Skip to main content

హాస్య సంజీవనీ థూమము

హాస్య సంజీవనీ థూమము

‘ శంకాకులమనే’ రాజ్యాన్ని,‘నిత్య శంకితుడనే’ రాజు పరిపాలిస్తున్నాడు. అతని తల్లి తండ్రులు, ఎంతో వెనుక చూపుతో (ముందు చూపుకి *) ముందుగా ఆ పేరుని కనినందువల్ల కాబోలు, అతనెప్పుఢూ చింతిస్తూనే ఉంటాడు. అతని చింతకి కారణం, ‘అగ్గిపుల్లా- సబ్బుబిళ్లా ‘ ఏదైనా కావచ్చు ! లేదా కాకపోనూ వచ్చు ! ‘ అగ్గిపుల్ల వెలగక పోతే చింత, వెలిగితే-‘ అయ్యో ! వెలిగి పోయిందే !’ అని చింత. ’సబ్బుబిళ్ల’ అరిగినా చింతే, అరగక పోయినా చింతే ! చింతకి కారణం కనబడక పోయేసరికి, ‘అయ్యో,ఈ రోజు చింతించడానికి ఏదీ లేదే !’ అన్న చింత.! ఇలా ఆ మహారాజు ఎప్పుడూ చింతాక్రాంత మగ్నుడై ఉండేవాడు.

చితి శవాన్ని, చింత శరీరాన్ని, కాలుస్తుందంటారు. అతనిని చూస్తే ఆ మాట నిజమేనని అనిపిస్తుంది. నడివయసు రాకముందే,‘నెరసిపోయిన జుట్టు, లోతుకు పోయిన కళ్లు, అంటుకి పోయిన బుగ్గలు, చిక్కి సూదిగా మారి వంకర పోయిన ముక్కు,రాజరికపు దుస్తులు, హంగులూ మోయలేని సన్నని అస్థిగత శరీరమూ, అంతా కలిసి, ఒక జీవచ్ఛవం, అతని రూపం !’

చింత అతని శరీరాన్ని కాలుస్తూ ఉంటే, అతని సంపదనీ, వివేకాన్నీ భ్రష్టు పట్టించడానికి చేరారు,’చెదపురుగ’ల' లాంటి,ఇద్దరు మంత్రులు.ఒకరు ‘దోచే మహామంత్రి’, ఇంకొకరు ‘రెండవ వాడు,‘చా.చె’ ( చాఢీలు చెప్పే) సచివుడు. వాళ్లిద్దరే అతని ఆంతరింగిక సలహాదారులు. తక్కిన వారినందరినీ చాడీలు చెప్పి, సచివుఢు దూరం చేసాడు.

దోచే మంత్రి ఒక రోజు, మహారాజుని చింతకు గురి చేసాడు.“మహారాజా ! ప్రభువుల వారి ఖజానా రాను రాను ఖాళీ అయిపోతోంది. ఖర్చు ఎక్కువ, మిగులు తక్కువ అయిపోతోంది.”

“ దానికేముంది మాహామంత్రీ ! మిగులు పెరగాలంటే, ఆదాయం పెంచాలి, ఖర్చు తగ్గించాలి--------”

“ చాలా బాగా చెప్పారు మహారాజా ! నేను అదే ఆలోచనలో ఉన్నాను.అసలు ఆదాయం అంతా మిగల్చాలనే నా తాపత్రయం.”

“ఎలా చేస్తారు, కొత్త పన్నులు వేస్తారా ?”

“ అవును మహారాజా !”

“ మహారాజా ! క్షమించాలి, పన్నులు వేయాలనే ఆలోచన మంచిదే ! కాని వెయ్యడం మంచిది కాదు.”

“ అంటే ?”

“ ఇప్పటికే చాల పన్నులు వెయ్యడం జరిగింది.ఇంకా వేస్తే ప్రజలలో అసంతృప్తి పెరిగి పోతుంది. మహారాజా !”
నిజమే మీరేమంటారు మహామంత్రీ ?”

“ మనం వేసే పన్ను, ప్రజల మంచి కోసమే అయితే అని వాళ్లని నమ్మించ గలిగితే, అసంతృప్తి ఉండదు. అందుకు నేను ఒక ఉపాయం ఆలోచించాను మహారాజా !” అంటూ దో.చే.మంత్రి తన దగ్గరున్న జోలె తీసాడు. ఆ జోలె లోంచి, ఒక తోటకూర కట్ట తీసి, మహారాజుకి చూపించాడు.“ చూడండి, మహారాజా! ఇది తోటకూర కట్ట ! మన రాజ్యంలో విరివిగా పండుతుంది. దీని మీద పన్ను వేస్తే, మన ఆదాయం పెరుగుతుంది. ప్రజల ఆరోగ్యం కూడ బాగుపడుతుంది.

“ ఎలా ?”

“ ఇదుగో చూడండి,” అంటూ దో.చే.మంత్రి, తోటకూర కట్ట విప్పి చూపించాడు. ఆ కూరలో లుకలుక లాడుతూ ఒక ఆకుపురుగు కనబడింది !

“ ఛ! దాన్ని పారేయండి అవతల----” అన్నాడు మహారాజు.

దో.చే.మంత్రి తిరిగి దానిని తన జోలెలో వేసి, మూతి బిగించాడు.“ చూసారా మహారాజా! ఈ పురుగు మన ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తోంది ! అందుకని దీని పైన మనం వేసే పన్ను------”

“ సమంజసమే !” అన్నాడు మహారాజు.

తోడు దొంగ లైన దోచే. చా.చె. మంత్రులిద్దరూ తమ పథకం పారినందుకు లోలోపల ఆనందించారు.

‘తోటకూర పన్ను సంచలనం కలిగించింది.’ ఆనందాశ్రమంలో, పరమానంద యోగి ముందు, శిష్యులు, పురప్రముఖులు గుమికూడారు.

“ బంగారం మీద పన్ను, వెండి మీద పన్ను, పప్పు మీద పన్ను, ఉప్పు మీద పన్ను, అప్పు మీద పన్ను, చివరకి తోటకూర మీద పన్ను ! గురువర్యా ! మీరు యీ విషయంలో కలుగ జేసుకోక తప్పదు. ,” అంటూ వేడుకొన్నారు.

పరమానంద యోగి, ధ్యాన మగ్నుడై, విషయం అంతా ఆకళింపు చేసుకొన్నాఢు. ఆ తరువాత ఆ గుంపులో ఉన్న రాజవైద్యునితో సంప్రదించాడు.

“ సభాసదులందరికీ నమస్కారం ! మన మహారాజు గారు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో, రాజవైద్యునితో మాట్లాడాక అర్థమయింది ! అతను నిత్యమూ చింతతో కాలం గడుపుతూ, తన శరీర ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవడం లేదు. ఆ పైన స్వార్థపరులు చెప్పే చెప్పుఢు

మాటలు వింటున్నారు. శారీరికంగా, మానసికంగా రోగి అయిన అతని పట్ల మీరు ద్వేషం పెంచుకోవద్దు. కొన్నాళ్లు ఓపిక పట్టండి. నేను అతనిని బాగు చేసేందుకు ప్రయత్నిస్తాను. అతను బాగయితే మన సమస్యలన్నీ వాటంతట అవే బాగవుతాయి,” అన్నాడు.

“ మహారాజా ! ఈయన పరమానంద యోగి .మన రాజ్యంలోని ఆనందాశ్రమానికి అధిపతి. మీ అనారోగ్యం సంగతి విని మీ దర్శనం గురించి వచ్చారు.” అన్నాడు రాజవైద్యుడు, మహారాజుకి నమస్కరించి, యోగిని పరిచయం చేసాడు.

“ యోగిగారికి వైద్యం తెలుసా ?”

“ నాకు వైద్యం తెలియదు మహారాజా ! వైద్యం మీ రాజవైద్యులే చేస్తారు.”

“ మరి మీరేం చేస్తారు ?”

“ మీరు మీ కోల్పోయిన ఆరోగ్యాన్ని ఎలా పొందగలరో, తిరిగి పొందిన తరువాత దానిని ఎలా కాపాడు కోగలరో,తెలియ జేయడానికి వచ్చాను మహారాజా ! నా దురుసుతనాన్ని మన్నించి, నేను చెప్పే విషయం దయచేసి వినండి..”

మహారాజు ఆ యోగి వంక చూసాఢు. బ్రహ్మతేజస్సు ఉట్టిపఢుతున్న ప్రశాంత గంభీరమయిన వదనంతో, ఆ ముఖానికి శోభని ఇస్తున్న తెల్లని శ్మసృపటలంతో, ఆ పరమానంద యోగి, ఆరోగ్యం గురించి, చెప్పదగిన వానిలాగే కనిపించాడు.” ఫరవాలేదు, చెప్పండి,” అన్నాడు మహారాజు.

“ మహారాజా !ఈ రాజవైద్యులవారిచ్చే, ఔషధం పని చేయక పోవడానికి, మీ నిరంతర చింతయే కారణం ! మీ ఆరోగ్యం కుదుటపడాలంటే మీరీ చింతను విడనాడాలి.”

“ చింత ఎలా వదులుతుంది. అది నా ఊఁపిరి అయిపోయింది ! ఊఁపిరి లేనిదే ఎలా బ్రతక గలను ?”

“ హాయిగా నవ్వుతూ బ్రతికెయ్యండి మహారాజా ! నవ్వు చింతను దూరం చేయడమే కాదు, దరి చేర నీయదు కూడా.”

“ నవ్వడం ఎలా ? నాకు నవ్వు రాదే !”

ముసిముసిగా నవ్వుకొన్నాడు పరమానంద యోగి, మహారాజు ప్రశ్నకి. “ మహారాజా ! నా ఆశ్రమం నుండి, ప్రతీరోజూ ఒక శిష్యణ్ని పంపిస్తాను. అతను మీకు హాస్యాన్ని పండించే కథలను, చతురోక్తులనూ వినిపిస్తాఢు. మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తాడు.”

దోచే మంత్రికి, చా.చె సచివునికీ, యోగి ప్రస్తావనలో ఏదో అనర్థం గోచరించింది. తమ దోపిడీ ఆట కట్టుపడే ప్రమాదం స్ఫురించింది. దోచే మంత్రి, వెంటనే కలగజేసుకొని, ఎంతో తెలివితో యోగి ప్రస్తావనని మరో మలుపు త్రిప్పాడు.

“ మహారాజా ! మీ ఆరోగ్యం కన్న ముఖ్యమయినదీ, విలువైనదీ ఏదీ లేదు ! మిమ్మల్ని నవ్వించి, తద్వారా ఆరోగ్యం కలిగేలా చేసేవారికి, అర్థరాజ్యం ఇచ్ఛినా తప్పు లేదు,” అన్నాడు.

చా.చె. సచివుడు మంత్రి మాటలకి, ఒక షరతుని జోడించాడు. “ మహారాజా ! మీరు అలా ప్రకటిస్తే, మన దర్బారంతా విధూషకులతో నిండి పోతుంది. ఎవరు సమర్థులో,ఎవరు అసమర్థులో తేడా తెలియకుండా పోవడమే కాక, మీ విలువైన సమయం కూడా నవ్వుల పాలయి వ్యర్థమవుతుంది. మిమ్మల్ని నిజంగా నవ్వించ గలిగిన వారికి. అర్థరాజ్యం ఇస్తామనీ, అలా చేయలేని వారిని చెరసాలలో వేయిస్తామనీ ప్రకటించండి.” అని

మహారాజు దానికి అంగీకరించాడు.

రోజుకొకరు చొప్పున, పరమానంద యోగి శిష్యలు, మహారాజు దగ్గరికి వచ్చేవారు. మహారాజుని నవ్వించే ప్రయత్నం చేసేవారు. నవ్వితే అర్థరాజ్యం పోతుందనే చింతతో, నిత్య చింతన మహారాజు బలవంతాన నవ్వుని ఆపుకోనేవాడు.

చా.చె.సచివుడు వారిని చెరసాలలోకి నెట్టించేవాడు. టక్కరి దొంగలిద్దరికీ ఇది చక్కని వినోదం అయిపోయింది. వారి పథకం యథాతథంగా సాగుతూనే ఉంది.

పరమానంద యోగి గంభీరమైన సమస్యలో పడ్డాడు. అతని శిష్యులందరూ, రాజుగారి చెరసాలలో బందీలయి పోయారు. మహారాజు ఆరోగ్యం మాట ఎలా ఉన్నా,తన శిష్యులని, విడిపించు కోవడానికైనా, మహారాజుని నవ్వించే ప్రయత్నం చెయ్యక తప్పదు. అదంత సులభం కాదు. ఎందికంటే మాహారాజు నవ్వకూడదని భీష్మించుకొని కూర్చొన్నాడు. గనుక !

‘ ఏం చేయాలో అడగాడానికి తన గురువు గారి దగ్గరకి బయలుదేరాడు ఆ యోగి. మార్గ మధ్యంలో ఒక విచిత్రం జరిగింది ! ఒక చిట్టడవి లోని బండరాళ్ల గుట్టమీద ఒక గొల్లవాడు పొట్ట చెక్కలయేలాగ నవ్వుతూ కనిపించాడు. యోగి చుట్టూ పరికించి చూసాడు,నవ్వించే దృశ్యమేదీ కనిపించ లేదనికి ! ఆ గొల్లవాడు ఎందుకు నవ్వుతున్నాడో వానినే అడిగి తెలుసుకొనేందుకు అక్కడికి వెళ్లి అడిగాడు.“ఎందుకు నాయనా ! అలా నవ్వుతున్నావు?” అని.

“ ఏమో,నాకే తెలవదు సామీ !” అన్నాడు ఆ గొల్లవాడు.“ యీ బండరాయి మాటున చిన్న గుహ ఉండాది సామీ ! అక్కడికెల్తే సాల ! నవ్వు దానంతటదే వస్తాది సామీ !” అన్నాడు.

యోగికి ఆ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి ! గొల్లవానితో పాటు, ఆ గుహలోకి వెళ్లాడు. ఆ గుహలోంచి చల్లని గాలితెమ్మెర అతని ముఖాన్ని తాకి, నాసికా రంధ్రాలలోకి ప్రవేశించింది !

ఆ గాలి లోపలికి పీల్చగానే, గిలిగింతలు పెట్టినట్లయి, పకపకా నవ్వసాగాడు అతను. చివరికి ఆ నవ్వు భరించలేక బయటికి వచ్చేసాడు. ఆ ఘటన అతనికి స్ఫూర్తినిచ్చింది.

“ మహారాజా! మిమ్మల్ని నవ్వించి, ఆరోగ్యవంతులిగా చేయాలని ప్రయత్నించిన నా శిష్యులందరూ, మీ సహాకారం లేక చెరసాల పాలు అయ్యారు.”

“ యోగివర్యా ! మీ మాటలు సముచితంగా లేవు. మీ శిష్యులు మహారాజుల వారిని నవ్వించలేక పోయినందుకు శిక్ష అనుభవిస్తున్నారు, ఇందులో మహారాజుల వారి సహకార లోపం లేదు,” అన్నాడు దోచే మంత్రి.

“ నిజమే అమాత్యా ! షరతుకి లోబడి, వాళ్లు శిక్షని అనుభవిస్తున్నారు.ఇప్పుడు తప్పొప్పుల ప్రసక్తి నేను తీసుకొని రాను, మహారాజా ! మీరు సహకరించినా, నవ్వనని భీష్మించుకొని కూర్చొన్నా,నేను మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయడానికే వచ్చాను.”

“ నేను నవ్వకపోతే ?!”

“ మీ చెరసాల లోనే నా ఆశ్రమం పెట్టుకోంటాను. ఒక వేళ మీరు నవ్వినట్లయితే, అర్థరాజ్యంతో పాటు, వారి నందరినీ బంధ విముక్తులుగా చేయాలి.”

మహారాజు, దోచే ముఖం వంక చూసాడు. ఆ చూపుని అర్థం చేసుకొన్న దోచే మంత్రి, “ యోగివర్యా ! మీరు తొందర పడుతున్నారు.మీకు శిక్ష పడితే ప్రజలలో అలజడి వస్తుందని అభిప్రాయ పడుతున్నారేమో! అలాంటి ప్రమాదం లేకుండా ఈ పరిహాస ప్రక్రియని ప్రజలందరి సమక్షంలో జరగడానికి మీరు సమ్మతిస్తారా ?”

“ అలాగే కానివ్వండి మహారాజా ! నా గెలుపోటములు నిర్ణయ మయ్యేలా రేపటి దర్బారులోనే, న్యాయ నిర్ణేతల సమక్షంలో యీ ప్రకటనని చెయ్యండి ”
దోచే మంత్రికి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది. నిండు పేరోలగంలో ఈ యోగి చమత్కార సంభాషణలకి, ప్రహసనాలకి, ప్రజలందరూ పగలబడి నవ్వుతారేమో ! అందరూ నవ్వి , మహారాజు నవ్వకపోతే, మహారాజు సహకరించడం లేదని స్పష్ట మవుతుంది. ఏం చేయాలన్నట్లు, చా.చె. సచివుని ముఖం వంక చూసాడు దోచేమంత్రి.

“ పరమానంద మహర్షీ ! హాస్య కథలు విని విని వాటిలో హాస్యం లోపించి పోయి, మహారాజావారికి విసుగు పుట్టింది. మీ కథలకి ప్రజలు నవ్వుతారేమో గాని, మహారాజావారు నవ్వలేరు. అందుకని అతన్ని అపార్థం చేసుకోకుండా, మీరు కథలు, పరిహాస ప్రసంగాలు వగైరాలు తప్ప, ఇంకేదైనా ప్రయత్నం చెయ్యండి.” అన్నాడు చా.చె.మంత్రి.

“ అవునవును” సమర్థించాడు మహారాజు, అతనికి కూడా అర్థరాజ్య నష్ట చింతన కలిగింది! మరునాడు పరమానంద యోగి, నిండు దర్బారులో మాహారాజావారి ప్రకటన వెలువడ్డాక, తనతో పాటు తెచ్చుకొన్న కలశం చూపించి, “ మహారాజా ! షరతుని అనుసరించి నేను మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేయనే చెయ్యను. ఈ కలశంలో ‘ హాస్య సంజీవనీ థూమం’ ఉంది. దాని మూత తీసి, ఆ థూమాన్ని కేవలం వాసన చూడండి. ఆ పైన మీరు నవ్వకుండా ఉండ గలిగితే నేను పందెం ఓడినట్లేనని అంగీకరిస్తాను.” అన్నాడు.

ఓస్ ! ఇంతేనా ?! అనుకొన్నాడు మహారాజు,‘అంగీకారమే’ నన్నట్లు తల పంకించాడు.

పరమానందుడు పరమానందంతో, కలశం మూత తీసాడు. మాహారాజు అందులోని ‘హాస్య సంజీవనీ థూమాన్ని’ ఆఘ్రాణించాడు.

అంతే ! కలశం లోని థూమం తన పని తాను చేసింది ! ఆ థూమం (లాఫింగ్ గేస్) మహారాజు నాసికా రంధ్రాలలోకే కాదు సభా సదన మంతా వ్యాపించింది. అందరి శరీర నాళాల్లోనూ ప్రవేసించింది. వారి వారి శరీరాల లోపల గిలిగింతలు పెట్టింది. తట్టుకోలేని తీయని తిమ్మిరి లాంటి అనుభవాన్ని కలిగించింది. దాంతో మహారాజు నోరు తెరచి చిరునవ్వు నవ్వాడు, ఆ నవ్వు ఉధృతమయి అతను నవ్వకుండా ఉండలేక, పొట్ట చేత పట్టుకొని, పకపక నవ్వ సాగాడు

ఉమ్మడి మంత్రులు కూడా ఆశ్చర్యంనుండి తేరుకోకుండానే నవ్వుల పాలు అయ్యారు. వారితో పాటు సభాసదులందరూ నవ్వసాగారు. ఒక్క యోగి తప్ప, ఎందుకంటే అతడా గాలి పీల్చ లేదు గనుక. థూమం చల్లారాక నవ్వుల జల్లు నెమ్మదించింది.

మహారాజు ఆరోగ్యం కుదుట పడింది. అతని కళ్లు గనిలోంచి బయటకి తీసిన వైడూర్య రత్నాల్లా, రాచఠీవిని ప్రదర్శిస్తూ కళకళ లాడాయి. అతని బుగ్గలు గాలి బుడగల్లాగ ఉబ్బి ముఖానికి చందమామ లాంటి గుండ్రని ఆకృతి నిచ్చాయి. ముక్కు వంకర పోయి, నిటారుగా, బలంగా దూలంలా నిలబడి, కోటేరులాగయింది ! నెరసిన జుట్టు నల్లబడి నిండు యవ్వనాన్ని, శరీరం పుష్టిని సంతరించుకొని, నిండుదనాన్నీ ఇచ్చాయి.

దానికంతటికీ కారణం ‘హాస్య సంజీవని’ అయిన నవ్వు గొప్పదనం. అది తెలుసుకొన్న మహారాజు యోగికి అర్థరాజ్యం ఇచ్ఛాడు. యోగి రాజ్యాన్ని ఏం చేసుకొంటాడు ! తన ఆశ్రమానికి నికరమైన ఆదాయం ఉండేలా కొన్ని భూములు తీసుకొని, మిగిలినది మహారాజుకే ఇచ్చేసాడు. దానితో మహారాజు నిజానిజాలు తెలుసుకొని, టక్కరి మంత్రులిద్దరినీ చెరసాల లోకి నెట్టాడు. చెరలోని శిష్యులందరికీ తన దర్బారులో పదవులిచ్చాడు. వారందరి సహకారంతో పన్నులు సవరించి వాటిని అర్థవంతం చేసాడు.

అతః సర్వే జనాః హసనోభవంతు !! పునః పునః సుఖినోభవంతు !!!

******************
రచన : ఎ. శ్రీధర్
******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ