Skip to main content

వేణీ సంహారము

వేణీ సంహారము


(1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది)

నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది !

ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది.

ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అదృష్టం !.అలాంటి నా నీలవేణి, నాలుగు నెలలుగా, నిర్లిప్తతతో శూన్యం లోకి చూస్తూ, అప్ప్పుడప్పుడు అరుస్తూ, మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తోంది !

నిన్నటి నీలవేణిని స్వంతం చేసుకొని ఆ అనంత సౌందర్యానికి తృప్తి చెందిన మనస్సు, మబ్బు కమ్మిన చందమామలా మారి పోయిన నేటి నీలవేణి మీద జాలితో, ఆందోళనతో, దైన్యాన్ని కలిగిస్తూ ఉంటే పెద్ద పోలీసు ఆఫీసర్నే అయినా, ‘ఇప్పుడెలా ? ఏం చేయాలి? ’ అన్న ప్రశ్నలతో ఏమీ చేయలేని నిస్సహాయతతో సమస్యగా ఘనీభవించి దిక్కు తోచకుండా పోయంది. !

రుక్మిణీ నాధ శాస్త్రి గాయత్రీ ఉపాసకుడు , జ్యోతిష విద్వాంసుడు, రామాలయ పూజారి. అతనితో నేను నా సమస్యని చెప్పుకొన్నాను.

“అమ్మాయికి ఎప్పటినుంచి ఇలాగ ఉంది ?” అతను నీలవేణిని, ‘అమ్మాయి’ అనే పిలుస్తారు.

“ నాలుగు నెలల క్రిందట, మా అత్తవారింటికి పండగలకి వెళ్లినప్పుడు ఒక దుర్ఘటన జరిగింది. ఆమె దూరపు వరస మేనత్త కొడుకు, మామయ్యగారి మూడంతస్తుల మేడ డాబా మీదనుండి క్రింద పడి, తల పగిలి చనిపోయాడు..ఆ సమయంలో నీలవేణి డాబా మీదనే ఉండి, ఆ దుర్ఘటనని కళ్లారా చూసింది. అప్పటి నుంచీ ఇలా అయింది,.” చెప్పాను నేను. ‘ నిజంగా అది దుర్ఘటనేనా !’ అన్న అనుమానం ఇప్పటికీ పీడిస్తూనే ఉంది, నా పోలీసు బుర్రని ! ‘అది దుర్ఘటన కాక, హత్య అయి ఉంటే , నీలూకి ఇందులో ఏమైనా సంబంధం ఉందా ? అందుకే ఇలా అయిందా ?’ సమాధానం దొరకని ప్రశ్నలు !! నా తలని తొలిచేస్తున్నాయి.’

“ అమ్మాయి అప్పుడప్పుడు అరుస్తూ ఉంటుందన్నారు కదా, ఏమని అరుస్తుంది ?”

“ వద్దు,వద్దు, నా జత్తు కత్తిరించ వద్దు,అంటూ అరుస్తోంది.” జవాబిచ్చాను. ‘ ఈ జుత్తు కత్తిరించడ మేమిటో ! చాల చిత్రంగా ఉంది.,’ అనుకొన్నాను మనసులో.

“ డాబా మీద అమ్మాయి, అతను తప్ప, ఇంకెవరైనా ఉన్నారా ? ” ‘పోలీసు లాగే అడుగుతున్నా రితను ! ఎవరైనా ఉండి ఉంటే నేనే రహస్యాన్ని భేధించి ఉండే వాణ్ని కదా !’ “ మనుష్యులెవరూ లేరండీ ! కాని అతను అంటే ఆ బావ ఎంతో ముచ్చట పడి తెచ్చుకొన్న ఒక తాబేలు ఉంది. ”

“ తాబేలా ?”

“ అవునండీ ! డిప్పమీద నక్షత్రాలు గల తాబేలు ! దానిని విరూపాక్ష తాబేలు అని పిలిచేవాడు ”

“ విరూపాక్షుడు అంటే ఎగుడు,దిగుడు కన్నులు కలవాడు, అనగా శివుడు, అని అర్థం ! తాబేలు డిప్ప మీద ఎగుడు దిగుడుగా నక్షత్రాలలాగ కనిపించే రేఖా చిత్రాలు ఉంటాయి కాబట్టి దాన్ని విరూపాక్ష తాబేలు అని పేరు పెట్టాడన్న మాట !

“ అవునండీ !”

“ విరూపాక్ష కఛ్ఛపం అంటే ఏదో విషయం ఙ్ఞాపకం వచ్చింది బాబుగారూ ! ఉండండి ఇప్పుడే వస్తాను, ” అంటూ ఇంటి లోపలికి వెళ్లి , కాసేపటి తరువాత ,చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకొని వచ్చాడతను. అదేదో తంత్రానికి సంబంధించిన పుస్తకమయి ఉంటుంది, ఎందుకంటే దాని మీద ‘కాళీ మాత ’ బొమ్మ వేసి ఉంది. ఆ పుస్తకంలోకి చూస్తూ, “ మీ మామయ్యగారి ఇంటికి నాలుగయిదు సార్లు వచ్చాను నేను, వాళ్లింటిలో ఒక ‘మూగపిల్లి’ ఉండేది అవునా ?”

“అవునండీ !”

“ ఇప్పుడు కొంచెం కొంచెంగా విషయం అర్థమవుతోంది.”

“ ఏ విషయం శాస్త్రిగారూ ?”

మూగపిల్లి, విరూపాక్ష కఛ్ఛపాలకి, స్త్రీ కేశాలకీ ఉన్న ప్రయోజనం. యీ తంత్ర పుస్తకంలో వివరించ బడింది.అమ్మాయి మేనబావ బ్రహ్మచారి, తాంత్రిక సాధకుడు అయి ఉంటాడు. అంటేనా ?”

“ నాకు తెలియదండీ, మూగ పిల్లి సంగతి మొదట్లో నాకు తెలియదు. ఏం చేసినా ఇది అరవ దేమిటా ! అని అనుకొనే వాణ్ని, నీలూవే చెప్పింది, అది మూగపిల్లి అని.” శాస్త్రిగారి మాటలు నాలో ఉత్సాహాన్ని కలిగించాయి.

“ డాబా మీద ‘విరూపాక్ష తాబేలు’ ఉన్నవిషయం ఎలా తెలిసింది ?”

‘పత్తేదారులాగ ప్రశ్నలు వేస్తున్నాడితను ! ఏం కనిపెట్టాడో త్వరగా చెప్తే బాగుండును !’ అయినా నాకు తెలిసింది చెప్పాను,“ నీలూవే చెప్పింది.ఆ దుర్ఘటన తరువాత, ఆమె తెలివితో మాట్లాడిన మాట అదొక్కటే ! ‘ఏమండీ ! పాపం ! ఆ తాబేలుని తీసుకెళ్లి చెరువులో వదిలెయ్యండీ !’ అని చెప్పి, ఆ తరువాత, గట్టిగా అరిచి స్పృహ కోల్పోయింది.”

“సరే బాబుగారూ! విషయం చూచాయగా అర్థమయింది.తాంత్రిక విషయాలు మీతో చెప్పిలాభం లేదు గాని, అమ్మాయికి ఎలా బాగవుతుందో చెప్తాను వినండి.”

“ శాస్త్రిగారూ ! తాంత్రిక ప్రయోగాలేవైనా జరిగాయంటారా ?” ఆదుర్దాతో అడిగాను.

“బాబుగారూ! అలాంటి ప్రయోగాలు ఇంటి డాబా మీద జరగవు.ముందు అమ్మాయిని కోలుకో నివ్వండి ఏం జరిగిందో అమ్మాయే చెప్తుంది.”.

“ నిజమేనండీ ! ఆమె కోలుకోవడం ముఖ్యం !”

“ అమ్మాయి కోసం మీరు కొన్ని ఆచారాలు, పూజలలో రాజీ పడక తప్పదు ! “నా వైపు నిశితంగా చూస్తూ అన్నారతను గంభీరంగా. అమ్మాయి తన జుత్తుని కత్తిరించ వద్దని ఎందుకలా భయ పడుతోందో, సుమారుగా తెలుసుకొన్న నేను, మీకు ఒక ఉపాయం చెప్తాను తప్పకుండా చేయండి. ఆమెను ‘ప్రయాగ’, త్రివేణిలో స్నానం చేయించి, అక్కడ తీర్థ పురోహితుల చేత పూజ చేయించి, ‘వేణీ దానం’ చెయ్యండి. “

“ వేణీదానమా ! అంటే ?”

“ అమ్మాయి తల నీలాలని కత్తిరించి, దానం చేయడాన్ని వేణిదానం అంటారు. అది ప్రయాగలో చేస్తే పుణ్యస్త్రీకి , వైధవ్యం ఉండదని నమ్మకం ! “

“ జుత్తు కత్తిరించ వద్దని,అరిచి గోల పెడుతున్న నీలూ ,వేణీదానం చేస్తే ఊరుకుంటుందా ! అసలు అలా చేయనిస్తుందా ?”

“ కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబుగారూ!ఆచరణ ద్వారానే నిజ నిర్ధారణ జరుగుతుంది.”

“ అలాగే, వస్తానండీ !” అంటూ అతని నుండి సెలవు తీసుకొన్నాను.

త్రివేణీ సంగమ స్థలానికి, వెళ్లే పడవ మీద కూడ నీలవేణి అరిచింది.“నా జుత్తు కత్తిరించ వద్దు ,” అంటూ.నేను ఆలోచనలో పడ్డాను. నీలవేణికి ’ తన కేశాలంటే ఎంతో మక్కువ ! ఆ మాటకొస్తే నాకు కూడా మక్కువే ! అంతటి అపురూపమైన దేవుడి వరాన్ని దానమివ్వాలా ? నీలవేణి తట్టుకోగలదా, పిచ్చి మరీ ముదిరిపోదు కదా !‘

త్రివేణి దగ్గరి బల్లకట్టు మీదనుండి క్రిందకి దిగి, నీలవేణి తలారా స్నానం సరదాగా చేసింది. నేను కూడా చేసాను.నావ మీద ఎక్కి తడి బట్టలు పిండుకొని, కొత్తవి ధరించాను. నీలవేణి కూడా కొత్త చీరని చూడగానే అర్థం చేసుకుంది. “ మీ పంచెను అడ్డం పట్టుకోండి”,అంటూ నా పంఛె మరుగున తన తడి బట్టలు విప్పి,కొత్త చీర కట్టుకొంది ! అంతే కాదు,తడి బట్టలు పిండుకొని ప్లాస్టిక్ సంచీలో పెట్టింది. ఇద్దరం తీరానికి వచ్చాం.

మా కోసం కేటాయించిన స్థలంలో, పురోహితుని ముందు కూర్చొన్నాం. మాలాంటి జంటలు ఎంత మందో ! ఆ జంటల, జంట నయనాలన్నీ నీలవేణి కేశాల పైననే ! పురోహితుడు మంత్రాలు చదివి, నీలవేణిని నా ఒడిలో కూర్చోమన్నాడు. నీలవేణికి అంతా సరదాగా, వింతగా ఉంది. నా తొడ మీద కూర్చొంది. చివరికి ఆ సమయం రానే వచ్చింది. దువ్వెనతో నీలవేణి కేశరాశిని దువ్వసాగాను,నీలవేణి ముచ్చట పడుతూ చూసింది. మూడు పాయలుగా చేసి ఒదులుగా జడ అల్లాను. బుధ్ధిగా వేయించుకొంది. ముఖనికి పసుపు వ్రాసాను, బొట్టు పెట్టాను. ఆ తరువాత, ~ ~ ఆ తరువాత ~ ~ ఆమెకి కనబడకుండా దాచిన కత్తెర తీసి , జడని పట్టుకొన్నాను. చూట్టూ ఉన్న జంటల్ని చూసిన నీలవేణికి విషయం అర్థమయింది.

“ వేణీదానం చేస్తారా ?” అని అడిగింది

“అవును,” బాధతో జవాబిచ్చాను.

“ భూజాల వరకు కత్తిరించండి! వాడు ~ ~ వాడు ~ దాన్ని పట్టుకొని తన చేతి మీద మెలి పెట్టాడు. నే నింక భరించ లేను, కత్తిరించెయ్యండీ !” అంది.

ఆమె మాటలు వింతగా తోచాయి. ఆ సమయంలో ఇంకేమీ అడగ లేదు.భుజాల వరకు జడ కత్తిరించేసాను. ఆ దృశ్యం చూసిన నీలవేణి కెవ్వున అరిచి నా భుజం మీద వాలి పోయింది. ఆ తరువాత నీలవేణిని లాడ్జి వరకు దాదాపు ఎత్తుకొనే తిసుకొని వచ్చాను.

నీలవేణికి జ్వరం వచ్చింది. అది తగ్గడానికి మూడు రోజులు పట్టింది. ఆశ్చర్యం ! నీలవేణి కూడా కుదుట పడింది ! తన జుత్తును భుజాల వరకు దువ్వుకొని అలాగే వదిలేసి,“ఎలా ఉందండీ ?” అని అడిగింది. ఆమె ముఖం వంక చూసాను.‘పులు కడిగిన ముత్యంలాగ ’ప్రశాంతంగా వెలిగి పోతూ ఉంది.

“ ఎలా ఉందంటే మాట్లాడరేం ?”

“ చాలా బాగుంది నీలూ !”

“ కదూ !? అనవసరంగా బెంగ పడ్డాను. భుజాల వర్కు జుత్తున్న వాళ్లు బాగుండరా ఏం ?”

“ ఎందుకు బాగుండరు ! ఇంకెవరి మాటో ఎందుకు,నువ్వు ఇలాగ,ఇది వరకటి కన్నబాగున్నావు ఇంతకీ నీ ఒంట్లో ఎలాగుంది ?” అని అడిగాను.

“ బాగుందండీ ! నా పిచ్చి కూడా కుదిరింది.”

“ అవేం మాటలు నీలూ, నీకు పిచ్చి ఆని ఎవరన్నారు ?”

“ నాకు తెలుసండీ ! మీరు వేణీదానం చేయించి మంచి పని చేసారు ! దుశ్శాసనుడి లాంటి నా బావ ముట్టుకొన్న జుట్టుని వాడు పట్టుకొన్నంత మేరకి, కత్తిరించి పారేసారు ! ఇప్పుడు నా కెంత హాయిగా ఉందో తెలుసా ?”

“నీలూ ! మీ బావ చనిపోయాడుగా ఇప్పుడతని ఊసు ఎందుకు ?”

“ అది మామూలు చావు కాదండీ !—“

“ అవును నీలూ ! నాకు కూడా అలాంటి అనుమానమే వచ్చింది. నీ జుత్తు వదిలించుకొనే ప్రయత్నంలో నీకు తెలియకుండానే అతనిని మేడ మీద నుంచి తోసేసావు కడూ ?”

“ పొరపాటు కాదండీ ! గ్రహపాటు ! తన తాంత్రిక సాధన కోసం రెండు మూగ జీవాలని బలి తీయబోయాడు ! అయినా మీరు పోలీసు ఆఫీసరు కదా,నిజం చెప్పండి, మనుష్యులని చంపితేనే హత్య అవుతుందా, మూగ జీవాలని చంపితే హత్య కాదంటారా ?”

“ ఎందుకవదు,నీలూ ! దానిని కూడా నేరం క్రిందనే పరిగణిస్తారు. ఇంతకీ మీ బావ హత్య చేయ బోయిన మూగ జీవాలు ఏవి నీలూ ?” నీలవేణి మూడులోఉంది ! ఇప్పుడే ఆ విషయాన్ని రాబట్టాలి’. అనుకొంటూ..

“ మా ఇంట్లో అమాయకంగా తిరుగాడే మూగపిల్లిని పట్టి బంధించి ఒక టిన్ను డబ్బాలో పెట్టాడు. ఎక్కడో వెతికి తెచ్చిన విరూపాక్ష తాబేలుని, పారిపోలెదు గనుక మేడ మీద వదిలాడు, వాటిని బలి చేసి, ఒక పునిస్త్రీ జుత్తుని వాటి రక్తంతో తడిపి, పూజలు ఛేయాలని అన్నాడు. దాని కోసం నా జుత్తు ఇవ్వమన్నాడు. నేను నిరాకరించె సరికి నా జుత్తుని పట్టుకొని , చేతికి మెలి వేసి, కత్తెరతో, కత్తిరించాలని చూసాడు. నేను ఎలా తప్పించుకోవాలో తెలియక, దేవుణ్నే తలచుకొన్నాను. అప్పుడే జరిగిందొక విచిత్రం ! “

“ ఏం జరిగింది ?”

“ టిన్ను డబ్బాలో పెట్టిన పిల్లి పాపం, దాన్ని దొర్లించడం మొదలు పెట్టింది, అరవడానికి నోరు లేదు కదా ! అలా దొర్లుకుంటూ వస్తున్న డబ్బాని, తాబేలు చూసి, అందులో తిను బండారాలు ఉన్నాయని అనుకొన్నాదేమో, దాని మూతని తన నోటితో తీసింది. అంతే ! మూగ పిల్లి హఠాత్తుగా బావ మీద దూకింది. ఆ సంఘటన ఎదురు చూడని బావ, డాబా మీద నుండి,పడిపోయాడు.

ఆమెని దగ్గరకు తీసుకొంటూ అన్నాను, “ నీలూ ! నువ్వు మళ్లీ మామూలుగా మారి నాకు దక్కినందుకు సంతోషంగా ఉంది,”అని.

“ నాకు కూడా సంతోషంగానే ఉందండీ ! ఆ దుశ్శాసనుడు ముట్టుకొని మైలపడిన నా వేణిని ,మీచేతుల మీదుగా సంహారం చేయించుకొని, త్రివేణిలో స్నానం చేసి, పునీతురాలిని అయినందుకు !” అంది.

నేను మనస్సు లోనే రుక్మిణీ నాధ శాస్త్రి గారికి అంజలి ఘటించాను.

**********************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార