Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 35

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 35

( దృశ్యము116 )

( వేంకటాచలం పైన శిలా భవనము )

( తొండమానుడు, రణసింహడు, కూర్మావధాని, మహాలక్ష్మి , రాఘవుడు, శిశుబాలిక, ఉంటారు )

( శ్రీనివాసుడు కనిపించడు. అతని స్థానంలో ‘శిలా విగ్రహము’ ఉంటుంది )

(అందరూ ఆశ్చర్యంతో శ్రీనివాసుని శిలా విగ్రహానికి ప్రణమిల్లుతారు )

( శ్రీనివాసుడు శిలా విగ్రహంలోంచే మాట్లాడుతాడు )

శ్రీనివాస---- ఓ తొండమాను మహారాజా ! నీ అగ్రజుడైన ఆకాశ రాజు నాకు ఆప్తుడగుట చేతను, నాకు మందిర నిర్మించి ఉపకారము చేసిన, నీకు శతాధికముగా ప్రత్యుపకారము చేసితిని.! లీలా మానుష రూపములో నేను ఒక చోటనే వసించుట వలన, ఒక బ్రాహ్మణ కుటుంబమునకు తీవ్ర అపకారము కలిగినది !! అదియే నేను సూక్ష్మ రూపమున ఉన్నచో అటుల సంభవించుట జరుగక యుండెడిది !!

ఇటు పైన నేను మౌనమును వహించెదను ! నా లీలా మానుష రూపమును త్యజించి, శిలా రూపముననే భక్తుల కోర్కెలు తీర్చెదను !! అత్యంతము ఏకాంత జనముతో తప్ప మరి ఎవరికి కనిపించను ! మరియు సంభాషింపను !! ఈ కలి యుగమున ఇక నేను అన్య ముఖము చేతనే మాటలాడుదును !! ఓ రాజా ! నీవు నీ పురమున కేగి నీ రాజ్యమును పాలించుకొనుము !!

( తొండమానుడు ఒక్కసారి దర్శనమివ్వమని బ్రతిమలాడుతాడు )

(శ్రీనివాసుడు మాట్లాడడు )

కూర్మ --- మహారాజా ! ప్రభువు ఇంత స్పష్టముగా చెప్పిన వెనుక తమరు, మరీ మరీ దర్శనమివ్వమని అడుగుట తగదు.

తొండమాన ---- ( దుఃఖంతో ) భూసురోత్తమా ! విన్నారు కదా స్వామి మాటలు !! నా అన్న తనకు ఆప్తుడగుట వలన , నేను తనకు శిలామందిరము కట్టించి , తనకు ఉపకారము చేయుట వలన, స్వామి నాకు ప్రత్యుపకారము చేసినారట !! అంతియే గాని , నేను తన భక్తుడనని అతడు అంగీకరించ లేదు ! మీరే చెప్పండి అవధానిగారూ ! నేను అతని భక్తుడను కానా !?

కూర్మ --- మహారాజా ! మీరెట్లు వగచుట తగదు . స్వామి ‘సప్తర్షుల’ యాగ ఫలమును స్వీకరించి, కలి యుగమున మానవ జనోధ్ధరణకు, అర్చామూర్తిగా ఈ నాటి నుండి శిలా రూపమున అవతరించినారు !! మానవ రూపమున అతడు ఒకే ఒక స్థలమున తన లీలా విశేషములను ఛూపించ గలడు. కాని శిలా రూపమున, విశ్వమంతయు తన లీలలు వ్యాప్తి చేయగలరు !!

అదియే అతని మాటల లోని అంతరార్థము ! ఇక మీ భక్తి విషయమందురా, దానికి కొలబద్దలు లేవే ! భక్తి యనునది భగవంతునికి భక్తునికి మధ్య గల అనుబంధము ! ఈ అనుబంధము ఒకరు అంగికరించ నంత మాత్రమున, అసత్య మవదు !

తొండమాన--- ( తేరుకొని ) నిజమా, విప్రోత్తమా !! నేనుశ్రీవారి భక్తుడనేనని, మీకు నమ్మకము కలిగినదా ?-

కూర్మ ---- ( నవ్వి ) మహారాజా ! శ్రీవారి శిలా మూర్తికి అర్చన మొదలు పెట్టండి! స్వామికి తులసీ దళాలంటే, ఇష్టం ! వాటితో అర్చించండి.

తొండమాన --- ( గర్వంతో ) ఉత్త తులసీ దళాలతో కాదు, సువర్ణ తులసీ దళాలతో అర్చిస్తాను ! నేను తన భక్తులలో, అగ్రగణ్యుడనని శ్రీవారి చేతనే అంగీకరించేలాగ చేస్తాను. ---రణసింహా ! పద ! మన్ము రాజధానికి వెళ్దాం. ఈ రోజు జరిగిన విశేషాన్ని , చాటింపు వేయిద్దాం ! రేపటి నుండి సువర్ణ తులసీ దళాలతో సహస్ర నామార్చన మొదలవుతుందని, శ్రీవారి దర్శనం చేసుకొని పునీతులవమని కూడ చాటింపు వేయిద్దాం !

( తొండమానుడు , రణసింహుడు వెళ్లి పోతారు )

( కూర్మావధాని, మహాలక్ష్మి, శిశువులు ఉంటారు )

కూర్మ ---- . మహాలక్ష్మీ ! మనము ఇక ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలి.

మహాలక్ష్మి,, ఏమండీ ! మన ఊరు,మన ఇల్లు----

కూర్మ --- అక్కడేముంది మహాలక్ష్మీ ! నాలుగు మట్టిగోడలు, ఒక గడ్డి పైకప్పు,తప్ప ! తొండమాను రాజు దయ వల్ల ఇక్కడనే, మన నివాస గృహము ఏర్పాటు కానున్నది ! అస్థి తీర్థ మహాత్య్మము , జనులలో, చాటింపు వేయడం వల్ల, ఇక్కడ కులవృత్తికి లోటు ఉండదు ! నీవేమంటావు ?

మహాలక్ష్మి,--- మంచి నిర్ణయమే తీసుకొన్నారు. వేంకటాచల నివాసం, మన పూర్వ పుణ్యం కావచ్చు ! ఏమండీ ----

కూర్మ --- ఏదో అడగాలనుకొంటున్నావు కదా ?

మహాలక్ష్మి,--- అవునండి ! సువర్ణ తులసీ దళాలతో పూజ చేస్తే, భక్తి ఇనుమడిస్తుందంటారా ?

కూర్మ --- ఫలం, పుష్పం, తోయం -- నిర్మలమైన మనస్సుతో ఇస్తే చాలన్నాడు భగవంతుడు ! అయితే ఈ కొండ మీద వెలసిన వేంకటేశ్వరుడు మాత్రం, కలియుగ ధర్మాన్ని అనుసరించి, సుంకం కావాలన్నాడు. కనుక తులసీ దళాలో, లేక సువర్ణ తులసీ దళాలో ఏవి మహత్తరమైనవో, ఆయనే నిర్ణయిస్తాడు ! అంత వరకు మనము వేచి చూడక తప్పదు.

మహాలక్ష్మి,--- నిజమేనండి ! ‘ కరివేపాకు లాగే, యీ తులసీ దళాలు కూడ’ ఏదో విచిత్రం చూపించేలాగే ఉన్నాయి. స్వామి లీలలు స్వామి వారికే తెలియాలి.

*****************

( దృశ్యము 117 )

( వేంకటాచలం పైన శిలామందిరం )

( శ్రీనివాసుని విగ్రహానికి , సువర్ణ తులసీ దళాలతో సహస్ర నామార్చన జరుగుతోంది )

( తొండమానుడు ఒక్కొక్క దళాన్ని ఒక్కొక్క నామం చదువుతూ, అర్చిస్తూ ఉంటాడు )

( అర్చన ఏకాంతంలో అంటే తొండమానుడు తప్ప మరవరూ ఉండరు. తొండమానునికి కిరీటం తప్ప, తక్కిన రాజోచిత దుస్తులు ధరించి ఉంటాడు )

( ఒక ఎత్తెన ఫీఠం పైన, బంగారు పళ్లెంలో సువర్ణ తులసీ దళాలు ఉంటాయి )

తొండమాన----ప్రభూ ! ఈ రోజు నుండి అష్టోత్తర శతం చొప్పున పది రోజుఅ పాటు నీకు అర్చన చేస్తాను. నన్ను ఘోరమైన పాప పంకిలం నుండి విముక్తుణ్ని చేసినందుకు, ఈ విధంగా నా కృతఙ్ఞుతను తెలుపు కొంటున్నాను. నన్ను నీ భక్తునిగా అంగీకరించేటంత వరకు పూజ ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

“ ఓం నమో వేంకటేశాయ ; శేషాద్రి నిలయాలయే! / వృషదృగ్గోచరాయచ ! విష్ణవే సతతం నమః !
సదంగన గిరీశాయ; వృషాద్రి పతయే నమః / మేరు పుత్ర గిరీశయ ; సరస్స్వామి తటే జుషే !
కుమారా కల్పసేవ్యాయ ; వజ్ర దృగ్విషయాయచ ! సువర్చలా సుతన్యస్త సైనాపత్య భూయచ !
రామాయ; పద్మనాభాయ; సదా వాయుస్తుతాయచ ! త్యక్త వైకుంఠ లోకాయ ! గిరి కుంజ విహారిణే !
హరి చందన గోత్రేన్ద్ర స్వామినే సతతం నమః ~ ~ ~ ~

******************

( దృశ్యము 118 )

( వేంకటాచలం పైన శిలా మందిరం )

( శ్రీనివాసుని శిలా విగ్రహానికి , తొండమానుడు రెండో రోజు పూజ చేస్తూ ఉంటాడు )

తొండమాన---- ప్రభూ ! శ్రీనివాసా ! నిన్నటి దినం నీ పూజ నూట ఎనిమిది సువర్ణ తులసీ దళాలతో చేశాను. ఈ రోజు కూడ అదే విధంగా చేస్తున్నాను. నన్ను కరుణించి నా భక్తిని అంగీకరించు ప్రభూ !

“ శంక రాజన్య నేత్రాభ్జ విషయాయ నమో నమః ! వసూ పరి చరిత్రాత్రే కృష్ణాయ సతతం నమః !
అబ్ధి కన్యా పరిష్వక్త వక్షసే, వేంకటాయచ ! సనకాది మహాయోగి పూజితాయై నమో నమః !
దేవ జిత్ప్రముఖానస్త, దైత్య సంఘ ప్రణాసినే ! శ్వేత ద్వీప వసన్ముక్త, పూజితాంఘ్రి యుగాయచ !
మాయా గూఢ విమానాయ గరుడ స్కంధ నివాసనే !అనంత శిరసే నిత్య మనన్తాక్షాయతే నమః !

******************

( దృశ్యము ౧౧౯ )

( వేంకటాచలం పైన శిలా మందిరం )

( శ్రీనివాసుని శిలా విగ్రహానికి , తొండమానుడు పదవ రోజు పూజ చేస్తూ ఉంటాడు )

తొండమాన---- ప్రభూ ! ఈ రోజు పదవ రోజు ! నేటితో సహస్ర దళల పూజ పూర్తవుతుంది. కని నీ నిర్ణయము తెలియనే లేదు !

( అంటూ పూజ మొదలు పెడుతూ, స్వామి పాదాల వంక చూస్తాడు. క్రిందటి రోజు పూజించిన సువర్ణ తులసీ దళాల కొన్ని మట్టితో చేసిన తులసీ దళాలు కనిపిస్తాయి.
తొండమానుడు వాటి వంక ఆశ్చర్యంతో చూస్తాడు )

తొండమాన--- స్వామీ ! ఇది యేమి విపరీతము ! నేను పూజించిన సువర్ణ తులసీ దళాల పైన, మృణ్మయ తులసీ దళాలు ఎలా వచ్చాయి.? అవే ఇలా మట్టిగా మారిపోయాయా !? స్వామీ, స్వామీ –

( శ్రీనివాసుడు పలుకడు )

తొండమాన --- స్వామీ ! మీ మఒనవ్రతధారణ వలన కొన్ని నగ్న సత్యములు బయల్పడకున్నవి ! మిమ్ములను మట్టితో పూజించిన వాడెవ్వడు ?

( శ్రీనివాసుడు పలుకడు )

( తొండమానుడు ఆ రోజు పూజ ముగించకుండానే, పాండు తీర్థానికి కూర్మావధాని వద్దకు వెళ్తాడు. కూర్ముడు రాజుని చూసి లెచి నిల్చొంటాడు )

తొండమాన--- అవధాని గారూ ! మీరొక పరి ఆలయమునకు రండు.

కూర్మ --- అటులనే మహారాజా !

( తొండమానుడు , కూర్ముడు కలసి ఆలయానికి వెళ్తారు. అక్కడ మట్టి తులసీ దళాలని, తొండమానుడు అతనికి చూపిస్తాడు )

తొండమాన--- అవధాని గారూ ! నా పూజలో ఏమి లోపం ఉంది ! నా సువర్ణ దళాలు , మృణ్మయ దళాలుగా ఎలా మారి పోయాయి ?

కూర్మ ---- మహారాజా ! మీరు రోజుకి ౧౦౮ సువర్ణ దళాల చొప్పున ౯ రోజులు పూజించారు అవునా ?

తొండమాన--- అవును.

కూర్మ --- అంటే తొమ్మిది వందల డేభ్భై రెండు (౯౭౨) సువర్ణ దళాలు ఉండాలి కదా ?—ఈ దళాలన్నీ లెక్క పెట్టి, లెక్క సరిగా ఉన్నాయో ,లేదో చూద్దాం !

( ఇద్దరూ కలిసి దళాలను లెక్క పెడతారు. లెక్క సరిగానే ఉంటుంది )

కూర్మ --- మహారాజా ! సువర్ణ దళాలు లెక్కకి సరి పోయాయి ! అంటే ఈ మట్టితో చేసిన తులసీ దళాలు ఇంకెవరో పూజించినవి అయి ఉండాలి !!

తొండమాన--- మట్టితో తులసీ దళాలు చేసి పూజించాలనే ఆలోచన ఎవరికి వచ్చింది ?

కూర్మ --- మహారాజా ! ఈ దళాల పని తీరు చూస్తుంటే, ఇవి ఎవరో కులాలుడు చేసినట్లుగా ఉంది !

తొండమాన--- కులాలుడు అనగా కుమ్మరివాడు ! అవధాని గారూ ! మీరు చేసిన సూచన సమంజసముగా ఉంది.ఈ కుమ్మరి ఎవరో తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు ! ఈ రోజే వాని విషయం కనిపెడతాను !

కూర్మ --- మహారాజా ! ఈ విషయంలో నిదానం ప్రధానమైనది ! ఆ కులాలుడెవరో , ఎందుకిలా చేస్తున్నాడో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం ! ఆ తరువాతే ఏదైనా
నిర్ణయం తీసుకోండి !

తొండమాన--- అర్థమయినది ! అవధాని గారూ ! మహాలక్ష్మమ్మ గారి విషయంలో తీసుకొన్నట్లు, తొందర పాటుతో కాక, వివేకంతో పరిశీలించి నిర్ణయం తీసుకోమంటారు, అంతేనా ?

కూర్మ ---- అవును మహారాజా !

తొండమాన--- నేనే స్వయముగా మారు వేషంలో వెళి, పరిశీలిస్తాను, సరేనా ?

( కూర్ముడు అంగీకారంగా తల ఊపుతాడు )

************

Comments

  1. ఇంత బాగా రాస్తూ
    బాలాజీ ఏంటండీ?
    చక్కగా శ్రీనివాసుడనో లేక వెంకటేశ్వరస్వామనో సంబోధించక
    పోనీ ఉత్తరం వారికి అర్థం కాదు అనుకోవటానికి మన బ్లాగు చదివేది తెలుగువారే కదా
    తెలుగుని పెంపొందించండి

    ReplyDelete
  2. మాననీయ రహ్మానుద్దీన్ షేక్ గారూ ! ‘బాలాజీ’ అనే పేరుని ఉధరించడానికి కారణం ఉందండీ ! సప్తర్షుల యాగ ఫ్లాన్ని అంగీకరించిన తరువాత, శ్రీ మహా విష్ణువు,మతి కోల్పోయి,తీర్థ యాత్రలు చేస్తూమథుర(యు.పి)వెళ్తాడు.అక్కడ వైఖానస ఋషి అతనిని తన ఆరాధ్య దైవమైన ‘బాల కృషునిగా’ గుర్తించి ‘బాలాజీ’ అని పిలుస్తాడు. అదే తొలి పిలుపు కావడం వల్ల ,నే్ను ఆ పేరు వాడాను ! యీ కథ ఇదివరకే వ్రాసాను.అంతే కాని భాషాభిమానం లేక కాదు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ