{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧ మార్చి ౧౯౬౨ లో ప్రచురించారు. ఆ కథలని ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.}
వసంతం ప్రవేశించింది. ప్రకృతి రాగ రంజితమయింది ! కోకిల మంగళ గీతాల్ని ఆలాపిస్తోంది.
పక్షులు ప్రకృతి లోని స్వాతంత్ర్య వాయువుని స్వేచ్ఛగా అనుభవిస్తున్నాయి. ఎర్రగా చిగిర్చిన చిగురు కొమ్మల పైన కూర్చొని మంతనాలాడుతున్నాయి. రాళ్ల గుట్టలపై జంటలు జంటలుగా చేరి కమ్మని సౌరభాన్ని పీలుస్తున్నాయి. నిర్మల వారి పూరిత తటాక శిఖరాల్ని రెక్కలతో ఎగజిమ్ముతూ వినోద క్రీడల తేలి ఆడుతున్నాయి. తియ్య మామిడి గున్నల ఆకు జొంపాల్లో సరస వినోద కేళిని ఆనందిస్తున్నాయి !
రంగు రంగు పువ్వులు చిగురు కోకల్ని కట్టి సమీర బాలునితో గుస గుసలాడుతున్నాయి.భ్రమర బాలకుల వినోద కేళికి విచ్చుకొంటున్నాయి ! తమ శరీర నిర్గత సౌరభాన్ని ప్రకృతికందిస్తూ విశ్వ వ్యాపినీ ప్రేమను వ్యక్తపరుస్తున్నాయి !
కొండ వాగుల్లోంచి మెలికలు తిరిగి , నడక విన్యాసాన్ని చూపిస్తున్న సెలయేటి కాంతలు తమ మంద భావాన్ని విదిలి, సజ్జనుని హృదయం వలె నిర్మలత్వాన్ని పొంది పయనిస్తున్నాయి ! నదీ సైకత స్థలాలు చంద్రికా ధవళిమను మించి పుణ్య స్త్రీల మనోభావం వలె ప్రకాశిస్తున్నాయి !
ప్రాతః సంధ్యారుణ కాంతి ప్రకృతి కాంత యొక్క చీర కుచ్చెళ్ల మణుల కాంతి , యనవితానమంతా వ్యాపించి శోభాయ మానంగా ప్రసరించింది !
“ పితా సుతస్య రసినో మత్స్వాన ఇంద్ర గోమతః !
అపిర్నో బోధి సద్యమాద్యో పృధే స్మాం అవంతుతేదియః !!”
పై మంత్రాన్ని – కులపతి మేద్యాతిథి కాణ్వ మహర్షి దర్శితమైనదాన్ని – బాల బాలికలు (విద్యార్థులు) ఎలుగెత్తి గానం చేసారు. ఆ గానం తరంగాయమానమై నభో మండలంలో సుళ్లు తిరుగుతూ వ్యాపించింది.
కులపతి మేద్యాతిథి సన్నిధానంలో విద్యార్థులు క్రమ క్రమంగా యథోచిత స్థానాల్ని అలంకరించారు.ప్రాతః కాల హవన క్రియకై వేదికలో అగ్ని జ్వలిస్తూంది !
కులపతి, “ మైత్రేయీ ! ఏదీ ‘అపాల’ ?” అని ప్రశ్నించాడు.
మైత్రేయి కాణ్వ ప్రియదర్శిని వైపు ముఖాన్ని త్రిప్పింది. ప్రియ దర్శిని ఆంగీరస ప్రియముఖిని చూసింది.
ప్రియముఖి : “ భగవాన్ ! పాల ఉషః కాలానికి ముందుగానే మాలతీ మంటపానికి వెళ్లింది.”
కులపతి : “ అక్కడ ఏం చేస్తోంది ?”
ప్రియముఖి చెప్పడానికి సంకోచించింది.
మైత్రేయి “ భగవాన్ ! అపాల ద్యానంలో ఉంటుంది. కొన్ని సమయాల్లో ‘ఇంద్రునికి’ సోమరసం అగ్నిలో హోమం చేస్తుంది.”
కులపతి “ సోమరసమా ! సోమలత లోంచి రసం తీయడం సులభం కాదు. అపాల అక్కడ రసం తీసే సాధనాల్ని
సేకరించుకుందా ?!”
ప్రియదర్శిని “ భగవన్ ! అపాల క్షంతవ్యురాలు.”
కులపతి “ కాణ్వాయనీ ! వివరంగా చెప్పు.”
ప్రియదర్శిని “ భగవన్ ! అపాల సోమలతని నోటిలో వేసుకొని నమిలి రసాన్ని అగ్నిలో ఉమ్మి హోమం చేయడం చూసాను.”
కులపతి మేద్యాతిథి మౌనంగా కొన్ని క్షణాలు కండ్లు మూసుకొని ధ్యాన ముద్రలో మునిగి పోయాడు !
అదే సమయంలో అపాల మెల్లగా లోపలికి వచ్చి, ప్రియదర్శిని ప్రక్కన నెమ్మదిగా కూర్చొంది.
అపాల పదహారేండ్ల కన్యక. యౌవన లక్ష్మి పరిపూర్ణంగా ఆమెను కటాక్షించింది. ఆమె శరీరం పసిడి తీగవలె మెరుస్తూంది. అంగాల్లో పూర్ణమై సౌష్టవం రూపొంది ఉంది. ఆమె ముఖం లోని కాంతి నిర్మల తేజోపూరితం ! ఆకర్ణాంతం విస్త్రుతి చెందిన ఆమె నయనాల దృక్కుల్లో శాంతి కిరణాలు చిమ్ముకుంటాయి ! ఆమె స్వాహా దేవివలె తేజోపూరిత ! ఊర్వశి వలె నయనోన్మాద రూపిణి !
మహర్షి కండ్లు విప్పాడు. ఎదురుగా అపాల కనిపించింది. చిరునవ్వు నవ్వాడు, ఇట్లన్నాడు “కుమారీ ! ఆత్రేయీ అపాలా !
భగవంతునికి అర్పించ తగిన హోమద్రవ్యాన్ని అపవిత్రం చేయకూడదమ్మా !”
అపాల కండ్లు చెమ్మగిల్లాయి. మేను వణికింది. కులపతికి అభివాదన చేసి గద్గద కంఠంతో ఇలాగంది. “ భగవాన్ ! నా అపరాధం క్షమించాలి. పురుహూతుడు సోమరస ప్రియుడు. అతనికి సోమరసం అర్పించనిదే నేను భుజించలేను ! ఈ విషయంలో అశక్తురాల్ని, భగవన్, అశక్తురాల్ని.—”
“ బిడ్డా ! వ్యధ చెందకు. నీకు సోమరసం పిండే సాధనాల్ని మైత్రేయి ఇస్తుంది.”
“ భగవన్ ! సాధనాల్తో తీసిన రసాన్ని నా యింద్రుడు గ్రహించకుండా ఉన్నాడు భగవన్ ! నన్ను క్షమించండి !”
మహర్షి తిరిగి కండ్లు మూసాడు. ఈ సారి అతని ద్యానం కొన్ని నిమిషాలు సాగింది. అప్పుడే బాలభానుని కిరణాలు ఆశ్రమోప్రాంతాల్ని వసంత రాగంలో ముంచెత్తుతున్నాయి..
మహర్షి కండ్లని విప్పాడు. అతని ఫాలభాగం వింత తేజస్సుతో ప్రకాశిస్తూంది. “ వత్సా ! అపాలా ! నీ జన్మ ధన్యమయింది.ఆశ్రమ వాసులందరూ అపాలను చూచి తమ ఆశ్చర్యాన్ని ప్రకటించారు.
మహర్షి అగ్ని ముఖాన్ని నెరవేర్చాడు. అంతేవాసులందరూ ఎలుగెత్తి మంత్ర పఠన కావించారు. అగ్ని ముఖానంతరం మహర్షి చెప్పాడు.
“ వత్సలారా ! ఈ దినం వసంతోత్సవం .మీరందరూ స్వేఛ్ఛగా ఉత్సవాన్ని జరిపించుకోవచ్చు.మీ వినోద కేళికి మా బోంటి వృధ్ధులు అంతరాయమే ! నేను నదీ ప్రాంతంలోని ఏకాంత గృహానికి వెళ్లిపోతున్నాను. మరొక శుభవార్త ! ఈ ఉత్సవాన్ని తిలకించడానికి కాశీరాజ పుత్రుడు ‘కుమార ప్రతర్దునుడు’ వస్తాడు. యువరాజుని మీరందరున్నూ గౌరవించి ఉత్సవంలో
ప్రవేశాన్ని కల్గించండి.”
*************
కణ్వాశ్రమంలో వసంతోత్సవ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. కాశీరాజ పుత్రుడు ప్రతర్దునుడు విచ్చేసాడు.
చైత్రరథం అలంకరింపబడింది. దాని చక్రాలు కేతకీ దళాలతో చుట్టారు. గుమ్మటమంతా రకరకాల పుష్పాల్తో అలంకరించారు. గుమ్మటం యొక్క శిఖరం పద్మాలతో సజ్జితం చేసారు. స్తంభాలు మల్లి, విరజాజి, మందార, వకుళ, జపాకుసుమ పుష్పాల మాలలతో చుట్టవేసారు. కొబ్బరాకులతో అల్లిన రెండు పెద్ద చిలకల్ని రథం ముందర నిల్పారు.
హంస వాహనం కూడ చాల శోభాయమానంగా అలంకరింపబడింది.
విద్యార్థులు సభ తీర్చారు.కుమార ప్రతర్దునుడు ఏకగ్రీవంగా కుమార ప్రతర్దనుణ్ని మన్మధునిగా ఎన్నుకొన్నారు.
విద్యార్థినులు సభ కూడింది. అక్కడ ‘ అపాల’ కానరాలేదు !
“ ఏదీ, ఆత్రేయీ అపాల ?” అని కేక వేసింది మేధాకుమారి.
“ మాలతీ మంటపంలో ఉండొచ్చు.” అని చెప్పింది శ్రధ్ధా కుమారి.
“మేధా! శ్రధ్ధా.! వెళ్లండి, అపాలని తీసుకొని రండి. ” అని తొందర పెట్టింది మైత్రేయి.
మేధా శ్రధ్ధలిద్దరూ మాలతీ మంటపానికి పరుగు తీసారు. మాలతీ మంటపం సూర్యకిరణాల్లో మెరిసిపోతోంది. మంటపం ఒక కొలను మధ్యన ఉంది. మంటపానికి వెళ్లడానికి ఒక దారు నిర్మిత మైన వెంతెన ఉంది. మంటపాన్ని దట్టంగా మాలతీలత పెనవేసుకొంది. పుష్పగుఛ్ఛాలు సూర్యరశ్ములతో మంతనాలు ఆడుతున్నాయి కొలనంతా కలువలు అర్థ నిమీలిత నేత్రాల్తో సమాధిలో ఉన్న యోగినీ గణంలాగు భాసిస్తున్నాయి
శ్రధ్ధా, మేధలు ఇద్దరూ మాలతీ మంటపాన్ని చేరుకొన్నారు. అచ్చట అపాల ! సూర్యరశ్ములు ఆమె బంగారు శరీరంపై పడి వింత శోభని ఇస్తున్నాయి. ఆమె ముఖ చంద్రుడు సూర్యకిరణాల ప్రభావానికి లొంగి పోలేదు. ఆమె కలువ కన్నులు మాత్రం ద్యాన ముద్రలో ముణుచుకొనే ఉన్నాయి. ఆమె ముఖం లోంచి తొంగి చూస్తున్న హాసబాలుడు ప్రవాళాధర శయ్యపై లేచి కూర్చొన్నాడు.
అపాల పద్మాసనం వేసుకొని కూర్చొంది. ఆ స్థిలో ఆమె పద్మాసనీ లక్ష్మీ దేవి వలె భాసిస్తోంది. ఇట్లు కాకలీ కంఠంతో ఇంద్రుణ్ని స్తుతిస్తూంది.
“ భగవన్ ! శతక్రతో ! వజ్రపాణీ ! పురుహూత !
నాకు నీ ప్రత్యక్ష రూపాన్ని చూపించు నాథా !
అదృశ్యంగా నన్నేల చక్కిలిగింత పెట్తావు !
ప్రభూ ! నీ శత్రు భీకరమైన వజ్రాన్ని
చూచి భయపడతాననుకొంటున్నావా !
భయపడను నా మనోహరా ! భయపడను.”
శ్రధా మేధలు ఈ మాటలు విన్నారు. “ అపాలకి పిచ్చి ఎక్కిందా ?” అని అనుకొన్నారు. ఏమాశ్చర్యం ! సూర్య భగవానుడు చిన్న మేఘ శకలం మధ్య దాక్కున్నాడు ! అస్పష్టమైన ఉరుము , మేఘ శకలాన్ని చీల్చుకొంటూ పచ్చని సౌదామినీ రేఖ ! ఇదంతా తృటిలో అదృశ్యమయింది !
“ అపాలా, అపాలా ! ఓ అపాలా ! ” అని బిగ్గరగా పిల్చింది శ్రధ్ధాకుమారి.
అపాల దిగ్గని లేచింది. ఎదురుగా తన సహాధ్యాయినీలను చూసింది.
“ ఏం కొంప మునిగిందని అరుస్తున్నారే!” అని నవ్వుతూ ప్రశ్నించింది అపాల.
“ మరేముందే !మైత్రేయీ అమ్మగారు మండిపడి పోతున్నారు.కుమార ప్రతర్దనుణ్ని మన్మథునిగా ఎన్నుకొన్నారే ! ఇంకా ‘రతీదేవి’ ఎన్నిక కాలేదు” అని బదులిచ్చింది శ్రధ్ధాకుమారి.‘
“నేనుండాలా ఏం? రతీదేవిని మీరు ఎన్నుకోరాదూ !”
“ నీ కంటె రతి ఎవరున్నారే ? వేగిరం పద పోదాం. అప్పుడే చైత్రరథం కోలాహలం చెలరేగుతోంది,” అని హెచ్చరించింది మేధాకుమారి.
***************
పరమోత్కృష్ట సుందరి అపాలనే రతిగా ఎన్నుకొన్నారు కుమారీ గణం. చైత్రరథం బయలుదేరింది. కుమార ప్రతర్దనుడు మన్మథ వేషాలంకృతుడు అయ్యాడు. ఆ వేషంలో ఆ రాకుమారుడు సాక్షాత్తు మన్మథునిగానే కనబడ్డాడు.
నలుగురు బాలురు రథాన్ని ఈడుస్తున్నారు.
ఒక బాలుడు పాడుతున్నాడు. మిగతావారు జయగానం జోడిస్తున్నారు.
బాలుడు : “ మోహన రూపుడు, మోహనాంగుండు,
మోహన దృష్టితో ముద్దుగా వచ్చె !
ఇతర బాలురు జయ జయ రతినాథ ! జయ కామదేవా !
జయజయ చిత్తాభ్ర చందృడా ! జయము !
బాలుడు : విటలాక్షు కంటితో నీరయ్యె వాడు !
పటుతరానంగుడై పరతెంచు నేడు !
ఏతెంచె చైత్రంబు నెక్కి ఈ రోజు !
ఏతెంచె మోదంబు నెదలోన మనకు !
ఇతర బాలురు జయ జయ రతినాథ ! జయ కామదేవా !
జయజయ చిత్తాభ్ర చందృడా ! జయము !
బాలుడు చదువులు సంధ్యలు చల్లగా సాగ
మదిలోని కోర్కెలన్ మరిపించు దేవా !
చిగిరించనీయకు చిత్తంబులోన ,
మగువలపై కాంక్ష మారుడా ! మాకు,
విద్యార్థి దశనిట్లు వెళ్లగా నిమ్ము !
విద్యార్థి బృందంబు వేడుచున్నాము !
ఇతర బాలురు జయ జయ రతినాథ ! జయ కామదేవా !
జయజయ చిత్తాభ్ర చందృడా ! జయము !
హంస వాహనారూడురాలై రతీ దేవి బయలు దేరింది.కుమారీ గణం బలవంతం పైన అపాలని రతీ దేవిగా అలంకరించారు.
ఆ అలంకరణలో అపాల యందు రతీదేవియే ప్రతిబింబిౙచింది.
ఒక బాలిక పాడుతోంది. తతిమ్మా బాలికలు జయ గానం చేస్తున్నారు.
బాలిక వెన్నెల రాశిగా వేదండయాన ,
మిన్నున మెరుపనన్ మీనాక్షి యిపుడు,
హంస రూపంబున అక్కున నెక్కి,,
అంశుమాలిని మించు నత్యంత శోభ ;
రక్తికి నెలవైన రతిభామ వేడ్క,
శక్తి కామేశుని చంచల బాల !
ఏతెంచుచున్నది ఏణాక్షులారా !
బాలికలు జయజయ పద్మాక్షి, జయ కామ శక్తి !
జయజయ రతిదేవి ! జయ మోహనాంగి !
బాలిక మాతరో ! ఎదలోన మమకార వృత్తి,
పోగొట్టి, వైశాల్య బోధక ప్రేమ,
జోకొట్టు మాతృత్వ జేగీయ శక్తి,
నెమ్మిగా మాలోన నీతితో కూడి,
అమ్మరో దయచేసి మమ్మేలుకొమ్ము !
బాలికలు జయజయ పద్మాక్షి, జయ కామ శక్తి !
జయజయ రతిదేవి ! జయ మోహనాంగి !
హంస వాహనికి, చైత్రరథం ఎదురయింది. విద్యార్థినీ , విద్యార్థుల కోలాహలం గొప్పగా చెలరేగింది !
మారుడై ప్రతర్దన కుమారుడు పంచ బాణాలను ,హంస వాహనంపై వదిలాడు. వ్ర్దురు గొట్టాల్లో ఉన్న జపా కుసుమాల్ని చైత్రరథంపై హుటాహుటిగా కన్యకామణులు ఎగజిమ్మారు.వసంతంతో నిండిన చిమ్మెన గొట్టాలు రంగంలో ప్రవేశించాయి.ఎక్కడ చూసినా ఒకే ఎరుపు ! ఆడపిల్లల హాసలహరీలపై , మగపిల్లల వీరాలాపాలు విలువ లేకుండా పోయాయి.!
గుబురుగా ఏపుగా పెరిగిన బాల చూతం క్రింద, నేల గోమయంతో అలికి, ముగ్గు వేయబడి ఉంది.వృక్షం ముదలు భాగం అశోక పత్రాలతో చుట్టవేయబడింది. మధ్య మధ్య రంగు రంగు పువ్వులు జోడింప బడ్డాయి. తూర్పు దిక్కులని చూస్తూ గోపురాకారమైన గుమ్మటం నిర్మింపబడింది. గుమ్మటం ముఖద్వారానికి రంభా స్తంభాలు కట్టబడ్డాయి. పోక గెలలు బాల చూతం చుట్టూ, వెదురు గడలు పాతి వ్రేలాడకట్ట బడ్డాయి !
గుమ్మటం లోపల రతీ మన్మథుల విగ్రహాలు నిలబెట్టారు.
ఉత్సవం ఆ ప్రాంతాన్ని సమీపించింది.
యువరాజు ప్రతర్దనుడు రతీదేవి విగ్రహానికి పూలదండ వేశాడు. ఆత్రేయీ అపాల మన్మథుని విగ్రహానికి పూలహారం
వేసింది.
రతీ మన్మథ పూజ జరిగింది.
*****************
కుమార ప్రతర్దనుడు, అపాలా రూప ముగ్ధుడై పోయాడు. వాని యొక్క హృదయంలో ఆ ముని కన్యక విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకొంది ! వాని మోహన దృక్కులు ఆ యౌవనాంగి యొక్క అంగ సంధుల్లో పడి మత్తెక్కి పోయాయి ! ఆమె శరీర లావణ్యం , ఆ రాకుమారుని హృదయ రాజీవానికి అరుణోదయం వలె భాసించింది ! వాడు తియ్యని కలలు కంటున్నాడు ! వాడు ఊహా ప్రపంచంలో అపాల రతిగాను, తానే మన్మథునిగాను చిత్రించుకొని ఆనందిస్తున్నాడు !
అపాల మాలతీ మంటపంలో ‘ ఇంద్రారాధన ’తత్పరురాలై సమాధిలో కూర్చొంది.ఆమె మనస్సు ఇంద్రత్వాన్నే పొందింది ! ఆమె ప్రపంచంలో వ్యక్తుల పట్ల విరాగి ! ఆమె ఒక్కొక్క అంగమున్నూ,‘ఇంద్ర, ఇంద్ర, ఇంద్ర --’ అనే జపిస్తూంది !ఆ దివ్య నామాన్ని తలంచగానే ఆమె శరీరం వివశమై పోతూంటుంది ! ‘అప్పుడు తానేమైనట్లు ?’ ‘ తానే ఇంద్రుడు’ ! అనే భావం , కాదు స్థిత ప్రజ్ఙ ఆమెలో భాసించింది ! ఆ ప్రఙ్ఞలో ఆమె మేఘంగాను, దాంట్లోని సౌదామినీ రేఖగాను మారిపోతూంటుంది ! అట్టి సమాధిలో అపాల శరీరం దివ్య తేజస్సుతో దుర్నిరీక్ష్యంగా కన్పిస్తుంది ! ఉరుము విన్నప్పుడల్లా ఆమె నెమలివలె ఉల్లాసంతో శతసహస్రము లైన భావపు రంగుల్లో పురి విప్పుకొని నాట్యమాడుతుంది ! ఆమె ప్రకృతిలో ఇంద్రుణ్ని చూస్తుంది ! ఆ సమయం, ఆ ప్రఙ్ఞావతి తానే ప్రకృతిగా మారిపోతుంది ! అపాల భగవంతుడైన ఇంద్రుణ్ని ప్రేమించించి !!!
కుమార ప్రతర్దనుడు ఆశ్రమంలో ఒక పక్షం రోజులు ఉండిపోయాడు !
మహర్షి మేద్యాతిధి వీరిద్దరి స్థితిని గమనించక పోలేదు ! అతడు పరాదృష్టి కల మంత్ర ద్రష్ట ! మహర్షి ! ఒక్కొక్క బాలుడు, ఒక్కొక్క బాలిక హృదయం అతనికి తెలుసు !
అపాల యొక్క ఇంద్ర భక్తికి అతడు హర్షించాడు. ఆమె ఇంద్రుణ్ని ప్రేమస్తూంది ! మహర్షి హృదయం జాలిచే ద్రవించి పోయింది ! “ ప్రభూ ! శతక్రతూ ! ఈ పేద పిల్లను క్షమించు, ఈ అమూల్య రత్నాన్ని చెడగొట్టకు ! ఈ ముగ్ధ మనస్సును మార్చడం నీకొక వింత కాదు,” అని ప్రార్థించాడు.
ఆ కాలంలో గురుకుల వాసం చేస్తున్న బాల, బాలికల వివాహానికి కులపతి అంగీకారం ఉండాలి. కులపతి పరోక్షంలో ప్రేమ కలాపం జరుగ రాదు. ఆర్యానార్య సంఘర్షణలు తరచుగా ఉన్న రోజులవి ! అనార్యుల రాజ్యాలు వింధ్యాద్రికి దక్షిణంగా ప్రబలి ఉండేవి. తత్పలితంగా ఆర్యానార్యుల మధ్య వివాహాదులు జరిగి పోతూండేవి ! వీటిచే ఆర్య మత ధర్మాలకి పెద్ద అఘాతం ఏర్పడుతుందనే భయం చేత ఈ కట్టుబాటు అమల్లోకి వచ్చింది.
కుమార ప్రతర్దనుడు మహర్షి మేద్యాతిధి దర్శనార్థం వచ్చాడు. తాను అపాలను ప్రేమించిన విషయం మహర్షితో ప్రస్తావించాలని తీర్మానంతో వచ్చాడు.
“కుమారా ! ఉత్సవం కులాసాగా జరిగిందా ? ఆశ్రమంలో నీ గౌరవానికి లోటు రాలేదు కదా ?”
“ మహాత్మా ! తమ ఆశ్రమానికి రావడం నా పూర్వజన్మ సుకృతం ! గురూత్తమా ! నేనొక ధర్మ సందేహంలో పడి పోయాను. దాన్ని తమ సన్నిధానంలో విన్నవించుకోవాలని వచ్చాను. ”
“నేను సావధానంగానే ఉన్నాను.”
“ నేను కుమారి ఆత్రేయీ అపాలను ప్రేమించాను. మా ఇద్దరి కళ్యాణాన్ని తమరు ఆశీర్వదించాలి.”
“ కుమారా ! ప్రేమించడం తప్పు కాదు. నీవు ఈ విషయం అపాలతో ప్రస్తావించావా ? నిన్ను అపాల ప్రేమించిందా ?
ప్రేమించని కన్యని నిర్భందించి వివాహమాడడం మన ఆర్య సంప్రదాయం కాదు.”
“ నేను అపాలా కుమారితో సంప్రతించలేదు.”
“ నీవు మొదట అపాల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకో ! తరువాత అపాల తండ్రి మహర్షి శ్యావాశ్వ ఆత్రేయుని కలుసుకొని మాట్లాడు. మీ ఇద్దరి కళ్యాణ విషయంలో నా అభ్యంతరం ఉండదు.”
ప్రతర్దనుడు మహర్షికి అభివాదన చేసి వెళ్లిపోయాడు.
మాలతీ మంటపానికి దారి తీసాడు. అక్కడ అపాల ఇంద్ర ధ్యానంలో మైమరిచి ఆనందిస్తూంది.
“ అపాలా కుమారీ !” అని పిలిచాడు ప్రతర్దనుడు.
అపాల యొక్క ధ్యానం భంగమయింది, కండ్లు విప్పింది. కాశీ రాజకుమారుని చూసింది. మర్యాదగా లేచి నిలబడి
“ఆత్రేయీ అపాల నమస్కరిస్తూంది” అని చేతులు జోడించింది.
“కుమారీ ! నీతో ప్రత్యేకంగా మాట్లాడాలని వచ్చాను.”
“ మహాభాగ ! నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను క్షమించండి ”
“ కుమారీ ! మహర్షి నీతో మాట్లాడడానికి అనుమతిని ప్రసాదించారు.”
“అలాగా ! సెలవియ్యండి.”
“నేను మన యిద్దరి వివాహానికి అనుఙ్ఞ కోరాను. మహర్షి సమ్మతించారు. కుమారీ ! నేను నిన్ను గాఢంగా ప్రేమించి ఉన్మాదావస్థలో పడిపోయాను. నన్ను అనుగ్రహంచు !”
“మహాభాగ ! నాకు తల్లి తండ్రులున్నారు.”
“నేను వారిని కూడ కలుసుకొంటాను, మొదటి నీ అభిప్రాయం ---”
“ ఆర్యా ! క్షంతవ్యురాలిని . నా ఆత్మ ఇదివరలో అర్పితమయి పోయింది ! ఇక ఈ శరీరమే మిగిలి ఉంది ! ఇది దీనిని సృష్టించిన వారి స్వంతం ! ఇంత కంటె అధికం చెప్పలేను,” అని అపాల మంటపాన్ని వదలి వెళ్లిపోయింది.
ప్రతర్దనుడు స్తంభించి పోయాడు. ‘ ఎవడా అదృష్ట శాలి !? ’అని తలంచాడు. అపాల ఇంద్రుణ్ని ప్రేమిస్తూందని వానికెలా తెలుస్తుంది !!
***************
కొన్ని మాసాలు ప్రశాంతంగా గడచి పోయాయి. అపాల ఆత్మ ఇంద్ర శక్తితో ప్రజ్వరిల్లింది. ఆ కాంతి ఆమె శరీరాన్ని చుట్టి వేసింది. అపాలకు పరావాక్కు సిధ్ధించింది ! ఆమె ఫాలం దివ్య తేజంలో పుంజీభూతమయింది ! విఙ్ఞాన కిరణాలు ఆమె ముఖం లోంచి వెలువడ్డాయి ! ఆమె వాణి ఇంద్ర మయమై భాసించింది . హృదయ గుహలోంచి పరావాక్కు నిర్గమించింది. అది మంత్ర రూపంగా “ఇంద్ర సూక్తమై” భాసించింది ! అపాల మంత్ర ద్రష్ట అయింది!!
ఆశ్రమ వాసులకి ఇది ప్రమోదాన్ని , ఆశ్చర్యాన్ని పుట్టించింది !! మహర్షి మేద్యాతిథి సంతోష పారవశ్యంచే మైమరచి అపాలని కౌగలించుకొని గౌరవించాడు.
మహర్షి ఆ సూక్తానికి ఉదాత్తాను దాత్త స్వరితాల్ని సమకూర్చాడు ! ఆశ్రమ వాసులు సూక్తాన్ని గానం చేసారు.
అగ్ని ముఖం ఏర్పాటయింది. అగ్నిలో ‘ సోమరసాన్ని’ హోమం చేశారు. అగ్ని చల్లగా ఆరిపోయింది ! మహర్షి అర్థవంతంగా అపాల వైపు చూచాడు !
అపాల సోమలతని నోట్లో వేసుకొని చక్కగా నమిలి ఆరిపోయిన అగ్నిలో ఉమ్మింది !
ఆశ్చర్యం !! అగ్ని శతాధిక కీలల్తో జ్వలించింది !!!
నిర్మలమైన ఆకాశం ఒక క్షణంలో మేఘావృతమయింది ! ఉరుములు ఉరిమాయి ! వితానమంతా తటిత్ ప్రకాశంతో నిండింది ! అఖండ ధారాపాతంగా వర్షం కురిసింది !
మహర్షి ముఖం బ్రహ్మ తేజంతో వెలుగొందింది !!
మహర్షి అందరినీ చూచి ఇలాగన్నాడు.
“ వత్సలారా ! ఈ దినం ఆర్య స్త్రీ సంఘం గర్వించదగిన పుణ్య దివసం ! మనలో స్త్రీలు కూడా మంత్ర ద్రష్టలై కీర్తిని పొందడం మన ఆర్య జాతికే గౌరవం ! ఈ దినం అపాలా ద్రష్టమైన మంత్రాల్ని జగత్కర్త ఇంద్రుడు స్వీకరించడం , ఆమె ఉఛ్ఛిష్ట సోమరసాన్ని గ్రహించడం లోంచి వ్యక్తమయింది !! ఈ రోజు మొదలు అపాలకు నేను “ బ్రహ్మవాదిని” అనే సార్థకమైన బిరుదుని ప్రసాదిస్తున్నాను.
********************
బ్రహ్మవాదిని అపాల ఇంద్ర ధ్యానంలో కొన్ని మాసాలు ప్రశాంతంగా గడిపింది. ఆ దినాలు ఆమె జీవితంలో సుధా మధురాలు ! ఆమె ఇంద్రునిలో ఈక్యత చెంది ప్రతీక్షణం ఇంద్రభోగాన్ని అనుభవించింది !
ఒక రోజు అరుణోదయమయింది. అపాల ఆ రోజే స్వగ్రామానికి ,పయనమై పోతోంది. రెండు గుర్రాలతో సజ్జితమయిన రథం సిధ్ధంగా ఉంది. మహర్షి శ్యావాశ్వుడు స్వయంగా తన కుమార్తెను తీసుకొని పోవుటకు రథాన్ని తోలుకొని వచ్చి ఉన్నాడు.
మహర్షి మేద్యాతిథి అపాల యొక్క దైవీక ప్రేమోదంతాన్ని శ్యావాశ్వునికి స్పష్టంగా చెప్పాడు. శీఘ్రంగా అపాలను ప్రతర్దునికి ఇచ్చి వివాహం చేస్తే కాని ఈ విపరీతం శాంతించదని అభిప్రాయ పడ్డాడు శ్యావాశ్వుడు. ఆ విషయంలో కులపతి తన అభిప్రాయాన్ని ఇట్లు వెల్లడించాడు.
“ మహాభాగ ! మీ కుమార్తె అపాల బ్రహ్మవాదినీ గణంలో సర్వోత్తమురాలు ! అట్టి విద్యార్థినిని ఈ గురుకులం పొంది మహోత్కృష్టమైన సంతానం పొందిన తల్లి వలె గర్విస్తూంది ! అపాల యొక్క భావిని గురించి నేనేమీ చెప్పలేకున్నాను. ఆమె ఇంద్రుణ్నే స్వయంగా వరునిగా వరించింది ! దీని పరిణామం దురూహ్యం ! ఆమెను కన్యక గానే ఉంచుతేనే బాగుంటుందేమో !! అయినా మీ కుటుంబ విషయంలో నేను నిశ్చితమైన విధానాన్ని సూచించడం ఉచితం కాదు ! భగవంతుడైన ఇంద్రుడు అపాల భావిని భాగ్యవంతంగా చేయుగాక ! ”
మహర్షి శ్యావాశ్వుడు తన నిర్ణయయాన్ని మార్చుకోలేదు. గతరాత్రి అపాలకు సరిగా నిద్ర పట్టలేదు. ఆమె తన తండ్రి నిర్ణయాన్ని ప్రతిఘటించ లేక పోయింది ! తెల్లవారు ఝామున ఆమెకు చిన్న మైకం పట్టింది. అది సుషుప్తి జాగృతులకి మధ్యావస్థ ! అప్పుడొక కల !!
‘ అపాల తన ఉఛ్ఛిష్ట సోమరసం తోనే ఇంద్రునికి అగ్నిలో హోమం చేసింది. ఆ ప్రదేశమంతా మేఘం క్రమ్ముకొంది. దాని లోంచి జల్లు ప్రదేశమంతా తడిపింది. ఆ జల్లులో ఆమె తడిసి ముద్దయిపోయింది ! ఆమె అంగాలు ఒకానొక అవ్యక్తమైన , ఆనందంతో పూరించి పోయాయి. ఇంతలో ఒక బలమైన గాలి వీచింది. ఆమె కట్టుకొన్న చీర విడిపోయింది ! ఆమె నగ్న శరీరం బంగారం వలె ప్రకాశించింది ! ఒక నల్లని ఆకారం ఆమెను సమీపించింది ! ఆ ఆకారం చేతిలో ఏదో పొడవపాటి
వస్తువు విద్యుత్తు వలె మెరిసిపోతూంది ! “ భగవన్ ! ఇంద్రా ! నాథా ! ” అని అపాల ఆ వ్యక్తిని నగ్నం గానే సమీపించింది ! “అపాలా !నా కౌగిట్లోకి రా! ”అని ఆ ఆకారం అపాలను తన హృదయానికి హత్తుకొంది ! ఏమి ఆనందం !! ‘ధన్యురాలిని’ అని అపాల కండ్లు విప్పింది !
ఎదురుగా తన తండ్రిని చూసి సిగ్గుచే ఎర్రవారింది అపాల !
******************
అపాల ప్రతర్దనుల వివాహం జరిగిపోయింది !
ప్రతర్దనుడు తలచాడు. తానిక ఆ అపూర్వ సుందరి యొక్క లావణ్య మధువును ఆశ్వాదించబోతాడు ! తనవంటి భాగ్య శాలి ఎవరును కారు ! ఈ తలంపుతో అతని లోని తియ్యటి భావాలు సముద్ర తరంగాల వలె విజృంభించాయి !
పెండ్లివారి రథాలు కదిలి వెళ్తున్నాయి. ప్రతర్దనుడు తన ప్రేయసి అపాలతో కలిసి కణ్వాశ్రమానికి వెళ్లుతున్నాడు. అక్కడ మహర్షికి అభివాదన పూర్వకంగా గురు దక్షిణాదికం సమర్పించుకోవాలి కదా !
అపాల తలంచింది !‘ తన శరీరం వరుని కర స్పర్శచే అపవిత్రమయి పోయింది ! అది మరింత అపవిత్రం కానుంది ! తన మనోనాధుడు తనని స్వీకరిస్తాడా ? “ అయ్యో ! ” అని ఆమె హృదయం ప్రతిధ్వనించింది ! ఆమె మనోగహ్వరం భయంకరంగా తెరచుకొంది ! ఆమె శోకం పెల్లుబుకింది ! ప్రార్థనా పూర్వకమైన రోదన తనలోనే ధ్వనించింది !!
ఈ ప్రార్థన విన్నాడు భగవాన్ ఇంద్రుడు ! మేఘాలు దొర్లాయి ! భూమి కంపించింది ! గాలి విజృంభించింది ! ఉరుములు ఉరిమాయి ! అది తన ప్రళయ తాండవం యొక్క పద ఘట్టన శబ్దం లాగుంది ! తటిత్ ప్రభలు ఆకాశమంతా ఆవరించాయి ! ప్రతర్దనుడు రథాన్ని ఆపమన్నాడు . రథం ఆగింది. కణ్వాశ్రమోప్రాంత భూములు మెరుపు కాంతిలో కన్పడుతున్నాయి !
“ ప్రేయసీ అపాలా ! మనం గురువుల్ని చూచి , వాన తగ్గగానే పయనం సాగిద్దామా !” అని ప్రతర్దనుడు అపాలను చూచు ప్రశ్నించాడు.
ఏమాశ్చర్యం !! అపాల తప్త కాంచన సన్నిభమైన శరీరం నల్లబడి పోయింది ! శరీరమంతా చీము కారుతూ రణాలు వ్యాపించి ఉన్నాయి !! ప్రతర్దనుడు జుగుప్సతో రథం దిగి పోయాడు. అపాల కూడ దిగింది . వాన తగ్గిపోయింది !
ప్రతర్దనుడు విసుగుతో కాణ్వాశ్రమాన్ని చూస్తూ నడక సాగించాడు. అపాల అక్కడే నిలబడి ----
“ భగవాన్ ! పురుహూతా ! నీ కరుణ అపారమయింది ! నా శరీరాన్నిఅపవిత్రం కాకుండా కాపాడావు! నేను ధన్యురాలిని ! ఇదుగో వస్తున్నాను, నన్ను స్వీకరించు !” అని చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ పల్కింది.
ఆకాశమంతా అదే వెలుగు ! “ ప్రేయసీ అపాలా ! నిన్ను స్వీకరించాను, రా పోదాం !!” అని గంభీర నాదం వినబడింది.
అపాల క్రింద పడిపోయింది.
ఆశ్రమం నుండి మహర్షి మేద్యాతిథి ఆశ్రమ వాసులు అక్కడకు వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసారు.
అపాల శరీరం లోంచి దివ్య తేజస్సు నభోమార్గంగా పయనించింది ! అపాల మృత కళేబరం సువర్ణచ్ఛాయతో మెరిసి పోతోంది !
మహర్షి మేద్యాతిథి చేతులు జోడించి అపాలకు నమస్కరించాడు. “ బ్రహ్మవాదినీ అపాలా !! ఇంద్ర పత్నీ అపాలా !! ఇదే నీకు మా జోహారులు !!” అని బిగ్గరగా పలికాడు.
ఆకాశం లోంచి అశరీర వాక్కు,“ నేను అపాలను స్వీకరించాను ! అపాల నా భార్య ! ఆమె ద్రష్టమైన మంత్రాలు వివాహ కాలంలో అందరూ చదవాలి ! అప్పుడు గాని వివాహం పవిత్రం కానేరదు !”
ప్రతర్దనుడు అపాలకు నమస్కరించాడు !
అందరూ నమస్కరించారు !
“ ఆత్రేయీ అపాలా !! బ్రహ్మవాదినీ అపాలా !! ఇంద్ర పత్నీ అపాలా !! నీకు జయమగు గాక !!!అని జయనాదం చేసారు
*****************
.. ******************
చాలా బాగుంది కథ.
ReplyDeleteక్షీరగంగకు స్వాగతం. వేదంలో కథలని నాకు ఓపిక ఉన్నంత వరకు టైపు చేసి ప్రచురిస్తాను. తప్పక చదవండి. మీ స్పందనకి సంతోషం.---ఎ.శ్రీధర్.
Deleteఅభినందనలు,వేదనిధి లో వున్న సైన్సు,అస్త్ర శస్త్ర నిర్మాణ విశేషాలు అవకాశం వున్నంతవరకు తెలియజేయండి
ReplyDeleteఅభినందనలు,వేదనిధి లో వున్న సైన్సు,అస్త్ర శస్త్ర నిర్మాణ విశేషాలు అవకాశం వున్నంతవరకు తెలియజేయండి
ReplyDelete