Skip to main content

నీల గ్రహ నిదానము 6

నీల గ్రహ నిదానము 6

( అందరూ ఆ వార్త విని నివ్వెర పోతారు. దశరథుడు చెవులు మూసుకొంటాడు )

దశరథ ---- హరి హరీ ! ఎట్టి దుర్వార్త వినవలసి వచ్చినది !! మహాత్మా , మీరు చెప్పునది నిజమేనందురా ?

బుధుడు -- సందేహము వలదు రాజేంద్రా ! మానవులే కాదు, పశువులు, సర్పములు , లతలు ,వృక్షములు , మొదలగు తిర్యగ్ స్థావర సముదాయములు కూడ నశింప నున్నవి అదియే కాక---

దశరథ --- అమంగళము ప్రతిహతమగు గాక ! విప్రోత్తమా, మీరు చెప్పునది ఇంకేది మిగిలినను సత్వరము చెప్పివేయుడు. ఈ దశరథుడు గుండె రాయి చేసుకొని వినుటకు సంసిద్ధుడై యున్నాడు.

బుధుడు ---- అవశ్యము నృపుడా ! వినుము. గ్రామములు , నగరములు , దేశములు , ద్వీపములు----

సుమంత్ర ----- ఆగండి ! భూసురోత్తమా ! చిన్న సందేహము, నగర, మృగ , మానవ జాతి సముదాయముల నాశన కాండ ఎట్లు సంభవించ నున్నది ?

బుధుడు ----- భూ వలయము లోని, సప్త ద్వీపముల జలములు వాపీ కూప తటాకములు, నదీ నదములు ఇంకి పోవుట వలన.

అకంప --- మ--- మహాత్మా ! ఇదంతా ఒక్క రోజులోనే జరిగి పోతుందంటారా ?

బుధుడు ---- కాదు అకంపనా, పృథ్విపై పన్నెండేళ్ల క్షామము ఏర్పడి, క్రమ క్రమముగా జీవకోటి నశింప నున్నది.

అర్ణవ ---- స్వామీ ! మరి సరయూ నదిలోని నీరుకూడ ఇంకి పోతుందా !

బుధుడు ---- పిచ్చివాడా ! సరయులో నీరే కాదు , నీ శరీరము లోని ఉప్పుటేరులతో పాటు సముద్ర జలము;లు కూడ శుష్కించి పోనున్నవి.

సుమంత్ర ----- రాక్షస మాయ వలెననా ?

బుధుడు --- కాదు అమాత్యవర్యా ! గ్రహ చక్రవర్తి యైన శనైశ్వరుని పీడన వలన----

సుమంత్ర ---- ప్రాణి కోటిని అటుల పీడించుట వలన శనిగ్రహమునకు కలుగు లాభమేమి ?

బుధుడు ---- ఇచట లాభ నష్టముల ప్రసక్తి లేదు. మహమంత్రీ ! పరమేష్టి, గ్రహములకును ప్రాణి కోటికి నడుమ సున్నితమైన సంబంధమును ఏర్పరిచి యున్నాడు. గ్రహములు అనినంతనే , పట్టి పీడించునవి అని అర్థము. ఇప్పుడా శనైశ్వరుడు , ప్రజా రక్షణార్థము నిర్మింప బడిన , రోహిణీ నక్షత్ర మండలమును జీవుల ప్రారబ్థ కర్మ పరిపాకము వలన , భేదింప నున్నాడు. దుర్భరమైన ‘ద్వాదశ వర్ష క్షామము ,’త్వరలో , అతి త్వరలో రానున్నది.

దశరథ ----- సౌమ్యేంద్రా ! దీని నివారణోపాయ మేదైనను కలదా ?

బుధుడు ---- లేకేమి, రాజేంద్రా ! సావధాన చిత్తుడవై వినుము.

దశరథ --- అనుగ్రహింపచండి మహాత్మా !

సుమంత్ర ---- సెలవియ్యండి విప్రోత్తమా !

భటులు ---- చెప్పండి స్వామీ ! ఎలాటెలాంటి పూజలు చేయించాలో,ఏఏ గంగల్లో మునగాలో తెలియ జేయండి.

బుధుడు ---- గంగయందు కాదు వత్సలారా ! గోదావరి యందు మునగవలె !

దశరథ ---- స్వామీ ! పరిహాసము లేల ? సత్యమును సత్వరముగ చెప్పి వేయుడు.

బుధుడు ---- పరిహాసము కాదు రాజా ! పచ్చి నిజము ! సప్త గోదావరీ మధ్యస్థమైన క్షేత్రము తప్ప సమస్త భూమండలమునందును, కరువు కాటకములు సంప్రాప్తించనున్నవి ! కనుక

దశరథ --- ( ఆత్రుతతో ) మరి మార్గాతరము ?

బుధుడు ----- అయోధ్యను విడిచి పారిపోవుటయే దీనికి మార్గాంతరము !

దశరథ ---- నా ప్రజలు అయోధ్యను విదిలి పారిపోవుట నేను ఊహింపను కూడ చేయనొల్లను. సౌమ్యేంద్రా ! మరి ఏదైన మార్గము సెలవిండు.

సుమంత్ర -----దేశమంతటిని పీడించగల దుర్భిక్షము గోదావరీ ప్రాంతమును వదిలి వేయుటకు కారణము ?

బుధుడు ---- ఈ విషయము మీకు తెలియక పోవుట ఆశ్చర్యకరము. నూట ఇరవదేండ్ల క్రితము, శనీశ్వరుడు రోహిణీ శకటమును భేదించినపుడు , భూమి యందు క్షామము సంభవించెను. ఒక్క గౌతమ సిద్ధాశ్రమము నందలి అక్షయ తటాకములోని నీరు తప్ప తక్కిన జలములన్నియు శుష్కించి ప్రాణికోటి యంతయు, త్రాగు నీటి కొరకు త్రాహి త్రాహియని ఆర్తనాదములు చేసినది.

దశరథ ---- సౌమ్యేంద్రా ! ఇది మాకు తెలియని విషయము.గౌతమ మహర్షి త్రాగు నీటిని ఎటుల రప్పించెను ?

బుధుడు ---- అతని ఆశ్రమ మందలి అక్షయ తటాకము పరమేశ్వర వర ప్రసాదము గావున శుష్కించక పోవుట ఎరిగి తిరిగి తన తపస్సుచే శివుని మెప్పించి, సుర గంగను భువికి గోదావరి రూపమున రప్పించిన వాడాయెను. అతని చేత గోదావరిని రప్పించుటకు, ఆ సమయమున కూడ సప్తర్షులు కపట నాటకమును ఆడ వలసి వచ్చినది ! దానికేమి గాని, దశరథ రాజేంద్రా ! గోదావరీ జలములే నీకును నీ ప్రజలకును ఇక శరణ్యములు !

సుమంత్ర --- అబద్ధము, మోసము ! మహారాజా ! ఈ సౌమ్యుడు నిక్కముగా మోసగాడు, వేషగాడని నాకు తోచుచున్నది !! త్రికాల దర్శులు, బ్రహ్మర్షులు అయిన వశిష్టులవారు, రాజ్యము వదిలి కొన్ని దినములే కాదా అయినది ! ఇంతటి భయంకర కాలము సంభవింపు నెడల, ఆ మహాత్ముడీ విషయము మనకి ముందుగా నేల తెలుపడు !?

దశరథ --- అమాత్యా ! సతతము ప్రజాహితము కోరు వశిష్ట మహర్షి , ఈ విషయము మనకు చెప్పకుండ పోవుటకు కారణము, నాకును అగమ్య గోచరము !

బుధుడు ---( కోపంతో ) అకంపనా, అర్ణవ ష్ఠీవీ ! చూసితిరి కదా ఈ రాజామంత్యుల కపటము ! అరిష్ట చిహ్నముల అంతరార్థము తెలుసుకొనుటకు వీరు కనబరిచిన ఆరాటము, ఏమయినదయ్యా , చెప్పిన పిమ్మట చక్కని తరుణోపాయము !! రాచ నగరును వదిలి రాలేని వీరి దౌర్బల్యము కానేల మన యందరి దౌర్భాగ్యము !!! భటులారా , త్వరపడి నాతో రండు. ప్రజల మధ్యకు వెడలి మనమీ వార్తను వారికి అందించ వలెను.---

అర్ణవ ---- స్వామీ ! ఈ అకంపనుని మాటేమో గాని నేను మాత్రము అయోధ్య విడిచి రాను.

బుధుడు ---- పిచ్చివాడా ! సముద్రములనే శుష్కింపజేయు దుర్భిక్షము , నీ శరీరమందలి చెమటను కూడ ఇగిర్చి వేయునని కాబోలు నీ ఆశ ! అంతేనా ?

అర్ణవ ---- అది నా ఆశ మాత్రమే కాదు మహాత్మా ! నా జీవితాశయము

బుధుడు ---- మంత్ర తంత్ర పారమ్యుడగు యీ సౌమ్ముడు , నీ శరీర బాధను నిముషములో పోగొట్ట నున్నాడు. ఇలా దగ్గరకి రా ! చిరంజీవీ ! ( అర్ణవుని శరీరాన్ని స్పృశించి ) ఈ క్షణము నందే నీ దేహావస్థ అంతమొందినది, పోయి పరీక్షించి రమ్ము.

( అర్ణవ ష్ఠీవి వెళ్లి పోతాడు )

అకంప ---- స్వామీ ! నేను కూడ మీ శిష్యుడ నగుటకు సంసిద్ధుడనే కాని ----

బుధుడు ---- నీ భార్య లకుమను, చూపులకు తిలోత్తమను గుణములకు ,సర్వోత్తమను చేయగలను రమ్ము అకంపనా, నీ గృహమునకు దారి చూపుము.

అకంప --- ( మోకరిల్లి ) ఎంత తియ్యని వార్త చెప్పినారు గురుదేవా ! అకంపనుడు ఈ క్షణము నుండియే మీ శిష్యుడను !

అర్ణవ ---- ( ప్రవేశించి ) గురుదేవా ! మీ మాట యదార్థము ! పుట్టిన ఇన్నాళ్లకు నా మూత్రము పురీష మాత్రమగుట చూచి, నా కనులను నేనే నమ్మలేక పోయాను.--- అకంపనుడితో పాటు నేను కూడ మీ శిష్య పరమాణువును, ఆశీర్వదించండి ( మోకరిల్లుతాడు )

బుధుడు ----భళిరా, భళి ! శిష్యులారా, లెండు. అయోధ్యా పుర ప్రజలను రానున్న దుర్భిక్షము నుండి తప్పించుటకు, నేను చేయబోవు ప్రయత్నమునకు సహకారులు కండు, రండు.

(ఊహించని యీ పరిణామానికి రాజు, మంత్రి నివ్వెర పోతారు. )

దశరథ --- ( తెప్పరిల్లి ) వలదు, వలదు భటులారా ! మీరితని వెంట పడవలదు. దుర్భిక్షమేర్పడుట నిజమగునెడల, దాని నుండి అయోధ్యనే కాదు, నా రాజ్యమందలి సమస్త ప్రజానీకమును , నేను కాపాడెదను ! నా శాసనమున ప్రజలు , అన్నోదకములకు బాధ పడుట నేను సహింప జాలను.

సుమంత్ర ---- విమల యశస్కుడైన యీ రాజన్యుని చల్లని ఏలుబడిలో ప్రజలు, అన్నోదకములకు కరువు గాంచుటయా !! అట్టి దురవస్థ రానే రాకూడదు గాని , వచ్చిన యెడల , యీ దశరథుని ధన ధాన్య భండాగారములు, ప్రజల ముంగిట కాగలవు గదా, మంగళ ద్వారములు !! అకంపనా!, అర్ణవా !మీరీ సౌమ్యుని మాయాజాలమున పడనేల !? ఈతడు ఉత్త మోసగాడు !

అర్ణవ --- మహామంత్రీ ! మీ సందేహము నిజము కావచ్చును, కాకపోవ్చును ! ఏళ్ల తరబడి నన్నేలిన నా శరీర దురవస్థ , యీతని దయవలన, కడతేరుట మాత్రము నిక్కము ! నా కింత మేలు చేసిన సౌమ్య మహాశయులను సేవింపని నా జన్మము వ్యర్థము.

అకంప ---- అర్ణవుని అనుగ్రహించినట్లే, ఈ గురువరేణ్యులు నన్ను కూడ కరుణించ నున్నారు ! నా భార్య ‘లకుమ’ (ఆనందంతో ) రూపమున తిలోత్తమ గుణమున సర్వోత్తమ కాగలదట !! ఆహా ఏమి నా భాగ్యము !! సేవలు చేసిన ఇట్టి ఉత్తములకే కదా సేయవలె !

బుధుడు ----- సుమంత్రా ! ‘ప్రాణ విత్త మాన భంగము లందు, బొంకినను అఘము చెందరని’మా గురువైన శుక్రాచార్యుల నీతి ! నేను చేయునది మోసమో, లేక దోషమో , ప్రజా హితార్థమై గదా ! అట్టి నా చర్య మీకు కంటకము కానేల ! మీ మాటలు నిక్కమని నమ్ముటకు వీరు మూర్ఖులు కారు---శిష్యులారా ! రండు ---

అకంప ------ (రాజామాత్యులకు మోకరిల్లి ) మహారాజా! మీకు నా ప్రణామములు

అర్ణవ ---- మహామంత్రీ ! మీకు నా ప్రణామములు.

అకంప --- ఈ క్షణము నుండి సౌమ్యగురుదేవుని చరణములే మాకు నెలవులు.

అర్ణవ ---- ఇచ్చివెయ్యండి, మాకీ రాచకొలువు నుండి మాకిక సెలవులు. (లేస్తాడు)

అకంప ---- (లేచి ) గురువర్యా ! రండు--- అయోధ్యాపురికి, దారి ఇటు --- ఇటు---

( భటులు ముందుండి దారి చూపగా బుధుడు వారితో పాటు వెళ్లిపోతాడు )

సుమంత్ర ----మహాప్రభూ ! వృక్షమున్నంత దనుక లతలు నిరాశ్రయలు కావు ! సౌమ్యుని మాటలు నమ్ముటకు , అయోధ్య ప్రజలు ఈ భటులంత మూర్ఖులు కారు. మీ సెలవైన నే నీతని ఆట కట్థించ గలను.

దశరథ ---- ఏమంటివి ఏమంటివి, ఏమంటివి !!! సుమంత్రా వృక్షమున్నంత దనుక లతలు నిరాశ్రయలు కావనియా ! లెస్స పలికితివి అమాత్యా !! నా రాజ్యమందలి ప్రజా లతలు, ఈ దశరథ భూరుహ ముండునంత వరకు , నిరాశ్రయులు కారు---కాబోరు ----నేనటుల కానివ్వను !! మా వంశ మూల పురుషుడైన సూర్యుదేవుని ఉపాసన చేసి, ఈ సౌమ్యుని మాటల యందలి నిజా నిజములు తెలుసు కొనెదను గాక !

సుమంత్ర ---- సూర్యోపాసన మీరు ఏకాంతమునందే చేయవలెనా ప్రభూ ?

దశరథ --- సుమంత్రా ! నీ ప్రజా హిత బుద్ధి, ప్రభు భక్తి మాకు అవగతమయినది. రమ్ము , ఇచ్చోటనే ఇప్పుడే సూర్యదేవుని ఆరాధించెదము గాక !

( ఇద్దరూ ప్రార్థనా భంగిమలో కూర్చొంటారు )

దశరథ ---- సుమంత్రా, నీవు నా వెనుకనే మంత్రోచ్ఛారణ చేయుము. ఓం జపా కుసుమ సంకాశం—

సుమంత్ర ------ ఓం జపా కుసుమ సంకాశం---

దశరథ --- కాశ్యపేయం మహాద్యుతిం---

సుమంత్ర --- కాశ్యపేయం మహాద్యుతిం---

దశరథ ---- తమోరిం సర్వపాపఘ్నం----

సుమంత్ర ----తమోరిం సర్వపాపఘ్నం---

దశరథ ---- ప్రణతోస్మి దివాకరం ----

సుమంత్ర --- ప్రణతోస్మి దివాకరం---

( స్టేజి అంధకారం అయిపోతుంది, స్తోత్రం వినిపిస్తూనే ఉంటుంది. వాళ్లిద్దరి పైన ఒక స్పాట్ పడుతుంది )

(మరో స్పాట్ వెలుగులో --- రోహిణి కనబడుతుంది )

రోహిణి ---- ధశరథ రాజేంద్రా !

( దశరథుడు సుమంత్రుడు , ఆమె వైపు ఆశ్చర్యంతో చూస్తారు )

రోహిణి --- దశరథ రాజేంద్రా ! నేనే రోహిణిని ! ప్రొద్దు పొడిచేందుకు ఇంకను చాల సమయమున్నది, గనుక సూర్యదేవుని దర్శనము కష్ట సాధ్యము కాగలదని, సత్యము పలుకుటకు నేనే వచ్చితిని.

దశరథ ---- మాతా ! మీకివే నా నమస్సలు !

రోహిణి ---- రాజేంద్రా ! శనైశ్వరుడు శకటాకార రూపమున నున్న నా నక్షత్ర మండలమును పీడింప బూనుట నిక్కము . తొల్లి ద్వాదశ వర్ష క్షామము ఆ నక్షత్ర భేదన సమయమునే జరిగినదని సౌమ్యుడు చెప్పినది కూడ నిజమే !

దశరథ ---- తల్లీ ! ఈ దుర్భిక్షమును నివారించుటకు ఉపాయము లేనే లేదా ?

రోహిణి ---- కుమారా ! శని మార్గావరోధము ఒకానొక ఉపాయము. ----

ధశరథ ---- అర్థమయినది తల్లీ ! నీ మండలమునకు వచ్చి శనిదేవుని మార్గావరోధము చేసెదను --

రోహిణి ---- దశరథ రాజేంద్రా ! నీకు సుస్వాగతము

( ద్వితీయాంకము ప్రథమ దృశ్యము సమాప్తము )

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద