Skip to main content

నీల గ్రహ నిదానము 1

నీల గ్రహ నిదానము 1

ప్రధమాంకము

ప్రధమ దృశ్యము

(చంద్ర లోకం లోని శివాలయం)

(రోహిణి శివ పూజ చేస్తూ ఉంటుంది)-

రోహిణి------“ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః
కామదం, మోక్షదం తస్మా దోంకారాయ నమో నమః

ఓం ‘నం’ నమంతి మునయ స్సర్వే నమంత్యప్సరసాం గణాః
నరాణా మాది దేవానాం ‘నకారాయ’ నమో నమః

ఓం ‘మం’ మహత్తత్వం మహాదేవ ప్రియం జ్ఞాన ప్రదం పరం
మహాపాప హరం దేవం తస్మా ‘మకారాయ’ నమో నమః

ఓం ‘శిం’ శైవం శాంతం శివాకారం శివానుగ్రహ కారణం
జ్ఞానదం, పరమం, తస్మా ‘శ్చికారాయ’ నమో నమః

ఓం ‘వాం’ వాహనం , వృషభం, యస్య వాసుకీ కంఠ భూషణం
వామ శక్తి ధరం, దేవం ‘వకారాయ’ నమో నమః

ఓం ‘యం’ యకారో సంస్థితో దేవో యకారం పరమం శుభం
యన్నిత్యం పరమానందం ‘ యకారాయ’ నమో నమః

(ప్రవేశం---చంద్రుడు)

(చంద్రుడు ధ్యాన ముద్రలో ఉన్న రోహిణి వంక తమకంతో చూస్తూ పిలుస్తాడు)

చంద్రుడు ---- ప్రియే, రోహిణీ !

రోహిణి ---- ( ధ్యానం భంగమవగా, చంద్రుని వంక చిరుకోపంతో చూస్తుంది) ఏమందురు స్వామీ ?

చంద్రుడు --- రోహిణీ ! చంద్ర శిలా నిర్మిత, అంతఃపుర ప్రసాద హర్మ్యాల్ని, నీ చిరునవ్వు హారతులతో వెలిగించకుండా-----

రోహిణి ---- శివుని ముందు హారతి వెలిగించడం దేనికి, అంటారు, అంతేనా స్వామీ ?-

చంద్రుడు ----- అవును దేవీ !చిలుకల కొలుకలైన నీ కంటి కొనలు, అనురాగ రాగ రంజితాలు అయితేనే తప్ప ఈ చిరుకోపంతో శోభిల్లడం లేదు సుమా !

రోహిణి ---- ( శివుని ముందు నుంచి లేచి ) స్వామీ ! ఇది శివ పూజా సమయం, ప్రణయానికి -----

చంద్రుడు --- సమయా సమయాల ప్రసక్తి లేదు రోహిణీ ! పద ! పూజ ముగిసినట్లే కదా ! – (అంటూ ఆమె చెయ్యి పట్టుకొంటాడు)

రోహిణి --- ( విడిపించుకొని ) కాసేపు నన్నంటకండి స్వామీ ! నేను మీ ఆలినే అయినా ----

చంద్రుడు ---- ఇప్పుడు మాత్రం శివ పూజా ‘పరురాలి’ నంటావ్ ! ( ‘పరురాలి’ అన్న పదాన్ని వత్తి పలుకుతూ)

రోహిణి ---- (చంద్రుని నోటి దగ్గర చేయి పెట్టి వారిస్తూ ) మీ ఇల్లాలిని అంత మాట అనకండి స్వామీ ! ఈ రోహిణి మనో వాక్కాయ కర్మల చేతనే కాక, రూప వయో లావణ్యాదుల చేత కూడా----

చంద్రుడు --- ( అడ్డుపడి, ఆమె చిబుకాన్ని ఎత్తి పట్టుకుంటూ ) నాకు తెలుసు రోహిణీ ! నువ్వీ రాకా సుధాకరుని అనుంగు ప్రియురాలివి---

రోహిణి --- ( తన్మయత్వంతో, చంద్రుని కౌగిలిలో చేరి) ధన్యురాలుని ప్రభూ !

(ఇద్దరూ ప్రణయోన్మత్తతలో పరిసరాలని మరిచి పోతారు )

(ప్రవేశం— దక్ష ప్రజాపతి )

{ దక్షుడు వస్తూనే ఆ దృశ్యాన్ని చూసి, వెనకడుగు వేస్తాడు. అదే సమయానికి-- (తెరలోంచి) కొన్ని స్త్రీ కంఠ స్వరాలు -- అశ్చిన్యాది తారకల కంఠ స్వరాలు వినిపిస్తాయి.}

నక్షత్ర కాంతలు --- ( తెరలోంచి) చూసారా తండ్రీ ! ఆ రోహిణీ శశాంకుల ప్రణయ పరవశం ! చంద్రుడింక రోహిణికే కైవసం-------

దక్షుడు ---- చూసానమ్మా, చూసాను ఇప్పుడు అర్థమయింది నాకు, మీ కలవరంలోని ఆక్రోశం ! -- శాంతించండి, నేను రోహిణికి నచ్చ చెపుతాను--- ( అని రోహిణి వంక చూసి ) రోహిణీ !!! ( బిగ్గరగా పిలుస్తాడు )

( రోహిణీ చంద్రులిద్దరూ ఆ కేకకి తెప్పరిల్లి విడిపోతారు )

రోహిణి ----- ( తండ్రి వంక చూసి, సిగ్గు పడుతుంది ) నాన్నాగారూ ! రండి, ఈ సమయంలో మీ ఆగమనం ---

దక్షుడు --- నీ ఆలింగనానికి అంతరాయం, అంతేనా ?

చంద్రుడు ---- మామగారూ ! నమస్కారం ! అదికాది రోహిణి అభిప్రాయం---

దక్షుఢు ---- సమర్థించబోకు శశాంకా ! సమయా సమయాలు పాటించక, నేను పిలిచిన పిలుపు కావచ్చుకాక, మీ ప్రణయావేశానికి ప్రొద్దు గుంక ! అయినా నీ పని మాత్రం ఏమంత సమంజసం చంద్రా !? పవిత్రమైన శివ సన్నిధిలో శివ పూజా తత్పరురాలైన తరుణిని తమకంతో గవయడం-----?

రోహిణి --- నాన్నాగారూ ! అది మా స్వవిషయం ----

దక్షుఢు---- నిజమేనమ్మా ! రోహిణీ ! మన స్వవిషయాలు మరి కొందరికి కాకూడదమ్మా విష తుల్యాలు---

చంద్రుడు ---- మా దంపతుల ఆంతరింగిక విషయాలు మరికొందరి మనసులకి విష తుల్యాలా మామయ్యా ?

రోహిణి ---- ఎవరా ఇచ్చగించని పరులు తండ్రీ ?

దక్షుడు ---- వారు మీ కిరువురికీ కావలసిన వారేనమ్మా ! చంద్రా ! ఈ రోహిణితో పాటు అదే నక్షత్ర యోనిలో అయోనిజలు, అపరంజి బొమ్మలు అయి జన్మించిన వారిని, కన్న తండ్రిని కూడ నేనేనయ్యా !

రోహిణి --- ఓహో ! ఇప్పుడు అర్థమయింది, నా సవతులు మాత్సర్యంతో మీకు చెప్పిన మాటలు విని ----

చంద్రుడు ---- మీరు మమకారంతో మమ్మల్ని మందలించడానికి వచ్చారన్న మాట !

రోహిణి ---- ( గర్వంతో చంద్రుని వంక చూస్తుంది ) విన్నారా నాన్నగారూ ! మా ఇద్దరిదీ ఒకే బాట, ఒకటే మాట! ఈ రాజు, రోహిణికి మాత్రమే రేరాజు ! చంద్ర సదనమను యీ తామర కొలనులో , రోహిణి మాత్రమే కలువ బాల !!

దక్షుడు ---- ( కోపాన్ని అణచుకొంటూ ) రోహిణీ ! విచక్షణ లేక మాట్లాడుతున్నావు. అశ్విన్యాది నక్షత్ర కాంతలు నీకు సపత్నులే కాదు, సోదరీ మణులు కూడ ! ( ఆమె దగ్గరకు వెళ్లి అనునయంతో ) చూడమ్మా! వారిలో అశ్విని, భరణి, కృత్తికలు ముగ్గురూ నీకు అక్కలు--- మృగశిరాది రేవతి పర్యంతం నీ చెల్లెళ్లు ,--ఇందులో పరాయి వారెవరమ్మా ? నువ్వు వారితో పాటు పుట్టింట పెరిగావు, వారందరితో కలసి మెట్టినింట మసలడం ధర్మం ! నీ నాధుడు వారికి మాత్రం అనాధుడవడం ఈ తండ్రి భరించలేడమ్మా ! నీ తల్లి ‘ వీరిణి’ యీ వార్త విన్నప్పటి నుండి శోకాకులయై నిద్రాహారాలు వదిలి పెట్టింది. అందుకనే నేను నీ కడకు కార్యార్థినై వచ్చాను.

రోహిణి (వినరాని మాటలు వింటున్నట్లు ) నాన్నగారూ ! అనునయ వినయాలతో కలిపే కాపురాలు ఎంత కాలం నిలుస్తాయి ? ప్రాణ నాథుని తలలో నాల్క అయి, అతని ననుక్షణం, కనుసన్నలలో మెలిగేలా చేసుకో గలగడం ఒక కళ ! ( ఆగి, తండ్రి వంక ఓరగా చూస్తూ వ్యంగ్యంగా ) నాన్నగారూ ! సోదరీమణులే అయినా, సపత్నులుగా మారిన వారితో, ( చంద్రునికి దగ్గరగా వెళ్లి ) నే నీ చంద్రకళను ఎలా పంచుకో గలను ?

దక్షుఢు ---- అర్థమయిందమ్మా నీ సహృదయం ! ఇక నీతో మాటలాడి ప్రయోజనం లేదు. ( చంద్రునితో ) చంద్రా! అందగాడవని, షోడశ కళా పూర్ణుడవనీ నిన్ను చూసి నా కన్నియలు ముచ్చట పడితే కాదనలేక నీ కాళ్లు కడిగి వారి నందరినీ నీకు దానం చేసాను. నీ పెళ్లినాటి ప్రమాణాలైనా గుర్తు తెచ్చుకొని వారిని ఏలుకోవయ్యా !!

చంద్రుడు--- ఆగండి మామగారూ ! అదే మీరు చేసిన పొరపాటు. మీ కన్నియలందరూ నన్ను చూసి ముచ్చట పడడం, అది నా గ్రహపాటు ! నేను మాత్రం వారందరిలో తొలుదొల్త చూసినది రోహిణిని, మనసిచ్చింది కూడా ఆమెకే ! ఆమె చేయి నందుకోవాలని మీ దగ్గరికి వస్తే, ఒకే యోనిలో పుట్టిన కన్నెలని వారిని విడదీయడం సాధ్యం కాదని మాయ మాటలు చెప్పి, ఇరువది ఆరు గుదిబండలని నా మెడకి కట్ట బెట్టారు. పెళ్లినాటి ప్రమాణాలంటూ నే నెవరికైనా చేసి ఉన్నట్లయితే అవి కేవలం రోహిణికే ! (పద్యం)

చం__ ఇరువదియారు కన్యలను యేర్పడ గట్టిరి నాదు కుత్తుకన్
వరుసకు వారు భార్యలవవచ్చును కాని ప్రియంబు రోహిణే
పొరబడి తక్కువారలతొ పొందొనరించిరి మాయ మాటలన్
విరసము తోడ బల్కుచును వెర్రినిఁచేయుచు మోసగించరే !

దక్షుడు ---- చంద్రా ! నీవు రోహిణిని దక్క తక్కిన చుక్కలను చేపట్టడం------

చంద్రుడు ---- రోహిణి కొరకే మామగారూ !

దక్షుడు --- పెళ్లయినాక వారిని పరిత్యజించడం -----

చంద్రుడు ---- అది కూడ రోహిణి కొరకే !

రోహిణి ---- (కిలకిలా నవ్వి) విన్నారా నాన్నగారూ ! అందచందాలకి సాటిలేని యీ వన్నెకాడు, షోడశ కళాప్రపూర్ణుడైన యీ శృంగార నాయకుడు,ప్రియురాలి అంగాంగాలను అమృత పూరితం చేయగల యీ అమృతాంశుడు, రోహిణికే ప్రాణ నాయకుడు. పాల సముద్రంలో పుట్టి, వెన్నలాంటి వెన్నెలను వెదజల్లే యీ జాబిల్లికి ------

చంద్రుడు ---- ఈ రోహిణి మాత్రమే ఏకైక నాయిక !

దక్షుడు --- ( కాస్త కోపంతో ) చంద్రుడా ! ప్రేమ మత్తులో పడి ఉన్మత్తుడివి అయిపోయావు. రోహిణీ సౌందర్య జాలంలో పడి అంధుడివి కూడా అయినావు. నా ఇరువది ఆరు ఆడబిడ్ఢలను నిష్కారణముగా, తోడు లేకుండా చేసావు. ( మెత్తబడి ) వాళ్ళలో ఎవరినైనా, ఏనాడైనా అనురాగ దృష్టితో చూసావా చంద్రా ! పిల్ల నిచ్చిన మామగా నీ హితవు కోరి చెప్పే మాట విను --- అశ్విని కన్న కమ్మని కంఠమా రోహిణిది ! భరణి కన్న సమున్నతమా ఈమె కుచద్వయము ! కృత్తిక శరీర కాంతులు అగ్నికైన తేగలవు కదా తలవంపులు !! మృగశిర మృగ నయనాలు కురిపించ లేవంటావా వలపు హరి చందనాలు !?------

రోహిణి ---- నాన్నగారూ!! చాలించండి యీ స్తోత్ర పాఠాలు! వారు మీకు కన్న బిడ్డలైతే కావచ్చు గాక ! నాకు మాత్రము భయంకర సపత్నులు !!

చంద్రుడు---- దేవీ ! ఆవేశపడకు. నేనుండగా నీ కెందుకీ వ్యర్థ వార్తాలాపాలు ? నీ సవతులు ఎంతెంత సుందరాంగులైనా, ‘ అష్ట విధ నాయికా లక్షణాలు’ నీలోను, షోడశ కళలు నాలోను మూర్తీభవించి ఉన్నాయి. ముసలి వాళ్లకేం తెలుసీ కాముక విశేషాలు !! నీవు మందిరం లోకి వెళ్లి విశ్రాంతి తీసుకో ! ( దక్షునితో ) మామగారూ ! మీరు వచ్చిన పని ముగిసిందనుకొంటే మాకు సెలవియ్యండి. ఇప్పటికే మా ఏకాంతం చాల వరకు వ్యర్థమయింది.

దక్షుడు ----- (ఉగ్రుడయి) చంద్రా ! ఏమి నీ దురహంకారము !! నీవు ఇంద్రుని కన్న అందగాడివా ? నారాయణుని మించిన నాయకుడివా ? శివుని తలదన్నిన కామశాస్త్ర పారంగతుడివా ? ఏమిరా నీ కండ కావరం !! పిల్ల నిచ్చిన మామనని ఒదిగి ఒదిగి మాట్లాడినందులకా యీ మిడిసిపాటు !!! నేను సకల కార్య సుదక్షుడనైన దక్షప్రజాపతినని, ఉప బ్రహ్మనని మరచితివా ??—

(రోహిణి , దక్షుని ఆగ్రహం చూసి భయంతో అతని దగ్గరకు వెళ్తుంది.)

రోహిణి --- నాన్నాగారూ !! శాంతించండి, రండి లోపలికి వెళ్లి మాట్లడుకొందాం.( చెయ్యి పట్టుకొంటుంది.)

దక్షుడు --- ( చెయ్యి విదిలించుకొని ) ఛీ ! ధూర్తురాలా !! నీవే ధీని కంతటికీ మూల కారణము ! ( రోహిణికి చెంప దెబ్బ కొడతాడు )

( రోహిణి ఆ దెబ్బకి క్రింద పడుతుంది. చంద్రుడు ఆమెను లేవనెత్తేందుకు వస్తాడు. ఆమె లేచి మోకాళ్ల మధ్య తల దూర్చి ఏడుస్తుంది. చంద్రునికి ఆమె కన్నీరు భరించ రానిదవుతుంది అతడు ఆవేశానికి లోనవుతాడు )

చంద్రుడు --- దక్షా !! నీ వెంత సుదక్షుడవో నాకు తెలియనిది కాదు. చంద్రునికి సరిపోలు వారు సురాసురుల లోనే లేరు తెలుసా ? నా ఇంటికి వచ్చి, నా ఇల్లాలిని చెంప దెబ్బ కొట్టిన వాడు, బ్రహ్మ ఉపబ్రహ్మలలో ఎవరైనను నేను సహించునది లేదు. – ఆ ! మామగారివి కాబట్టి క్షమించి వదిలి పెడుతున్నాను. ఇక మీరు దయచెయ్యండి---(రోహిణి దగ్గరగా వచ్చి) రోహిణీ ! నా సఖీ ! దుఃఖించకు దేవీ ! పద మన మందిరానికి పోదాం ( బ్రతిమాలుతాడు )

( దక్షునికి ఆ దృశ్యం భరించ రానిదవుతుంది ఆవేశంతో ఉచితానుచితాలు మరచి పోతాడు. )

దక్షుడు _--- ( రోషావమానాలతో శపిస్తాడు ) చంద్రా ! యుక్తా యుక్త జ్ఞాన శూన్యుడవై నన్ను అవమానించావు ! ఈ రోజుతో నీ షోడశ కళలు నీలో హరించి పోవును గాక !! నీవు కళా విహీనుడవై, నిస్తేజుడవై , మృత ప్రాయుడగుదువు గాక !!! ( పద్యం )

గీ--- మామ నజ్ఞానమున చందమామ నీవు
పరిభవించితొ మఱి దాని ఫలిత మిదిగొ
కళల గోల్పోయి నీ దగు కాంతి నుడిగి
పండి యుందువు జీవచ్ఛవంబు పగిది.

( అని వెళ్లిపోతాడు )

( దక్షుడు వెళ్లిపోగానే చంద్రుడు నిస్తేజుడై నిస్సత్తువతో క్రింద పడిపోతాడు. రోహిణి చంద్రుని వంక దిగులుతో చూస్తూ ఉంటుంది.)

*********
(ఈ నాటకం మూడు భాగాలుగా పొద్దులో ప్రచురించబడింది )

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద