Skip to main content

స్మిత నయన 2

వెలుగు నీడల అన్యోన్యతకి ప్రత్యక్ష తార్కాణంగా, నలుపు తెలుపుల కలయికతో వింతగా మెరిసి పోతూ, ఎగిరెగిరి పడుతున్న ‘ సింధు’ నదీ తరంగ హస్తాలతో చేతులు కలపాలనే ఆతృతతో , నింగి నుండి నేలకి దిగజారి పోతోంది , విదియ చంద్రుని వెన్నెల జాలు.

“ కళ్యాణీ !”

సింధు నది అలలలోనూ , దానికి ఆనుకొని విస్తారంగా వ్యాపించిన గంభీరారణ్య మధ్యం లోనూ, ‘కళ్యాణి ’ గుండెల్లోనూ ప్రతిధ్వనించింది ఆ పిలుపు !

‘ మహారాజు ఆనంద పాలుని సైనిక స్కందా వారం లోని, ‘ గజ శాలలో’ ,‘ ఛరాల్, ఛరాళ్’ మంటూ గొలుసుల శబ్దం దానికి సమాధానం ఇచ్చింది !
తనకై ప్రత్యేకింప బడ్డ డేరాలో, ఆలోచనల తాకిడికి నిద్ర పట్టక దొర్లుతున్న, ఆనంద పాలుడు దిగ్గున లేచి పర్యంకంపై కూర్చొన్నాడు.

“ కళ్యాణీ !”

తిరిగి నభో వీధిలో సుళ్లు తిరిగిందా ధ్వని ! ఆనంద పాలుడు మరి సందేహించ లేదు.

ఇరువది సంవత్సరాలుగా తన తండ్రి కాలం నుండి షాహి వంశపు రాజుల, చతురంగ బలాలలో అతి ముఖ్యమయిన గజశిక్షణ శాఖకి అధ్యక్షుడిగా, పని చేస్తున్న ‘ భద్రకుని’ పిలుపు అది !

“ భద్రకునికి ఏమయింది ? ఇంత రాత్రి పూట నిస్సహాయంగా కళ్యాణిని ఎందుకు పిలుస్తున్నాడు ?

“మహారాజా ! ” అన్న పిలుపు విని ఆతృతతో గుడారం వెలుపలికి వచ్చాడు ఆనంద పాలుడు.

“ కళ్యాణి కట్లు త్రెంచుకొంది. శతృవుల గుడారం వైపు , అతి వేగంగా పరుగు తీస్తోంది. ఎవరూ దానిని మళ్లించ లేక పోతున్నారు ”, ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డాడు దౌవారికుడు.

“ మహామంత్రి ?”

“ మీ కోసమే ఎదురు చూస్తున్నారు ప్రభూ ! గుర్రం సిధ్ధంగా ఉంది.”

దౌవారికుని మాట పూర్తి కాకుండానే, ఒక సుసజ్జితమైన గుర్రాన్ని తీసుకు వచ్చి, మహారాజు ఎదురుగా నిలబెట్టాడొక భటుడు.

ఆనంద పాలుడు ఒక్క దూకుతో గుర్రాన్ని అధిరోహించాడు.

“ మహామంత్రీ !”

“ ప్రభూ !”

కళ్యాణి చర్యకి కారణ మేమిటి మహామంత్రీ ?”

“ కళ్యాణికీ, భద్రకునికీ గల సంబంధం మీకు తెలియనిదా ప్రభూ ! ఇరువదేండ్ల క్రితం వింధ్య పర్వత సానువుల్లో,‘కళ్యాణి’ దొరికిన నాటి నుండి అదే వానికి సర్వస్వమూ అయిపోయింది ! కళ్యాణికి కూడా భద్రకుడే అన్నీ అయ్యాడు.”

“ అయితే అకస్మాత్తుగా విన వచ్చిన భద్రకుని పిలుపే దీనికి కారణమంటారా ?”

“ అవును ప్రభూ ! చివరి ఘడియల్లో నిస్సహాయ స్థితిలోని భద్రకుని ఆర్తనాదమే దానికి కారణం.”

“ చివరి ఘడియలా ?”

“ అవును మహారాజా ! భద్రకుడు కటిక కసాయిల చేతిలో హత్య చేయబడ్డాడు.”

“ ఎక్కడ ?” మహారాజు దీర్ఘంగా నిట్టూర్చాడు.

“ అక్కడికే వెళ్తున్నాం ప్రభూ !”

సింధునదీ తీరాన్ని ఆనుకొని విస్తారంగా పెరిగిన అరణ్య మధ్య భాగంలో దట్టమైన పొదల మధ్య భద్రకుని శరీరం రక్తపు మడుగు మధ్య పోల్చుకోవడానికి వీలు లేనంతగా, ముక్కలు ముక్కలుగా కోయబడింది.

ఆనంద పాలుని దృష్టి , మృత కళేబరం నుండి కళ్యాణి వైపు మరలింది.

కళ్యాణి చూపులు ఎక్కడో దూరంగా ఉన్న , ‘ మహమ్మద్ గజనీ’ సైనిక స్కందావారం వైపు కేంద్రీకరింపబడి ఉన్నాయి. అది దాని రక్షకుడు, స్వామి సర్వస్వమూ అయిన, భద్రకుని మృత కళేబరం వంక చూడనైనా చూడలేదు ! అది తిరిగి తన యజమాని పిలుపు కోసం నిలబడినట్లుగా, ప్రతీ చిన్న శబ్దాన్నీ చెవులు రిక్కించుకొని వింటోంది !!

“ పద కళ్యాణీ !” ఆనంద పాలుడు వాత్సల్యంతో దాని మేను నిమిరాడు. కల్యాణి రాజు వంక చూసి, గజశాల వైపు అడుగు వేసింది.
అందరి హృదయాలు పెద్ద బాధ్యత తీరినట్లయి, గాఢంగా నిశ్వసించాయి.

“ మహారాజా !”

ఆనంద పాలుడు మంత్రి ముఖం వంక ప్రశ్నార్థకంగా చూసాడు.

ఈ రోజు మీరు యుధ్ధరంగంలో కళ్యాణిపై నుండి చేసిన స్వైర విహారం శత్రువుల గుండెలను చెదరగొట్టింది. అదిగాక ఈ ఒక్క రోజు యుధ్ధంలోనే 5000 మంది, తురుష్క సైనికులు మరణించినట్లు తెలుస్తోంది ! అందుకని విజయం సాధించడానికి , శతృవులు తప్పుదారులు త్రొక్కడానికి ప్రయత్నించక మానరు.”

“ అయితే భద్రకుని హత్య అటువంటి ప్రయత్నాలకు నాంది అని మీ అభిప్రాయమా ?”

“ అవును ప్రభూ !”

*****************

“ మహాప్రభూ !” గజ శిక్షకుడు వీరభద్రుడు వినయంగా చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

“ ఏమయింది వీరభద్రా !”

“ కళ్యాణి యుధ్ధరంగం లోకి వెళ్లడానికి ఉబలాట పడుతోంది మహారాజా ! మిగతా గజ బలాన్నంతా తరలించుకొని వెళ్లి, దానిని ఒంటరిగా వదిలేయడంతో క్రిందు మీదవుతోంది. ప్రభూ !”

“ సరే ! దానిని సిధ్ధం చేయండి.”

వీరభద్రుడు రెండు క్షణాల పాటు నివ్వెరపోయి,“కళ్యాణిని యుధ్ధరంగం లోకి పంపించ వద్దని, దానికి కొంత కాలం పాటు విశ్రాంతి అవసరమని , మహామంత్రి శాసించారు ప్రభూ
!”
“ అవసరం లేదు వీరభద్రా ! అది తన స్వామిని దారుణంగా హత్య చేసిన దుర్మార్గులని చీల్చి చెండాడాలని అనుకొంటోంది. దాని పగను తీర్చుకోగలిగిన అవకాశం దానికి ఇవ్వక పోవడం పాపమే అవుతోంది. వెంటనే దానిని యుధ్ధానికి తగిన విధంగా అలంకరించి, నా గుడారానికి తీసుకొని రండి.”

వీరభద్రుడు వినయంతో నమస్కరించి వెళ్లిపోయాడు.

****************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద