ఇద్దరు అభిసారికలు రెండు సెలయేర్లు.
“హే! సూర్య భగవాన్! ఇక ఎంతకాలం ఈ నిరీక్షణ తండ్రీ!వృద్ధ మండలాధీశ్వరు డైన పూర్ణ ప్రభుని జీవిత భానుడు, అస్తమించేదెప్పుడు ప్రభూ ?!”
పిపాసా తప్తములైన దృక్కులతో, అనుదినం సూర్యభగవానుని సమాధానం కోసం వేధించే ఈ వేదనా భరిత విలాపం, సోమపురీ మండలాంతర్గత మైన ఉద్యానవనంలో వసించే ఇద్దరు అభిసారికలది.
సోమపురీ మండలం సస్యశ్యామల భరితమే కాక, బౌద్ధులకు తీర్థయాత్రా స్థలం కూడ. ఇక్కడే జగత్ప్రసిద్ధమైన ‘ సోమపురీ మహా విహారం’ ఉన్నది. పుణ్య సంచయార్థం వచ్చే యాత్రికుల సంఖ్య దిన దిన ప్రవర్థమానం అవుతూండడం చూసి, మాండలిక ప్రభువైన పూర్ణప్రభుడు రాజధాని నుండి మహావిహారం వరకు విశాల రాజమార్గాన్ని నిర్మించాడు.
పూర్ణప్రభుడు ప్రజానురంజకుడైన పరిపాలకుడే కాక దయాళుడు. వ్యక్తిగతంగా కూడా ఎవరికీ అపకారమూ చేసి ఎరగడు. అంతెందుకు, యాత్రికులు ఆ
విశాల రాజ మార్గ మధ్యంలో విశేష ధనంతో నిశ్చింతగా నిద్రించ గలరంటే, అతని పరిపాలన ఎంతటి శాంతియుతమైనదో ఒక్క మాటలో చెప్పినట్లవుతుంది.
ఆ రాజమార్గానికి ఒక ప్రక్కగా, దగ్గర దగ్గరగా పెంచబడిన రెండు ఉద్యానవనాలు,వాటిలో లతా పుష్పాఛ్ఛాదితము లైన రెండు భవంతులు చూపరుల కంటిని ఇట్టే ఆకర్షిస్తాయి. ఒకదానితో ఒకటి పోటీ పడి కట్టించినట్లుండే ఆ భవనాలు సమాన రూప వయో లావణ్యాలు కల ఇద్దరు నర్తకీమణుల నివాస గృహాలు.
సౌందర్యంలోనూ, సంగీతంలోనూ, నాట్యకళా ప్రావీణ్యంలోనూ,మనసు మెచ్చే విధంగా పూలమాలలు కట్టడంలోనూ, వారిద్దరూ ప్రతిద్వంద్వులే ! మహారాజు పూర్ణప్రభుని నుండి సామాన్య పౌరుల వరకూ, వారిరువురి నాట్యకళా ప్రౌఢిమని శ్లాఘించేవారే ! వారిరువురి రూపజాలంలో చిక్కి, మిథ్యాంగిక విన్యాసాలకి ముగ్ధులయి, సన్నిధిని సాధించలేక పరితపించే ప్రముఖులు కూడ లేక పోలేదా నగరంలో !
వారిలో ఒకరి పేరు సనక ! రెండవ తరుణి పేరు మేనక ! సూర్యాస్తమయ సమయంలో, ఏకాకిగా ఉద్యానవన ప్రాంత సరోవర తటం నుండి, సంధ్యారుణ కాంతులతో మెరిసిపోయే రాజభవనం వంక దృష్టి సారిస్తూ, తనలో తనే మురిసిపోయేది సనక !
ఆ రాజమందిరంలో మహారాణి హోదాలో తిరుగాడ గలిగే భాగ్యం త్వరలోనే తనకి పట్టబోతుందనే ఆనందంతో ! కారణం యువరాజు పుణ్యరత్నుడు ఆమెను తన హృదయ రాజ్ఞిగా స్వీకరిస్తానని ఇచ్చిన వాగ్దానమే ! అయితే వృద్ధ మండలాధీశ్వరుడైన పూర్ణప్రభుని మరణానంతరమే తన ప్రతిన నెరవేర గలదనే షరతు కూడా సూచిస్తూ. సరిగా ‘మేనకకి’ కూడా అటువంటి వాగ్దానాన్నే ఇచ్చాడు యువరాజు పుణ్యరత్నుఢు. అందుకే అనుదినం సూర్యభగవానునికి అంజలి ఘటిస్తూ, “ హే ! సూర్య భగవాన్ ! ఇంకా ఎంత కాలం ప్రభూ, ఈ దుస్సహ నిరీక్షణ, “ అంటూ ప్రార్థిస్తారా అభిసారికలు.
ఇరువరి హృదయాలలోని ఆవేదనా ఆకాంక్షా ఒకటే కావడం వల్ల ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టదు.
నిత్యమూ, కళ్లు మిరమిట్లు గొలిపేలా అలంకరించు కొనడంలోనూ, చూపులు నిలిపి వేసేలా పూలమాలలు కట్టడం లోనూ, వారిరువురి పోటీ చెప్పశక్యం కాదు !
కాని చీలి రెండు పాయలై ప్రవహించే నది, చివరకు ఒకే సముద్రాన్ని ఆశ్రయించేటట్లు, ఆ అందాన్ని చూసి ఆనందించే హక్కు ఒక్కరిదే !
అతడే యువరాజు పుణ్యరత్నుడు !!
సముద్రుడు అన్ని నదులనూ ఒక్కలాగే ఆదరిస్తాడు. తన గంభీరమైన హృదయంలో దాచుకొంటాడు. అలాగే పుణ్యరత్నుడు కూడా ఆ రెండు ప్రేమ వాహినులను తనలో కలుపుకొన్నాడు.అతడి ప్రేమ సముద్రుని ప్రేమ వలె గంభీరమైనది కాదు.అసలది ప్రేమ అని చెప్పడానికే వీలు కాదు.‘ అతడు వారివురినీ ప్రేమించినట్లు నటిస్తున్నాడు’, అని చెప్పినా ఆవగింజంత అబద్ధం చెప్పినట్లే అవుతుంది !
ఆ ఇద్దరి నర్తకీమణుల ఆకాంక్షా, ఉచ్ఛాభిలాషా, పుణ్యరత్నుని మాటలనే నాగస్వరం విని నాట్యం చేసేవి. ఆ రెండు నాగినులనూ ‘మహారాణి పదవి’ అనే బుట్టలో పడవేసి, మిథ్యా ప్రేమ కలాపాలనే నాగస్వరంతో ఆడించేవాడు, పుణ్యరత్నుఢు.
ఆ ప్రణయ కేళి, కాదు కాదు పాములాట రోజుకో విధంగా ఉండేది.
ఒక రోజు___అపరాహ్న వేళ ఇంటి ముందర వృక్షచ్ఛాయలో, విశ్రమించిన, ‘సనక’ చల్లని చందన స్పర్శతో పులకితురాలై వెను తిరిగి చూసింది.ఎదుట మధుర భావనలే మూర్తి దాల్చినట్లు, చేత చందనపు గిన్నెతో ప్రత్యక్ష మయ్యాడు పుణ్యరత్నుడు. ప్రొద్దు రెండు ఝాముల వరకు కూర్చి కట్టిన పూలమాల అతని కంఠానికి అలంకరిస్తూ,“ ఇంకాఎన్నాళ్లీ దుస్సహ నిరీక్షణ ప్రభూ ! గోముగా అడిగింది సనక, అతని హృదయం మీద వాలిపోయి.
“ఏం చెయ్యమంటావో ఆజ్ఞాపించు దేవీ !”
“మహామండలేశ్వరుల నిర్యాణం వరకు ఎదురు చూడక వారి అనుమతి తోనే మన వివాహం జరగదా ప్రభూ?!”
“వీలు పడదు సనకా ! అతని అనుమతి లభించడం అసాధ్యం !”
ఆ మాటలకి దిగజారి పోయిన సనక విషణ్ణ వదనం చూస్తే నవ్వు వచ్చేది పుణ్యరత్నునికి. ఆమెనింకా మాటలతో రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో, “ఒక ఉపాయం ఉంది సనకా !” అన్నాడు హఠాత్తుగా.
“ఏమిటది ప్రభూ ?!” ఆతృతతో ధ్వనించింది సనక కంఠం.
“మహారాజుని మన ప్రణయ పథం నుంచి అపసారితం చెయ్యడమే !”
మాట పూర్తి కాకుండానే అడ్డు పడింది సనక. “ అంతటి భయంకరమైన ఆలోచనలకి తావివ్వకండి యువరాజా ! “ అంటూ.
“అయితే దినాలపై దినాలు, యుగాలపై యుగాలుగా ఈ దుస్సహ నిరీక్షణ లోనే గడుపుతావా సనకా ?”
ఆ ప్రశ్నకు సనక బదులివ్వలేదు. మౌనంగా యువరాజు ముఖం వంక చూస్తూ ఉండి పోయింది. ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకొని, “అందుకే విష ప్రయోగం చేత పూర్ణ ప్రభుని అంతమొందింస్తే మన మార్గం సుగమ మవుతుంది,
ఏమంటావు సనకా ?”
సమాధానంగా సనకకు ‘ఊ’ అనడం తప్పని సరి అయింది.
అంతే, అదే కావాలి పుణ్యరత్నునికి. ‘ఒక అసాధారణ రూపవతి అయిన యువతి తన కోసం ఎంతటి భయానక కార్యానికి ఒడికట్టింది !’ అనే ఆలోచనే అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేది. వికటంగా నవ్వుతూ ఆమె నుండి సెలవు తీసుకొని నిష్క్రమించాడు పుణ్యరత్నుడు, ఆ నాటి ఆటని ముగించుకొని. యువరాజు నవ్వుకి అర్థం తెలియక, కాతర నయనాలతో అతను వెళ్లిన వైపే చూస్తూ ఉండి పోయింది సనక.
ఆమె నుండి సెలవు తీసుకొని మేనక మందిరానికి వెళ్లాడు యువరాజు.
కక్ష్యాంతర్భాగం నుండి యువరాజు ఆగమనాన్ని గమనించిన మేనక గాలిని మించిన వేగంతో పరుగు పరుగున వచ్చి, అతని గళసీమలో ఉన్న పూలమాలని చూసి, ఠక్కున ఆగి పోయింది. ఆ మాల సనక కట్టినదేనని గ్రహించి,ఈర్ష్యతో ఆమె కండ్లు కెంపుల్లా ప్రకాశించాయి. తనకు రాబోయే మహద్భాగ్యాన్ని, ఆ సనక ఎక్కడ తన్నుకు పోతుందో అనే అనుమానంతో, అభిమాన స్వరంతో, “ సనకతో మీ ఈ చర్యకి అర్థమేమిటి ప్రభూ ? అని ప్రశ్నించింది. ఆమె ముఖభవాలలో అంతరంగాన్ని చదవ గలిగిన పుణ్యరత్నుడు “ నేనీ మాలని మనస్ఫూర్తిగా గ్రహించ లేదు మేనకా ! కాని------”
“ఏమిటది ప్రభూ ?”
“చెప్తాను విను,” అంటూ, ఆమె నతి దగ్గరగా తీసుకొని, పరమ రహస్యం చెప్పే వానిలాగ స్వరం తగ్గించి, “ సనక నీకు విష ప్రయోగం చేసి, తన ప్రణయ పథాన్ని నిష్కంటకం చేసుకోవాలని అనుకొంటోంది,” అన్నాడు.
“మీరీ విషయం తెలిసి కూడా ఉపేక్ష వహిస్తారేం ప్రభూ !?”
“ఏం చెయ్యమంటావో చెప్పు మేనకా ?”
“ఆమె నీ దేశం నుండి బహిష్కారం చేయించండి రాకుమారా !”
“నువ్వు ఒప్పుకొంటే ఆమె నీ గేహం నుండే బహిష్కారం చేయిస్తాను మేనకా !”
“అదెలాగ ప్రభూ ?”
“మనమే రహస్యంగా విష ప్రయోగం చేసి ఆమెని------”
“శివ, శివ !” అంటూ అతని నోటిని తన చేతితో మూసింది మేనక.
“సరే ! అలాగే కానీ, మరికొన్నాళ్లకి సనక చేత విష ప్రయోగం చేయబడి, మరణించే వరకు ఇలాగే భజన చేస్తూ ఉండు” అంటూ తెచ్చి పెట్టుకొన్న కోపంతో అక్కడ నుంచి లేచి పోవడానికి ఉద్యుక్తు డయ్యాడు యువరాజు.
వెళ్లిపోతున్న యువరాజుని వారిస్తూ, “ మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి యువరాజా ! మీ మాటకి నే నెన్నడూ ఎదురాడను,” అంది గోముగా. బిగ్గరగా నవ్వుతూ అక్కడ నుండి నిష్క్రమించాడు పుణ్యరత్నుడు. అంతటితో ఆ నాటి వినోద కేళిని ఉపసంహరించుకొని.
ఆ విధంగా సాగుతూ ఉండేది పుణ్యరత్నుని ఆట ! ఇద్దరు లావణ్యవతులు, తమ మిథ్యా ఆంగిక విన్యాసాలతో ఎంత మందికో పిచ్చెత్తించిన, ఇద్దరు నటనా లలామలు, కేవలం తన కుహనా ప్రేమకి వశవర్తులై, తన ఇచ్చ వచ్చినట్లు ఆడడం అతనికి గర్వకారణమయేది.
*************
యువరాజు ప్రస్తావన వినగానే సనక మొదట కంపించి పోయింది. ధర్మ వ్రతుడైన మహారాజుకి విష ప్రయోగం అన్న మాటలే ఆమె సహించలేక పోయింది. కాని ఆమె అంతరంగంలోని ప్రేమ, ఉచ్ఛభిలాష దానిని అణచి వేసాయి.
మహారాజు చావు వెనక కలగబోయే మహాద్భాగ్యాన్ని తలపుకి తెచ్చుకొని తనకు తానే ఊరడిల్లేది సనక.
మరికొంత కాలం గడిచినాసరే అతని ప్రస్తావన అలాగే ఉండిపోవడం, ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే ఒకనాడు, చిక్కని లతా నికుంజంలో యువరాజు హృదయంపై తల వాల్చి, విశ్రమించిన వేళ , “ఊరకనే అంతటి భయంకర ప్రస్తావన ఎందుకు ఎత్తారు ప్రభూ ?!” అని అడిగింది.
సమాధానంగా పుణ్యరత్నుఢు వికటంగా ఆమె గుండెలు పగిలేలా నవ్వాడు. “ మరేం లేదు సనకా ! నా ప్రేమ కోసం నీవు ఎంతటి హైన్య స్థితికి దిగజారావో తెలుసుకొందామని,” అంటూ.
అతని మాటలు సనక హృదయ తాపాన్ని రెచ్చగొట్టాయి. ఆమె నవనాడులూ ఒక్కసారిగా స్తంభించి పోయినట్లయింది. కొంత సేపటికి, “నిజమే ప్రభూ ! మీ ప్రేమలో పడి పిచ్చి దాన్నయిపోయాను,” అంది గద్గద కంఠంతో.
పుణ్యరత్నుడు జవాబు విని విపరీతమైన ఆనందం పొందాడు.. అసలా దినం అతనొక క్రొత్త పథకం ఆలోచించి వచ్చాడు. దానిని సనక ముందు బయట పెట్టాడు.
“నీ లాగ మేనక కూడ నన్ను ప్రేమిస్తోందన్న విషయం నీకు తెలుసునా సనకా?”
అతని ప్రశ్న సనకకి ఆశ్చర్యాన్ని కలిగించింది.ఆవిషయం నిజంగానే తెలియదు.
అప్పుడప్పుడు మేనక దినచర్యలు ఆమెకట్టి సందేహాన్నికలిగించినా, మరుక్షణం దానిని మరచి పోయేది. విస్ఫారిత నేత్రాలతో అతని వంక చూస్తూ, “నా కా విషయం తెలియదు ప్రభూ ! కాని అనుమానం మాత్రం ఉంది,” అంది.
“నాకు మీ ఇద్దరి పట్ల సమానమైన ఆప్యాయతే ఉంది. అందుకే మీ ఇద్దరి మధ్య ఎవరి ప్రేమ గొప్పదో తెలుసుకోవడానికి చిన్న పరీక్ష పెట్ట దలచాను.”
“పెట్టి ------”
“అందులో ఎవరు ఉత్తిర్ణులవుతారో వారినే నా జీవిత భాగస్వామినిగా చేసుకొంటాను.”
నిర్మేఘ జలపాతం లాంటి ఈ వార్త సనకను కొంతకాలం చైతన్య రహితంగా చేసింది. మరుక్షణం తేరుకొని, “ ఏమిటా పరీక్ష ప్రభూ ?!” అన్నది గద్గద కంఠంతో.
“మరేమీ లేదు, నీవు మేనక ఇద్దరూ రెండు పుష్ప మాలలు తయారు చేసి, రేపు ఉదయం ‘ నందన మంటపానికి’ తీసుకొని రావాలి. ఎవరి చేత కట్టబడిన పుష్ప మాలిక ఎక్కువ సుందరఃగా ఉంటుందో, ఆమెయే నా అర్థాంగి అవుతుంది.”
సనక దానికేమీ జవాబివ్వలేదు. అసలామె ఏ ప్రశ్నకీ సమాధానం చెప్పే స్థితిలో లేదు. రాజకుమారును పరీక్షా విధానం ఆమెను అప్రతిభురాలిని చేసింది. ‘ మనసుని బట్టి తెలుసుకోలేని ప్రేమని పుష్పమాలలు చూసి ఏం తెలుసుకొంటాడీ యువరాజు !!’ అన్నదే ఆమెకి అర్థం కాని విషయమయి పోయింది.
మౌనం అర్థాంగీకారంగా భావించి .ఆ చోటు వదిలి వెళ్లి పోయాడు పుణ్యరత్నుఢు., నేరుగా మేనక మందిరానికి.
*************
మరునాడు __________
రాత్రి మూడవ ఝాము నుండి మేలుకొని మిక్కిలి ప్రయాసతో రచించిన
పుష్పమాలికలు సజ్జలలో ఇమిడ్చి, కళ్లు మిరమిట్లు గొలిపే అలంకరణతో ఆ అభిసారికలు ఇద్దరూ ‘నందన మంటపం’ వైపు ఉషోదయానికి స్వాగతం చెప్పడానికా అన్నట్లు దారి తీసారు.
గమ్యమూ, లక్ష్యమూ ఒకటే అయినందువల్ల ఇద్దరూ, ఒకరికొకరు తారస పడ్డారు. ఇద్దరి చూపులూ నిమేష కాలం సంధించుకొని, పరస్పర హస్తగతాలైన పూలసజ్జల మీద నిలిచాయి.
ఎంత చిత్రమైన ప్రేమ పరీక్ష అది !!
శాశ్వతమూ, సౌభద్రమూ అయిన భావి మహారాజ్ఞి పదవి, సామాన్యమూ, సామయికమూ అయిన పూదండ మీదనా ఆధార పడేది !!
పుణ్యరత్నుని పాములాటకి అణుగుణంగా తల ఒగ్గిన ఆ నాగినులిద్దరూ ఒక్కొక్కటిగా మెట్ల నధిగమించి, నందన మంటపం చేరుకొన్నారు. నందన మంటపం మహావిహారానికి ప్రక్కనే ఉన్న నందన పర్వత మధ్యభాగంలోని సమతల ప్రదేశంలో మహారాజు పూర్ణప్రభువు చేత నిర్మింపబడి ఉంది.
అక్కడికి చేరుకొన్న తరువాత, వారెదుర్కొన్నది యువరాజు పుణ్యరత్నుని కాదు. మంటపం మధ్యభాగంలో పద్మాసనం వేసి కూర్చొని, అరమోడ్పు కనులతో ధ్యానంలో మునిగి ఉన్న, సోమపురీ విహారానికి గురుపాదులైన ‘ ఆచార్య ఆనంద శ్రమణకులని’.
సనక మేనక లిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొన్నారు. అనంద శ్రమణుకులని వారెన్నడూ చూసి ఎరుగరు ! వారి దృష్టిలో అతనొక సామాన్య బౌద్ధభిక్షువు.
‘ ఈ భిక్షువు ఇక్కడెందుకున్నట్లు ? ఇతని ధ్యానం ఎప్పటికి ముగిస్తుంది ?’ అన్న సందేహం ఇద్దరిలోనూ ఒకేసారి పొటమరించింది.
భిక్షువుని ధ్యాన భంగం కలిగించే నిమిత్తం ఇద్దరూ అతని ముందు మోకరిల్లి, “ స్వామీ !” అని పిలిచారు.
ఆనందులు ఆకర్ణాంతములయిన కళ్లు తెరచి. “ఎవరమ్మా ! మీరు ?” అని అడిగారు.
“మే మొక లక్ష్యసిద్ధిని ఆశించి, పరీక్షార్థులమై ఇక్కడికి వచ్చి ఉన్నాము. స్వామీ ! విజయం కలగాలని ఆశీర్వదించండి,” సనక మేనకలు ఇద్దరూ అతనికి సాష్టాంగ పడ్డారు.
ఆనందులు వారి ముఖాల వంక ప్రసన్న దృక్కులతో చూసారు“ మీ లక్ష్యం నాకు అర్థమయింది తల్లీ ! ప్రేమ సామ్రాజ్యానికి పట్టమహిషులు కావాలని కదా మీ కోరిక ! విజయం తప్పక లభిస్తుంది. కాని మీరు తప్పుదారిలో పయనిస్తున్నారు తల్లీ!” అన్నారు గంభీరంగా. సనక మేనకలు విస్మయంతో ఆనందుల ముఖం వంక చూసి, చేష్టలుడిగి పోయారు. వారి చూపులలో ‘ఏం చేయాలి స్వామీ !’ అన్న ప్రశ్న గోచరించింది .
ఆనందులు వారి చూపులలో తన చూపులు నిలిపి, “ అసూర్యంపశ్యలు, అపురూప లావణ్యవతులు అనురాగవతులు అయిన మీరు,అహంకారి, మదోన్నత్తుడు అయిన ఒక ప్రభు సత్తమునికి మీ ప్రేమ సుమాన్ని అర్పింప బూనడం అవివేకం కాక మరేమిటి తల్లీ ! విలువైన బహుమతి అర్హత గలవారికే ఇవ్వాలమ్మా !” అని ప్రభోదించారు.
ఆనందుల చూపులు వారి అంతరాత్మలలో ఏం తుఫాను లేవదీసిందో ఏమో ! వారి చేతులు అప్రయత్నంగానే తమ తమ సజ్జలలోని పూలమాలలని బయటికి తీసాయి. వెనువెంటనే ఆనందుల తర్జని మంటపం లోని ‘తథాగతుల’ విగ్రహం వంక సూచించింది. అతని మేఘ గంభీర ధ్వని వారిద్దరినీ ఈ విధంగా ఆదేశించింది.
“ మీ ప్రేమ సుమాంజలి, ప్రేమ మూర్తులయిన ‘ బుద్ధ భగవానినికే’ లభించాలి తల్లీ ! అతని ప్రేమ వలెనే మీ ప్రేమ కూడ విశ్వవ్యాప్తం కావాలి. వెళ్లండి, వత్సలారా ! మీకు తప్పక విజయం లభిస్తుంది.” అంటూ అతను మంటపం విడిచి, విహారం వైపు దారి తీసారు.
సనక మేనకలు చాల సేపటి వరకు చేత పూలదండలతో, అలాగే నిల్చి పోయారు. వారి మనస్సులలో ఆలోచనా తరంగాలు, పెరిగి, విరిగి హృదయపుటంచులు తాకి నురగ పర్వతాలుగా రూపొంది చివరకి చెలియలి కట్టని చేరుకొన్నాయి..
క్రింద నుండి వారిని హెచ్చరిస్తున్నట్లుగా, బౌద్ధ బిక్షువుల ‘త్రిశరణాల’ గానం ఉఛ్ఛస్వరంతో వినబడింది.
“ బుద్ధం శరణం గచ్ఛామి,
ధర్మం శరణం గచ్ఛామి,
సంఘం శరణం గచ్ఛామి”
అభిసారికలిరువురిలోనూ చైతన్యం వచ్చింది. ఇద్దరి అడుగులూ సన్నని మంజీర ధ్వనులతో ఒకే దిక్కుగా పయనించాయి. విహారాన్ని దాటి, మంటపాన్ని దాటి, పర్వత శిఖరాన్ని దాటి, అనంత విశ్వంలోని ప్రేమ సామ్రాజ్యం లోకి-------------
అశ్వారూడుడై మంటపం వైపు, వారిద్దరి ప్రేమ పరీక్షార్థం వస్తున్న పుణ్యరత్నుడు, దూరం నుంఢే వారిద్దరూ చేత పూమాలలతో, పర్వత శిఖరాగ్రం నుండి, దూకడం చూసి, స్తబ్ధుడై పోయాడు.
*****************
సోమపురి మహావిహారం, నందన మంటపం, ధర్మ ప్రభువైన పుణ్య ప్రభుని కోట, శిథిలావస్థలో ఈ నాటికీ నిలిచి ఉన్నాయి !
విహారానికి చెరొక వైపు శతాబ్దాలుగా, త్రిశరణాలని త్రికారణాలతో నమ్మి, చరించే బౌద్ధభిక్షువుల పిపాశోపమనానికే కాబోలు, సజీవ ప్రేమ వాహినులైన రెండు జలధారలు, కొండ క్రిందికి దూకుతూ, ఈ నాటికీ ప్రవహిస్తున్నాయి.
ఆ ఇరు వాగులలో ఒక దాని పేరు, ‘ సనక’, రెండవ దాని పేరు‘ మేనక’ .
(ఈ కథ సెప్టెంబరు ౨౦౧౦ కౌముదిలో ప్రచురింపబడింది )
********************
**********************

Comments
Post a Comment