Skip to main content

పరిభూత సుర త్రాణం

ఆ సంఘటన ఇప్పటికి 500 సంవత్సరాలు (1510 జనవరి 23) క్రిందట జరిగింది. అయినా దాని నుంచి మనం ఈ నాటికీ పాఠాలు నేర్చుకొని మనుగడని ఎలా సాగించాలో చరిత్ర చెప్తోంది!!! __ ఎ. శ్రీధర్ గారి చారిత్రక రచన పరిభూత సురత్రాణం చదవండి.
ఈ రచన జూన్ నెల 3వ తా్రీఖు పొద్దులో పడింది.

…………….

పరి భూత సురత్రాణం
కనిబరిగె (గుల్బర్గా) లోని ప్రసిధ్ధమైన ‘కపిలేశ్వర దేవాలయంలో’ కపిలేశ్వరునికి అష్టోత్తర శతనామార్చన చేయించి శివోపస్థాన రూపమైన ద్విపద గీతిని ఆలాపించింది ‘అవనిజ’..


“రంగు మీరగ వచ్చి రమ కౌగలింప—బంగరు పుంఖపు ప్రభ కైతవమున
కాలంబు వచ్చు నాకలి దీరునంచు—గాలినెయ్యుండు ముఖంబున డాగ

తూణీర రూప పాథోరాశియందు---బాణ రూపంబున పవళించు హరిని
గారవమున లేపి కరమున నంది—స్ఫార సుమేరు చాపంబున గూర్చి

చికుర రూపంబగు జేజేల దారి- శకట రూపంబగు క్షమయును గదల
శకటాంగ రూప భృచ్చంద్రార్కరుచుల—ప్రకటాట్టహాస ప్రభలు మించి పర్వ

హుంకార భోధిత మురునభోవాటి-- నోంకార పటునాద ముగ్రమై వెలయ
ధనురాయు మన చండ ధాటికి నదరి—మినుకుల గుర్రాలు మేనులు వంప

“జయము నీ కగుగాక శంకరా” యనుచు-- హయ చోదకుడు బ్రహ్మ యాశీర్వదింప
ఒక్క యేటున మేటి నుగ్ర పురముల మూటి—స్రుక్కడగించిన ముక్కంటి గొలుతు”

పూజారి ఆమె పాడుతున్న గీతాన్ని పరవశత్వంతో వింటూ, కపిలేశ్వరునికి హారతి నిస్తున్నాడు. ఇంతలో బయటినుంచి కోలాహలం ! ఛీత్కారాలు , హయహేషలు, ఆర్తనాదాలు, వినిపించసాగాయి. వాటి మధ్య ఒక అశ్వారూఢుడైన యువకుడు , “ పారిపొండి, పారిపొండి , సురత్రాణ సైన్యం వస్తోంది, పారిపోండి. “” అంటూ హెచ్చరికలు చేస్తూ దేవాలయం ప్రధాన ద్వారం దగ్గర ఆగి మరికాస్త బిగ్గరగా వినిపించాడు.

పూజారి చేతిలోని ‘హంస హారతి ‘ క్రింద పడిపోయింది. “అమ్మా ! అవనిజా ! లోపలికి రా !” అంటూ, ఆమెను గర్భగుడిలోకి లాగి, గుడి తలుపులు మూస్తూ అన్నాడు, “ అమ్మా ! సుర త్రాణ సైన్యం ముందుగా దేవాలయాల మీద దోపిడీకి దిగుతుంది. ఈ గుడి నుండి సడి చేయకుండా బయటికి పోవాలి. “ కపాలీశ్వరుని ఆభరణాలు తీయడంలో నాకు సహాయం చెయ్యి. “ అంటూ, గర్భగుడిలో ఉత్తరదిశలో, పట్టుబట్టలతో కప్పబడి ఉన్న ఒక భోషాణాన్ని తీసి, స్వామికి అలంకరించిన నగలు. అవనిజ తీసి ఇస్తూ ఉండగా వాటిలో పడేసి, కపాలీశ్వరుని వెనుక భాగాన ఉన్న గోడలోని, రహస్యమైన యంత్రపు మరని త్రిప్పాడు.. గదిగోడలలో ఒక భాగంగా కలిసి ఉన్న రాతిపలక తెరచుకొని దారి నిచ్చింది.

అవనిజ విప్పారిన పద్మనేత్రాలని బండి చక్రాలలాగ చేసుకొని ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా, భోషాణాణ్ని ఆ సొరంగ మార్గంలోకి నెట్టి, “అవనిజా ! పద త్వరగా ! “ అంటూ ఆమె చేయి పట్టుకొని లోనికి దారి తీసాడు. పూజారి.

ఇద్దరూ లోపలికి ప్రవేశించి కాస్త స్థిమితపడ్డాక, ఆ సొరంగపు గోడలలో అమర్చిన ఒక కాగడాని తీసి వెలిగించాడు. అతను. ఆ కాగడా వెలుగులో ఇద్దరూ భోషాణాన్ని నెట్టుకొంటూ మెల్లగా అడుగులు వేస్తున్నారు. ఆ భోషాణానికి అమర్చి ఉన్న చక్రాలని కాగడా వెలుగులో బయటికి తీయడంతో దాన్ని నెట్టడం వాళ్లకి సులువయింది.
అప్పటివరకు జరిగినదాన్ని మననం చేసుకొన్న అవనిజ తన కాకలీ స్వరంతో “ ఏమిటిది, బాబాయ్ ?! ఎవరీ సురత్రాణ సైన్యాలు ? ఎందుకిలా పారిపోవడం ! మనని పరిపాలించే ఏలిక మహ్మద్ షా (రెండవ ) సురత్రాణుడు కదా ! తన రాజ్యం మీద తనే తిరిగి దండయాత్ర చేయడ మేమిటి ? “ అని అడిగింది.

పూజారి కాగడా వెలుగులో ఆమె అమాయకమైన ముఖాన్ని చూసాడు. మచ్చలేని చంద్రబింబం లాంటి ఆమె ముఖం ఆ కాగడా వెలుగునే వెన్నెలలా ప్రతిబింబిస్తోంది. సమున్నతమైన ఆమె కోటేరులాంటి నాసిక, కనుబొమలనే రెండు ధనస్సుల మధ్యనుంచి ఎక్కుపెట్టిన బాణంలా నిటారుగా ఉంది. లక్కపిడతల్లాంటి ఆమె ఎర్రని పెదవులు, వాటిమధ్య మెరుస్తున్న తెల్లని పలువరస ఎలా కనిపిస్తున్నాయంటే అవి చూసిన పూజారికి ఒక శ్లోకం గుర్తుకొచ్చింది.

“రాగవా నధర ఏష సన్తతం: నిర్మల ద్విజ సమీప వర్త్యపి
ఏభిరస్య సహవాసతః ప్రియే : నేషదప్యపగతో నిజో గుణం !!”

శుద్ధ సత్వగుణముగల బ్రాహ్మణుల సన్నిధి యందున్నను రజోగుణమును విడువని జనము వలె, తెల్లని దంతముల చేరువనున్నను ఈ యధరము రక్తవర్ణమును విడువకున్నదని ఆ శ్లోక తాత్పర్యాన్ని స్ఫురించేలా చేసింది.

మరుక్షణం ప్రస్తుతానికి వచ్చిన పూజారి, అవనిజా ! మన ఏలిక మహ్మద్ షాని , ఖాసిం బరీద్ అనే విద్రోహి యుద్ధంలో ఓడించి, బీదర్ కోటలో బందీని చేసాడు. మన ఏలిక కాస్త సౌమ్యుడు., మెతకవాడు. క్రొత్తగా వచ్చిన ఖసిం బదీర్ సురత్రాణుడు క్రూరుడు., మత యుద్ధమనే పేరుతో ధన మాన ప్రాణాలని దోచుకొనే రక్తపిపాసి. ఆ దుర్మార్గుని సైన్యం ఎలాంటి దౌర్జన్యాలు చేసారంటే ...........”

“ ఎలాంటి దురాగతాలు చేసాడు బాబాయ్ ? “
“ తల్లీ ! ఏం చెప్పమంటావ్ ?”........

“ వడిగుళ్లు సొచ్చి, దేవళ్ల బద్దలు చేసి-- ధట్టించి తేజీల గట్టునొకడు
జిగురు పాలకటంచు జిగురించు—రావిమ్రాకుల నజ్జు నజ్జుగా గొట్టునొకడు

గురు సార్వభౌముల గోఢు పోసుక పట్టి—నామముల్మొదలంట నాకు నొకడు
గద్దించి వెన వైదికపు బాపనయ్యల పిల్ల జుట్లూడంగ బెరుకునొకడు

పొట్టేళ్ల గతి బట్టి బోడి సన్యాసుల ఢీయని త్రాకులాడించు నొకడు
సోమయాజుల బ్రహ్మసూత్రముల్ ద్రెంచి, సింగాణి విండ్లకి నల్లెగట్టు నొకడు

పైకాలు గొమ్మని బల్మి గోమటివారి చెలువపై బడి బూతు చేయు నొకడు...........”

చాలు, బాబాయ్ ! చాలు, మరి విన లేకున్నాను...” అంది, అవనిజ, కండ్ల వెంట కన్నీరు ధార కట్టగా !

పూజారి ఆమె ముఖం చూసి మనస్థితిని అర్థం చేసుకొని ఆగి పోయాడు. “దిగులుపడకమ్మా, అవనిజా ! అశ్వారూఢుడై వచ్చి మన దేవాలయం ముందు హెచ్చరించాడు చూడు, ఒక “

“ అవును బాబాయ్ ! స్పురద్రూపి అయిన ఒక యువకుడు ! అతడెవరు బాబాయ్?! “

` “అతడేనమ్మా ! మన విమోచనోద్యమ నాయకుడు. పేరు ‘ననక దేవరాయడు. .వర్తమాన విజయనగర పాలకుడైన తుళువంశ క్షత్రియుడు, ‘శ్రీ కృష్ణ దేవ రాయలకు ‘ గురుకుల సహాధ్యాయుడు. విజయనగరానికి వెళ్లి ఖసిం బదీర్ ‘ దురాగతాల్ని శ్రీ కృష్ణ దేవ రాయలకు వినిపించి సహాయమడగాలని తీర్మానించాడు.....”

“ అలాగా బాబాయ్ ! .”అని ఆగిపోయి దీనమైన స్వరంతో విలపించింది అవనిజ. “ నేను ఆడుదానను అయిపోయాను బాబాయ్, లేకుంటే , ననుకదేవరాయునితో కలిసి వెళ్లేదాన్ని. ...” అని.

పుజారి ఆమె మాటలకి నివ్వెరపడి , ఆమె వంక తేరిపార చూసాడు. “అవనిజా ! నువ్వు స్త్రీవి కావడమే, ఆ దేవుడు నీ కిచ్చిన వరం. కళా పిపాసి అయిన ఆంధ్ర భోజున్ని నీ నాట్యంతో, నీ గానంతో, రంజింప జేసి, ననుక దేవుని సందేశాన్ని వినిపించి మన సహాయానికి తరలించగల కౌశలం నీకే ఉంది. ననుక దేవునితో పాటు.....”

“ నేను అతనితో వెళ్లేందుకు సిద్ధమే బాబాయ్ ! విమోచన యజ్ఞానికి ఆహుతి నిచ్చే సమిధ నవుతాను. ఈ ప్రయత్నంలో నేను ప్రాణం పోగొట్టుకోడానికయినా వెనుదీయను. నా నాట్యం, నా గానం, నా కళాకౌశలం దానికి ఉపయోగపడితే జన్మ ధన్యమయినట్లు భావిస్తాను. “ అంది అవనిజ ధృఢనిశ్చయంతో.

ఆమె ముఖం, ఇప్పుడు వెన్నెల వెదజల్లే జాబిల్లిలా లేదు. చంఢ ప్రచండ కిరణాలతో ఎదిరిని భస్మం చేయగల మధ్యందిన మార్తాండునిలగ భాసించింది ఆ పూజారికి.
************************
సొరంగ మార్గంనుండి బయటపడిన తరువాత చుట్టుప్రక్కల పరిసరాలని చూసింది అవనిజ.

అడవిమధ్యలో అసిరమ్మ గుడి అది ! (అసిరమ్మ-శిరము లేని అమ్మ- ఛిన్న మస్త ) అప్పటికే అక్కడ ఆరుగురు ఆశ్వికులు ఒక పల్లకీ తదుపరి ప్రస్థానానికి తయారుగా ఉంది.

ననుకదేవుడు వారిని చూడగానే, అశ్వంనుండి క్రిందకి దిగి భోషాణాన్ని బయటికి లాగడంలో పూజారికి సహాయం చేసాడు. ఆ తరువాత తల వంచి అవనిజకి అభివాదన చేసాడు.

“ ననుకదేరాయా ! ఇదుగో ఈ అమ్మాయే అవనిజ ! గానకోకిల, నాట్యమయూరి, రూపానికి లక్ష్మి, కళా కౌశల్యానికి సరస్వతి, నారీ శక్తి ప్రతీకయైన దుర్గ, అమాయకత్వానికి సురభి, ఆలోచనకి ద్రౌపది,....అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా , “ఇక చాలు బాబాయ్ !” అని అడ్డుపడింది అవనిజ . “ నా నురించి అతిశయోక్తులు చెప్పేకన్న అతని గురించిన వాస్తవాలు చెప్పండి, “ అంటూ.

ననుకదేవుడు కూడా పూజారిని వారించాడు. “ గురువర్యా ! నా గురించి చెప్పడానికేమీ లేదన్నదే వాస్తవం. ఇప్పుడు చెప్పాల్సినదీ, చేయవలసినదీ నా కీర్తిగానాలు కాదు.,శ్రీ కృష్ణదేవరాయలు గురించి చెప్పండి.

“ శ్రీ కృష్ణ దేవరాయలా ! ఆయనెవరు ? “ అడిగింది అవనిజ.

“ శ్రీ కృష్ణ దేవరాయలు, తుళువంశ క్షత్రియుడు. విజయనగర సామ్రాజ్య వారసత్వాన్ని తన అన్న వీర నరసింహ రాయల దగ్గర నుండి చేపట్టిన రాజాధిరాజు.! అతడు ధర్మనిష్టలో యుధిష్ఠురుడు, బాహుబల మందు భీముడు, ధనుర్విద్యయందు ధనంజయుడు, నిష్కపట నీతి యందు సహదేవుడు, ఔదార్యమందు కర్ణుడు, వ్యూహరచనలో ద్రోణుడు, స్వసైన్య రక్షాతంత్రంలో భీష్ముడు, పరసైన్య విదారణ పద్ధతిలో అశ్వథ్థామ, అశ్వహృదయ జ్ఞానంలో నకులుడు, సప్రేమ మహాసుందరుల వివక్త సన్నిధిలోకుడ చలించని శ్రీ శుకుడు, ఆంధ్ర సాహిత్య కళామతల్లికి అనుంగు పుత్రుడు, అతడే మనకి కాబోయే సార్వభౌముడు.”

అవనిజ తన చేయి చెక్కిలికి చేర్చి, “ అర్థమయింది. ఒక్క మాటలో చెప్పాలంటే పురుషోత్తముడన్న మాట ! “ అంది.

“ అవును మనము ఇప్పుడు అతని సన్నిధికే వెళ్తున్నాం. దేశవిమోచన దీక్షాకంకణులైన యువ కిషోరాలు నాతో పాటు ద్వాదశసంఖ్యలో ఉన్నారు. వీరనారీమణులు మీతో కలిసి నలువురు, వెరసి పదహారుగురు. మనమందరం, కళాకారుల లాగ దారిలో మజిలీలు చేస్తూ విజయనగరం చేరుతాం. అల్లసాని పెద్దనామాత్యులవారు, మహామంత్రి తిమ్మరుసులవారు మనకి శ్రీ కృష్ణ దేవరాయల సభాభవనమైన భువన విజయంలో ప్రదర్శనకి ప్రవేశార్హత కలిగిస్తారు. ఆ ఆంద్రభోజుని మనసుని రాగరంజితం చేసాక కానుకలిచ్చే బదులు విమోచన నివ్వమని అడుగుదాం.!” ఏక బిగిన చెప్పాడు, ననుకదేవుడు.

“ ఆయన ఒప్పుకొంటాడంటారా ? “

“ ఆయన ఔదార్యంలో కర్ణుడని........”

“ అటులనే, ఇప్పుడేం చేయాలి ?”

“ మీరు ఈ నగల భోషాణంతో పాటు ఆ పల్లకీ నెక్కి కూర్చోవాలి. తక్కిన కథ మన గురువర్యులు, మిత్రులు నడిపిస్తారు. “
************************
భువన విజయంలో మహారాజ శ్రీ క్రష్ణ దేవరాయలు, మహామంత్రి తిమ్మరసు, అల్లసాని పెద్దనా మాత్యులు తదితర రాజబంధువులు, రాజ పరివార బృందముల ఎదుట, బెల్గాం, బీదర్ , కనిబెరిగ నుండి వచ్చిన యువకళాకారుల ‘ రామాయణ ప్రదర్శన ‘ రక్తి కట్టింది. ఆ రోజు శ్రీ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నల వివాహ ఘట్టం ప్రదర్శింపబడుతోంది.

“ దేవతల్ హర్షింప దేవ కామినులు--- వావిరి నాట్యముల్ వర్థిల్ల జేయ
ఫుల్లాబ్జ దళ నేత్రి, పూర్ణేందువదన --- నిల్లాండ్ర మేల్బంతి, యిభరాజవదన

జనకజ చేబట్టె, జన నాధ సుతుడు--- ఘన ధన్వి రాముడు ఖచరులు వొగడ
భరతుడు గ్రహియించె భాసురంబుగను---కరముచే మాండవీ కర సరోజమును

సౌమిత్రి పట్టెను, సద్గుణవల్లి.--- గామిని యూర్మిళ కర పల్లవంబు
శృతికీర్తి రమణీయ శోభన కరము,--- జతగూర్చి పట్టెను శతృఘ్నుడంత !

కళ్యాణమయ్యెను గన్యకామణుల—కళ్యాణ మబ్బెను ఖచరవాసులకు
కళ్యాణ గానముల్ గంధర్వ సతులు---కళ్యణ రవముచే గళమెత్తి పాడ

నూర్వశీ మేనకలున్నత స్థాయి---గర్వత నృత్యముల్ ఘటియించి యాడ
దేవతల్ సుమములన్ దివినుండి రాల్ప---భువి కళ్యాణోత్సవ భూరి వైభవము
ముగిసెను సంతోష పూర్వకంబుగను.!”

శ్రీ కృష్ణ దేవరాయలు పాటను, నృత్యాన్ని, అభినయాన్ని చూసి ప్రశంసించాడు. కళ్యాణ శబ్దాన్ని పలుమార్లు నానార్థ సూచకంగా వాడినందుకు మెచ్చుకొన్నాడు. ప్రదర్శనకారులను ఏమి కావాలో కోరుకోమన్నాడు.

అవకాశం లభించిన ననుకదేవుడు, అవనిజ తధితరులు తమ రాకలోని పరమార్థాన్ని విడమరిచి చెప్పి రక్షించమని వేడుకొన్నారు. సార్వభౌములు వారిని తన ఏకాంతమందిరంలో కలియమని చెప్పి, కనుసన్నలతో తిమ్మరసుల వారిని అనుసరించమని సూచించి, వారితో పాటు అక్కడ నుంచి కదిలాడు.
************************
శ్రీ కృష్ణదేవరాయలు అరిభయంకరుడై ఖాసిం బదీర్తో పోరి, ఓడించి బీదర్ కోటలో బందీగా పడిఉన్న మహమ్మద్ షాను చెర నుండి విడిపించాడు. అంతే కాదు, ఎవరూ ఊహించని రీతిలో,తిరిగి అతనికే బహమనీ రాజ్యాన్ని అప్పగించాఢు. తిమ్మరసు మంత్రి దూరదర్శిత్వం , రాయల రాజనీతి ఎంత పటిష్ఠమైనవో ఆ సంఘటననే సాక్ష్యంగా ఛెప్పవచ్చు. ఆ రోజేగాని ఆ సురత్రాణుని వధించి ఉంటే తక్కిన ముస్లింపాలకుల మనసులలో ద్వేషబీజాలు మొలకలెత్తి వారందరి ఐకమత్యానికి దోహదం చేసి ఉండేవి. ఆ విధంగా అతడు అల్లసానివారి మాటలలో ‘యవన కోణిభవ స్థాపనా’!!’ అని, ‘;పరిభూత సురత్రాణ!!’ అని కొనియాడబడ్డాడు.

ఆ సంఘటన ఇప్పటికి 500 సంవత్సరాలు ( 1510 జనవరి 23) క్రిందట జరిగింది అయినా దాని నుంచి మనం ఈ నాటికీ పాఠాలు నేర్చుకొని మనుగడని ఎలా సాగించాలో చరిత్ర చెప్తోంది !!!

స్వేచ్ఛావాయువులు పీల్చుకొన్న అవనిజా- ననకదేవులు రాయలచేత ఆదేశింపబడి తిరిగి కళ్యాణ బంధంలో బంధింపబడ్డారు..!!!!!!!!

Comments

  1. బీబీ నాంచారమ్మ(వేంకటేశ్వరుని రెండవ భార్య)ముస్లిం స్త్రీ.బీబీ నాంచారమ్మ కథను విశ్వసిస్తూ చాలామంది ముస్లిములు నేటికీ తిరుమలను దర్శించుకుంటున్నారు.ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని డిల్లీ సుల్తాన్ డిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతర వివాహాలు కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.http://beta.thehindu.com/arts/books/article415269.ece


    ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిం సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ "స్వర్ణ పుష్పార్చన" లేదా "అష్టదళ పాద పద్మారాధన" చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన రెండు మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.
    http://ravindrasriramanujadasan.co.cc/tirumala/impq/tfaq13.html

    ReplyDelete
  2. చీరాల, మే 7: వడయవర్లు స్వామివారి 108వ ఢిల్లీ తిరునాళ్ల మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. సంతబజారులోని వడయవర్లు దేవస్థానం నుండి వెంకటేశ్వరస్వామి వారిని ఊరేగింపుగా తీసుకొచ్చి దర్బారురోడ్డులోని చలువ పందిరిలో వుంచారు. సాయంత్రం వడయవర్లు స్వామివారి విగ్రహాలను మేళతాళాలతో తీసుకొచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి చీరాల పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దర్బారు రోడ్డులో ఏర్పాటుచేసిన ప్రత్యేక పందిరిలో స్వామివారి విగ్రహాలను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రికి వెంకటేశ్వరస్వామి, పద్మావతి, బీబీ నాంచారమ్మ విగ్రహాలతో పాటు వడయవర్లు స్వామివారి విగ్రహాలను దేవస్థానానికి తీసుకెళ్ళారు. ఢిల్లీ సుల్తాన్ కాలంలో స్వామివార్ల విగ్రహాలను సుల్తాన్ వద్ద నుండి రామానుజాచార్యులు తిరిగి తిరుమల చేర్చిన ఘట్టాన్ని పురస్కరించుకొని గత 107 సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.http://www.andhrabhoomi.net/prakasam/v-116?nocache=1#comment-7405

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ