Skip to main content

యుగధర్మం 1

‘కొక్కొరొకో’ ఉషస్సు రాకకు స్వాగతం చెప్పింది కుక్కుట ధ్వని.

ఇష్ట దేవతా స్మరణ చేసుకొంటూ పక్క దిగాడు జగన్నాధం. అతడు నా అన్నవారెవ్వరూ లేని ఒంటరి . ఏ ఊరి వాడో, ఎక్కడి నుండి వచ్చాడో గాని, దాదాపు ఏడేళ్లు కావస్తూంది, అతడా ‘వీరన్న పాలెం’ చేరుకొని. అంతకాలం ఆ ఊరిలో స్థిరంగా అతనికే ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనస్సును ప్రశ్నిస్తూ ఉంటాడు కూడా, ‘ నువ్వీ ఊరిలో ఇంతకాలం ఉండడానికి కారణమేమిటి ?’ అని. ఒకటి ఊరిలోని ప్రశాంతత, రెండు ‘గుండాల చెరువు’,మూడవది---- మూడవది --- అతని హృదయం చెప్పడానికి సంశయిస్తుంది.

గుండాల చెరువు ఆ ఊరి ఉత్తర సరిహద్దు. పంటల వేళే గాని, మామూలు దినాలలో దాని వైపు ఎవరూ తేరి చూడరు, కాని జగన్నాధానికి, అది ప్రాతః స్నానానికి కలిగించిన సౌకర్యం మరే ఊరిలోని సరస్సూ కలిగించ లేదంటే అతిశయోక్తి లేదు !

ఇదంతా విని జగన్నాధం మూడు కాళ్ల ముదుసలి అని మీరు అనుకొంటే మీదే తప్పు. అతడు పదహారణాల పడుచు వాడు. అయినా వివాహమంటే విముఖత చూపించేవాడు. ‘ గత జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్నాడో, అలాంటి నిర్ణయం తీసుకోడానికి’, అనుకొంటారు ఆ గ్రామ ప్రజలంతా !

తను ఆ ఊరిలో స్థిరత్వం పొందడానికి రెండవ కారణమైన ‘గుండాల చెరువుకు’ , చెంబు చేత పుచ్చుకొని బయలు దేరాడు జగన్నాధం. తీరాన నిలబడి చుట్టూ కలయ జూసి, ‘ ఈ ప్రశాంతతే నన్నీ ఊరికి కట్టి పడేసింది’ అనుకొన్నాడు. అతని మనస్సా నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. ‘ కాదు, అదొక్కటే కాదు, మరొక బలవత్తరమైన కారణం ఉన్నది’ అంటూ ! జగన్నాధం దానిని గట్టిగా కసిరి చెరువులోకి దిగాడు.

ఆ సరస్సు మధ్యలో చాల సేపటి నుంచి తేలుతున్న ఒక మృత కళేబరం అప్పటికి గాని, అతని దృష్టిని ఆకర్షించ లేదు. అతడు దానిని చూసి భయంతో కొయ్యబారి పోయాడు.

‘ గ్రామస్థుల ఉపేక్షకు, తన అపేక్షకు కారణమయిన ఈ సరస్సు, ఆ వ్యధిత మానవుణ్ని పొట్టిన బెట్టుకొని, కప్పను మింగిన పాములా ఎంత నిశ్చలంగా ఉంది !’ అని ఆశ్చర్యపోతూ దగ్గరలోని, ‘వీరాయి’ ఇంటికి బయల్దేరాడు ఆ వార్త చెప్పడానికి.

‘ వీరాయి గుండెలు తీసిన బంటు. ఈ అనాథ ప్రేత సంస్కారానికి అతనే తగినవాడు ’ అనుకొన్నాడు. విషయం విన్న వీరాయి విస్మయంతో, గూడెంలోని బలగంతో, గుండాల చెరువు చేరుకొన్నాడు.

అందరూ కలసి, ఆ కళేబరాన్ని తీరానికి చేర్చి కెవ్వుమన్నారు. వీరాయి పరిశీలనగా దాని వంక చూసి, “ బాబూ ! ఇతడు మీరు అనుకొన్నట్లు, వ్యధిత హృదయుడూ, అనాధుడూ కాదు, సర్కారు వారిని గడగడ లాడించిన గంగన్న పాలెం కరణం, ఇంటి దోపిడీ కేసులో శిక్ష అనుభవించి, వారం రోజుల క్రితమే విడుదల అయిన గజదొంగ ! పేరేదో తెలియదు గాని, ఇతన్ని ఈ చుట్టుపట్ల ఎరగని వారు అరుదు. ఏదో ప్రమాదం వల్ల సంభవించిన మరణమే గాని, స్వచ్చంధ మరణం కాదు,” అన్నాడు.

మరికొన్ని క్షణాలలో పాలెం ప్రజలంతా గుండల చెరువు చుట్టుముట్టారు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే చెరువు ఆనాడు తీర్థ యాత్రా స్థలంలా కళకళలాడింది !

చెరువు గట్టునే కొలువు తీరి, ఎవరికి తోచిన విధంగా వారు, ఈ విషయంపై చర్చించుకొంటున్నారు. జగన్నాధం కూడా చర్చలో పాల్గొన్నాడు. అంతలో గోలు గోలున గుండెలు బాదుకొంటూ అక్కడికి వచ్చింది సీత.

జగన్నాధం విస్మయంతో ఆమె వంక చూసాడు. ‘ సీత ఆ ఊరిలోకల్లా నీతి నిజాయితీలతో బ్రతికే సర్వాయి భార్య ! ఈ గజదొంగ చనిపోతే ఆమె దుఃఖించడం దేనికి ?’ అనుకొన్నాడు.

ఆ విషయాన్నే అడిగాడు జగన్నాధం . దానితో అందరి దృష్టులూ సీత మీదకి ప్రసరించాయి.

సీత ఎక్కిళ్ల మధ్యనే చెప్పింది, “ ఆడు – ఆడు నిన్న సాయంత్రం నుండి కనబడడం లేదండి,” అని.

సీత భాషలో , ‘ఆడు’ అంటే ‘ సర్వాయి ’ అని అర్థం !

“ ఏదన్నా పనుండి రాలేదేమో !” జగన్నాధం సముదాయించాడు.

“ లేదు బాబూ ! ఆడికీ నాకూ పనేంటి ?”

“ మీరిద్దరూ ఏమైనా జగడమాడుకొన్నారా ?”

“ లేదు బాబూ ! మొన్న సాయంత్రం పనుండి సందూకు పెట్టి తెరిస్తే, అందులో మూడు వందల రూపాయిలు కనబడ్డాయి.ఆడికింత డబ్బు ఎక్కడిదని ఆశ్చర్యపోయి, వస్తే అడగొచ్చులే అని, ఏభై రూపాయలు తీసి ఏరేగా దాచినాను. నిన్న పొద్దుట పెట్టె తీసి, డబ్బు లెక్క పెట్టుకొని, గుండె బాదుకొంటూ, “ ఇందులో ఏభై రూపాయలు నువ్వుగాని తీసావా ?” అని ఆడిగాడు. నేను తమాషాకి, “ లేదు, అందులో డబ్బున్న సంగతే నాకు తెలియదే ?”

అన్నాను. అంతే బాబూ ! రోజల్లా దిగాలుగా తల పట్టుకొని కూర్చొన్నాడు. అన్నం నీరు ముట్టలా ! ఆడి అవస్థ చూసి, నిజం చెప్పేద్దామనుకొన్నాను గాని, రాత్రి చెప్పొచ్చులే, అని ఊరుకొన్నాను. కాని సాయంత్రానికే మిగిలిన డబ్బు జేబులో వేసుకొని ఉడాయించాడు. ఇంత దాకా పత్తాయే లేదు.”

అందరూ ఆలోచనలో పడ్డారు. రోజుకి ముప్పావలా కూలీకి గతిలేని సర్వాయికి మూడు వందలు ఎలా వచ్చాయన్నదే అందరి హృదయాలలోనూ సమస్యగా ఘనీభవించింది.

అంత వరకు మౌనంగా కథంతా విన్న భూషయ్య, “ ఇకనేం ? తెలిసిపోయింది !”’ అంటూ కేక వేసాడు. జగన్నాధం ,భూషయ్యవైపు ప్రశ్నార్థకంగా చూసాడు.

“ పాపాయి కూడా నిన్నటి నుండి కనిపించడం లేదు. చూస్తూంటే వీళ్లిద్దరూ కలిసే పోయినట్లుంది !” అన్నాడు భూషయ్య.

పాపాయి ఆ ఊరిలో అందరికీ పరిచయమైన వ్యక్తే ! చిన్న పాపాయిలా అమాయకత్వం చిందే కళ్లతో, అందంగా, చలాకీగా ఉండే కన్నెపిల్ల ఎవరి మనస్సుని ఆకర్షించదు గనుక ?’
ఆ మాటలు విన్న సీత రోదన మితిమించి పోయింది.

“ ఛ ! వాడింత దుర్మార్గుడని అనుకోలేదు. ఏం చేస్తాం ? అంతా యుగధర్మం ! ఊరుకో సీతా ! నిన్నంత నిర్దాక్షిణ్యంతో వదిలి, దానితో లేచిపోయిన వాడి కోసం, ఎందుకు విచారిస్తావ్ ? వాడు లేకపోతే నీ భుక్తికి లోటు ఉన్నప్పుడు కదా, నీకు భాధ ! అయినా పాపాయికి ఇదేం పిదప కాలమో ! నిన్న మొన్నటి వరకు కంటి ముందు పాపాయిలా తిరిగింది.! వాడు అందుకోసమే డబ్బు జత చేసుకొని ఉంటాడు.,” అన్నాడు జగన్నాధం, తప్పంతా ‘యుగధర్మం’ క్రింద కట్టేస్తూ.

జగన్నాధం అనునయించే కొద్దీ, సీత రోదన శృతి మించింది. ఆ దుఃఖం హృదయ పూర్వకమేనా అని సందేహించాడు పంతులు. అతడే ఆ ఊరిలో కల్లా కాస్త విద్యాగంధం కలవాడు. అంతేకాదు, గజదొంగ చావుకీ, సర్వాయి పరారీకి, ఏదో సంబంధం ఉన్నదని అనుమానించి, తన మనస్సులోనే ఒక ఊహారూపాన్ని ఏర్పరుచుకొని, దానిని పల్లీయుల ముందు పెట్టాడు.”

అదేమిటంటే --

“ వారం రోజుల క్రిందటనే విడుదయిలయిన దొంగా, సర్వాయి కలిసి, ఒక దొంగతనం చేసారు. దాని ఫలితమే మూడు వందల రూపాయిలు ! ఏ కారణం చేతనో దొంగ సర్వాయి దగ్గిరనే డబ్బు ఉంచమని, తనకి అవసరమైనప్పుడే ఇవ్వమని చెప్పి ఉంటాడు. కాని సర్వాయి దురాశతో ధనాన్ని అంతటినీ కాజెయ్యాలని, పథకం వేసుకొన్నాడు ! సీత తీయగా మిగిలిన డబ్బుతో మరొక ఊరికి పారిపోయాడు. దారిలో గుండాల చెరువు దగ్గిర దొంగ, నిలదీయడంతో ఇద్దరికీ పోరాటం జరిగి ఉంటుంది ! పోరాటంలో చనిపోయిన దొంగను చెరువులో పారేసి, తన దారిని నిష్కంటకం చేసుకొని ఉంటాడు సర్వాయి.”

“ అయితే పంతులూ ! నువ్వు చెప్పింది కూడా సబబుగానే ఉంది గానీ, సర్వాయి, రూపాయలతోనే కాక, పాపాయితో కూడా ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ?” అన్న జగన్నాధం ప్రశ్నకు , తెల్ల ముఖం వెయ్యడమే పంతులు వంతు అయింది. !


********************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ