Skip to main content

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )

    స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.

    రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !

    రుద్రాభిషేకం జరుగుతోంది.!

    అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !

    ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !

    ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.

    పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల్లు చేసాక, అతని తండ్రి కాలధర్మం చెందారు. తక్కిన ముగ్గురు తమ్ముళ్ల  పెళ్ళిల్లు తన చేతులతోనే చేయించాడు, పినాక పాణి. అందుకే అతనన్నా, అతని భార్య ‘ మీనాక్షి’ అన్నా ఆ కుటుంబ సభ్యులందరికీ ఎంతో గౌరవం. ఆ దంపతులకి ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. వారిలో చిన్న అమ్మాయి ,‘శ్రీలత’ పెళ్లి చేసాక, అల్లునితో పాటు మొట్టమొదటి సారిగా, ఆ క్షేత్రానికి వచ్చారు వాళ్లు.

    నిజానికి ఆ కుటుంబ సభ్యులు అందరూ వస్తే, ఆ ‘మినీబస్సు’ కూడ చాలదు వాళ్లకి ! వారిలో కొందరు రక రకాల కారణాల వల్ల రాలేక పోయినందు వల్ల, ఆ బస్సు వాళ్లని  క్రిక్కిరిసి పోకుండా కూర్చొని ప్రయాణం చేయగలిగేలా అమిరింది !

    మృగశిరా నక్షత్ర యుత జ్యేష్ట అమావాస్యకి, ఆ కుటుంబానికీ పెద్ద సంబంధం ఉంది. ఆ రోజు  దాటాక ,‘ఆరుద్ర కార్తె’ మొదలు అవుతుంది. ఆ ఆర్ద్రా ప్రవేశం నాడే, ఆ కుటుంబంలో మూడు తరాలకి ముందు జన్మించిన , ఋషి తుల్యుడైన ఒక పూర్వ పురుషుని, ‘శివైక్యం’ జరిగింది !

    అందుకే ఆ రోజు,‘ శ్రీరామ లింగేశ్వర స్వామి వారికి, అభిషేకం తప్పని సరిగా చేయించి , ఆ తరువాతనే కేవలం, ‘అరటి పళ్ల’ ఫలహారం చేస్తారు వారందరూ ! బస్సులో రెండు గెలలు అరటి పళ్లు, రెండు కేన్ల కమ్మని పాలు ఉన్నాయి.

    కొత్త అల్లుడు,‘సూర్య చరణ్’ని భోజనం చేయడానికి అనుమతించినా, అతను ఎంతో ఉత్సాహంతో ,‘ ససేమిరా’ అని వాళ్లతో పాటు ఉపవాసం ఉన్నాడు. శ్రీలత అతనికి ఒక అరటి పళ్ల ,‘అస్తం’ అందించి “ ముందుగా మీరు ఈ అరటి పళ్లు తిని, పాలు త్రాగండి” అంది.

       “మరి తక్కిన  వాళ్లో ?”

    “శాంతక్క అందరికీ ఇస్తుంది లెండి, మీరు మొదలు పెట్టండి.”

    “ అదేమిటి లతా ! చిన్న పిల్లలు సైతం ఉపవాసం ఉన్నారు కదా?”

    “ ఆ పిల్లల ఉపవాసాల  సంగతి మీకు తెలియదు లెండి, వాళ్లేమీ గడి ఆకలితో లేరు !” అంది  శ్రీలత  నవ్వుతూ.

    “ పిన్నీ ! అన్యాయంగా మాట్లాడకు, నేను నాలుగు ‘ రవలడ్డూలు ’మాత్రమే తిన్నాను, అంతే !” అన్నాడు శ్రీకర్ . వాడు శ్రీలత అక్క శాంతిసేన కొడుకు, నాలుగేళ్లవాడు. శ్రీకర్ మాటలు విని అందరూ గొల్లున నవ్వారు.

     అరటి పళ్ల అస్తాలు, హస్తాలు మారాయి. సూర్యచరణ్ ఒక పండు ఒలిచి తింటూ,“ ఇంతకీ ఇదేం అరటి పండు ?” అని అడిగాడు.

    ``అంటే ?”అడిగింది శ్రీలత.

    “ అంటే ఏ జాతి అరటి పండు? ”అని.

    “అమృత పాణి,” జవాబిచ్చింది శాంతిసేన.,“ మరిది గారూ ! పట్నంలో పెరిగి చదువుకొన్నారు కదా, మీకు అరటి పళ్లల్లో రకాలు కూడా తెలుసా ?” అని అడిగింది.

    “ మీ అందరికీ తెలిసిన దాని కన్నా నాకు మరొక్కటి ఎక్కువే తెలుసు,” అని కొంటెగా జవాబిచ్చాడు అతను.

    అంతే ! అందరిలో ఉత్సుకత పెరిగింది.

    “అయితే అల్లడిగారికి ఎంత తెలుసో పరీక్ష చేద్దామా ?” అన్నాడు పినాక పాణి. అతనికి, ‘పాలకొల్లు’ మండలం లోని ‘ అరటి పాడులో’ అరటి తోట ఉంది. ఎనభై చెట్ల బతాయి ఫల సాయం కూడా ఉంది ! చెల్లెళ్ల వివాహాలు అయి పోయాక తమ్ముళ్లతో, పిత్రార్జితాన్ని పంచుకొని, అరటి, బతాయి తోటలతో పాటు, విశాలమైన పెంకుటిల్లుని కూడా , అరమరికలు లేకుండా తన స్వాధీనంలో ఉంచుకొన్నాడతను ! తక్కిన వారందరూ ఆస్తిని సొమ్ము చేసుకొని తృప్తి పడ్డారు. అందువల్ల  పినాక పాణి  పెంకుటిల్లే అందరికీ  ప్రధానమైన నివాస  గృహం.‘ పండుగలకీ, పబ్బాలకీ అందరూ అక్కడికే  చేరుతారు. కొత్త అల్లుడు సూర్యచరణ్, ఐ..టి.లో పెద్ద చదువులు చదివి, హైదరాబాదు లోని ఒక పెద్ద సంస్థలో,‘ ‘కన్సల్టెంటుగా ’ పని చేస్తున్నాడు. ఆ అబ్బాయి, తమకన్నా ఒకటి ఎక్కువే తెలుసునని అనడం , ‘అదీ అరటి పళ్ల విషయంలో’ అతనికి ఆశ్చర్యం కలిగించింది !

    పినాక పాణి మాటలకి అందరూ ఉలిక్కిపడి అతని వంక చూసారు.

    “ అందరూ తలో రెండు అరటి పళ్ల రకాల పేర్లు చెప్పండి” ఆఙ్ఞ జారీ చేసాడు పినాక పాణి.

    “ అయితే సరే, నేను మొదలు పెడతాను,” అన్నాడు సారంగ పాని. అతను పినాక పాణికి పెద్ద తమ్ముడు. “ వినండి, అరటిలో మొదటి రెండు రకాలు, ‘పచ్చ బొంత’,‘ బూడిద బొంత ” అన్నాడు.

    ప్రస్తావన తలలు మారింది.

    “ పచ్చ బొంత బత్తిసా, బూడిద బొంత బత్తీసా !”
    “ నూకల బొంత, సపోటా బొంత !”
    “ నేంద్రం, సిరుమల అరటి !”
    “ వామన కేళి, చక్కెర కేళి !”

    అంతే ! అక్కడితో ఆగిపోయింది ! అల్లుడు గారి కోసం ఇంకేమైనా మిగిల్చామేమో అన్న అనుమానంతో , వాళ్లు చెప్పిన వన్నీ లెక్క వేసుకొని , చివరగా “ కర్పూర బొంత !” అన్నాడు పినాక పాణి.

    అయిపోయింది అన్నట్లు తృప్తిగా తల పంకించి, అందరూ ‘ సూర్య చరణ్’ వైపు చూసారు, ‘ ఏదీ తమరు చెప్పండి’ అన్నట్లు!

    సూర్య చరణ్ వాళ్ల చూపులకి ఖంగు తినలేదు, చిరనవ్వుతో అందరి వంకా చూసాడు.

    “ మామయ్య గారూ ! నేను అనుకొన్నట్లే అయింది. మీలో ఎవరికీ  అయిదు వందల ఏళ్ల క్రిందట లుప్తమయిన జాతి అరటి పండు గురించి తెలియనే  తెలియదు ! నిజానికి ఆ జాతినే ‘కదళీ ఫలం’ అని పిలిచేవారు ! ఇప్పుడు మీరు చెప్పినవన్నీ  కేవలం అరటిపళ్ళు మాత్రమే ! వీటికి ‘ కదళీ ఫలాలని’ పిలిపించుకొనే అర్హత లేదు ! ఆ కదళీ ఫలం , దాని పుట్టు పూర్వోత్తరాలు, వాటి సేద్యం చేసే విధానాలు, వాటి మహిమలు, అవి లుప్తమయి పోయిన కారణాలు, వీటి గురించి ఎంతో పరిశోధన చేసి, ఎన్నెన్నో వివరాలు సేకరించాను నేను .”

    సూర్యచరణ్ ఆ మాటలు చెప్పిన విధానం విన్న పినాక పాణి గారు అతని వంక గౌరవంతో చూసారు. “ అల్లుడు గారూ ! చాల సంతోషం, అరటి పళ్ల రైతుకే , వాటి గురించి చెప్పగల సాహసం, సామర్థ్యం  మీకు ఉన్నాయని మాకు అర్థమయింది ! ఎలాగూ ఇల్లు చేరడానికి రెండు గంటల సమయం పడుతుంది. మాకు మార్గాయాసం తెలియకుండా ఆ వివరాలు ఏమిటో చెప్తారా ?” అని అడిగాడు.

    “ తప్పకుండా చెప్తాను. అందరికీ ఉత్సాహంగా ఉండే విధంగా చెప్పాలంటే దాన్ని కథలాగ చెప్పాలి. ఆ కథ మొదలుపెట్టాలంటే  అందరూ వాటిని ఆరగించి, వాటి గురించి మీకు తెలిసిన పాటలు కొన్ని పాడాలి, అప్పుడే చెప్తాను.”

    సూర్యచరణ్  ప్రతిపాదన, కరక్కాయ గొంతులో పడ్డట్లు అయింది. పెద్ద తలకాయలకి ! పిల్లల్లో మాత్రం ఉత్సాహం చెలరేగింది !

    “ ఓ నాకు అరటి పండు పాట వచ్చు !” అంటూ అందుకొన్నాడు శ్రీకర్. “ అరటి చెట్టు చూడరా ! అందమైన చెట్టురా !ఆకులన్నీ పచ్చన, అరటి పండు తియ్యన !” అని పాడాడు.

    అందరూ చప్పట్లు కొట్టారు.

    సారంగ పాణి పన్నెండేళ్ల కూతురు ,‘ శివాని’ అందుకొంది.

    “ నా పేరు అరటి పండు, నా రంగులు మూడే మూడు !
    పసుపు, ఎరుపు, పచ్చ !  నే గుత్తితో పాటు వచ్చా !
    అమ్మ కొకటి, నాన్నకొకటి, నీ కొకటి, చేతులు చాపితే ఇస్తా ”

    శివాని పాటతో నవ్వుల జల్లు కురిసింది !

    ఆ పాటలు ఇచ్చిన ప్రేరణతో , శాంతి సేన, శ్రీలత, వారి మేనత్తలు , మరో పాట అందుకొన్నారు, కలసి కట్టుగా ---

    “ ఆదివారము నాడు, అరటి మొలచినది.
    సోమవారము నాడు, సుడివేసి పెరిగినది.
    మంగళ వారము నాడు, మారాకు వేసినది.
    బుధవారము నాడు ,పొట్టి గెల వేసినది.
    గురువారము నాడు గుబురులో దాగినది.
    శుక్రవారము నాడు, చకచకా గెల కోసి,
    అందరికి పంచితిమి, అరటి అత్తములు
    అబ్బాయి, అమ్మాయి , అరటి పండ్లివిగో !”

    పాటతో పాటుగా అందరి ఆరగింపు ముగిసింది, వారందరూ సూర్యచరణ్ వైపు, కథ చెప్పమన్నట్లు చూసారు.

    సూర్యచరణ్ చెప్పసాగాడు.

    “ అయిదు వందల ఏళ్ల క్రిందట లుప్తమయి పోయిన, అరటి జాతి పేరు, ‘కస్తూరి కదళి’. మూరెడు పొడవు, నాలుగు అంగుళాల మందం, ఏడు రంగులు కలసిన తొక్కతో చూపరులను ఇట్టే ఆకట్టుకొనే అరటిపండు అది ! దీని వివరాలు కొన్ని శాసనాల లోను, కొన్ని దేవాలయ శిల్పాల లోను,కనిపించింది ! ఈ కస్తూరి కదళి చాల మహిమా న్వితమైనదట!  దీన్ని మహిళలు, ‘బహిష్టు’ తీరాక క్రమ పద్ధతిలో ఆరగిస్తే, ‘గర్భధారణ’ జరిగి, చక్కటి మగ శిశువుని ప్రసవించేవారట !”

    “ మరి మగవాళ్లు తింటేనో ?” అడిగింది శ్రీలత.

    “ అల్లుడు గారూ ! ఏడు రంగుల అరటి పండు గురించి మొదటిసారిగా వింటున్నాను. దీని వివరాలు శాసనాల లోను, దేవాలయ శిల్పాల లోని ఉన్నాయని అంటున్నారు. మరి ఆ జాతి ఏమయింది ? ఎందుకు  నామ రూపాలు లేకుండా నాశనమయింది ? ” అడిగాడు పినాక పాణి.

    “ మామయ్యగారూ ! కస్తూరి కదళి ఆవిర్భావానికి, అంతరించి పోవడానికి కూడా ఆశ్చర్య పరిచే కారణాలు ఉన్నాయి. ఆ కదళీ ఫలాల మాట అటుంచండి, ఇప్పుడున్న పచ్చ, పసుపు, ఎరుపు రంగు అరటి పళ్లు కూడా ,మరో అయిదు వందల ఏళ్ల తరువాత , నామ రూపపాలు లేకుండా నాశనమవుతాయని శాస్త్రఙ్ఞుల అంచనా !అందుకే బి.టి . అరటి విత్తనాలుకని, వాటిని పండించమంటున్నారు..”

    “ నాన్నగారూ ! ఆ వివరాలన్నీ తరువాత అడగండి. ముందు ఆయన గారిని కథ చెప్పమనండి,;; అంది శ్రీలత. ఆమెకి తన భర్త తన వాళ్లనందరినీ శ్రోతలని చెసి, కథ చెప్పబూనడం గర్వంగా ఉంది !“ ఇంతకీ నా ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు, ఆ కస్తూరి కదళిని మగవాళ్లు తింటే ఏమవుతుంది ?” అని అడిగింది.

    “మగవాళ్లు దానిని క్రమం తప్పక తింటే, వారిలో ఇంద్రియ సామర్థ్యం పెరిగి, రతి కేళిలో , స్త్రీలని పరవశింప చేసే వారట !అంతే కాదు, చక్కని స్త్రీ శిశువుకి జన్మనిచ్చేవారట ! అందుకే అంతటి మహిమాన్వితమైన ఈ ఫలాన్ని చాల మితంగా వాడడానికి కారణం కూడా ఉండేది. అవి చాల అరుదుగా ఫలించేవి ! సామాన్యులకి అందుబాటులో ఉండేది కాదట ! ఒక గోవుని ఇచ్చి, ఒక గెల కొనేవారట, ఆ రోజులలోనే  ! ”

    సూర్యచరణ్ మాటలకి స్త్రీలు లజ్జాభరిత ముకిళిత వదనారవిందలు అయ్యారు. పురుషులు ముసి ముసి నవ్వులు నవ్వుకొన్నారు. తాము చూసిన దేవాలయ శిల్పాల లోని , దృశ్యాలని ఙ్ఞాపకం తెచ్చుకొన్నారు ! అది గమనించిన ,పినాక పాణి “ అల్లుడు గారూ ! మీరు చెప్పే ఫలం రూపు రేఖలు, మహిమలు తెలిసాయి. ఇక వర్ణనలు తగ్గించి ముందుగా అవి ఎలా ఆవిర్భవించాయో చెప్పండి.” అన్నాడు.

    సూర్యచరణ్ ,మళ్లీ మొదలుపెట్టాడు. “ పూర్వం ‘ ఔర్వుడనే ఋషి ఉండేవాడు. అతనికి ‘కస్తూరి కందళి’ అనే కుమార్తె ఉండేది ! ఆ ఋషికన్య కురూపి, కారు నలుపు దేహ కాంతి కలిగి, చూసేవారికి కంటగింపుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక ఆ రూపానికి తోడు , ఆమెకి ‘బుధ్ధి మాంద్యం’  కూడా తోడయింది....”

    “ బాల్యంలో ఆలనా పాలనా సరిగా లేకపోతే , పిల్లలు మందబుధ్ధులే అవుతారు. ” కథ మధ్యలో అడ్డు వచ్చింది, శ్రీలత పెద్దత్తయ్య. ఆమెకి పిల్లల పెంపకం పట్ల చాల విషయాలు తెలుసు, విశాఖ పట్నంలో ఆమె ఒక చిన్నపిల్లల క్రష్’ని నడుపుతోంది. ఆమెని మాట్లాడనిస్తే, ఇక తన అనుభవాలన్నీ చెప్తుందని భయపడింది శాంతిసేన.

    “ పెద్దత్తయ్యా ! ప్లీజ్ ! మరిది గారిని కథ చెప్పనీయందడి.”

    “అలాగే కోడలా ! నేను అతని గొంతెక్కి కూర్చున్నానా ? కందళికి బుధ్ధిమాంద్యం ఎందుకు వచ్చిందో, నా అనుభవం మీద  చెప్పానంతే ! కానియ్యి  బాబూ , మీరు కథ చెప్పండి.”

     “ కందళికి అంత ఖర్మ ఎందుకు పడుతుంది వదినా ! ఋషికన్య కదా, ఆమె తండ్రి ఏవేవో పూజలు, వ్రతాలు చేయించే ఉంటాడు. వ్రతాలు చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయి” అంది సారంగ పాణి భార్య. ఆమెకి  వ్రతాల పిచ్చి ! ‘కన్నె నోములు,ముత్తైదువ నోములు, గర్భిణీ నోములు, బాలింత నోములు, వయసుడిగిన ప్రౌఢల నోములు, చిట్ట చివరగా విధవలు చేసే నోములు ఎన్నెన్నో తెలుసు ! ఆమెని కదిలిస్తే  కోటి వ్రతాలు గలగల లాడుతాయి !

    “ కాంతం పిన్నీ ! కథ పూర్తిగా వినాలంటే , ఏ వ్రతం చెయ్యాలో చెప్తావా ?” అడిగింది శ్రీలత.
    “ మా ఆవిడని కాదు, నన్ను అడగవే చెప్తాను,” అన్నాడు సారంగ పాణి. అతను ‘ భార్యావ్రత బాధితుడు’.
    “ మీకు కూడ వ్రతాలు తెలుసా బాబాయ్ ?”
    “ సాంగత్య ఫలితమే చిట్టీ ! మనమందరం , అల్లుడు గారు చెప్పే కథని పూర్తిగా వినాలంటే..”
    “ ఊ ! వినాలంటే ఏ వ్రతం చెయ్యాలి ?” అడిగింది కాంతం. ఆమెకి తన భర్త చెప్పబోయే కొత్త వ్రతం పట్ల ఆసక్తి కలిగింది.
    “ మౌన వ్రతం పాటించాలి.”
    “ మీరు అదే వ్రతం పాటిస్తారా బాబాయ్ !” అడిగింది శాంతిసేన.
    “ నేను పాటించేది సహన వ్రతమే శాంతీ !”

    సారంగ పాణి మాటలకి బస్సులో నవ్వుల జల్లు కురిసింది.

    ఆ హాస్య వల్లరి సద్దు మణిగాక, సూర్యచరణ్ కథ మొదలు పెట్టాడు. “ ఇంటి దగ్గర గాని , ఆశ్రమంలో గాని, తననెవరూ చేరదీయడం గాని, మాట్లాడడం గాని ఎరగని ఆ కందళి, దూరంగా ఉన్న చిట్టడవికి వెళ్లేది. అక్కడ మొక్కల తోనూ , పువ్వులతోనూ, ఉడతలతోనూ, కబుర్లు చెప్పేది. అలా ప్రకృతిలో లీనమయి, ప్రకృతి కన్యలా తిరిగే కందళికి, ఒక రోజు ఒక చిలక , ఒక గాడిద కనిపించాయి. అంతేకాదు, చిలక మానవ భాషలో మాట్లాడి, ఆమె పేరు, వివరాలు
 తెలుసుకుంది. తరవాత ఆమె చుట్టూ తిరుగుతూ ఏవేవో మంత్రాలు చదివింది. అంతే ! కందళికి అప్సరో కాంతలని
 తలదన్నే సౌందర్యం స్వంతమయింది. చిలక మాత్రం నల్లగా, కాకిలాగ మారిపోయింది..”

    అంతే ! కథకి మరో అంతరాయం కలిగింది. ! బస్సు చక్రం గుంటలో పడి, దాని వెనుక టౌరు పంక్చరయింది, బస్సు నిల్చి పోయింది !
            ***********************

Comments

  1. అమ్మమ్మమ్మ ... గురువుగారూ అదరకొడుతున్నారు. చాలా చాలా బాగున్నాయి. ఇంతకాలం మీ బ్లాగు నాదృష్టికి ఎందుకురాలేదా అని అనిపించింది.

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం వేణుగోపాలం గారూ ! క్షీర గంగకు స్వాగతం. ఈ బ్లాగులో ఉత్తమ కాల్పనిక కథా సాహిత్యం ఉంది. వెతికి వెతికి చూడండి. శ్రీధర్.ఎ

      Delete

Post a Comment

Popular posts from this blog

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ