా ఉండాలనే ప్రయత్నమూ చేయకండి. ఏ ప్రయత్నమూ చేయకుండా మీ షరతు తొలగించుకొని ఆనందంగా స్వీకరించండి. అవి ఎంత ప్రాణ శక్తితో అరుస్తున్నాయో !! వాటినే మంత్రంగా చేసుకొని లయం అయిపోండి.”

“ స్వామీజీ ! నా చెవులకే కాదు, సమస్త ఇంద్రియాలకీ ఆ అరుపులు దుర్భరంగా ఉన్నాయి. వాటిని నే నెలా మంత్రంగా చేసుకోగలను ?”

“ అవును చేసుకోలేరు. ఎందుకంటే మీ ఇంద్రియాలు మీకు సహకరించడం లేదు. మీ శరీరమే మీ స్వామిత్వాన్ని, అంగీకరించనప్పుడు కుక్కల్ని ఎందుకు ఆడిపోసుకొంటారు ?”

“ స్వామీజీ ! మీ లాగ అంత మందీ జితేంద్రియులు కాలేరు కదా ?”

“ అవును బాబూ ! అంతమందీ జితేంద్రియులు కాలేరు. నిజానికి వాటిని జయించే ప్రసక్తే రాకూడదు ! దేనినైనా లొంగ దీసుకొడానికి, దానిని జయించాలనే ఆలోచనే తప్పు. ఎంతలా వాటిని జయించాలనుకొంటే, అవి అంతలా తిరగబడతాయి ! వాటిని ప్రేమించాలి, లాలించాలి, చెప్పాల్సిన తీరులో చెప్తే, అవి మనకి దాసోహం చేస్తాయి.”

“ నా శరీరాన్ని నేను ప్రేమించడం లేదంటారా ?” సినిమా హీరోళాంటి తన దేహ ఘటన వైపు సంతృప్తిగా చూసుఒంటూ అడిగారు మంత్రిగారు.

“ లేదు, తిండి పడేసి కండలు పెంఛడం, శరీరాన్ని ప్రేమించడం కానే కాదు.! ఉదాహరణకి మీ అరికాలునే తీసుకోండి. దాన్ని రోజుకో సారి, లేదా వారానికో సారి, పోనీ నెలకో సారైనా తలచుకొంటున్నారా ?”

మంత్రిగారు ఆలోచనలో పడ్డారు. ‘నిజమే ! అరికాలుని తనెప్పుడు తలచుకొన్నాడు ! ఏభయి రెండేళ్ల జీవితంలో ఏ మూడు నాలుగు సార్లో ! అది కూడా ఏ గాజు పెంకో గ్రుచ్చుకొన్న నాడు ---- ”

అతని ఆలోచనల్ని పసిగట్టేసి నట్లున్నాడు స్వామి. “ చూసారా, బాబూ ! నొప్పి కలిగినప్పుడే మీరు వాటిని స్మరించారు. దాన్ని కాసేపు నిమిరి, లాలించారు. తక్కిన జీవితమంతా దాని మీద నడిచారు. అలాంటివే మీ శరీరంలో ౨౬ కేంద్రాలు ఉన్నాయి బాబూ ! మీరు వాటికి తిండి పడేసి, వాటి చేత మీ అవసరాల మేరకి పని చేయించు కొంటున్నారు. అవి కూడ వాటి పరిథుల్లో కుక్కల్లాగే విశ్వాసంగా మీ పని చేస్తున్నాయి. కాని ఏనాడు మీరు వాటిని ప్రేమించారు ? ప్రేమా లాలనా లేనిదే ఇలాంటి సందర్భాలలో అవి మీకు ఎందుకు సహకరిస్తాయి.? మీ హక్కు కోసం వాటి స్వేఛ్ఛని అరికట్టే అధికారం, ఏ సివిక్సు మీ కిచ్చింది ?”

మంత్రిగారు తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరో నాయకుల మాటలు విన్నారు. ఇంకెందరో డాక్టర్ల సజెషన్లు తీసుకొన్నారు. ‘ ఈ రోజు ఈ బైరాగి దేశం దాకా ఎందుకు, నీ దేహం సంగతే తనకి తెలియదంటున్నాడు !నీ హుకుం నీ శరీరం పైనే పని చేయడం లేదంటున్నాడు ! ఇతన్ని ఇంకా ఇలా మాట్లాడనిస్తే పూర్తి బ్రైన్ వాష్ చేసేలా ఉన్నాడు. లాభం లేదు, ఈ వాక్ప్రవాహానికి , డామిట్ !’ “ స్వామీజీ , ఇప్పుడేం చేయమంటారు ?” అంటూ డేమ్ కట్టేసారు
.
“ మీ శరీరంలోని 26 కేంద్రాలలోనూ మీ మనసుని ప్రవేశింప జేసి, పది, పదిహేను సెకెండ్ల సేపు వాటిని లాలించండి. కుక్కల ఉనికిని గాని, వాటి అరుపుల్ని గాని మరచిపోయే ప్రయత్నం చేయవద్దు. అన్నింటికన్న మంచి పధ్ధతి ఏమిటంటే, ఆ కుక్కల్నే మీ శరీర కేంద్రాలుగా భావించండి. ఒక్కొక్క కుక్కనీ ఒక్కొక్క అంగం దగ్గర నిలబెట్టి, వాటి ఆక్రోశాన్ని విని, ఈ రోజు నుంఛి వాటి సంగతి పట్టించుకొంటానని, వాగ్దానం చేసి, శాంతించమనీ, నిద్రించమనీ, అర్థించండి. అప్పుడే మీరు తృప్తిగా నిద్ర పోగలుగుతారు.”

“ స్వామీజీ ! నా అఙ్ఞానాన్ని మన్నించి ఆ కేంద్రాలేవో తెలియజెయ్యండి. ” మంత్రిగారీ సారి తమ అఙ్ఞానాన్ని చిత్తశుధ్ధితో ఒప్పుకొన్నారు

“ తప్పకుండా చెప్తాను, శ్రధ్ధతో వినండి---
1. అరికాళ్లు 2 కుక్కలు
2. మోకాళ్లు 2 కుక్కలు
3. తొడలు 2 కుక్కలు
4. గుప్తేంద్రియం 1 కుక్క.
5. నాభి 1 కుక్క.
6. హృదయం 1 కుక్క.
7. ఊపిరితిత్తులు 2 కుక్కలు.
8. భుజస్కంధాలు 2 కుక్కలు.
9. కుడి అరచేయి, మోచేయి, భుజం 3 కుక్కలు
10. ఎడమ అరచేయి, మోచేయి, భుజం 3 కుక్కలు.
11. కళ్లు 2 కుక్కలు
12. చెవులు 2 కుక్కలు
13. ముఖం 1 కుక్క.
14. ముక్కు 1 కుక్క.
15. భృకుటి 1 కుక్క.

మొత్తం 26 కేంద్రాలు, 26 కుక్కలు.

పై కుక్కల్ని వరుస క్రమంలో తలచుకొని, లాలించి, ఇరవై ఆరవ కుక్కదాకా వచ్చాక, తిరిగి విలోమ క్రమంలో మొదటి కుక్క వరకు, పది పదిహేను సెకెండ్ల సేపు తలచుకొని లాలించండి.”’

మంత్రిగారికి మరి మాటల్తో పొద్దు పుచ్చాలని అనిపించలేదు. “ వస్తాను స్వామీజీ ! ” అంటూ బంగళా వైపు నడిచారు. వెళ్తూ, వెళ్తూ ఆగి, ఆ కుక్కల వంక చూసారు. ఈ సారి ఆ చూపులో ఏముందో ! కుక్కలు ఏం పసికట్టాయో కాని, క్షణం విరామాన్ని ఇచ్చాయి.

మంత్రారు వాటిని లెక్కపెట్టారు.

ఆశ్చర్యం !

సరిగ్గా 26 ఉన్నాయి అవి !!

**************

తెల్లగా తెల్లవారిపోయింది.

మంత్రిగారు ఆవలిస్తూ నిద్ర లేచారు. బధ్ధకంగా తన వైపు చూసుకొన్నారు. ఇదేమిటిది ? తనెలా నిద్ర పోయాడు !! కుక్కలు ఏమయ్యాయి ?? తను నిద్ర పోవడమే కాదు, ఆ నిద్రలో ఒక స్వప్నాన్ని కూడా చూసాడు.

ఆ స్వప్నాన్ని తలచుకోగానే అతని ఒళ్లు జలదరించింది. ఎంత చిత్రమైన కల అది ! దాని ఫలితమేమిటో ఆ బైరాగినే అడిగి తెలుసుకోవాలి.

మంత్రిగారు వెంటనే లేచి, ఔట్ హౌస్ చేరుకొన్నారు.

స్వామి సిధ్ధాసనంలో కూర్చొని, ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. అయినా మంత్రి పిలుపుకి కళ్లు తెరచి, చిరునవ్వుతో , “ నిద్ర పట్టిందా బాబూ ?” అని అడిగాడు.

“ మీ దయ వల్ల నిద్రపోయాను స్వామీజీ ! ఒక కల కూడా కన్నాను, చాల చిత్రమైన కల అది ---- ”

“ ఏమిటి బాబూ ఆ కల ?”

“ కలలో నాకొక వ్యక్తి కనిపించాడు. అతని కళ్లు ముందుకి లేవు, వెనుకకీ లేవు, తిరగలిలా తిరుగుతున్నాయి. అతని మెదడు మోకాళ్ల మీద ఉంది. పొట్ట బానలా ఉంది. చేతులకి వ్రేళ్లకి బదులు నాలికలున్నాయి. కళ్లు ఉండాల్సిన చోట చెవులు ఉన్నాయి, చెవులు ఉండాల్సిన చోట కళ్లు ఉన్నాయి. గుప్తేంద్రియం ఎక్కడుందో కనిపించనే లేదు. స్వామీజీ ఆ వ్యక్తి ఎవరు, ఎందుకలా ఉన్నాడు ?”

స్వామీజీ కాసేపు మంత్రిగారి వంక చూస్తూ ఉండిపోయారు. తరువాత గంభీరంగా బదులిచ్చాడు.

“ ఆ వ్యక్తి ఎవరో, ఎందుకలా ఉన్నాడో తెలుసుకొనే ముందు, అతని స్వభావం తెలుసుకో బాబూ ! మీ కల లోని మనిషి ఎటు కావాలంటే అటే నడవ గలడు.. కాని అతని అడుగు ఎప్పుడూ ముందుకి పడదు ! దిశలు మార్చుకొంటూ తన దారి తాను చూసుకొంటుంది. అతని మెదడు ముంగాళ్ల స్థాయిలోనే ఉంది. చేతులకున్న నాలికలు అందిన ప్రతీ దాన్నీ జుర్రుకోవడాన్నే సూచిస్తున్నాయి. కడుపు సంగతి సరే సరి ! ఎన్నిటికైనా జీర్ణం చేసుకొంటోంది. అతను చూడాల్సిన చోట వింటున్నాడు. వినాల్సిన చోట చూస్తున్నాడు. పోతే గుప్తేంద్రియం కనిపించనే లెదన్నావు కదూ ! లేక పోవడమేం బాబూ, మెదడు లోనే ఉందది. మెదడంతా ఆక్రమించి దాన్ని పూర్తిగా వాసనా కేంద్రంగా మార్చింది ! తెలిసిందా ఇదీ ఆ మనిషి తత్వం !---- ”

మంత్రిగారు ఆలోచనలో పడడం చూసి, స్వామి తన ప్రసంగాన్ని ఇంకా కొనసాగించాడు.

“ చీకటి గదిలోకి, దీపం తీసుకు వెళ్తేనే దాని స్వరూపం తెలుస్తుంది. ఆ గదిలో ఉన్న ఫర్నిచర్ కంట పడుతుంది. నిన్న రాత్రి నిద్రలో మీ వివేక దీపం వెలిగించుకొని తొలిసారి మీరు మీ శరీరం లోకి ప్రవేశించారు. --- ”

“ స్వామీజీ ! ” దాదాపు అరిచినంత పని చేసారు మంత్రిగారు. “ మీరనే దేమిటి స్వామీజీ ! నేను చూసింది నన్నేనా !! అంటే – నా ఆత్మనా !!! నాకు కలలో జరిగింది ఆత్మ సాక్షాత్కారమా !!!!!!!! ”

స్వామి బదులివ్వ లేదు. కళ్లు మూసుకొని ధ్యానంలో పడ్డాడు !

( యువ జూన్ ౧౯౮౪ )

*****************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద