గుమ్మం దగ్గర, మోకాళ్ల మీద తల ఆన్చి కూర్చోన్నదల్లా, ఏదో నిర్ణయానికి వచ్చినదాన్లా, గభాలున లేచి, గాజులు గలగలమనేలా చీర కుచ్చెల్లు సర్దుకొంది రాజ్యలక్ష్మి. గదిలో టేబుల్ మీద, లాంతరు వెలుగులో, లావుపాటి బైండ్ పుస్తకం చదువుతున్న, లెక్చరర్ భాస్కరం దృష్టిని ఆమె చర్యలేవీ అలరించ లేక పోయాయి.
ఆమెకి తెలుసు, తన హొయలు, తన వయ్యారాలు, నయాలు, అనునయాలు ఏవీ అతనిని పుస్తకం ముందు నుంచి కదిలించలేవని, అయినా ఆమె తన ప్రయత్నం మాన దలచుకొలేదు.
పది రోజుల నుంచి, ప్రతీ రోజూ ఆమె అనుకొంటోంది, ‘ ఈ రోజు ఎలగైనా అతనితో మాట్లాడాలని !’కాని తొమ్మిది రోజులూ ఆమెకి చుక్క ఎదురయింది.
‘ అందుకే ఈ రోజు చెప్పెయ్యాలని’, గట్టిగా నిర్ణయించుకొని లేచిందామె. గది తలుపులు గభాలున మూసి, బోల్టు బిగించింది. టేబిల్ దగ్గరగా వెళ్లి, అతని ఎదురుగా ఉన్న కుర్చీని జరాల్మని లాగి, అర చేతుల మధ్య ముఖాన్ని ఇమిడ్చి, టేబిల్ అంచు మీదుగా వంగి, తపో భంగం చేయడానికి వచ్చిన అచ్చెరలా కూర్చొంది.
భాస్కరం ఏకాగ్రతకి ఈ సారి భంగం కలిగింది. అతని దృష్టి సులోచనాల మీదగా . పేజీ ఫ్రంటు లైను నుండి, ఆమె .మీదకి మరలింది.
ఎర్రని చివర్లతో, విచ్చుకొన్న తెల్ల కలువల్లాంటి అర చేతులని , ముద్దాడ వచ్చిన చందమామలా ఉంది ఆమె ముఖం. టేబిల్ అంచు అదిమి పెట్టినందు వల్ల, జాకెట్ లోంచి, ఉబికిన ఆమె నున్నను వర్తులాలు ఆ ముఖ చంద్రుని చక్రవాక మిథునాల లాగ ఉన్నాయి !
చిరకాలం నుండి అతనిని ఆశ్రయించి, గర్వ కారణ మయిన చదువు , సమయానికి హెచ్చరించగా , సులోచనాలు సర్దుకొని తిరిగి పుస్తకం మీదకి దృష్టి మరల్చాడు భాస్కరం.!
రాజ్యలక్ష్మి నిరాశతో వెనక్కి వ్రాలి, పైట సర్దుకొంది. వెన్నెలని మబ్బు క్రమ్మినట్లయింది. ‘ ఏమయినా సరే, ఇవాళ ఇతనితో చెప్పెయ్యాలి.’ మనసుని మరీసారి హెచ్చరించి, --
“ ఏమండీ” అని పిలిచింది రాజ్యలక్ష్మి.
“ -------------”
“ మిమ్మల్నేనండీ !”
“ ఏమిటి రాజ్యం ?”
“ రాత్రి పదకొండు గంటలయింది, మళ్లీ తెల్లవారి లేచి ఎలాగూ చదువుకోవాలి, చదువు కట్టి పెట్టి పడుకోండి.”
‘ చదువు కట్టి పెట్టి’ అన్న మాటలు అతనికి కర్ణ కఠోరంగా వినిపించాయి . “ నీకు నిద్ర వస్తే పడుక్ఓ రాజ్యం, నేను దీన్ని పూర్తి చేసి వస్తాను.” అన్నాడు విసుగ్గా.
భాస్కరానికి కోపం వచ్చిందని గ్రహించింది రాజ్యలక్ష్మి. చదువుని ఏమన్నా అంటే అతనికి కోపం వస్తుందని ఆమెకి తెలుసు. కారణం చదువు అతని ప్రాణం, అతని ఊపిరి, దాని కట్టి పెట్టడమంటే, ఊపిరి బిగించడమే అవుతుంది ! అప్పగింతల సమయంలో తండ్రి పరంధామయ్య ఆ విషయాన్ని ఆమెకు చెప్పనే చెప్పాడు. “ చూడు తల్లీ ! తల్లి లేని పిల్లవని నీకు చేసిన గారాబం వల్ల నీకు ఎలాగూ చదువు అబ్బలేదు.! ఆద పిల్లవు కాబట్టి, చదువు కన్నా సంసారం ముఖ్యమని రాజీకి వచ్చి, నిన్ను చదువుకొన్న వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. భాస్కరం చదువరులకే చదువు చెప్పగల మేథావి. అతని తెలివి తేటలు అనంతం ! అతను చదువుల సారం మథించడానికి పుట్టిన మేరువు. అందుచేత అతని చదువుకి అంతరాయం కలిగించకుండా గుట్టుగా కాపురం చేసుకో !” అని.
పరంధామయ్య కూద గొప్ప మేథావే ! చదువు చెప్పడం వృత్తి ధర్మంగానే కాక, స్వధర్మంగా స్వీకరించిన మనిషి. ఉన్న ఒక్కగానొక్క పిల్ల రాజ్యలక్ష్మిని చదువుల సరస్వతిని చేయాలని అతను ప్రయత్నించాడు. కాని రాజ్యలష్మికి చదువు అబ్బలేదు. తను గురువే కాక, తండ్రి కూడా కావడమే, దానికి కారణమని అనుకొని, ఆమెని చదివించే భాధ్యతని , ప్రియ శిష్యుడు భాస్కరానికి అప్పజెప్పాడు.
తండ్రి చెప్పే చదువు పట్ల ఆసక్తి లేని రాజ్యం భాస్కరం చెప్పేదాంట్లో, మార్పు ఉంటుందని ఆశించి, మొదట్లో కాస్తంత శ్రధ్ధ కనబరించింది. కాని అతను కూడా అవే పాఠాలు, అవే లెక్కలు మొదలెట్టడంతో విసుగెత్తి, చదవడం మానుకొంది. ఆమెకి కావలసిన చదువేమిటో తేల్చుకోలేక, ఆ గురు శిష్యులిద్దరూ కలిసి, ఆమెది ‘మట్టిబుర్ర’ అని తీర్పు ఇచ్చి చదివించడం మానేసారు. కూతురికి చదువు రాలేదు సరే, అల్లుడైనా చదువుకొన్నవాడు కావాలని అనుకొన్నారు పరంధామయ్య గారు. మరుక్షణం అతని దృష్టిలో భాస్కరమే మెదిలాడు. వెంటనే భాస్కరం మేనమామతో మాట్లాడి, సంబంధం ఖాయపర్చి , ఇద్దరికీ పెళ్లి చేసారాయన.
పెళ్లయి రెండేళ్లు గడిచినా, రాజ్యలక్ష్మి కాపురానికి వచ్చి నెల్లాళ్లే అయింది. దానికి కారణం భాస్కరం చదువు !
ఎం.ఏ, బి.ఇడి చదివి లెక్చరర్ గా స్థిర పడిన నెల్లాళ్లకే , భాస్కరం ఒక్కగానొక్క మేనమామ కాలం చేసాడు. ఇంట్లో ఇన్ని మార్పులు జరిగాక రాజ్యలక్ష్మి భర్తతో కాపురానికి వచ్చింది.
వచ్చిన వారం రోజులకే ఆ ఇంటి వాతావరణాన్ని క్షుణ్నంగా అర్థం చేసుకొంది రాజ్యం. ఆ ఇంటికి పెద్ద దిక్కు అయిన , భాస్కరం విధవ మేనత్త కాంతానికి, పక్కింటి మేస్టారి గారి అబ్బాయి శంకరంతో గల చనువు, ఆమె దృష్టికి విపరీతంగా కనిపించింది. పెద్ద దిక్కు అని, ఆవిడ పెద్దదేమీ కాదు, నిజానికి భాస్కరం కన్న రెండేళ్లు చిన్నది ! ఆవిడ అతని మేనమామకి రెండో భార్య. మొదటి భార్య పోయిన చాలకాలానికి , ఇద్దరు కొడుకులు హైస్కూలు చదువులు కూడా పూర్తి చేసిన తరువాత, కాంతం ,అంద చందాలు చూసి, మనసు జారి, ఆమెని వివాహం చేసుకొన్నాడట అతను ! కాంతం శంకరంతో సాంగత్యం కోసమే , భర్త పోయినా , తన సవతి కొడుకుల దగ్గరకి వెళ్లక, ఇక్కడే తిష్ట వేసిందన్న నిజం ఎంత మట్టి బుర్ర అయినా రాజ్యం కని పెట్టేసింది ! ఇన్నాళ్లుగా అదే ఇంటిలో , మహామేధావి అయిన తన భర్తకి ఈ విషయం తెలియక పోవడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది.
రాజ్యలక్ష్మి తన గుప్త ప్రణయాన్ని పసిగట్టిందన్న విషయం కాంతానికి తెలిసి పోయింది. ఆ విషయాన్ని ఆమె భాస్కరానికి చెప్పెస్తుందేమో అన్న భయం ఆమెని చుట్టుముట్టింది. దాంతో వారిద్దరి మధ్య ‘కోల్డ్ వార్’ మొదలయింది. ఇంటికి పెద్ద దిక్కుగా తనకి గల అధికారం కాంతం సద్వినియోగం చేసుకొంది. వంత పని, ఇంటి పనితో పగలంతా రాజ్యాన్ని వంటింటికే పరిమితం చేసింది. రీసెర్చి వర్కులో తల మునక లైన భాస్కరం రాత్రిళ్లు రాజ్యం ఊసు పట్టించుకోడన్న విషయం కాంతానికి అనుభవైక వేద్యమే ! ఈ విధంగా భార్యా భర్తల మధ్య ఏకాంతాన్ని భంగం చేసి, తన రహస్య ప్రణయం భాస్కరం చెవికి సోకకుండా ఆమె జాగ్రత్త పడుతూన్న కొద్దీ, రాజ్యంలో సహనం నశించింది. ఎలాగైనా భర్తకీ విషయం తెలియజేస్తే, మేధావి అయిన అతను ఏదో పరిష్కారం చేయగలడన్న నమ్మకంతో, పది రోజులుగా ఆ ప్రయత్నం ప్రారంభించింది రాజ్యలక్ష్మి. కాని ఇంత వరకు అతనికీ విషయం తెలియజేయడం సాధ్యం కాలేదు.
“ ఏమండీ,” మళ్లీ పిలిచింది రాజ్యలక్ష్మి.
భాస్కరం విసుగ్గా పుస్తకం లోంచి తలెత్తాడు. ‘
“ మీతో కొన్ని విషయాలు మాట్లాడాలండీ, కాసేపు నాకు అవకాశమిస్తే---”
“ ఏ విషయం ?” అని భాస్కరం అడగ లేదు. అతని ‘రీసెర్చి’ ముందు ఏ విషయమైనా అతనికి అప్రస్తుతమే ! ,“ తరువాత మాట్లాడుకోవచ్చు రాజ్యం ! నీకు నిద్ర వస్తే వెళ్లి పడుకో !” అని అన్నాడు.
తలుపు బయట చెవులప్పగించి, వారిద్దరి సంభాషణ విన్న కాంతం , “ అమ్మాయ్య ! ఈ రాత్రి కింకా ఫరవాలేదు. ’ అని తేలికగా నిట్తూర్పువిడిచి తన గదిలోకి వెళ్లిపోయింది. ఆమెకి తెలుసు, ఈ విషయం ఇంక ఎంతో కాలం దాగదని, ఏదో ఒకనాడు బయట పడక తప్పదని. శంకరాన్ని ఆమె మనస్ఫూర్తిగా ప్రేమించింది. భర్త ఎలాగూ పోయాడు కనుక, శంకరంతో రహస్య ప్రణయానికి స్వస్తి చెప్పి, వివాహాన్ని ఆశించడంలో తప్పేమీ లేదు. కాని ఎంతో ధైర్యం మనో నిబ్బరంతో సాధించాల్సిన పని అది ! ఆ పనిలో ఎవరూ తోడులేక పోవడం, తనంత తానే వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవల్సి రావడం ఆమె దౌర్భాగ్యం ! భాస్కరం చదువు , మేథస్సు , సమస్యని పరిష్కరించలేవని ఆమెకి బాగా తెలుసు. పై పెచ్చు శంకరం నిరుద్యోగి ! అతనికి ఏదైనా ఉద్యోగం దొరికి, కాలు నిలద్రొక్కుకోగలుగితే, గాని వివాహం సాధ్యం కాదు. భర్త తన వాటాకి వదిలి వెళ్లిన ఆస్తితో, ఎంతో కాలం జీవించడం కష్టం. అందుకే ఆమె సమయం కోసం ఎదురు చూస్తోంది. ఈ లోగా విషయం బయట పడి, బజారు పాలు కావడం ఆమెకిష్టం లేదు. కాని ‘ పులి మీద పుట్రలాగ’ వచ్చిన రాజ్యలక్ష్మిని తానెలా ఆప గలదు ! కోపంతో ఆమె పిడికిళ్లు బిగుసుకొన్నాయి. ‘ రాత్రిళ్లు కూడా దాన్ని మొగుడితో ఒంటరిగా పడుకోనీయ కూడదు,’ గట్టి నిర్ణయానికి వచ్చిన కాంతం గబగబా తన చాప, పడక చుట్ట పట్టుకొచ్చి, “ భాస్కరం, భాస్కరం !” అంటూ తలుపులు దబదబా బాదింది.
తలుపు చప్పుడు వల్ల భాస్కరం చదువుకి అంతరాయం కలిగింది. అతను ఎదురుగా కూర్చొన్న రాజ్యలక్ష్మి వంక చూసాడు. ఆ చూపులో ‘ అత్తవచ్చింది , తలుపు తియ్యి’ అన్న భావం ఉంది.
రాజ్యం మనసు కోపంతో కుతకుత లాడి ఫోయింది. దిగ్గున కుర్చి లోంచి లేచి, మంచం మీద నుండి, దుప్పటీ తలగడా వేరు చేసి, క్రింద పరచింది. ప్రహారాల వల్ల, ఊగుతున్న తలుపుల వంక చూడనైనా చుదకుండా, బలవంతంగా కళ్లు మూసుకొని దాని మీద పడుకొంది..కాంతం అందుకే వచ్చిందన్న సంగతి ఆమె మట్టిబుర్ర క్షణంలో గ్రహించింది.
మేథావి అయిన భాస్కరానికి ఆమె చర్య అర్థం కాలేదు. విసుగుతో వెళ్లి తలుపులు తెరచాడు అతను.
కాంతం గాలి విసురులా లోపలికి వచ్చింది. “ అబ్బ ! ఆ గదిలో ఒంటరిగా పడుకోలేక పోతున్నానురా భాస్కరం ! నిద్రమ్ పట్టడం లేదు,” అంటూ రాజ్యలక్ష్మి ప్రక్కనే పక్క పరచి, “ నిద్ర పోతున్నావేమిటి కోడలా ! అయినా మంచం మీద కాక క్రింద పడుకొన్నావేమిటి ? మడి కట్టుకొన్నావా ,ఏం ?” అని పలకరించింది.
రాజ్యలక్ష్మి జవాబివ్వలేదు. కాంతం లోలోపల నవ్వుకొంటూ,“ కాస్త లాంతరు వత్తి తగ్గించు భాస్కరం ! లైటు కళ్లల్లోకి పడుతోంది ”అని పడుకొంది భాస్కరం లైటు వెలుగుఆమె మీద పడకుండా, షేడు పెట్టి పుస్తక పఠనంలో లీనమయి, ఇంట్లోని అంతర్నాటకానికి తనకి తానుగా చాటయ్యాడు.
********
ఒంటరిగా ఎండన పడి ఒగరుస్తూ వచ్చిన కూతురు వంక ఆశ్చర్యంతో చూసి, “ ఏమమ్మా ! ఇలా వచ్చావ్ ? అందరూ క్షేమంగా ఉన్నారు కదా !” అని ఆతృతతో అడిగాడు పరంధామయ్య.
“ అందరూ క్షేమమే నాన్నా ! మిమ్మల్ని చూడాలనే వచ్చేసాను.”
“ నాకు కబురంపితే నేనే వచ్చే వాణ్ని కదమ్మా ! ఇలా ఉన్నట్లుండి బయలుదేరి రావడం ఏం బాగా లేదు, భాస్కరంతో చెప్పే వచ్చేవా ?”
రాజ్యలక్ష్మికి ఉక్రోషం ముంచుకొచ్చింది.
“ అతనితో ఎలా చెప్పేది నాన్నా ? రోజుకున్న ఇరవై నాలుగు గంటలలోనూ రెండు నిముషాలు కూడ అతనితో మాట్లాడడానికి వీలు చిక్కడం లేదు. పగలంతా కాలేజీ, రాత్రిళ్లు పుస్తకాలు, నా ఊసు పట్టించుకోవడానికి .అతనికి టైము ఎక్కడుంది ?”
“ అదా తల్లీ, నీ బాధ ! ” పరంధామయ్య గారు పకపకా నవ్వారు. “ రీసెర్చి వర్కు పూర్తయ్యేవరకు నువ్వు అతనికి చేదోడు వాదోడుగా ఉండాలి. భాస్కరం ఎంత తెలివైనవాడో, అంత మంచివాడు. అందుకోసమే ఏరి కోరి నిన్ను ---”
తండ్రి ప్రసంగం ఇంకా కొనసాగుతూ ఉండగానే, రాజ్యలక్ష్మి లేచి, వంటింట్లోకి వెళ్ళి స్టౌ ముట్టించింది. తండ్రి నోట, భర్త ప్రశంస ఎంతకీ ఆగదన్న విషయం ఆమెకి బాగా తెలిసిందే ! భర్తతో విషయ ప్రస్తావన ఎలాగూ జరగడం లేదు, తండ్రికి అంతా తెలియజేసి, అతని ద్వారా భర్తకి చెప్పిస్తే, బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చిందామె, రాత్రంతా ఆలోచించి. అందుకే పనులు ముగించుకొని ఆదరా బాదరాగా వచ్చింది. కాపీ కలిపి, తండ్రి చేతికి ఒక కప్పు అందిస్తూ రంగం లోకి దిగింది రాజ్యం.
“ అంతా బాగానే ఉంది గాని నాన్నా ! అతని విధవ మేనత్త కాంతమ్మ గారి తొనే కాస్త ఇబ్బందిగా ఉంది—’’
కొత్తగా కాపురానికి వెళ్లిన కూతురు , అకస్మాత్తుగా ఇంటికి వచ్చి, అలాంటి అభియోగాన్ని తనతో చెప్పుకొన్నప్పుడు ఏ తండ్రైనా తరచి, తరచి విషయం రాబట్టి, సమస్యా పరిష్కారానికి ప్రయత్నిస్తాడు. కాని వచ్చిన చిక్కల్లా, పరందామయ్య కూడా మేథావి కావడమే ! కూతురు తెలివితేటల పట్ల ఏ మాత్రమూ నమ్మకం లేని మనిషి అతను.
“ అదేమిటమ్మా, అలా అంటావ్ ? చిన్నదే అయినా ఆవిడ చాలా మర్యాద తెలిసిన మనిషి ! నీ పెళ్లి మాటలకి వెళ్లినప్పుడు ,‘బాబాయిగారూ !’ అని నా కాళ్లకి మొక్కి పాదధూళి తీస్దుకొన్నప్పుడు కనిపెట్టాను నేను, ఆమె భక్తి శ్రధ్ధలు, వినయ విధేయతలున్నూ, పాపం చిన్నతనం లోనే వైధవ్యం వచ్చి--- ”
రాజ్యలక్ష్మికి ఇక అక్కడ ఉండాలని అనిపించ లేదు. కాంతాన్ని బేషరతుగా, అంతగా తండ్రి మెచ్చుకోవడం, కొలిమిలో పెట్టినట్లయింది. ఆమెకి. భర్త ఎలాంటివాడో తండ్రి కూడా అంతే ! ఎదుటి మనిషి అభిప్రాయాలు అర్థం చేసుకొని ఊహలకి విలువ నివ్వడం వీళ్లకి చేతకాని పని. ఆమెకి ఈ మేథావి వర్గం మీదనే అసహ్యం పుట్టుకొచ్చింది.
“ వెళ్లొస్తాను నాన్నా ! చాలా వేళయింది, మళ్లీ ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది” అని లేచింది రాజ్యలక్ష్మి.
***************
ఇంటికి తిరిగి వచ్చిన రాజ్యం , గదిలో ఎవరివో మాటలు, నవ్వులు వినిపించి తలుపు దగ్గరే ఆగి పోయింది. లోపల కాంతం, శంకరం ఇద్దరే ఉన్నారని అర్థమయింది. తలుపు మీద చేయి వేసి, మెల్లగా త్రోసి, లోపల గడియ లేదని గ్రహించింది. పిలవాలా, వద్దా అని కాసేపు తటపటాయించి , తలుపులు రెండూ గభాలున తోసి, లోపలికి దారి తీసింది.
.అకస్మాత్తుగా వచ్చిన రాజ్యం రాకతో గదిలో ఇద్దరూ తడబడ్డారు. ఒకరి కొకరు దూరంగా జరిగి కూర్చొన్నారు. రాజ్యం అదేదీ గమనించనట్లు, ఇంటి లోపలికి వెళ్తూ,,“ శంకరం గారు ఎందుకు వచ్చినట్లో ?” అని అన్యాపదేశంగా అడిగింది.
శంకరం లాగే అతని మాటలు కూడా తడబడ్డాయి. “ భా --- భాస్కరం మాస్టారి గురించి వచ్చానండి. మా న్నాన గారు కొంత డబ్బు అప్పుకోసం పంపించారు. వచ్చే వారం
ఉద్యోగానికి ధరావత్తు కట్టడానికి వెళ్ళాలి.”
“ అలాగా , మాస్టారు ఈ టైములో ఇంట్లో ఉండడం ఎప్పుడైనా చుసారా ? ఇంతకీ ఎంత మొత్తం కావాలేంటి ?” తనే యజమాని అయినట్లు మాట్లాడింది రాజ్యం.
కాంతం మనసు లోలోపల కుతకుతలాడి పోయింది. ‘ ఏమిటి ఇవాళ దీని అథారిటీ !’ అని విస్తు పోయింది. ఆమె.
“ వెయ్యి రూపాయల వరకు కావాలండి మాస్టారిగారి దగ్గర అయితే నమ్మకంగా దొరుకుతాయని--- ” నసిగాడు శంకరం.
“ అబ్బో పెద్ద మొత్తం ! అతను వచ్చిన తరువాత మరోసారి రండి. నేను కూడా చెప్పి ఉంచుతాను. ఇంతకీ ఉద్యోగం ఎక్కడ ? ఈ ఊర్లోనా, లేక బయటికి పోవాలా ?”
“ తల అమ్ముకొన్న తర్వాత ఎక్కడయితే ఏమిటండి, బయటికే పోవాలి.”
“ నిజమే లెండి, అయినా ఊరు విడిచి బయటికి పోవడమే మంచిది. కాకపోతే అలవాటైన ప్రాణం కాబట్టి మీకు కాస్త బాధగానే ఉంటుంది.”అంటూ కాంతం వైపు ఓర చూపు చూస్తూ వంటింట్లోకి వెల్లిపోయింది రాజ్యలక్ష్మి.
ఆమె వెళ్లిన తర్వాత శంకరం కూడ లేచాడు. కాంతం అతని చెయ్యి పట్టుకొని ఆపింది.
“ రాజ్యలక్ష్మి కి మన సంగతి తెలిసిపోయింది శంకరం. ఇంక ఎంతో కాలం మనం ఇలా ఉండలేం. డబ్బు ధరావత్తు కట్టేస్తే నీకెలాగూ ఉద్యోగం దొరుకుతుంది. కదా ! పనిలో జాయన్ అవటానికి వెళ్లే ముందు , నన్ను కూడ --- ” ఆ పై మాట పూర్తి చేయడానికి సిగ్గు అడ్డు పడి అతని ఛాతీ మీద తల వాల్చేసింది కాంతం.
శంకరం ఆమె తల నిమురుతూ ఆలోచనలో పడ్డాడు. ‘ కాంతం ,అందం ,డబ్బు రెండూ ఉన్న వితంతువు. పైగా తనంటే పడి ఛస్తుంది. తనకి ఉద్యోగం ఎలాగూ వస్తుంది. ఆమెని తీసుకొని పోయి కాపురం పెట్టేస్తే, వచ్చిన నష్టం ఏముంది ? తండ్రి బాధ పడతాడు, ఇంటితో సంబంధం తెగిపోతుంది, అదీ ఒకందుకు మంచిదే ! ఇద్దరు చెళ్లెళ్ల పెళ్లి భాద్యత నెత్తిన వేసుకోనక్కర లేదు’
“ భయపడకు డార్లింగ్ ! ఉద్యోగం దొరక గానే వచ్చి నిన్ను తీసుకొని పోతాను. ఈలోగా ఈ విషయం బయట పడకుండా చూడు” అన్నాడు శంకరం.
********“
“ రాజ్యం, ఓ రాజ్యం !”
పెరట్లో నూతి పళ్లెం మీద గిన్నెలు తొలుస్తున్న రాజ్యం భర్త పిలుపు విని, ఆదరా బాదరాగా గదిళొకి వెళ్లింది. “ రాజ్యం, ! అలమారాలో పదకొండు రుపాయలు మొన్ననే తెచ్చిపెట్టాను. అవేవీ కనిపించడం లేదు ?”
“ బాగా, వెతికారా ?”
“ ఆ ! అలమారా అంతా క్రిందు మీదులు చేసి వెతికాను, కనిపించ లేదు. నువ్వు తీసావేమోనని ---- ”భాస్కరం మాటలు తడబడ్డాయి. అతని ముఖంలో విసుగునీ, దైన్యాన్నీ స్పష్టంగా చూడ గలిగిన రాజ్యలక్ష్మి తను కూడా అలమారా వెతకడం మొదలు పెట్టింది.
ఆమెకి తెలుసు, ఆ డబ్బుతో అతను తన రీసెర్చి వర్కుని ప్రింటింగు చేయదలచుకొన్నాడని, డబ్బు పోయిందనే బాధ కన్నా, తన గ్రంథం అచ్చవదేమోనన్న అనుమానమే అతనిని ఎక్కువగా బాధిస్తోందని ! అలమారాలో డబ్బు ఉందన్న సంగతి తనకే కాదు, కాంతానికీ తెలుసు, ఆవిడ పొలాల మీద వచ్చిన శిస్తు బాపతే సొమ్మే అది ! శంకరం మొన్ననే వచ్చి వెయ్యి రూపాయలు అవసరం ఉందని చెప్పాడు. ఆ డబ్బుని ఆవిడ ఈ విధంగా సద్వినియోగం చేయలేదు గద !’
`` ఏమండీ ! ” పిలిచింది రాజ్యం.
“ దొరికిందా?” ఆతృతతో అడిగాడు భాస్కరం.
“ లేదండి, ఈ విషయం మీ అత్తయ్యని ఓ సారి అడిగారా ?”
“ ఎందుకు ! ఆవిడకేం తెలుస్తుంది ?”
పుట్టెడు కోపాన్ని లోపల దిగమ్రింగుకొని నెమ్మదిగా జవాబిచ్చింది రాజ్యం. “ అడగడంలో తప్పేముందండీ ! ఆవిడ తీసి జాగ్రత్త చేసి ఉండవచ్చు కదా ?”
రాజ్యం మాటలు ఇంకా పూర్తవనే లేదు. , “ భాస్కరం ! ” అని పిలుస్తూ గది లోపలికి వచ్చిది కాంతం.
“ ఏమిటత్తయ్యా ?”
“ నీతో ఒకమాట చెప్పాలి, ఇలా రా !” అంటూ అతని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లింది..
‘డబ్బు విషయం చెప్పడానికి అయి ఉంటుంది, ’ అనుకొన్న రాజ్యం , అల్మారా తలుపులు తాళాలు వేసి, నూతి దగ్గరకి వెళ్లింది , తిరిగి తన పనిలోకి చొరబడడానికి.
*************
“ నమస్కారం మాస్టారు !”
ఏదో ఆలోచనలో పడి పరధ్యానంగా గుమ్మం దాటిన భాస్కరం ప్రక్కింటాయన పిలుపుతో ఉల్లిక్కిపడ్డాడు.
“ నమస్కారం !” రెట్టించాడు పక్కింటి ముసలాయన.
“ అబ్బెబ్బే ! అదేమిటండీ, పెద్దవారు, ఇలా నాకు నమస్కారం చెయ్యవచ్చా ?” భాస్కరం తడబడ్డాడు.
``చిన్నవాడివే అయినా దొడ్డ మనసు బాబూ, నీది ! మొక్కడంలో తప్పేమీ లేదు. అవసరం అయినదాని కన్నా వంద రూపాయలు ఎక్కువే వేసి ఇమ్మాన్నావట కదా మీ ఆవిడతో, మా శంకరం చెప్పాడు.”
“ ఏ డబ్బండీ ? శంకరం ఏం చెప్పాడు మీతో ?”
“ ఎందుకు బాబూ , ఏమీ తెలియనట్లు మాట్లాడుతావు ! శంకరానికి ఉద్యోగం దొరికింది, ధరావత్తుగా వెయ్యి రూపాయలు కట్టాలి. మీ ఆవిడతో విషయం చెప్తే, మీతో మాట్లాడి ఇప్పిస్తానన్నదట, చల్లని తల్లి ! దారి ఖర్చుల నిమిత్తం వంద రూపాయలు ఎక్కువే ఇమ్మన్నారు. మాస్టారు అని, పదకొండు వందలు శంకరం చేతిలో పెట్టి ---”
ముసలాయన మాటలు మరి వినిపించ లేదు భాస్కరానికి ! వినిపించినవి మాత్రం అశనిపాతంలాగ తగిలాయి.‘ రాజ్యం డబ్బు శంకరానికి ఎందుకిచ్చింది ? కాంతం అత్తయ్య చెప్పిన మాటలు నిజమేనన్న మాట ! ఈ సంగతేదో ఇవ్వాళే తేల్చుకోవాలి, ’ కాలేజీకి అన్య మనస్కం గానే దారి తీసాడు భాస్కరం.
*************
“ రాజ్యం ‘!”
మంచి నీళ్ల మరచెంబుతో గది లోకి వచ్చి, లోపల కాంతం పక్క కనిపించక, ఆశ్చర్యంతో భర్త ముఖం వంక చూసిన రాజ్యం, భర్త బిగ్గరగా పిలిచిన పిలుపుకి అదిరి పడింది..
లాంతరు వెలుగులో భాస్కరం ముఖం కోపంతో జలిస్తూ కనిపించింది. శరీరం చెమటలు పట్టి, చిరు కంపనతో ఊగుతోంది. పిడికెళ్లు టేబులు అంచు మీద బుగుసుకొని, ఉన్నాయి.!
భర్తని ఈ విధంగా చూడడం రాజ్యానికి ఇది మొదటి సారి ! సహజం గానే ఆమె అడుగులు తడబడ్డాయి. మాట సన్నగిల్లింది. కళ్లు తామర కొలను లయ్యాయి.
“ ఏమండీ !” అంది మెల్లగా.
“ శంకరానికి ఆ డబ్బు నువ్వెందుకు కిచ్చావు ?”
“ ఏ డబ్బండీ ?” తెల్లబోతూ అడిగింది రాజ్యం. ,“ నే నిచ్చానని ఎవరు చెప్పారు ?”
“ శంకరం తండ్రిగారే చెప్పారు, అవసరం కన్నా వంద ఎక్కువే వేసి ఇచ్చావట, ఎందుకిచ్చావ్ ?”
“ నేను శంకరానికి డబ్బు ఇవ్వడం ఏమిటండీ ! మీరెలా నమ్మారా మాటలని ?”
“ హు ! ఎలా నమ్మానని కదూ, అడిగావ్ ? అవును అడగకేం చేస్తాను ! ఎన్నెన్నో అబధ్ధాలు నిజమని నమ్మాను, ఈ నాడు ఒక నిజాన్ని నమ్మేసరికి ఎలా నమ్మావని అడగకేం చేస్తావ్ ?”
“ ఏమిటండీ ఈ మాటలు ! ” రాజ్యలక్ష్మి కంఠం బొంగురు పోయింది. చెంపల మీద కన్నీరు ధార కట్టింది, చెంగుతో వాటిని తుడుచుకోంటూ అంది, “ నిజం ఏమిటి ! అబధ్ధమేమిటి ? మీ మాటలు అర్థం కావడం లేదు, శంకరానికి ఆ డబ్బు ఇచ్చింది నేను కాదు, మీ కాంతం అత్తయ్యే ! ఏది నిజమో నన్ను చెప్పనీయండి.”
“ రాజ్యం !” పిచ్చి కోపంతో ఊరిమాడు భాస్కరం.“ఇంకా నీ కట్టు కథలు నమ్మడానికి నేనేం మూర్ఖుణ్ననుకొన్నావా, నీకు చదువు చెప్పే రోజుల్లోనే నీ గుణాన్నీ, ఆకలినీ చూచాయగా కని పెట్టినా, అది నా మీద ప్రేమ అని మోసపోయాను. రీసెర్చి వర్కులో పడి కొన్ని రోజుల పాటు నీ పట్ల జరిగిన ఉపేక్షని సాకు చేసుకొని , శంకరంతో కలిసి ఈ విధంగా నీ ఆకలి తీర్చుకొంటావని అనుకోలేదు ! దానికి ముడుపు ఈ రకంగా చెల్లిస్తావని లీలగా నైనా అనుమానించ లేక పోయాను. ఇంకా నువ్వు చెప్పే కట్టు కథలకి చెవులప్పగిస్తావనుకొన్నావా ? ఛీ ! నీ ముఖం చూదడం పరమ పాపం ! ’ ’పిడికెళ్లు బిగించి కుర్చీ లోంచి లేచాడు భాస్కరం.
“ ఏమండీ !” మొదలు నరికిన మానులా క్రింద పడి అతని రెండు కాళ్లు గట్టిగా వటేసుకొంది రాజ్యలక్ష్మి. దుఃఖం, అవమానం, ఉక్రోషం అన్నీ ఒక్కుమ్మడిగా చుట్టుముట్టి ఆమెని మూగ దానిని చేసాయి.
భాస్కరం విసురుగా కాళ్లని విడిపించుకొని, గదిలోంచి బయటికి దారి తీసాడు. అతని చదువు, అతని మేధా సంపత్తి ఏదీ రాజ్యలక్ష్మి పరిస్థితిని అతనికి విడమార్చి చెప్పలేక పోయాయి. రాజ్యం కాళ్లు పట్టుకొని రోదించడం ఆమె తప్పుని ధృవపరచి నట్లేనని నమ్మాడతను. వెంటనే గది దాటి , వీధి దాటి, తెలియని గమ్యం వైపు , ఆవేశం నడిపించిన దిక్కు దారి తీసాడు భాస్కరం.
************
‘ కాంతం ! మై లవ్ !” చెట్ల క్రీనీడలో , రైల్వే ఫ్లాట్ ఫారం పైన ఒక సిమెంటు బెంచీ మీద , ఆమె ప్రక్కగా కూర్చొని ఆమె చేతిని ముద్దాడుతూ అన్నాడు శంకరం.
“ ఛ ! ఏమిటది , అంత పబ్లిక్ గా !” చెయ్యి లాగేసుకొంది కాంతం.
“ కాంతం నువ్వు కనబడక పోవడంతో రాజ్యలక్ష్మికి అనుమానం మన మీద కలిగి, గోడవ చేయదు కద ?”
“ దానికి మన సంగతి ఆలోచించేందుకు వ్యవధి లేకుండా ఒక సమస్యని సృష్టించే వచ్చాను. ” అంటూ తమని అతి దగ్గరగా దాటుకొంటూ పోయిన వ్యక్తిని చూసి, గతుక్కుమంది కాంతం. శంకరం కూడా ఆ వ్యక్తిని చూసాడు, అతనెవరో కాదు , భాస్కరమే !
“ భాస్కరం మేస్టారు ఇక్కడకి ఎందుకు వచ్చినట్లో ! మన పరారీ సంగతి బయటపడి పోలేదు కద ?” గాభరాతో అన్నాడు శంకరం.
“ నువ్వు గాభరాపడకు శంకరం ! భాస్కరం మనని చూడలేదు. నిన్నటి నుండి ఇంటికి రాకుండా పిచ్చివాడిలా తిరుగుతున్నాడు కాబోలు, అతనిని ఇంటికి పంపించి వస్తాను,” అని శంకరం వారిస్తున్నా వినకుండా, “ భాస్కరం, భాస్కరం !!” అని పిలుస్తూ అతనికి ఎదురయింది కాంతం.
భాస్కరం ఆగి ఆమె వంక ఆశ్చర్యంతో చూసాడు. “ ఏమిటత్తయ్యా ! మీ రిలాగ --- ”
“ మరేం చెయ్యమంటావు భాస్కరం ! నువ్వు ఇల్లు విడిచి వెళ్లడంతో, ‘అది ’ మరీ రెచ్చిపోయింది. బరి తెగించి పట్ట పగలే శంకరంతో ప్రణయం సాగిస్తోంది ! అది చూడలేక , తెగ తెంపులు చేసుకొని నా పెద్ద కోడుకు ( సవతి కొడుకు ) దగ్గరకి బయలు దేరాను నేను ---”
“ అత్తయ్యా !” ఆమె మాటలకి మధ్యలోనే అడ్డుపడ్డాడు భాస్కరం, “ ఆ శంకరం ఇంట్లోనే ఉన్నాడంటావా ?”
“ అవును బాబూ ! ఇంట్లోనే ఉన్నాడు , అది చూడలేకే ---”
“ రాజ్యం” పిచ్చిగా కేక వేసి, ఇంటివైపు దారితీసాడు భాస్కరం. ఇంటికి వెళ్లి, వాళ్లిద్దరినీ చేజేతులా పట్టు కోవడానికి !
***********
ఇంటికి తిరిగి వచ్చిన భాస్కరానికి, రాజ్యలక్ష్మి ఊహించని పరిస్థిలో దర్శనమిచ్చి, అప్రతిభుణ్ని చేసింది !
సజీవంగా ప్రియుని బాహు బంధంలో కాదు, నిర్జీవంగా, దూలానికి వ్రేలాడుతూ కంఠ పాశ బంధంలో !!
‘ ఏమయింది ! రాజ్యం ఎందుకిలా చేసింది ? తన తప్పు బయట పడిపోయిందన్న అవమానం భరించలేక ఇలా చేసిందా ? ’ మెదడు మొద్దుబారి , శూన్య దృక్కులతో ఆమె శరీరం వంక చూస్తున్న భాస్కరాన్ని, సరిగా అదే సమయానికి అక్కడకి వచ్చి చేరిన, పరంధామయ్య చెయ్యి గట్టిగా తట్టి, జాగృతుణ్ని చేసింది.
భాస్కరం అతనిని చూసి ఏదో చెప్పబోయాడు. పరంధామయా వారించి ఇలా ఓదార్చారు, “ ఇందులో నీ తప్పేమీ లేదన్న సంగతి నాకు అర్థమయింది భాస్కరం ! అది నా కడుపున చెడబుట్టింది. నన్ను, నిన్ను సర్వ నాశనం చేసి, తల వంపులు తెచ్చింది—”
చదువుల సారం పుక్కిట బట్టిన ఆ ఇద్దరు మేధావంతులు ఒకరినొకరు ఓదార్చుకొన్నారు. చదువడమే తప్ప దాని ప్రయోజనం తెలుసుకోలేని, చదువుని వృత్తిగా తప్ప లౌకిక వ్యవహారాలకి విబియోగించుకోలేని ఆ చదువుల తల్లి ముద్దుబిడ్డ లిద్దరూ, తమ అంచనాల కొలబద్దతో, రాజ్యలక్ష్మి వెన్నపూస లాంటి వ్యక్తిత్వానికి కళంకం ఆపాదించడంతో తృప్తిపడి, ఆమె భౌతిక కాయాన్ని తరలించే ఏర్పాట్ల కోసం త్వరపడ్డారు.
(యువ – అక్టోబరు ౧౯౮౧ )

Comments
Post a Comment