{ కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలని కొన్ని వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ చుక్కాని పక్ష పత్రిక ౧౫ మార్చి ౧౯౬౩ సంచికలో ప్రచురించారు. ఆ కథలని ‘క్షీరగంగలో’ పరిచయం చేయడానికి సంకల్పించాను.}
అది పడైవీడు క్షేత్రం !
రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది.
ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’.
“ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’.
“ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ.
“ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు పటాపంచలయ్యే ‘ ఛిన్నమస్త’ యొక్క చరిత్రను చెప్తాను ,సావధానంగా విను.ఇక్కడకి క్రోసు దూరంలో ‘ పడైవీడు’ అనే గ్రామం ఉంది. అది పూర్వం కుండిన పురి. దానికి నందన నగరమని పేరు కూడా ఉంది.పడైవీడు అంటే, ‘అరవ భాషలో’ సైనికుల విడిది అని అర్థం ! దానికి తగిన గుర్తులు నీకు ఈ ప్రాంతంలో కొల్లలుగా కన్పిస్తాయి.”
వేద కాలంలో ఈ సహ్యాద్రి ప్రాంతం ‘ జమదగ్ని’ మహర్షి యొక్క గురుకులంగా ఉండేది. ఆ శిఖరాన్ని గమనించు ! దాన్నే ‘ చంద్రగిరి’ అని అంటారు. అక్కడే జమదగ్ని యొక్క ఆశ్రమం ఉండేదట ! ఇక్కడ ప్రవహిస్తున్న నది , జమదగ్ని మహర్షి యొక్క కమండలు ధార అని ప్రసిధ్ధి ! నది ఒడ్డున జమదగ్ని యొక్క యఙ్ఞవాటిక ఉండింది. ఈ నాటికిని ఆ ప్రాంతంలో ఎక్కడ త్రవ్వినా విభూతి మట్టి దొరుకుతుంది ! జమదగ్ని యొక్క పత్ని పేరు ‘ రేణుక’. ఆమె చరిత్ర పావన తమం ! తలుస్తేనే శరీరం గగుర్పాటు చెందుతుంది !”
‘‘ఈ సందర్భంలో నీకు కొంత ఆధ్యాత్మిక విషయాన్ని చెప్పవలసి ఉంది అది ప్రస్తుతం కూడ ! దశమహావిద్యలనే మాటనీవు వినే ఉంటావు. పరాశక్తి యొక్క దశ విధములైన శక్త్యూర్ములనే దశమహావిద్య అంటారు ! ఇది అధ్యండం లోను, అధి పిండం లోను నిత్యం చేష్టిస్తున్న శక్తి విలాసములే ! ౧. లలిత శక్తి--- సహస్రార గతమైన పరాశక్తి యొక్క కళ ౨. ఛిన్నమస్త--- ఆఙ్ఞా చక్రములో విజృంభిస్తుంది ! ౩. కాళి --- హృదయ స్థానంలో ఉంది ! ఈ హృదయ స్థానాన్ని భద్ర కవాటం అని వర్ణిస్తారు తాంత్రికులు ! ౪. త్రిపుర్ భైరవి --- మూలాగ్ని కుండ గత శక్తి ! ౫. సుందరి ( భువనేశ్వరి )—ప్రఙ్ఞా స్థాన కళ ! దీన్నే శుధ్ధ సంవిత్ అని అంటారు యోగులు. ౬.జ్యేష్టనే --- చిచ్ఛక్తిగా వర్ణిస్తారు. దీన్ని ఉపాసించిన వారికి
నిర్వికల్ప సమాధి ఏర్పడుతుంది ! ౭.తారనే --- పశ్యంతీ వాక్కుగా క్రాంత దర్శకులైన యోగులు పేర్కొన్నారు. ఈ శక్తి మణిపూర చక్రమందు ఉందంటారు తాంత్రికులు ! ౮. మాతంగిని --- వైఖరీ వాక్కుగా కీర్తించారు. ఇది జిహ్వా రంగంలో తాండవిస్తుంది. ౯. బగళ --- స్తంభన శక్తి అని అంటారు.౧౦. కమలనే --- లక్ష్మీ కళగా వర్ణించారు.! ఇవే మహా విద్యలు !
“ ఈ రేణుకాలయమందు “ ఛిన్నమస్త” ప్రతిభావిస్తుంది ! ఈమె ప్రచండ చండి !
ఛిన్నం శిరం కీర్ణం కచం దధానాం
కరేన కంఠోద్గత రక్త ధారాం !
రామాంబికాం దుర్జన కాళ రాత్రీం
దేవీం పవిత్రాం మనసా స్మరామి !!
అని వాసిష్ఠ గణపతి మునీంద్రులు ప్రచండ చండి అవతారమగు రేణుకను గానం చేసి ఉన్నారు. ఇక కథను విను.
**************
ఇది వేదకాలం లోని పవిత్ర చరిత్ర !
కృతుడనే వాడు మరీచి పుత్రుడైన కశ్యప మహర్షి శిష్యుడై తన బ్రహ్మచర్య వ్రతాన్ని గురుచరణ సన్నిధానంలో గడిపాడు. పాతికేళ్ల ప్రాయం లోనే కృతుడు సర్వ శాస్త్రాలను అధ్యయనం చేసి ఋషితుల్యుడయ్యాడు ! కశ్యపుడు శిష్యుని ప్రఙ్ఞా సంపత్తికి మెచ్చుకొన్నాడు. “ కృతా ! ఈ గురు కులంలో సంపూర్ణ విద్యా పట్టభద్రుడవయ్యావు. ఒక యదేచ్ఛగా వెళ్లి గార్హస్థ్యాన్ని స్వీకరించి లోక కళ్యాణమునకై నీ జీవితాన్ని అంకితం చేసుకో !”
దైన్య భావంతో ఇంకా తన ఎదుటనే నిలబడి ఉన్న కృతుణ్ని గమనించి కశ్యప మహర్షి మందహాసంతో మరల అన్నాడు.
“నాయనా ! నీవేమి చింతిస్తున్నావో గ్రహించాను. నీవు పదిహేను సంవత్సరాలు భక్తితో సేవ చేసావు. చేసిన సేవయే గురుదక్షిణగా స్వీకరించాను ! నీ భావి జీవితం తేజోవంతం చేయాలని భగవన్ ఇంద్రుని ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను.! వెళ్లిరా !”
శిష్య వత్సలుడైన గురువు వాక్యం వల్ల మనస్సు తేలికపడ, కృతుడు మరీచాశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
కృత ఋషి దేశాటాన కావిస్తూ అనేక గురుకులాల్ని సందర్శించాడు. పుణ్య తీర్థాల్లో స్నానం చేసాడు. తుదకు వింధ్యాద్రి దాటి విదేహ దేశంలో అడుగు పెట్టాడు. ‘శిప్రా – (ఇప్పటి పేరు) నదీ ప్రాంతం లోని ప్రకృతి సంపదని చూసి ఆనందించి, కొంత కాలం అక్కడ తపో వృత్తిలో గడుపుదామని తీర్మానించాడు.కరండి అనే గ్రామం నదీ తీరంలోఉంది. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు కృత ఋషి.
కరండి గ్రామంలో ఆర్యులు, అనార్యులు ఉన్నారు. వారు అన్యోన్యం కలసి మెలసి సోదర భావంతో ఉంటున్నారు ! కొన్ని ఆచార నియమాల్లో ఇరువురు భిన్నులైనా దేవతారాధన విషయంలో సమ స్థాయిలోనే ఉంటూ ఉండేవారు !
కృతఋషి విఙ్ఞాన వృధ్ధిని గమనించి బుధ్ధిమంతులైన కరండి గ్రామ జనులు ఒక గురుకులాన్ని అతని ఆధ్వర్యం క్రింద నెలకొల్పారు ! వారి సదుద్దేశాన్న పూర్తిగా ప్రోత్సహించాడు ఉజ్జయినీ నగర పాలకుడు,‘ నేమి’ మహారాజు !
కృతుని యజమాన్యంలో కరండీ గురుకులం మంచి వృధ్ధి లోనికి శీఘ్రకాలంలో వచ్చింది !
కాలం శర వేగంతో పయనించింది. ఆ కాలానికి తాళ హంగుని జతకూర్చి జగన్నాటక సూత్రధారియైన విధి, కృత ఋషి వంటి తపోధనుని తన ప్రభావ జాలంలో ఇరికించింది ! ‘నేమి రాజపుత్రి వీరాదేవి’ ప్రేమ కట్టాక్షాలనే జాలాన్ని కృతునిపై నేర్పుగా విసిరింది ‘ విధి’ !
మన్మథుని ఆరవ బాణమైన మోహనాంగి వీరాదేవి ప్రేమ కటాక్షాలని తిరస్కరించ లేక పోయాడు కృత ఋషి ! నేమి మహారాజు వీరి ప్రేమని గుర్తింపక పోలేదు ! చిరకాలం నుండి
ఆర్యఋషితో సంబంధం కలపాలని వాంఛిస్తున్న , నేమి భూపాలుడు తన కుమార్తె యొక్క కోరికను నెరవేర్చుటకే తీర్మానించాడు !
వీరా కృతుల వివాహం జరిగిపోయింది ! వారిద్దరి ప్రణయ ఫలితమే ‘ కార్తవీర్యార్జునుడు’ !!
*******************
విరోచనుడు కుండలీపుర వాస్తవ్యుడు !
‘పురి’ వాచకం గౌణంగా వర్తిస్తుంది. అది ఒక కుగ్రామం.
విరోచనుడు పంచమ జనుడు. ఆ కాలంలో ఆర్యులు, అనార్యుల్లో కొందరిని ‘పంచమ జనులని’ వర్ణించారు !
‘విరోచనుడు’ వృత్తిలో కమ్మరి. వాని భార్య పేరు ‘ వజ్ర’. వజ్రా విరోచనులు ఆదర్శ దంపతులు ! వారికున్న పెద్ద లోపం ఒకటే ! అదే సంతానం లేకపోవడం !
విరోచనుడు ఒకనాడు గండ్ర గొడ్డలిని తీసుకొని కర్రలకై అడవికి వెళ్లాడు.
అప్పుడు మిట్టమధ్యాహ్నం, నభోమణి ఆకాశ మధ్యంలో తన చండ కిరణాల్ని వెదజల్లుతూ ప్రకాశిస్తున్నాడు. విరోచనుడు కర్రతో కొట్టి ఎండ వేడికి అలసిపోయి పెద్ద మర్రిచెట్టు క్రింద మేను వాల్చి నిద్రపోయాడు.
ఆ నిద్రలో ఏదో గిలిగింత పెట్టినట్లు అయింది ! మెల్లగా కండ్లు తెరచి చూసాడు !
ఎదురుగా భయంకరమైన ఎలుగుబంటి నిలబడి ఉంది ! వేటలో ప్రఙ్ఞ గల విరోచనుడు మొలలో బాకుని పెరికి లాఘవంతో లేచాడు! ఎలుగుబంటి ఏ మాత్రం చలించకుండా పండ్లికిలించి గురుగుర శబ్దం చేసింది ! ఆ భీకర జంతువు సాధువుగా నిలబడి ఉండడంలో ఏదో ఆంతర్యం ఉందని గ్రహించాడు. విరోచనుడు !
ఎలుగురాయుడు తన గుండెలకి హత్తుకొని ఉన్న ఒక శిశువుని మెల్లగా క్రిందకి దించి, అక్కడ ఆగకుండా త్వరిత గమనంతో వెళ్లిపోయింది !
విరోచనుడు శిశువుకి దగ్గరగా వెళ్లాడు. అతని కండ్లు ఆనందంతో తాండవించాయి !
ఆ శిశువు నింగి నుండి క్రింద పడిన చంద్ర బింబంలాగ ఉంది ! దాని తనూలత మిలమిలమని నక్షత్రం వలె మెరుస్తూంది !
ఆ బిడ్డ తనకి ఈశ్వర వర ప్రసాదమని తలంచి విరోచనుడు పొంగిపోయాడు ! కర్రల్ని కూడ లెక్కచేయక శిశువుని తీసుకొని వెళ్లి భార్య చేతికి సంధించాడు !
ఆ దంపతులు శిశువునకు తల్లి తండ్రులై అల్లారు ముద్దుగా పెంచారు. శిశువునకు ‘ రేణుక’ అని నామకరణం చేసారు !
*****************
రేణక యందు పదిహేను వసంతాలు నవనవోన్మేష సౌందర్యంతో వికసించాయి !
ఆమె యందు ముగ్ధ యొక్క లక్షణాలు, ప్రౌఢ యొక్క అంగ సౌష్టవం కనిపించాయి !
రేణుక పసిడి బొమ్మ ! ఆ నిగారింపు, బంగారంలో లావణ్య వారి మెరుపు తివ్వ వలె ప్రకాశించింది ! సుకుమారములైన ఆమె అంగాల్లో మంచి పాటవం కన్పిస్తుంది ! ముక్కు, చిగురు పెదిమలు, పలువరస ఆ ముగ్ధ యొక్క వదన చంద్రునిలోఎన్నతగిన సౌందర్య ఖండాలు ! శ్రీకారాభ శ్రోత్రములతో మంతనాలాడు ఆమె సోగ కనుల మార్దవం, పక్ష్మలత్వం,తేజస్సు వర్ణనాతీతం ! ఆమె తనూలత విద్యుల్లత వలె మహోజ్వల కాంతికి ధామం !
రేణుక అందాల భరిణ ! పల్లెజనులు ఆమెను దేవకన్య అని గౌరవిస్తారు ! ఒకనాడు రేణుక తల్లి తీవ్రమైన మన్య జ్వరానికి గురి అయింది. ఆమె శరీరం కొలిమిలో లోహ ఖండం వలె మండిపోతూంది ! విరోచనుడు లోహ వస్తువులను సంతలో అమ్మకానికి తీసుకొని వెళ్లాడు. తిరిగి ఇంటికి రావడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది.
“ అమృత వల్లి మూలిక తెలుసా ? సెలయేరు ప్రక్క ప్రాకి ఉంటుంది ! ఒకమారు మీ నాన్నగారు తెచ్చారు కాదూ ?” అని రేణుకను ప్రశ్నించింది వజ్ర.
“ అవునమ్మా, తెలుసు.” అని బదులిచ్చింది రేణుక.
“ సూర్యోదయానికి ముందుగా సెలయేటి ఒడ్డుకి వెళ్లి, ఆ మూలికని తీసుకొని రాగలవా ? ఈ పాడు జ్వరం వదలకుండా ఉంది.”
“ సరేనమ్మా !”
అరుణోదయం కావస్తోంది. రేణుక పడకపై నుండి లేచింది. తల్లిని చూసింది..అప్పుడామె మగత నిద్రలో నిద్రిస్తోంది.
రేణుక గండ్ర గొడ్డలిని చేత ధరించి విసవిస నడిచి సెలయేటిని సమీపించింది. అదేమీ పెద్ద ఏరు కాదు ! అక్కడక్కడ చిప్ప చిప్పలుగా నీరు కన్పిస్తూంది. ఏటి నిండా కంకర రాళ్లున్నాయి. కొన్ని పెద్ద రాళ్లకు ప్రాకుడు పట్టి అరుణ రాగంలో వింత శోబని ఇస్తున్నాయి !
రేణుక తీరాన్ని అంటి అడుగుల్లో అడుగులు వేసుకొంటూ నడుస్తూంది. ఆమె అక్కడ ఒక్కొక్క తివ్వనీ పరీక్షిస్తూంది.
అప్పుడే భూమి పాటారింది, గ్రామంలో నుండి కుక్కుట ధ్వని వినవస్తూంది ! అరుణ రాగంతో ప్రక్కలంట తెల్లని మబ్బు తునకలు కలిసినందున తూర్పు దిశ శోభాయమానంగా ఉంది ! కొన్ని పక్షులు చెదరిన మేఘ శకలాల లాగ నింగిని కిలకిలా రావంతో పయనిస్తున్నాయి !
ఉన్నట్లుండి తూర్పు దిశ సింధూర కాంతిని వెదజిమ్మింది ! రేణుకకి ఇంకా మూలిక దొరక లేదు. ఆమె మరికొంత దూరం ముందుకి సాగింది
వెనకనుండి గుర్రపు డెక్కల చప్పుడు ధ్వని ! రేణుక సంభ్రమంతో వెనుదిరిగి చూసింది .
ఎత్తైన నల్లని ఉత్తమాశ్వంపై బంగారు కాంతిని చిమ్ముతున్న కవచాన్ని ధరించిన యోధుడు ఆమె కంటికి ప్రత్యక్ష మయ్యాడు.అంత ఉన్నతమైన అశ్వాన్ని , అంత ఉన్నత కాయం కల పురుషుణ్ని రేణుక చూసి ఉండలేదు ! అశ్వరాజం రేణుకని సమీపించింది.
“ అమ్మాయీ ! ఏం వెతుకుతున్నావ్ ? నీవు ఎవరి పిల్లవు ?” అని యోధుడు ప్రశ్నించాడు. యోధుని కంఠ ధ్వని వర్షాకాల పయోధరంలో నుండి నిర్గమించే ఉరుము లాగు వినిపించింది.
యోధుడు స్ఫురద్రూపి ! వాని ఆకర్ణాంత రక్త నయనాల విస్తృతి శృతిని మించి ఉన్నాయి. మీసకట్టు తేనెటీగల గుంపు వలె వాని మూఖ శోభకి వెన్నె తెస్తూంది ! చెవులకి వ్రేలాడు మణికుండలాల కాంతి ,సూర్యకిరణ భ్రాంతిని కలిగిస్తూంది ! వాని ఉన్నతమైన నాసిక, వాని హృదయగత రాజసాన్ని ఎత్తి చూపుతూంది ! వాడు బంగారు ఉష్ణీవాన్ని ధరించి ఉన్నాడు. దానిపై పొదగబడిన నవరత్నాలు విధవిధములైన కాంతుల్ని చిమ్ముతున్నాయి !
అతడే చక్రవర్తి ‘కార్తవీర్యార్జునుడు !’
రేణుక వానికెట్టి బదులు ప్రసాదించలేదు. వాన వేషం ఆమెకు వింతగా ఉంది ! ఆమె వాని ప్రశ్నకి బదులుగా చిన్న మందహాసం ప్రదర్శించింది !
ఆ మందహాసం కార్తవీర్యుని హృదయాకాశానికి వెన్నెలయింది !
“ సుందరీ ! నీ పేరేమి ?” అని ప్రశ్నించాడు.
“ నా--- నా –పేరా ? – వజ్రవైరోచని ” అని బదులిచ్చింది ఆమె తడబడుతూ !
“ అబ్బో ! పేరు చాల గంభీరంగా ఉందే !”
“ నా పేరు మాట అటుంచు, నీ వేషం , అబ్బే చాల వికృతంగా ఉంది !” అని బదులిచ్చింది రేణుక.
“పిల్లా ! నా గుర్రం పైన ఎక్కి నాతో వస్తావా ? నీకు అనేక వింతలు చూపిస్తా.”
“ ఏం వింతలు ?”
“అంతఃపురం, నందన వనాలు, రకరకాలైన పానీయాలు, విధవిధాలైన రత్నాలు, చీని చీనాంబరాలు, ఇత్యాదులు ” అని నవ్వాడు.
“ నీవు చెప్పిన వింతల అర్థం నాకు తెలీదు. కావాలంటే నేనొక వింతని నీకు చూపెట్టగలను.”
“ ఓహో ! అలాగా, మరీ మంచిది, ఏం వింతో ?”
“ నీవు అలాగే ఉండు, నీ శిరస్సుపైన ఉన్న వికారమైన బరువుని ఒక్క క్షణంలో ఈ గండ్ర గొడ్డలితో క్రిందకి దొర్లిస్తాను.” అని కిలకిలా నవ్వింది.
ఎంతటి అవమానం ! చక్రవర్తి భ్రుకుటిని ముడిపెట్టాడు. వాని కండ్లలో ఎరుపు కాంతి రెట్టించింది ! వాని పెదిమలు వణికాయి ! వాని విశాల వక్షం విప్పారింది !
“ దుడుసు పిల్లా ! నేనెవర్నో తెలియక జల్పిస్తున్నావ్ ! ఇదిగో ఇప్పుడే నిన్ను నా గుర్రంపై ఎక్కించుకొని వెళ్తాను. నన్ను ఎలా ప్రతిఘటిస్తావో చూస్తాను !” అన్నాడు కోపంతో.
వాని గుర్రం సకిలించింది ! అది ముందరి కాళ్లని మీదికెత్తింది ! అంతే , కనురెప్ప పాటులో గండ్ర్ర గొడ్డలి రివ్వుమని దూసుకొని వెళ్లింది. దాని పాటు ఎట్టిదో రేణుక చూడలేదు ! ఆమె పరుగు తీసింది, ఎంత వేగం ? లేడిలా పరుగెత్తింది రేణుక ! నదిని ఒక్క అంగలో దాటింది ! వెనక గుర్రం చప్పుడు కూడ ఆమెకి వినిపించ లేదు. ఆమెలో ఏదో వింత శక్తి ప్రవేశించింది కాబోలు ! ఆమె గాలిలో పయనిస్తున్నట్లు భావించింది !
రేణుక మెదడు శూన్యమయి పోయింది ! కండ్లు చీకట్లు క్రమ్ముకొన్నాయి ! చైతన్యం తప్పి వెల్లకిలా ఒక ,మర్రిచెట్టు బోదెపై పడిపోయింది ! ఆమె బాహువులు వనక నుండి మర్రిచెట్టునే కాబోలు కౌగలించుకొన్నాయి !!
అంతర్లీనుడై సమాధి యోగంలో ఉన్న మహర్షి జమదగ్ని ఉలిక్కిపడి కండ్లు తెరచాడు !
అతని కంటికి ఎదురుగా నేలపై కన్పడింది మిలమిల బాలసూర్య కిరణాల్లో మెరుస్తున్న గండ్రగొడ్డ్డలి ! ఒక యోధుడు నల్లని గుర్రంపై వంద గజాల దూరంలో దౌడు తీస్తున్నాడు ! తరువాత తన తొడలపైన ఒక యువతిని చూసాడు ఋషి పుంగవుడు ! విస్తృత వినీల కచభరం యొక్క మధ్య చందమామ వలె ఆ యువతి ముఖం మహర్షిని ఆకర్షించింది ! ఉరోజాల పైన నున్న వస్త్రం సడలినందున బంగారు తామర మొగ్గల వలె ఆమె ఉరోజ చక్రవాక మిథునం , మహర్షి కండ్లకి విందు కావించింది ! నడుముని చుట్టి ఉన్న ఆమె బాహులత కేతకీ దళాల నునుపుతో మహర్షి శరీరానికి మధురమైన స్పర్శానుభూతిని కలిగించింది !
మహర్షి రేణుక ముఖాన్నిచూసాడు.చూడ తగ్గదాన్నిచూసినట్లు తృప్తిని పొందింది మహర్షి యొక్క కల్లోల హృదయం !
“ ప్రభో మఘవన్ ! హిమాలయంలో భగవధ్యానంలో ఉండిన నన్ను ప్రేరేపించి,ఇందులకేనా ఇక్కడకి తరిమావ్?భగవన్ ! నీ లీల మానవ మాతృడనైన నాకు ఎలా తెలుస్తుంది ? ఈ చక్కని చుక్క, ఈ మెరిసిపోతున్న చంద్రబింబం నా తొడపై పడిపోనేల ! పడెను పో, నేను ఆమెను చూసి చలించనేల ! ముప్పది సంవత్సరాలుగా పాలిస్తున్న నా బ్రహ్మచర్య నిష్టకి, అంతరాయం కలిగి పోయింది ! ఇట్టి సందర్భాన్ని సృష్టించి భక్తుని శోధిస్తున్నావా, వజ్ర బాహూ ! ఇంత దూరం వచ్చాక నీవే నాకు కర్తవ్యాన్ని ఉపదేశించు ! ” అని కొంత తడవు కండ్లు మూసుకొని జమదగ్ని హదయం లోనే ధ్వనించాడు !
జమదగ్ని ముప్ఫదేండ్ల ప్రౌడ యువకుడు. కఠినమైన బ్రహ్మచర్య దీక్షను వహించి, తన తపస్సుచే సాధించిన అమృతత్వ సిధ్ధ మహాయోగి !
అతని ఆజానులంబిత బాహువులు, విశాలమైన వక్షము, విశాలమై తేజోపూరిత నయనాలు చూచినప్పుడు, అతని యందు బ్రహ్మకళతో పాటు, ఒక మహావీర పురుష పుంగవుని ఛాయలు కూడ పొడగట్టక మానవు ! అతని కేశాలు తపోవ్యసనం చేత సంస్కార హీనములై, పింగళ రాగంతో జటలు కట్టి ఉన్నాయి ! చిన్న గడ్డం అతని సుందర వదనానికి వింత శోభనే ఇస్తోంది !
జమదగ్ని కమండలూదకాన్ని , బాలిక మోముపైన జల్లి, తన చేలాంచలంచే విసిరాడు.
రేణుక కండ్లను విప్పింది . ఆమెకి మహర్షి ముఖ మండలం గోచరించింది ! ఆ మసక తెలివిలో ఆమె మహర్షి ముఖాన్ని భానుబింబమని తలచింది !
“ ప్రభో, ప్రభాకరా ! నీకివే వందనాలు !” అని గొణిగింది.
“ అమ్మాయీ ! నీకేమీ భయం లేదు. లే !” అన్నాడు జమదగ్ని.
రేణుక సిగ్గుపడింది. పైట సరిచేసుకొని లేచింది. తనకి ఎదురుగా ఉన్న మహర్షిని చూసి, చేతులు జోడించి ఇలాగంది .“మహాత్మా ! నా అపరాధాన్ని క్షమించండి. నేను ఆవేశంలో ఒక దుష్టుని బారి నుండి తప్పించుకోవడానికి పరుగెత్తాను-”
“ సుందరీ ! నాకు అంతా తెలిసింది ! నీవేమీ భయపడవద్దు. ఆ దుష్టుడు ఇప్పుడు లేడు. వీడు నీ ప్రణయాన్ని ఆశిస్తున్న ఒక పేద తపస్వి !”
రేణుక యొక్క శరీరం నునుదొంతర్ల సిగ్గు పువ్వులతో వికసించింది !
ఆమెకి మహర్షి యొక్క భావం ఒక విధంగా అర్థమయింది !
“ మహాత్మా ! ధన్యురాల్ని !” అని పండ్ల లోంచి సన్నగా పల్కింది !!
“ సుందరీ ! అదిగో నేదే కాబోలు, గండ్ర గొడ్డలి, తీసుకో ! నేను స్వయంగా వచ్చి నీ ఇంట్లో దిగపెడతాను.” అని మహర్షి లేచాడు.
రేణుక గండ్ర గొడ్డలిని తీసుకొని మహర్షి వెనువెంట బయలు దేరింది. బాలభానుడు సహస్ర రశ్ములతో ఆ జంటని ఆశీర్వదిస్తున్నాడా అన్నట్లు తూర్పు దిక్కున బారెడు ఎత్తున జ్వలించాడు !
*********************
మన కథాకాలం చాల పురోగమించింది. ఉజ్జయినిలో ‘అర్జున భూపాలుడు’ మధ్యందిన మార్తాండుని భంగి వెల్గుతున్నాడు ! అతని భుజ దండముల మధ్య దక్షిణాపథమంతా ఇమిడి పోయింది ! ఆరితేరిన ఐదువందల అతిరథ శ్రేష్టులు చూపగలిగే ప్రతాపాన్ని అరడోక్కడే ప్రదర్శించ గలిగినందున , కార్త వీర్యుడు సహస్ర బాహుడని కీర్తింప బడ్డాడు ! అరడు సహస్ర బాహుడే కాదు, సహస్రాక్షుడు కూడ ! రాజ్యం లోని నేరస్థులు అతని చార చక్షువుల్ని దాటి వెళ్లలేక పోయారు ! కాబట్టి అతనిరాజ్యంలో శాంతి భద్రతలు కాపురం చేసాయి !
పౌలస్త్య కుల చంద్రుడు , మహోగ్ర పరాక్రముడు, ‘రావణాసురుడంతటి వాడు ’ దక్షిణాపథంలో అడుగు పెట్టలేక పోవుటకు కారణం, కార్తవీర్యుని పరాక్రమమే !
అదే సమయంలో సహ్యాద్రి ప్రాంతంలో ‘ చంద్రగిరి’ పర్వత సానువులందు , మహర్షి జమదగ్ని తన సతీమణి రేణుకా దేవితో కలసి గురుకులాన్ని స్థాపించాడు . దాన్ని ధృఢ మూలం చేసి, జమదగ్ని వేలాది శిష్యగణంతో స్థావరం ఏర్పరచుకొన్నాడు ! ఆ ప్రాంతాలకి శాశ్వతంగా నీటి కొరత తీర్చే నిమిత్తం తన కమండల ధారని ప్రవహింప జేసాడు ! ఇంతకు ముందుండిన నిర్జీవమైన సెలయేటిని , సజీవ నదినిగా చేసాడు జమదగ్ని మహర్షి !
చక్రవర్తి కార్తవీర్యార్జునుడున్నూ, మహర్షి జమదగ్నిన్నీ సమ వయస్కులు ! సమాన రూప తేజో సంపద కలవారు ! ఒకడు క్షత్రియోచిత క్రియలందు అపార శక్తి గలవాడు ! ఇంకొకడు ఆత్మశక్తి పూరిత బ్రహ్మతేజో ప్రభావ సంపన్నుడు
జమదగ్ని పత్ని రేణుకా దేవి ఇప్పుడు పుత్రవతి ! ఆమె వయస్సులో ముఫ్ఫైఐదు శరత్తులు దొర్లిపోయాయి ! ఆ వయస్సులోనూ, ఆమె శరీరం సౌందర్య ప్రదర్శన శల వలె నయన పర్వంగానే ఉండేది !
రేణుకా దేవికి ఆధ్యాత్మ గురువు మహర్షి జమదగ్నే ! భర్త వద్ద పారమార్థిక విద్యతో పాటు, లౌకిక ఙ్ఞాన సంపత్తిని కూడా ఆమె ఆకళించుకొని విద్వాంసురాలయింది !
రేణుకాదేవి తన నాథుని యందే పరమేశ్వర రూపాన్ని చిత్రించుకొని జగత్కారణ కర్తయైన ఇంద్రుని సగుణాత్వాన్ని ప్రతిపాదించిన పరమ పతివ్రత ! ఆమె సర్వకాల సర్వావస్థల్లోనూ తన పతి దేవుని , తన స్వరూపంగానే ధ్యానించే పరమ యోగిని !
అటు తపోమూర్తియైన జనకుని , ఇటు కుండలినీ శక్తి రూపుణియైన తల్లిని పుణికి పుచ్చుకొని, పుట్టుక తోనే బాల యోగిగా ఉద్భవించాడు భగవన్ రాముడు ! తల్లి వానికి తనకి అతిప్రియమైన పరశువు ఇచ్చి వానిని ‘ పరశు రామునిగా చేసింది !
కౌమార దశలోనే ,ఇంకా చెక్కిళ్లలో తల్లిపాలు తొణికిసలాడుతూ ఉండగానే, పరశు రాముడు తల్లి తండ్రుల అనుమతి పొంది, హిమాలయములకు వెళ్లి, ఘోరమైన తపస్సు చేసి, సకల దురితాపహారి శంకరుని మెప్పించి , అమృత సిధ్ధి పొంది తండ్రిని మించిన తనయుడు అయ్యాడు !
అప్పుడు పరశు రాముని వయస్సు పద్దెనిమిదేండ్లు !
****************
అది శరత్కాలం ! నదీ జలాలయందు శీతలత్వం, తరులతా గుల్మాదులందు శుష్కత్వం, సర్వ జీవ రాసుల్లోనూ తంద్రత, ఆకాశ మందు మంచు మబ్బులు, సూర్యబింబంలో విరాగ లక్షణం, చంద్రబింబంలో ప్రత్యేకమైన ధాళధళ్యం, కలిగి ప్రకృతి చైతన్యా చైతన్యాల మధ్య ఊగులాడుతోంది !
అదే కాబోలు జ్యేష్ఠా దేవియొక్క కళా వికాసానికి ఉదాహరణ ! జమదగ్న్యాశ్రమం కళా విహీనంగా ఉంది ! ఉషః కాలంలో చెలరేగే హోమధూమం వెలువడ లేదు ! ప్రాతః సంధ్యా కాల ఉపస్థాన మంత్రాల ఘోషణ వినబడ లేదు !
ఒక యువకుడు ఆశ్రమాభిముఖుడై ఉషః కాల సమయంలో నడుస్తున్నాడు. వాడు ఆజాను లంబిత బాహుడు ! ఆకర్ణాంత విశాల నయనుడు ! శుధ్ధ స్ఫటిక సన్నిభ శరీరుడు ! వాని విశాల వక్ష స్థలం త్రిభువనాల్ని సవాలు చేయగలిగి వజ్ర ధృఢమై ఒప్పుతూంది ! నల్లని గిరజాలు, నూనూగు మీసకట్టు కలిగి, వాని ముఖం శరత్కాల చంద్రుణ్ని ధిక్కరిస్తూంది ! వాని భుజంపై గండ్ర గొడ్డలి వ్రేలాడుతోంది ! వాని పద ఘట్టనలతో భూమి అదురుతూంది !
అతడే భగవన్ పరశు రాముడు !!
నిర్జీవ కళలతో దీనంగా ఉన్న ఆశ్రమాన్ని ఆశ్చర్యంతో చూస్తూ, పరశు ధారి దానిని చేరుకొన్నాడు. నేరుగా తన తండ్రి యొక్క పట కుటీరంలో అడుగు పెట్టాడు.
అవనిత శిరస్కుడై, కూర్చొని ఉన్న తండ్రిని చూచి పరశు రాముని హృదయం తల్లడిల్లింది !
“ నాన్నగారూ ! నేను మీ రాముణ్ని !” అన్నాడు బిగ్గరగా.
“ నా తండ్రీ ! వచ్చావా ?” అని కుమారుని కౌగలించుకొన్నాడు జమదగ్ని ! అతని వేడి కన్నీటి ధార పరశు రాముని భుజస్కంధాన్ని తడిపింది !
జమదగ్ని కుమారుని కూర్చోబెట్టి ఇలాగన్నాడు !
“ నాయనా ! నీ తల్లిని, పరమ పతివ్రతని కార్తవీర్యార్జునుడు , నది నుండి నీరు తెస్తూండగా దొంగలించుకొని పారి పోయాడు ! ఈ ఘోర కార్యం జరిగి మూడు మాసాలయింది ! నేను కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేకపోతూ, ఈ కాలాన్ని చాల బరువుగా గడిపాను ! నీవు వచ్చావ్, ఇక నీ తల్లి యొక్క విషయంలో ఏమి చేయాలో నీవే నిర్ణయించు !”
పరశు రాముని కండ్ల నుండి కన్నీరు కారలేదు ! నిప్పుకణాలు రాలాయి ! వాని ముఖం ఎర్రని సహస్రదళ తామరసం వలె ఎరుపెక్కింది ! భృకుటి ముడిపడి రుద్రుని ఫాలాక్షాణ్ని పోలింది ! పెదిమలు వణికాయి ! వక్షస్థలం పర్వత సానువు వలె పొంగింది ! పరశు ధారి తన తల్లి తనకిచ్చిన గండ్ర గొడ్డలిని చేతిలో పట్టుకొని మూడుసార్లు చుంబించి ఇలాగన్నాడు !
“ తండ్రీ ! పరమ పూజ్యులైన మీ పాదాల్ని ముట్టి ప్రమాణం చేస్తున్నాను ! ఇదిగో ఇప్పుడే వెళ్లి నా తల్లిని చెరనుండి విడిపించుకొని వస్తాను. ఆ దుర్మార్గుణ్ని ఈ పరశువుతో ఖండ ఖండాలుగా ఖండిస్తాను ! ధన మధాందతచే కొవ్విన దక్షిణ ఉత్తరాపథముల రాజన్య లోకాన్ని నా గండ్ర గొడ్డలికి బలి ఇస్తాను ! భూమాత యొక్క పవిత్ర శరీరాన్ని వారి రక్త ధారల్తో తడిపి రాజస గుణానికి స్వస్తి చెప్పిస్తాను ! భగవన్ ఇంద్రుని వజ్రధార వలె నా మాతృదత్తమైన పరశువు కూడ యుధ్ధ రంగంలో ప్రకాశించుగాక ! మాతృ విముక్తి చేయనిదే మంచినీళ్లు కూడ ముట్టను!” అని గర్జించాడు పరశు ధారి !
“ బిడ్డా ! పరశూ !జామదగ్నుల కీర్తిని ప్రతిష్టించు ! అకార్తవీర్యమస్తు ! కాని తండ్రీ, ఒక్క మాట ! నీ తల్లి పరగృహ వాసం వల్ల కళంకితురాలై పోయింది ! అది దైవ నిర్ణయం కాబోలు ! కాబట్టి ఆ పవిత్ర మూర్తిని చెర విడిపించి యదేఛ్ఛగా విడిచి పుచ్చు ! ఆమెకి ఈ ఆశ్రమంలో జాగా లేదు ! ఇదే నా నిర్ణయం ! నీకు వజ్రధారి అపార శక్తిని ప్రసాదించు గాక !” అని చెప్పాడు జమదగ్ని.
********************
కార్తవీర్య ,పరశురాముల యుధ్ధం జరిగింది !
ఆ యుధ్ధాన్ని దేవగణమే వర్ణించలేనప్పుడు అల్ప మేధస్సు గల నే నెట్లు వర్ణించ గలను !
నభస్సునుండి జారి పడిపోయిన భాను బింబం లాగు , కార్తవీర్యార్జునును శిరస్సు , పరశురాముని పరశు ధారకి నేలకి ఒరిగి పోయింది !
కార్తవీర్యుని సామ్రాజ్యమంతటిని పరశు రాముని వశం కావించారు , మంత్రి దండనాధులు ! ఆ సామ్రాజ్యాన్ని ప్రజల పరం గావించి , పరశు రాముడు నాలుగు గుర్రాల రథం మీద, తన తల్లి రేణుకా దేవిని కూర్చొండ జేసి, జమదగ్ని యొక్క ఆశ్రమాభిముఖుడయ్యాడు ! ఆశ్రమ సమీపంలో రథాన్ని ఆపుచెసి, తండ్రి యొక్క కఠిన నిర్ణయాన్ని మాతృదేవికి వినిపించాడు !
“ రామా ! ఈ రోజు నా జీవితం ధన్యమయింది ! నీ తండి తీర్మానం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ! విత్రతకి, శీలానికి ఉదాహరణభూతమైన ఆర్య స్త్రీ కులానికి నీ తల్లి రేణుక కళంకం తీసుకొని రానేరదు ! విధి నిర్ణయమే తేజో రూపుడైన నీ తండ్రి ముఖం ద్వారా ఇట్టి తీర్మానాన్ని చేసిందని నా విశ్వాసం ! నీవు పిత్రాఙ్ఞను పాలించినట్లే మాత్రాఙ్ఞను పాలిస్తావని నమ్ముతున్నాను !” అని చెప్పింది మాతృదేవి.
“ అమ్మా ! నీవు కాలితో ఆదేశిస్తే దాన్ని నేను శిరస్సుతో ఆచరిస్తాను ! ఆఙ్ఞని దయచేయమ్మా !”
“ అయితే విను, నీ తండ్రి యొక్క ముఖారవిందాన్ని నేను చూడాలి ! ఆ అవకాశాన్ని కల్గించు. నేను ఆశ్రమంలో అడుగు పెట్టను. నీ తండ్రిని చూసిన తరువాత నీవు నీ పరశువుతో నా శిరస్సుని ఖండించు ! ఇదే నా ఆఙ్ఞ !”
పరశురాముడు క్షణకాలం స్థంభించి పోయాడు ! వాని కండ్ల వెంబడి మొట్టమొదటి సారిగా కన్నీరు ప్రవహించింది !
“ అమ్మా ---అమ్మా !” అని కేక వేసాడు ఏడుస్తూ.
“ నాయనా, రామా ! ” అని తల్లి కుమారుని కౌగలించుకొంది. ఆ కౌగిలిలో విచిత్రమైన అనుభూతి కలిగింది ఆ జగదేక వీరునికి ! ఏదో శక్తి వాని రక్త నాళాల్లో ప్రవహించింది ! ఆవేశంతో ఇలాగన్నాడు.
“ అమ్మా ! నీ ఆఙ్ఞను పాలిస్తాను ! నా తల్లికి దివ్యత్వాన్ని కల్పించి మాతౄణాన్ని తీర్చుకొంటాను.
*****************
జమదగ్ని మహర్షి తన శిష్య గణంతో రేణికాదేవి దర్శనార్థం వచ్చాడు !
ఆ దివ్య సందర్శనం అతిలోక్యమాన్యమైనది !
రేణుకా దేవి శరీరం దివ్య తేజో పూరితమై ప్రకాశించింది !
“ రామా ! నా పతి దేవుని చూసాను ! ఇక నీ కర్తవ్యాన్ని నెరవేర్చు !” అని ఆదేశించింది మాత !
చెప్పినదే తడవు ! పరశుధారి భీకర పరశువు విద్యుద్ఘాతం వలె రేణుకా దేవి కంఠసీమని వరించింది !
ఆశ్చర్యం ! ఆ శిరస్సు నేల పడలేదు ! అది రేణుకాదేవి దక్షిణ హస్త తలంలో పడింది ! అది బ్రహ్మాండమైన నక్షత్రం వలె ప్రకాశించింది !
*****************
“ శర్మా ! విన్నావా, పరమ పావని “ ఛిన్నమస్త” చరిత్రాన్ని! ఇచ్చట కథని ముగింపు చేస్తూ మహాకవి ‘గణపతి మునిచే’ ఛంధో బధ్ధమైన వాక్కుల్ని స్మరించి పునీతుల మవుదాం !”
“ ఛిన్నం శిరః కీర్ణ కచం థధానాం, కరేణ కంఠోద్గత రక్త ధారాం !
ధారాత్రయే తత్రచ మధ్యధారాం, కరస్థ వక్త్రీణ ముదాపి పంబ తీరా !!”
ఇట్టి రూపంతో ఛిన్నమస్తని ధ్యానించి ధన్యులమౌదాం.”
“ భగవతిః కృత్తశిరా భవతి
మధితపతీ నృపతీ నశుభాన్ !
ప్రథన భువి ప్రగుణం భుజయోః
పరశు ధరాయ వీతీర్య బలం !!
“ శర్మా! అదిగో దేవాలయంలో ఘంటానాదం వినిపిస్తూంది ! మనం వెళ్లి ఛిన్నమస్తని దర్శనం చేసి తరిద్దాం !”
*****************
******************
Comments
Post a Comment