Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన ---1

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన --1

( బాలాజీ అర్చావతార వైశిష్ట్యాన్ని , కథలనీ, క్రమానుగతంగా దృశ్య రూపంలో వ్రాసిన కదంబ మాలిక )

(దృశ్యము-----1 నైమిషారణ్యం )

( పాత్రలు--- సూత పౌరాణికుడు, శౌనకాది ఋషుల గుంపు )

శౌనకుడు_____ సూత మహర్షీ ! ‘వరాహ, భవిష్యోత్తర, స్కాంధ, లింగ ‘ పురాణాల లోని ‘శ్రీ వేంకటేశ్వర’అర్చావతార విశేషాలను మాకు చెప్పి, మమ్ములను ధన్యులను చెయ్యండి.

సూతుడు _____ శౌనకమునీ ! పురాణములన్నియు మనుజుల మనుగడను, సుఖమయ మొనర్చుటకే వ్రాయబడినవి. పునీత భారత దేశము ప్రసిద్ధి నిలుపుటకు, ఉపయుక్తములయిన సంస్కారముల దెల్పు, నిర్మల దర్పణములు యీ పురాణములు !

1 ఋషి ____ సూత మహర్షీ ! ‘శ్రీ వేంకటేశ్వరుడు’ అనగా ఎవరు ?

2 ఋషి____ శ్రీ రామ చంద్రుడు, శ్రీ కృష్ణుడు, వంటి మహా విభూతిలె గాక, అర్చావతారము నెత్తుటకు కారణ మేమి ?

సూతుడు _____ మునులారా ! ‘శ్రీ వేంకటేశ్వరుడు, ‘వేం’అనగా పాపములను, ‘కట‘అనగా నశింప జేయు ఈశ్వరుడు. పేరులో ఈశ్వర శబ్దం, వచ్చినంత మాత్రమున యీతఢు ‘శివుని’మూర్తియని భావించుట తగదు . ఇతడు సాక్షాత్తు ‘వైకుంఠము ’నుండి విచ్చేసిన ‘శ్రీ మన్నారాయణుడు’!

3 ఋషి ______ భగవత్తత్వము ఎన్ని రూపాలుగా ఉంటుంది ?

సూతుడు _____ ఆగమాలు భగవత్తత్వము అయిదు రూపాయని ఘోషిస్తున్నాయి ! అవి, “పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా రూపాలు “ సత్య, జ్ఞాన, ఆనంద రూపమై, సమస్త కారణ భూతమైన ‘శ్రీమన్నారయణుడే; పరతత్వము ! ఆ పరతత్వమే సృష్టి,, స్థితి, లయాలను, మోక్ష ప్రదానాదులను చేయడానికి వ్యూహాలుగా, భాసిస్తుంది !! ఈ వ్యూహాలు ‘వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ’నామాలతో ప్రకాశిస్తున్నాయి.

4 ఋషి______ ఈ వ్యూహాలు ఏ విధంగా పని చేస్తున్నాయి ?

సూతుడు _____ పర తత్వం, పరిపూర్ణ గుణ భరితమైనది . ఇది వైకుంఠంలో జీవన్ముక్తులయిన వారిచేత, పూజింప బడుతుంది. తక్కిన మూడు వ్యూహాలలో ఒకటి క్షీర సాగరంలో ఉంఢి, జగద్రక్షణ అవసరమయి నప్పుడు అవతార రూపం పొందుతుంది. అలా వచ్చినవే మన శ్రీరామాద్యవతారాలు !! వీటినే ‘విభవాతారాలంటారు’ అవి ఆ యా కాలంలోని వారికి తప్ప తరువాతి కాలం వారికి అందుబాటులో ఉండవు.

1 ఋషి _____ అంతర్యామి వ్యూహం ఎలా క్రియాన్విత మవుతుంది?

సూతుఢు____ ఈ వ్యూహం జీవునిలో అణువై, అంతర్యామిగా ఉంటుంది. హృదయంలో ఉన్న దైవాన్ని దర్శించడం అంత సులభం కాదు !!

2 ఋషి_____ మరి అర్చా వ్యూహం సంగతేమిటి ?

సూతుఢు ____ ఇంత వరకు చెప్పిన ‘పర, విభవ, అంతర్యామి’వ్యూహాలు అనుభవ సులభాలు కావు ! అందుకే శ్రీ కృష్ణభగవానుడు భగవద్గీతలో, ‘ఆర్తులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు, అర్ధార్థులు, అనే నాలుగు రకాల భక్తులు, ఏ రూపాన తనను సేవిస్తారో, ఆ రూపంలోనే పరిపూర్ణ ఫలాన్ని ఇస్తానని చెప్పాడు.

3 ఋషి ______ సూత మహర్షీ ! మీ దయ వలన అర్చామూర్తి యొక్క వ్యూహరచన తెలిసింది.

4 ఋషి____ అర్చామూర్తిని ఆరాధించిన వారు, పరతత్వ స్వరూపాన్ని సేవించేవారి ఫలాన్ని అందుకో గలరా ?

సూతుడు ____ అందుకు సందేహం లేదు. అందుకే శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తులను ఉద్ధరించేటందుకు, శ్రీ వేంకటేశ్వరునుగా అర్చావతారం ఎత్తాడు.

శౌనకుడు _____ సూతమహర్షీ ! మన భాగ్యవశమున అవతరించిన ఆ మహావిష్ణువు కథ మాకు తెలియ జేయండి.

అందరూ ____ అవును, సూతమహర్షీ ! కథా ప్రారంభం చెయ్యండి.

***************************
( దృశ్యము 2----- వైకుంఠంలో శ్రీమహావిష్ణువు , తన దేవేరులతో సేవ లందుతూ ఉంటాడు)

( పాత్రలు----- శ్రీ మహావిష్ణువు, శ్రీదేవి , భూదేవి, ఆదిశేషుడు పాన్పు రూపంలో )

( అదే సమయంలో ఒక శ్లోకం వినిపిస్తుంది. )

శ్లోకం _____” శాంతాకారం, భుజగ శయనం, పద్మనయనం, సురేశం
విశ్వాకారం, భువన సదృశం, మేఘవర్ణం, శుభాంగం
లక్ష్మీ కాంతం, కమల నయనం, యోగిహృద్యాన గమ్యం,
వందే విష్ణుం, భవ భయహరం, సర్వ లోకైక నాథం.

( శ్రీ మహావిష్ణువు, శ్లోకం విని దిగ్గున లేస్తాడు. అతని పాదాలని ఒత్తుతున్న శ్రీదేవి అలుగుతుంది.)

విష్ణు _____ శ్రీ దేవీ ! ఎవరో భక్తుఢు----

శ్రీదేవి ______ అవున్లెండి ! శ్రీవారి శ్రోత్రాలకి, అప్పుడే స్తోత్ర పాఠాలు వినిపించాయి ! ఇక యీ శ్రీదేవి, ఆ భూదేవి, మేమెందుకు లెండి.

విష్ణు ______ అది కాదు దేవీ ! ఇతడెవరో సామాన్యుడు కాదు -----

శ్రీదేవి _______ సామాన్యుడో, మహామాన్యుడో, ఎవరయితేనేం !! ఏకాంత సేవకి అంతరాయం కలిగించాక ?

భూదేవి _______ అక్కా ! అతడెవరో కాదు, సాక్షాత్తు వాయుదేవుఢు !! శ్రీవారి దర్శనార్థం, వైకుంఠానికి తన అసామాన్య వేగంతో వేంచేస్తున్నాఢు !

విష్ణు _____ వాయుదేవుల వారు వస్తున్నారా ! వారి రాకకు కారణ మేమిటో ?

శ్రీదేవి _______ వచ్చిన తరువాత ఎలాగూ తప్పదు ! ఇప్పటి నుంచీ కార్యకారణాల చర్చ దేనికి ? నువ్వేమంటావు, చెల్లీ ?

భూదేవి _____ అక్కా ! విషయం ముందుగా తెలుస్తే, సత్వరం చక్కబెట్టి, పంపించెయ్య వచ్చు !

విష్ణు ( భూదేవితో )___ వాయుదేవుని రాకకు కారణము నీకు తెలియునా దేవీ ?

భూదేవి _____ ప్రభూ ! కృతయుగంలో మీ వైకుంఠ విహారానికి, ఇక్కడ ఒక క్రీడాద్రి ఉంఢేది కదా ?

శ్రీదేవి _____ అవును, స్వామివారు భూలోక విహారానికి బాగుంటుందని, దానిని వైకుంఠం నుండి భూలోకానికి తరలించారు
.
భూదేవి _______ అవునక్కా ! భూలోక వాసులు, ప్రభువుల వారి వినోద చిహ్నంగా దానిని ఆనంద గిరి అని పిలుస్తున్నారు. మేరు పర్వతుని కుమారుడైన ‘క్రీడాద్రి,’ భువికి చేరి, ‘ఆనందాద్రి' అయింది. ఇప్పుడా ఆనందాద్రి సమీపంలో, అంజనాదేవి తపస్సు చేసిన ఆశ్రమ ప్రాంతంలో--- ప్రకృతి వైపరీత్యం ఎక్కువయింది !

విష్ణు _____ ప్రకృతి వైపరీత్యమా దేవీ ?

భూదేవి ______ అవును ప్రభూ ! ధూళితో కూడిన తుఫానులు, రాళ్ల వర్షాలు పడి, సంక్షోభం చెలరేగుతోంది. నీటి కొరత ఏర్పడి సెలయేర్లు కాలువల లాగ, చెరువుల గోతుల్లాగ మారిపోయాయి. రాళ్ల తాకిఢికి, నిప్పురవ్వలు చెలరేగి, అడవుల దగ్ధమవుతున్నాయి. దీనికి కారణం తెలియని ప్రజలు ఈ దుర్గతికి, వాయుదేవున్ని దుయ్యబఢుతున్నారు.

విష్ణు _____ భూదేవీ ! నీ అభిప్రాయం ఏమిటి , కారణం వాయువు కాదంటావా ?

భూదేవి _____ ప్రభూ ! సర్వజ్ఞులయిన మీకు చెప్పాల్సిన పని ఏముంది ! అల్ప పీడనం కల చోట వాయుగుండం లేవక తప్పదు ! ప్రళయకాల ఝంఝూ మారుతమే, అక్కఢి ప్రజల సమస్య !

విష్ణు _____ గరుత్మంతుడు, నా క్రీడాద్రిని సరియైన స్థలంలో, తూర్పు సముద్రానికి మరికాస్త పడమటిగా, సువర్ణముఖరీ నదికి ఉత్తరంగా మరో క్రోసుడు దూరంలో నిలిపి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు !

శ్రీదేవి _____ చెల్లీ ! కాల విశేషాలకి తగ్గ పవనాలు అక్కడ వీచాలంటే, అల్ప పీడనం నశించాలంటావా ?

భూదేవి ____ అవునక్కా ! దానికి శ్రీవారు చెప్పినది, అదే ---- ఆనందాద్రిని మరో క్రోశెడు దూరంలో నిలపడమే సరియైన మార్గము.

విష్ణు ____ మార్గములు, మార్గాంతరములతో నాకేమి సంబంధము ? నా దేవేరులతో లభ్యమయిన ఏకాంతాన్ని భంగం చేయడానికి వస్తున్న యీ వాయువును రానివ్వకూఢదు. ఏమందువు శ్రీదేవీ ?!

శ్రీదేవి _____ శ్రీవారికి ఇంతకాలానికి, చక్కని ఆలోచన వచ్చిందంటాను. ( నవ్వుతుంది )

విష్ణు _ ( చిరునవ్వుతో ) దేవీ ! నీ అభిమతము నా కెప్పుడూ శిరోధార్యమే ! ( అని ప్రక్కనే పాన్పులా పడిఉన్న ‘ఆదిశేషుని ‘తట్టి పిలుస్తాడు ) ఆదిశేషా !!

( ఆది శేషుఢు మానవ రూపంలో ప్రవేశిస్తాడు )

ఆదిశైష ____ ప్రభూ ! ఆజ్ఞ !!

విష్ణు ____ ఆదిశేషా ! వైకుంఠానికి దూసుకు వస్తున్న వాయువుని అడ్డగించే సామర్థ్యము నీకే కలదు.

ఆదిశేష ____ ఆజ్ఞాపించండి ప్రభూ ! నా కర్తవ్యమేమిటి ?

విష్ణు _____ మేము మా కాంతులతో ఏకాంతాన్ని కోరుతున్నాం. నీవు సింహద్వారము దగ్గర కాపలా ఉండి, వాయువును లోనికి రానియ్యక నిరోధించవలె !

ఆదిశేష ____ ప్రభూ ! ఆజ్ఞా ప్రకారము అటులనే చేసెదను. --- కాని మీ పాన్పు----

విష్ణు _____ (విసుగుతో ) మేము మరో పాన్పుపై విశ్రమించెదము అనంతా ! ఇది కూడ సందేహమేనా ?

ఆదిశేష _____ చిత్తం ప్రభూ ! అటులనే చేసెదను. ( ఆదిశేషుడు వెళ్లిపోతాడు )

***********************

Comments

  1. అద్భుతప్రయోగం మీలక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాను

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ