Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—11

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన—11

( దృశ్యము 50 )

( వేంకటాచలము )

( రంగదాసు ఒక బావి తవ్వుతూ ఉంటాడు. ప్రవేశం వైఖానస ఋషి )

వైఖానస-- రంగదాసూ ! ఏం చేస్తున్నావు ?

రంగ -- ( చెమట తుడుచుకొంటూ ) బావి తవ్వుతున్నానండీ !

వైఖానస -- ఈ కొండమీద ఎన్నో సెలయేర్లు ఉండగా, యీ బావి దేనికయ్యా ?

రంగ -- నిజమేనండి ! అవన్నీ దిగువగా చాల దూరంలో ఉన్నాయండి. స్వామి పూజకని, ఇక్కడే పూల తోట వేశాను కదండి, కుండలతో నీళ్లు తెచ్చి, పొయ్యడం చాల కష్టంగా ఉందండి. అందుకని ఇక్కడే బావి తవ్వుతున్నానండి.

వైఖానస-- అదా విషయం ! స్వామివారి కైంకర్యానికే బావి తవ్వుతున్నా వన్నమాట ! మంచిదే, అలాగే కానియ్యి ! ( అని వెళ్లిపోతాడు )

( రంగదాసు నిష్ఠతో అలా తవ్వుతూనే ఉంటాడు. అలసినప్పుడల్లా, --)

రంగ --- వేంకటేశా ! గోవిందా ! ( అని సేద తీరుతూ ఉంటాడు )

*******************
( దృశ్యము 51 )

( వేంకటాచలం )

( స్వామి పుట్టకు కొంత దూరంలో, రంగదాసు, మరో ముగ్గురు కూలీలతో, ఆ పుట్టకి నాలుగు ప్రక్కలా గోడ కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు )

( ప్రవేశం వైఖానసుడు )

వైఖానస-- రంగదాసూ, ఏం చేస్తున్నావు ?

రంగ-- గోడ కట్టిస్తున్నానండి. అందుకని రాళ్లు పేరుస్తున్నాను.

వైఖానస-- ఇదంతా ఎందుకు రంగదాసూ ?

రంగ --- వానలు పడితే పుట్ట తడిసిపోదా అయ్యవారూ ! ఇప్పుడు నాలుగు వైపులా మూడడుగుల గోడైనా కడితే, తరువాత కర్రదుంగలతో, పైకప్పు వేసి గుడిశె వేయవచ్చు.

వైఖానస-- రంగదాసూ యీ పనులన్నీ చేయడం వల్ల స్వామి వారి తపస్సుకు అంతరాయం కలుగుతుందేమో !

రంగ --- సద్దు లేకుండా, పని చేయిస్తాను.

వైఖానస--- సరే ! ఈ పనిలో పడి, స్వామి పూజకు, పువ్వులు, తులసి దళాలు తేవడం మరువకు.

రంగ -- అలాగేనండి !

*******************

( దృశ్యము 52 )

( వేంకటాచలం లోని ఒక లోయ.! ఎగువున ఉన్న పూల తోటలో రంగదాసు పూలు కోస్తూ ఉంటాడు )

( ఆ లోయలోపల ఒక యక్షిణీకాంత నిల్చొని, తన ప్రియున్ని పిలుస్తూ ఉంటుంది. ఆమె పేరు క్షీరార్ణవ యక్షిణి )

క్షీరార్ణవ--- ప్రియా, నలకుబేరా ! ఇటు, ఇటు---( అని బిగ్గరగా పిలుస్తుంది )

( నలకుబేరుడు ఆమె వెనక నుండి, చప్పుడు చెయ్యకుండా వచ్చి, ఆమె కళ్లు మూస్తాడు . ఆమె అతని చేతుల పైన తన చేతులు వేసి, క్రిందకు లాగుతుంది. అతడు ఆమె మెడలో తన చేతులు హారంలాగ వేస్తాడు. క్షీరార్ణవ కోపం తెచ్చుకొంటూ-- )

క్షీరార్ణవ--- ఏమిటిది ప్రియా ! నా వెనకనే ఉండి, నన్ను ఎలుగెత్తి పిలిచేలాగ చేస్తున్నారు.

నలకుబేర-- ప్రియా ! అలా పిలిచేటప్పుడు, నీ గళంలోని నరాలు, బిగుసుకొని, వాటిలోంచి, క్షీరధారలు ఉబికి, నీ పేరు ‘ క్షీరార్ణవ’ అని చెప్పక చెప్తున్నాయి, తెలుసా !

( క్షీరార్ణవ అతని చేతులు విఢిపించుకొని, గోముగా అలుగుతుంది )

క్షీరార్ణవ--- ఏమంటిరి ప్రియా ! నా గళసీమలోని నరాలలో పాలు ప్రవహిస్తున్నాయా ? ఏమి హేళన !—

నలకుబేర-- హేళన కాదు ప్రియా ! ప్రియావలోకన !! నీ నరాలలో పాలు, నీ బుగ్గలలో పాలు, అంతెందుకు, నీ శరీరమంతా పాలు--- అందుకే నీ పేరు సార్థకం అయిందని అంటున్నాను.

( క్షీరార్ణవ సిగ్గు పడి దూరంగా పారిపోతుంది. నలకుబేరుడు ఆమె చెయ్యి పట్టుకొంటాడు )

క్షీరార్ణవ--- అబ్బ ! కాస్త మృదువుగా పట్థుకోండి !

నలకుబేర—ఒడిసి పట్టకుంటే, నువ్వు పాలనురుగులా జారిపోతావేమో !!

క్షీరార్ణవ-- మీ చేతికి చిక్కాక, జారిపోవధమూ, పారిపోవడమూ కాదు---

నలకుబేర-- మరి !---

క్షీరార్ణవ-- కలిసిపోతాను !

( ఇద్దరూ ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు )

( రంగదాసు చేస్తున్న పని మరచిపోయి ఆ జంటవైపు చూస్తూ ఉండిపోతాడు )

******************

( దృశ్యము 53 )

( స్వామి పుట్ట )

( వైఖానసుడు స్వామికి ఎదురుగా కూర్చొని, అతనికి పూజ చేస్తూ ఉంటాడు )

వైఖానస--- వన మధ్యే, తరోర్మూలే/ స్వామి పుష్కరిణీ తటే.
తిష్టంతం పుండరీకాక్షం, శ్రీ భూమి రహితం హరిం—
చించా వృక్షస్య మూలేతు / ప్రాదురాసీ జనార్దనః
తింత్రిణీ వృక్ష మూలస్థం / వల్మీకం పరం హరిం---

( పూల కోసం వైఖానసుడు బుట్టలో చెయ్యి పెడితే, అది ఖాళీగా ఉంటుంది . వైఖానసుడు పూల బుట్టను చూస్తాడు. పూజ ఆపి,--- )

( స్వామి తపస్సులోకి జారుకొంటారు. అలా తపస్సులోకి వెళ్లిపోయిన స్వామిని చూసి, వైఖానసుడు నిరుత్సాహ పడతాడు )

వైఖానస--- (తనలో ) పూలు తేకుండా, ఈ రంగదాసుడు ఏం చేస్తున్నట్లు !--- మళ్లీ ఏ నుయ్యో, గొయ్యో తవ్వుతున్నాడు కాబోలు ! --- రానీ, వీడి పని చెప్తాను !

( ప్రవేశం రంగదాసు. చేతులో పూల సజ్జతో, వైఖానసుడు మండిపడతాడు )

వైఖానస--- రంగదాసూ ! చాల ఆలస్యం చేసావు. ఇవాళ స్వామికి పూల మాల వేయడం కుదరలేదు.--- ఇంతకీ నీ ఆలస్యానికి కారణం ?—

( రంగదాసు మాట్లాడడు )

వైఖానస--- ఏవేవో పిచ్చి పనులు చేస్తున్నావు ! అసలైన కైంకర్యం మానేసి, అవునా ?

( రంగదాసు మాట్లాడడు )

వైఖానస-- మాట్లాడవేం, ఏం చేస్తున్నావు ?

రంగ --- అయ్యగారూ. అయ్యగారూ !--- అపచారం అయిపోయిందండీ ! ఇంకెప్పుడూ ఇలా చేయనండి !

వైఖానస--- ఆ సంగతి అలా ఉంచు, ఏం చేసావో చెప్పు ?

( రంగదాసు చేతులు జోడిస్తాడు, కాని మాట్లాడడు )

వైఖానస-- నువ్వు చెప్పవన్న మాట ! చెప్పకుండా మూగనోము పడితే నేను తెలుసుకోలేనను కొన్నావా ?

( అని కళ్లు మూసుకొని రంగదాసు ఏం చేసాడో తన మనో నేత్రంతో చూస్తాడు )

( క్షీరార్ణవ నలకుబేరుల ప్రణయ దృశ్యాలు అతనికి కనిపిస్తాయి. అతని మనస్సు విచలిత మవుతుంది ! తనని ఆ స్థితికి తీసుకెళ్లిన రంగదాసు పైన చాల కోపం వస్తుంది వైఖానసునికి )
వైఖానస--- రంగదాసా ! --- ప్రణయ దాసుడవై హరికైంకర్యానికి ఆలస్యం చేసి అపచారం చేసావు ! ఇన్నాళ్లూ నీవు చేసిన హరిసేవకి ఫలితం లేకుండా చేసుకొన్నావు--- ( కోపంతో ) వెళ్లు ! ఇక నీ ముఖం నాకు చూపించకు, స్వామి పుష్కరిణిలో పడి చావు !!---( అని అంటాడు )

( రంగదాసు అతని కాళ్లు పట్టుకొని ఏడుస్తాడు.)

( పుట్టలోంచి స్వామి మాటలు వినిపిస్తాయి )

విష్ణు --- వైఖానసా ! విరాగి వైన నిన్నే ఉద్వేగానికీ, తద్వారా అపరిమితమైన కోపానికీ, గురిచేసిన యక్షిణీ ప్రేమలీల --- రంగదాసు వంటి సామాన్యునికి మైమరుపు కలిగించిందంటే ఆశ్చర్యమేముంది ! నీ నిర్ణయం ప్రకారం రంగదాసు ప్రాణత్యాగం చేసుకోవాలి, అంతేనా ?---

వైఖానస--- ప్రభూ ! నన్ను క్షమించండి. క్షణికమైన ఆవేశానికి లోబడి, అలా అన్నాను. అంతేగాని---

విష్ణు --- ఆవేశంతో వెలువడినా, అవి ఋషి నోటనుండి వచ్చాయి గనుక. అమలు జరగ వలసిందే ! రంగదాసూ !

రంగ--- స్వామీ !

విష్ణు ---- నీవు చింతింపకము, స్వామి పుష్కరిణిలో స్నానము చేసి, ప్రాణత్యాగము చేయుటకు సంకల్పించుము. నీ మరు జన్మమున ఆకాశరాజూకి అనుజుడివై, ‘’తొండమానుడ’ వన్న నామథేయంతో వెలుగంది, నా పరమ భక్త శిఖామణివై. నా కొరకు ఆలయము నిర్మింతువు గాక !

( రంగదాసు సాష్టాంగ పడతాడు పుట్టముందు )

విష్ణు --- వైఖానసా ! నీ కైంకర్యము ముగియు సమయమైనందునే , నీకా చిత్త చాంచల్యము అయినది ! మహత్తరమైన దైవ కార్యమునకు నాంది పలుకుటకై నీవు ఇచటి నుండి మరలి పోవక తప్పదు !

వైఖానస-- ప్రభూ ! బాలాజీ ! రంగదాసుని వలె నాకు కూడ ప్రాణత్యాగము చేయుటకు అనుజ్ఞ నిండు ! మీ సేవ నుండి మాత్రము దూరము చేయవద్దు !

( పుట్టలోని విష్ణువు మాట్లాడడు.)

( రంగదాసు స్వామి పుష్కరిణి వైపు వెళ్తాడు. )

( వైఖానసుడు పుట్ట ముందు సాగిలబడి ఎంతో దుఃఖిస్తాడు )

వైఖానస--- ప్రభూ ! బాలాజీ ! నా బాలాజీ !— (అంటూ)

( పుట్టలోని విష్ణువు మాట్లాడడు )

వైఖానస--- ప్రభూ ! బాలాజీ ! మహత్తర దైవ కార్యమునకు నాంది జరుగనున్నది గావున , నే నుండరాదని శాసించితిరి ! కానిండు, -- ఆ దైవ కార్యమేదో ముగిసిన పిమ్మట --- (ఎంతో ఉద్వేగంతో ) -- నన్ను పిలువకుందురా, నేను రాకుందునా ? -- నేను మీకు అడ్డమయినందున, ఎడమగుచుంటిని, ప్రభూ ! బాలాజీ ! పోయి వచ్చెదను గాక ! అంతియే గాని నేను నేరస్థుడను కాను ! బాలాజీ ! నేను నేరస్థుడను కాను !

( స్వామి పుట్ట ఏమీ పలకదు ! విష్ణువు దీర్ఘ తపోదీక్ష కొరకు తన కింకరులను దూరం చేసుకున్నాడు )

**********************

( దృశ్యము 54 )

( ఆకాశం )

( నారదుడు పుట్టలో నున్న విష్ణువు తపస్సును ఆకాశం లోంచి చూస్తాడు )

నారద -- ప్రభూ ! శ్రీమహావిష్ణూ ! ఏమి యుగ్ర తపమయ్యా నీది ! చాంద్రమానము గిర్రున తిరిగి ( 60 సంవత్సరములు ) మరల భాధ్రపదము వచ్చు వరకు నిరంతరము సాగుతూ, కలియుగమున నిన్ను సేవించు భక్తుల నాదరించుటకై , నీవు చేయు యీ తపస్సు ఫలవంతమగు, సమయము ఏతెంచినది ! ఇక---ఇక—

వృ.-- ఖలారి కేశవ వినోద తాండవ / ఫణాళి కాళియ బాలకా !
కులారి రాజస సురారి మర్దన / పులోమ రుక్మిణి లోలకా !
జ్ఞానము నిచ్చుచు, జగాన / మోహము, భవాన తాపము గూర్చుచున్,
మానవ లోకము, సులీల నేలుచు / రమించు మించుము నేర్పుతోన్ !

( అని పాడుతూ తాండవం చేస్తూ వెళ్తాడు )

************************

( దృశ్యము 55 )

( బ్రహ్మ లోకం )

( బ్రహ్మముందు, శివుడు, సూర్యుడు, మరికొంత మంది దేవతలు మరియు నారదుడు ఉంటారు )

నారద --- దేవతలారా ! శేషాచలమున అకుంఠ తపోదీక్షలో మునిగిన శ్రీమన్నారాయణునికి, మీ - మీ తపో ఫలితములు ఇచ్చు సమయము ఆసన్నమయినది !

శివుడు --- నారదా ! దేవతలందరి ప్రతినిధిగా ఈ మహత్కార్యమును నెరవేర్చుటకు, నీ జనకుడే సమర్థుడు !

నారద – ( బ్రహ్మతో )-- జనకా ! విన్నారు కదా, సదాశివుని ఆదేశము ! ఇక-- మీరీ కార్య నిర్వాహక భారము వహింపక తప్పదు.

బ్రహ్మ --- శంకరా ! మీ ఆదేశము నాకు శిరోధార్యము ! -- దేవతలారా ! నేను ‘‘గోవు’ రూపమున , శ్రీమన్నారాయణుని కడకు వెడలి, గోక్షీర ధారలతో
నా బల, వీర్య, తేజో, జ్ఞానములను అతనికి సమర్పించుటకు నిశ్చయించితిని !

శివుడు --- బ్రహ్మదేవుని ఆలోచన కడుంగడు సమంజసము ! క్షీరధారల రూపమున బల, వీర్య, తేజో, జ్ఞానములను ఇచ్చుట నేనును, సిద్ధముగా నున్నాను. బ్రహ్మకు తోడుగా ‘గోవత్సముగా’ నారాయణుని కడకేగెదను !

సూర్యుడు + దేవతలు -- విధాతా ! శివ శంకరా ! మీరు తలచిన యీ కార్యాచరణములో, మా వంతుగా మేము మా బల, వీర్య, తేజో, జ్ఞానములను , మీరిచ్చు క్షీరధారలలో నిహితము చేసి శ్రీమన్నారాయణునికి సమర్పించ గలము !

నారద -- బాగున్నది ! బహు బాగున్నది ! జనకా, గోవుగా మారనున్న , మిమ్ములను శ్రీమన్నారాయణుని కడకు చేర్చువారెవరు ?

బ్రహ్మ --- ( సూర్యునితో ) సూర్యనారాయణా ! నీవు కరివీర పురమున కేగి, లక్ష్మీదేవితో యీ విషయము చెప్పి, ఆమెను చోళరాజు ‘సువీరుని’ రాజ్య సీమలకు చేరవేయుము. నేనును, శివ శంకరుడును, గో-వత్సముల’ రూపమున ఆమె కొరకు వేచి యుందుము.

నారద --- జనకా ! లక్ష్మీదేవి వచ్చి, గో-వత్సములను సువీరునకు అమ్మివేయునా ఏమి ?

బ్రహ్మ --- అవును నారదా ! చక్కగా సెలవిచ్చితివి.

సూర్య --- విధాతా ! మీ ఆదేశము మేరకు, నేను నా విధిని నెరవేర్చెదను గాక !

********************

( దృశ్యము 56 )

( చోళ రాజు సువీరుని రాజ్యము )

( లక్ష్మీదేవి, మాయా గోవత్సములను తోలుకొంటూ, ఒక వీధిలోకి ప్రవేశిస్తుంది )

( ఆ వీధిలోని ఒక ఇల్లాలు ఆవు దూడలను చూస్తుంది )

ఇల్లాలు -- ఆహా ! ఎంత చక్కని ఆవు ! దూడ కూడ చూడ ముద్దొస్తూ ఉంది ! ( అనుకొంటూ ఇంటి బయటికి వస్తుంది )

ఇల్లాలు --- ఓసి గొల్లమ్మా ! ఆవు నమ్ముతావా ?

లక్ష్మి --- ( ఆగి ) అవునమ్మా, అమ్మకానికే తోలుకు వెళ్తున్నాను.

ఇల్లాలు --- ( దగ్గరగా వచ్చి ఆవుని చూస్తుంది ) అబ్బ ! ఎంత చక్కగా ఉందీ ఆవు !

లక్ష్మి ---- అంతేనమ్మా ! చూసి సంతోషించు ! అందరాని వాటికి అర్రులు చాచకూడదమ్మా !

ఇల్లాలు -- ఏమేమి ! ఈ గోవు నా తాహతుకి, అందరానిదా ? అంత గొప్పదా నీ ఆవు ?

( వీళ్ల మాటలు విని కుతూహలంతో వీధిలోని జనం గుమి కూడతారు )

లక్ష్మి -- ఆవు గొప్ప చెప్ప నలవి కాదమ్మా ! ఇది తలరాతలు రాసే ఆవు ! తలపుల్లో నిలిచే ఆవు ! తపో ఫలితాలు ఇచ్చే ఆవు !---

ఇల్లాలు -- ఏంటో ! మాయమాటలు చెప్తున్నావు ! నువ్వు చెప్పిందే కాక, పాలిస్తుందా ఇవ్వదా ?

లక్ష్మి --- ఇవ్వకేమమ్మా ! సాధారణమైన పాలు కాదు ! వరాలిచ్చే దేవతల బలాలు నిండిన పాలు ! సంపదలిచ్చే సురుల సంపదలు నిండిన పాలు ! చదువుల నిచ్చే తల్లి వెలుగులు నిండిన పాలు ! దీని పాలకి ఏ పాలూ సాటిరావు !!

( ఇల్లాలు అర్థం కాక తల గోక్కుంటుంది )

ఈల్లాలు -- ఏం చోద్యమమ్మా ! ఒక్క మాట అర్థం కాలేదు ! మొత్తానికి మాయదారి ఆవని తెలిసింది. నా కెందుకులే తల్లీ ! ( అని ప్రక్కకి తప్పుకొంటుంది )

( లక్ష్మి మాటలు విన్న వారు అర్థమయి కొందరు, అర్థం కాక కొందరు, ముఖాముఖాలు చూసుకొని, గుస గుస లాడుకొంటూ ఉంటారు )

( ఇంతలో ,ఒక ఇంటి కిటికీ చాటునుంచి, ఒక గొంతుక వినిపిస్తుంది )

గొంతు ---- తల్లీ ! యాదవ వనితా ! నీ పేరేమిటమ్మా ?

లక్ష్మి --- ( కాస్త ఆలోచించి ) నా పేరా ?! రుక్మిణి !

గొంతు -- రుక్మిణమ్మా ! మీరు మీ ఆవు గురించి చెప్పిన మాటలన్నీ నిజమేనా ?

లక్ష్మి -- అవునయ్యా ! అంతా నిజమే ! అయినా చాటునుండి అడుగుతావెందుకు , కొనేవాడివయితే బయటికి వచ్చి, అడుగు !

గొంతు --- అలాగేనమ్మా ! బయటికి వచ్చే అడుగుతాను !

( అంటూ ఆ మనిషి కిటికీ చాటునుంచి లేచి, తలుపు తీసుకొని వస్తాడు. )

( ఆశ్చర్యం ! -- అతని ముఖం గాడిద ముఖం, శరీరమేమో మనిషి శరీరం !! ప్రజలు అతని చుట్టూ చేరుతారు. గార్ధభ ముఖుడు, లక్ష్మి, ఆవు , దూడలు మధ్యలో ఉండగా , చూసే ప్రజానీకం వాళ్ల చుట్టూ వలయాకారంగా నిలబడతారు.)

( ఆ వలయాన్ని నెట్టుకొంటూ ఇద్దరు రాజభటులు కూడ వచ్చి నిలబడతారు )

( గార్ధభ ముఖుడు ముందుగా లక్ష్మికి, ఆవుకి, దూడకి నమస్కారం చేస్తాడు )

గార్ధభ --- రుక్మిణమ్మా ! నే నొకప్పుడు చక్కని రూపుగల బ్రాహ్మణ పండితుణ్ని ! ఒక రోజు నా ఇంటికి వచ్చిన అతిథికి, ఎలాగూ ఆ రోజు, మా తండ్రిగారి ఆబ్దికమే గనుక, శ్రాద్ధ భోజనానికి పిలిచి, పెట్టించాను ! ఆ రోజు నుంచే , నా ముఖం ఇలా మారిపోయింది ! --- నేనే తప్పు చేసానో తెలియదు. దీనికి తరుణోపాయం ఏమిటో అంతకన్న తెలియదు ! ఆ నాటి నుంచి దుర్భర జీవితాన్ని గడుపుతున్నాను ! తల్లీ ! రుక్మిణమ్మా ! నీకు, నీ నాధునికీ, నీ వంశం వారికీ, అందరికీ మొక్కుతాను ! నీ గోవుకీ , దూడకీ కూడ పదే పదే మొక్కుతాను. ( మొక్కుతాడు )

లక్ష్మి --- ( జాలితో ) అలాగే బాపనయ్యా ! బెంగపడకు, అడుగుతాన్లే ! ( అని గోవు దగ్గరకి వెళ్లి ) విన్నావా బిడ్డా ! నీకు నీ తండ్రి మీద ఆన ! ఈ బాపనయ్యకి ఈ గతి ఎందుకు పట్టిందో చెప్పు !!

( గోవు తల ఆడించి, తన ముందుకాలి గిట్టలతో, నేల మీద ఏదో రాస్తుంది. అది బ్రహ్మ రాత ! ఎవరికీ అర్థం కాదు ! లక్ష్మి ఆ రాత చూస్తుంది, చదివి చెప్తుంది .)

లక్ష్మి --- ఇదుగో బాపనయ్యా ! నువ్వొక అయోగ్యుడికీ, సంతానం లేని వాడికి శ్రాద్ధ భోజనం పెట్టావు. నీ పితృ దేవతలు కోపించడం వల్ల. నీకీ ముఖం ఏర్పడింది ! అర్థమయిందా ?

గార్ధభ --- అర్థమయింది తల్లీ ! నా తప్పు తెలిసింది ! తరుణోపాయం కూడ చెప్పి, నన్ను కటాక్షించు !

( ఆవు తనకి తెలియదన్నట్లు తల తిప్పుతుంది. దూడ నుదురు నాకి , దూడ నడగమని సంకేతం ఇస్తుంది. లక్ష్మి దూడని అడుగుతుంది )

లక్ష్మి --- ఓ ! గోవుని మించిన గోవత్సమా ! ఈ గృహ మేథికి , గార్ధభ ముఖం పోయే ఉపాయం చెప్పు !

( దూడ చెంగు చెంగున ఎగిరి తన ముంగోటితో నేల మీద వ్రాస్తుంది. లక్ష్మి ఆ రాత చూసి చెప్తుంది )

లక్ష్మి ---- ఇదుగో బాపనయ్యా ! కొంగు బంగారం లాంటి కొండను వదిలి ఎక్కడికి పోనక్కర లేదయ్యా ! వేంకటాచలం పైని, ఆకాశగంగ తీర్థ స్నానము, స్వామి పుష్కరిణీ స్నానము చేస్తే చాలు, నీ రూపు నీకు తిరిగి వస్తుంది !

(గుంపులో ఉన్న రాజభటులు ఒకరికొకరు సైగ చేసుకొని ఈ విషయం రాజుగారికి చెప్పేందుకు వెళ్తారు)

**********************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని ...