Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—7

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—7

( దృశ్యము 23 )

( బ్రహ్మలోకం-- బ్రహ్మ జపమాలతో జపం చేస్తూ ఉంటాడు )

( నారదుడు ప్రవేశం )

నారద ------ నారాయణ, నారాయణ !

( బ్రహ్మ కళ్లు తెరచి చూస్తాడు. నారదుని వంక చూసి చిరునవ్వు నవ్వుతాడు )

నారద ----- జనకా ! నమస్కారములు !

బ్రహ్మ ----- వత్సా ! ఆశీస్సులు ! నీవు వచ్చిన కారణము ?

నారద ---- విధాతా ! కాల వైపరీత్యము వల్ల లక్ష్మీదేవి రసాతలమును, వైకుంఠమును వదిలి, భూతలమునకు ఎటు వెళ్లినదో తెలియనీయక మాయమైనది !,

బ్రహ్మ ---- నారాయణుడు కూడ, ఆమెను వెదకుచు భూలోకమునకు బయలుదేరెను, అదియేనా ?—

నారద ____ అదేయే జనకా ! వారిరువురు పోయిన జాడ తెలియక, నా మనసు ఆతుర పడుచున్నది !

బ్రహ్మ ---- నీ మనమున ఆత్రుతయా ! కలహమును ఎగత్రోసి, వారిని వేరుచేసినది నీవు ! ఇప్పుడు ఆతుర నందుట చిత్రముగా నున్నది !

నారద ----- తండ్రీ ! మీరిటుల అపహాస్యము చేసిన నేనేమి చెప్పగలను ? వైకుంఠమా రిక్తమయినది ! స్వామి భ్రమణ శీలులయినారు ! భక్తులకు వారి దర్శనమెట్లు కాగలదు ?

బ్రహ్మ ----- యోగ దృష్టితో అంతరంగమున , వారి దర్శనము చేయలేవా నారదా ? ఇంత బేలతన మేల ?

నారద ----- తండ్రీ ! ఇది నా ఒక్కని సమస్య కాదు గద !

బ్రహ్మ ----- ( నవ్వి ) అర్థమయినది నారదా ! లక్ష్మీ నారాయణులు అవతారము లెత్తిన సమయమున, శ్రీ సూర్య నారాయణుడే, నారాయణుడన్న మాట మరచితివా ? వారెటు పోయినది, కర్మ సాక్షి అయిన ఆయనకే తెలియనోపును !

నారద ----- తండ్రీ ! నాకు సెలవీయుడు ! నేను సూర్యనారాయణుని కడకు, వెళ్లి వచ్చెదను ! ( అంటూ నిష్క్రమిస్తాడు )

****************

( దృశ్యము 24 )

( సూర్యలోకం. సూర్యుడు కూర్చొని ఉంటాడు. ప్రవేశం నారదుడు )

నారద ----- నారాయణ, నారాయణ !

సూర్య ----- నమోవాకములు నారద మహర్షీ ! బ్రహ్మలోకము నుండియే కదా మీ రాక ?

నారద ----- అవును సూర్యనారాయణా ! జగచ్ఛక్షువయిన నీకు, నా రాకపోకల పరిశిలన కేమి గాని, శ్రీ లక్ష్మీ నారాయణుల జాడ, తెలియ జేసిన బాగుండును !

సూర్య ----- నారద మహర్షీ ! శ్రీ దేవి, భరత వర్షమున, గంగానదికి పశ్చిమ భాగాన ఉండే, “ కరివీర పురమును’ ( కొల్హాపూరు ) చేరి తన దశ దిశలయందు యోగినీ గణములను కొలువుంచి, తన జాడ శ్రీ నారాయణునికి తెలియకుండ జాగ్రత్త పడి తపస్సు చేయుచున్నది ! మహర్షీ ! ఇది దేవ రహస్యము !!

నారద ---- అటులనా పద్మమిత్రా ! మరి నారాయణుని మాట ఏమిటి ?

సూర్య ----- దేవర్షీ ! శ్రీవారు లక్ష్మిని వెతుకుతూ, భ్రమణ శీలురై కాశీ, విశ్వనాథుని దగ్గర ఉన్నారు ! చూడండి !---

( సూర్యుడు నారదుడు కాశీ వైపు చూస్తారు )

******************* ‘

( దృశ్యము 25 --- కాశీ విశ్వేశ్వరాలయం. విష్ణువు లింగానికి నమస్కారం ధ్యానం చేస్తూ, కనిపిస్తాడు )

విష్ణు ----- “బ్రహ్మ మురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం,
జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదాశివ లింగం.
దేవముని ప్రవరార్చిత లింగం, కామదహన కరుణాకర లింగం
రావణదర్ప వినాశక లింగం. తత్ప్రణమామి సదాశివ లింగం.
సర్వసుగంధ సులేపిత లింగం, బుద్ధివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందిత లింగం, తత్ప్రణమామి సదాశివ లింగం --- “

*********************

( దృశ్యము 26-- సూర్య లోకం )

( సూర్యుడు, నారదుడు ఉంటారు )

నారద ---- భాస్కరా ! ప్రభువు కోసం, ఆదిశేష, పిపీలికులు శేషాచలమందును. ద్వారకా ఋషి, కుంకుడు చెట్టుక్రింద తపస్సు చేస్తున్నారు. లక్ష్మీదేవి తన జాడ తెలియనీయక కాపలా పెట్టుకొన్నది ! అందరూ తలో దిశా తపస్సు చేస్తున్నారు ! స్వామి కనీసం భక్తుల దగ్గరకి చేరేది ఎట్లాగ ?

సూర్య ----- నారద మునీ ! మీకు తెలియని సమయాచారములు లేమున్నవి ? నారాయణునికి ఇష్టమైన తిథివారనక్షత్రాదులు మీకు తెలియవా ? వాటి నన్నింటిని కాలవశమున ఒక చోట చేర్చగలిగిన మీ సంకల్పము నెరవేర గలదు !

నారద ---- అర్థమయినది, సూర్యనారాయణా ! నీ కిష్థమయిన మాసము ఏది ?

సూర్య ----- భాద్రపద మాసము ! ఆ మాసమందే నేను స్వక్షేత్రమయిన సింహరాశిలో సంచరించు చుందును !

నారద ---- వారము ?

సూర్య ---- శ్రీవారు ఒకరికి ఒక విషయమునే అనుగ్రహించెదరు. అందువలన వారము, సోముని వారము !

నారద ---- అయన సోమవారమన్నమాట ! తిథి, నక్షత్ర యోగాదులు-----?

సూర్య ----- మహర్షీ ! యీ జ్యోతిషాంగములన్నియు చంద్రుని అధీనములు గాదా ?

నారద ---- మంచిది, అటులయిన నేను చంద్రుని కడకు పోయి, తెలుసు కొనెదను గాక !

******************

( దృశ్యము 27 . చంద్రలోకం. )

(చంద్రుడు నక్షత్రకాంత శ్రవణం ఉంటారు, ప్రవేశం నారదుడు )

నారద ----- నారాయణ, నారాయణ !

చంద్ర ------ నారద మునీంద్రులకు స్వాగతం !

శ్రవణం ------ దేవర్షీ ! ఇటు ----- వచ్చి ఆశీనులు కండు .

నారద ---- దక్షపుత్రీ ! కార్యార్థుడనై వచ్చిన వాడను, సుఖాశీనుడ నెట్లు కాగలను ?

చంద్ర ----- మునీంద్రా ! అంత అవసర పడి, వచ్చినారా ?

నారద ----- అత్యవసరమగు కార్యము ! చంద్రా, స్వామి నారాయణుడు, భూలోకమున భ్రమణ శీలుడై సామాన్యుని వలె సంచరించు చున్నాడు. అతని సన్నిధి కొరకు, ఉగ్ర తపము చేయుచున్న ఆదిశేష, పిపీలికల వద్దకు శ్రీవారిని చేర్చ వలెను ! అందుకు నీ వల్ల కాగల కార్యములు -----

చంద్ర ----- ఆజ్ఞాపించండి, మహర్షీ ! తప్పక నెరవేర్చ గలను !

నారద ----- శ్రీవారు భాద్రపద మాసమందలి సోమవారము నాడు, వల్మీకమును చేరగలరని సూర్యుడు చెప్పినాడు. తక్కిన జ్యోతిషాంగ విషయములు నీకు తెలిసిన నా పని సులభము కాగలదు !

చంద్ర ----- మహర్షీ ! శ్రీవారు రామావతారమున చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రమున జన్మించినారు. శ్రీకృష్ణునిగా శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రమున జన్మించినారు ! రాబోవు భాద్రపద మాసమున యీ నక్షత్రములలో ఏవియు వచ్చుట లేదు !

నారద ---- మరి ఏ నక్షత్ర కాంత నీతో జత కూడనున్నది , చంద్రా ?

చంద్ర ----- ( నక్షత్ర కాంత శ్రవణాన్ని దగ్గరగా తీసుకొని ) ఇదుగో ఈమెయే నా చెంత చేరనున్నది !

నారద ----- దక్షపుత్రీ ! నీ నామ మేమి ?

శ్రవణం ----- శ్రవణము, దేవర్షీ !

నారద ----- ఆహా ! శ్రవణానంద కరముగా నున్నది ! శ్రీవారు విశేష శ్రవణ శక్తి గల వైశ్రవణులు కదా ! అందు వల్ల ఆ భాగ్యము నీకే దక్కగలదు !!

శ్రవణం ----- ధన్యురాలను దేవర్షీ ! నాతో పాటు ఆ రోజు ద్వాదశి తిథి, సిద్ధయోగము జత కలువ గలవు !

నారద ---- మంచిది చాల బాగున్నది ! భాధ్రపద శుక్లద్వాదశి సోమవారము శ్రవణా నక్షత్ర యుత సిద్ధ యోగము కలిసిన పంచాంగ శుద్ధి దినమున, శ్రీవారిని శేషాద్రికి చేర్చవలె ! ---- ఇక నాకు సెలవిండు, పోయి వచ్చెదను గాక !

******************

( దృశ్యము 28 )

( కశ్యప మహర్షి ఆశ్రమము. కశ్యపుడు, అతని భార్య అదితి ఉంటారు )

నారద ---- ( ప్రవేశించి ) నారాయణ, నారాయణ !

కశ్యప ---- వత్సా నారదా ! రమ్ము, సువర్లోక విశేషములు విని చాల కాలమైనది !

నారద ---- కశ్యప మహర్షీ ! సువర్లోకమున ఇప్పుడు విశేషము లేమున్నవి ! స్వామి నారాయణుడు ఇప్పుడు వైకుంఠమున లేడు, ఆ విషయము మీకు తెలియదా ?

అదితి ------ తపోదిక్షలో ఉన్న మహర్షికి ఆ విషయములు ఎట్లు తెలియగలవు , నారదా ? అవి అన్నియు నేనతనికి సావకాశముగ చెప్పెదను ! ముందు నాకీ విషయము చెప్పుము ! నా కొడుకు నారాయణుడు ఎక్కడున్నాడు ? కోడలు లక్ష్మి ఏమి చేయుచున్నది ?

నారద ----- పుణ్యశీలీ, అదితి మాతా ! నీ కోడలు అలిగి, సంసార బంధములు త్రెంచుకొని కరివీర పురమున ( కొల్హాపూరు ) యోగినీ గణముల సేవలో, కొలువు తీరినది ! స్వామి ఆమెను వెదకుచూ, తీర్థ యాత్రలు చేయుచున్నాడు.

అదితి ---- ( దుఃఖంతో ) ఇన్ని కష్టాలలో ఉన్నా వానికి నేను జ్ఞాపకం రాలేదు ! కష్ట సమయాలలో లోకులకు, ' అమ్మ' జ్ఞాపకం వస్తుందంటారు ! అందరి కష్టాలు తీర్చేవాడైన నా కొడుకుకి, -- అమ్మ జ్ఞాపకం ఉంఢధు !!

కశ్యప ------- నారదా ! భూలోకమునకు వచ్చిన నారాయణుడు , చేరవలసినది నా ఆశ్రమానికి లేదా ఉగ్ర తపము చేయుచున్న ఆదిశేషుని కడకు , ఇటు అటు కాక ఎటో తిరుగుట వలన ఏమి ప్రయోజనము ?

నారద ---- అందుకే నేను మీ కడకు వచ్చితిని. మీరు అతనికి సరియైన మార్గము నిర్దేశించండి !

కశ్యప ------ నారదా ! శేషాచలమే అతనికి సరియైన మార్గము గమ్యము కూడ ! అందు ఎన్నెన్నో తీర్థములు గలవు ! వాటిలో ‘దేవతీర్థము’ ఒకటి ! ఆ తీర్థములో శ్రవణా నక్షత్రయుత సోమవారము నాడు స్నాన మాడినచో సకల సౌభాగ్యములు కుటుంబ సౌఖ్యము కలుగ గలవు !

నారద ---- (సంతోషంతో ) మహర్షీ ! ఏమని సెలవిచ్చితిరి !! శ్రవణా నక్షత్రయుత సోమవారమా !!! ఆహా ఏమి యాదృశ్చిక సంఘటన !! మీ నోట విధాతయే ఇట్లు పలికించినాడు !

కశ్యప ---- నారదా ! శ్రవణముతో కూడిన సోమవారమునకు ఇంకేమైనా విశేషములు కలవా ?

నారద ----- మహర్షీ ! ఇంత వరకు మీరు చెప్పిన విశేషము తప్ప మరేమియు లేదు ! కాని ---- మీరు సంకల్పించిన --- బహుళ ప్రయోజనము చేకూర గలదు ! సూర్య చంద్ర తారకాది జ్యోతిషాంగములతో చర్చించి, రాబోవు భాధ్రపద మాసము , ఇందువారము ద్వాదశి తిథి, శ్రవణానక్షత్ర సిద్ధయోగ నందు, శేషాచల ప్రవేశానికి ముహూర్తము పెట్టి మీ కడకు వచ్చినాను ! మీ నోట కూడ అదే మాట వినుట ---- ఆడబోయిన తీర్థము ఎదురయినట్లు అయినది !

కశ్యప ----- నారదా ! నారాయణునికి అత్యంత ప్రీతి పాత్రుడవైన నీవు నిర్ణయించిన ముహూర్తము రిక్తము కాదు ! నేను నా పుత్రునికి స్వప్న దర్శన మిచ్చి, కర్తవ్యము గుర్తుకు తెచ్చెదను !

నారద ------ అదితి మాతా ! మీ అభిప్రాయ మేమిటి ?

అదితి ------ శేషాచలమే వానికి సరియైన నివాసము ! దేవకిగా నేను వానికి జన్మనిచ్చినా పాలిచ్చి, పోషించినది యశోదయే కదా ! ఇపుడా యశోద,, ‘వకుళ మాతగా’ జన్మనెత్తి ఆ కొండపైననే వాసము చేయుచున్నది !

నారద ------ అటులైన స్వామి శేషాచలమున మాతృ వాత్సల్యమును కూడ చవి చూడగలడు---- మీ అభిప్రాయము అదియే కదా అదితి మాతా ?!

అదితి ----- అవును నారదా ! తనయుడు తల్లి ఒడిని చేరుకొనుట కన్న కావలసిన దేమున్నది ?

నారద ---- కశ్యప మహర్షీ ! అదితి మాతా !! ఇక నాకు సెలవీయుడు. స్వామి దర్శనమును, శేషాచలమున చేయునట్లు నన్ను ఆశీర్వదింపుడు !

కశ్యప, + అదితి ----- తథాస్తు !!

******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద