Skip to main content

శ్రీ హరీ ! రాత్రిని రానీయకు ! భయానక భక్తుని కథ

శ్రీ హరీ ! రాత్రిని రానీయకు !

చీకటి రాత్రి లోని చీకటిని ,‘ హేడ్ లైట్లు ‘ చీలుస్తూ ఉండగా , ‘ఘాట్ రోడ్డు’ మీద మొరాయిస్తూ వెళ్తోంది బస్సు .

ప్రహ్లాద రావు ‘కిటికీ; దగ్గర సీటులో కూర్చొని చూస్తున్నాడు. లోయలు ,లతలు, చెట్లు, రక రకాల రూపాలని తలపుకి తెచ్చే రాళ్ల గుట్టలు , వీటన్నిటి పైన ‘చీకటి’, నల్లని దుప్పటి కప్పేసింది .ఇక చేసేదీ, చూసేదీ లేక, ప్రహ్లాద రావు తన చూపును బస్సులోపలికి మరలించాడు. బస్సు డ్రైవరు గళ్ల టీ షర్టు వేసుకొని ,గుబురు మీసాలు ,స్థూల శరీరంతో , ‘కత్తుల రత్తయ్యను ’ తలపిస్తున్నాడు.

కండక్టరు, క్లీనరు ఇద్దరూ ఖాకీ దుస్తులలో, సన్నగా, గెడకర్రల్లాగ, ‘రమణా రెడ్డిని’, ‘రాజ బాబునీ’ తలపిస్తున్నారు. ‘వాళ్లిద్దరినీ కలిపి ఒకటిగా చేసినా, ఆ డ్రైవరులో సగానికి వస్తారేమో !’ తన ఆలోచనకి తానే నవ్వుకొని సాటి ప్రయాణీకులని గమనించాడు అతను.ఇంచు మించు అందరితోనూ పరిచయం ఉందతనికి ! రెండు సీట్ల వెనకాల, ‘సంగీతం మేస్టారు’ చేతిలో వీణని జాగ్రత్తగా పట్టుకొని, సిల్కు లాల్చీ, పోలియస్టరు పంచెతో, చూడగానే గౌరవం కలిగించే ‘ముఖ సిరితో’ కూర్చొని ఉన్నాడు. అతని ప్రక్కనే అతని చెల్లెలు, నిండు నవ మాసాల గర్భిణీ స్త్రీ ఆయాస పడుతూ, అవస్థలు పడుతూ, కూర్చొని ఉంది.

ఆ వెనక సీట్లో ఒక అమ్మాయి వయసు ముప్ఫైలోపే ఉంటుంది, ముచ్చటగా కునికి పాట్లు పడుతోంది ! ఆమెకి సైటు వేస్తూ ఒక యువకుడు , నీటుగా టక్ చేసుకొన్న డ్రస్సుతో కూర్చొని ఉన్నాడు. చివరి సీటులో ఒక బుర్ర మీసాల, బూరి బుగ్గల ఆయన, పొట్టివాడు కాబోలు, తల మాత్రమే కనిపించేలాగ కూర్చొని ఉన్నాడు. ఆ తరువాత ఇద్దరు ఉపాధ్యాయులు, వెరసి తను గాక, పట్టుమని పదిమంది ఉన్నారా బస్సులో !

చిన్నప్పటి నుంచి, నాటకాలు వేసే ‘ప్రహ్లాద రావుకి’ ఆ పేరు, వేషానికిమించి వేయడం వల్లనే వచ్చింది. ఆ బస్సులోని వారు తన నాటక కంపెనీలో పాత్రధారుల లాగే ఉన్నారు. తన ఆలోచనకి తానే నవ్వుకొని, కిటికీ లోంచి బయటికి చూసాడు. బస్సు హెడ్ లైట్ల వెలుగులో, పొడవైన ‘అనకొండలాగ’ కనిపించే రోడ్డు కనిపించక పోయే సరికి, గాభరాతో తల బయటికి పెట్టి చూసాడు. హెడ్ లైటు వెలుగు, లోయలోని లతలు, పొదలు, రాళ్ల మీద పడుతోంది ! బస్సు రోడ్డు ఎక్కేందుకు మొరాయించ కుండా, వేగం విపరీతంగా పెంచుకొని, క్రిందకి దిగుతున్నట్లుంది !! ఇదేమిటిది !! బస్సు చక్రాల క్రింద రోడ్డు మాయమయి, గాలిలో తేలినట్లు కనిపిస్తున్నాయేమిటి ?!

కొంపదీసి బస్సు లోయలో పడిపోవడం లేదు కద !!!

*************

ప్రహ్ల్లాదుడు, అరమోడ్పు కనులు నెమ్మదగా విప్పాడు. చుట్టూ అంధకారం, చీకటి గుహలో లాంటి అంధకారం ! ఏదో వాసన, శరీరమంతా జిగురు లాంటి ద్రవంలో తలమునకలయి ఉంది ! తాను తల క్రిందలుగా ఉన్నాడు. కాళ్లు, చేతులు పొట్ట దగ్గరకి ముడుచుకొని పోయి, ‘కీచకుణ్ని’ చంపిన తరువాత భీమసేనుడు అతని శరీరాన్ని బంతిలా చెసినట్లు ఉన్నాడు. ఏమిటీ అవస్థ ! మాతృ గర్భంలోని శిశువు లాంటి అవస్థ ! తాను నిజంగానే మాతృగర్భంలో ఉన్నాడా ?!

“ప్రహ్లాదా, నాయనా ప్రహ్లాదా !” పిలుపు.

ప్రహ్లాదుడు కళ్లు పూర్తిగా విప్పాడు. ఏదో తెల్లని తేజస్సు, వెనక నీడలాంటి అస్పష్టమైన ఆకారం, వీణ చేతిలో పట్టుకొని, సంగీతం మాస్టారా !

“ ప్రహ్లాదా, నేను నారదుణ్ని ! అవును నారద మహర్షినే !! నిన్ను మాతృగర్భం లోనే వధించ బోయిన దేవేంద్రున్ని వారించి, నా ఆశ్రమానికి నీ తల్లితో సహా తెచ్చాను. నీకు రోజూ హరికథలు చెప్తాను, విని తరించు !”

ప్రహ్లాదుడు మంత్రముగ్ఢుడై విన సాగాడు. బయట పడేందుకు కాళ్లు గట్టిగా విదిలించాడు. వేదనతో పొలికేక పెట్టింది తనని భరిస్తున్న తల్లి ! వెంటనే కండరాల్ని బిగించి, గాలితో బయటికి నెట్టింది, ప్రసవించడానికి ! తను క్రిందకి జారి పోతున్నాడు, ఇంకా, ఇంకా--- చీకటి సొరంగ మార్గం గుండా జారి పోతున్నాడు ! చివరికి ‘శీర్షోదయమయింది’ నిండు వెలుగులో ! ఆహా, గర్భ నరకం తప్పింది, ఎంత హాయిగా ఉంది !

భూమి మీద పడుతూనే తాను పెద్దవాడయి పోయాడు. గురువులిద్దరూ బెత్తం పట్టుకొని బెదిరిస్తున్నారు, “ ప్రహ్లాదా ! హరినామ స్మరణ త్యజించు, నీ తండ్రి పేరు తలచుకో ! ఆ బెత్తపు దెబ్బల నుంచి తప్పించుకొంటూ, తాను ఇంకా పెద్దవాడయ్యాడు, ఒక రాచ వీధిలో ప్రవేశించాడు.

అక్కడ రాచ వీథిలో ! ఒక రాజకుమారుడు నిడుపైన కరవాలాన్ని, పట్టుకొని తనవైపే వస్తున్నాడు, చంపేస్తాడా ?

“ ఎవరు నువ్వు ? నన్నెందుకు తరుముతున్నావు,” అరిచాడు.

“ నేను ఆహ్లాదుణ్ని ! నీ పినతండ్రి కొడుకుని, అస్తమానం వైరి నామం జపించే నిన్ను వధిస్తే, నాకు రాజ్యాభిషేకం జరుగుతుంది, చావడానికి సిధ్ధంగా ఉండు,” అంటూ కత్తితో ప్రహారం చేసాడు, తాను పరుగెత్తాడు, రాజవీథి దాటగానే ఆహ్లాదుడు కనుమరుగయ్యాడు.

‘ హమ్మయ్య !’ అనుకొంటూ తానొక ఇంట్లోకి వెళ్లాడు.అక్కడ దర్శన మిచ్చింది ఒక యువతి, “ రా, ప్రహ్లాదా ! నీ కొసమే ఎదురు చూస్తున్నాను.”అంటూ ఎదురు వచ్చింది.

“ ఎవరు నువ్వు ? నాతో ఏం పని ?”

“ నేను నీ మేనత్త ‘ హోళికను’, నిన్ను చంకనేసుకొని, అగ్ని ప్రవేశం చేస్తాను. అంటూనే ఆమె ప్రహ్లాదుణ్ని చంకనేసుకొంది, ఇంటి మధ్యలోనున్న అగ్ని గుండంలోకి ప్రవేశించింది.

‘ అమ్మో, కాలిపోయాను !’ అనుకొన్నాడు ప్రహ్లాదుడు.కాని అలా జరగ లేదు.అగ్ని గుండం, హోళిక ఇద్దరూ మాయ మయ్యారు..

ఇంతలో బుర్రమీసాలు, బూరి బుగ్గలు ఉన్న ఒక తల, అట్టహాసంగా నవ్వుతూ, ప్రహ్లాదుని వెంట పడింది. “ ప్రహ్లాదా ! నేను ‘రాహువుని’ , నీ తండ్రి హిరణ్య కశిపుని ఆఙ్ఞ మీద నిన్ను, నిన్ను --- ”

“ ఏం చేస్తావ్ ?”

“ కబళిస్తాను, సూర్య చంద్రులనే కబళించగల నాకు, నువ్వొక లెక్కా ?” అంటూ ప్రహ్లాదుని వెంట బెట్టింది. ప్రహ్లాదుడు పరుగెట్టాడు, రాహువు తలకాయ వెంట బెట్టీంది. ఆ వీధి మలుపు తిరగగానే మాయమయింది !

ఇంతలో రమణారెడ్డి, రాజబాబుల్లాంటి ఇద్దరు భటులు వచ్చారు. పహ్లాదున్ని చెరొక రెక్కా పట్టుకొని లేవనెత్తారు.

“ నన్నెక్కడికి తీసుకొని వెళ్తున్నారు, ఏం చేస్తారు ?”

“ కొండ మీద నుంచి క్రిందకి తోసేస్తాం , రాజాఙ్ఞ !” అన్నారు వాళ్లు. ప్రహ్లాదుడు మహారాజు వంక చూసాడు, హిరణ్య కశిపుడు, కత్తుల రత్తయ్యలాగ ఉన్నాడు. అతను క్రూరంగా భటులకేసి చూసి, “ వీణ్ని కొండ మీదకి ఎక్కించి క్రిందకి తోసేయండి .” అన్నాడు

అతని ఆఙ్ఞా ప్రకారం భటులు ప్రహ్లాదుణ్ని కొండ ఎక్కించి, క్రిందకి తోసేసారు. ప్రహ్లాదుడు కొండ చరియల్లో పడి పోతున్నాడు.

***********

ప్రహ్లాద రావు చెట్టుకొమ్మల మధ్య చిక్కుపడ్డాడు. విషయమంతా అర్థమయింది. బస్సు లోయలో పడింది. అందరూ చనిపోయారు, తను ! తన సంగతేమిటి ? తాను ప్రహ్లాదుడయితే, వారందరూ పాతధారులు కావడమేమిటి !?

ఇంతలో ఉదయపు నీరెండ పరచుకొంది. లోయలో పడిపోయిన పాత్రధారులందరూ, అచేతనమైన శవాలుగా మారి పోయారు. ఆ ఎండ తనని కూడ సమీపించింది. తన శరీరం
కూడ --- !

అర్థమయింది, తాను కూడా చనిపోయాడు ! ఎండ పూర్తిగా పడితే శవమయి పోతాడు !

తిరిగి రాత్రి వస్తుంది. ‘కాళరాత్రి’ ! వాళ్లు ప్రేతాలుగా మారి తన వెనక పడతారు.

పాపాత్ముడైన ‘అజామీళుడు’ చనిపోయే ముందు ‘నారాయణ’ అంటే, వైకుంఠానికి వెళ్లాడట ! ప్రహ్లాదుని వేషంలో తానెన్నో సార్లు అన్నాడు, కాని ----
తనకి వైకుంఠ ప్రాప్తి లేదని తెలిసి పోయింది కనీసం, ‘శ్రీహరీ ! ఈ రాత్రిని రానీయకు.’ అనుకొంటూనే అతను ఎండ మీద పడగానే, నిశ్చేతనుడయి పోయాడు.
హారర్ భయానక భక్తుని కథ
**************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ