Skip to main content

రత్న గర్భ యీ వసుందర 4

రత్న గర్భ యీ వసుందర 4

మూడో రోజు సాయంత్రానికల్లా పశుపతి రోగం నిమ్మళించింది. అతని తల క్రింద పెట్టిన నువ్వుల నూనె చిక్కని పసుపు పచ్చని ద్రవంలాగ మారింది.

“ చూసారా ! మీ రోగం కాస్తా దీనికొచ్చేసింది ! ” ఆంటూ దానిని తీసుకొని పెరట్లోకి వెళ్లింది పార్వతి., దానిని గోతిలో పారెయ్యడానికి. తిరిగి వచ్చిన పార్వతిని ,“ పార్వతిగారూ ! మరయితే నా పథ్యం కూడా రేపటితో సరేనా ?”’ అని అడిగాడు పశుపతి.

“చూడండి, మన పరిచయం అయి మూడు రోజులు అయింది. మీరు నన్ను ‘గారూ’అని మన్నించ నవసరం లేదు. పార్వతీ అని పిలవండి చాలు.”

“అలాగే పార్వతీ! మరి నన్ను కూడా—”

“ ఉహు !” తల అడ్డంగా ఊపింది పార్వతి “మిమ్మల్ని నేను మీరు అనే పిలుస్తాను,అదే సాంప్రదాయం కూడా.”

పశుపతి వారించ లేదు. సాంప్రదాయాల పట్ల పార్వతికి ఎంత మక్కువో అతనీ మూడు రోజుల లోనే గ్రహించాడు. “పార్వతీ ! నాకో విషయం చెప్తావా ?”

“అడగండి”

“ నీ తల్లీ తండ్రీ ఎక్కడ ఉన్నారు ?”

“ నా తల్లి తండ్రులు శ్రీశైలం యాత్రకి వెళ్లి, తిరుగుదలలో బస్సు ప్రమాదంలో కాలధర్మం చేసారట ! నేను అప్పుడు పొత్తిళ్లలో పాపాయిగా ఉండేదాన్నని పెద్దమ్మ చెప్పింది. గౌరి పెద్దమ్మ తాను పెద్దమ్మనని చెప్పబట్టి గాని లేకపోతే నాకు ఆవిడ తల్లి కాదని తెలిసేదే కాదు.”

“ మీ పెద్దమ్మ చాల మంచి మనిషిలాగ ఉంది. విశ్వపతిని కూడా చిన్నప్పుడే తెచ్చి పెంచిందట కదా ?”

పార్వతి ఓర కంటితో చూసింది అతన్ని. “ ఊ ! కూపీలు లాగడంలో గట్టివారే ! మీరు మాత్రం ఏ విషయాలూ చెప్పకండి. మూడురోజుల క్రితం వటవృక్ష శాయిగా కనిపించిన తమరు నేడు పట్టి మంచం శాయిగా మారారు ! అంతే తప్ప మరేమీ తెలియనివ్వ లేదు.”

పశుపతి ఆమె మాటలకి గలగలా నవ్వేసాడు. “చెప్తాను పార్వతీ ! నా గురించి కూడ చెప్తాను. మనిద్దరం ఒక ఒప్పందం చేసుకొందాం, నే నడిగిన వాటికి నువ్వు జవాబు చెప్పు, నువ్వు అడిగిన వాటికి నేను జవాబు చెప్తాను,సరేనా !”

“ సరే,అడగండి, మీకేం కావాలో ?”

“విస్సూ, నువ్వూ ఒకే తల్లి పెంపకంలో పెరిగారు. అతను తాగుబోతు, తిరుగుబోతు ఎందుకు అయ్యాడు?”

“ ముందు తాగుబోతు అయ్యాడు.తాగుబోతు అయ్యాక గోవుల్నే ఏమిటీ, మనుషుల్నే హత్య చేసిన వారున్నారు.”

“నిజమే ! తాగుబోతు ఎలా అయ్యాడు ?

“ విస్సుని పెద్దమ్మ చదివించాలనే చూసింది. వాడికి చదువు అబ్బలేదు. మెట్రిక్ ముమ్మారు తప్పాడు. అప్పట్లో .పెద్దమ్మ పాల వ్యాపారం ముమ్మరంగా ఉండేది. పెదనాన్న పశువైద్యం కూడా చక్కగానే చేసేవాడు,పిచ్చివాడైనా సరే !”

“ ఏమిటీ పశువైద్యమా ?”

“అవును ”

“ మంత్రాలతోనా ?”

“అవును పశువైద్యం ఇప్పటికీ మంత్రాలు,మూలికల తోనే చేస్తారు.” పార్వతి కోపంగా జవాబు ఇచ్చింది. “ నేను చిన్నప్పటి నుంచి ఈ ఈంట్లో పెరిగిన దాన్ని.అతని శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసు.”సరిగా అదే సమయానికి “గౌరీ” అంటూ వచ్చాడు వీర్రాజు.

“ నేను పెదనాన్నా, పార్వతిని.”

“రెండు పేర్లూ ఒకే విభూతివమ్మా , గౌరే పార్వతి, పార్వతే గౌరి !”

“పెదనాన్నా, ఎండన పడి వచ్చావు, మజ్జిగ తాగు!” అంటూ పార్వతి మజ్జిగ తేవడానికి లేచింది మజ్జిగ త్రాగితే వీర్రాజు ధోరణి శాంతిస్తుందని ఆమెకి తెలుసు.

“చూడమ్మా! ఎండన పడి వచ్చాను గనుక నాకు కర మథితము,పశుపతికి దండాహత తక్రము తెచ్చి ఇవ్వు.’.

“అలాగే !” అంటూ పార్వతి వంటింట్లోకి వెళ్లింది. పశుపతికి వీర్రాజు మాటలు కుతూహలాన్ని కలిగించాయి. “ వీర్రాజు గారూ ! దండాహత తక్రము అంటే ఏమిటి ?” అని అడిగాడు.

“తక్రము అంటే మజ్జిగ ! పెరుగుకి రెట్టింపు నీళ్లు కలిపి, కర్ర కవ్వంతో చిలికి చేసింది కాబట్టి
దానికా పేరు వచ్చింది. ఇది నిక్కాక, అన్ని రకాల మేహ, ప్రమేహాలకి మంచిది. ‘కర మథితము’ అంటే పెరుగుకి సరిసమానంగా నీళ్లు చేర్చి చేతితో చిలికి చేసేది.”

“మజ్జిగలో ఇన్ని రకాలు ఉన్నాయా ?”

“ చాల రకాలు ఉన్నాయి, బాబూ ! మథితము, మిళితము, శోలము,కాల్కేయము,, కర మథితము, దండాహత తక్రము, ఉదశ్వితము , అతి మిళితము అనే రకాలు ఉన్నాయి. అలాగే పెరుగులో కూడా స్వాదు దధి, మంద దధి, ఆమ్ల దధి, అత్యామ్ల దధి, శితాయుక్త దధి అనే రకాలు ఉన్నాయి. చేసే విధానాన్ని బట్టి మజ్జిగకీ, రుచిని బట్టి పెరుగుకీ ఈ పేర్లు వచ్చాయి.”

“పెదనాన్నా ! ఇదుగో నీ మజ్జిగ.”

వీర్రాజు మజ్జిగ గటగటా త్రాగేసి,“అమ్మా,విస్సు సంగతి ఏమన్నా తెలిసిందా ?” అని అడిగాడు.

“తెలియదు పెదనాన్నా! వాడు,మల్లన్నకలిసి పశువులకి సరుకు జబ్బు అంటించారని కోర్టులో ఋజువయింది కదా, అందుకని వాళ్లిద్దరికీ ఏడాదిన్నర శిక్ష పడింది. వాళ్లు ప్రస్తుతం జైలులో ఉన్నారు.”

“ తెలుసమ్మా పార్వతీ ! ఏడాదిన్నర కావచ్చింది కదా, అందుకే అడుగుతున్నాను !”

పార్వతి విస్మయంతో అతని వంక చూసింది.విస్సంటే పెదనాన్నకి చాలా ప్రేమ ఉంది, అందుకే ఇవన్నీ గుర్తు ఉన్నయని ఆమెకి అర్థమయింది. “ ఇంకా కొన్ని రోజులు ఆగాలి పెదనాన్నా” అంది.

“ మంచిదమ్మా ! ఈ సారి వాడిని తెచ్చేందుకు పట్నం వెళ్లేటప్పుడు పశుపతిని కూడా తీసుకెళ్లు”

“అతను మనతో ఎందుకు వస్తారు పెదనాన్నా!.ఆయనికీ మనకీ ఏమిటి సంబంధం ?”

“అదేమిటమ్మా ! ఇంకా వీడెవరో నీకు తెలియనే లేదా ! వీడు అదే ఈ పశుపతి నీకు బావ వరుస అవుతాడు, నిన్ను పెళ్లాడడానికి వచ్చాడే !—”

వీర్రాజు అకస్మాత్తుగా పేల్చిన ఆ బాంబుకి తక్కిన ఇద్దరూ ఖంగు తిన్నారు. పార్వతే ముందుగా తేరుకొని పారిపోబోయింది. పశుపతి కాల యాపనం చేయకుండా ఆమె జడ దొరక బుచ్చుకొని ఆపాడు, “ చూడండి మామయ్యా ! పెళ్లనే సరికి ఎలా పారిపోతోందో ?” అని వీర్రాజుతో ఫిర్యాదు చేసాడు.

“ పారిపోవడం కాదు సిగ్గుపడుతోంది.” అంటూ పార్వతి ఎడమ చేయి అందుకొని, పశుపతి కుడి చేతిలో పెట్టి, తన పెద్దరికం నిలబెట్టుకొన్నాడు వీర్రాజు.

తన చేతిలోని, పార్వతి చేతిని మృదువుగా నొక్కుతూ , ఆమెకే వినబడేలాగ అన్నాడు పశుపతి. “ పార్వతీ ! నీ నందిని మీద ఒట్టేసి చెబుతున్నాను, ఈ చెయ్యిని ఏనాడూ వదలను,”

పార్వతి బదులివ్వ లేదు. కళ్లు వెడల్పు చేసుకొని పశుపతి వంక చూసింది. ఆమెకి అంతా అయోమయంగా ఉంది. ఉన్నట్లుండి ఈ ఆగంతకుడు తనకి బావ ఎలా అయిపోయాడు ! ఆ సంగతి తన కన్నా ముందుగా పెదనాన్నకి ఎలా తెలిసి పోయింది !! ఆమెకి తట్టుకోలేని కోపం వచ్చింది. ఛర్రున తన చేతిని లాగుకొంది.

ఆమె పరిస్థితిని అర్థం చేసుకొన్నవీర్రాజు,విషయాన్నివివరించి చెప్పాడు. “ ఆ రోజు రాత్రి నందిని ఇతని కాగితాలు పూర్తిగా నమిలెయ్యలేదమ్మా ! మీరు గాభరాలోవాటి సంగతి గమనించ లేదు. మరునాడు ఉదయాన్నే ఆంజనేయుడి గుడికి వెళ్లిన నేను వాటిని వెతికి పట్టుకొన్నాను. ఆ కాగితాల ద్వారా ఇతని తండ్రి పేరు నారాయణ మూర్తిగారని, తల్లి పేరు సరస్వతి అని తెలిసింది. వాళ్ల ఇంటి పేరు లింగం వారు.సరస్వతి ,మీ పెద్దమ్మకి పెద్దమేనత్త అవుతుంది. అంటే నీ తల్లి వసుంధరకి కూడా మేనత్తే కదా ! నిజ నిర్ధారణ చేసుకోడానికి మర్నాడే నేను ఇతనిని ప్రశ్నించాను కాగితాలు తిరిగి ఇస్తూ..నిజమేనని అంగీకరించాడు, కాని నీతో చెప్ప వద్దని అన్నాడు, నిన్ను ఆట పట్టించడానికి ! ”

“ ఇతన్నిపెళ్లి చేసుకోవాలంటే నాకు అన్నినిజాలు తెలియాలి పెదనాన్నా! చుట్టరికం ఉన్న పెద్దమనిషి నేరుగా ఇంటికి రాక, మర్రిచెట్టు దగర ఉయ్యాల వెయ్యడం దేనికి ? బస్తీలో ఈయనగారు వెలగ బెడుతున్న ఉద్యోగం ఏమిటి ? లేప్ టాప్ ,క్రెడిట్ కార్డులు ఉన్నంత మాత్రాన సంపాదన పరుడే అని ఎలా నమ్మడం ? తొందర పడకు పెదనాన్నా ! నాకీ వివాహం సమ్మతం కాదు—”

“ బాబూ ! పార్వతికి నువ్వే నచ్చచెప్పు.దాని అంగీకారం లేనిదే నేనే పనీ చెయ్యను !”

పశుపతికి తన వివరాలు చెప్పక తప్పలేదు. ఆ ఊర్లో ‘దెయ్యాల దిబ్బ’ లీజు తీసుకొన్న సంగతి, ఊరికి రాగానే వీర్రాజు మామయ్య గారి గురించి అడిగితే ఎవరూ జవాబు ఇవ్వలేదనీ, ఊరి చివర పంచములుండే చోట అడిగితే, ఆ కుటుంబాన్ని వెలి వేసిన సంగతి తెలిసిందనీ, పార్వతి మంచి నీళ్ల కోసం చెరువు గట్టుకి అర్ధరాత్రి వెళ్తుందనే నిజం తెలిసాయనీ చెప్పాడు. అప్పటికే రాత్రి అయిపోవడం వల్ల పార్వతిని కలుసుకోవడానికి చెరువు దగ్గరే కాపలా కాసానని , ఒంటరిగా వస్తున్న ఆమెను చూసి ఆట పట్టించాలని ఉయ్యాలలొ దాగానని చెప్పాడు. అంతా చెప్పిన తరువాత తాను నిరుద్యోగిననీ వాళ్లు, విశ్వపతి , మల్లన్న సహాయం చేస్తే వ్యవసాయం చేస్తానని అన్నాడు.

పశుపతి చెప్పిన వివరాలు చెవులు రిక్కించి విన్నారు వారిద్దరూ.

*********

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద