Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 24

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 24

( దృశ్యము 96)

( నైమిశారణ్యము )

( సూతుడు ,శౌనకాది ఋషులు ఉంటారు )

సూతుడు ---- ముని పుంగవులారా ! ఆ విధంగా పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం సుసంపన్న మయినది ! ఆ వివాహ సదస్సులో పాల్గొని , తాంబూలాన్ని అందుకొనే అదృష్టం పొందాను. ,

శౌనక ---- సూతమహర్షీ ! వీనుల విందైన పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ గాధ విన్న, మా జన్మలు తరించాయి.

౧ ఋషి -- భవిష్యత్తులో బృహస్పతి చెప్పిన ఆ దోషము, దాని నివారణము ఎలా జరిగాయి ?

౨ ఋషి -- స్వామి లీలా మానుష రూపాన్ని ఎప్పుడు త్యజించారు ?

౩ ఋషి -- స్వామి వల్మీకం , ఆలయంగా ఎలా రూపొందింది ?

౪ ఋషి -- కళ్యాణం జరిగాక లక్ష్మి, వకుళ మాలికలు ఏమయ్యారు ?

సూత --- మునులారా ! వినండీ. శ్రీనివాసునితో, పద్మావతీ దేవి పరిణయం జరిగాక, వకుళ మాలిక వేంకటా చలానికి ,లక్శ్మి కరివీర పురానికీ వెళ్లి పోయారు . నవదంపతుల మధ్య ఏకాంతం కల్పించడానికి ! ఆకాశరాజు, ధరణీ దేవి , చీర సారెలతో సాగ నంపాలని ప్రయత్నించారు., కాని స్వామి తనకి కొండ మీద గూడు లేదనీ, అందువల్ల వాటిని తరువాత పంపమనీ చెప్పి నవ వధువుతో వేంకటాచలానికి పయన మయ్యారు. దారిలో అగస్త్య మహర్షి కోరికపై, అతని ఆశ్రమంలో విడిది చేసారు. మర్నాడు తిరిగి కొండ నెక్కబోతున్న ఆ జంటను ఆపి, వివాహ మయిన ఆరు నెలల వరకు కొండ నెక్కరాదనీ, అంత వరకు తన ఆశ్రమం లోనే నివసించమని కోరాడు అగస్త్య మహాముని. అతని కోరికను శ్రీనివాసుడు మన్నించాడు. అలా నవ దంపతుల కాపురం మొదలయింది !

శౌనక -- సూతమహర్షీ ! ఈ ఆరు నెలల కాపురంలో ఏ యే వింతలు జరిగాయి ?

సూత స్వామి లీలా విశేషాల వెనుక అర్థమూ, పరమార్థమూ ఎప్పుడూ ఉంటాయి. ఆరునెలల దాంపత్యంలో చాల విషాద సంఘటనలు జరిగాయి. పద్మావతీ దేవిని , భవ బంధాల నుండి విముక్తురాలిని చేయడమే పరమార్థమని తోస్తుంది.

౧ ఋషి --- విషాద సంఘటనలా ? అవి ఎట్టివి మహర్షీ ?

సూతుడు -- ముందుగా ఆకాశరాజు దివంగతుడయాడు. ధరణీ దేవి భర్త మరణ వార్త వినీ వినక ముందే, తనువు చాలించింది.

౨ ఋషి -- పాపం ! పద్మావతీ దేవికి అంతలోనే మాతా-పితృ వియొగమా ?

సూతుడు --- ఆ వియోగానికి తోడు , ఆమె పినతండ్రి తొండమానునికి, తమ్ముడు వసుధానునికి మధ్య రాజ్యం కోసం కలతలు రేగి, చివరికి కత్తులు దూసుకొనేంత వరకు , వచ్చింది.

౩ ఋషి -- అర్థ రాజ్యానికి అధిపతి అయిన తొండమానుడు అన్న కొడుకుతో యుద్ధానికి ఎందుకు తల పడ్డాడు ?

సూతుడు --- చోళ రాజు సుధర్ముడు మాట అయితే ఇచ్చాడు గాని, తను జీవించి ఉండగా , రాజ్యాన్ని పంచి ఇవ్వలేదు ! అన్న ఆకాశ రాజు బ్రతికి ఉన్నంత కాలం, అతని సేవలోనే గడపిన, తొండమానుడు అర్థ రాజ్యాన్ని ఆశించనూ లేదు ! వసుధానుడు అంగీకరించక పోవడం వల్ల తగవు వచ్చింది.

౪ ఋషి --- ఆ యుద్ధంలో శ్రీనివాసుడు ఎవరి పక్షం చేరాడు ?

౧ ఋషి -- ఆ యుద్ధ పరిణామం ఏమయింది ?

సూతుడు --- ముని వర్యులారా ! ఇది చాల ఆశక్తికరమైన సంఘటన ! తొండమానుడు , స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు.! ఇక వసుధానుడా స్వయముగా శ్రీవారి స్యాలకుడు ! స్వామి ఎవరి పక్షము వహింప గలడు ?

౨ ఋషి --- నిజము సూతమహర్షీ ! స్వామి ఎవరి పక్షమున పోరాడినారు ?

సూతుడు --- శ్రీనివాసుడు, తన భక్తుడైన తొండమానునికి చక్రాయుధము నిచ్చి, తాను ఖడ్గపాణియై వసుధానుని పక్షమున పోరు సలిపినాడు. ఆ పోరున శ్రీనివాసుని ఖడ్గధారలకు బలి అయి క్షీణించి పోతున్న , తన బలగాన్ని చూసిన తొండమానుడు ,గత్యంతరము లేక, స్వామిపై చక్రాయుధాన్ని సంధించాడు.

౩ ఋషి --- ఆశ్చర్యముగా నున్నదే ! శ్రీ హరి సుదర్శనము శ్రీ హరిపై సంధింప బడినదా ?

౪ ఋషి -- కలికాల మహాత్యమందురా మహర్షీ ?

సూతుడు -- నిజమే ! కలికాల మహిమయే ఇది ! కలికాలము కనుకనే, రెండవ భార్యగా సుధర్ముని వరించిన నాగకన్య తన పుత్రునికి అర్థరాజ్యము అడిగినది ! సుదర్ముడా మాట కాల మహిమ వలననే మరచినాడు ! తాతల నాటి మాట తీర్చుటెందులకని మనుమడు తలపోయుట కాల మహిమయే కదా ? అందువల్ల ఈ యుద్ధము కూడ స్వామి లీలా విశేష మనక తప్పదు ! కలికాల సమయాచారములను స్వామి ఆ యుద్ధభూమియందే ఏర్పరిచినారు ! తండ్రి ఆస్తులను తనయులు పంచుకొను వరవడి ఆ యుద్ధము నందే ఏర్పడినది !

శౌనకుడు --- సూతమహర్షీ ! సుదర్శన చక్రము ధాటికి శ్రీవారి కేమయనది ?

సూతుడు --- స్వామి నియమ బద్ధుడు కనుక, తన చక్రాస్త్రము ధాటికి, తానే దెబ్బ తిని, రణరంగమున మూర్చపోయినాడు ! ఆ దృశ్యమును దూరముగా ప్రాకారముపై నుండి, చూసిన పద్మావతీ దేవి, మనో వ్యాకులతతో, అగస్త్య ముని వద్దకు వెళ్లింది !

***************

( దృశ్యము ౯౭ )

( అగస్త్యాశ్రమము )

( పద్మావతి, అగస్త్యుడు ఉంటారు . పద్మావతి విచారంతొ ఉంటుంది .చేతులు జోడించి అడుగుతుంది. )

పద్మావతి ---అగస్త్య మునీంద్రా ! నా ప్రాణ నాధుడు రణరంగ మధ్యమున మూర్ఛిల్లి , పడిపోయినారు ! ఎవరునూ అతనిని పట్టించుకొనుట లేదు. ఇప్పుడు నే నేమి చేయవలెను ? నా ప్రాణ నాధుని రక్షించుకొనే ఉపాయ మేమున్నది ?

అగస్త్యుడు -- దేవీ ! యుద్ధమున క్షత్రియులు ఎవరి పని వారు చూసుకొనుచున్నారు. అందుచే నీ భర్తను చూచువారెవ్వరునూ లేరు ! సమరోత్సాహమున --సజీవములగు శరీరము లందే తప్ప, క్రింద పడిన వారిని ఎవరునూ, కన్నెత్తి కూడ చూడరు!

పద్మావతి -- మహర్షీ ! అదియే చింతకు కారణము నే నిప్పుడు ఏమి చెయ్యవలెను ?

అగస్త్యుడు --- నీవు రణరంగమునకు , నీ పతికి సపర్యలు చేయుము. అతడు సేద తీరిన పిమ్మట , యుద్ధము నుండి, నివర్తింప జేయుము ! నీ భార్తకు హితము నాచరించి సంధి చేయుట మంచిదని చెప్పుము !

****************

( దృశ్యము ౯౮ )

( అగస్త్యాశ్రమము బయట )

( పద్మావతి ఆశ్రమం బయటకి వచ్చి, ఒక పల్లకీలో కూర్చొంటుంది .ఆశ్రమ వాసులతో అంటుంది )

పద్మావతి --- ఆశ్రమ వాసులారా ! అన్నలారా ! తమ్ములారా ! నా పసుపు కుంకుమలు కాపాడండి ! నన్ను రణరంగమునకు తీసుకొని పొండి.

( పల్లకీని ఆశ్రమ వాసులు ఎత్తుతారు )

**************

( దృశ్యము ౯౯ )

( నారాయణ వరము దగ్గర రణరంగంలో యుద్ధ భూమికి కాస్త దూరంగా ఉన్న ప్రదేశం )

( శ్రీనివాసుడు నేల మీద స్పృహ లేక పడి ఉంటాడు )

( కొంత దూరంలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది )

( పద్మావతీ దేవి పల్లకీని మోసుకొంటూ ఆశ్రమ వాసులు ఆ చోటికి చేరుకొని శ్రీనివాసునికి దగ్గరగా పల్లకీని దించుతారు )

( పద్మావతి పల్లకీలో తెచ్చుకొన్న నీళ్లు , గాయాలకి రాసే పసరు మందులు, దూది వగైరాలతో క్రిందకి దిగి, సపర్యలు చేస్తూ ఉంటుంది . శ్రీనివాసుని గాయాలు కడిగి, తుడిచి, మలాము రాస్తుంది. ముఖం మీద నీళ్లు జల్లి, తుడుస్తుంది. శ్రినివాసునికి తెలివి రాదు. అతని తలని తన తొడ మీద పెట్టుకొని, చివరి సారిగా నీళ్లు చిలకరించి తన చీర చెంగుతోనే విసురుతుంది )

( ఎట్టకేలకు శ్రీనివాసునికి తెలివి వస్తుంది. కళ్లు తెరచి పద్మావతిని, ఆశ్రమ వాసులనీ , పల్లకీని తక్కిన పరిసరాలనీ చూస్తాడు. తనింకా యుద్ధ భూమిలోనే ఉన్నాడా అన్న అనుమానం వస్తుంది )

శ్రీనివాసుడు --- దేవీ ! నే నెక్కడ ఉన్నాను ?

పద్మావతి -- ( దుఃఖము ఆనందము మిళితమైన స్వరంతో )స్వామీ ! యుద్ధభూమిలోనే ఉన్నారు. మీ ఆయుధం మిమ్మల్ని గాయ పరచి మూర్ఛిల్ల జేసింది !

( ఇంతలో అక్కడికి అగస్త్యుడు వస్తాడు )

శ్రీనివాస --- ఇది ఆశ్రమం కాదా ?

పద్మావతి --- కాదు స్వామీ !

( శ్రీనివాసుడు కోపంతో లేచి కూర్చొంటాడు )

శ్రీనివాస --- దేవీ ! ఈ ఘోర యుద్ధరంగమున వనితల కేమి కార్యము ? ( అని అగస్త్యునితొ ) మునీంద్రా ! ఈమెను శీఘ్రముగా ఆశ్రమమునకు కొనిపొండు !

అగస్త్యుడు --- ఓ ప్రభూ ! సంధి జరిగించుము ! పిన తండ్రికి, సోదరునకు సంఢి చేయించు ఉద్దేశ్యముతో పద్మావతి ఇచ్చటకు వచ్చియున్నది !

శ్రీనివాస --- ఓ మునీంద్రా ! యోషితలకు యుద్ధభూమి ప్రవేశము యుచితము కాదు .నే నిప్పుడు తొండమానుని సంహరించి, వసుధానునకు రాజ్యమిచ్చెదను !

పద్మావతి --- ప్రాణనాధా ! కృపానిధే ! దయ జూపుము ! లోక నాశనము చేయ బూనితివా ? ఇద్దరునూ రాజ్యార్హలే ! అందుచే రాజ్యమును , కోశమును విభాజించి ఇమ్ము ! సర్వ లోకములకు స్వస్తి యగునట్లు, రణభూమి నుండి నివర్తింపుము.

శ్రీనివాస – దేవీ ! నీకు క్షాత్రధర్మము తెలియదు ! నేను తొండమానుని సంహరించి, రాజ్యమును వసుధానునికి ఈయ వలయును ! లేదా వసుధానుని కొరకు యుద్ధములో ప్రాణములనైన విడువ వలయును !

( ఆ మాటలు విన్న పద్మావతి ఏడుస్తూ అగస్త్యుని వంక చూస్తుంది )

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద