Skip to main content

ఎడమ చేతి బొటన వ్రేలు

ఎడమ చేతి బొటన వ్రేలు

( ఈ కథానిక స్వాతి మాస పత్రిక , సెప్టంబరు 2011 సంచికలో ప్రచురిత మయింది).

“ అమ్మా ! పది లక్షల రూపాయలు ఇస్తాను, అది తీసుకొని ఎక్కడికైనా వెల్లిపో !”

కొడుకు మాటలు విని నిర్ఘాంతపోయింది రాజ్యలక్ష్మి. ఆమె వయసు 73 సంవత్సరాలు, ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పని చేసి, పదిహేనేళ్ల క్రిందట పదవీ విరమణ చేసింది.ఒక్కగానొక్క కొడుకుతో దక్షిణ ముంబయిలో, సంపన్నవర్గాల కాలనీలో నివసిస్తోంది.మూడేళ్ల క్రిందట వివాహం కూడా చేసింది.

మనవల కోసం ఎదురు చూస్తూ, ఆ విషయమేదో చెప్తాడనుకొన్న కొడుకు హఠాత్తుగా ఆ మాటనే సరికి, తల దిమ్మెక్కిపోయింది ఆమెకి.

“ మరి నువ్వూ, కోడలు పిల్లా ?” ఎట్టకేలకి గొంతు కూడగట్టు కొని అడిగింది.

“ మేమిద్దరం లండన్ వెళ్లి పోతున్నాం. మాకు అక్కడ మంచి జాబ్ దొరికింది. వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు జరిగి పోయాయి.వచ్చే వారం లోనే ప్రయాణం.”’

“ అలాగా చాల సంతోషం నాయనా ! నేనెక్కడికి పోతాను ? ఈ ఇల్లు---”

“ఇది అమ్మేసాం అమ్మా ! ఆ డబ్బులోంచే నీకు పదిలక్షలు ఇస్తానంటున్నది. ఇంత పెద్ద ఇంట్లో, ఇలాంటి పోష్ కాలనీలో నువ్వు ఉండ లేవు. నీకు ఈ ముంబయి మహానగరం బాగా తెలుసుకదమ్మా! ఏదైనా చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని కాలం గడిపెయ్యి. అంతలా ఉండలేక పోతే ఒక ఏడాది పోయాక మా దగ్గరకి వచ్చెయ్యి.”

రాజ్యలక్ష్మికి అర్థమయింది.తనకింక వారం రోజులే డెడ్ లైన్ ! ఈలోగా వాళ్ల ప్రయాణానికి ముందే తను వెళ్లిపోవాలి. లండన్లో ఉద్యోగాలు వెతుక్కోవడానికి, వీసా, పాస్ పోర్టులు తయారు చేసుకోవడానికి, ఇల్లు అమ్మేయడానికి, వాళ్లకి టైము ఉంది. ఈ అమ్మకు చిన్న గూడు చూడడానికి టైము లేదు.ఎందుకంటే వాళ్లకున్న చాలా గొప్పవి. తను నర్సుగా పని చేసిన నిర్భాగ్యురలు, కనుక తను చూసుకోగలదనే ధీమా వాళ్లకి ఉంది. ఇంకెందుకు ఆలస్యం ?!

రాజ్యలక్ష్మి తన డైరి తీసి, అందులో ‘ సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్’ నెంబరు 1090కి డయిల్ చేసింది. అటునుంచి “హలో” అనగానే తన సమస్యని చెప్పింది.

************

మర్నాడు సాయంత్రం పోలీసు కానిస్టేబిల్ తుకారాం రాజ్యలక్ష్మిని కలిసాడు. తను నివసించే కాలనీలో చిన్న ‘వన్ రూం, కిచెన్, అపార్టుమెంటు ఖాళీగా ఉందని, అద్దె 3500, డిపాజిట్ 25000 కట్టాలని చెప్పాడు.

తల్లి తన సమస్యని ఇంత వేగంగా పరిష్కరించుకో గలదని అతను అనుకోలేదు. ఇంటి బయట నిలబడి ఉన్న పోలీసు జీపుని , యూనిఫారంలో వచ్చిన తుకారాంని చూసి, నమ్మకం కలిగి, ఒక సూట్ కేసులో పది లక్షల రూపాయలు సర్ది తల్లి దగ్గర పెట్టాడు.

“ అమ్మా ! నీకు కావలసిన సామాన్లు ఏమిటో చెప్పు, అన్నీ ఎరేంజ్ చేసి, నీ కొత్త ఇంటికి పంపించేస్తాను.”

సామాన్లు ఏం కావాలో చెప్పమంటున్న కొడుకు వంక నిరుత్తరురాలై చూసింది రాజ్యలక్ష్మి. తుకారాం పరిస్థితి అర్థం చేసుకొన్నాడు.“ సార్ ! సామాన్లు ఏవి కావాలో అమ్మని అడిగి ఇబ్బంది పెట్టాకండి. వృధ్ధులకి ఏయే అవసరాలుం టాయో, ఏయే సదుపాయాలు ఉండాలో, వాటికి ఏయే సామాన్లు కావాలో, ‘సీనియర్ సిటిజన్ ఫోరం’ తయారు చేసిన లిస్టు నా దగ్గర ఉంది. మీరు వాటిని ఎరేంజి చేసి పంపించండి.” అంటూ ఒక లిస్టుని అతని చేతికి ఇచ్చాడు తుకారాం. తర్వాత అమ్మనీ , ఆమె సుటుకేసునీ తన జీపులోకి ఎక్కింఛాడు.

***************

ఆ కాలనీ లోని చిన్న ఇంట్లో రాజ్యలక్ష్మి నాలుగేళ్లు సంతోషంగా గడిపింది.‘ తుకారాం’ పిల్లలిద్దరూ ఆమెని ‘ అమ్మమ్మా’ అని పిలుస్తూ క్షణం వదిలేవారు కారు.అంతే కాదు, ఆ కాలనీ లోని వారందరూ, ఆమెతో బాగా కలిసి పోయారు. దక్షిణ ముంబయి లోని పోష్ కాలనీలో ఎవరితోనూ, సంబంధం లేకుండా, ‘ కొడుకు- కోడలు’ అనే పాశానికి కట్టుబడి, తానింత కాలం ఎందుకు గదిపిందో ఆమెకి అర్థం కాలేదు. అక్కడ నివసించే మనుష్యుల ఆదరాభిమానాలు చూసాక !

అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. చివరి వీడ్కోలు తీసుకొనే సమయం వచ్చి, ఆమె వారినందరినీ దుఃఖంలో ముంచి, తాను మాత్రం ప్రశాంతంగా కన్ను మూసింది. సీనియర్ సిటిజన్ ఫోరంలో, లిఖిత పూవకంగా రిజిస్టర్ చేసిన ఆమె చివరి కోరికని, ఇనస్పెక్టర్ జయంత్ అందరికీ చదివి వినిపించాడు.

‘ రాజ్యలక్ష్మి అనబడే నేను, నలభై ఏళ్లు నర్సుగా పనిచేసిన నాకు జీతాన్నీ, పదవీ విరమణ అయ్యాక, పెన్షన్ నీ, ఇచ్చి ఆదుకొన్న ప్రభుత్వానికి, నా వంతు భాద్యతగా, నా మృతదేహాన్ని అప్పగిస్తున్నాను. మెడికల్ కాలేజీలో అధ్యయనానికి నా అస్థి పంజరం ఉపయోగ పడితే, ఆత్మతృప్తి కలుగుతుంది. నేను మిగిల్చి పోయిన నా వస్తువులు , నా బ్యాంక్ బేలన్సు, నన్ను, ‘ అమ్మమ్మా’ అని ప్రేమతో పిలిచిన, కానిస్టేబుల్ తుకారాం పిల్లలకి ఇచ్చి వేయమని విన్నవించుకొంటున్నాను. నా ఎడమ చేతి బొటన వ్రేలు మాత్రం, నా తదనంతర క్రియా కర్మలకి, వినియోగించ వలసినదిగా ప్రార్థిస్తున్నాను.’ అని

*****************

మూడు రోజుల తరువాత లండన్ నుంచి వచ్చిన , ‘ఈ-మెయిల్ ని’ తుకారాంకి చూపించాడు జయంత్.

“ అయ్యా ! నా తల్లి మరణ వార్త విని నేను చాలా దుఃఖించాను. ఆమ్నె చివరి కోరికని కూడా తెలుసుకొన్నాను. ఇండియా నుండి వెళ్ళ్లిపోయేటప్పుడే ఆమెకి పది లక్షలు ఇచ్చి, నా ఋణం తీర్చుకొన్నాను.కేవలం ఆమె బొటన వ్రేలి కోసం, దాని వెనుకనున్న అంధ విశ్వాసాల కోసం, తిరిగి ఇండియాకి నేను రాలేను. ఆ బాధ్యత లబ్ధిదారుడైన శ్రీ తుకారాం గారికే, అప్పగించ వలసిందని చెప్పండి.”

ఆ సందేశాన్ని సజల నయనాలతో చదివిన తుకారాం “సారూ ! నాకు వారం రోజులు సెలవియ్యండి. నాసికా త్రయంబకం వెళ్లి, అమ్మకి ‘ అంగుష్ట శ్రాధ్ధం ’ చేయిస్తాను” అన్నాడు.

****************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ