Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 19

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 19

( దృశ్యము 87 )

( ధరణీ దేవి అభ్యంతర మందిరం )

( ధరణీ దేవి, ఆకాశ రాజు కూర్చొని ఉంటారు )

ధరణీ దేవి -- ప్రభూ ! వివరంగా చెప్తాను వినండి. గత ఉగాది నాడు , రాజ సభలో దైవఙ్ఞులు, మన పద్మావతికి, పురుషోత్తముడైన వరుడు లభిస్తాడనీ, దేవతలే ఆమె పెళ్లికి పెద్దలవుతారనీ, చెప్పారు కదా !

ఆకాశ రాజు --- అవును, దైవఙ్ఞులు, అలాగే చెప్పారు !

ధరణీ దేవి--- ఆ పైన మన ఉద్యాన వనమున, ఒక వృద్ధ బ్రాహ్మణుడు, పద్మావతి చేయి చూసి, అదే విధముగా జోస్యముగా చెప్పినాడు.

ఆకాశ రాజు--- నిజమే ! ఈ విషయము మీరు ఇదివరకే తెలియజేసినారు !

ధరణీ దేవి-- అవును ప్రభూ ! ఆ తరువాత అదే ఉద్యాన వనమున, మన పద్మావతి ఒక సుందర పురుషుని సంధించి, అతని మీద మనసు పడి, బయటికి చెప్పలేక, లోన దాచుకోలేక జ్వరపడింది.. ఇదంతా ఒక ఎరుకల సాని తన సోదెలో చెప్పింది.

ఆకాశ రాజు -- దేవీ ! పద్మావతి సఖులు---

ధరణీ దేవి---- ఆ విషయమును ధృవ పర్చినారు ప్రభూ !

ఆకాశ రాజు --- మీరు మన అమ్మాయిని --

ధరణీ దేవి—అడిగి తెలుసుకొన్నాను మహారాజా ! ఆమె అతనిని ప్రేమించిన మాట నిజము ! -- వెంటనే ఎరుకల సాని చెప్పిన విధంగా , అతనికే పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని, ముడుపు కట్టగానే, పద్మావతి జ్వరం మటు మాయ మయింది !

ఆకాశ రాజు-- దేవీ ! మీరలా తొందర పడడం సబబు కాదేమో ఆనిపిస్తోంది.

ధరణీ దేవి--- పరిస్థితిని బట్టి అలా చేయడం తప్పని సరి అయింది ! ముందుగా అమ్మాయి ఆరోగ్యం బాగయితే చాలని, ఆ యువకుని నుండి, వివాహ ప్రస్తావన ,వస్తే చూసుకోవచ్చునని, అలా చేసాను.

ఆకాశ రాజు --- ఇంతకీ ఆ యువకుడెవరు దేవీ ?

ధరణీ దేవి-- అతని నివాసం వేంకటాచలమట ! తల్లి తండ్రుల ఫేర్లు దేవకీ వసుదేవులట !

ఆకాశ రాజు-- అతని తల్లి తండ్రులు గతించినారా దేవీ ?

ధరణీ దేవి -- మీరు ఊహించినది నిజమే ప్రభూ ! తల్లి తండ్రులు గతించినారు. పాలిత మాత ఉన్నది.ఆమె పేరు వకుళా దేవి ! అతని నివాసము వేంకటాచలమే ! పెర్లు చాల ఉన్నాయి.- వేంకట రమణుడనీ, శ్రీనివాసుడనీ విన్నాము !

ఆకాశ రాజు-- ఈ వివరము లన్నియు ఎట్లు తెలిసినవి ?

ధరణీ దేవి --- అతని పాలిత మాత వకుళామాత వివాహ ప్రస్తావన తెచ్చినది. ఆమెను మన విశ్రాంతి గృహమున యుంచి మీ కడకు కబురంపితిని.

( ప్రవేశం పరిచారిక )

పరిచారిక -- మహారాణీ వారికి నమస్కారము ! మహారాజుల వారికి జయము ! శుక మహర్షులవారు వచ్చి, ప్రవేశమునకు అనుమతి కోరుతున్నారు.

( రాజ దంపతులు ఒకరి ముఖాలు, మరొకరు చూసుకొంటారు )
ధరణీ దేవి-- ప్రభూ ! వేంకట రమణుని పాలిత మాత, తన పుత్రుని కీర్తి ప్రతిష్టలను, శుక మహర్షుల వారిని, అడిగి తెలుసుకోమన్నది ! ఈ సమయమున వారి రాక, దైవ ప్రేరితము వలె నున్నది.

ఆకాశ రాజు --- దేవీ ! మహర్షుల ఆశయములు సద్యః ఫలితముల నిచ్చునవి ! మనము సంతతి కొరకు తపించు తరుణమున ఈ శుక మహర్షి తనంత తానుగా విచ్చేసి, మన సమస్యకు పరిష్కారము సూచించిన వారైరి ! ఇప్పుడు ఆమె వివాహ ప్రస్తావన సమయమున, అతని రాక, మన ప్రస్తుత సమస్యకు పరిష్కారము కాగలదేమో ! ( పరిచారికతో ) శుక మహర్షుల వారిని సగౌరవమగా ప్రవేశ పెట్టుము.నీ వెంట మరికొందరు పరిచారికలను---

ధరణీ దేవి --- ప్రభూ ! పరిచారికలెందుకు నేనే ఎదురేగి వెళ్లి, అతనికి స్వాగతము పలికెదెను.

ఆకాశ రాజు--- లెస్స పలికితివి దేవీ ! నీ వెంట నేనును వచ్చెదను.

*****************

( దృశ్యము 88)

( ధరణీ దేవి అభ్యంతర మందిరం )

( పరిచారికలు పూల పళ్లేలటో , పూలని జల్లుతూ రాగా, ఆకాశరాజు, ధరణీ దేవి, శుక మహర్షిని వెంట పెట్టుకొని లోపలికి ప్రవేశిస్తారు )

( శుకమహర్షిని ఆశీనుని చేసి, రాజు రాణి కూర్చొంటారు )

శుక --- ఆకాశ భూపతీ ! అందరూ కుశలమే కదా ?

ఆకాశ రాజు--- మీ రాక వల్ల సర్వ శుభములు కలిగి, రాజ్యమంతయు కుశలమైనది. మహర్షీ ! తపో భూమి వదిలి, మీరిట్లు కదలి వచ్చుటకు కారణమేమి ? కబురంపిచినచో మేము వచ్చు వారము కదా ?

ధరణీ దేవి--- మహర్షీ ! ఎంత కాలమునకు యీ పుత్రికపై మీకు దయ కలిగినది !

శుక --- పుత్రీ, ధరణీ దేవీ ! నీ ఆధరాభిమానములకు చాల సంతోషమైనది. ఆశ్రమము విడిచి లోకుల ఆవాసములకు వచ్చుట నాకు అలవాటు లేని పని , అంతియె గాని మీ రాజ దంపతులపై అభిమానము లేక కాదు !

ధరణీ దేవి --- అవును ఊరక రారు కదా మహాత్ములు—

శుక ---- నిజమేనమ్మా ! శ్రీనివాసుని పాలిత మాత వకుళా మాత వేంకటాచలమును వదలి, మీ రాజ మందిరమునకు వచ్చిన వార్త తెలిసి, ఆమె దర్శనము కొరకై , నే నిటుల వచ్చితిని. ఆమెను కొండపై కలుసుకొనుట కుదురట లేదు !

( రాజ దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటారు )

ఆకాశ రాజు--- మహర్షీ ! మీరు--- మీ వంటీ మహనీయులు , ఒక సామాన్య వృద్ధ మాత దర్శనమునకై, పని గట్టుకొని వచ్చినారా !? ఆశ్చర్యముగ నున్నదే !

శుక --- ఆకాశ భూపతీ ! ఆమె సామాన్యురాలు కాదు, ద్వాపరమున లోక కళ్యాణమునకై పుట్టిన శ్రీ కృష్ణుని బాల్య లీలలు స్వయముగా వీక్షించిన యశోదా మాత !

ఆకాశ రాజు--- మహర్షీ ! శ్రీ కృష్ణుని తల్లి తండ్రులు దేవకీ వసుదేవులు కదా !

శుక -- నిజము మహారాజా ! కారణ వశమున అతడు, దేవకీ గర్భమున జన్మించినను తన శైశవ ప్రాయ మంతయు యశోదా మాత కడనే గడపెను..

ఆకాశ రాజు --- మహర్షీ ! మీరు ఇప్పుడు చెప్పిన ఈ వకుళా మాత----

శుక ---- ( నవ్వి ) యశొదా మాతయే, జన్మాంతరమందు వకుళామాత అయినది.!-- తన పాలిత పుత్రుని, శైశవ లీలలే తప్ప, కళ్యాణ వేడుకలు చూడని, ఆమె కోరికను,--- ఈ జన్మలో తీర్చుకొనుటకై, ఆమె -- మీ కడకు వివాహ ప్రస్తావన తీసుకొని వచ్చినది.

ధరణీ దేవి-- మహర్షీ ! అటులయిన -- ఆ వేంకట రమణుడు !!—

శుక --- శ్రీ కృష్ణుడేనమ్మా ! అవతార మూర్తులకు యుగబేధములు జన్మజన్మాంతరములు, లెక్కకు రావు పుత్రీ !

ఆకాశ రాజు-- మహర్షీ ! అటులయిన శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువే నన్నమాట !!

శుక -- ఆకాశ భూపతీ ! సందేహించకము ! ( పద్యము )

ఉ--- అతని వంటి సుందరుడహర్పతి తేజుడు, విశ్వవాఙ్ఞ్మనో
తీతుడు, ధర్మవర్తి, రణధీరుడు, సద్గుణమూర్తి, లోక వి
ఖ్యాతుడు, దేవపూజ్యుడు, మహామహిన్వితుడైన యట్టి, జా
మాత లభించుటెన్న, నతిమానుష పుణ్య ఫలంబు సూ నృపా !

ఉ-- కావున నొండు మాటనక, గారవమారగ వానికీవు, ప
ద్మావతి నిచ్చి, పెండిలి యధావిధి సేయుము, సప్త పూరుషం
బీవల, నావలన్ నృప ! త్వదీడ్య కులంబు తరించు, లోక సం
భావిత పుణ్యముల్, త్రిదివ వాసము నీకు లభించు భూవరా !

( ప్రవేశం పరిచారిక, దారి చూపుతూ ఉండగా, వకుళా మాత )

వకుళ --- మహర్షీ ! నా కొడుకు కీర్తి ప్రతిష్టలేనా చెప్తున్నారు !!

శుక --- ( లేచి నిలబడి నమస్కరించి) ప్రణామము మాతా ! మీ దర్శనమునకై వచ్చి, ప్రసంగ వశమున శ్రీనివాసుని గురించిన సందేహములను ----

వకుళ --- పటాపంచలు చేసారన్నమాట !

( వకుళామాత మాటలకు అందరూ నవ్వుకొంటారు )

******************

( దృశ్యము 89)

( వేంటాచలం పుట్ట )

( శ్రీనివాసుడు కూర్చొని ఉంటాడు )

( ప్రవేశం శుక మహర్షి, వచ్చి శ్రీనివాసునికి నమస్కరిస్తాడు )

శుక --- శ్రీనివాసా ! అవతార కారకుడ వైన నీవు, ఒక సరస్సు లాంటీ వాడివి. నీ అవతారాలన్నీ ఆ సరస్సునుండి బయలు దేరిన కాలువల వంటీవి. ( శ్లోకం )

శ్లోకం--- అవతారహ్య సంఖ్యాయాః / హరే స్సర్వనిధైః ద్విజాః
యదా విదానః కుల్యాః / సరసున్యుః సహస్రశః

ఈ కలి యుగమున ఆశ్రితులను కాపాడే అర్చారూపం దాల్చనున్న నీకు నా సహస్ర కోటీ వందనాలు.

శ్లోకం---- వేంకటేశాయ విద్మహే, త్రిపతి నాధాయ ధీమహి, తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ !

( అంటూ శుకుడు శ్రీనివాసునికి సాష్టాంగ ప్రణామం చేస్తాడు )

(శ్రీనివాసుడు శుకుని లేవదీస్తాడు )

శ్రీనివాస ---- శుక మహర్షీ ! మీ రొనర్చిన ఈ వేంకటేశ గాయత్రీ మంత్రం మిక్కిలి మహిమాన్వితమగు గాక ! అంతియే కాదు, మీరు నాకిచ్చిన ’త్రిపతి’ నామధేయముతోనే యీ ప్రాంతము ప్రసిద్ధమగుగాక !

శుక --- దేవదేవా ! మీరు నా మీద చూపించిన గౌరవమునకు ధన్యడనయితిని.నేను వచ్చిన పని మీకు తెలియనిది కాదు. అయినను వచ్చిన కారణము విన్నవించుకొంటున్నాను.వినుడు-- చోళ రాజగు ఆకాశ భూపతి , అతని ధర్మపత్నియగు ధరణీ దేవి దంపతుల గారాబు పట్టి, కుమారి పద్మావతిని, మీకిచ్చి వివాహము చేయుటకు సమ్మతించి ,బృహస్పతి చేత వ్రాయించిన శుభలేఖను, మీకు ఇచ్చుటకై వచ్చినాడను, స్వీకరింపుడు !

( అని శుభలేఖను శ్రీనివాసునికి ఇస్తాడు. శ్రీనివాసుడు శుభలేఖ చూస్తూ ఉంటాడు )

( ప్రవేశం వకుళామాత , చేతులో ఆకు దొన్నెలలో తేనె , కంద మూలాలు తెస్తుంది )

వకుళ --- మహర్షీ ! ముహూర్తం చాల బాగుంది ! నా కొడుకు బదులు నేనే చెప్తున్నాను. వానికి అంగీకారమే ! ఇదుగో ఈ జుంటి తేనె కంద మూలములు సేవించి, వానిని ఆశీర్వదించి వెళ్లండి.

( శుకుడు ఆమె తెచ్చినవి ఆప్యాయంగా తింటాడు )

శ్రీనివాస--- శుక మహర్షీ ! అమ్మ అంగీకరించింది కనుక నాకు అంగీకారమే !

వకుళ --- ( నవ్వి ) కుమారా ! నా మాట మన్నించినందుకు చాల సంతోషం ! ముందుగా ఈ వార్తను వరాహ స్వామికి తెలియజేసి, వారి ఆశీస్సులు పొందుము. ఆ పైన ఆకాశ భూపతి పేర , ప్రతి శుభలేఖను వ్రాసి , శుక మహర్షి కిచ్చి పంపుము.

శ్రీనివాస -- తల్లీ ! అటులనే చేసెదను.ఆదిశేష, గరుత్మంతులకు వివాహ శుభలేఖలను ఇచ్చి,సత్యలోక, తపోలోక, కైలాస, నాగ లోకముల లోని, దేవ గణము లందరినీ, ఆహ్వానించెదను.

వకుళ--- ఆహా ! ఏమి నా భాగ్యము ! నీ పెళ్లికి తరలి వచ్చే దేవతా సమూహములను, కనులార కాంచు తరుణము వచ్చినది కదా ! శ్రీనివాసా ! నా జన్మ ధన్యత నందినది కదయ్యా !

*******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ