Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 28

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 28

( దృశ్యము 104)

( కరివీర పురం దగ్గర సంపెంగ చెట్టు )

( లక్ష్మి, కపిల ముని ఉంటారు )

కపిల --- తల్లీ ! శ్రీలక్ష్మీ ! విన్నావు కదా ,శ్రీనివాసుని మనోవ్యాకులత, నీవు చెంత లేకున్న, అతడు నిర్నిద్ర చింతయే అగును !

లక్ష్మి ---- మునీంద్రా ! స్వామి అవతార రహస్యము, మీకు తెలియనిది కాదు గదా ? నేను అతని చెంత చేరవలెనన్న, అతడు కర్తవ్యోన్ముఖుడు కావలయును !

కపిల --- ( ఆనందంతో ) తల్లీ ! అటులయిన నీ వాతనికి దూరమయినది ,భృగు మహర్షిపై కినుక వల్లనో, లేక

లక్ష్మి --- పద్మావతిపై మాత్సర్యము వల్లనో, అని, భావించారా మునీంద్రా ?

కపిల --- అవును తల్లీ ! నీ నాధుడు కూడ అటులనే భావించు చున్నాడు !

లక్ష్మి --- నా స్వామి, యీ లక్ష్మిని , వెనుకటి గృహలక్ష్మి వలెనే , భావించు చున్నాడు ! తపస్సుతో పరిపక్వమై---పునీతమైన మనస్సు గల సామ్రాజ్య లక్ష్మి వలె భావించుట లేదు !--- భృగు మహర్షి నా జనకుడు స్వామి వక్షస్థలమున దాగి , అంతర్ముఖియైన నన్ను, తన కాలియందలి కంటితో, అనితర సాధ్యమైన, అక్షి కుక్షి విద్యతో జాగృత పరచినాడు ! సకల జీవ రాశుల దారిద్ర్య విమోచనము చేయుమని ప్రభోదించినాడు ! అతనిపై కినుక వహించుట నాకు పాడి యగునా మునీంద్రా ?

కపిల --- తల్లీ ! నిన్ను జాగృత పరచుటకు , భృగు మహర్షి చేసిన ప్రయత్నము నిస్సందేహముగ , అనితర సాధ్యము ! కాని అతడెన్నుకున్న మార్గము ,అదియే విష్ణు వక్షస్థలమున పాద తాడనము మాత్రము, ఘోరమైన తప్పిదము !

లక్ష్మి --- మునీంద్రా ! నా తండ్రి చేసిన తప్పుకు పరిహారముగ , నా స్వామి అతని పాద నేత్రమును పొడిచి , అతని విద్యను , సుకృతమును , తపస్సును నశింప జేసినాడు .

కపిల---- తల్లీ ! అదియా నీ కోపమునకు కారణము !?

లక్ష్మి --- కాదుమునీంద్రా ! నా నాధుడు బహు దూరదర్శి ! అతని లీలలను విమర్శింప జాలను !! కాని మునీంద్రా , నా తండ్రి ఆ పయిన ఏమయినాడో తెలుసుకొనుటకు కుతూహల మగుచున్నది !

కపిల --- తల్లీ ! భృగు మహర్షి , శ్రీ మహావిష్ణువు విధించిన శిక్షను ఆనందముతో స్వీకరించినాడు ! అటుపైన కాశికా క్షేత్రమునకు వెడలి , శివుని పట్ల చేసిన అపరాధమునకు శిక్షింపబడినాడు !!

లక్ష్మి --- మునీంద్రా ! నా తండ్రి కాశికా క్షేత్రమున ,శివుని కోపమునకు గురి అయినాడా?అదెట్లు జరిగినది ?

కపిల --- సామాన్యమయిన లోక ధర్మమును పాటింపక పోవుట వలన.

లక్ష్మి --- నా తండ్రి పాటింపని లోక ధర్మము ఏది మునీంద్రా ?

కపిల --- తల్లీ ! ఏ క్ష్తేత్రమున కేగిన ఆ క్ష్తేత్ర ప్రధాన దేవతను స్తుతించవలె నన్నది సామాన్యమయిన లోక ధర్మము !కాశి శివ క్షేత్రము ! అచట శివ దూషణ నిషిద్ధము ! నీ తండ్రి ఆ క్షేత్రమున కూడ , తన పరీక్షలో శివుడు భంగ పడినాడని, అతనిది తామస ప్రవృత్తి యని , శ్రీ మహావిష్ణువే సత్వగుణ సంపన్నుడని ఎలుగెత్తి చాటినాడు.—

లక్ష్మి --- అతడు పలికినది యదార్థమే కదా !

కపిల --- నిజమే ! అయినను ఉచితానుచితములు పాటింప కుండుట, అతని చేసిన అపరాధము !

లక్ష్మి --- మునీంద్రా ! ఆ అపరాధమునకు అతడెట్లు శిక్షింపబడినాడు ?

కపిల --- కోపించినది శివుడు కాదు తల్లీ ! శివ- కేశవు లిరువురూ సత్వ గుణ సంపన్నులే ! సమయా సమయములను బట్టి, వారి ప్రవృత్తి మారుచుండును !

లక్ష్మి --- మునీంద్రా ! నా తండ్రి కేమయనది ? అతనిని శిక్షించిన వారెవరు ?

కపిల --- శిక్షించినది జగదంబ ! నీ తండ్రి తన జీవిత కాలమంతయు, అధ్యయనము చేసి, రచించిన --- భృగునాడి యన జ్యోతిష గ్రంథము , ఛిన్నాభిన్న మగుననియు , పృథ్విలో మానవుల కది, అగమ్యమగుననియు శపించినది !

లక్ష్మి ---- మునీంద్రా ! ఎంత పని జరిగినది ? నా తండ్రి తన తపస్సును , సుకృతమును, విద్యను , చివరికి తన జన్మ సాఫల్యమొనర్చిన సాధనను కూడ పోగొట్టుకొన్నాడన్న మాట

కపిల అవును తల్లీ ! ఇంత జరిగినను అతడు తన ధైర్యమును, వివేకమును కోల్పోలేదు ! దర్శన మాత్రమున పాపములు పోగొట్టగల నర్మదానదీ ఉద్గమ స్ఠానమైన , అమర కంటక క్షేత్రమున , ఘోరమైన తపస్సు ఛేయుచున్నాడు !

లక్ష్మి --- ఎవరి గురించి మునీంద్రా ?

కపిల --- అది శివ క్షేత్రము తల్లీ ! నీ తండ్రి ఓంకారేశ్వరుని కృపా కటాక్షములకై , తపము చేయుచున్నాడు ! తల్లీ ! నీ తండ్రి విషయము తెలిసినది కదా ! ఇక ప్రస్తుతమునకు రమ్ము ! నీ తండ్రిపై నీకు కినుక లేదని స్పష్టమైనది, సవతి అయన పద్మావతీ దేవిపై మాత్సర్యము లేదని కూడ తెలిసినది ! నీ నాధుడు , నీతో పాటు, ఆలయ ప్రవేశము చేయుటకు సంకల్పించి , నిన్ను పిలుచుటకై రానున్నాడు---

లక్ష్మి --- ( ఆనందముతో ) ఏమంటిరి మహర్షీ ! నా నాధుడు నన్ను పిలువరానున్నారా ?---

కపిల --- అవును తల్లీ ! అతడే స్వయముగా రానున్నాడు.

లక్ష్మి ----( ప్రసన్న వదనంతో ) ఇతరులతో రాయబార మంపక, తనంత తానుగా వచ్చి పిలిచిన, నాకు ఆభ్యంతర మేమున్నద ?

కపిల--- సంతోషం తల్లీ ! నీ మనసులో మాట బయట పడినది ! --- అదుగో నీ నాధుడు , అశ్వారూడుడై, నీ కడకు వచ్చుచున్నాడు --- చూడుము !! ( అని దూరంగా చూపిస్తాడు )

( లక్ష్మి అతను చూపించిన దిక్కు చూస్తుంది. శ్రీనివాసుడు దూరంగా గుర్రం ఎక్కి, వస్తూ కనిపిస్తాడు )

( ఆ దృశ్యం చూసి, లక్ష్మి ముఖంలో ఆనందం వెల్లి విరుస్తుంది )

( కపిల మహర్షి ఆమె ముఖాన్ని చూసి, చిరునవ్వు నవ్వుకొని అంతర్థాన మవుతాడు )

( ప్రవేశం-- శ్రీనివాసుడు )

శ్రీనివాస --- ( గుర్రం దిగి ) దేవీ, శ్రీదేవీ ! నాపై కోపమింకను పోలేదా దేవీ ?

( అంటూ చేతులు చాపుతాడు . లక్ష్మి అతని చేతులలో వాలి పోతుంది )

లక్ష్మి ---- నాథా ! ఎంత కాలానికి వచ్చారు మీరు ?--- కర్తవ్యోన్ముఖులమై కలిసి, అడుగు వెద్దామంటే నేను కాదంటానా, ప్రభూ !

శ్రీనివాస --- శ్రీదేవీ ! నాకు కలిమి బలిమి అంతా నీవే ! నీవే రాకున్న నేనా ఆలయమున ఎట్లుండ గలను ?

లక్ష్మి -- అదేమి బేలతనము స్వామీ ! నేను లేకున్న నేమి ? మీ చిన్నారి దేవేరి పద్మావతి చెంతనున్నది కదా ?

శ్రీనివాస --- శ్రీదేవీ ! పద్మావతి, ఇప్పుడే భవ బంధాల నుండి, బయట పడినది ! నా అవతార తత్వమును, మెల్ల మెల్లగా ఆమెకు అవగత మొనర్చు చుంటిని ! గత జన్మలలో ఆమె ఎంత తపస్సు చేసినను, నన్ను పతిగా పొందుట కొరకు చేసినది ! యీ జన్మలో నా సాహచర్యమున కింకను చెయ్యలేదు కదా ?

లక్ష్మి --- స్వామీ ! మీదెంత నిష్టుర హృదయము ! తపము చేయనిదే , ఆమెను దరిచేయనీయరా స్వామీ ?

శ్రీనివాస --- శ్రీదేవీ ! నేనీ అవతార మెత్తినది, కొండ పైన కట్టిన ఆలయములో , ఇరువురు దేవేరులతో భోగములనుభవించుటకు కాదని, నీకు అర్థమయినది ! ఆమెకు కూడ తెలియ వలయును కదా !!

లక్ష్మి --- అటులయిన, ఆమెను త్యజింతురా స్వామీ !

శ్రీనివాస ----కాదు, కూర్మితో చేపట్టినది , త్యజించుట కొరకు ఎంత మాత్రమూ కాదు ! కొంత కాలము దూరము చేసి సంస్కరించుటకు.

లక్ష్మి --- ఏ విధముగా దూరము చేయుదురు ?

శ్రీనివాస --- పద్మావతి, తన తమ్ముని చేత, తన తండ్రి ఇచ్చిన సారె గురించి, గొప్పగా చెప్పించినది ! ఆ సారెలో సంభారము లన్నియు కలవు, కాని లేనిది ఒకటే !---

లక్ష్మి --- అదేమిటి స్వామీ ?

శీనివాస ---- కరివేపాకు .

( లక్ష్మి నెవ్వెర పోయి శ్రీనివాసుని వంక ఛూస్తుంది )

లక్ష్మి --- కరివేపాకా ?!

శ్రీనివాస --- అవును దేవీ ! ఆ సారెలో లేని వస్తువు, కొండమీద లభ్యము కాని, వస్తువు అది ఒక్కటే !!

లక్ష్మి ---- పద్మావతిని దూరము చేసి సంస్కరించుటకు , మీకు కరివేపాకు సాకు దొరికిందా స్వామీ ?

శ్రీనివాస--- అవును దేవీ ! ప్రస్తుతము నాకు బిల్వ పత్రముఅల కన్న, కరివేపపత్రములే ఇష్టమయనవి !

లక్ష్మి --- స్వామీ ! మీ లీలలు మీకే తెలియనోపును ! ప్రస్తుతము మిమ్ముల ననుసరించుటయే నాకు కర్తవ్యము, దారి తీయుడు.

శ్రీనివాస --- దేవీ ! ఎంత కాలమునకు నాపై కనికరము కలిగినది ! రమ్ము, ఆలయమునకు పోతము !

( శ్రీనివాసుడు, లక్ష్మి చేయి పట్టుకొని వచ్చి, ఆమెను గుర్రం ఎక్కిస్తాడు. తరువాత తను కూడ ఎక్కుతాడు )

*****************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ