Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 29

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 29

( దృశ్యము 106 )

( తొండమానుని రాజ్య సరిహద్దులలో ఒక చిట్టడవి )

( అడవి లోని దారిగుండా ఒక రెండెడ్ల బండి, వెళ్తోంది. బండీ నాయుడు బండి నడుపుతున్నాడు )

( బండిలో కూర్ముడనే బ్రాహ్మణుడు , అతని భార్య మహాలక్ష్మి ,అయిదేళ్ల కొడుకు రాఘవుడు ఉంటారు .మహాలక్ష్మి ఆరునెలల గర్భవతి )

( బండి క్రింద ఒక ఉట్టి వ్రేలాడుతోంది. ఆ ఉట్టిలో ఒక కుండ , ఆ కుండలో అస్థికలు, కుండమీద మూత ఒక గావంచాతో బిగించి కట్టబడి ఉంది )

( బండి నెమ్మదిగా వెళ్తోంది )

నాయుడు--- అయ్యా ! పంతులయ్యా !

కూర్మ --- ఏమిటి నాయుడూ ?

నాయుడు ---- మీ పేరేంటయ్యా ?

కూర్మ --- నా పేరుతో నీకేం పని ?

నాయుడు --- బండి నిచ్చాటు అడవిలో ఒంటరిగా వెళ్తోంది. కబుర్లు చెప్పుకుంటూ పోతే బాగుంటుందని అడిగానయ్యా !

కూర్మ --- ఈ అడవి అంత భయంకరమైనదా ?

నాయుడు --- ఇది నిచ్చాటు అడవే అయినా , భయమేమీ లేదయ్యా !

కూర్మ ---- అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ?

నాయుడు --- ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పగలనయ్యా ! ఎందుకంటే , ఇది తొండమాను చక్రవర్తి రాజ్యం ! సరిహద్దుల్లో దుండగులే కాదు, అడవిలో జంతువులు కూడ అతనంటే భయపడతారయ్యా ! ఎవరికీ ఎలాంటి ఆపదలూ రావయ్యా !

కూర్మ ---- అంత గొప్పవాడా, మీ తొండమాను చక్రవర్తి ?

నాయుడు --- గొప్పవాడే బాబయ్యా ! ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు !

కూర్మ --- ( నవ్వి ) నాయుడూ ! నా పేరు కూర్మావధాని , కూర్ముడని ఊళ్లో వాళ్లు పిలుస్తారు ! మా ఊరు కాళహస్తికి దగ్గర్లో ఒక కుగ్రహారం. మా తండ్రిగారు ఈ మధ్యనే కాలధర్మం చేసారు, కర్మ కాండలు ముగిసి, కావలసిన వారందరూ వెళ్లిపోయాక, అతని అస్థికలు కాశీ గంగలో నిమజ్జనం చెయ్యాలని, యాత్రకి బయలు దేరాను .---- ఈమె నా భార్య , (భార్యని చూపించి ) మహాలక్ష్మి , వాడు నా కొడుకు ( కొడుకుని చూపించి ) రాఘవుడు, అయిదేళ్లవాడు. ఇది చాలా ? ఇంకా వివరాలు కావాలా ?

నాయుడు ---- ఇవరాలన్నీ సాన బాగా చెప్పారండి ! ఎంతైనా బ్రాహ్మలు కదండయ్యా ! అయినా నాకు తెలియక అడుగుతాను ----

కూర్మ --- ఏమిటది నాయుడూ ?

నాయుడు ---- మరేం లేదయ్యా ! అమ్మగారు మళ్లీ నీళ్లోసుకున్నారేంటయ్యా ?

కూర్మ -- అవునోయ్ నాయుడూ ! మీ అమ్మగారు ఇప్పుడు ఆరు నెలల గర్భవతి !

నాయుడు --- అదేనయ్యా ! అలాగే అనిపించింది. అయినా నాకు తెలియక ----

కూర్మ ---- అడగవయ్యా ! నేనేమీ అనుకోన్లే ?

నాయుడు --- ఆరు నెలల గర్భిణీ స్త్రీని, యాత్రలకి తీసుకొని వెళ్లరాదని అంటారండి, మీ లాంటి పెద్దలు ! మరి---

కూర్మ ( బాధతో ) ముందే చెప్పాను కదా నాయుడూ ! అది కుగ్రహారమని ! పేదవానికి పెళ్లామే చుట్టం, అన్న సామెత నీకు తెలిసినట్లే కదా ! డబ్బున్న వాడి కయితే అందరూ చుట్టాలే ! మా లాంటి నిరుపేదల కెవరు గతి ? కాశీయాత్ర కూడ భిక్షాటన చేసి చెయ్యాలి !

నాయుడు --- బాబయ్యా ! నూతిలో కప్పకు నుయ్యే ప్రపంచం అని, మీ లాంటి పెద్దలంటే విన్నానయ్యా !

కూర్మ --- ఇప్పుడా సామెత దేనికయ్యా , నాయుడూ ?

నాయుడు --- మరేం లేదు బాబయ్యా ! మీరు , మీ గ్రామంలో కూర్చొని , అదే అన్నీ అనుకొంటున్నారయ్యా ! తొందమాను చక్రవర్తి రాజ్యంలో , అందరికీ ఆ రాజే ఆప్తుడయ్యా !

కూర్మ --- అంటే ఆ రాజు అంతటి ధర్మదాతా ?

నాయుడు --- ఆ రాజు సంగతి సరేనయ్యా ! ఆ రాజుకి , ఆ రాజ్య ప్రజలకి కొండంత దేవుడు అండ ఉంది !

కూర్మ --- ఎవరు నాయుడూ , ఆ కొండంత దేవుడు ?

నాయుడు --- ఏడు కొండల వాడయ్యా ! వేంకటేశ్వర స్వామి ! ఆపద మొక్కుల వాడు , పిలుస్తే పలికే దేవుడయ్యా !

కూర్మ --- ఓహో ! వేంకటాచల రమణుడైన శ్రీనివాసుడా !! మీ తొండ మాను చక్రవర్తి అన్న కూతురు , పద్మావతీ దేవిని పరిణయ మాడాడట కదా ! ఆ మధ్య కొండ మీద ఆలయంలో ప్రవేశము, కూడ జరిగాయని విన్నాము !

నాయుడు --- బ్రహ్మోత్సవాలు కూడా జరిగాయయ్యా ! ఎక్కడెక్కడి జనం తిరునాళ్లలా వచ్చారు ! మీ గ్రామం నుండి ఎవరూ వెళ్లలేదా బాబయ్యా ?

కూర్మ ---- వెళ్లారయ్యా , నాయుడూ ! అగ్రహారం అంతా కదిలి ఘనంగా సంభావనలు తెచ్చుకొన్నారు. మా నాన్నగారు కాలధర్మం చెందడం వల్ల నాకు, వీలు కాలేదు.

మహాలక్ష్మి ---- ఏమండీ !

కూర్మ --- ఏమిటే ?

మహాలక్ష్మి --- పెళ్లి , మనుగుడుపులు అన్నీ అయి, గృహ ప్రవేశం జరిగాక , పద్మావతీ దేవి, తిరిగి కొండ దిగువకి వచ్చి, తిరుచానూరు శుకాశ్రమంలో ఉందని విన్నాం ! ఆ సంగతేదో , అతనిని అడగండీ !

కూర్మ విన్నావా నాయుడూ ! మీ అమ్మగారి సందేహం ?

నాయుడు ---- విన్నానండి ! పద్మావతమ్మగారు తిరుచానూరు వచ్చిన మాట నిజమేనండి ! తమ్ముడు వసుధానుడు , ఆమెను తిరిగి కొండ మీదకు తీసుకు వెళ్తానన్నా ఆమె ఒప్పుకోలేదట ! భర్త వచ్చి పిలిచేదాకా వెళ్లనని , తనకి ఆ ఊర్లోనే ఆలయం కట్టమని చెప్పిందట ! అలాగేనని ఆలయం కట్టించాడట ఆ మహారాజు !

మహాలక్ష్మి --- అయితే నాయుడూ ! ఆ తల్లి కొండ దిగువకి రావడానికి కారణం ఏమిటొ ?

నాయుడు --- ఆ యమ్మ తెచ్చిన సారెలో, కరివేపాకు , లేదంట ! ఆ కొండ మీద కరివేపాకు దొరకదాయె ! ఆరు నెలలకి సరిపడా కరివేపాకు తెమ్మని పంపాడంట, వేంకటేశ్వర స్వామి !!

మహాలక్ష్మి --- నాయుడూ ! అది అన్యాయం కాదంటావా ? అంత గొప్ప దేవుడికి కూడ , అత్తింటి సారె మీద ఆశ ఉంటుందంటావా ?

( నాయుడు తలపాగా తీసి బుర్ర గోక్కుంటాడు )

నాయుడు --- అదేమోనమ్మా ! అవన్నీ దైవలీలలు !! అందరికీ అర్థం కావని, మీ లాంటి వాళ్లు చెఫ్తే, విన్నానమ్మా !

కూర్మ---- మంచి దెబ్బకొట్టావు నాయుడూ ! బంతిని విసిరి కొడితే తిరిగి తన దగ్గరకే వచ్చినట్లు, మీ అమ్మగారి ప్రశ్న ఆమెకే తిప్పి కొట్టావు.

మహాలక్ష్మి --- ఆ ప్రశ్న నా మీదకి కాదు, మీ మీదకే తిప్పికొట్టాడు నాయుడు. ఆగమ శాస్త్రాలు చదువుకొన్నవారు మీరు, మీరే చెప్పండి !

కూర్మ --- మంచి మాటే అడిగావు మహాలక్ష్మీ ! మొదటి సారి విన్నప్పుడు నాకు కూడ ఇది, ఎబ్బెట్టుగానే తోచింది ! కాని ----

నాయుడు --- ఆగండయ్యా ! నాకు కూడ అర్థం అయ్యేలాగ చెప్పండి బాబయ్యా !

కూర్మ --- అలాగే నాయుడూ ! శ్రద్ధగా విను ! కరివేపాకుని మనం , ఒక్క తీపి వంటకాలకి తప్ప తక్కిన అన్ని రుచులూరే వంటకాలకి వాడతాం, అవునా ?

నాయుడు --- అవునండి !

కూర్మ ---- వంటకాలని శుద్ధిచేయడానికి మంచి వాసనని ఇయ్యడానికి, ఆ ఆకుని వాడతాం ,అంతే కదా ?

నాయుడు --- అవునండి , పని అయ్యాక తీసి పారేస్తాం కూడ !

కూర్మ --- ఇక్కడ కరివేపాకు అంటే తపస్సు అని అర్థం ! వంటకం అంటే సాధన ! రుచులు, కామితార్థాలు అంటే కోరుకొనే వరాలు ! ---వరాలు కోరుకొనేవారు తపస్సు అనే కరివేపాకు వేసి, సాధన అనే వంటకాన్ని శుద్ధిచేసి, పరిమళ భరితం చెయ్యాలి ! అప్పుడా ఫలితం రుచులూరుతూ , అనుభవ యోగ్యం అంటే తినే వీలు అవుతుంది ! తినేటప్పుడు వైరాగ్యం కూడదు కాబట్టి, తపస్సును అంటే కరివేపాకును వేరు చెయ్యాలి, అర్థమయిందా ?

నాయుడు --- కొంచెం కొంచెం అర్థమయిందయ్యా ! ఆమ్మగారూ , మీకు తెలిసిందాండి ?

మహాలక్ష్మి--- కరివేపాకు, వంటకాలు , రుచులు , వీటన్నిటికీ మీ వ్యాఖ్యానాలు బాగున్నా, ఇంకా ఎక్కడి పశ్న అక్కడే ఉండిపోయింది !

********

Comments

  1. అయ్యో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అపేసారే!!!

    చాలా బాగా రాస్తున్నారు.

    ధన్యవాదములు సర్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద