Skip to main content

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3

(రెండవ దృశ్యము.)

( దక్ష వాటిక )

( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.)

దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు )

( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.)

( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు )

( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ )

నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు.

దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ?

నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ?

దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి.

నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కారం అయిపోతే, ఏడేడు లోకాల జీవుల సమస్యలన్నీ భూతాకారం దాల్చి , అతనిని చుట్టుముట్టి ఉండేవి. అందుకే అతనొక యుక్తి పన్నాడు తెలుసా ?

దక్షుడు --- ఏమిటది నారదా !?

నారదుడు --- సమస్యలు , కోరికలు, సర్వమూ త్యజించి తనని ధ్యానించిన వారికే ముక్తి నిస్తానన్నాడు.

దక్షుడు ---- అన్నిటినీ త్యజించిన వాడు, తనకి తానే జీవన్ముక్తుడవుతాడు. ఇక నారాయణుడు చేసేదేముంది ?

నారదుడు ---- అదే బాబాయి బ్రహ్మ రహస్యం !! ఉపబ్రహ్మవైన నీకు మాత్రం తెలియదా ఏమి ?

దక్షుడు ---- అయితే నారదా ! సమస్యా పరిష్కారానికి నారాయణ నామ స్మరణ అవసరం లేదంటావు.

నారాయణ --- హరి హరీ ! నేనలా ఎప్పుడన్నాను ? అన్నిటికీ నారాయణ స్మరణ అవసరం లేదన్నాను.

దక్షుడు --- నారదా ! నువ్వు మాటలతో చిక్కుముళ్లు వేస్తున్నావు. ఒక దానికొకటి పొందు కుదరడం లేదు.

నారదుడు --- స్టితి కారకుడైన నారాయణుడు, జగద్రక్షణ కొరకు తన లీలా విలాసంతో మూడు కోట్ల దేవతా సమూహాన్ని సృష్టించి వారివారి అర్హతల మేరకు శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు. చిన్న చిన్న సమస్యలు చిల్లర దేవుళ్లతోనే తీరిపోయేటప్పుడు నారాయణుని బాధ పెట్టడం ఎందుకు ? ఇంతకీ మీ సమస్య ఏమిటి బాబాయి ? నాతో చెప్పకూడనిదా ?

దక్షుడు --- లేదు నారదా ! నీతో చెప్పుకోవలసినదే !

నారదుడు --- అయితే సావధాన చిత్తుడనై వింటాను.

దక్షుఢు --- నారదా ! నాకు నక్షత్ర యోనిలో జన్మించిన కుమార్తెలలో రోహిణిని దక్క, తక్కిన వారి నందరినీ చంద్రుడు పరిత్యజించాడు.

నారదుఢు ---- ` జామాతా దశమ గ్రహః ' అన్నది ఆర్యోక్తి ! నీ జామాత నవగ్రహాలలోనే ఒకడు కావడం నీ దురదృష్టం !!

దక్షుడు ---నిజమే నారదా! వారి కాపురం నిలబెట్టడానికి నా శాయ శక్తులా,రోహిణీ- చంద్రులకు నచ్చ జెప్పాను.

నారదుడు --- రూప యవ్వన మద గర్వంతో వారు మీ మాటలను పట్టించుకోలేదు, అంతేనా ?

దక్షుడు --- అక్కడితో తీరిపోలేదు నారదా ! నేను ఆవేశంలో రోహిణిపై చేయి చేసుకొన్నాను.

నారదుడు --- అందుకు చంద్రుడు అలిగి మిమ్ములను అవమానించాడు---

దక్షుడు ---- నారదా ! నీకీ విషయం ముందే తెలుసన్న మాట !

నారదుడు --- ఎందుకు తెలియదు బాబాయ్ ! ఆకాశ లోకం కోడై కూస్తూంటే ! మీ శాప ప్రభావం చేత మృత ప్రాయుడైన చంద్రున్ని , శివుడు ఆదుకొన్నాడు. చంద్రుని కళాకాంతులు దినదిన వృద్ధిక్షయములు కాగలవని మీ శాపాన్ని మలుపు తిప్పాడు.----అయినా ‘ కడుపు చించుకొంటే కాళ్ల మీద పడుతుందన్నట్లు’ , మీరు చేసిన పని ఏం బాగుంది బాబాయ్ ! కూతుర్ని ఏలుకోలేదని అల్లుని జవ సత్వాల్ని హరిస్తే నష్ట పోయేది ఎవరు ?

దక్షుడు --- నిజమే నారదా ! ఆ విషయంగానే ఇంట్లో గృహకలహం జరిగింది. భార్యా బిడ్డలందరూ నా పైన అలిగి గృహత్యాగం చేసారు.

నారదుడు --- ఎక్కడికి వెళ్లారు బాబాయ్ ! శివ సన్నిధికేనా ?

దక్షుడు ------ అవును.

నారదుడు --- పిన్ని ఈ విషయంలో పొరపాటు చేసింది బాబాయ్ ! రోహిణీ చంద్రులు శివ ప్రీతి పాత్రులు. అతడిందులో జోక్యం చేసుకొంటాడని అనుకోను. అంతే కాదు బాబాయి, జరిగిన దంతా సపత్నుల మాత్సర్యం వల్లనే జరిగిందని, రోహిణి చంద్రున్ని మరీ కట్టుదిట్టం చేసేసింది ! చంద్రుడామె నక్షత్ర మండలాన్ని తన వెనువెంటనే తిప్పుకొంటున్నాడు. ఇది వరకటి సంగతేమే గాని ఇప్పుడు మాత్రం అతడు ‘ చుక్కల్ని’ పూర్తిగా పరిత్యజించాడు.

దక్షుడు ---- నారదా ! ( నారదును చేతుల్ని పట్టుకొని ) ఆ చిక్కుల పాలైన చుక్కలు నీకు పరాయి వారు కారు. వారిని పతి దరి చేర్చే మార్గాన్ని చూపించు.

నారదుడు ---- చాల కష్టమైన భాద్యతని నెత్తిన పెట్టావు. అయినా ఆలోచించి చూద్దాం.

( నారదుడు మహతీ ఝంకారం చేస్తూ పచార్లు చేస్తాఢు. దక్షుడు వెను వెనుకనే తిరుగుతూ ఉంటాడు )

( అదే సమయానికి రంగ స్థలం పైన లైట్లు ఆరిపోతాయి. వెనుక నున్న నీలి రంగు తెరపై గెలాక్సీ ప్రొజెక్టు చేయబడుతుంది. అంటే నక్షత్ర కాంతల ఆగమనాన్ని సింబాలిక్ గా చూపించాలి అన్న మాట )

( గెలాక్సీ తెర మీద తిరుగుతూ ఉండగా )

నక్షత్రాలు --- ( తెరలోంచి ) నారద మునీంద్రా !! శరణు శరణు !! శివానుగ్రహానికి కూడ నోచుకోని మీ చెల్లెల్లని మీరే ఆదుకోవాలి.

దక్షుడు --- ఏమి యీ వైపరీత్యము ! శివుడు కూడ మీపై జాలి దలుపలేదా ? ( అంటూ ఆసనంపై కూలబడతాడు )

నక్షత్రాలు ---- లేదు తండ్రీ ! రోహిణి, శివుని ముద్దుల మరదలట ! మేము శివ సన్నిధికి వెళ్తున్నామని తెలిసి,అది ముందే అక్కడికి చేరుకొని, ‘ సతీ శివుల’ ఎదుట మా మాటకు చోటు లేకుండా చేసింది.

నారదుడు ---- హరిహరీ ! రోహిణి ఎంతకు తెగించింది.

నక్షత్రాలు --- నారద మహర్షీ !! చక్కని చుక్కలమైన మా వైపు నాథుడు చూడనైన నిచ్చగింప కున్నాడు. మా రోదనం ఆకాశ రోదనమయింది. అన్నవైన నీ వైన మమ్ములను కరుణించు.మార్గాంతరం చూపెట్టు. ( పద్యం )

గీ ఒక్క మారైన మముఁ జూడ నొప్పుకొనడు
చిక్కినాడు రోహిణికదె రిక్క రేడు
మమ్ము కరుణించి నారద మార్గమొండు
చూపుమా యన్న మా గోడు మాపు వేగ!

నారదుడు --- తారామణులారా ! రోహిణీ చంద్రులను విఢదీసినట్లయితే, మీరు మీ నాథున్ని మీ వైపు తిప్పుకోగలరా ?

నక్షత్రాలు --- రోహిణి నాథుని చెంత లేనప్పుడు అంతయు మా కనుకూలమే మునీంద్రా !

నారదుడు --- సరియే తారామణులారా ! మీరు మీమీ నెలవులకు పొండు. అనుకూలమైన మార్గము స్ఫురించినప్పుడు తెలియ జేసెదను లెండు.

నక్షత్రాలు ---- అనుగ్రహించంఢి నారద మహర్షీ !! మీ రాకకై ఎదురు చూస్తూ ఉంటాము.

( గెలాక్సీ ఆఫ్ అవుతుంది, తిరిగి రంగ స్థలం పైన లైట్లు. )

( నారద మహర్షి తిరిగి మునపటిలాగే మహతీ ఝంకారం చేస్తూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు )

దక్షుడు --- నారదా ! శివుడు రోహిణి పక్షమయినప్పుడు తక్కిన చుక్కల రక్షణ వహించువాడు----

నారదుడు --- శివుని కన్న అధికుడు గాని, అతనితో సమానుడు గాని కావలె !

దక్షుడు --- అందుకే నేను నారాయణ నామస్మరణ చేయ సమకట్టాను.

నారదుడు --- నారాయణుడు చంద్రునికి బావ కాదా బాబాయ్ !

దక్షుడు --- నిజమే నారదా ! నాకు స్ఫురించనే లేదా విషయము ! అయిన నిపుడు మార్గాంతరము ?

నారదుడు ---- రోహిణీ చంద్రుల వియోగము !

దక్షుడు ---- అదెట్లు సాధ్యము నారదా ! ఎవరు చేయ గలరా పనిని ?

నారదుడు ---- బాబాయ్ ! రోహిణీ చంద్రుల వలెనే ‘సతీ శివుల’జంట కూడ విడదీయరానిదే కదా ? వారి దాంపత్యము పరస్పర అనురాగ పూరితము, ఆదర్శవంతము అవునా ?

దక్షుడు ---- అవును.

నారదుడు --- అటువంటి జంటను ఏడున్నర సంవత్సరముల పాటు, వియోగ బాధకు గురి చేసినదెవరో తెలుసా ?

దక్షుడు --- సతీ శివులకు వియోగమా ? అదెప్పుడు సంభవించెను నారదా ? ఎవరా పని చేసిన ప్రతిభావంతులు ?

నారదుడు --- దేవ,దానవ, యక్ష, కిన్నెర, కింపురుష , మానవ, తిర్యగ్ వర్గుల యందు ఏ జీవినైనను ఏడున్నర సంవత్సరముల పాటు, ఇక్కట్ల పాలు చేయగల వారెవరున్నారు ప్రజాపతీ !? అతడు ఛాయా సూర్యుల పుత్రుడు—

దక్షుడు --- యముడా ?

నారదుడు --- కాదు, యమాగ్రజుడైన ‘శనీశ్వరుడు’అతడొక పరి శివుడు వద్దకు వెడలి, “ సదాశివా! నీ వంతు ఏలిన నాటి శని పీఢ ప్రారంభము కానున్నది, ఏమి చేయమందువు ?’’ అని ప్రశ్నించాడట !

దక్షుడు --- శివుడు ఏమన్నాడు ?

నారదుడు --- నీవు నన్నేమి చేయగలవని పంతగించి సతితో కలిసి, ఆలోచించి, సూక్ష్మాతి సూక్ష్మ మైన కారణ శరీరముతో , ‘హిమవంతుని’నడిబొడ్ఢున నున్న చిన్న ఛిధ్రములో ఏడున్నర ఏళ్ల పాటు సమాధి గ్రస్తుడైనాడట !

దక్షుడు --- ఆ పిమ్మట ?

నారదుడు ---- ఏమున్నది ! తరువాత శనిని పిలిపించి నన్నేమి చేయగలిగితివని ప్రశ్నించినాడట ?

దక్షుడు --- అర్థమయినది నారదా ! సతీ శివుల వియోగమే వారి పాలిట శనిపీడ అయినది. శనైశ్వరుడు ఆ విషయమే శివునకు చెప్పెను కాబోలు !

నారదుడు --- అవును బాబాయ్ ! శివునికి సతీ వియోగము చేసిన వాడు, రోహిణికి పతీ వియోగము కల్పింప లేడంటావా ?

దక్షుడు --- భళిరే నారదా ! బహు చక్కని ఆలోచన ! శని ఏడేడు పద్నాలుగు లోకములందు ఎవరి చేతనైనను అపరాజితుడు ! సర్వులను నొప్పింపు వాడే గాని, శర్వునిచే నైనను నొప్పింప బడని వాడు.

నారదుడు -- అతడంత ప్రతిభావంతుడు ఎట్లయినాడు బాబాయ్ ?

దక్షుడు ---- అది పరమేష్థి అతని కిచ్చిన వరము ! జీవులను ఐహిక బాధలకు గురిచేసి, వారి అహంకార చిత్త వృత్తిని నశింపజేసి, ఆముష్మిక పథము వైపు నడిపించుటయే శని కర్తవ్యము ! శని బాధ పడ లేక, అతనిని నిందించు వారి బలము శనినే చేరుట వలన, అతడు క్షణక్షణ ప్రవర్థమానమైన అశేష బలవంతుడు ! నారదా ! శనిదేవుడు ఇప్పుడు కృత్తికాంతమునందు కదా సంచరించు చున్నాడు. !!

నారదుడు --- అవును బాబాయ్ ! రోహిణి కక్ష్యలో ప్రవేశించుటకు ఎంతో సమయము లేదు.

దక్షుడు --- సత్వరముగా, రోహిణీ శకట భేదనము చేయుమని అతనిని వేడుకొనేదను గాక ! నారదా ! నీవు చేసిన సహాయము వెల కట్ట లేనిది ! ఇక సెలవా మరి !! ( వెళ్లి పోతాడు )

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద