Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 14

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 14

( దృశ్యము 72 )

( నైమిశారణ్యము )

( సూత మహర్షి, శౌనకాది మునులు ఉంటారు )
సూత --- శౌనకాది మునులారా ! శుక మహర్షి చెప్పిన విధమున, పుత్ర కామేష్టి యాగము చేసి, నాగలి పట్టి దున్నిన ఆకాశ రాజున కొక పెద్ద మందసము కనిపించెను. ఆ మందసమందు, వికసించిన పహ్ముల మధ్య, పూర్ణ చంద్రుని ధిక్కరించు శరీర కాంతిగల చక్కని పసిపాప కన్పించినది ! ఆ పాపకు పద్మావతి యని నామకరణము చేసి, రాజదంపతులు ఆనందముతో పెంచసాగిరి !

శౌనక --- మహర్షీ ! ఆ ఆకాశరాజునకు పుత్రోదయము ఎట్లయ్యెను ?

సూత --- ఆరేళ్ల ప్రాయమున, పద్మావతి తన చిలుక పలుకులతో, “ అమ్మా ! నాకు తమ్ముడు కావాలే ! “ అని అనినంతనే ధరణీదేవి గర్భము ధరించి, వసుధానుడను పుత్రుని బడసినది !

1 ఋషి --- సూత మహర్షీ ! జనక మహారాజునకు సీత వలె, ఆకాశరాజునకు పద్మావతి లభించడం, యాదృచ్ఛికమా ? లేక ----

2 ఋషి --- ఆ సీతా - పద్మావతుల మధ్య జన్మ సామ్యములకు, కారణమేదైన కలదా ?

సూత --- మంచి ప్రశ్నయే వేసితిరి ! సీతా పద్మావతుల సంబంధము త్రేతాయుగము నాటిది ! ఒకనాడు నారద మహర్షి, పౌలస్త్యుడయిన రావణాసురుడు, లోక కంటకుడయిన విషయమును, శ్రీమహావిష్ణువుకు విన్నవిస్తూ ఉండగా, అత్యధిక సంవేదన శీలయగు శ్రీలక్ష్మికి, రావణ వధకు, తానే ముందు నాంది పలుక వలెనను సంకల్పము పుట్టినది ! ఆమె సంకల్పము తక్షణమే ఒక బాలికగా జన్మమెత్తి, కుశధ్వజ మహర్షి, హోమగుండము సమీపమున , దర్భగడ్డిపై, అయోనిజగా, ప్రకటితమయినది !

3 ఋషి --- సూత మహర్షీ ! అటుల సీతకన్న ముందు, శ్రీమహాలక్ష్మి సంకల్ప అయోనిజగా పుట్టిన వేదవతి ----

4 ఋషి -- రావణ వధకు ఏ విధమున తోడ్పడినది ?

సూత -- మునిపుంగవులారా ! సంకల్ప అయోనిజగా జన్మించిన వేదవతియే, జన్మాంతరమందు ‘పద్మావతి’ అయినది ! ఇక రావణ వధకు వేదవతి, ఎటుల తోడ్పడినదో వినుడు !

******************

( దృశ్యము 73 )

( భూలోకంలో కుశధ్వజ ఋషి కుటీరం )

( ఋషి కుశధ్వజుడు , మహర్షి అతని కమార్తె వేదవతి, అగస్త్యుడు, ఉంటారు )

( అగస్త్యుడు ఎత్తైన ఆసనం మీద కూర్చొని ఉంటాడు. కుశధ్వజుడు ప్రక్కనే నిలబడి, అతనికి విసనికర్రతో విసురుతూ ఉంటాడు )

( వేదవతి పాత్రతో నీరు తెచ్చి, అగస్త్య మహర్షికి ఇస్తుంది. అగస్త్యుడు ఆ నీరు కొంచం త్రాగి, ఆ నీరు పాత్ర క్రింద పెడతాడు )

అగస్త్యుడు --- కళ్యాణీ ! నీ పేరు ఏమిటి ?

వేదవతి --- మహర్షీ ! నా తండ్రి నాకు పెట్టిన పేరు వేదవతి !

అగస్త్యుడు --- వేదవతీ ! నీకీ పేరు తండ్రి పెట్టినదని చెప్పావు ! మరి నీ అసలు పేరేమిటి ?

వేదవతి –ఆత్మకు పేరెక్కడుంటుంది మహర్షీ !

అగస్త్యుడు --- మరేముంటుంది ?

వేదవతి -- అహం ఉంటుంది ! అరిషడ్వర్గాలు దానిని పెంచి పెద్ద చేస్తాయి !

అగస్త్యుడు --- ( ఆశ్చర్యంతో ) వేదవతీ ! రూప, యవ్వన లావణ్యాలు చిగిర్చి, పూత పెట్టిన యీ ప్రాయంలో, నీకీ వైరాగ్య చింతన, చిత్రంగా ఉంది ! – సరే , ఆత్మ నంటిన అరిషడ్వర్గాలను త్రుంచితే ఏమవుతుంది ?

వేదవతి -- అహం క్షీణిస్తుంది !

అగస్త్యుడు --- ఆ అహన్ని కూడ లోబరచుకొంటే ?

వేదవతి ---- ఆత్మ, పరమాత్మకి సమర్పిత మవుతుంది .

( అదే సమయానికి కుశధ్వజుని మేనల్లుడు, ‘ ఋతుపర్ణుడు’ ప్రవేశిస్తాడు. ఋతుపర్ణుడు అగస్త్యునికి, నమస్కరిస్తాడు )

ఋతుపర్ణుడు-- అగస్త్యమహర్షీ ! నా అభివాదము స్వీకరించండి.

అగస్త్యుడు --- కుశడ్వజా ! ఈ చిరంజీవి ఎవరు ?

కుశధ్వజుడు-- మహర్షీ ! ఇతను నా మేనల్లుడు. మీ ఆశీస్సులు లభిస్తే, నాకు కాబోయే అల్లుడు.

అగస్త్యుడు --- కుశధ్వజా ! నీ కమార్తె మాటలు విన్నాక, అలాంటి ఆశీస్సులు ఇచ్చేందుకు మనసు శంకిస్తోంది. వేదవతీ, నివేమంటావు ?

( వేదవతి దీనంగా అగస్త్యుని పాదాల మీద పడి, ఏడుస్తుంది )

వేదవతి-- మహర్షీ ! మీరు,నాలుగు మాటలాడి నా మనస్సు తెలుసుకో గలిగారు ! చిరకాల సాహచర్యమున్నా, ఎరుక తెలిసిన నా తండ్రి, నా మనసెరిగి మాట్లాడుట లేదు !

అగస్త్యుడు --- ( గంభీరంగా ) కుశధ్వజా !

( అతని కంఠం లోని తీవ్రతకి కుశధ్వజుడు కంపిస్తాడు. చేతులు జోడించి అంటాడు )

కుశధ్వజుడు-- చిత్తం మహర్షీ !

అగస్త్యుడు --- కన్యక వరణ స్వాతంత్ర్యాన్ని ధిక్కరించి, పెళ్లి జరిపించాలను కొంటున్నావా ? అది, నేరమని నీకు తెలియదా ?

కుశధ్వజుడు-- మహర్షీ ! కూతురు కోరికను మన్నించి, వివాహం చేయడం, ధర్మసమ్మతమని నాకు తెలియక కాదు !-- కోరరాని కోరిక కోరితే, ఏ తండ్రైనా , ఏం చెయ్యగలడు ?

అగస్త్యుడు --- వేదవతీ ! నువ్వు చెప్పు, నీవు కోరినది భ్రష్టుడినా ?

వేదవతి--- కాదు.

అగస్త్యుడు --- వ్యసన పరుడినా ?

వేదవతి--- కాదు.

అగస్త్యుడు --- నిషిద్ధ జాతి కులములలో, జన్మించిన వాడినా ?

వేదవతి--- కాదు !

అగస్త్యుడు --- సత్పురుషుడేనా ?

వేదవతి-- సచ్చిదానంద స్వరూపుడయిన పురుషోత్తముడిని !

అగస్త్యుడు --- అర్థమయింది ! నీవు, నీ చిత్తాన్ని శ్రీమన్నారాయణునికి, అంకితం చేసావు, అంతేనా ?

వేదవతి-- అవును మహర్షీ ! తపస్సు చేసి, అతనిని పతిగా పొందాలని, తండ్రి ఆజ్ఞ అడిగాను.—

కుశధ్వజుడు-- మహర్షీ ! మీరే చెప్పండి, ఇదేమైనా తీరే కోరికా ? ఋతుపర్ణుడు రూప, యవ్వన , గుణ సంపన్నుడు. పోనీ, అతనిని కాక, యోగ్యుడయిన వరుని, ఇంకెవరి నయినా----

అగస్త్యుడు --- కుశధ్వజా ! శ్రీమన్నారాయణుడు యోగ్యుడయిన వరుడు కాడంటావా ?

కుశధ్వజుడు-- మహర్షీ ! ఆ మాట అనే అర్హత నాకెక్కడిది ? అతడు, మానవ మాత్రుడు కాదని మాత్రము అనగలను !

అగస్త్యుడు --- పర్వత రాజ పుత్రి పార్వతి, తపస్సు చేసి, పరమేశ్వరుని పతిగా పొందిందా, లేదా ?

కుశధ్వజుడు-- మహర్షీ ! ఆమె కారణ జన్మురాలు గనుక, అలా చెయ్యగలిగింది.

అగస్త్యుడు --- కుశధ్వజా ! ఈ వేదవతి కూడ అయోనిజయై, హోమ గుండము సమీపమున, దర్భలపై పడి, నీకు దక్కిన మాట మరచితివా ?

కుశధ్వజుడు--- మహర్షీ ! -- ఈమె కారణజన్మురాలు కావచ్చును ! కాని తపము చేయుటకు, తగిన వయసా ఇది ? ఈమె సుందర సుకుమార శరీరము గల అబల కాదంటారా ?

అగస్త్యుడు --- వేదవతీ ! నీ తండ్రి అడిగిన ప్రశ్నలో నిజం ఉంది. దానికి నీ జవాబేమిటి ?

వేదవతి-- మహర్షీ ! నా రూపము, యవ్వనము, వయసు, సుందర సుకుమార శరీరము--- వీటిలో ఏది -- నా మనో నిశ్చయమయిన తపస్సుకి, ఏ నాడు-- అడ్డు రాగలవో , -- ఆ నాడే నన్ను నేను అగ్నికి అర్పించుకొందును, కాని తపమును వీడజాలను !

అగస్త్యుడు --- శరీరము , అగ్నికి ఆహుతి అయిన పిమ్మట , తపమెట్లు చేయగలవు ?

వేదవతి-- జన్మాంతరమందు----

అగస్త్యుడు --- ఆ జన్మాంతరమందు కూడ, నీ కోరిక సిద్ధించక పోయినచో ?—

వేదవతి--- కల్పాంతరము వరకు, వేచి యుండగలను !

అగస్త్యుడు --- సాధు, సాధు ! వేదవతీ ! నీవు సామాన్యురాలివి కాదు---కుశధ్వజా !

కుశధ్వజుడు-- ఆజ్ఞ, మహర్షీ !

అగస్త్యుడు --- సత్వరము హోమగుండము ప్రజ్వలింప జేయుము !

( కుశధ్వజుడు, ఋతుపర్ణుని వంక చూస్తాడు )

ఋతుపర్ణుడు—అలాగే మహర్షీ !

( అంటూ , ఆ కుటీరంలో ఒక మూలగా ఉన్న హోమగుండంలో, సమిధలు వేసి, అగ్ని రాజేస్తాడు )

అగస్త్యుడు --- కుశధ్వజా ! వేదవతి వంటి బాలికను, పెంచిన మమకారము నుండి, విడివడి ధారాదత్తము చేయడం చాల కష్టము----

కుశధ్వజుడు --- ( దుఃఖంతో ) మహర్షీ ! ఏమిటి మీరంటిన్నది ! వేదవతిని ధారాదత్తం చేయాలా ? ఎవరికి ?—

అగస్త్యుడు --- అగ్నికి !—

కుశధ్వజుడు---అగ్నికా!! -- అంటే వధువుగానా ?—

అగస్త్యుడు --- ( నవ్వి ) కాదు కుశధ్వజా ! ఆమెను , అగ్నిపుత్రికను చెయ్యి ! అలా చేస్తే, ఆమె ఆశయ సాధనకు, సహాయం చేసిన వాడవు అవుతావు.

కుశధ్వజుడు--- ( దీనంగా ) మహర్షీ ! -- మీరు ఆమెకు నచ్చజెప్పి, సంసారిక జీవితం వైపు మరలిస్తారనుకొన్నాను !

ఋతుపర్ణుడు--- ( దుఃఖంతో ) అగస్త్యమహర్షీ ! వేదవతికి ఇష్థం లేనప్పుడు, నేనామె కరస్పర్శ కూడ చెయ్యను ! అసలామె నిల్చొన్న చోట, కూర్చొనే సాహసం కూడ చెయ్యను ! కాని--- ఆమెను, ఈ ఆశ్రమానికి దూరం చెయ్యకండి !

అగస్త్యుడు --- కుశధ్వజా ! నీవు ఋషివి, సామాన్యుని వలె, అలా బేలగా ప్రవర్తింపకుము ! ఋతుపర్ణా ! నీవు వేదవతి మాటలు విన్నావు కదా, ఆమె ఏమన్నది ! --తన రూపము, యవ్వనము, సుందర సుకుమార శరీరము, ఏనాడు తన తపస్సుకి అడ్డు వస్తాయో, ఆ నాడే వాటిని త్యజిస్తానంది ! -- ఏమంటావు వేదవతీ ! నీ నిశ్చయం అదే కదా ?

( వేదవతి అగస్త్యునికి మోకాళ్ల మీద వంగి నమస్కరిస్తుంది )

వేదవతి--- మహర్షీ ! మీ దీవనతో , మీ అండ దండలతో, నా జీవితం సార్థకమయింది ! నా మనో నిశ్చయానికి ఊఁపిరి పోసి లక్ష్య సాధనకు మార్గం చూపెట్టారు ! -- నా వారితో-- భవ బంధాలు త్రెంచుకొనే, మార్గం నుండి, నన్ను మరలించకండి !

అగస్త్యుడు---- ( వారిద్రరి వంక చూస్తూ-- )—విన్నారు కదా ! ఈ అమ్మాయి మాటలు ! కారణ జన్మురాలైన, యీమె నిర్ణయానికి తిరుగు లేదు . మీ నిర్ణయం ఏమిటో తెలియజేయండి !

( కుశధ్వజుడు, ఋతుపర్ణుడు ఒకరి ముఖాలొకరు చూసుకొంటారు. తరువాత మౌనంగా, రాజుతున్న హోమగుండం దగ్గరకి వెళ్లి, దానికి ఇరుప్రక్కలా నిలబడతారు. దుఃఖాన్ని అదుపులోనికి తెచ్చుకొంటూ, కళ్లు తుడుచు కొంటారు )

కుశధ్వజుడు—మహర్షీ ! మీ ఆజ్ఞ ప్రకారం నేను దత్త హోమానికి సిద్ధంగా ఉన్నాను.

( అగస్త్యుడు, వేదవతిని హోమగుండం దగ్గరకి తీసుకు వస్తాడు. ఆమెకి ఎదురుగా తాను నిలబడుతాడు. ఆ తరువాత అతను అగ్ని గుండానికి నమస్కరించి )

అగస్త్యుడు----వైశ్వానరా ! నేను నీ అంశతో, సూర్యుని తేజస్సుతో, జలకుంభమున పుట్టిన అగస్త్యుడను ! పరమేశ్వరునకు అత్యంత ప్రీతి పాత్రుడను ! నా కోరిక మన్నించి, వేదవతి యను పేరు గల ఈ కన్యను నీ పుత్రికగా స్వీకరింపుము ! నీకు అంగీకార మగునో కాదో, సత్వరము తెలియ జేయుము !

( హోమగుండం నుండి, అగ్ని ప్రత్యక్ష్య మవుతాడు )

అగ్ని --- అగస్త్య మహర్షీ ! మీ ఇచ్చకు విరుద్ధముగా నే నెట్లు ప్రవర్తంచగలను ? ఈ నాటినుంచి ఈ వేదవతి, నాకు పుత్రిక ! ఈమెను రక్షించు భారము నేను వహింపగలను !

( అగస్త్య మహర్షి వేదవతి చేతిని అగ్ని చేతిలో పెడతాడు. )

అగస్త్యుడు---- వేదవతీ ! నేటినుండి, అగ్ని నీ జనకుడు ! నీ ఆశయ సాడనకు జనకుని ఆజ్ఞ గైకొనుము !

వేదవతి--- ( అగ్ని నమస్కరించి ) తండ్రీ ! శ్రీమన్నారాయణుని పతిగా, పొందు తలంపుతో, తపము నాచరించుటకు నిశ్చయించినాను ! మీ అనుజ్ఞ నిండు !

అగ్ని -- పుత్రీ ! నీ సంకల్ప బలము, అగస్త్యమహర్షి ఆశీర్వాదము, నిన్ను గమ్యమునకు తప్పక చేర్చ గలవు ! నా రక్షణ నీకు నీ సంకల్ప మాత్రమున లభించ గలదు ! హిమవత్పర్వతము నందు తొల్లి పార్వతి తపస్సు చేసిన స్థలమే నీ తపో స్థలము ! నేను నిన్ను అక్కడకు చేరెదను, నాతో రమ్ము !

( అని ఆమె చెయ్యి పట్టుకొని, హోమగుండంలోకి దూకుతాడు ! ఇద్దరూ అదృశ్యమవుతారు )

( అగస్త్యుడు తృప్తితోను, కుశధ్వజ, ఋతుపర్ణులు ఆశ్చర్యంతోను చూస్తారు )

*******************

( దృశ్యము 74 )

( హిమాలయాలలో తపోభూమి )

( వేదవతి నిశ్చలంగా కూర్చొని, తపస్సు చేస్తూ ఉంటుంది.)

( ప్రవేశం రావణాసురుడు. వచ్చి వేదవతిని చూస్తాడు )

రావణ -- ( తనలో ) ఆహా ! ఏమి ఈ అద్వితీయ సౌందర్యము ! మునికన్య పరిధానములోనే, సొగసుగత్తెగా ఉన్న ఈమెకు, పట్టు పీతాంబరములు కట్టి, స్వర్ణ భూషణములు అలంకరించిన ఎంత మనోహరముగా నుండునో గదా ! నా మనోహారిణి యైన , యీమెను చేపట్టని జన్మమేల ! ప్రయత్నించెదను గాక !!

రావణ -- ( ఆమె దగ్గరగా వెళ్లి, పిలుస్తాడు ) సుందరీ !

( వేదవతి మాట్లాడదు )

రావణ --- సుందరీ ! నేను పులస్త్య బ్రహ్మ పుత్రుడనైన రావణుడను ! లంకేశ్వరుడను ! నీ ధ్యానము రవంత నిలిపి, నా మాటలను ఆలకింపుము !

( వేదవతి మాట్లాడదు )

రావణ --- సుందరీ ! నీవు నాకు సమాధాన మివ్వని, పక్షమున, నీ తపో భూమితో పాటు, నిన్ను పెళ్లగించి, నా లంకకు తీసుకొని పోగలను ! నా ప్రతాపము తెలిసిన దానివైతే, ----

( వేదవతి కళ్లు విప్పి చూస్తుంది )

వేదవతి --- రావణాసురా ! ఉగ్ర తపస్వి వయిన నీవు, నా తపమునకు ఆటంకమేల కలిగింతువు ?

రావణ -- తపము పేరిట నిన్ను గౌరవించి విడిచి పెట్థిన, నా మనోతాపము ఎట్లు తీరగలదు ? వికసించిన పుష్పములను వెదకు భృంగము పగిది, నీ వద్దకు వచ్చాను. ఇక మధువును ఆస్వాదించుటయే తడవు !

వేదవతి--- రావణా ! పొగరు తలకెక్కి, ఇటుల పలుకుచున్నావు---

రావణ --- పొగరు కాదు, నీ రూపజనిత-- నయనోన్మాదము , కైపెక్కి, పలుకుచున్నాను ! సుందరియగు కన్య వీర పురుషుని సొత్తు అని మరువకుము !

వేదవతి--- రావణా ! సుందరియగు కన్య వీర పురుషుని సొత్తు కావచ్చును ! కాని, నీవు మాత్రము వీర పురుషుడవు కావు !

రావణ --- ఏమి ? ఏమంటివి సుందరీ ! నన్ను మించిన వీరుడీ ముజ్జగములలో లేడను మాట తెలియని దానవా నీవు ?

వేదవతి-- నీ వనునట్లు, నాది లోకోత్తర సౌందర్యమే యగునెడల, నేను నిన్ను మించిన వీరపురుషుని సొత్తు కాగలను ! కాని నీ దానను కాజాలను !

రావణ --- సుందరీ ! నీ మాటలు నా బలమును , శౌర్యమును ,వేలెత్తి చూపుచున్నవి ! నన్ను మించిన వీరపురుషుడెవరో, చెప్పుము ! వాని పీచమడఫించి వచ్చి, నిన్ను చేపట్థెదను !

వేదవతి-- రావణా ! నేను—నా మనమును, నారాయణునికి అర్పించి, అతనిని పతిగా పొందగోరి, తపము చేయుచున్నాను ! అన్యాక్రాంత మనస్వినిని, తపస్వినిని అయిన నన్ను ఆశింపక, నా తపమునకు ఆటంకము కలిగించక, మరలి పొమ్ము !

రావణ -- ఏమి ! నీ మనసు నారాయణా క్రాంతమా? ( నవ్వి ) హురే ! బాగున్నది, బహు బాగున్నది !! అతడు నా శతృవర్గము లోని వాడు ! నా మనోహారిణిని అతనికి అర్పించుటకు నే నొల్లను ! --కనుక నీవు నా కాంతవు కాక తప్పదు !

( రావణుడు వేదవతి చెయ్యి పట్టుకోబోతాడు. వేదవతి తప్పించుకొని పరుగెడుతుంది. రావణుడు వెంబడిస్తాడు )

( వేదవతి నిస్సహాయురాలై, ఒక మూలకి చేరి, చేతులు జోడించి, అగ్నిని ప్రార్థిస్తుంది. ఆమెకెదురుగా అగ్ని గుండం వస్తుంది )

వేదవతి--- ఓరీ, కామాంధుడా !! వనితల బలాత్కారమే నీ వంశాంతమునకు మూల కారణ మగు గాక !

( అని శపించి, అగ్ని గుండం లోకి, దూకేస్తుంది. రావణుడు హతాశుడై వెళ్లిపోతాడు )

*******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ