Skip to main content

నీల గ్రహ నిదానము 10

నీల గ్రహ నిదానము 10

రోహిణి ---దశరథా ! వికృతాకారుడు, భయంకరుడు అయిన గుళికుని నీవు మాటలతోనే మరల్చినావు. ఇది నీ విజయమునకు తొలి మెట్టు.!

దశరథ ----- తల్లీ ! ఆకారములు, చేష్టలు వికృతములయినంత మాత్రమున , మనో వ్యాపారములు వికృతములనుట పొరపాటు ! గుళికు డెంతటి భయంకరుడైనను న్యాయమును అభిలషించు వాడని, వెల్లడి అయినది కదా ! ఎందరో సుందరాకారులు కపట మానసు లగుట నేను ఎరుగుదును.

రోహిణి ----రాజా ! నీ మాటలలో శ్లేష ధ్వనించు చున్నది. నేను నా సవతులతో ప్రవర్తించిన విధము వికృతము, భయంకరము అందువా ?

దశరథ --- తల్లీ ! నా మాటల వెనుక నీ కట్టి యర్థము స్ఫరించిన యెడల నన్ను క్షమించుము. తల్లి తండ్రుల వర్తనమును విమర్శించు అధికారము తనయునకు లేదు ! ( దశరథుని మాటలు పూర్తవగానే, తెరపై నీలి రంగు వెలుగు పడుతుంది, స్టేజంతా నీలం అయిపోతుంది )

రోహిణి ---- దశరథా ! ఇదుగో శని తేజము ! శని వచ్చుచున్నాడు. సంసిద్ధుడవు కమ్ము !

దశరథ ---- ( చూసి ) అవును, శని దేవుడు ప్రవేశింప నున్నాడు. తల్లీ ! సామమున పని చక్కబెట్టు కొనుట ఎంతయు శ్రేయోదాయకము ! ఎదురు రాబోవు దివ్య పురుషునకు స్వాగతము చెప్పెదము ! ఏమందువు ?

రోహిణి ---- కుమారా ! నీ యెడల నాకు విశ్వాసము ఏర్పడినది ! నీవు చెప్పినట్లే చేసెదను.

దశరథుడు ---- తల్లీ ! త్వర పడుము !

( స్తోత్రము )

ఇద్దరూ ---- ఇంద్ర నీల ద్యుతి శూలీ, వరదో గృధ్ర వాహనః
బాణ బాణాసన , ధర్మ స్కర్త వ్యోర్కస్సుత సదా
ప్రణమ్య దేవ దేవేశం, సర్వ గ్రహ దోష నివారణం
శనైశ్వరస్చ శాంతస్య, చింతయామసి పార్థివః

( శని మంద మంద గతితో కుంటు కుంటూ ప్రవేశిస్తాడు.)

ఇద్దరూ ----- (నమస్కరించి ) స్వాగతం ! శనైశ్వరా !! సుస్వాగతం !!

శని ----- దశరథా ! నన్నెదిర్చి నిల్చుటకు వచ్చినవాడివి శరములకు బదులు నమస్కారములు సేయనేల ! ముందరి కాళ్లకు బంధములు వేయుటకా ?

దశరథ ----సూర్యపుత్రా ! నీ కాలికి బంధములు వేయుటకు గాని, నీ పై శర ప్రయోగము చేయుటకు గాని, నాకు సామర్యమెక్కడిది ? దేవాసురులను, నరులు, యక్ష, కిన్నెర , కింపురుషులు సిద్ధ, సాధ్య చారణులు, ఎవరైనను నీ చూపు పడినంత మాత్రమున భస్మమవుదురు ! నే నింకను నిలిచి యుంటినేని --

శని ----- నా తండ్రి యగు సూర్యుడు , నీ జన్మకొక మహత్తర ప్రయోజన మున్నదని తెలియ జేయుట వలన నీ వింకను నిలువ గల్గితివి.

( పద్యము )

చం- కలదొక కారణమ్ము నిను గాల్చక ప్రాణము నిల్పి యుంచ, నీ
వలననె నుద్భవంబగును ప్రాభవ శీలుఁడు, రామచంద్రుఁడున్
కలగదు క్షామ మెన్నటికి గ్రచ్చర రోహిణి పీడనంబుచే
తెలియుము సత్య మియ్యెదయె తేల్చి వచించితి రాజ సత్తమా !
తొలగుము దారి వీడుచును, తొయ్యలినియ్యెడ నుంచి పొమ్మికన్.!

రోహిణీ పీడనము వలన , దుర్భిక్షము సంభవించు ననునది అసత్యమని తెలుసుకొన్నావు కదా ! నాతో నీ వైరమున కిక కారణము లేదు. ఆమె నిచట విడిచి, నీవు మరలి పొమ్ము !

దశరథ --- శనిదేవా ! అసాధ్యడవు అజేయుడవు ! అయిన నీతో వైరము నా కేల ! నిల్చియే మాటలాడుచున్నావు, ఆ ఆసనము నలంకరించి మమ్ము కృతార్థులము చేయుము.

( పద్యము )

గీ నీ వజేయుండ వెందును నిక్కముగ
వైరమేటికి నీ తోడ వీర వర్య !
నిలిచి యుండుచు మాటలాడ నీ కదేల
కూరుచుండుము నియ్యెడ కూర్మితోడ !

శని ---- నన్ను పొమ్ము---పొమ్ము, అనువారే గాని , రమ్మని పిలిచి ఆసనము చూపించిన వాడవు, నీవే కన్పట్టినావు ! అయినను ఇది రోహిణి పాన్పు ! నీ వేమందువు రోహిణీ ! యీ అజకుమారుడు నన్ను నీ శయ్యపై కూర్చొనుమనుచున్నాడు ! నీకు సమ్మతమేనా ?

రోహిణి ---- శనైశ్వరా ! అతఢు అజకుమారుడే కాదు, నాకును కుమారుడే ! నీవు సంశయింపక ఆసీనుడువు కమ్ము !

శని ---- సరి సరి ! నీవు కూర్చొన మన్నావు గనుక, ఈ శయ్యపై. నీ శయ్యపై ( శయ్య అనే పదాన్ని వెరైటీ మాడ్యులేషన్ తో ) కూర్చొంటిని. ( కూర్చొంటాడు )

దశరథా ! --- నన్నీ రోహిణి శయ్యపై ఆసీనుని చేసి, నీ వివేకమును చూపించినావు ! ఇక నీవు పోవచ్చును

దశరథ ---- అనుజ్ఞ నిమ్ము యమాగ్రజా ! నాతో పాటు , నా తల్లిని కూడ తీసుకొని పోయెదను !

శని ----- దశరథా ! మరల నీవు మొదటికే వచ్చుచున్నావు ! రోహిణీ భేధనము చేసెదనని నేను ప్రజాపతికి మాట ఇచ్చితిని.

దశరథ -----శౌరీ ! రోహిణీ రక్షణము చేసెదనని నేను ప్రజలకు మాట ఇచ్చినాడను.

శని ---- నీవు నీ ప్రజల కిచ్చిన మాట, క్షామముతో ముడిపడినది ! ఇప్పుఢది జరుగదు గావున , నీ విచ్చిన మాట చెల్లినట్లే !

దశరథ ---- దేవా ! నీవు ప్రజాపతి కిచ్చిన మాట , అశ్విన్యాది తారకలతో చంద్రుని సామరస్యమునకు సంబంధించినది ! ఆ సామరస్యము జరగనున్నది గావున నీ మాట కూడ చెల్లినట్లే !

( రోహిణి -- ఆశ్చర్యంతో దశరథుని వంక చూస్తుంది )

శని ---- దశరథా ! నీవు నీ మాటల మాయాజాలమున నన్ను మభ్యపెట్టుచున్నావు. రోహిణికి, తక్కిన తారలతో సంధి కుదరనున్నదా ? రోహిణీ నీవు మాట్లాడవేమి ?

రోహిణి ---- కుమారా ! నీ మాట నాకును మాయాజాలము వలెనే కన్పట్థు చున్నది. మనమధ్య అట్టి సామరస్యమునకు చర్చ జరగనే లేదే ?

దశరథ ---- తల్లీ ! ఇది వరకు జరగని మాట నిజము ! ఇప్పుడు జరగ నున్నది ! రోజుకొక చుక్కతో , చంద్రుని సమాగమమే నేను నున్ను కోరెడి వరము ! తీర్చలేవా తల్లీ ??

( రోహిణి కొయ్యబారి పోతుంది )

శని ---- ( నవ్వుతూ ) రోహిణీ ! -- వింటివి కదా, యీతని దుస్సాహస పూరిత ప్రస్తావము ! ఈ రాజన్యుని ప్రజాహిత చింతకు, స్వార్థ త్యాగ నిరతికి నీవును , సౌమ్యుడును పెట్టిన అగ్ని పరీక్ష వంటిదే, అతడు నీకు పెట్టినాడు--- వరము నిత్తువా, లేక చత్తువా ?

( రోహిణి మాట్లాడదు )

దశరథ -----తల్లీ ! నీవు వరము నిచ్చినను, మానినను, నేను ఆడిన మాట తప్పను ! నా శరమును శని పైననే కాదు, రుద్రుని పై కూడ సంధించి నిన్ను కాపాఢెదను !

రోహిణి ---- దశరథా ! నీవు --నీవు నన్ను ధర్మ సంకటమున పడవైచినావు ! ఆలోచించుటకు నాకు సమయము కావలె !

శని ---- ఆలోచించుటకు వ్యవధిని, ఈ అజకుమారునికి మీరిచ్చినారా రోహిణీ ? చుక్కలతో సంధికి ఇచ్చగింతువా ? సంతోషము! లేకున్న సర్వనాశనము !! నీ మండలమున ఆశీనుడనైన నేను నిన్ను విడువను కాక విడువను !!!

దశరథ ---- తల్లీ ! వరము నిత్తువా ! లేక శరము నెత్తుమందువా ? త్వరగా సెలవీయుము !

రోహిణి --- ( జనాంతికముగా ) ఈశ్వరునికే చిత్త చాంచల్యము కలుగ జేయగల యీ శని , దశరథుని బుద్ధిని ఆకట్టుకొన్నాడు ! ప్రయత్నమంతయు బూడిదలో పోసిన పన్నీరయినది ! ( ప్రకాశముగా ) దశరథా ! సమయము ప్రతికూల మైనప్పుడు సంధి సామరస్యములు దక్క వేరు దిక్కేమున్నది !! నీవు కోరినట్లే నా నాథుని శయ్యను ,రోజుకొక సపత్నితో పంచుకొనుటకు సంసిద్ధిరాల నైతిని., నా శయ్యపై కూర్చొన్న యీ శనిని సత్వరము లేచి పొమ్మని చెప్పుము .

దశరథ ---- మాతా ! ధన్యడనయితిని ! నీ నిశ్చయము , నా విజయమునకు చివరి మెట్టయినను, శనిని లేపుట నా తరమా ? ప్రయత్నించి చూచెదను,
( శనితో ) రవి నందనా ! నీ వంటి సుందరాకారులు , శయనించ దగిన శయ్య కాదిది !! దేవదేవా ! లేచి రమ్ము !

శని --- ఏమన్నావు రాజా ! నేను సుందరాకారుడనా ? నా ముఖము కోతివలె వికృతము , శరీరము భల్లూకము వలె రోమ భూయిష్టము ! చర్మము అర్థ దగ్థమై మసిబారిన కలుషితము ! ఆసనమా, కర్కశ గృధ్ర తూలికా తల్పము ! దశరథా ! నా కీ హంస తూలికా తల్పము నచ్చినదయ్యా !

దశరథ ---- శనైశ్వరా ! జీవుల అహంకారమునకు నిన్ను చేరుట చేత నీవు కురూపు డయితివి గాని, నీ హృదయ సౌందర్యము చెప్ప నలవి కానిది గదా ! అది కోర్కెలకు అంక పీఠమగు పాన్పు శనిదేవా ! నీవు కూర్చొనుటకు తగినది కాదు !!

రోహిణి --- శనైశ్వరా ! నీవు నా శయ్యపై కూర్చొన్నంతనే , ‘నా శయ్యా సౌఖ్యము’,ఇరువది ఆరు రోజుల ఎడమైనది ! --ఇక విశ్రమించితివేని నేను సన్యాసము స్వీకరింపవలె ! నన్ననుగ్రహించి పాన్పు దిగి రమ్ము !

శని --- మీరెంత చెప్పినను , నే నీ శయ్యను వదలను----వదలను !

( శని శయ్యపై గెంతి వికృత చేష్టలు చేస్తాడు )

( రోహిణీ దశరథులు ఒకరి ముఖాలొకరు చూసుకొంటారు )

( శని స్తోత్రమునకు వచన రూపము )

దశరథ --- ఓ నల్లని శరీరము కలవాడా ! ఈశ్వరుని యొక్క కాంతి వంటి కాంతి కలవాడా ! శరీర మందంతటను , స్థూలమైన రోమములు గల యో శనైశ్వరా నీకు నమస్కారము !!

రోహిణి ---- ఇంద్ర నీల మాణిక్యము వలె నల్లనైన కంఠ ప్రదేశము కలవాడా ! ఎల్లప్పుడును ఆకలిచే పీడింపబడెడి వాడా ! ఎంత చేసినను తృప్తిలేని యో శనైశ్వరా నీకు నమస్కారము !!

దశరథ --- ప్రళయాగ్ని వలె భయంకరమైన స్వరూపము గలవాడా ! యముని వలె మిక్కిలి ఘోరమైన వాడా ! విశేషమైన కోప స్వభావము కలవాడా ! కాంతుల యొక్క సముదాయుడవైన యో శనైశ్వరా నీకు నమస్కారము !!

రోహిణి ---- సమస్తమును భక్షించువాడా ! కోతి యొక్క ముఖము కలవాడా ! యో శనైశ్వరా నీకు నమస్కారము !!

దశరథ -----దివ్యజ్ఞానము కలవాడా ! కశ్యప మహర్షి మనుమడా ! సంతోషించిన యెడల రాజ్యము లేని వారికి సైతము రాజ్యము నివ్వ గల సమర్థుడా ! కోపించిన యెడల రాజ్యములను సైతము హరించు వాడా ! యో శనైశ్వరా నీకు నమస్కారము !!

రోహిణి -----ఓ శనైశ్వరా ! దేవేంద్రాది దేవతులు, సప్త మహర్షులు , నక్షత్రములు , నీవు చూచినంత మాత్రమున స్థాన భ్రష్థులగుచున్నారు ! అట్టి యో శనైశ్వరా నీకు నమస్కారము !!

దశరథ -----ఓ శనైశ్వరా ! దేశములు, నగరములు , గ్రామములు, ద్వీపములు , నదులు , వృక్షములు, లతలు, నీచే చూడబడినంత మాత్రమున నశింపుచున్నవి ! అట్టి యో శనైశ్వరా నీకు నమస్కారము !!

రోహిణి ---- ఓ గ్రహ రాజా ! నన్ననుగ్రహించి నా గద్దె దిగుము.

దశరథ --- ఓ గ్రహేశ్వరా ! నన్ననుగ్రహించుము . నేను వరములను కోరుచున్నాను.

శని ------ (గద్దె దిగి ) రోహిణీ ! నీ గద్దె దిగడమే కాక, ఇంకెప్పుడును నిన్ను పీడింపనని వాగ్దానము చేయుచున్నాను ! ( దశరథునితో ) దశరథా ! నీ స్తోత్రము నాకు సంతోషము కలిగించినది.! నీకు ఎట్టి వరములు కావలయునో చెప్పుము.

దశరథ --- ఓ సూర్యపుత్రా ! ఇది మొదలు దేవాసురులకు గాని, మనష్యులకు గాని, పశు పక్షి మృగాదులకు గాని , పీడింపక పోవుటయే నాకు ఇష్టమైన వరము ! ఆ వరమును అనుగ్రహింపుము !!

శని ---- ఓ రాజా ! గ్రహములనగా పట్టుకొనునవి అర్థము ! అవి జీవుల కర్మ పరిపాకముల ననుసరించి, బాధలను కలుగ జేయుచుండును. కనుక నీవు కోరిన వరము నిచ్చుటకు వీలు కాదు---

ధశరథ ---- ( మోకరిల్లి ) శనైశ్వరా ! నేనడిగిన వరమిచ్చునంత వరకు నీ చరణములు వదలను ! కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమః సౌరిః శనైశ్వరో మందః పిప్పలాదేన సంస్తుతః

దేవా ! రవినందనా ! నన్ను అనుగ్రహింపుము !! అంత దనుక నీ నామములు స్మరించుట మానను !!

( ప్రవేశం బుధ నారదులు )

బుధ -నారదులు --- శనైశ్వరా ! అజ కుమారుని అభీష్టము మాకును ఇష్టము !!!

నీలాంజనాభం మిహిరేష్ట పుత్రం, గ్రహేశ్వరం
పాశ భుజంగ పాణిం ! సురా సురాణాం భయదం
ద్విబాహుం స్మరే శనిం మానస పంకేజహం !

శని ----ఓ దశరథ మహారాజా ! నీచే చేయబడిన యీ నా స్తోత్రమును , ఏ దేవాసుర మానవాదులు ప్రతిదినము , పఠించెదరో వారికి నా వలన ఎట్టి పీడయు కలుగదు. ( పద్యము )

సీ ఎవ్వారు నీ చేయు స్తవ రాజమ్ము
దీక్షతో పఠియింత్రు దిన దినమ్ము
నరులైన సురులైన నక్తంచరులయున
వారిని నే పట్టి బాధ పెట్ట
గోచారమందున, కుజుఁడష్ట మందున్న
యేల్నాటి శని నైన, యెట్టి దశల
జన్మ లగ్నంబందు చరమ సీమయందును
అంతర దశ నైన యన్ని దశల

గీ రవియు గురుఁడును కేతువు రాహువైన
శుక్రుఁడు బుధుడైన చివరకు సోముడైన
కుజుఁడు వీరలెవ్వరి చేతఁ కీధు గల్గ
రక్షణమ్మొనరింతు నే తక్షణమ్ము !!

బుధుడు --- అజకుమారా ! లెమ్ము. ! నీవు దన్య చరితుడవైతివి.! నీ వలన లోకులకు శని పీడా నివారణోపాయము తెలిసినది ! ( నారదునితో) దేవర్షీ ! ఇక నీ ఉపాయమును—సమస్త ప్రాణికోటికి తెలియ జేయవలె !

నారదుడు --- పతితులారా, భ్రష్టులారా !
బాధా సర్ప దష్టులారా !
సకల పీడా కష్ట హారము
సర్వ మంగళ శుభ ప్రదము
దశరథ కృత శని స్తవము
పఠన పాఠన మాచరించండి

బుధుడు ---- శని వాసర శుభ్ర వేళ
లోహ నిర్మిత శని ప్రతిమను
జమ్మి పూలతో పూజ చేయండి
కపిల ధేనువు దాన మీయండి.
వెతలు బాపే విధము తెలియండి !

( చంద్రుడు, దక్ష ప్రజాపతి , గుళికుడు, ప్రవేశిస్తారు )

( అందరూ నమస్కార భంగిమలోను, శని అభయ ముద్ర లోను స్టిల్ లో ఉండగా తెర వెనుక నుండి శని స్తోత్రం వినిపిస్తూ ఉండగా----- తెర )

(సమాప్తము )

Comments

  1. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

    - శి.రా.రావు
    శిరాకదంబం

    ReplyDelete
  2. ధన్యవాదాలండీ!మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.
    శ్రీధర్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ