Skip to main content

రత్న గర్భ యీ వసుంధర 6

రత్న గర్భ యీ వసుంధర 6

జైలు నుండి విడుదల అయ్యాక విశ్వపతినీ, మల్లన్నలనీ వీర్రాజు కుటుంబంతో సహా, పంఛాయితీ విధించిన జరీమానా చల్లించేసి, ఆంజనేయ స్వామి గుడి దగ్గర , ప్రాయశ్చిత్తం చేయించాడు పశుపతి.

ఆ వెంటనే ఊరు ఊరంతటికీ అన్న సంతర్పణ పెట్టించాడు.

ఆ సంతర్పణలో, తెల్లని మల్లులాల్చీ, పైజామాతో అచ్చు రాజ కుమారుడి లాగ కనిపిస్తూ, అంతటా కలయ తిరుగుతున్న పశుపతిని చూసి, పెద్ద బుగత హేమ చంద్రం అసూయకి లోనయాడు. ఉత్సాహంతో, ఉల్లాసంతో బాబాయిలు, పిన్నులతో కబుర్లు చెప్తున్న పార్వతి ముఖ చంద్రిక అతని అసూయా ధూమాన్ని మరింత రెచ్చగొట్టి ఎగదోసింది.సంతర్పణ జరుగుతూ ఉండగా, పశుపతి తాను ఆ ఊరికి ఎందుకు వచ్చాడో అక్కడున్న వారందరికీ చెప్పాడు.అందరి సహాయ సహకారాలు అర్థించాడు.

దెయ్యాల దిబ్బ మీద వ్యవసాయం అనగానే,పిచ్చి వీర్రాజుకి తగిన అల్లుడే దొరికాడని భావించారు ఆ ఊరి పెద్దలు ! ఆ మాటలు విన్న హేమ చంద్రం చూపుల నుండి అసూయా మేఘం తొలగి, కుతూహలం తొంగి చూసింది. “ దెయ్యాల దిబ్బ మీద వ్యవసాయం చేస్తావా? నీ కేదైనా పిచ్చిగాని పట్టిందా, రక్తం కక్కుకొని ఛస్తావు జాగ్రత్త ! ” అన్నాడు బిగ్గరగా.

అందరి మనసుల లోనూ అదే అనుమానం మెదులుతున్నా , బిగ్గరగా బయటికే అనేసిన పెద్ద బుగత మీద ఎందుకో వెగటు కలిగింది. వారికి.

“ ఆ అబ్బాయికి దెయ్యాల మీద నమ్మకం లేదేమో !” సర్ది చెప్పారు కరణం గారు.

“ దెయ్యాలకి కావలసినది హింస ! దాని వల్ల కలిగే పైశాచిక ఆనందం ! నమ్మకం ఉండి దేవుడి శరణు చొచ్చిన వాళ్లని అవేమీ చెయ్యవు.నమ్మకం లేని వాళ్లని,నమిలి మింగేస్తాయి. ఆ పైన ఉన్నవాడు కూడా కాపాడ లేడు” అన్నాడు హేమ చంద్రం.

“ పైశాచిక ఆనందం దెయ్యాలకే కాదు, హింసా ప్రవృత్తి గల మనుష్యుల లోనూ ఉంటుంది ప్రెసిడెంటుగారూ! దెయ్యాలని తప్పుపట్టడం ఎందుకు లెండి ! దేనినైనా ఎదిరించి మనోధైర్యం కలిగి ఉంటే ఎవరికీ భయ పడవలసిన అవసరం లేదు.” అని బదులిచ్చాడు పశుపతి.

పశుపతి మాటలు చురుక్కుమని తగిలినా ,“ సరే బాబూ ! ఏదోకావలసిన వాడవని, మా పార్వతిని పెళ్లి చేసుకోబోయే వాడవని హితవు చెప్పాను. దానిని హింస అనుకొంటే ఎలా ? అయినా నువ్వీ కాని పని ఛేయాలనుకొన్నప్పుడు నేనెందుకు ఆపడం ! నీ ఇష్టం వచ్చినట్లు తగలడు ! ఆ పైన ఏమయినా నన్ను తప్పు పట్టకు,” అన్నాడు హేమ చంద్రం.

సంతర్పణ జయప్రదంగా ముగిసింది
.
*******************

స్వస్తి శ్రీ చాంద్రమాన వికృతి నామ సంవత్సర మార్గశీర్ష శుధ్ధ తదియ ,తేదీ ౮.౧౧.౨౦౧౦ పూర్వాషాడా నక్షత్ర యుత బుధవారం నాడు వీర్రాజు నిర్దేశించిన స్థలంలో ‘గోరీలు’ కట్టేందుకు , కొలతలప్రకారం మార్కింగు చేసి, పట్ణం నుండి తెప్పింఛిన,,‘ఎస్కవేటర్ని ఆ స్థలం తవ్వమని ఆదేశాలు ఇచ్చాడు పశుపతి. వలయాకారంగా ఉన్న వేదిక మీద, రాక్షసి డైనాసోర్ లాగ ఉన్న ఆ ఎస్కవేటర్ అనుకొన్న దానికన్న ముందుగానే రెండున్నర గంటల సమయంలోనే గొయ్యి తవ్వేసింది. ఆ స్థలం లోని మన్నుని చాల దూరంగా గిరాటు వేయించాడు పశుపతి. ౨౭ అడుగుల వెడల్పు ,౬ అడుగుల పొడవు, ౪ అడుగుల లోతు గల ఆ గొయ్యిని , ముందుగానే చేయించి తెప్పించిన ఏడు కర్ర పలకలతో మూడు అడుగుల దూరంలో అమర్చి, ఆ గోతిని తొమ్మిది కంపార్టుమెంట్లుగా విభజించాడు. ఆ పైన ఆ కంపార్టుమెంట్లలో నీళ్లు జల్లించి, గోమయంతో అలికించి, పసుపు రంగు బియ్యం పిండితో ఏవేవో ముగ్గులు వేయించి, అత్తరు జల్లి, ధూపం ఇచ్చాక, వాటిలో కుడినుండి ఎడమ వైపుకి, వరుసగా నెంబర్లు వేసి ఉన్న గుడ్డ బొమ్మలని పెట్టించాడు వీర్రాజు.

కుడి నుండి ఎడమ వైపుకి వరుసగా పెట్టిన బొమ్మలలో మొదటిది ఇస్మాయిల ఖాన్, రెండు మూడు, నాలుగు బొమ్మలు హర్షద్ హఫీజ్, జావేద్, షోహెబ్, లది, అయిదు,ఆరు బొమ్మలు బడా అబ్దుల్ రహమాన్, బాబర్ ఇమ్రాన్ లది. ఏడు, ఎనిమిది బొమ్మలు అబ్దుల్ రజాక్ ,ఫహాదుల్లా లవి.

బొమ్మలని వాటిలో పెట్టేసాక ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లి పోయారు అందరూ. ఎస్కలేటర్ని పట్నం తిరిగి పంపించేసి,మరో రెండు రోజుల తరువాత రమ్మని చెప్పాడు,పశుపతి.

ఆ రోజు రాత్రి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తూ గడిపారు అందరూ..

*******************

మరునాడు ఉదయం అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ భయ భ్రాంతులని చేసింది. తొమ్మిది బొమ్మలు చిరిగి తునా తునాకలుగా చేసి విసిరేయబడ్డాయి. గోతులలో ఆకులు అలమలు,చెత్తా చెదరం వచ్చి చేరాయి. మట్టిని దూరంగా పోయించడం వల్ల కాబోలు, అలా ఉండి పోయింది గాని, లేకపోతే దానితో గోతులు తిరిగి కప్పబడి ఉండేవి !

వీర్రాజు వాటిని చూసాడు. “ బాబూ ! అశాంతితో నిండిన ఆత్మలు నీ ఆహ్వానాన్ని నిరశన తెలపడం మనం ఊహించినదే కదా ! అయితే అవి బొమ్మలని మాత్రమే చీల్చాయి, మరే విధమైన భీభత్సాన్ని సృష్టించ లేదు.ఈ రోజు కూడా ప్రయత్నించి చూద్దాం.ఈ రోజు వాటికి బలి ఇచ్చితృప్తి పరుద్దాం,” అన్నాడు పశుపతితో.

“ మామయ్యగారూ! బలి అంటే వాటి కోసం కోళ్లు,మేకలు కొయ్యాలా ?”

“ లేదు బాబూ ! వాటికి గొడ్డు మాంసం ఇష్టమని చెప్పి, గొడ్డుని బలి ఇయ్యలేము కదా ! వాటి కోసం మరో జీవిని హత్య చేయకూడదు ! పెరుగు కుండలో అటుకులు వేసి, నిమ్మకాయలు వేసి పెడదాం వాటి స్పందన ఎలా ఉంటుందో చూద్దాం !” అన్నాడు.

“ బావా ! సంగీతానికి వశీభూత శక్తి ఉంటుందని అంటారు.బలితో పాటు వాటికి ఇష్టమైన సంగీతం వినిపిస్తే --” అంది పార్వతి.

పశుపతికి వాళ్లు ఇచ్చిన సలహాలు నచ్చాయి..రెండో సెట్టు బొమ్మల మీద ఉర్దూలో ౭౮౬ అని, దాని దిగువ వాళ్ల పేర్లు కూడా వ్రాయించి, ,చంద్రుడు చుక్క చిత్రం వేయించి వాటికి తగిలించాడు.ఆ తరువాత పెరుగు కుండని గోరీ తల దగ్గర పెట్టి, దాన్లో అటుకలు,అడ్దుగా కోసిన నిమ్మకాయలు వేసి పెట్టింఛాడు. ఆ తరువాత, చక్కటి, ప్రశాంతమైన సూఫీ సంగీతం రాత్రంతా వినిపించే లాగ ఏర్పాటు చేసాడు.

మర్నాడు ఉదయానికి వాటిలో మొదటి మూడు బొమ్మలు గోరీలలో అలాగే ఉన్నాయి. వాటి కోసం పెట్టిన బలి ఖాళీ అయిపోయింది.తక్కిన ఏడు బొమ్మలూ చిరిగి పేలికలయి.కనిపించాయి.వాటి కోసం పెట్టిన పెరుగు కుండలు బ్రద్దలయి ఉన్నాయి.

ఆ దృశ్యాన్ని చూసిన వీర్రాజు ముఖంలో చిరునవ్వు వెలిగింది.“బాబూ ! మొదటి మూడు ఆత్మలు నీ బలిని, ఆహ్వానాన్ని అంగీకరించాయి.రేపు మరో మూడు రాజీకి రావచ్చు.మొత్తం నీ దారికి రావడానికి కొంత సమయం పట్టవచ్చు !” అన్నాడు.

ఆ తరువాతి రోజు వీర్రాజు అన్నట్లుగానే మరో మూడు ఆత్మలు శాంతించిన చిహ్నాలు కనిపించాయి.మళ్లీ మరో ప్రయత్నం చేసాడు పశుపతి.చివరి సారిగా ఆ ఆత్మలన్నీ ఆహ్వానాన్ని అందు కొన్నాయి.పట్నం నుండి,ఎస్కవేటర్ కూడా వచ్చింది.

పశుపతి ఆ గోరీల చుట్టూ ప్రహరీ గోడ కోసం నలు ప్రక్కలా పునాదులు తవ్వించాడు.తొమ్మిది స్తంభాలు కూడ ముందు నాలుగు, వెనక అయిదు చొప్పున ౨౦ అడుగుల పొడవు గలవి పాతించాడు.. గోతులని రాతి పలకలతో మూయించి వాటి మీద సమాధి కట్టించాడు.ఆ సమాధిని, తెలుపు.ఆకుపచ్చా రంగు టైల్సుతో అలంకరించాడు.ఆ విధంగా సమాధుల నిర్మాణ కార్యక్రమం ముగిసింది.

“బావగారూ ! ఆ స్తంభాలను ఎందుకు పెట్టించారు?” అడిగాడు విశ్వపతి.

“ విస్సూ ! ఆ తొమ్మిది స్తంభాల మీద ఒక గ్రిల్ పెట్టించి ,సౌర విద్యుత్తు బేటరీలు బిగించుతాను. బేటరీలు రేపటికల్లా వస్తాయి.వాటి నుండి ఉత్పత్తయిన విద్యుత్తుతో ఈ సమాధుల చుట్టూ దీపాలు, వెలిగించ వచ్చు, అలాగే చక్కటి సంగీతం వినిపించ వచ్చ !” అని బదులిచ్చాడు.

పశుపతి చెప్పినట్లే సౌర విద్యుత్తు బేటరీలు వచ్చాయి.వాటిని బిగించడం జరిగింది. ఆ తరువాత బోరు డ్రిల్లు తెప్పించి ,బోరు తవ్వించాడు అయిదు అంగుళాల నీటి మట్టం పడడంతో అందరూ సంతోషించారు.అక్కడ నీరు పడుతుందని తెలిస్తే, ఇంత కాలం అది దిబ్బగా పడి ఉంటుందా! అని ఆశ్చర్య పోయారు కొందరు పెద్దలు. ఏది ఏమైనా ఆ ప్రయత్నం చేసి విజయం సాధించి నందుకు, అభినందించారు,

నీరు,భూమి,సౌర విద్యుత్తు లభించడంతో, బేంకు పశుపతికి లోను మంజూరు చేసింది.అతను ఆ భూమిలో వాణిజ్య పంటను పండిస్తా ననడం కూడ బేంకు యజమాన్యానికి నమ్మకాన్నిఇనుమడింప జేసింది.

ఇంకేముంది ! తొమ్మిది ఎకరాల స్థలంలో, ఇంధన తైలం మొక్కల ( జరాత్రోఫ్ బయో ఫ్యూయల్ ) విత్తనాలు తెప్పించి వాటిని సాగు చేసేందుకు పూనుకొన్నాడు. ప్రతీ ఎకరానికి తన సమాధిలో నిద్రిస్తున్నఆత్మల నెంబర్లని ఆ పొలం మధ్యలో బోర్డు మీద వ్రాయించాడు.వినాశనం చేయడం కన్న నిర్మాణం చేయడం వల్ల ‘అల్లా’ అనుగ్రహాన్ని త్వరగా పొంద వచ్చునని వాటి మీద వ్రాయించాడు.అలా చేయడం వల్ల వాటి మధ్య పోటీ పెరిగి ,పంట వేగంగా సాగు కొస్తుందని ఆశించాడు.

అతను ఆశించినట్లే జరిగింది.మొక్కలు త్వరితంగా ఏపుగా పెరిగి కాపు కొచ్చాయి.వాటి కాపుని ‘ ఇన్ ష్యూర్ ’చేసాడు.. ఆ తరువాత దివాణంలో ఉన్న భవనాన్నిమరమ్మత్తు చేయించి, రంగులు వేయించి అందంగా తీర్చిదిద్దాడు. ఆ భవనం క్రింది భాగంలోని గదిలో ‘డీజిల్ జనరేటర్’ పెట్టించి, ఆ భవనానికే కాక మొత్తం ఫారానికే నిరంతర విద్యుత్తుని సరఫరా చేయించే ఏర్పాట్లు చేయించాడు. ఇదంతా తన బందు వర్గ సభ్యులయిన వీర్రాజు, విశ్వపతి, పార్వతి, మల్లన్నల సహాయ సహకారాలతో సాధించ గలిగాడు.

ఆ తరువాత రంగులీనే ఆ అందాల భవనంలో వీర్రాజు కన్యాదానం చేయగా , విశ్వపతి పెళ్లి పెద్ద అయి భాద్యతలు నిర్వహించగా , తన స్వప్న సుందరి అయిన పార్వతి, పాణిగ్రహణం బంధు మిత్రుల సమక్షంలో చేసి, ఆ భవంతిలో గృహ ప్రవేశం చేసాడు.

ఆమె చేతిని అతను అనురాగంతో, ఆప్యాయతతో అందుకొన్నాడు. అతని చేతిని ఆమె నమ్మకంతో, బాధ్యతతో అందుకొంది.

వారి దాంపత్య జీవిత భూరుహం వ్రేళ్లు తన్ని, రెండు శాఖలు కూడా వేసింది.

ఈ లోగా చాల మార్పులు జరిగాయి. వీర్రాజు స్వర్గస్థుడయ్యాడు.విశ్వపతి ప్రెసిడెంటు ఎలక్షన్లో నిలబడి, తన చిర కాల ప్రత్యర్థి అయిన పెద బుగత హేమ చంద్రాన్ని,చిత్తుగా ఓడీంచాడు. విశ్వపతి పంచాయితీకి ప్రెసిడెంటు అయ్యాక ఆ ఊరికి రోడ్దు పడింది. మిడిల్ స్కూలు కాస్తా హైస్కూలు అయింది. ఇరవై పడకల ఆస్పత్రి కట్టించ బడింది. ఆ ఆస్పత్రికి పెద్ద డోనర్ పార్వతే అయింది ! పశుపతి తన ఫారంలో ఎంతో మందికి ఉపాధి కల్పించి గ్రామస్థుల అభిమానాన్ని పొందాడు.

***************
అంత అభివృధ్ధి జరిగినా పశుపతి మనసు శాంతించ లేదు.

ఒక రోజు పార్వతితో తనకి వచ్చిన ‘ఈ మెయిల్” ఆఫర్ని చూపించి చర్చించాడు
.
నార్తు అమెరికాలో,భూములని లీజు క్రింద తిసుకొని ‘వరి,గోధుమ ’ పంట పండించ వచ్చనీ,అలా చేస్తున్న ఒక ‘ఎన్.ఆర్.ఐ’ మిత్రుడు పంపిన ఈ మెయిల్ అది !

పార్వతి విదేశాలకి వెళ్లవద్దంది.హాయిగా ఉన్న ప్రాణాన్ని కష్టాలకి గురి చేసుకోవడం దేనికని ఎదురు ప్రశ్నవేసింది. పశుపతి దానికి బదులుగా , ఆమె జీవితాన్నే ఉదాహరణగా చూపాడు.

“ పార్వతీ ! నువ్వు స్త్రీవి అంటే ప్రకృతివి ! ఊరు ఊరంతా వెలి వేసాక,నువ్వు కేవలం వంటింటికీ, గోశాలకీ పరిమిత మయ్యవు ! నేను పురుషున్ని ! ప్రకృతివైన నీవు శక్తికి ప్రతీకవైతే నేను ఆ శక్తిని వెలికి తీసి వినియోగించ గలిగే కర్మవీరుణ్నైన పురుషున్ని ! నేను వచ్చి నా చేయిని ఊత నివ్వగానే , నువ్వు వెంటనే వెళ్లి, ప్రెసిడెంటుని ఎదిరించి వచ్చావు కదా ?”

“ అవ్వును బావా ! నీ తోడు దొరికాక నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.అయినా ప్రకృతి ,పురుషుడు అంటూ మొదలెట్టావేంటీ ?” అడిగింది పార్వతి.

“ వెలి వేసాక,నీ సామర్థ్యం సంకుచిత పరిధిలో ఏ మాత్రమూ వికసించ లేక పోయింది.అవునా ?”

“ అవును ఇంతకీ ఏమంటావు నువ్వు ?”

“ ప్రకృతి కూడా అంతే పార్వతీ ! కంచెలు కట్టి ,ఎల్లలు,బిగించి ఆంక్షలు పెడితే భూదేవి సామర్థ్యం కూడా సంకుచిత మవుతుంది.”

పార్వతికి ఏదో అర్థమయీ అర్థమవనట్లయింది. “ వివరించి చెప్పు బావా!”అంది.

“ నీ జీవితంలో పురుషుడనైన నేను ప్రవేశించాక,కంచెలు,ఎల్లలు త్రెంచి వేసాక, అది విశాలమై విస్తరించి నిత్య కళ్యాణం పచ్చతోరణం అయింది ఇందులో నేను చేసినది స్వల్పమే ! నీ పెదనాన్న.నీ తమ్ముడు, మీ ఊర్లో ని ‘దెయ్యాల దిబ్బనే‘ నేను సమర్థవంతంగా సాగు చేయించ గలిగాను,అంతే ! ఏ ఊరయితే నిన్ను వెలి వేసిందో ఆ ఊరే నిన్ను ఈ నాడు నెత్తికెక్కించుకొంది--”

పార్వతికి అర్థమయింది. అయినా జవాబివ్వ లేదు. మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మరో మూడు రోజుల తరువాత, పశుపతితో అంది,“బావా ! ‘యీ వసుంధర రత్న గర్భ !!’ప్రకృతికి సరిహద్దులు,విజేతలైన పురుషులకి విశ్రాంతి ఉండ కూడదని ,అదే విశ్వవికాస రహస్యమని, విశ్వ మీమాంస అంటే అదేనని తెలుసుకొన్నాను ! నా మూర్ఖత్వానికి క్షమించు! నార్తు అమెరికా పోదాం పద !” అని. పశుపతి ఆమె నిర్ణయానికి పులకించి పోయాడు.

(సమాప్తం)

*******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ