Skip to main content

గాలి వాన

చిట్టమ్మి వరి ఓవులని విసురుతోంది. బండి పైన ఉన్న నారన్నాయుడు వాటిని అందుకొంటున్నాడు.

ఆ విసురులోని వయ్యారం , ఆ ఊపులోని కదలిక, గురిచూడడం లోని మురిపించే చూపులు వెనక్కి వంగి ఒక్క ఉదుటున విసిరేటపుడు కదిలే స్తనాల అన్యోన్య కర్కశత్వం , నారన్నాయుని మదిలో మధుర భావనల్ని గుప్పిస్తున్నై.

చిట్టమ్మి పేద పడుచు, తల్లి తండ్రులు లేని పిల్ల. ఈ సువిశాల ప్రపంచంలో ఆమెకున్న ఒక్కగా నొక్క దిక్కు తాత సోమినాయుడు ఒక్కడే ! సొమినాయుడు డెబ్భై సంవత్సరాల వృధ్ధుడు.దౄష్టి మందగించినందున దేనికీ పనికి రాడు.

నారన్నాయుడు గ్రామంలో పెద్ద రైతు.

కండలు తిరిగిన భుజదండాలు , నల్లసాని రాతి వలె మిలమిల మెరిసే గుండెల వైశాల్యం, వాని యౌవనం యొక్క పరాకాష్టకి నిదర్శనాలై నిలిచి ఉన్నై.

“ నాయుడు మాఁవా ! గబగబా ఓవుల్ని అందుకోలేకున్నావ్ !” అని చిట్టెమ్మి కిలకిలా నవ్వింది.

ఆ నవ్వు నాయుని హృదయంలో తియ్యని స్పందనని పుట్టించింది. ‘‘ ఆ నవ్వుల జల్లు కోసమెనే పిల్లా, నేను ఆలస్యం చేస్త !” అని చిరునవ్వు నవ్వాడు నారన్నాయుడు.
చిట్టమ్మి కపోలాలు అరుణ రాగంతో కెంపెక్కాయి. సిగ్గుతో ఆమె శరీరం వణికింది.

“ పిల్లా ! బండికి బరువు అగ్గజమయింది. పడుగుని లాగి పట్టుకో, చూద్దాం !” అన్నాడు నాయుడు.

చిట్టమ్మి పడుగుని పర్రానికి మెలిపెట్టింద్సి. ఎదమ పాదాన్ని పర్రం యొక్క ద్డె పైన బలంగా మోపింది. రేండు చేతుల్తోనూ పడుగుని బిగించి తన శరీరాన్ని వంచి లాగింది.

అప్పుడామె ఇంధ్ర ధనస్సులా కనిపించింది.

నారన్నాయుని హృదయంలో రంగు రంగుల పువ్వులు వికసించాయి.! కోస్తా పోతులు కదిలాయి. బండి ధాన్యలక్ష్మితో బరువుగా ముందుకి కదిలింది.

చిట్టమ్మి తాను మొయ్యదగిన వరి మోపుని కట్టి నెత్తిపై పెట్టుకొంది. బండి వెనక అపూర్వమైన పద విన్యాసంతో నడవ సాగింది.

“ పిల్లా ! మోపుని బండి మీద పడేసి, మొఖరు మీద కూర్చో, చీకటి పడక ముందే కళ్ళానికి చేరుకోవాలి.” అన్నాడు నాయుడు.

“ వద్దు మాఁవా ! నే నిలా అడ్డ దారంట ఇంటికి పోతా !”

“ కూలి డబ్బులు పుచ్చుకోవూ ?”

“ రేపు పెద్ద చెరువు పొలాల వరి కోతప్పుడు పుచ్చుకుంటా !”

‘ కటక్’ మనే శబ్దం ! బండి దాపల చక్రం బురద గుమ్మిలో పడిపోయింది ! దాపలి పోతు ముందరి కాళ్లు బురదలో కూరుకు పోయాయి !
నాయుడు బండి క్రిందకి గెంతాడు.

“ దీం తస్సదియ్య ! కుంచం వరకు చక్రం బురదలో కూరుకు పోయింది”

“ అవు మాఁవా ! ఇప్పుడేం దారి ?”

“ వరి మోపు క్రిందకి దించి, మొఖరు పట్టుకొని దాపల పోతుని మునకాల కర్రతో అదలించు, నేను చక్రాన్ని పట్టి తోస్తా.”
నాయుడు, సిలకట్టు బిగించి గుమ్మిలో దిగాడు.

దాపలి పోతు మెలవేసుకొంది. !

వలపలి పోతు జలగలా సాగింది.

నారన్నాయుడు ఊపిరి బిగపట్టి చక్రాన్ని కదిలిస్తున్నాడు.

“ లాభం లేదు మాఁవా ! దాపలి గొడ్డు మెల వేసుకొంది,” అని బిగ్గరగా శ్వాస పీలుస్తూ అంది చిట్టమ్మి.

“ ఏం బుగతా ! బండిని గుమ్మిలో కుదేసావ్ ?” అని ప్రశ్నించాడు కృష్ణన్నాయుడు., నారన్నాయుని పెద్ద పాలేరు. పొలం గట్ల పైని పచ్చగడ్డి కోస్తూ , దూరం నుండే బండి గుమ్మిలో దిగపడడం చూసి అక్కడికి వచ్చాడు.

“ కృష్ణా ! ఏదో పరధ్యానంలో పడి దారి చూసుకోలేదు. ఓవుల్ని క్రిందకి దించాలి, వెల్లి పాలేర్లని కేకెయ్యి,” అన్నాడు నారన్నాయుడు.

కృష్ణన్నాయుని అభిమానం దెబ్బతింది. నొసలు బిగించాడు, నూనూగు మీసాల్ని ఒక మారు దువ్వుకొన్నాడు.. ఎర్ర గావంచా తలకి చుట్టాడు.

ఆ సమయంలో పద్మవ్యూహంలో చొరబడే అభిమన్యునికి మల్లే కన్పించాడు కృష్ణన్నాయుడు.

చిట్టమ్మి వాణ్ని చూసి కళ్లతో నవ్వింది. హృదయంలో వికసించింది. ఆమె కంటికి కృష్ణన్నాయుడు , త్రినేత్రుని ఎదిరించి నిలిచిన మన్మథుని మల్లె కన్పించాడు !

“ బుగతా ! ఓవుల్ని దించడమే ! ఎంత అవమానం ! అమ్మవారి దయ చల్లగుండాల, నా దండల్లోని చేవ తరక్కుండాల ! దాపలి పోతు వంక పూజుని నేనానుకొంటా ! చక్రాన్ని కదిలించు, బుగతా !” అని గర్వంగా చెప్పాడు.

కృష్ణన్నాయుడు ఆ ఊర్లో పేరు పొందిన వస్తాదు. ఎంత బలవంతుడో అంత సౌమ్యుడు. వ్యవసాయంలో ఆరితేరిన రైతు. మంచు రూపసి, రాగి రంగులో మెరిసే వాని శరీరంలో ఆరోగ్య లావణ్య వారి సుళ్ళు తిరిగి ప్రవహిస్తోంది. దాపలి పోతుని విప్పి, దాని స్థానే పూజుని ఆనుకొన్నాడు కృష్ణన్నాయుడు. వెలపలి పోతు ఓర కంటితో వాణ్ని చూసింది, దాని అభిమానం కూడా దెబ్బతింది కాబోలు, కండ్లలో ఎర్ర జీర నిప్పు కణాల్లా కన్పించింది.

కృష్ణన్నాయుడు “ హుం !” అని, ఒక్క బిగితో పూజుని గుండెకి ఆనించుకొని, ముందుకు త్రోసాడు.

వలపలి పోతు ఒళ్ళు కుదించుకొని, జలగలా ముందుకి సాగింది. ‘ కటక్, కటక్’ మనే శబ్దం చేసుకొంటూ బండి బంతిలాగు గుమ్మినుండి బయట పడింది !

నారన్నాయుడు ,“ సెబాష్ !’ అని తన పాలేరు వీపు తట్టాడు. సిగ్గుతో పెళ్లికూతురిలా దాపలి పోతు ముఖం వ్రేల వేసుకొని తన మెడకి పూజు తగిలించుకొని నిలబడింది.
బండి కదిలింది. కృష్ణన్నాయుని కళ్ళతో తాగేస్తూ, చిట్టమ్మి వరి మోపుతో అడ్డదారి తొక్కింది.

*************

నారన్నాయుడు ఆ గ్రామంలో మోతుబరి రైతు. గ్రామానికి సర్పంచి కూడ అతనే ! తెలుగు భాషలో మంచి ప్రవేశం ఉంది. రాగ వరసతో, రామాయణం , భాగవతం చదవ గలడు ! వ్యవసాయంలో ఆరితేరిన చెయ్యి ! బీద సాదల మీద దయకలవాడు. ధారాళమైన అంతఃకరణ గలవాడు. గ్రామంలో వాని మాట సుగ్రీవాఙ్ఞలా చలామణి అవుతూంది.
ఇలాంటి గుణగణాల్తో కూడిన నారన్నాయునికి ఒకే ఒక లోపం ఉంది, అతడు స్త్రీల విషయంలో దుర్బల చిత్తం కలవాడు.

నారన్నాయుని హృదయంలో చిట్టమ్మి యొక్క యౌవనం కామాగ్నిని రేపింది !

చిట్టమ్మి తండ్రి వెంకునాయుడు పదేండ్ల ప్రాయం చిట్టమ్మిని సోమినాయుని పరం కావించి కన్ను మూసాడు. దక్షుడైన కుమారుని మరణానంతరం, వృధ్ధుడైన సోమినాయుడు మతి చలించి, పోయాడు. పూట తిండికి కూడ గతిలేని ఆ కుటుంబాన్ని కాపాడాడు నారన్నాయుడు, కాబట్టి సోమినాయునికి నారన్నాయిని మీద దైవ భక్తి కలదు.

చిట్టమ్మి నారన్నాయుణ్ని కండ్ల ముందరే పెరిగి పెద్దదయి, యువజన మాదకమైన యౌవన సీమలోకి అడుగు పెట్టింది.

పూల తోట వంటి ఆ బాలిక యౌవన వసంతం వాని హృదయంలో స్థిర వసంతాన్ని నెలకొల్పింది.

వరిమళ్లలో కొడవలితో, వరిజెవుల్ని కోస్తున్న చిట్టమ్మి వనికి మన్మథుని ఆరవ బాణంలా వలె కన్పడేది.

నారు ఉడుపులప్పుడు కిన్నెర కంఠంతో పాడే, చిట్టమ్మి , నాయుడికి మత్తెక్కించి ఉర్రూతలూగించేది.

చిట్టమ్మి కూడ నారన్నాయుని ప్రేమిస్తోంది,! ఆ ప్రేమ బాగా విడబారిన బొండు మల్లె వలె తెల్లనిది, దానిలో రాగం లేదు ! అది పవిత్రమైన పితృ ప్రేమ !

నాయుడు వివాహితుడు, పిల్లల తండ్రి కాబట్టి, అతను చిట్టమ్మిని ప్రేమిస్తున్నాదని చెప్పడం కంటె, కామిస్తున్నాడని చెప్పడమే ఉచితం !

చిట్టమ్మి కృష్ణన్నాయుణ్ని ప్రేమిస్తోంది ! కృష్ణన్నాయుడు ఆమెని ప్రేమిస్తున్నాడు. ! వారిద్దరూ మొదట అన్యోన్య రూప సందర్శనం చేతనే ప్రేమికులయ్యారు. కాల క్రమంలో వారిద్దరూ తమతమ రూపాల్ని ప్రేమ గుండంలో ఆహుతి కావించుకొన్నారు.! వారిది శుధ్ధమైన ప్రేమ.

వారిద్దరి ప్రేమ విషయం గోప్యమయినది కాదు, పుట్టుక తోనే వారి ప్రేమ పరిమళించింది ! నారన్నాయునికి వారి ప్రేమోదంతం తెలిసి పోయింది !

నారన్నాయుని హృదయాకాశంలో కారు మబ్బులు ప్రబలి పోయాయి.

కృష్ణన్నాయుడు తన పాలేరు ! చిట్టమ్మి తన ఉప్పు తిని పెరిగిన పిల్ల ! తాను చిట్టమ్మి యౌవనానికి సంపూర్ణంగా హక్కు దారుడు.! తన హక్కుని హరింప చూస్తున్నాడు కృష్ణన్నాయుడు, ఎంత సాహసం ! ఈ అవమానాన్ని తానెట్లు భరింప గలడు ? తానిప్పుడు వారిద్దరి మధ్య చేయి చేసుకోక పోతే, శృతిమించి రాగంలో పడుతుంది ! ఈ విధంగా తల పోసాడు నారన్నాయుడు.

వాని ఆలోచనకి అడ్డు తగిలింది వాని మనస్సాక్షి !

‘ నీవు సంసారివి, నిన్ను నమ్ముకొని ఒక యువతి ఇంట్లో ఉంది. దాన్ని విస్మరిస్తూ, నీవు నీతి బాహ్యుడవై పోతున్నావు ! చిట్టమ్మి నీ ఉప్పు తిని పెరిగినంత మాత్రాన నీవు దాన్ని కామించడం నీతి విరుధ్ధం. ఒక పేద పడుచు యొక్క భావిని నాశనం చేయకు !’

నారన్నాయుని కామాగ్నికి వాని మనస్సాక్షి భస్మీ పటలం అయిపోయింది ! వాని కామానికి క్రోధం బలాన్ని ప్రసాదించింది.

ఆ రోజు రాత్రే ఆ నిర్మల ప్రేమకి , గొడ్డలి పెట్టు పెట్టేయాలని తీర్మానించాడు నారన్నాయుడు.

నారన్నాయుడు చుట్ట కాల్చుకొంటూ, పశువుల శాల యొక్క విశాలమైన అరుగు మీద కూర్చొన్నాడు. అతని మస్తిష్కంలో ప్రశ్న పరంపరలు చెలరేగుతున్నాయి. వాటికి సమాధానం చెప్పుకోలేక వేదన అనుభవిస్తున్నాడు.

అదే సమయంలో పాలేరు మల్లేశు పచ్చగడ్డిని కర్రతో కొట్టి దులిపి పశువులకి వేసాడు.

“ ఒరే మల్లేశూ ! కృష్ణ ఏడీ ?” అని అడిగేడు నారన్నాయుడు.

“ పొలాల కాడికి ఎల్లుంటాడు బుగతా !”

“ పొలంలో ఇప్పుడేం పనిరా ?”

“ఈ రేతిరి తప్పక వోన వస్తాది, నా నెల్లి పొలం గట్టూ కొట్టి దిగజార్చి రావాల, అన్నాడు బుగతా !”

“ వాడి శ్రాధ్ధం ! మేఘం లేనిదే వాన ఎలా వస్తుందిరా ?”

“ ఆడికి కలొచ్చిందంట ! ఈ రేతిరి పెద్ద గాలివాన వస్తాది మల్లేశూ, అని చెప్పిండు”.

వీరిద్దరూ మాట్లాడుతూ ఉండగానే , కృష్ణన్నాయుడు అక్కడికి వచ్చాడు.

“ కృష్ణా !” కటువుగా పిల్చాడు నాయుడు, ఆ పిలుపులో మోటుతనం కృష్ణన్నాయిని హృదయాన్ని తాకింది. వాడు అదిరి పడ్డాడు.

“ కృష్ణా !” నీవు చిట్టమ్మి విషయంలో జోక్యం చేసుకోవద్దు ! ఏం ? నేను చెప్పింది తెలిసిందా ?” అని గద్దించాడు నాయుడు.

కృష్ణన్నాయుని హృదయం క్షోభించింది, నాయుని మాట పిడుగులా తాకి, తల తిరిగినట్లయింది, నాయుడి అభిప్రాయం వానికి బోధపడలేదు. చేతులు కట్టుకొని మౌనంగా నిల్చొన్నాడు !

“ నాతో విరోధం తెచ్చుకోవద్దు, చిట్టమ్మి విషయంగా ,నేను వేరే ఆలోచనలో ఉన్నాను, వెళ్లి నీ పని చూసుకో”

తన యజమాని మాటకి ఎదురు చెప్పకుండా, కృష్ణన్నాయుడు రెండు గునపాలు, పెద్దబల్ల చెక్క తీసుకొని ఆ చోటు వదిలి వెళ్లిపోయాడు.

**************

అదే రాత్రి , మొదటి ఝాము ఇంకా ముగియ లేదు.

చల్లని గాలి తెరలు తెరలుగా వీచింది. చిన్న చిన్న మేఘాలు ఆకాశ వీధిలో పచార్లు చేయ సాగాయి. క్రమక్రమంగా గాలి వేగం హెచ్చింది. మేఘాలన్నీ పోగై కలుసుకొని పెద్ద కొండలా నభో భాగాన్ని చుట్టి వేసాయి. వాటి మధ్య మెరుపు దాని వెనక కరకరమని పిడుగు పాటు, భూమి దద్దరిల్ల సాగింది.

ప్రకృతి భీభత్సంగా ఉంది.

గాలి వేగం హెచ్చింది. మేఘాల పట్టుదల ఇనుమడించింది. రెండింటి పోరు ఘోర రూపాన్ని దాల్చింది.

ఉన్నట్లుండి గాలి స్తంభించింది. ! మేఘాలు క్రిందకి దిగబడ్డాయి, ! హోరుమని శబ్దం ! కుండ పోతగా వర్షం దిగజారింది.

“ బావా, బావా ! ఎక్కడున్నావ్ ?” చిట్టమ్మి అరుపు. .

పెద్ద చెరువు గట్టు మీద నిలబడి ఉంది , చిట్టమ్మి చుట్టూ సుడి గాలితో వర్షం ఆమెని ఊగిసలాడిస్తోంది ! చెరువు వాలుగొమ్ములు ప్రవాహ రూపాన్ని దాల్చి, నురగలు కక్కుకుంటూ పారుతున్నాయి. ఆ గాలితోనే తేలిపోతూ చిట్టమ్మి పెద్దమడుగుని సమీపించింది. చిట్టమ్మికి కృష్ణన్నాయుని ఎర్రని తలపాగా మడుగు దగ్గర మొగమడిలో కన్పించింది.

చిట్టమ్మి ,“ బావా, బావా ! ” అని గొంతెత్తి పిలిచింది. ఆ శబ్దం హోరుగాలిలో కొట్టుకు పోయింది. !

చిట్టమ్మి ఇక సహించలేక పోయింది ! గట్టు మీద కూర్చొని, అలాగే మడిలోకి జారింది ధాన్యపు కంకులతో కూడిన వరి మొక్కలు మడిలో చెల్లా చెదురుగా ఉన్నాయి ! ఆ బురదలోనే శక్తినంతా కూడ తీసుకొని చిట్టమ్మి కృష్ణన్నాయుని సమీపించింది.

మడుగుకి అడ్డంగా బల్ల చెక్క కట్టబడి ఉంది. చెక్క ఊడి పోకుండా రెండు వైపుగా గునపాలు పాతి ఉన్నాయి. పడుగు బలంగా బిగించబడి మడుగు యొక్క ఇనప గొళ్లాలకి గునపాలకి ఇర్రింపబడి ఉంది.

చెక్కని ఆనుకొని, భీమబలుడు కృష్ణన్నాయుడు వీపుని దన్నుపెట్టి కూర్చొని ఉన్నాడు.

వాని శరీరమంతా బురద మయమై ఉంది !

చిట్టమ్మి ,“ బావా” అని కేక వేస్తూ కృష్ణన్నాయుని గుండెలపై చారబడి పోయింది..

“ చిట్టీ ! ఎంత సాహసం ! ఈ చోటికి ఎందుకు వచ్చావ్ ? నాయుడు మనల్ని కలియ వద్దన్నాడు కదా !” అని ఆమె కురుల్ని సరిచేస్తూ గొణిగాడు కృష్ణన్నాయుడు.

“ బావా ! నాయుడే కాదు, బగవంతుడు కూడ మనల్ని విడదీయ లేడు. ” అంటూ చిట్టమ్మి వెక్కి వెక్కి ఏడ్చింది.

వాన జోరుగా పడుతోంది. ఉరుములు , మెరుపులు అన్యోన్యం మాట్లాడుకొంటున్నాయి.

ఆ ప్రేమిక మిథునం ఒండొరుల కౌగిళ్లలో స్పృహ తప్పి, మడిలో రెండు రాతి విగ్రహాల్లా బల్ల చెక్కనానుకొని స్థాణుత్వాన్ని పొందారు.!!

*************

అదే రాత్రి రెందవ ఝాము ముగించిన మూడవ ఝాము ప్రారంభించింది. నారన్నాయుడు తన పాలేర్లతో, పెద్ద చెరువు మడుగు దగ్గరకి వచ్చాడు !

నాయుడు అక్కడ చూసిన దృశ్యం !!

ఆ దృశ్యాన్ని చూసిన నాయుడు హృదయం కరిగి పోయింది.

అప్పుడు గాలివాన పూర్తిగా వెలిసింది.

ఆకాశం నారన్నాయుని హృదయంలా నిర్మలంగా ఉంది !

నక్షత్రాలు వితానమందు మెరుస్తున్నాయి. !

నారన్నాయుడు మడి లోనికి దిగి, చిట్టమ్మిని, కృష్ణన్నాయుని చూస్తూ, నిలబడ్డాడు !

నాయుడు కండ్లు చెమ్మగిల్లాయి. అతను వారిద్దరి చేతుల్నీ పట్టి చూసాడు.

ఇద్దరి శరీరాల్లోనూ వేడి రక్తం ప్రవహిస్తూనే ఉంది.

నాయుడు తృప్తిగా శ్వాసని పీల్చుకొన్నాడు. వానికి ఇది వరలో పుట్టిన అసూయ పటాపంచలు అయింది.

కృష్ణన్నాయుడు ముందు జాగ్రత్త వహించక పోతే, పెద్ద చెరువు క్రింద ఉన్న పాతిక గరిసెల ధాన్యంలో ఒక్క గింజ కూడ తనకి దక్కి ఉండేది కాదని నాయుడు తెలుసుకొన్నాడు.
కృతఙ్ఞతతో వాని హృదయం చల్లబడింది. కోపం పరిత్యజించింది ! కోపాన్ని వెన్నంటి కామం పరుగు తీసింది.

“ పంచ భూతాల సాక్షిగా, ఆకాశం లోని తారలు సాక్షిగా, ఈ ఇద్దరూ ఏకం ఛేయబడ్డారు.! భగవంతుడు వీరిద్దరి దాంపత్యాన్ని సుఖవంతం చేయుగాక !” అని నాయుడు బిగ్గరగా వారిద్దరినీ ఆశీర్వదించాడు.

“ తథాస్తు” అని అన్నట్లు ,కోడి కూత దూరంగా గ్రామం నుండి పలికింది.

*******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద