Skip to main content

రత్నగర్భ యీ వసుంధర 1

రత్నగర్భ యీ వసుంధర 1

స్వస్తిశ్రీ చాంద్రమాన వికృతి నామ సంవత్సర , కార్తీక , బహుళ పంచమి , పునర్వసూ నక్షత్ర యుత, శుక్రవారం (రోమన్ కేలండరు ప్రకారం తేదీ ౨౬.౧౧.౨౦౧౦) నాటి రాత్రి .

గొల్లకావిడి పడమర వాలిపోయింది. సప్తర్షి మండలం ఇంచు మించుగా, మధ్యభాగానికి వచ్చేసింది.పూర్ణ ( బహుళ పంచమి) చంద్రుడు జేగీయ మానంగా చల్లని కిరణాల్ని వెదజల్లు తున్నాడు. ఆకాశం నిర్మలమైన నక్షత్ర కాంతులతో చూడ ముచ్చటగా ఉంది.

పెద్ద మర్రిచెట్టు , దాని ప్రక్కగా ఆంజనేయుడి గుడి, గుళ్లో దీపం గుడ్డిగా వెలుగుతూ, అప్పుడప్పుడు భగ్గుమని లేస్తోంది, కాసేపట్లో ఆరి పోవడానికి కాబోలు ! చెట్టు చుట్టూ వలయా కారంగా వెడల్పైన అరుగు నున్నని గచ్చుతో మెరుస్తోంది.

గుడి ప్రక్కనే పెద్ద చెరువుంది. నాలుగు ప్రక్కల నుంచి, దాన్లోకి పావంచాలు ఉన్నాయి. నాచు కూడా విస్తారంగా పాకి ఉంది,

’పార్వతి’ మంచినీటి బిందెతో నలు ప్రక్కలా బిక్కు బిక్కు మని చూస్తూ , చెరువు దగ్గరకి వచ్చింది. తోడు తెచ్చుకొన్న ’నందిని’ ఆమె వెనకనే అర్థనిమీలిత నేత్రాలతో తాపీగా నెమరు వేసుకొంటూ, గంగడోలు ఊపుకొంటూ నడిచి వస్తోంది.

” నువ్విక్కడే ఉండు తల్లీ ! పావంచాల మీద నాచు ఎక్కువగా ఉంది, జారి పడతావు. నేను గభాలున వెళ్లి బిందె ముంచుకొని వస్తాను,” అంటూ మెట్లు దిగ సాగింది పార్వతి.

నందిని ’అంబా’ అంటూ అరిచింది.

”ఏమిటే నా మాటలు నాకే అప్పచెప్తున్నావు ! నేను జాగ్రత్తగానే దిగుతున్నాను, నువ్వలా అరిచి గోల పెట్టకు, ఎవెరైనా వచ్చేస్తారు.” అని నందినితో చెప్పి, భయం భయంగా నలువైపులా చూసి, ఎవరూ లేరని నిశ్చయించుకొన్నాక, బిందె ముంచబోతూ ఆగిపోయింది పార్వతి.

నీట్లో గుండ్రటి అలలు, మధ్యలో ఎక్కడో మొదలై క్రమంగా పెద్దవవుతూ, గట్లకి రాసుకొని విరిగి పోతున్నాయి. ’ఇంత మాటు మణిగిన వేళ నీట్లో ఈ అలజడి దేనికి?’ సందేహంలో పడింది పార్వతి. “ఆ! ఏ మర్రి పిందో పడి ఉంటుందిలే’ అనుకుంటూ , మళ్లీ బిందెని ముంచింది. ’ బుడుంగు బుడుంగు’ మంటూ నిండుకొంటున్న ఆ బిందెని శబ్ధవేధిలా వచ్చి తాకిందొక రాయి. పార్వతి గాభరాతో బిందెనలాగే విడిచిపెట్టి, రాయి వచ్చిన దిశ చూసింది. మర్రిచెట్టు కొమ్మలకి తాళ్ల ఉయ్యాల కట్టి, దాంట్లో కొలువు తీరి ఉన్నాడో మనిషి.

” నీ జిమ్మడ! ఎంత హడలు కొట్టేసావు ! నువ్వింతకీ మనిషివా జడలమర్రి మీద దెయ్యానివా ?”

పార్వతి ప్రశ్నకి జవాబు వచ్చేలోగానే, నందిని ’అంబా’ అంటూ అరిచి, మర్రి క్రిందికి చేరి మెడచాచి ఉయ్యాల నదుకోవాలనే విఫల ప్రయత్నం చేసింది. ఉయ్యాల అందక పోయే సరికి ఉక్రోషంతో చెట్టుకున్న అరుగు చుట్టూ, ఎక్కడానికి అనువైన చోటుకోసం కాబోలు, తిరిగి తిరిగి చూస్తోంది నందిని.

తనని అందుకోవాలని ఆ ఆవు వెసిన రంకె, చేస్తున్న ప్రయత్నం హడలెత్తించాయి కాబోలు ఆ మనిషికి , ”ఏమిటీ ! మీ ఆవుకి చెట్లు ఎక్కడం కూడా వచ్చా ?” అంటూ ఉయ్యాల లోంచి , లేచి కూర్చొన్నాడతను.

సరిగా అదే సమయానికి , ఆ ఉయ్యాల సందుల్లోంచి ఒక ఫైలు జారిపడి, బుసలు కొడుతూ తిరుగుతున్న నందిని కంట పడింది. అంతే ! నందిని దాన్లోని కాగితాలని నోట కరచింది

”అయ్యో , నా కాగితాలు !” అంటూ ఊడ పట్టుకొని జర్రున జారాడతను. నందిని కాగితాలతో సహా పరుగు పెట్టింది.

”ఇదుగో, అమ్మాయ్ ! నీకు దండం పెట్తాను, నా ఫైలు నాకు ఇప్పించు,” ఆవు వెంట పరుగు తీసాడు అతను,” అయ్యో నా కాగితాలు,” అంటూ.

” నీకు దండం పెట్తాను”, అంటూ అతనన్న ఒక్క మాటకే కరిగి పోయిన పార్వతి,”నందినీ ! ఆ కాగితాలు ఇచ్చెయ్యి తల్లీ !” అంటూ గబ గబా మెట్లెక్కింది.

నందిని ఎవరి మాటలూ వినిపించుకోలేదు. ఆంజనేయుని గుడి చుట్టూ, ఆ స్వామి పూనినట్లే గిరికీలు కొట్ట సాగింది. దాని వెంట పడ్డ అతను, కాలికి ఏం తగిలిందో ఏమో, ఒకసారి మొదలు నరికిన మానులా పడిపోయాడు.క్రింద పడుతూనే ఏదో నిస్సత్తువ భయము ఆవహించగా
,మైకం కమ్మి, స్పృహ కోల్పోయాడు.

” అయ్యయ్యో , ఎంత పని అయిపోయింది !” అంటూ అతని దగ్గరకి చేరింది పార్వతి. ‘’ఏంటబ్బా! ఎందుకలా పడిపోయావ్ ! దెబ్బలేవీ తగల్లేదు కదా”, అంటూ అతని నుదుటి మీద చెయ్యి వేసిన పార్వతి వెంటనే చెయ్యి లాక్కుంది. అప్పుడు కనిపించిందామెకి , పసుపు పచ్చగా మారిన చొక్కా కాలరు, బట్టలు సైతం పసుపు రంగులోకి మారి పోయిన ఆ మనిషి రోగం ఏమిటో , ఎందుకలా ఉన్నపాటున కూలిపోయాడో, పార్వతికి చప్పున అర్థమయింది.

’ఇప్పుడలా ఉన్నపాటున పక్క మీద చేర్చి,నెల రోజుల పాటు వైద్యం చేయిస్తేనే గాని, కుదుట పడలేడీ మనిషి .ఎవరో , ఎక్కడివాడో, వైద్యం సంగతి సరే సరి ! ఇంటికెలా తీసుకు వెళ్తుంది?’ పార్వతికి తన నిస్సహాయ పరిస్థితి మీద కోపం.,జాలి,ఏడుపు ముప్పిరిగొన్నాయి.

’ఒకప్పుడు ఈ ఊర్లో మకుటం లేని మహారాణిలా తిరిగింది. ఇప్పుడదే ఊరికి మహమ్మారి, గోమారి (గోవుల్ని చంపేది) అయింది. తలుపు తట్టి పిలుస్తే, సాయం చేసే వారెవరూ లేరు. మంచి నీటి కోసం అర్థరాత్రి బయలు దేరాల్సి వస్తోంది. తాను దూర కంత లేదు, మెడకో డోలు అన్నట్లు, ఈ కామెర్ల రోగి ఒకడు, ఏం చెయ్యాలి !’

నందిని నెమ్మదిగా వచ్చి, పార్వతి ప్రక్కనే నిల్చొంది. తన కోపాన్ని దాని మీద చూపెట్టింది ఆమె. ”చూడవే రాక్షసీ ! ఎంత పని చేసావో ! నువ్వా కాగితాలు తినేస్తావేమోనన్న కంగారులో, ఇలా పడి పోయాడితను.”

నందిని తన తప్పేమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. పార్వతి అంత కోపంలోనూ నవ్వు ఆపుకోలేక పోయింది. ”చేసిందంతా చేసి, ఏమీ తెలియదంటావేమే !” అంటూ.నందిని అదేమీ పట్టించు కోలేదు. తెలివి తప్పిపోయిన ఆ మనిషి వంక చూసింది. నెమ్మదిగా ఆ ప్రక్కనే చోటు చేసుకొని పడుకొని. కన్న బిడ్డని ఆదరించినట్లు, తన నాలుకతో అతని ముఖాన్ని నాకడం మొదలు పెట్టింది.

నందిని చర్యకి పార్వతి ముందు గాభరా పడింది. తరువాత ఆ చర్యలోని ఆంతర్యం తెలిసి గర్వించింది నందిని అతనికి తెలివి తెప్పించే ప్రయత్నం చేస్తోంది ! తల్లిలా తనని ఆదరించే ఈ గోమాత వెంట ఉండగా ఇంగిత జ్ఞానం లేని పశువుల్లాంటి ఊరి పెద్దలు తనని వెలి వేస్తే మాత్రం ఏం ?’

పార్వతి కొండంత తృప్తితో నందిని ముఖం వంక, అతని ముఖం వంక, చూడ సాగింది.అతని ముఖం లేత పసుపు రంగులో దిగి పాలిపోయి,పీక్కుపోయి ఉన్నా, చక్కగానే ఉంది! మనిషి బాగా ఎత్తు, ఎత్తుకి తగ్గ లావు, అందగాడే ! వయస్సు కూడా రమారమి తనంతే ! కాక పోతే మరి కాస్త ఎక్కువ ఉండవచ్చు ! పార్వతి తన ఆలోచనకి తనే సిగ్గు పడింది. అలా సిగ్గు పడ్డ ఆ అపరంజి బొమ్మని చూసి, చందమామ కూడా సిగ్గు పడ్డాడు కాబోలు, మబ్బు చాటున తప్పుకొన్నాడు.

అతడు తన కళ్లు తెరిచాడు కళ్లు విప్పగానే కనపడ్డ గరుకైన వెడల్పాటి నాలుక, ఆ నాలిక తాలూకు ముఖం చూసి గాభరాతో లేచి కూర్చొన్నాడు.

”మరేం భయం లేదు, మీకు తెలివి తప్పి పోతే, నందిని మీ ముఖాన్ని నాకి ----”

”ఏమిటీ ! ఈ గొడ్డు నా ముఖాన్ని నాకిందా ? ఛీ ! ” చీదరించుకొన్నా డతను.

”అవున్లెండి, ఛీ కొట్టక ఏం చేస్తారు ! పుట్టెడు రోగానికి ,నిస్సత్తువ తోడయి, అర్థరాత్రి ,ఊరి చివర తెలివి తప్పి పడిపోయిన మిమ్మల్ని,తల్లిలా ఆదరించి తెలివి తెప్పించింది అది ! అలా మీ మానాన మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతే , ఏ ఎలుగుబంటో వచ్చి చప్పరించి ఉంటే తెలిసి వచ్చేది”---

”బాబోయ్ ! ఎలుగుబంటే !”—

”అవును,” లోలోపల గొంతులోని నవ్వుని బిగపెట్ట్టింది పార్వతి. ”ఇక్కడ వాటికేమీ కొదవ లేదు.అని. ”పదవే పోదాం నందినీ ! అయ్యగారికి తెలివి వచ్చింది కదా, తన దారి తనే చూసుకొంటార్లే !” అంటూ నందినిని తట్టి లేపింది పార్వతి.

నందిని లేచి నిలబడింది. అతనా అమ్మాయి వంక, ఆవు వంక, క్షణం సేపు చూసాడు. అమ్మాయిని ఇది వరకే చూసాడతను ! చేత బిందె పట్టుకొని, వయ్యారంగా చెరువు గట్టు కేసి, నడిచి వస్తున్నప్పుడు, తెల్లని చీర కట్టుకొని, ఉంగరాల జుట్టు వెనక్కి దువ్వి, చిన్న ముడి పెట్టి, ఆ ముడిలో నాగమల్లి పూలు పరిసరాల్ని పరిమళ భరితంగా చేస్తుండగా ! ఆమె సామాన్య స్త్రీలాగ కనిపించ లేదు. కార్తిక పున్నమి నాటి చందమామ నుండి అయిదు రోజుల క్రిందటే దిగి వచ్చి పంచవన్నెల, స్త్రీ మూర్తిగా, మూర్తీభవించిన చంద్రికలాగ కన్నుల పండువుగా కనిపించింది. బిందెని నీట ముంచుతూ.! మనసులో చిలిపి ఊహ మెదిలి, బిందెని రాయితో కొట్టాడు, కాని ఆమెతో వచ్చిన ఈ బాడీ గార్డు ఇంత పని చేస్తుందని అనుకోలేదు.అతని చూపులు తిరిగి ఆవు వంక నిలిచాయి.

తెల్లని ఒంగోలు జాతి సుదర్శనమైన ఆవు అది ! దాని కళ్లల్లో వెన్నెల పడి, పరావర్తనం చెంది, వైడూర్య కాంతులీనుతున్నాయి ! ’తను తెలివి తప్పి పడిపోతే అది తన ముఖాన్ని నాకి సేద తీర్చిందట, ఎంత విచిత్రం ! తన నలాగే వదిలేసి ఉంటే ఏ ఎలుగుబంటో వచ్చి,--- ”అమ్మ బాబోయ్ !” మళ్ళీ మరోసారి ఆమె మాటల్ని మననం చేసుకొంటే కంగారు పుట్టింది, అతనికి. ఒంట్లో నిస్సత్తువగా ఉన్నమాట నిజమే ! భోజనం చేసి అప్పుడే రెండు పూటలు దాటిపోయాయి గనుక ! కాని ’పుట్టెడు రొగం’ అంటుందేమిటి ! ఏమిటా రోగం--- అతను ఆలోచనల నుండి తేరుకొని, వాళ్ల వంక చూసాడు. అమ్మాయి , ఆవు ఆ సరికే చెరువు గట్టు చేరుకొన్నారు. బహుశా నీల్ల బిందె కోసం గాబోలు !

పార్వతి గట్టుమీదే నిలబడి అసహాయంగా చెరువు కేసి చూసింది. ఆమె వదిలేసిన బిందె చెరువు మధ్యకి చేరుకొంది అప్పటికే ! అన్ని గట్లూ వెలి వేసినట్లు చెరువు నీట్లో మధ్యగా నిల్చిన ఆ బిందె తన జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చింది. ’బిందె పోతే వచ్చిన నశ్టమేమీ లేదు, కాని తెల్లారగానే , అది తన రాకని అందరికీ చాటి చెప్తుంది. మళ్లీ ఏ గాలి దుమారం తెస్తుందో ఏమో ! వీర్రాజు పెదనాన్న అసలే పిచ్చి మనిషి, అందులోనూ పున్నమి దగ్గర ! ఇప్పుడేం చెయ్యాలి ?’

చెరువులో దబ్బుమని రాయి పడ్డ చఫ్ఫూడికి ఆమె తెప్పరిల్లింది. అతను చెరువు మధ్యలో రాళ్లు విసురుతూ, బిందెని ఒక గట్టుకి చేర్చాలని చూస్తున్నాడు.చెరువులో అలలు లేచి ఖాళీ బిందెని పడవలాగ ఒక గట్టు వైపుకి నెట్టుతున్నాయి. మరికొంత సేపటికి బిందె గట్టు చేరుకొంది. అతను గభాలున వెళ్లి, ఆ బిందెని నీల్లతో ముంచి తెచ్చి, ఆమెకిచ్చాడు. ఆ కాస్త బరువుని పావంచాలు దాటించి తీసుకు వచ్చే సరికే అలసటతో రొప్పసాగాడు.

అతని చేతుల్లోంచి బిందెని అందుకొంటూ అంది పార్వతి,” మీకు ఒంట్లో బొత్తిగా బాగు లేదు, చూసారా ఇంత చిన్న పనికి ఎలా అలసి పోయారో ?”

”నిజమే ,కాని నాకున్న ఆ రోగం ఏమిటి ?”

” అయ్యో, మీకు తెలియనే తెలియదా ? మీకు పచ్చ కామెర్ల రోగం వచ్చింది. పూర్తి పథ్య పానీయాలు, పడక పాటిస్తే గాని తగ్గదు.”

*******

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ