Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 26

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 26

( దృశ్యము 101 )

( వేంకటాచలం పైన ఓక చెట్టు నీడ )

( శ్రీనివాసుడు , బ్రహ్మ, విశ్వకర్మ ఉంటారు )

తొండమాన ---- ప్రభూ ! ఆలయమునంతయు తిరిగి చూసినారు కదా ? మీరు చెప్పినట్లే నిర్మింఫ జేసితిని !

శ్రీనివాస----- తొండమాను రాజా ! ఆలయ నిర్మాణమును యధోక్తముగా చేసి, నన్ను ఆనందింప జేసినావు ! కావున ఈ ఆలయము , ఆనంద నిలయము కాగలదు !!

బ్రహ్మ --- తథాస్తు !! జనకా ! నే నీ ఆలయమున రెండు దీపములను ప్రతిష్టింప బూనుకొన్నాను.కలి యుగాంతము వరకు, ఆ దీపముల ఉండవలయును. ఎప్పుడీ ఆలయ విమానము పడిపోవునో , దీపములు నశించును. అప్పటీ వరకు మీ అవతారము భూలోకమున ఉండ వలయునని నా అభిలాష !

శ్రీనివాస --- కుమారా ! అట్లే యగుగాక ! ఆలయ ప్రవేశము తరువాత, ద్వజారోహణతో మొదలయి, రథారోహణతో
నంత మగునట్టి, వాహన యుక్తమగు పూజ చేయుము !

బ్రహ్మ --- ఆజ్ఞా ప్రకారము అటులనే చేసెదను ! ( అని విశ్వకర్మతో ) విశ్వకర్మా ! స్వామివారికి విచిత్రమైన వాహనములను , దారు మయమగు ర్థమును చేయుము. అటులనే ఛత్ర చామరములను, వ్యజనములను సమకూర్చుము !

విశ్వకర్మ --- పరమేష్టీ ! ఎట్టి వాహనములను చేయవలయునో ఆనతీయుడు ?

బ్రహ్మ -- శేష ,హంస , సింహ, కల్పవృక్ష , సర్వ భూపాల , గరుడ , ఐరావత , నర , పల్లకీ , వాహనములు నిర్మింపుము ! అటులనే ఉత్సవ శ్రీనివాస మూర్తులు నాలుగు నిర్మింపుము.

విశ్వకర్మ --- ఆటులనే చేసెదను !

శ్రీనివాస --- తొండమాను రాజా ! బ్రహ్మ చేయబోవు ఉత్సవము సామాన్యమయినది కాదు ! అది బ్రహ్మోత్సవమే అగును !! కాని ----

విశ్వకర్మ ---- ప్రభూ ! సందేహ మెందులకు ?

తొండమాన ---స్వామీ ! విధాత తలపెట్టిన ఉత్సవము బ్రహ్మోత్సవ మగుటకు ఏమి చేయవలయును ?

శ్రీనివాస --- సర్వదేవ ,జనాకీర్ణమైన ఉత్సవమే , ఉత్సవమనుట చెల్లును ! కావున నీవు సర్వ దేశములకు భృత్యులను పంపి, అంగ , వంగ , కళింగ, సౌగంధ, కాశీ , విరాట ,కురు ,జాంగిల ,బర్బర ,పాండ్య ,చేది , మత్స్య , సింధు , దేశముల అధిపతులను, ప్రజలను, ఉత్సవమునకు, ఆహ్వానింపుము ! వచ్చినా వారి కోర్కెలు తీర్చెద ననుము !

తొండమాన ---ప్రభూ ! సత్వరము అటులనే చేసెదను !

శ్రీనివాస --- త్రిలింగ దేశమునకు అధిపతు లయిన నీవును, వసుధానుడును, గ్రామ , గ్రామములకు, చారులను పంపి, వేంకటాచలము పైన, నవ నిర్మిత ఆలయమందు , ఏడుకొండల వాడు, వేంకట రమణుడు, ఆలయ ప్రవేశము చేయుచున్నాడని, ఆ తరుణమున వచ్చి, కాన్కల నొసగి, కోర్కెలు పొంది, ఉత్సవమును తిలకించి, జన్మ సాఫల్యమును పొంద వలసినదని, చాటింపు వేయించుడు !

తొండమాన ---స్వామీ ! ఆజ్ఞా ప్రకారము అటులనే చేసెదను ! ఇక నాకు సెలవిండు ! ( అంటూ వెళ్లిపోతాడు )

విశ్వకర్మ --- ప్రభూ ! నేను మీ దివ్య వాహనములను , దారుమయ రథమును నిర్మించె దను ! నాకు అనుజ్ఞ నిండు ! ( అంటూ వెళ్లిపోతాడు )

బ్రహ్మ --- జనకా ! నేను కూడ ఉత్సవములకు తగిన ఏర్పాట్లు చేయవలయును కదా ?

శ్రీనివాస -- కుమారా ! అటుఅనే కానిమ్ము, పోయిరమ్ము !

( బ్రహ్మ వెళ్లిపోతాడు )

శ్రీనివాస - ఈ వేంకటాచలమును వదిలి అగస్త్యాశ్రమమునకు, మరలుటకు మనసొప్పకున్నది. అయినను పద్మావతి ఎదురు చూచు చుండును. ( అని తనలో తాను నవ్వుకొంటాడు ) ఏమది ! నేను కూడ గృహస్థుని వలె ఆలోచించుట ఏమి ?! గృహమా ? అచలమా ? ఇవేమియు సత్యము కాదు ! కర్తవ్యము ముఖ్యము. ఆ కర్తవ్యమును యీ వేంకటాచలమందే నిర్వర్తించ వలయును ! ( ఆలోచనలో పడి ) లక్ష్మి లేనిదే కార్య సిద్ధి కలుగుటెట్లు ? లక్ష్మిని యీ కొండకు రప్పించుటెట్లు ?

( అని స్వామి పుష్కరిణి వైపు వెళ్తాడు )

*********************

(దృశ్యము ౧౦౨ )

(స్వామి పుష్కరిణి )

( శ్రీనివాసుడు స్వామి పుష్కరిణి గట్టుపై , ఒంటరిగా కూర్చొని ఉంటాడు )

శ్రీనివాస --- ఈ స్వామి పుష్కరిణి,స్వామిత్వమును ప్రసాదింప గలదట ! నాకు కలిగించ గలదేమో చూసెదను గాక ! ( అని ధ్యానం చేస్తాడు ) ( పద్యం )

మారెడు చెట్ల కోన నడుమన్, సరసీరుహ మొండు, వే

యి రేకులిప్పారగ పూచె, నొండు, కర పద్మ గ్రహీత,

సువర్ణ పద్మయై, తీరిచె గొల్వు, దాన నొక దేవత, లక్ష్మీ రు

చిరాఖ్య, నా యమను, కోరి భజించెద మిష్ట సిద్ధికై !”


( స్వామి పుష్కరిణి నడుమ చిన్న తామర పువ్వు లేస్తుంది. క్రమ క్రమంగా పెద్దదయి, బంగారు రంగులో మెరిసిపోతూ, సరస్సంతా నిండి, విచ్చుకొంటుంది )

( ఆ పద్మం మధ్య ,పద్మాసనం వేసుకొని, రెండు చేతులలోను, తామర పువ్వులు పట్టుకొని, లక్ష్మీదేవి ఉంటుంది , చిరునవ్వుతో శ్రీనివాసుని చూస్తుంది )

( శ్రీనివాసునికి ఆమెను చూసి, సంతోషంతో ముఖం విప్పారుతుంది )

శ్రీనివాస --- లక్ష్మీ ! దేవీ ! నా శ్రీదేవీ !—

( అంటూ లేచి నిలబడతాడు. లక్ష్మి చిరునవ్వుతో పద్మం మీద, నిల్చుని, నెమ్మదిగా అడుగులు వేస్తూ, గట్టు దగ్గరకు, చేరుకొంటుంది. తన చేతిని అందిస్తుంది. శ్రీనివాసుడు ఆమె చేతిని పట్టుకొని గట్టుపైకి లాగుతాడు. )

( ఆతని కల కరిగి పోతుంది ! అతని చేతిలో, కపిలముని చేయి ఉంటుంది )

కపిల ---- శ్రీనివాసా ! ఏమి యీ పారవశ్యము !! స్వామి పుష్కరిణిలో మునిగి, బయటికి వస్తున్న నన్ను , చేయి అందుకొని బయటకు లాగితివేల ?

శ్రీనివాస – కపిల మునీ ! మీరన్నది నిజము ! నా నమస్కారములు అందుకొనుడు ! లక్ష్మీ కటాక్షమును కల యందు పొంది, ఆ పారవశ్యములో, ఆమె చెయ్యి అనుకొని మీ చెయ్యి పట్టుకొని, లాగితిని ! క్షమించండి !

కపిల --- శ్రీనివాసా ! నీ మనస్థితి నాకు అర్థమయినది ! ఆలయ ప్రవేశమునకు సమయము దగ్గరైనది ! లక్ష్మి వెంట రాక, ఆలయమును చేరుట, ఎటుల సాధ్యమగునని నీవు చింతించు చున్నావు.! అవునా ?

శ్రీనివాస –నిజము కపిల మునీ ! లక్ష్మి అనుసరించని, ఆలయ ప్రవేశము సాధ్యమెట్లగును ?

కపిల --- శ్రీనివాసా ! నీవు గృహమును చేరి, పద్మావతీ దేవి కడ, ఈ ప్రస్తావన చేసి, ఆమె సమ్మతితో, కరివీర పురమున కేగుము ! స్వయముగా వెడలి , లక్ష్మిని రమ్మనుము ! నీ వివాహ శుభలేఖను గరుడుని చేత పంపించితివి ! సూర్యుని పంపి, ఆమెను పెళ్లికి రప్పించితివి ! కాని, ఇప్పుడా విధమున చేసిన, ఆమె శాశ్వతముగా దూరము కాగలదు !

శ్రీనివాస – కపిలమునీ ! స్వయముగా వెళ్లి పిలుచుటకు, నాకు అభ్యంతరము లేదు ! కర్తవ్య నిర్వహణలో అభిమానమునకు తావు లేదు కదా ?

కపిల --- శ్రీనివాసా ! కర్తవ్యము నీకే గాని, లక్ష్మికి లేదని, నీ వెందుకు భావించ వలె ! ఆమె జనకుడైన భృగు మహర్షి తన వామ పాదమున నున్న కంటితో, ’ అక్షికుక్షి విద్య’ ద్వారా, ఆమెను జాగృత పరచి కర్తవ్య పరురాలిని చేసాడు ! ఆమె కోపము అందులో భాగమే !!

శ్రీనివాస –కపిలమునీ ! మరి ఏ సంఘటన ఆమెకు కోప కారణమైనది ?

కపిల--- తనకు సవతిని తెచ్చినందుకు కలదేమో మరి !!

శ్రీనివాస –కపిలమునీ ! మీకు తెలియని దేమిన్నది ! వేదవతికి నే నిచ్చిన మాట---

కపిల --- శ్రీనివాసా ! నేను ఈ క్షణమే ఆమె వద్దకు వెడలి, ఆమెను నీ కడ చేర్చుటకు సుముఖు రాలిని చేసెదను ! నీవు నీ పని చేయుము !

శ్రీనివాస – కపిల మునీ ! మీ ఆజ్ఞ శిరోధార్యము ! నేను కరివీర పురమున లక్ష్మిని సంధించెదను గాక !

**************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ