Skip to main content

శిథిలాలయ దేవత 2

శిథిలాలయ దేవత 2

చరిత్రకారుడు – చూసారా మిలిటరీ వాళ్ల కాలు కమాండ్ మీదే కదులుతుంది ! మీకు నాకు కూడ ఈ ప్రయాణంలో ఎంతో మసాలా లభించింది. ఈ శిథిలాలయం వెనుక చోళరాజు, ఆనంద శ్రమణకులు, బుడతకీచు దొర !! అబ్బ ! ఎంత చరిత్ర దాగి ఉంది !!

రచయిత --- ఆపవయ్యా నీ సొద ! మనం ఇక్కడ నుండి బయట పడి ఇల్లు చేరినప్పుడు కదా అదంతా !! ముందు ఆ విషయం ఆలోచించాలి.

చరిత్రకారుడు --- అవును, అందుకు నాకు ఒకటే ఉపాయం కనిపిస్తోంది.

రచయిత --- ఏమిటది ?

చరిత్రకారుడు --- అద్భుత శక్తి వంతురాలైన ఈ దేవతే మనని ఇంటికి చేర్చాలి ! రండి, ఇద్దరం కలిసి ఆమెని ప్రార్థన చేద్దాం !

రచయిత --- దేవత పేరు, రూపం వగైరా తెలుస్తే ప్రార్థన సులువవుతుంది. మీరు చరిత్రకారులు కదా, ఈ చుట్టు పట్ల రాళ్ల మీద ఆమె వివరాలు దొరుకుతాయేమో చూడరాదూ !

చరిత్రకారుడు --- గుడ్ అయిడియా కవిగారూ ! ఇప్పుడే అన్వేషిస్తాను. ( కొంత సేపు వెతికాక ) కవిగారూ ! ఒక శిలా శాసనం మీద ఈ వివరాలు దొరికాయి. చదువుతాను వినండి.—ఈ మృగేంద్ర వాహనా దేవి ఆలయము , మహారాజ పరమేశ్వర వాకాటి కులాంభోధి చంద్ర, వాతాపి రాజ్య రమా రమణులైన శ్రీశ్రీశ్రీ తిమిర ప్రభువు చేత నిర్మింప బడినది. వ్యాపార నిమిత్తం, ‘జాఫ్నా’ నుండి, కొబ్బరి బొండాలు రాజధానికి చేరవేసే పడవలు సుడిగుండం పాలవడం చూసి, ఏడూగురు స్థపతులతో ఆలోచించి, శ్రీ తిమిర ప్రభువు ఈ ఆలయాన్ని నిర్మించి మృగేంద్ర వాహనా దేవిని యంత్ర, మంత్ర నిబధ్ధం చెసి, ఇందు ప్రతిష్ట చేసితిరి. బీజాక్షర చక్ర బంధితయైన ఈ దేవి, నౌకలు సుడిగుండం పాలవకుండా , సుడిలో చిక్కుకొని పోయిన నౌకలను తీర్ ప్రదేశానికి ఆకర్షించే శక్తి కలిగి ఉంది.--- డేష్, డేష్--- ఆ పైన విరిగి పోయింది.

రచయిత --- ఇంకేమీ వ్రాసి లేదా ?

చరిత్రకారుడు – లేదు.

రచయిత --- చాలు, ఉన్నంతలో మనకి కావలసిన సమాచారం దొరికింది ! చూసారా ! తంత్రఙ్ఞులు ఒక విశేష అయస్కాంతం లాంటి శిలని ఆలయంలో నిలిపి, దానిని కంట్రోల్ చేసేందుకు మృగేంద్ర వాహనని ప్రతిష్టించారు

చరిత్రకారుడు --- కోణార్క్ సూర్య దేవాలయంలో కూడా అలాంటిదే విశేషమైన అయస్కాంతం ఉండేదని చెప్పేవారు. ఇంతకీ ఈ దేవతకి మనల్ని ఇంటికి చేరవేసే శక్తి లేదంటారా ?

రచయిత ---- లేదు, ఆమె కేవలం సుడిగుండంలో, ఓడలను పడవేయడం గాని , పడ్డవాటిని తీరానికి ఆకర్షించడం గాని, తుఫాను లేని సమయంలో పడవల్ని సుడి వైపుకి రాకుండా చేయ గలగడం గాని, --- ఇదే చేయగలదు..

చరిత్రకారుడు --- దేవత శక్తి సామర్థ్యాలని గురించి మనలో మనకి తర్కం దేనికి ?ఆ సంగతి ఆమెనే అడిగి తెలుసుకోవచ్చు. ఆమె పేరు వివరాలు తెలిసి కదా, ఏదైనా ప్రార్థనా గీతం అల్లండి. హేతువాది అనడం

రచయిత --- ప్రార్థనా గీతాలకి ఇలాంటి శక్తులు పలుకవు పలుక నేరవు.

చరిత్రకారుడు ---- మరెలా పలుకనేరుస్తాయి ?

రచయిత ---- శిలా శాసనం చదివారు కదా ? ఈ దేవత ‘ బీజాక్షర చక్ర బంధిత !’ ఆ బీజాక్షరాలు ఏవో తెలుసుకొని వాటిని జపిస్తేనే గాని, ఈమెని మాట్లాడించడం కుదరదు.

చరిత్రకారుడు --- చిన్న సందేహం కవిగారూ ! హేతువాదం మాట్లాడే మీకు, ఈ తాంత్రిక ప్రక్రియల పట్ల , నమ్మకం ఎలా ఏర్పడింది ?

రచయిత --- ఖురాను మాట్లాడిన ప్రతీవాడూ,తురక వాడు కానట్లే, హేతువాదం మాట్లాడినంత మాత్రాన, హేతువాది అనడం శుధ్ధ తప్పు ! ఈ దెయ్యాలనేవి తృప్తి చెందని ఆత్మ లని నేను నమ్ముతాను.ఇంత వరకు మనకి కనిపించిన దెయ్యాలలో, ‘ రాజు, బుడత కీచు దొర ’ తామేదో పాప కార్యం చేసామని అందుకే శిక్షపడిందని, దానికి నిష్కృతి లేదనే భయంతో, అనుమానంతో దెయ్యాలయ్యారు.బిక్షుకా భయం లేక పోయినా తనెక్కడ పొరపాటు చేసాడో తెలియనందు వల్ల దెయ్యమయ్యాడు ! వీళ్లందరి సమస్య తృప్తి చెందక పోవడం లోనే ఉంది.

చరిత్రకారుడు --- కవి గారూ ! ఒక తృప్తి చెందని , శరీరం లేని ఆత్మ , బ్రతికి ఉన్న మనలాంటి జీవాత్మలతో తలపడి, ఎలా పీడింప గలవు ?

రచయిత --- అవి మనుషులని పీడించడం, వాటి ఆత్మ శాంతికి మార్గం తెలుసుకోవడం కోసం ! ఎందుకంటే మనిషే వాటికి ముక్తిని ఇవ్వగలడు గనుక !

చరిత్రకారుడు --- అంటే ఈ దెయ్యాలు మానావాటిత శక్తులు కావంటారా ?

రచయిత --- ఎంత మాత్రం కావు . ఆధునిక మానవుడు తను చెయ్యలేని పనిని యంత్రాల ద్వారా ఎలా చేయించ గలుగు తున్నాడో, ప్రాచీన కాలం లోని మనిషి, ఈ దెయ్యాలని వశ పరచుకొని, అలాంటి పనులు చేయించుకొన్నాడు. అంతెందుకు, ఈ శిథిలాలయ దేవత విషయమే తీసుకోండి. గుండంలో పడి పోతున్న కొబ్బరి బొండాల ఓడల్ని, ఒడ్డు చేర్చే నిమిత్తం,ఈ ద్వీపంలో ఆమె స్థాపించ బడిందా లేదా ?

చరిత్రకారుడు ---- మైగాడ్ ! అంటే ఈ దేవత కూడా ----

రచయిత --- ఒకానొక దెయ్యం ! ముందు ఆమెని పిలిచే ప్రయత్నం చెయ్యండి.

చరిత్రకారుడు ----ఏం చెయ్యమంటారు ?

రచయిత --- ఆమెని పిలిచే ప్రక్రియ కూడా, ఈ ఆలయం లోనే ఎక్కడో ఒకచోట వ్రాసి ఉండాలి ! మీరు బయట పడి ఉన్న రాళ్ల గుట్టలో కాక, ఆలయ స్తంభాల లాంటి ప్రదేశాలలో, మంత్రాక్షరాలేవైనా అభిస్తాయేమో చూడండి.

చరిత్రకారుడు --- కవిగారూ , మీది సరి అయిన ఆలోచన ! ఇదుగో ఇప్పుడే అన్వేషిస్తాను. (అంటూ ఆలయ స్తంభాలని దీక్షగా పరిశీలిస్తాడు )
కవిగారూ ! నాలుగు స్తంభాల మీద దొరికిన సమాచారం ఇది---

మొదటి దాని మీద—‘ ఓం నమో నమః” అని ఉంది.

రెండవ దాని మీద --- ‘ మృగేంద్ర వాహన ’ అని,

మూడవ దాని మీద --- ‘ హ్రీం భగవతే’ అని ----

నాలుగవ దాని మీద --- ‘ క్లీం దేవతాయై’ అని ఉన్నాయి..వాటిని ఎలా సెట్ చేయాలో మీరే ఆలోచించండి.

రచయిత --- ‘ ఓం , హ్రీం, క్లీం, నమో భగవతే మృగేంద్ర వాహన దేవతాయై నమః ’ – మంత్రం వచ్చినట్లే ఉంది కదూ ?

చరిత్రకారుడు --- వచ్చినట్లే ఏమిటండి, వచ్చేసింది, రండి జపం చేద్దాం.

(ఇద్దరూ మంత్ర జపం చేస్తారు )

ఇద్దరూ --- ‘ ఓం హ్రీం, క్లీం, నమో భగవతే మృగేంద్ర వాహన దేవతాయై నమః ’ ( అలా మూడు సార్లు చేస్తారు)

( దేవత కంఠ స్వరం వినిపిస్తుంది )

దేవత --- ఎవరు మీరు ?! నన్ను పిలిచిన పనేమిటి ?

రచయిత --- దర్శనం కోరి తల్లీ !

దేవత --- నాకు రూపం లేదు, మంత్ర శరీరమే గాని, మర్త్య శరీరం లేదు. నా విగ్రహం మీరు చూడలేదు గనుక, భావనా మాత్రంగానైనా నన్ను చూడలేరు, మీరు నన్ను పిలిచిన పనేమిటి ?

చరిత్రకారుడు --- మేమీ ద్వీపానికి కాందిశీకులమై వచ్చి చేరాము తల్లీ ! మమ్మల్ని తిరిగి ఇంటికి చేర్చి అనుగ్రహించు.

దేవత --- అది జరగని పని !

చరిత్రకారుడు --- మేము ఇక్కడ నుండి, బయటపడే దారేదీ లేదా తల్లీ ? నీవే ఇలాగంటే మేమేం చెయాలి ?

రచయిత --- తల్లీ ! నీవే తప్ప నితః పరం బెరుంగ – అని నీ శరణా పన్నుల మైనాము, కనికరించు తల్లీ !

దేవత --- మీ లాగే ముగ్గురు మానవులు, ఇది వరకు నా చేత రక్షింపబడి, ఇక్కడకు వచ్చారు.—మీ నరులను నమ్మ రాదు. మార్గాంతరం మీరే వెతికి పట్టుకోండి ! గుడిని మింగే వారికి, గుళ్లో లింగమొక లెక్కా?

రచయిత --- పులుపు కారం తినే మాకు, మోసం ద్వేషం సహజ గుణాలు తల్లీ ! కాని నిత్యమూ, అమృత పానం చేసే నీవు, అసూయా ద్వేషాలకి లోబడి, అనుచితంగా ప్రవర్తించడం ఏం బాగుంది ?

దేవత --- ఏమి, నేనా అనుచితంగా ప్రవర్తించింది ?! ఓయి నరుడా ! ఏమి నీ సాహసం ?

రచయిత --- కోపం శమించుగాక తల్లీ ! నన్ను సావధానంగా చెప్పనిస్తే ----

దేవత ---- చెప్పు, ఇందులో నా తప్పేమిటి ? ఒక నీచుడు ధన కాంక్షతో నన్ను నిలువు దోపిడీ చేసాడు. మరొక క్షుద్రుడు నా భావనా రూపాన్ని తునా తునకలు చేసి, ఎన్నడూ చూసెరుగని , ఒక పేడి సన్యాసి రూపాన్ని నాకు ఆపాదించాడు !ఇంకొక మ్లేచ్చుడు నన్ను తవ్వి, తీసుకొని పోవాలని ప్రయత్నించాడు, వీళ్లని శిక్షించి నేను శిక్షించిన తప్పేమిటి ?

రచయిత --- తప్పు కాదు తల్లీ ! తొందర పాటు, రాజుని సుడిలోకి నెట్టకుండా, అతని పలాయనానికి సహకరించి ఉంటే
అతను పాపం ! – తిరిగి తన రాజ్యం లభించిన పిమ్మట కృతఙ్ఞతతో, అతను నీకు రెట్టింపు నగలు చేయించి ఉండే వాడేమో ! ఒక రాజు చేయించిన నగలు ఇంకొక రాజు పరం చేసి ఉంటే, నీకు కలిగిన నష్టమేముంది తల్లీ ? నష్టమే కలిగిన పక్షంలో అతనిని శిక్షించడానికి నీకు మరొక అవకాశం ఉండేది కాదంటావా ? ఆ నగలు సముద్రం పాలయి, ఎవరికి మేలు చేసాయి ! చెప్పు తల్లీ ?

దేవత – ఓయి నరుడా ! నీ మాటలు నాలో జిఙ్ఞాసను రేకెత్తిస్తున్నాయి. శిక్షించడం కాక, క్షమించి తప్పు దిద్దుకొనే అవకాశాన్ని ఇవ్వడం మంచిదన్న నీ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. ఆ రాజు ప్రేతాత్మ నా గుడి చుట్టూ, చేసిన తప్పుకు పశ్ఛాత్తాపంతో తిరుగుతూ ఉండడం, నాకు సమ్మతం కాదు, నరుడా ! నీకు ప్రేతాత్మల ఉచ్చాటన క్రియ తెలిసి ఉంటుందనే నేను భావిస్తున్నాను, నిజమేనా ?

రచయిత --- తెలుసు తల్లీ ! నన్నేం చెయ్యమంటావో చెప్పు..

దేవత --- చోళ రాజుకు నీకు తెలిసిన ఉఛ్ఛాటన క్రియ ద్వారా ముక్తిని ఇయ్యి.

రచయిత -- నీ ఆఙ్ఞ శిరోధార్యం తల్లీ ! కాని దానికి కావలసిన పూజా సామాగ్రి –

దేవత --- హోమగుండము, గుగ్గిలం, ముగ్గు, నిమ్మకాయలు, వగైరా దినుసులే కదా ! నేను ఏర్పాటు చేస్తాను, చూడుము ---మదీయ కర తలము నుండి. హోమగుండము, కర పృష్టము నుండి పూజా సామగ్రి సమకూరును గాక !

( సాధన సామగ్రి సమకూరుతుంది.వాటిని పేర్చి రచయిత హోమగుండం ముందు కూర్చొని సంకల్పం చేస్తాడు )

రచయిత --- ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమ పాదే, అఙ్ఞాత ద్వీపే, శిథిలాలయ ప్రాంగణే, అస్మిన్ వ్యవహారిక చాంద్రమానేన ధాత నామ సంవత్సరే, చైత్రమాసాయాం, శుభనక్షత్ర,, శుభ యోగ, శుభ కరణే, శుభ తిథౌ, అస్మిన్ మహారాజాధిరాజ, చోల వంశోద్భవ, సిరి కాల నామ, పిశాచోచ్చాటనం కరిష్యే !--- ( అగ్గిలంమీద గుగ్గిలం వేస్తాడు ) ‘ఓం హ్రీం, ఫట్ స్వాహా ’

రాజు ---- దేవీ, మృగేమ్ద్ర వాహనా ! ధన్యోస్మి, నాకు ముక్తి నిచ్చిన మానవులారా ! మీకు ప్రణతోస్మి ! మీకు ఇవే సిరికాలుని శుభాకాంక్షలు !! ( అంటూ రాజు వెళ్లి పోతాడు )

చరిత్రకారుడు --- కవిగారూ ! మీ పిశాచోచ్చాటన అధ్భుతంగా ఉంది !! ( అంటు చప్పట్లు కొడతాడు )

రచయిత ---- అంతేనయ్యా ! నమ్మకమే ప్రధానం ! తంత్ర మంత్రాలు కావు. నమ్మకాన్నికలిగించడానికే ఈ తంత్ర క్రియ ! దీని పైన నమ్మకం ఉండబట్టే , ఎవరో వస్తారని,ఏదో చేస్తారని, ఎదురు చూసాడీ రాజు ! ఈ నాటికిది జరిగి అతనికి ముక్తి లభించింది.

చరిత్రకారుడు --- బౌధ్ధబిక్షువు, బుడత కీచు దొరల విషయంలో ఇది అవసరం లేదంటారా ?

రచయిత --- అవసరం ఉండదు, వాళ్లకీ తంత్ర ప్రక్రియ మీద నమ్మకం లేదు కాబట్టి ! బిక్షువంటే ఙ్ఞాపకం వచ్చింది, అతనీ పాటికి తన తప్పేమిటో తెలుసుకొనే ఉంటాడు ! లేకపోతే పిలిచి తెలియజేద్దాం !

చరిత్రకారుడు --- ఎలా పిలవాలి ?

రచయిత ---- త్రిశరణాల ద్వారా ! నా వెనకాలే చెప్పండి. ‘ బుధ్ధం శరణం గచ్చామి’

చరిత్రకారుడు --- ‘ ధర్మం శరణం గచ్చామి’

బిక్షు ---( ప్రవేశించి ) - సంఘం శరణం గచ్చామి’--- వత్సలారా ! మీరు శాసనం చదువుతున్నప్పుడే, నేను చేసిన పొరపాటు నాకు తెలిసి పోయింది ! బీజాక్షర యంత్ర మంత్ర నిభధ్ధమైన ప్రతిమ ఇది ! ‘ బుధ్ధ దేవుని ’ అలాంటి తాంత్రిక ప్రక్రియలో ప్రతిష్టించ పూనుకోవడమే నేను చేసిన తప్పు ! బుధ్ధుడు తంత్రానికి అతీతుడు ! ఇన్నాళ్లకు అది తెలిసి, నా ఆత్మకి శాంతి లభించింది. విజయోస్తు బిడ్డా ! భగవానుని శరణు మీకు మంగళ మొనర్చుగాక ! ( వెళ్లిపోతాడు )

దేవత --- చూసావా నరుడా ! ఆ పేడి సన్యాసి తల పొగరు.అతని చర్యని ఎలా సమర్థిస్తావ్ ?

రచయిత --- మంత్ర శరీరమే గాని, మర్త్య శరీరం లేని శక్తివి నీవు ! నీ భావనా రూపాన్ని అతడు మార్చినంత మాత్రాన నీకు జరిగిన అపచారం ఏమిటి తల్లీ ? బౌధ్ధమతం ఎక్కువ ప్రచారంలో ఉండే కాలమది అతనికే కనుక నీవు అవకాశం ఇచ్చి ఉన్నట్లయితే నీ కొత్త రూపంతో, ఇనుమడించిన రాగ బోగాలతో పూజలందుకొనే దానివేమో ! భక్తి శ్రధ్ధలు ప్రధానం గాని, బాహ్యాడంబరాలు కావని, దేవతవైన నీకు తెలియదా తల్లీ !?

దేవత --- రవి కాంచని చోట కవి కాంచునన్న మాట నిజమేలాగుంది ! మరి ఆ మ్లేచ్చుని సంగతి ?

రచయిత --- దొర తీసుకొని వెళ్లాలని అనుకొన్నది నీ ప్రతిమనే కదా తల్లీ ! మంత్రిత చక్ర బంధితవైన నిన్ను తీసుకు వెళ్లడం అతని తరమా? తేజస్సు లేని నీ ప్రతిమను తీసుకొని వెళ్లి, ఏదో మ్యూజియంలో ఎయిర్ కండిషన్ గదిలో పెట్టి ఉండేవాడు.నిన్ను అంటే నీ ప్రతిమ దర్శనార్థం ఎంతోమంది వచ్చిపోయేవారు.అది మాత్రం ఆరాధన కాదంటావా తల్లీ ?

దేవత ---- నిజమే నరుడా , నువ్వన్నది ఆలోచించి చూస్తే సబబుగానే ఉంది ! అణుయుగం లోని మానవులు తార్కిక ఙ్ఞానంలో చాల ముందుకు పురోగమించారన్నది నిన్ను చూసి ఒప్పుకోవచ్చు.ఆ దొర ఆత్మ మాత్రం ఆలయం చుట్టూ దేనికి పరిభ్రమించాలి ? పిలిచి ‘పాప పరిహారం’ అయిందని చెప్పు.

రచయిత ---- కెప్టెన్ , ఓ కెప్టెన్ !

చరిత్రకారుడు --- అలాకాదు, --- స్కౌట్ ! ఎటెన్షన్ ! --- మార్చ్ !

( బూట్ల చప్పుడు చేసుకొంటూ బుడతకీచు దొర వస్తాడు )

చరిత్రకారుడు --- స్కౌట్, మార్చ్ ! లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్ !--- స్టాప్ !

( దొర ఆగి పోతాడు )

దొర--- మీర్ రు నన్ను ఎందికు పిలిచార్ ?

చరిత్రకారుడు --- యువర్ సిన్ ఈజ్ ఎక్స్ క్యూజ్డ్ కెప్టెన్ ! మీ పాపం క్షమించ బడింది.

దొర --- థేంక్ గాడ్ ! హౌ కైండ్ యూ ఆర్ ! ( మార్చి చేసుకొంటూ వెళ్లి పోతాడు )

చరిత్రకారుడు --- తల్లీ ! నీ మందిరం చుట్టూ పరిభ్రమించిన ప్రేతాత్మలకి, ఈ నాటితో మిక్తి లభించింది ! మరి మాకో ?!

దేవత ---- మీ కోరిక తేర్చే శక్తి నాకు లేదని, మీకు తెలిసే ఉంటుంది, కాని ----

చరిత్రకారుడు --- ఏమిటి తల్లీ ?

దేవత --- నా ముక్తి మాత్రం మీ చేతుల్లో ఉంది. కొన్ని వందల సంవత్సరాలుగా, ఇక్కడ నిల్చిన నేను ప్రజలకు ఉపయోగ పడింది చాల తక్కువ రోజులు మాత్రమే ! ఈ పరిథి నుండి బయటపడాలన్న కోరిక నాకు చాల కాలంగా ఉంది ! నా విగ్రహం పాద పీథం క్రింద ఒక అయస్కాంత శిలా నిర్మిత చక్రం ఉంది. దాని వల్లనే నేనిక్కడ బంధింప బడ్డాను. మీరు మీ నెలవులకి చేరే ముందు దానిని బద్దలు కొట్టి, నాకు ముక్తి నివ్వండి.

చరిత్రకారుడు --- తల్లీ ! మేము బయటపడేది ఎలా ?

దేవత --- అణుయుగంలో నివసించే మీ నరులకి అసాధ్యమయినది ఏముంది బాబూ ! మీ ప్రభుత్వం సముద్ర జలాలలో మునిగి పోయిన స్టీమరు, దాని ప్రయాణీకులని వెతికే నిమిత్తం , ఒక ‘హెలికాప్టరుని’ పంపింది.అది వచ్చి మిమ్మల్ని సురక్షితంగా బయటకు చేరుస్తుంది. అందుకే చెప్తున్నాను, పోయే ముందు నాకు ముక్తిని ప్రసాదించి వెళ్లండి.

( తెరలో హెలికాప్టర్ చప్పుడు వినిపిస్తుంది )

రచయిత --- నిజమే తల్లీ ! అదుగో ఉషోదయం కూడ అయింది. ఈ ఉదయం మనందరికీ ముక్తిని ప్రసాదించ బోతోంది !

Comments

  1. శ్రీధర్ గారూ, నమస్తే. చాలా కష్టపడి నాటిక మొత్తం బ్లాగులో టైపు చేసి ఉంచారు. ధన్యవాదాలు. ఇదొక రేడియో నాటకమని మీరు మొదటి భాగంలో వ్రాశారు. ఆ రేడియో నాటికి ఆడియో మీ దగ్గర ఉంటే అప్లోడ్ చెయ్యండి విని ఆనందిస్తాము.

    ReplyDelete
  2. శ్రీ శివగారికి, నమస్తే ! ఈ నాటికని ఆకాశవాణి ,విజయవాడ కేంద్రం వారు, ౧౯౯౭ మార్చి రెండవ ఆదివారం నాడు, ప్రసారం చేసారు. నాకు పన్నెండు వందలు పారితోషికం లభించింది. ఆ రోజుల్లో టేపురికార్డరులో రికార్డు చేసినా, అది పూర్తిగా నష్టమయింది. దీనిలో మరొక పూజారి పాత్రను ప్రవేశపెట్టి భిలాయిలో శివరాత్రి నాడు ప్రదర్శన కూడా ఇచ్చాము. కాని ఇదేదో భేతాళ కథలాగ ఉందని. నాటక పరిషత్తులు అనుమతి ఇవ్వలేదు. కాని ప్రేక్షకులు మాత్రం చాలా బాగుందని, ఎన్నో విషయాలని వెలుగులోకి తెచ్చిందని అన్నారు. మళ్లీ ఇంత కాలానికి నా బ్లాగులో దీనిని టపా చెయ్యడం ,దానిని మీ లాంటి సహృదయులు మెచ్చుకోవడం చూస్తే, దీనికి టైం అవుట్ లేదని తెలిసింది. కళాకృతికి ఇంతకన్నా మెప్పు ఏముంది ! నా బ్లాగులోని, నీలగ్రహ నిదానం, (నాటకం) చీకటి చకోరాలు ( నాటిక) ఇంకా, బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన (టి,వి స్క్రిప్టు) కూడా చదవండి. ధన్యవాదాలతో --- శ్రీధర్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద