బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 18
( దృశ్యము- ౮౫ )
( ధరణీ దేవి అంతఃపురం )
( ఎరుకల సాని , దాని కొడుకు మన్మథుడు, పద్మావతి, చెలికత్తెలు ముగ్గురు, దరణీదేవి, ఆమె పరిచారిక ఉంటారు )
ఎరుకత-- విన్నావమ్మా,చిన్న దొరసానీ ! స్వామి పుష్కరణిలో తానమాడి, ఒక మహారాజు రాజ్యం పొందితే, మరొక మారాజు పిశాచ జనమ నుంచి, బయట పడి, తిరిగి తన రాజరికం, ఏలికొన్నాడమ్మా !
పద్మావతి-- ఎరుకా ! ఎవరే ఆ మహారాజు ? పిశాచ జన్మం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ?
ఎరుకత --- అదేటి చిన దొరసానమ్మా ! ఆ మహారాజు ఇంకెవరో కాదమ్మా ! మీ చోళ దేశపు మారాజేనమ్మా ! శ్రీ మహాలక్ష్మికి ఇచ్చిన మాట తప్పినందువల్ల, విష్ణుదేవుని మీద నింద వేసినందువల్ల, పిశాచ జనమ ఎత్తవలసి వచ్చింది తల్లీ !
ధరణీదేవి -- అవునమ్మా పద్మావతీ ! అతనే మన వంశ మూలపురుషులు శ్రీశ్రీశ్రీ సువీర చక్రవర్తులవారు ! మీ తాతగారైన సుధర్మ మహారాజుగారికి స్వయానా తండ్రిగారు !--- ఈ ఎరుకల సాని సోది ఎలా చెప్తుందో గాని, వేంకటాచలం పైన కథలు మాత్రం మా బాగా చెప్తోంది ! --- ఆన్నిటి కన్న ముందు నీ మనోరంజన చెసింది !
పద్మావతి --- ఎరుకా ! ఎరుక గలిగిన కథలు బాగానే చెప్పావు. ఆ వెంకటాచల రమణుడు ఎలా ఉంటాడో చెప్పవే !
ఎరుకత ---- ఆ సామి ఎలాగుండునో, చెప్పేందుకు, ఆదిశేషుడు చాలడమ్మా ! విశాలమైన నుదుటి మీద నిలువెత్తు నామాలు పెట్టుకొనే ఆ నీలిరంగు వేంకటేసుడు-- అదుగో -- ( పద్మావతి ఒడిలో బొమ్మను చూపిస్తూ) నీ పక్కలో ఉన్న విష్ణుమూర్తి ఇగ్రహం లాగే ఉంటాడమ్మా ! ఏనుగు లాంటి రొమ్ము, సింహం లాంటి నడుము, కమలాల లాంటి కళ్లు, విల్లులాంటి కనుబొమలు, నిడుపై నిటారుగా ఉండే కోటేరులాంటి ముక్కు, మాలలెన్ని వేసినా చాలదన్నట్లు చెప్పే పొడవైన మెడ, పర్వతాల లాంటి భుజకీర్తులు, మోకాలు నంటే చేతులు, పసుపు రంగు పట్టు పంచెలోంచి, మెరిసిఫొతూ, నీల మరకతాల స్తంభాలలా కనిపించే తొడలు, --- అతని సొగసు ఎలా చెప్పావంటావమ్మా !-- చూసె వారికి కళ్లు చారెడున్నా ఇంకా చాలవనిపించే సొగసమ్మా అతనిది ! -----
( ఎరుకత వేంకటేశ్వర స్వామిని వర్ణించి చెప్తుంటే, పద్మావతి తన్మయత్వంతో, అతనిని తలపోస్తుంది. చేతిలోని విష్ణుమూర్తి విగ్రహాన్ని, చెక్కిలిపై ముద్దాడుతుంది. ఆమె పెట్టిన ముద్దు, ఎరుకల సాని వేషం లోని , శ్రీనివాసునికి పులకింతలు పుట్టిస్తుంది. బుడతడి వేషంలోని మన్మథుడు, చేతిలోని పాల బువ్వ గబగబా జుర్రుకుంటూ, తన చూపులతోనే పద్మావతిపై బాణాలు వదులుతాడు ! )
౧ చెలికత్తె -- ఏం బుడత మన్మథుడా ! కమ్మని పరమాన్నం పెడితే, తీపి బువ్వ బాగులేదన్నావు ?---
౨ చెలికత్తె--- ఇప్పుడదే బువ్వ ఎలా జుర్రుకుంటున్నావ్ ?
బుడతడు-- ( పద్మావతి వైపు చూపిస్తాడు. ఆ చూపుడు వేలితోనే, ఆమెపై బాణం వేస్తాడు ) అమ్మ ! పేమతో ముద్దు పెట్టింది కదా !
౩ చెలికత్తె -- ఓహో ! చిత్రంగా ఉందే ! నీ ముందు, ఎవరు ఏది ముద్దు పెట్టినా, నీకు బువ్వ సయిస్తుందన్న మాట !
( చెలికత్తెలందరూ ఫకాలున నవ్వుతారు. పద్మావతి కూడ నవ్వుతుంది )
పద్మావతి -- తిను బాబూ ! తిను ! నువ్వు తింటానంటే, నే నీ బొమ్మకి ఎన్నో ముద్దులు ఇస్తాను ! ( అంటూ ముద్దులు పెట్టుకొంటుంది. ( ఆమె పెట్టిన ప్రతీ ముద్దుకూ స్వామి పులకించి పోతూనే ఉంటాడు.)
ధరణీదేవి ---( పద్మావతి నవ్వు ముఖాన్ని చూసి, ఆనందిస్తుంది ) తల్లీ ! ఎంత కాలానికి నిన్ను, నవ్వుతూండగా చూసానే !—( అని ఎరుకల సానితో ) ఎరుకతా ! నీ రాక అమ్మాయి ముఖంలో కళ తెచ్చి పెట్టింది ! -- ఇంక కథలు కట్టిపెట్టి, వచ్చిన పని కానియ్యి ! చెప్పవే నీ సోది !—
ఎరుకత -- ( ధరణీదెవి మాటలకు తెప్పరిల్లి ) అలాగేనమ్మా ! పెద్ద దొరసానీ ! మీరు తూరుపు ముఖంగా కూచోండమ్మా----
( అని ధరణీదెవిని తూర్పు ముఖంగా కూర్చోపెట్టి, తాను ఉత్తర ముఖంగా కూర్చొంటుంది )
( పరిచారిక తెచ్చి ఇచ్చిన పెద్ద పళ్లెంలోని, వాయనాన్ని, బుట్టలో వేసుకొని, పళ్లేన్ని బుట్ట మీద పెట్టి సోదె పలకని పళ్లెం మీద పెట్టి, వెదురు గొట్టం కూడ పెట్టి, సోదె పలక లోని గవ్వలకి, పసుప కుంకుమలతో పూజ చేసి, గలగలా ఆడిస్తూ, సోదె చెప్తుంది )
ఎరుకత --- ఓ మధుర మీనాక్షమ్మ ! తల్లీ, కంచి కామాచ్చమ్మా ! ఆ ! కాశీ విశాలాచ్చమ్మా ! -- ముక్కోటి దేవతలారా ! ముందుగా గణపయ్య నిన్ను నే గొల్తు, విగ్నాలు లేకుండా --- మొదముగా చెప్పు నా నోటి మాటలు సత్తెము చేసి చెప్పు ! -- దేవతలారా ! ఈ దొరసాని మనసులోని కోరిక తెలుపరే ! నా మాటలందు -- ఓ కాలాస్తి గ్యానమ్మా ! ఆ ! కనక దుర్గమ్మా పలుకరే ! -- సత్తెపు మాట పొల్లు పోనీక చెల్లింపరే ! నా సోదిలోన---
( అని గవ్వలు , గొట్టంలోంచి పాచికల్లా వేసి, గుణించుకొంటుంది )
ఎరుకత -- ఆ ! ఓ యమ్మి ! నీ మనసులో పెద్దె చిక్కే అయినాది ! ఎట్లా అని భాద పడతావు ? ఎటు వచ్చి ఎటుపోవునో, అని దిగులు పడుతావు ! తల్లీ ! గడ్డమే చూపితే బుర్రోడు అనుకో, ఎడమ చెవి చూపితే బుర్రదే అనుకో ! --- ( అని ఎడమ చెవి చూపించి ) తల్లీ ! నీ మదిలో చింత యీ బుర్రదేనమ్మా ! కలవరంబున చాల కలత పడి ఉంది. అది జబ్బు కాదు, భూత నాడులు కావు---
ధరణీ దేవి --- మరేమిటే దిగులు నా బాలకి ?
ఎరుకత--- చిన్నారి బాలకు మొన్న వనములో, నామాల నల్లనయ్య అగుపించినాడు ! వానిపై మోజు పడ్డది నీ బాల !---
ధరణీ దెవి -- ఎవరే ఆ పురుషుడు ?
ఎరుకత -- చెప్పినాను కదమ్మా , కథలలోన ! లోకాల నేలేటి సామయే యగును, నీ బాలకోసమే దివినుండి, భువికి వచ్చినాడు తల్లీ !
ధరణీ దేవి -- ఎక్కడుంటాడు, ఎట్టి గుణములు కలవాడు ?
ఎరుకత -- ఒక్క చోటన నేమి ? అన్నిటా గలవాడు, నీ బాలకై ఇపుడు దగ్గరే యున్నాడు ! గుణము లన్నింట మా మంచి గుణమే సామిది , తెలుసుకోవమ్మా !
ధరణీ దెవి -- దగ్గరే అంటివి, ఎక్కడే ?
ఎరుకత -- ఇక్కడా, అక్కడా అని తలచబోకు, నీ బాలకై, ఇప్పుడు ఎంకటాచలం కొండ మధ్యలో ఉన్నాడు. తల్లీ !
ధరణీ దేవి-- నీ మాట నిజమని రుజువేమిటే ?
ఎరుకత --- తోటలో జరిగిన సంగతి చెలులనే అడుగుమా చెప్పేరు తల్లీ ! రేపో మాపో వచ్చు, మా యమ్మ లాంటి , ముసలమ్మ ఇటకు తా మనువు గోరి !
ధరణీ దేవి--- ఎవరో కులగోత్రాలు లేని వాడికి ఇవ్వమంటావా ?
ఎరుకత-- నీ బిడ్డ వానికే ఆలిగా జనియింఛినాది ! తప్పింప బమ్మకే కాదు మా యమ్మ ! మూడు లోకాలకి ముచ్చటై వెలిగే నా మాలాల నల్లనయ్య నీ అల్లుడే యగును !
ధరణీ దేవి--- అట్లు వాని కియ్యక పోతే ?—
( ధరణీ దెవి మాటలు విని పద్మావతి, మంచం మీద దుబ్బుమని పడి, ముడుచుకొంటుంది. అందరూ ఆమె వంక చూస్తారు )
ఎరుకత --- ఆ ! ఎంత మాట ! ఎంత మాట ! తప్పు, తప్పు --- ఆ అయ్యను కట్టుకోడానికే నీ బిడ్డ పుట్టింది. అట్లా కాదంటే నీ బిడ్డ నీకు దక్కదు !
( పద్మావతి గట్టిగా మూలుగుతుంది. చెలికత్తెలు ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టి చూస్తారు )
౧ చెలికత్తె-- రాకుమారి నుదురు కాలిపోతోంది !
౨ చెలికత్తె -- మాయదారి జ్వరం మళ్లీ వచ్చినట్లుంది !
౩ చెలికత్తె-- నిజమేనమ్మా ! మహారాణీ !
( ధరణీ దెవి గాభరా పడుతుంది. దిగ్గన లేచి కూతురు మంచం దగ్గరకు వెళ్లబోతుంది. ఎరుకల సాని ఆమె చెయ్యి పట్టుకొని ఆపుతుంది )
ఎరుకత--- దిగులు పడకమ్మా ! నా మాటలు ముమ్మాటికీ సత్తెమమ్మా ! ఎంటనే పెండ్లికి పురికొలుపు. లచ్చనంగా, పెండ్లి జరుగుతుందే ఓ యమ్మ ! నీ బిడ్డ లచ్చికే తోడు అవుతుంది, నమ్ము! రానున్న సిరికి మోకాలొడ్డకు ! ఆ నామాల ఆయనకే బిడ్డ నిస్తానని ఒప్పుకో ! ముడుపు కట్టుకో ! ---
ధరణీ దెవి-- నువ్వు చెప్పినట్లు మనువు మాట్లాడు ముసలమ్మ వస్తే చూస్తాము.
ఎరుకత--- చూచేదెమిటి ? ఇస్తానని మాట ఇయ్యోయమ్మా !
ధరణీ దేవి--- ( పద్మావతి వంక చూసి ) ముసలమ్మ వచ్చే మాట నిజమైతే నామాలయ్యకే నా బిడ్ద నిస్తా !
ఎరుకత -- శుభమమ్మా ! నీ మాట ఈడేరగలదమ్మా !
( ధరణీ దేవి పద్మావతి దగ్గరకి వెళ్లి, మంచం మీద కూర్చొని, ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకొని చూస్తుంది. పద్మావతి కళ్లు మూసుకొనే ఉంటుంది. ఆమె నుదుట చెమట పట్టి ఉంటుంది )
ధరణీ దెవి-- అమ్మాయికి జ్వరం వచ్చినట్లే వచ్చి, ఇప్పుడు తగ్గుతున్నట్లుందే ! నుదుట చెమట పట్టింది !
ఎరుకత--- అవునమ్మా ! జబ్బు ఇక బాధించదమ్మ ! --మధుర మీనాచ్చమ్మ, కంచి కామాచ్చమ్మ, కాశీ విశాలాచ్చమ్మ తోడౌను నీకు--- అమ్మా ! చిన్న దొరసాని--- నీ పెండ్లికి దేవతలే పెద్దలయ్యేరు ! మా తల్లి నమ్మవో యమ్మ ! మధుర మీనాచ్చమ్మ ! కంచి కామాచ్చమ్మ ! కాశీ విశాలాచ్చమ్మ !--- ( ఆంటూ గంప సర్దుకొని , బుడతడిని చంక నేసుకొని, బయలు దేరుతుంది )
( ఎరుకల సాని వెళ్లిపోయిన తరువాత ధరణీ దేవి, పద్మావతి ప్రక్కన కూర్చొని అడుగుతుంది )
ధరణీ దేవి -- అమ్మా ! పద్మావతీ ! నే నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా ?
( పద్మావతి మాట్లాడదు )
ధరణీ దేవి -- తల్లీ ! ఉద్యాన వనములో, నీ వొక గారడీరాయుని చూసావని, నీ చెలికత్తెలు చెప్తున్నారు. ఈ ఎరుకల సాని అతనెవరో నామాల నల్లనయ్య అని వర్ణించేస్తోంది ! నాకు అర్థమయినదేమిటంటే , నీ వెవరో పురుషుని చూసావని, అతనిని చూపులతోనే వలచావని--- నిజమేనా తల్లీ ?
( పద్మావతి తల్లి వంక చూసి చిరునవ్వు నవ్వుతుంది )
ధరణీ దేవి -- అర్థమయిందమ్మా ! -- ఎరుకల సాని సత్యమే చెప్పిందన్న మాట ! అలాగయితే ఇప్పుడే ఆ నామాల నల్లనయ్యకు ముడుపు కడతాను.
( అని పరిచారిక చేత ఒక పట్టు వస్త్రం తెప్పించి, దానిలో బియ్యం , పసుపు కొమ్ములు, బంగారు నాణాలు వేయించి, ముడుపు కడుతుంది )
( మరుక్షణం పద్మావతికి, శరీరం తేలికయినట్లు అనిపిస్తుంది. వెంటనే లేచి వచ్చి, తల్లిని కౌగలించుకొంటుంది )
( ప్రవేశం- ఓక పరిచారిక )
పరిచారిక -- మహారాణీ వారికి వందనములు ! --అమ్మా ! రాకుమారి స్వస్థత కోసం, అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయానికి పూజ చేయించడానికి వెళ్లిన చెలికత్తెతో, ఎవరో వకుళమ్మ అనే వృద్ధురాలు, కలిసి వచ్చింది. --- మీ దర్శనానికి ఎదురు చూస్తోంది !
( ధరణీ దేవి పద్మావతి ఒకరి ముఖాలోకరు చూసుకొంటారు )
ధరణీ దేవి -- ఎరుకల సాని చెప్పిన ముసలమ్మ ఆవిడే అయి ఉంటుంది ! -- సరే ! ఆమెను సగౌరవంగా, నా మందిరానికి తీసుకురా ! ( అంటూ లోపలికి వెళ్తుంది. పరిచారిక బయటకు వెళ్తుంది.)
****************
( దృశ్యము ౮౬ )
( ధరణీ దేవి అభ్యంతర మందిరం )
( దరణి దేవి కూర్చొని ఉంటుంది. ప్రవేశం పరిచారిక, వకుళామాతని వెంటబెట్టుకొని )
వకుళ – మహారాణీ వారికి నమస్కారం ! ( నమస్కరిస్తుంది )
ధరణీ దేవి --- కూర్చోవమ్మా, వేంకటాచలం ముసలమ్మా ! ఏం పని మీద వచ్చావు ?
వకుళ --- మంచి బాగా అన్నారు మహారాణీ ! నేను వేంకటాచలం ముసలమ్మనే ! తొలుత వరాహ స్వామి కొలువు చేసేదాన్ని. అతని ఆఙ్ఞపైన , వేంకటాచల రమణుడైన వేంకట రమణుని సేవ చేస్తున్నాను ! శ్రీనివాసుడని, బాలాజీ అని, , పిలువబడే వేంకటేశ్వరుడు నన్ను ’ అమ్మా’ అనే పిలుస్తాడు !
ధరణీదేవి -- నీ పాలిత పుత్రునికి, గారడీ రాయుడు, నామాల నల్లనయ్య అనే పేర్లు కూడా ఉన్నాయని విన్నాను !
వకుళ -- అదంతా లోకుల అభిమానమమ్మా ! ఏ పేరుతో పిలిచినా , ’ఓ’ యని పలికి, వారి అవసరాలు తెలుసుకొని ఆదరించేవాడు నా కొడుకు !
ధరణీ దేవి-- మనసులో మర్మాలు తెలుసుకో గలిగే అతనికి, మనసులు మాయ జేసే, ’ విద్య’ తెలియదా ఏం ? --నా కూతురు పద్మావతిని ఏ మాయ చేసాడో తెలియదు, అతనిని చూసిన దగ్గర నుంచి భయపడి జ్వరం పెట్టుకొంది.
వకుళ --- అది, భయపడి తెచ్చుకొన్న జ్వరం కాదమ్మా ! వలపు వల్ల వచ్చిన జ్వరం ! నీ కూతుర్ని చూసిన దగ్గర నుంచి, నా కొడుకు కూడ అదే పనిగా ఆమెనే తలపోస్తూ కూర్చొన్నాడు. ’ మాయ’ నా కొడుకు ఒక్కడే చెయ్యలేదు మహారాణీ ! వాడి బాధ చూడలేక మీ దగ్గరకు , పెళ్లి ప్రస్తావన తెచ్చేందుకు వచ్చాను.
ధరణీ దేవి --- పెళ్లి ప్రస్తావన ఎవరికమ్మా ?
వకుళ ---ఇంకెవరికో కాదు, నీ కూతురు పద్మావతికి, నా కొడుకు శ్రీనివాసునికి ఇచ్చి చేస్తివా, సర్వం శుభమవుతుంది !
ధరణీ దేవి --- కుల గోత్రాలు లేని వాడికా--- కూతురు నిచ్చేది ?
వకుళ --- తెలుసుకొంటే ఎందుకు తెలియదమ్మా ! నా శ్రీనివాసుని తల్లి తండ్రులు చంద్ర వంశపు రాజ దంపతు లయిన దేవకీ వసుదేవులు ! వారిది వశిష్ట గోత్రం ! వాని జన్మ నక్షత్రం శ్రవణానంద కరమయిన శ్రవణము !
ధరణీ దేవి -- కులము, గోత్రము తెలిసాయి, సరే ! భోగ భాగ్యాల మాటేమిటమ్మా ! అవి లేక కొండ కోనల నాశ్రయించి తిరిగే వాడికి----
వకుళ --- ( అడ్డుపడి ) ఏమంటివమ్మా మహారాణీ ? నా కొడుకు కొండ కోనల నాశ్రయించిన వాడా ! పోనీ అలాగే అనుకొన్నా, ఆ కొండ సామాన్యమయినదా ! కోరిన వారి కోర్కెలు తీర్చే కొండ ! -- సంతతి లేని నిన్ను ’అమ్మా’ అని పిలిచే కూతురినిచ్చింది ఆ కొండే నమ్మా మహారాణీ ! ఆ కూతురి చేత ”తమ్ముడు కావాలే” అని పలికించి, నిన్ను పుత్రవతిని చేసింది కూడా ఆ కొండేనమ్మా ! ఆ కొండని ఆశ్రయించని వారెవరమ్మా ? పెరటి చెట్టు మందుకి పనికి రాదన్న మాదిరి, నీకు దగ్గరగా ఉందని, ఆ కొండని చులకన చేస్తున్నావు !
( వకుళా మాత ఎత్తి పొడుపుకి ధరణి దేవి గతుక్కుమంటుంది )
ధరణీ దేవి--- నిజమేనమ్మా, కొండ మీది ముసలమ్మా ! నీ కొండ చాల గొప్పది ! నా కోర్కెలు తీర్చినది కూడ ఆ కొండేనని ఎలా మరచి పోగలను ?— కాని కూతురునిచ్చి పెళ్లి చెసేది ఆ కొండకి కాదు కదా ? ఆ కొండ మీద తిరిగే నీ కొడుకుకి కదా ! నీ కొడుకు గొప్ప ఏమిటో చెప్పు వింటాను.
వకుళ --- మహారాణీ ! ఇప్పుడు నీ గౌరవానికి తగ్గ మాట అడిగావు ! తల్లిని కాబట్టి నా కొడుకు గొప్పలు నేను చెప్పుకోను ! అలా చేస్తే ఆయు క్షీణం ! -- మీ రాజ దంపతులని పుత్రకామేష్టి యాగానికి పురి గొల్పిన ఆ శుక మహర్షినే అడిగి చూడు, అతని కన్నా బాగా తెలిసిన వారు యీ ప్రాంతాలలోనే లేరు !
ధరణీదేవి -- ( చేతులు జోడించి ) మాతా ! పరుషంగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి ! మీకు ఎన్నో విషయాలు తెలుసునని, మీరు కారణ జన్ములని అర్థమయింది ! చక్కని సలహా ఇచ్చినందుకు నా ధన్యవాదాలు ! శుక మహర్షిని సంప్రదించే వరకు, మీరు మా విడిదిలోనే విశ్రమించండి ! ( పరిచారికతో ) నీవు మహారాజుల కడ కేగి, రాకుమారి స్వస్థత చెందిన వార్త తెలియ జెప్పుము. నాతో అత్యవసరముగా మాట్లాడు పని యున్నదని చెప్పి, వారిని నా మందిరమునకు రమ్మని చెప్పుము, సత్వరము తెలియజేయుము, పొమ్ము !
( పరిచారిక నమస్కరించి వెళ్లిపోతుంది )
ధరణీ దేవి --- మాతా ! మీకు విశ్రాంతి గృహమునకు , దారి చూపించెదను రండు !
( అంటూ వకుళను తీసుకొని లోపలికి వెళ్తుంది )

Comments
Post a Comment