Skip to main content

నీల గ్రహ నిదానము 9

నీల గ్రహ నిదానము 9

( చంద్ర _ రోహిణులిద్దరూ చెరొక ప్రక్క నిలబడగా దశరథుడు మధ్యన నిలబడుతాధు, అందరూ కలిసి )

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమ ప్రభం
కుమారం శక్తి హస్తంచ, ‘ మంగళం’ ప్రణమామ్యహం.

( రంగ స్థలం మీద లైట్లు ఆరి, తిరిగి వెలుగుతాయి. కుజ గ్రహ చ్ఛాయ కనిపిస్తుంది. )

మంగళుడు ---- రోహిణీ చంద్రులారా ! మీరు కోరిన మేరకు అజవాహనుడ నైన నేను ఈ అజకుమారుని ధనస్సును విద్యుచ్ఛక్తి పూరితము చేయుచున్నాడను.

( డైలాగు పూర్తి కాగానే, దశరథుని ధనస్సును ఒక మెరుపు లాంటి కాంతి వచ్చి తాకుతుంది )

మంగళుడు --- శశాంకా ! ‘ శని’ , తన పాశముచేత --- ఈ దశరథుని ధనస్సుతో పాటు బంధింప వేయగల సమర్థుడు. అసుర గురుడైన శుక్రాచార్యుని కవచము సాధించి, ఈ రాజన్యుని శని పాశ బంధము నుండి రక్షించుము

( కుజ గ్రహం నీడ మాయమవుతుంది. రంగ స్థలం పైన చిన్న స్పాట్ వెలుగులో, ముగ్గురూ శుక్రగ్రహ స్తోత్రం చేస్తూ కనిపిస్తారు )

హిమ కుంద మృణాలాభం, దైత్యనాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్త్రారం , భార్గవం ప్రణమామ్యహం

( తెర వెనుక శుక్ర గ్రహం నీడ కనిపిస్తుంది )

శుక్రుడు ---- రోహిణీ మృగాంకులారా ! ఒండొరుల నెడబాసి ఉండలేని మీ ప్రేమను అడ్డం పెట్టుకొని, దేవర్షి నారదుడు, అమేయ బుద్ధిబల సంపన్నుడైన బుధునితో కలసి, శని పీడా నివారణోపాయమును కనుగొనుటకు వేసిన ఎత్తుగడ నాకు అర్థ మయినది.! పథకము ఏదైనను ఫలితము మాత్రము, దేవ ,మానవులకే గాక ,రాక్షసులకు కూడ ప్రయోజనకరము గావున నే నీ దశరథునకు నా రక్షా కవచమును ఇచ్చుచున్నాను. ఇది ఒకే ఒక పర్యాయము ఇతనికి ఉపకరింప గలదు.

( స్టేజి మీద స్పాట్ లైటు మందంగా వెలుగుతుంది. ఒక రక్షాబంధం ‘ రాఖీ ‘ లాంటిది పై నుంచి క్రిందన పడుతుంది. రోహిణి దానిని తీసుకొని దశరథుని చేతికి కడుతుంది. )

శుక్రుడు ---- దశరథా ! శని చేతి భుజంగాస్త్రము , అతని పాశము కన్న భీషణమైనది. కాలసర్ప శిరః శరీరములైన ‘ రాహు __ కేతువులే’ దాని నుండి నిన్ను తప్పింప గలవారు. వారి అనుగ్రహమును పొంది, అజేయుడవు కమ్ము ! --- నీకు జయమగు గాక !

( నీడ జారిపోయి, తిరిగి రంగస్థలం మీద లైట్లు వెలుగుతాయి )

చంద్రుడు --- విన్నావు కదా ! దశరథా ! దైత్య గ్రహములగు , వారి యనుగ్రహము నీకు కలదో లేక వలదో నీవే నిర్ణయించు కొనుము. నేను వారి ముఖ దర్శనము కూడ చేయ నిచ్చగింపను. ఇప్పటికే చాల కాలాతీత మయినది .ఇక సెలవా మరి !

దశరథ ---- తండ్రీ ! నా కార్యము జయప్రద మగునట్లు నన్ను ఆశీర్వదింపనిదే మిమ్ములను వెళ్లనివ్వను.

చంద్రుడు --- ప్రాణ సఖిని, పరుల రక్షణయందుంచి పారిపోవుచున్న నా వంటి వాని ఆశీస్సులు నీ కేల నయ్యా ? నన్ను పోనిమ్ము--

దశరథ ---- తండ్రీ ! మీరిట్లనుట సమంజసము కాదు. పుత్రుడు కార్యము నెరవేర్చుట తండ్రికి తలవంపు లెట్లగును ? కనుక మరి యే విధమైన ఆలోచనలు చేయక నన్ను దీవింపుడు !

చంద్రుడు --( గద్గదిక కంఠంతో ) కుమారా ! దశరథా ! ఏమి సౌజన్య మూర్తివయా నీవు ! బుధ ,నారదులు గ్రహము కాని గ్రహాంతర వాసివైన, నిన్ను ఎందులకీ పనికి పురికొల్పి తెచ్చినారో నాకు ఇప్పుడు అర్థమయినది ! దశరథా ! సావథాన చిత్తడవై వినుము ! శనైశ్వరుడు చరాచర ప్రాణికోటి యందలి అహంకార చిత్త వృత్తులను క్రమక్రమముగా నాశనము చేసి వారిని జన్మ జన్మాంతరములందు ఆముష్మిక పథము వైపు నడిపించుటకే నియమింప బడిన వాడు--- బల ,అతిబల, మహాబలాది అహంకార చిహ్నములగు ఎట్టి శస్త్రాస్త్రముల కైనను అతడు అసాధ్యుడు శిరము వంచి అంతర్ దృష్టితో చూచు వారలకే గాని, తల లెత్తి చూచువారలకు అతడు కనబడడు . తెలిసినదా కుమారా ! వ్యర్థములైన శస్త్రములను నమ్ముకొనక , సడలని ఆత్మ విశ్వాసము తౌడను, నీ స్వకీయమైన సౌజన్యాస్త్రము తోడను నీ పనిని సాధించుము. నీకివే నా శుభాశీస్సులు !-

దీవించి వెళ్లిపోతాడు )

రోహిణి --- దశరథ రాజేంద్రా ! నీవు ‘రాహు_కేతువులను’ప్రార్థింప దలచితివా ?

దశరథ ---- తల్లీ ! లక్ష్యము పవిత్రమైనప్పుడు, కార్య సాధనకు ఉచితానుచితములు పాటింప కుండుటయే రాజనీతి ! నాకు ఆ మహానుభావుల ఆశీస్సులు కూడ అభిలషణీయమే !!

రోహిణి ----- అట్లైన నేను వెడలి మరల వచ్చెదను. నా నాథుడు చూడ నిచ్చగింపని ఆ అసురలను నేను కూడ చూడజాలను ! ( వెళ్లి పోతుంది )

( దశరథుడు వినమ్రుడై రాహు _ కేతువులను ప్రార్థిస్తాడు. )

అర్థ కాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం

పలాశ పుష్ప సంకాశం , తారకా గ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం , తం కేతుం ప్రణమామ్యహం

( రంగ స్థలం క్రమంగా చీకటయి తెరలో వికటాట్టహాసం వినిపిస్తుంది. తెర వెనుక లైట్లు వెలిగి , పాము శరీరము మానవ శిరస్సు గలిగిన రాహువు ఒకవైపు ,పాము పడగ క్రింద మానవ శరీరము గల కేతువు మరొక వైపు కనిపిస్తారు )

రాహు కేతువులు -- రాజా ! దశరథా ! రాక్షసులకు కూడ ఉపయోగింపగల పని చేపట్టిన నీకు మా ఆశీస్సులు. శని చేతి భుజంగాస్త్రము నీ పట్ల నిరర్థకమగును గాక !

( వికటాట్ట హాసం చేసి అదృశ్యమవుతారు )

( స్టేజి పైన తిరిగి లైట్లు వెలుగుతాయి. దశరథుడు తన ధనస్సు నందుకొని, లేచి నిలబడి నలు ప్రక్కల కలయ జూస్తాడు. తరువాత కుడివింగు వరకు వెళ్లి, వెనుకకి వచ్చి, బాణాన్ని ఆకర్ణాంతము సంధించి నిల్చొంటాడు )

( ప్రవేశం బుధ నారదులు )

బుధుడు ---- ( వస్తూనే ) ఆగుమాగుము దశరథ రాజేంద్రా ! నీ శర ప్రయోగము ,ఎవరి పైన ! శనీశ్వరుని పైన కాదు గదా ?

నారదుడు ---- అజకుమారా ! నీ అస్త్ర ప్రయోగము శనిపైననా ?

దశరథ ---- ( ఇద్దరికీ నమస్కరించి ) బుధ నారదులారా ! నా ప్రణామములు స్వీకరింపుడు ! నా శస్త్రము శనైశ్వరునిపై ప్రయోగించుట కొరకే కదా, మీరు నన్ను తెప్పించినది !

బుధుడు ----- రాజా ! నీకీ విషయమెట్లు తెలిసినది ?

దశరథుడు --- సౌమ్యేంద్రా ! నన్ను రోహిణి మండలమునకు చేర్చుటకు మీరు తెప్పించిన, చంద్రుని ‘హరిణ రథమును’నడుపు హరిణములే నాకీ విషయము , మార్గ మధ్యమందే తెలియ జేసినవి.

నారదుడు --- ఓహో ! ఇప్పుడు అర్థమయినది ! నీవు ‘ఋశ్యశృంగ మహర్షి ’కడ మృగ భాషను నేర్చిన వాడవు కదా !! అటులైన ఆ హరిణములు నీకు కథ యంతయు కరతలా మలకము చేసెనందువా ?

దశరథ ---- అవును దేవర్షీ ! ద్వాదశ వర్ష క్షామము ఉత్త కల్పన మాత్రమే ననియు, రోహిణీ రక్షణమను నేపథ్యమున మీరిరువురును కలిసి, ప్రాణి కోటికి ‘శని పీడా నివారణము’చేయు ఉపాయము కొరకు నన్నింత దూరము తెచ్చినారని తెల్సినది ! పూజ్యులైన శుక్రాచార్యుల మాటల వలన ఆ విషయము ధృవ పడినది కూడ !

బుధుడు ---అటులైన మా పని సులువయినది ! నీకీ నిజమును తెలియ జేయుటకే మే మిటుల వచ్చితిమి.

నారదుడు ----- అజకుమారా ! క్షామ మేర్పడు వార్త అసత్యమని తెలిసిన వెనుక, నీవు మరలి పోక, శనిని ఎదిర్చి నిల్చుటకే నిల్చితి వేల ?

దశరథ --- మహర్షీ ! మీ అభీష్టమునకు వ్యతిరేకముగ నే నెట్లు నడువగల వాడను ? శని పీడ నుండి లోకులను రక్షించుట కూడ , ప్రజా హిత కార్యమే కదా ?

నారదుడు ----లెస్స పలికితివి దశరథా ! బుధుని బుద్ధి కుశలత , నిన్ను ఎంపిక చేయుట యందే వెల్లడియైనది కుమారా ! శనైశ్వరుని గురించి నీ కంతయు తెల్సినది కదా ?

దశరథ -- మునీంద్రా ! అంతయు తెలిసినది గాని బాంధ్యవ్య బంధితుడు కానివాడు, కన్నీటికి కరుగని వాడు అయున శనైశ్వరుడు తారకల కంటినీరు చూచి వారికి ఆశ్రయ మిచ్చెనేల ?

నారదుడు ----- దశరథా ! ఈ విషయమున , శనిదేవుని ఆంతర్యము నాకును సందేహాస్పదమే ! బుధా ! నీవేమైన తెల్పగలవా ?

బుధుడు ----శనైశ్వరుని ఆంతర్యము, రోహిణీ భేదనము కాక, రోహిణీ హృదయ బేదనము అయి ఉండవచ్చునని నాకు తోచుచున్నది.--- అయినను శని వచ్చు వేళ సమీపించినది కదా ! --- మనలో మనకే గ్రుద్దులాట లేల ?

నారదుడు -----అవునవును సౌమ్యా ! శని వచ్చు వేళ అయినది కాబోలు, రోహిణి తడబడు నడకలతో ఇటు వైపే వచ్చుచున్నది.----రమ్ము ! మన మిచ్చోటనుండి సత్వరము తప్పించుకొని పోవలె !

బుధుడు --- అజకుమారా ! నీకు అభీష్ట సిద్ధి కలుగు గాక ! మేము వరల వచ్చెదము సెలవా మరి !

నారదుడు ----- తథాస్తు !

( బుధ నారదులు నిష్క్రమిస్తారు )

( ప్రవేశం --- రోహిణి )

రోహిణి ---- దశరథా ! శనైశ్వరుడు కృత్తిక కక్ష్యను వదలి నా కక్ష్యలో ప్రవేశింప నున్నాడు. అతను వచ్చు జాడ నీకేమైన తెలిసినదా ?

దశరథ ----- ఇంకను స్పష్టము కాలేదు.

రోహిణి ----- ( వింగు వరకు వెళ్లి చూసి వస్తుంది ) గండు చీమల బారు వంటి చలన గతి కలిగిన శని కదలికలు, ఇంత త్వరితముగా స్పష్టమవవు ! (దశరథుని దగ్గరగా వచ్చి, ప్రేమతో ) కుమారా ! నీవు కుశలమే కదా ? ఏదైనను తినుటకు, త్రాగుటకు ఇచ్చగింతువా ?

( రోహిణి మాట పూర్తి కాగానే, నేపథ్యంలో భయంకరమైన సంగీతం వినిపిస్తుంది . లైట్లు ఆరి డిమ్ అవుతాయి. )

(ఒక పాశము పై నుంచి, దశరథుని మీదుగా, అతని కాళ్ల వరకు జారి, తిరిగి మీదకి వెళ్లిపోతుంది )

( తరువాత ఒక పాము దశరథుని మీద పధి, క్రింద పడిపోతుంది )

రోహిణి --- దశరథా ! శని నీపై యుద్ధము ప్రకటించినట్లున్నది. సంసిద్ధుడవు కావేమి ?

దశరథ --- తల్లీ ! శత్రువు ఎంత బలవంతుడైనను, హెచ్చరిక లేకుండ ,శర ప్రయోగము చేయుట యుద్ధనీతి కాదు. ధర్మ మూర్తియైన యమునకు అన్నయగు శనైశ్వరుడు, యుద్ధనీతి తప్పునని నేను నమ్మను

రోహిణి --- అదేమి రాజా ! మరి యీ పాశ భుజంగాస్త్ర ప్రయోగము !!

( తెరలో వికటాట్టహాసం వినిపిస్తుంది. ఆ వెనుక శనికి ముఖ్య సఖుడగు గుళికుని కంఠ స్వరం వినిపిస్తుంది )

గుళికుడు --- ( తెరలోంచి ) ఓసీ ! మత్త కాశినీ ! రోహిణీ ! నిన్ను పిలుస్తున్నాడీ శని ! చాటు మాటుల నుండి బయటికి రావే కులపాంశనీ !!

రోహిణి ----- ( భయంతో ) అజకుమారా ! శరణు శరణు ! అధుగో శని !----

దశరథ --- ఏ మాత్రం చలించకుండా, తల్లీ ! ఇతడు శనైశ్వరుడు కాడు ! ఎవరో మాయావి ! నీవు భీతిల్లకుము నేనీ మాయావిని నిముషములో పట్టి తెచ్చెదను . ( అని తన వస్త్రము నుంచి ఒక నూలుపోగు తీస్తాడు. దాన్ని గురు మంత్రంతో అభిమంత్రిస్తాడు )

గురు బ్రహ్మా , గురుర్వష్ణు, గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః

ఓరీ మాయావీ ! నీకు ఋషికుల మంతటికీ పూజ్యుడైన మా కులగురువు వశిష్ట మహర్షి ఆన ! నీవు మాయా రూపమును విడిచి వత్తువా ? లేక ఈ నూలు పోగుతో బంధించి సప్త సముద్రముల కావల పడవైతు మందువా ?

( ప్రవేశం విక్రృతాకారుడైన గుళికుడు; )

గుళికుడు ---- ఏమేమి ? నన్ను బంధించి సప్త సముద్రముల కావల పడవైతువా ? క్షుద్ర మానవుడా ! నీ కెంత ధైర్యము ?

రోహిణి ----- దశరథా ! ఇతఢు శనైశ్వరుడు కాదు. నీ వన్నట్లు ఎవరో మాయావి !

గుళికుడు ----- రోహిణీ ! నిన్ను పట్టి బంధించుటకు, శనైశ్వరుడు దిగి రావలెనా ? దురహంకారిణీ ! శనికి ఇష్ట సఖుడగు యీ గుళికుడు చాలడా ? షష్ప సమానములగు యీ మానవుని శస్త్రములా, నిన్ను కాపాడునవి ?

దశరథ ---- గుళికేశ్వరా ! అల్పుడు , అథముడు అయిన మానవునుపై , అధర్మ యుద్ధము చేయబూనిన నీవు ఎంతటి వాడవో, వేరుగా చేప్పవలయునా ?

( రోహిణిని పట్టుకొని పాన్పు దగ్గరకు తీసుకెళ్లి, కూరచో పెడతాడు )

దశరథ ---- రోహిణీ మాత ! నా శరణాగత ! --- శనికి సఖులయిన, మీ ఆజ్ఞ లేవియైనను మాకు శిరో ధార్యములే ! అయినను , అవి భయాతురిత అయిన ఆమెతో గాక, నాకు సెలవిచ్చుట ధర్మమని నా విన్నపము !

గుళికుడు ---- ఏమేమి ! రోహిణీ మాత ( వ్యంగ్యంగా ) నీ శరణాగతయా ? నీ వామె దూతవా ? సరి, సరి ! నీ తోనే మాటలాడెదము గాక ! ఓరీ ! దూతాథమా ! విను, దేవ దేవేశుడు గ్రహ చక్రవర్తి యగు శనైశ్వరుడు ఈమెపై కినుక వహించి , పాశమున బంధించి తెమ్మని, నన్నంపినాడు. శని కార్యమునకు అడ్డు తగిలిన నీవును, ఆ మహత్తర పాశ బంధితుడవు కాగలవు ! శని పాశ బంధన యనిన ఎట్టి బృహత్తర దండనయో నీకు తెలియునా ?

దశరథ ---- ఎందులకు తెలియదు ? శని పాశము , అతని తమ్ముడైన యము పాశముల సంగతి తెలియని మానవులెవ్వరు ? ఆ పాశద్వయము , మీ వంటి భృత్యులకు బృహత్తర మగునేమో గాని , మా మనుజులకు వాటి బలము బాగుగనే తెలియును. అవి మానవ ప్రాణ తంత్రులచే చేయబడినవే కదా మరి ?---

గుళికుడు ---- ఏమంటివి ? శని పాశము మనిషి ప్రేగులతో నిర్మింప బడినదా ?

దశరథ ---- కాదందువా, గుళికేశ్వరా ! కొండలను సైతము పిండి చేయగల ఇంద్రుని వజ్రాయుధము , మనుజుని వెన్నెముక ! పదునాలుగు భువనము లందును ఎదురులేని విధాత , బ్రహ్మశిరోనామకాస్త్రము మానవ కపాలము ! అరి ధంశనమైన శ్రీహారి సుదర్శనము , మనిషి బొంగరపు కీలు ! నరుని నెన్నెదురుపై నుండు మూడు నరముల శల్యమూలము, తిరుగులేని రుద్రుని త్రిశూలము ! వేయేల ! అష్ట దిక్పాలకుల, ఆయుధము లన్నియు మానవాస్థికలే కదా ?

గుళికుడు ---- ఓహో ! అదియా నీ వాదన ! మహా తపస్సంపన్ను డయిన , దథీచి మహర్షి కంకాళమే సురుల అస్త్రాగారమన్నమాట నిజమయినను, దథీచి మానవుడయినంత మాత్రమైన మీరందరును గొప్ప వారగుదురా ?

దశరథ --- సుర శబ్ద వాచ్యము చేత సురులందరును పూజనీయులేనా ? --- మహోన్నతులైన మహితాత్ములు, సురా సుర, మానవ_తిర్యగ్ స్థావరములయందు లేరా ? బలి ప్రహ్లాదులు రాక్షసుల యందును, -- దథీచి, గౌతమ, భగీరధ, రఘు, దిలీపులు మానవుల యందును, మేరు హిమ, వింద్యాచలములు , పారిజాత, కల్పవృక్షములు స్థావరముల యందును, సురభి, నందినులు ధేనువులయందును, శేష వాసుకులు పన్నగముల యందును శ్రేష్టులు కారా ? జాత్యుపజాతులు, వర్జ విశేషములు అన్నియు పరమాత్మ లీలా సంకల్పము లయినప్పుడు , ఒకరి ఎక్కువ, ఇంకొకరి తక్కువ ఎక్కడ నున్నవి ?

గుళికుడు ----బాగు, బాగు, దశరథా ! నీ వాదన బాగుగనే యున్నది ! నీ చూపును చంద్రుడు, ధనస్సును కుజుడు, బుద్ధిని బుధుడు, శరీరమును శుక్రుడు, మహా భుజంగ గరళ నిగళ మగుట నుండి, రాహు,కేతువులు , కాపాడు చుండుట బట్టి, ప్రగల్భములు పలుకు చున్నావు ! ఇందు నీ గొప్పతన మేమున్నది ?

దశరథ --- అత్యంత బలహీనుడు కూడ , గొప్పవారి ఆశ్రయ లాభము పొంది అద్భుతములు చేయగలడు. దూది పింజల వంటి మేఘములు, వరుణుని ఆశ్రయము చేత , జలధరములై మెరుపులను ఉరుములను సృష్టించుట లేదా ?

గుళికుడు --- నీవు యుద్ధము చేయుమాట ఎటులున్నను పండితులతో వాగ్వాదములు మాత్రము చేయగలవు. ఈ వాదనలకు నా కంత వ్యవధి లేదు. రోహిణిని నాకు అప్పగించి పొమ్ము !

దశరథ ----మన్నింపుధు మహానుభావా ! రోహిణీ నక్షత్రము ప్రజాహితము కొరకు నిర్మింపబడినది, శని ,రోహిణీ మండలముల తాకిడికి , భూమి యందు పన్నెండేళ్ల దుర్భిక్షము సంభవించి ప్రజలు పెక్కు ఇక్కట్ల పాలగుదురు ! గనుక రోహిణిని విడుచుట జరగని పని !

గుళికుడు -----రాజా ! ప్రజా రక్షణ నీ కెట్టి కర్తవ్యమో, ప్రజా పీడన శని కట్టి కర్తవ్యము ! రోహిణీ పీడనము వలన, భూలోకమున క్షామము సంభవించు నెడల, అది అతనికి సమ్మతమే యగును.

దశరథ --- అయన భువి యందలి జీవులకు మరి తరుణోపాయమే లేదా ?

గుళికుడు --- శనికి సమ్మతమైనచో లేనట్లే !

దశరథ ----అహంకార మర్దనుడు, పరిశుద్ధుడు అయిన శనిదేవుడు, ఇట్టి పాప కృత్యము తలపెట్టుట తగునా ?

గుళికుడు --- శనికి కార్యముతోనే గాని, కారణములు ఫలితములతో సంబంధము లేదు. పాపఫుణ్యములు అతనిని అంటవు. నీతి న్యాయములు అత నెరుగడు !

దశరథ ---- మీ సఖుడు, కన్నీటికి కూడ కరుగడా ?

గుళికుడు --( ఫకాలున నవ్వి ) ఏమంటివి ? కన్నీరా ? శనికి, యమునకు, మృత్య దేవతకు అవి పన్నీటితో సమానము.

దశరథ --- గుళికేశ్వరా ! అయిన నా నిర్ణయము కూడ వినుము నన్ను చంపిన నాడే , మీరు రోహిణిని తాక గలరు.

గుళుకుడు --- రాజా ! నీవకాల మృత్యువును ఆహ్వానించు చున్నావు!

దశరథ ----మీ కెందులకా చింత గుళికేశ్వరా ?! మీకు కార్యముతోనే గాని, కార్యముతో సంబంధము లేదు గదా ?

గుళికుడు --- అవును, కాని నిన్ను చంపుటకు నిమిత్తము కావలె ! అది యముని పని !

దశరథ ---- రోహిణీ పీడనమునకు అట్టి కారణము కలదా గుళికేశ్వరా ?

గుళికుడు ---- ఈ మత్తకాశిని మాత్సర్య గుణముతో, సవతులకు పతీ వియోగము కల్గించినది.

దశరథ ---- అయిన నేమయినది గుళికేశ్వరా ! ఈమె పరపీడన యందు పరోక్షముగా మీకు సహాయమే చేసినది తన రెండు కనుల నుంచి కారు కన్నీరు మీకు పన్నీటి జల్లు కాజాలదని ఎంచి, తన సవతు లందరి చేత ఏడ్పించినది ! శిక్షించుట తప్ప రక్షించుట మీ కర్తవ్యము కానప్పుడు, తక్కిన చుక్కలను సమర్థించుటేల ?

గుళికుడు --- ( అప్రభితుడయి ) దశరథా ! నీ వాదన యుక్తి యుక్తముగనే యున్నది ! శనిదేవుడు తన కర్తవ్య నిర్వహణలో తప్పటడుగు వేసెనేల ! సరి ! ఈ విషయము శని కెరిగించి ,రోహిణీ భేధన కార్యము స్వయముగా నిర్వర్తించుకోమని చెప్పెదను గాక !

( వెళ్పిపోతాడు )

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ