Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--6

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన--6

( దృశ్యము –18)

( వైకుంఠము. శ్రీ మహావిష్ణువు పాన్పుపై అరమోడ్పు కనులతో పడుకొని ఉంటాఢు . శ్రీ మహాలక్ష్మి అతని పాదసేవ చేస్తూ ఉంటుంది ).

(భృగుడు ప్రవేశించి ఆ దృశ్యాన్ని చూస్తాడు )

భృగుడు ----- ( తనలో ) జామాత అరమోడ్పు కనులతో శయనించి ఉన్నాడు ! అనిమేష నయనుని నయనాలు, అరమోడ్పు లయినవి !! ఇక నా ధుహిత --- పతి పాద సేవలో ప్రపంచమునే మరిచినది !! వీరిరువురు యీ విధమున నుండిన భూలోక వాసులు సిరి సంపదలకు కరువైన వారయి, కడగండ్ల పాలవక తప్పదు !!!
శ్రీవారు ప్రమత్తులయి శయనించి ఉన్న సమయమిది ! -- ఇదే మంచి సమయము--- లక్ష్మిని జాగృతమొనర్చెదను గాక !!

( భృగుడు నేరుగా వెళ్లి, శ్రీ మహావిష్ణువు గుంఢెల పైన కాలితో తంతాడు )

( లక్ష్మి అదరి పడుతుంది ! విష్ణువు ఉలిక్కి పడతాడు. దిగ్గున లేచి భృగుణ్ని చూస్తాడు )

విష్ణు ---- తమరా, మహర్షీ ?! ( అని భృగువు దగ్గరగా వస్తాడు ) మీ రాక గమనించి గౌరవించ నందుకు, మంచి శాస్తియే చేసితిరి. భృగు మహర్షీ, మీరు సామాన్యులు కారు ! ( పద్యము )

సీ --- ద్విదళ సరోజమౌ , దివ్య చక్రం బీవు/ భ్రూమధ్యమున నున్న బుద్ధి వీవు
కన్నులలో నుండు, కాంతి పుంజంబీవు/ చింతచే నందెడు చింత నీవు
నిన్ను చేరనివారు నా దరికేగరు / నీదు పదములాన నీరజాక్ష !
కౌస్తుభంబు తగిలి కందెనా పాదంబు / భాద కలిగెనేమొ భధ్ర చరిత !

( అని మహర్షిని పాన్పుపై కూర్చోబెట్టి, అతని వామ పాదం పిసుకుతూ --)

ఆ.వె--- మౌనివర్య ! నన్ను మన్నించి గావుమా
పాదములను బట్టి ప్రణతు లిడుదు
తన్ని నందుకేను, చింతింప లేదయ్య
భరతాక్ష్మాకుమార , భృగు మహర్షీ !!

( అంటూ కాలిలో నున్న కంటిని పొడిచి, మూసివేస్తాడు )

భృగుడు ---- శ్రీ మహావిష్ణూ ! నీవు కదా సత్త్వగుణ సంపన్నుడవు ! ---( పద్యము )

ఆ.వె--- సారసాక్ష ! వినుము, సత్ర యాగంబును,
చేయదలచినారు, సప్త ఋషులు
వారి పిలుపు నంది, వస్తి నే నిచటకు
సత్త్వ పురుషు నెన్ను సంబరమున
కాని, యెంచి చూడ కమలాక్ష నీకన్న
యజ్ఞ పురుషు డెవరు, యదువరేణ్య !!

(అని స్తుతించి ) ప్రభూ ! యాగ ఫలమును తమరే స్వీకరింప వలెను !

విష్ణు ----- భృగు మహర్షీ ! అట్లెయగు గాక !

***************************

(దృశ్యము 20 )

( భూలోకంలోని ఆనందగిరి. ఆదిశేషుడు , పర్వత రూపంలో తపస్సు చేస్తూ ఉంటాడు )

ఆదిశేష--- ఓం , హ్రీం, హ్రీం, శ్రీం, శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః

( అదే గిరి మీద, చింత చెట్టు క్రింద, చీమల పుట్ట, ఆ పుట్ట లోంచి, పిపీలకుడు తపస్సు చేస్తూ ఉంటాడు )

చీమ -- ( పుట్ట లోంచి ) ఓం , హ్రీం, హ్రీం, శ్రీం, శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః

*********************

( దృశ్యము 21 )
( భూలోకంలోని ద్వారకా తిరుమల ప్రాంతం.! అక్కడే ఉన్న ఒక కుంకుడు చెట్టు క్రింద ద్వారకా ఋషి ఒంటి కాలిపై నిలబడి, తపస్సు చేస్తూ ఉంటాడు )

ద్వారక ------ ఓం , హ్రీం, హ్రీం, శ్రీం, శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః

*******************

( దృశ్యము 21 )

( ఆకాశం--- నారదుడు ఆకాశం నుండి ఆదిశేషు, పిపీలక, ద్వారకల తపస్సు చూస్తాడు )

నారద ----- అనంతా ! నీకీ మంత్రాన్ని నేర్పిన భృగుమహర్షిని, నిజంగా అభినందించాలి ! నారాయణునితో పాటు, లక్ష్మి కూడా ప్రసన్నమవుతేనే, నీ శిరస్సుపై స్వామి ఆగమనం జరుగుతుందనేది భృగుని ముందు చూపు ! --- నిన్ను తపస్సుకి పురికొల్పి, భృగుడు --- సప్తర్షులు తల పెట్టిన యాగానికి యజ్ఞ పురుషుని ఎంచే నెపంతో, విష్ణు వక్షస్థల వాసిని అయిన లక్ష్మిని తన్నినట్లే తన్ని, రోష పూరితురాలిని చేసాడు ! భూమిక సిద్ధమయింది ! నా పాత్రను నేను నెరవేర్చెదను గాక ! నారాయణ , నారాయణ !! ---( అంటూ వైకుంఠం వైపు దారి తీస్తాడు )

***********************

( దృశ్యము 22 )

( వైకుంఠము . శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి భూదేవి ఉంటారు. నారదుడు ప్రవేశిస్తాడు )

నారద --- నారాయణ, నారాయణ !! విశేషమైన శ్రవణ శక్తి గల లక్ష్మీ వాసుదేవులకు నా నమస్కారములు !
తల్లీ ! భూదేవీ !! నీకును నా నమస్కారములు !!

భూదేవి ----- నారదా ! నీ మాటలలో లక్ష్మీ వాసుదేవుల శ్రవణ శక్తి ప్రసక్తి ఏల ?

నారద ----- తల్లీ ! భూదేవీ ! నీకు తెలియని విషయమా ఇది ! నీ లోకంలో ఒక చీమ, ఒక పాము, మరొక ఋషి, ఉగ్ర తపస్సు చేస్తున్నారు ! వారి తపస్సుకు లోకములు తల్లడిల్లు తున్నాయి ! – ప్రభూ ! మీరు వైశ్రవణులు ! మీ కర్ణ పుటములకు ఇంకా వారి పిలుపు అందలేదా ?

విష్ణు ----- నారదా ! ఆదిశేషుడు , లక్ష్మీ ప్రసన్నం కోరుతున్నాడు ! నాతో పాటు లక్ష్మి రానిదే , నేను ఒంటరిగా ఎటుల వెళ్లగలను ?

నారద ---- తల్లీ ! శ్రీ దేవీ !! శ్రీవారి చిత్తము భక్తుని కడకు పోవుటకై త్వరపడుచున్నది ! మీరు ఉపేక్షించుట తగునా ?

శ్రీ దేవి ---- నారదా ! స్వామి భూలోక వాసులయిన యీ వైకుంఠమున ఎవరుండ గలరు ?

నారద --- తల్లీ ! నీ వెక్కడ నున్న శ్రీవారి కదియే వైకుంఠము కాగలదు !

శ్రీ దేవి ----- అయన నన్ను కూడ భూలోకమునకు పొమ్మందువా నారదా ?

నారద ----- తల్లీ ! వైకుంఠమున నీకు గౌరవ మెక్కడిది !? మొన్నననగా మొన్న భూలోక వాసియైన , భృగు మహర్షి వచ్చి, నీ నాథుని వక్ష స్థలమును తన్ని పోయినాడు ! --- తన్నిన వాడు బ్రాహ్మణుడని చెప్పి, దయాసాగరుడైన నీ నాథుడు అతనిని క్షమించి విడిచి పెట్టాడు !! కాని--- అతని వక్షస్థలమందు సదా నివసించే నీకు కలిగిన పరాభవము గురించి తలుపనైన తలపడు !!!

శ్రీదేవి ----- నిజమే నారదా ! భృగుని చేత అవమానము పాలైన నాటినుండి, నాకీ వైకుంఠము నందు, మనసు నిలుచుట లేదు ! స్వామి వచ్చినను రాకున్నను, నేనీ లోకమును విడిచి పోవుటకే తలచు చున్నాను !

విష్ణు ----- దేవీ ! నీవు వెడలిన చోట నీ నాథుడు, నిముషమైన మనజాలడు ----

నారద ---- తల్లీ ! శ్రీవారు ఇచ్చకపు మాటలాడుచున్నారు !!

శ్రీదేవి ----- అవును నారదా ! అవమానము జరిగినది నాకు ! అతనికి కాదు గదా !?

విష్ణు ----- దేవీ ! అటులైన -----

శ్రీదేవి ------ నేనీ వైకుంఠము వదిలి వెళ్లుటకు నిశ్చయించితిని ! ( అంటూ శ్రీదేవి అంతర్థానమవుతుంది )

విష్ణు ----- దేవీ ! శ్రీ దేవీ !!-( నారదుని వైపు చూసి-- ) నారదా ! ఎంత పని చేసితివి ? భృగు వృత్తాంతము జ్ఞాపకము చేయుట ఏల ? -- ఇప్పడేమి చేయ వలెను !?

నారద ----- స్వామీ ! నేనే పాపము ఎరుగను ! ఏదో ప్రసంగ వశమున భృగుని పేరెత్తితిని గాని --

విష్ణు ----- నారదా ! నా కొంప ముంచితివి ! లక్ష్మి లేని వైకుంఠము నా కేల ?-- ( అని విష్ణువు కూడ అంతర్థానమవుతాడు )

నారద ---- తల్లీ ! భూదేవీ !! అందరూ నీ లోకానికే చేరుకొన్నారు. ఆదిశేషుని కోరిక తీరే సమయం ఆసన్నమయింది . మరి నీవు ---- ?

భూదేవి ----- లక్ష్మీ వాసుదేవులు బహుశా ఆనంద గిరికే వెళ్లి ఉండవచ్చును ! నేను ముందుగానే అక్కడ వెలసిన ఆది వారాహ స్వామి సన్నిధిని చేరెదను గాక !!-----( భూదేవి కూడ అంతర్థానమవుతుంది )

నారద ---- ఆహా ! విధి వైపరీత్యమనిన ఎంత బలమైనది ! --- వైకుంఠము వంటి భవ్య నివాస సౌధమునకు కూడ కళావిహీనమగు దుస్థితి కలుగ గలదని ఎవరూహించెదరు !! -- ఈ విషయమును కైలాస పతికి, బ్రహ్మదేవునికి తెలియ జేసి, శ్రీ మహావిష్ణువు భూలోక గమనాన్ని ఒక కంట కనిపెట్టి ఉండమని చెప్పవలె !! ( అంటూ నిష్క్రమిస్తాడు )

***************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద