Skip to main content

మంగల్ పురోహిత్ థాం.

మంగల్ పురోహిత్ థాం.

అది మూడంతస్తుల మేడ. దాని పేరు ‘మంగళ పురోహిత్ థాం !’ పేరు చూస్తే కళ్యాణ మండపంలాగ ఉంది కదూ, కాని కాదు, అది ఎముకల ఆస్పత్రి , దుర్ఘటనా గ్రస్తుల వైద్యశాల.!

ముంబయి మహానగరంలోని ప్రసిద్ధి పొందిన మొదటి పదిమంది అస్థి శస్త్ర చికిత్సా నిపుణులలో ఒకరు, ప్లాస్థిక్ సర్జరీ నిపుణులలో మరొకరు అయిన ఇద్దరు సర్జన్లు, ముంబాయికి 46కిలో మీటర్ల దూరంలో, పన్వేల్ దగ్గర, పూనా_ గోవా హైవే ప్రక్కగా అనువైన స్థలంలో దుర్ఘటనకి లోనయిన దౌర్భాగ్యులని ఆదుకొనేందుకు దానిని నిర్మించారు.

క్రింద భాగంలో డాక్టర్ ధనంజయ పురోహిత్ క్లినిక్ ఉంది అతను ఆర్థో పెడిక్ సర్జను. రెండవ అంతస్తులో ఆనంద మంగల్ క్లినిక్ ఉంది. అతని ప్లాస్టిక్ సర్జను. మధ్యలో రోగుల పడక గదులు, మూడవ అంతస్తులో డాక్టర్ల నివాసాలు ఉన్నాయి.

ఆ రోజు జ్యేష్ట శుద్ధ నవమి ! మూడు నెలలుగా కాలి బొటనవ్రేలు వాచి, ఉబ్బిపోయి, కట్టిన పిండికట్లు బెడిసి కొట్టగా, రోజురోజుకీ పెరిగిపోతూ అసహ్యమూ, దుర్భరమూ అయి చివరికి కుళ్లిపోయి కంపు కొడుతూ ఉంటే, గత్యంతరం లేక ఆ ‘థామ్’కి వచ్చాడు అయోధ్యా ప్రసాద శర్మ.

అతను పరమ ఆస్తికుడు, శ్రీరామ భక్తుడు. అతనికి పుత్ర రత్నం కూడ శ్రీ రామ నవమి నాడే జన్మించడం వల్ల, అతని భక్తి వరదలై పారి, ప్రతీ శ్రీ రామ నవమికీ భద్రాచలం వెళ్లి, స్వామిని దర్శించడం అతని జీవిత లక్ష్యం అయిపోయింది.

ఆ లక్ష్య సాధనలో ఇరవై ఒక్క వసంతాలు ( చైత్ర నవములు) గడిచాయి. భక్తి ప్రపత్తులు కూడా అంత కంతా పెరిగాయి ! శ్రీ రామ నామ స్మరణమే అతని ఊపిరి ! ఆ స్వామి భజనలు చేయడం, ఆ స్వామికి అర్పించే వడపప్పు, పానకం ప్రసాదాలు, ఆహా ఏమి రుచి ! అంటూ భక్ష్యించడమనే అభిరుచికి కూడా అన్ని వసంతాల చరిత్రే ఉంది !

అతని శరీరంలో గుప్తంగా ప్రవేశించిన మధుమేహ రోగం, అతనేనాడూ గుర్తించ లేదు. అడపా, తడపా ఆ రోగ లక్షణాలు కనిపించినా, రాముడే అంతా చూసుకొంటాడనే నమ్మకం, స్వామి ప్రసాదమే సర్వ రోగ నివారిణి అన్న తాదాత్మ్యం ఆ రోగాన్ని మరింత గుప్తంగా పెంచ సాగింది.

అసలీ తాదాత్మ్యత ( ఐడెంటిఫికేషన్) మధుమేహాన్ని మించిన రోగం !!

రామ నామ తాదాత్మ్యం, స్వామి ( పి.ఎం/ సి. ఎం ) నామ తాదాత్మ్యం, ప్రేమ నామ తాదాత్మ్యం, నటీ నట నామ తాదాత్మ్యం, జాతి నామ తాదాత్మ్యం, కుల నామ తాదాత్మ్యం, ధన నామ తాదాత్మ్యం, భాషా నామ తాదాత్మ్యం, ప్రాంతీయ నామ తాదాత్మ్యం, ఆట నామ తాదాత్మ్యం, పాట నామ తాదాత్మ్యం, ఇంకా బాబా నామాల తాదాత్మ్యం, ఇలా విరాట్ పురుషుని తలల్లాగ, ఎన్నెన్ని తలలు ( వెర్రివి ) వేస్తుందో చెప్పడం సాధ్యం కాదు.

నిజానికీ తాదాత్మ్యం అనేది చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. బాలనాగమ్మ కథలో, మాయల మరాఠీ ప్రాణాలు చిలకలో ఉండడం, బాల వర్ధిరాజు దానిని ఏ విధంగా పట్టి మాంత్రకుణ్ని పీడించినదీ వినడంతోనే తాదాత్మ్యం అలవడుతుంది. వింటున్న పసి మనసు ఆ బాలవర్థి రాజు పాత్రలో తన అస్థిత్వాన్ని వెతుక్కుంటుంది, తాదాత్మ్యం పొందుతుంది.

అలాగే రామాయణ భారత భాగవతాది కథల ద్వారా అది పోషింపబడుతుంది. ఎంతో మంచివైన పంచతంత్ర కథలు చెప్పేవారు ఎందరున్నారు గనుక ?!

మూడు నెలల క్రిందట, చైత్రశుద్ధ నవమి నాడు, భద్రాచలం వెళ్లి, స్వామి కళ్యాణోత్సవాలు తనివి తీరా చూడాలనే కోరికతో, పాద రక్షలు లేకుండా, మండుటెండలో, కాలు కాలి బొబ్బలెక్కినా పట్టించుకోకుండా కిలోమీటర్ల కొద్దీ నడిపించింది అతని తాదాత్మ్యం,! దాని ఫలితంగా ఏర్పడిన బొటనవ్రేలు క్రింద వాపు, ఇంతింతై వటుడింతయై అన్న విధంగా పెరిగిపోయి చివరికీ స్థితికి తెచ్చి, మంగల్ పురోహిత్ థామ్ చేర్చింది.

8వ నెంబరు టోకెన్ అని పిలవగానే. ఆలోచనల లోంచి బయట పడి, లేచి డాక్టరు దగ్గరకి వెళ్లాడు అయోధ్యా ప్రసాద్ శర్మ.

పురోహిత్ అతనిని చూసాడు. గేంగరిన్ అయిందని, వెంటనే ఆస్పత్రిలో చేరిపోమనీ చెప్పి, “ మీకు షుగరు వ్యాధి ఉందా?” అని అడిగాడు. ఏమో తెలియదన్నాడతను. వెంటనే తన దగ్గరున్న గ్లూకోమీటర్తో రేన్డమ్ షుగర్ పరిశీలించాడు డాక్టరు. రక్తంలో షుగరు మోతాదు 400 మి.గ్రా ఉంది !

“ మీకు డయాబిటిస్ బాగానే ముదిరిపోయింది. ఇంత వరకు మీరు తెలుసుకోలేక పోవడం నిజంగానే దురదృష్టం.! ఇప్పుడిది డయాబిటిక్ గేంగరిన్ కేసు అయింది. ఎక్స్ రే తీసి చూస్తేనే గాని కాలి వేళ్ల పొజిషన్ తెలియదు. ముందు జాయన్ అయిపోండి. ఇవాళ రాత్రికే ఎక్స్ రే తీస్తారు. రేపు ఉదయాన్నే ఫాస్ట్ షుగరు చెక్ చేస్తారు. ఆ తరువాత ఆపరేషన్ విషయం నిర్ణయించడం జరుగుతుంది. అయోధ్యా ప్రసాదు కళ్లనీళ్ల పర్యంతం అయాడు.

పురోహిత్ డాక్టరు రెండు చేతులూ పట్టుకొని “ డాక్టర్ ! నా కాలు కాపాడండి. “ అంటూ వేడుకొన్నాడు. పురోహిత్ అతని పైన జాలి పడ్డాడు.

“సరే ! ఎక్స్ రే రిపోర్టు చూసాక ఈ రాత్రికే ఏ సంగతీ మీకు తెలియ జేస్తాను, మా శాయశక్తులా ప్రయత్నం చేస్తాం.”అన్నాడు

అయోధ్యా ప్రసాదు ఎక్స్ రే చూసాక డాక్టర్లిద్దరూ చర్చించుకొని, అతన్తో చెప్పారు. “మీ కాలి బొటనవ్రేలు బాగా పాడయింది. దాని ఎముక దెబ్బ తిని గుల్లబారి పోయింది. వేలుని కాపాడాలంటే ఇప్పటి కిప్పుడు చిన్న ఆపరేషన్ చేయక తప్పదు, డబ్బు వెంటనే కట్టేస్తే ఆపరేషన్ చేసేస్తాము, ఆ తరువాతే మేజర్ ఆపరేషన్ చేస్తాము,” అని..

ముందుగా బొటన వ్రేలు ఆపరేషను చేయడం జరిగింది. దాని ఎముకకి కన్నం పెట్టి ఒక స్థీలు మేకుని లోపలికి దింపి అది విరిగి పోకుండా చేసారు. ఆ తరువాత వారానికి షుగరు నియంత్రణ జరిగాక, కాలు చర్మాన్ని పొట్లకాయలా గంటు పెట్ఠి విప్పి, లోపల క్రుళ్లుపోయిన మాంసాన్ని వెలికి తీసి, బాగున్న మాంసాన్ని దగ్గరకి చేర్చి, కుట్లు వేయకుండా దగ్గరకు చేర్చి, కట్టు కట్టారు. చర్మం అవసరమయితే తొడ దగ్గరది తీసి వేస్తామని అన్నారు. మాంసంలో జీవకణ జాలం కొంత మిగిలింది కాబట్టి, దానంతట అది సర్దుకోగల అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయోధ్యా ప్రసాదు ముఖంలో ఆశా కిరణాలు వెలిగి మనసుకి ఊరట నిచ్చాయి.

ఆ రోజు ఉదయమే అయోధ్య ప్రసాదు ప్రక్క బెడ్ మీద ఇంకో పేషెంటు చేరాడు. అతని పేరు వెంకట రమణ. కార్పెంటరుగా పని చేస్తున్నాడు. మంగళ్ పురోహిత్ థామ్ దగ్గరే ఉన్న బయిఖలా టింబర్ డిపోలో పని చేస్తున్నాడు.

ఆ రోజు కలప మానుని మర రంపంతో కోస్తూ ఉండగా, అతని కుడిచేయి రంపం క్రింద పడింది. చెయ్యి వెనక్కి తీసుకొనేంతలో చూపుడు వ్రేలు నుంచి, ఉంగరం వ్రేలు వరకు తెగి పోయింది. ఆ చేతిని అలాగే తువ్వాలులో మూట కట్టి, తీసుకొని వచ్చారు అతని తోటి కార్మికులు.

ఎమర్జన్సీ కేసు కాబట్టి, డాక్టర్లిద్దరూ, ‘వెంకట రమణని’ ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి, చూసారు.

అతని చేతి వ్రేళ్లు తెగిపోయి వ్రేళ్లాడుతున్నాయి, వాటి ఎముకలు దెబ్బ తిన్నాయి, టేండన్లు ( తంత్రులు ) కూడ తెగాయి. నిజానికి ఆ మూడు వ్రేళ్లని కోసేయాల్సిన పరిస్థితి. మంగళ్ పురోహిత్ థామ్ కాక మరొక చోటికి తీసుకెళ్లి ఉంటే ఆ పని జరిగి ఉండేదే ! కాని ఆ డాక్టర్లిద్దరూ మైక్రో సర్జరీ పరికరాలతో తెగిన టెంఢన్లని కుట్టారు, వాటిని నిలువునా సరిచేసి, వ్రేళ్ల ఎముకల వెనక దన్ను పెట్టి నిలబెట్టారు. ఆ చిందర వందరగా ఉన్న ఎముక ముక్కలని వరుసగా పేర్చి, ఆ పైన ప్లాస్టర్ వేసారు. నిర్జీవమైన మాంసకణాల్ని తీసేసి, జీవ కణాల్ని ఇంప్లాంట్ చేసారు. అతని శరీరం ఆ ఇంప్లాంట్లని స్వీకరిస్తే అతని చెయ్యి బాగవుతుంది.

ఆ విషయమే వెంకట రమణకి, అతని కుటుంబీకులకి, విశదీకరించారు ఆ డాక్టర్లు. శరీరం వాటిని స్వీకరించాలంటే రక్తం శుద్ధమైనది కావాలి. వెంకట రమణ రక్తంలో నికోటిన్ మాత్ర అధికంగా ఉంది. అతను చైన్ స్మోకర్ కావడమే దానికి కారణం ! ఇటుపైన అతను సిగరెట్టు గాని పొగాకు పథార్థాలని గాని మచ్చుకైనా వాడకూఢదు ! వెంకట రమణ సరేనన్నాడు. కాని ఆనంద్ మంగల్ డాక్టర్కి నమ్మకం కలగలేదు. వ్యసనం ఎంత బలమైనదో అతనికి తెలుసు !

రోగి మొదటి రోజు సిగరెట్టు త్రాగడానికి భయపడతాడు. భయం అతని వ్యసనాన్ని గెలుస్తుంది. రెండవ రోజు భయం తగ్గి బుద్ధి తర్కించడం మొదలు పెడుతుంది. ‘ఒక్క సిగరెట్టు త్రాగితే ఏమవుతుంది ? ఈ డాక్టర్లందరూ ఇలాగే చెప్తారు!’. ఇలా తర్జన భర్జనలు పడి, బాత్ రూముకి వెళ్లాలనే సాకుతో, సిగరెట్టు త్రాగమంటుంది వ్యసనం ! ఫలితంగా వ్యసనం గెలుస్తుంది. మనసు సిగరెట్టు ఇచ్చే సుఖానికి లొంగి పోతుంది.

ఆ విషయం ఎంతో అనుభవజ్ఞుడైన, ఆనంద మంగల్ డాక్టరుకి తెలుసు.

అందుకే రమణ రెండవ చేతికి కూడా బేండేజి తగిలించాడు.

సిగరెట్లు, అగ్గిపెట్టె అందుబాటులోకి లేకుండా చూడమని అతని కుటుంబ సభ్యులకే కాక, ప్రక్క బెడ్ఢు మీద ఉన్న అయోధ్యా ప్రసాదుకి కూడా చెప్పాడు. పొగ త్రాగితే రక్తనాళాలు సంకోచించి , ఆర్థెరోక్లెరోసిస్ అనే జబ్బు వచ్చి వ్రేళ్ల చివర్లకి రక్త ప్రసరణ జరగదనీ, అదే కాక ఎముకలని గుల్లచేసే ఆస్థోపొరోసిస్ జబ్బు వస్తుందనీ హెచ్చరించాడు.అలా వారం రోజులు గడిచాక ఇద్దరి కట్లు విప్పి పరిశీలించారు. అయోధ్య ప్రసాదు కాలు దగ్గర చీలికగా కోసిన చర్మం చివర్లంట అతుక్కొంది. గాయం నీలురంగు తగ్గి, గులాబీ రంగులోకి మారింది.

వెంకట రమణ చేతివ్రేళ్లు కూడా, నీలిరంగు కోల్పోయి గులాబీ రంగులోకి మారడం మొదలయింది. డాక్టర్లిద్దరూ చిరునవ్వు నవ్వారు, వారి ప్రయత్నం ఫలించడం ఆరంభ మయింది ! ఇంప్లాంటు సర్జరీ అనుకూల సంకేతాలు ఇచ్చింది. ఇక రోగి సహకరిస్తే అంతా బాగు పడుతుంది ! నిజానికి ఆ ఆపరేషన్ వారిద్దరి సంయుక్త కృషి, ఆరు గంటల సమయం తీసుకొని చేసిన సఫల ప్రయోగం !

“ బాగుంది, అయోధ్యా ప్రసాదు గారూ ! రెండు రోజులలో మిమ్మల్ని రిలీజ్ చేస్తాం. ఇంటి దగ్గరే మూడు రోజులకి ఒకసారి మా డ్రెస్సర్ వచ్చి మీకు కట్టు విప్పి, గాయాన్ని శుభ్రం చేసి తిరిగి కట్టు కడతాడు” అన్నాడు పురోహిత్.

వెంకట రమణకి తిరిగి కుడిచేయి ప్లాస్టరు, ఎడమ చేతికి బేండేజి కట్టారు. వారం తరువాత పరిశీలించిన వెనుక రిలీజ్ చేస్తామన్నారు.

అయోధ్యా ప్రసాదు ఇంటికి వచ్చాడు.

ఇప్పుడతని దిన చర్య మారింది. షుగరు వ్యాధి పథ్యం మొదలయింది. వారం వారం భజన పెట్టే కార్యక్రమం రద్దయింది. భజనకి బదులు అతను మానసిక జపం అలవాటు చేసుకొన్నాడు.

వడపప్పు పానకం బదులు, మొలకెత్తిన గింజలు, మజ్జిగ ప్రసాదంగా సమర్పించి వాటినే స్వీకరించడం అలవాటు చేసుకొన్నాడు. సహజంగా ఏ దురలవాట్లు లేనివాడు కావడం చేత, త్వరలోనే కోలుకొన్నాడు.

వెంకట రమణ వారం తిరిగాక ఇంటికి వచ్చాడు. అతనికి కూడా ఇంటి దగ్గర డ్రెస్సింగు మొదలయింది. ఒక రోజు కట్లు విప్పిన డ్రెస్సరు, చేతివ్రేళ్లు నీలి రంగులో ఉండడం చూసి ఆశ్చర్య పోయాడు. ఆ విషయం డాక్టరుకి ఫోనులో చెప్పాడు. వెంకట రమణని తిరిగి ఆస్పత్రికి తరలించారు.

వెంకట రమణని డాక్టరు ఒకే ఒక ప్రశ్న అడిగాడు, “ సిగరెట్టు త్రాగారా?” అని

అతను జవాబివ్వలేదు. తల దించుకొన్నాడు. మౌనంగానే తల అడ్డంగా ఊపాడు, త్రాగలేదని ! కాని అది అబద్ధమని అతని మనసుకి తెలుసు.

అతను రోజుకి ఒక సిగరెట్టు చొప్పున నాలుగు రోజులుగా సిగరెట్టు సుఖాన్ని ఆస్వాదిస్తున్నాడు. డాక్టరు నిజాన్ని పసి గట్ట గలిగాడు, అతనికి కోపం వచ్చింది. ఆరు గంటల సేపు కష్టపడి, మైక్రో సర్జరీ పరికరాలతో భూతద్దం పర్యవేక్షణలో చేసిన ఆపరేషన్ అది ! అయినా అనుభవంతో స్థితప్రజ్ఞత సాధించిన వాడు కాబట్టి, ఇంకేమీ అడగకుండా, ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్లాడు.

మరో ఆపరేషన్ ముగిసింది. ఈ సారి వెంకట రమణ బొటనవ్రేలు తప్ప తక్కిన నాలుగు వ్రేళ్లు కోసేయడం జరిగింది !

వెంకట రమణకి అర్థమయింది, తను కాల్చిన నాలుగు సిగరెట్లకి మూల్యం నాలుగు వ్రేళ్లని !!

ఆ తరువాత వెంకట రమణ సిగరెట్లు కాల్చలేదు. అలాగని తన ధైర్యాన్ని కూడా కోల్పోలేదు ! జయపూరు వెళ్లి కృత్రిమ అంగాన్ని అమర్చుకొని తన బ్రతుకు బాగు చేసుకొన్నాడు.

*****************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద