Skip to main content

కలిమి

అల్లిబిల్లిగా అల్లుకొన్న గడ్డాన్ని, చేతితో రుద్దుకొంటూ, ఇంటి పైకప్పు కేసి చూసి భారంగా నిట్టూర్చాడు ‘వరద రాజులు. ’ వరద రాజులు కలిగిన వాడు కాడు.

‘ కలిమి’,‘సిరి ’లాంటి పదాల అర్థమూ, ప్రయోజనమూ,తెలుసుకోవలసిన అవసరం అతనికి ఏనాడూ గతంలో కలగ లేదు..

‘గతం అంటే ఒక చిరుపేద కుటుంబంలో ఒక్కగా నొక్క కొడుకై, తండ్రైని మింగి పుట్టినప్పటి నుండి, వారాల మీద అనవసరమూ, నిరర్థకమూ అయిన, ‘ స్కూలు ఫైనలు’ చదివి, రైల్వేలో, ‘ గాంగ్ మేన్’ గా టెంపరిరీ స్థాయి ఉద్యోగంలో కుదురుకొని , మూడేళ్లుగా కాపురం చేస్తున్న, ఇప్పటి వరకూ’ అని చెప్పుకోవాలి !

ఈ మధ్య కాలంలో అతను వాటికోసం పాటుపడి, అరిగించుకొన్న దెబ్బల ఫలితంగా, అర్థాలూ, అనర్థాలూ ఆలోచించడం కూడా మానేసాడనే చెప్పాలి.

పూర్వ జన్మలో చేసుకొన్న పాప పుణ్యాల ఫలితాలని బట్టే, ‘ కలిమి లేములు’ కలుగుతాయన్న మెట్ట వేదాంతమే, అతని ఆలోచనలని పూర్తిగా ఆక్రమించుకొని నరనరాన జీర్ణించుకుపోయిందంటే , అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు !

తనకీ తన భార్యకీ రెండు పూటలా సరిపోయేలా బియ్యమూ, కూర వగైరా సాదర ఖర్చుకీ సరిపోయే ఇరవై రూపాయలు కలిగి ఉండటమే అదృష్టం అనే పదానికి అతనిచ్చే నిర్వచనం.

సరిగ్గా మూడు రోజుల ముందు వచ్చిన మంగళ వారం అది !

వరద రాజులు అతని జీవనానికి ఆలంబనమైన, రైల్వే సర్వీసు నుండి, సస్పెండ్ చేయబడ్డాడు.

నిజానికి అతను చేసిన తప్పేమీ లేదు.

రెండు సంవత్సరాలుగా తన దగ్గరే ఉంటూ, ‘ రూర్ కెలాలో ’ చిన్న సైజు ఉద్యోగంలో, కుదురుకొన్న బావమరిది ‘ రంగ నాయకులు’ చూడడానికి వస్తున్నట్లు వ్రాసిన ఉత్తరాన్ని అందుకొని, రాత్రి పూట స్టేషన్’కి వెళ్లడమే అతని పొరపాటు అయిపోయింది.

నైటు డ్యూటీలో ఉంటూండగా, సూపర్’వైజరుతో చెప్పీ చెప్పకుండా అలా వెళ్లడం , వరద రాజులుకి కొత్త కాక ఫోయినప్పటికీ, ఆ రోజు మాత్రం అతని దురదృష్టం వెన్నంటి తరిమి, చేవ చచ్చిపోయేలా కొట్టింది !

సరిగ్గా అతను స్టేషనుకి వెళ్లిన సమయం లోనే షెడ్’లో రాగి గొట్టాల దొంగతనం జరిగింది.

అటువంటి దొంగతనాలు షెడ్లో జరగడం అతి సాధారణ మయిన విషయమే అయినా, ఈ దొంగతనం వల్ల కలిగిన పరిణామం మాత్రం విపరీతమైనదీ, ఎప్పుడూ ఎరగనిదీ అని చెప్పుకోవచ్చు !

కారణం ఆ ఊరికి కొత్తగా బదిలీ మీద వచ్చిన, ఎ.ఇ. నిరంకుశుడు అవడం వల్ల, ‘ హిట్లర్’ లాంటి రాక్షస గణానికి చెందిన వాడవడం వల్ల, నైట్ ఇన్ ఛార్జి ద్వారా, ఫోనులో విషయం విన్న వెంటనే, అఘ మేఘాల మీద వచ్చి వాలాడు.

అలా వచ్చి చేసినదేమీ లేకపోయినా, నిద్ర ముఖాలతో ఉన్న స్టాఫ్ వాలకాన్ని కనిపెట్టి, ‘అటెండెన్సు’ తీసుకోవాలనీ , పొజిషన్ చూడాలనీ, అన్నాడు.

వరద రాజులు పాపం పండి, ఆ సమయానికి అక్కడ ఉండ వలసిన వాడల్లా, అరగంట లేటుగా వచ్చిన ‘ఎక్స్ ప్రెస్’ కోసం నిరీక్షిస్తూ స్టేషను లోనే ఉండిపోయాడు !

అంతమందీ ఉండి వరద రాజులు ఒక్కడే లేక పోవడం వల్ల, సహజంగానే దొంగతనానికీ, అతనికీ లంకె వేయడం జరిగింది.

అలా జరగ లేదనీ, తనే అతను స్టేషనుకి వెళ్లేందుకు పర్మిషన్ తనే ఇచ్చానని చెప్పగలిగే ధైర్యం నైట్ ఇన్ ఛార్జికి లేక పోయింది !

వీటన్నిటి పరిణామ ఫలితంగా, వరద రాజులు అతని జీవనానికి ఆలంబనమైన ఉద్యోగం నుండి సస్పెండు చేయబడ్డాడు, విచారణ చేయకుండా తీసెయ్య గలిగే అధికారం ఆ అధికారి చేతిలో లేకపోబట్టి !

అంతే ! అది జరిగిన తరువాత మూడు రోజులు చక చకా నడిచి పోయాయి. వరద రాజులు గుండెల మీదుగా !

అయినా వరద రాజులు బ్రతికే ఉన్నాడు !

ఎందుకూ ? అని అంటే, అది అతనిని పుట్టించిన లేదా సృష్టించిన భగవంతునికి కూడా చెప్ప శక్యం కాదు.సాధారణంగా ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడల్లా, చిన్నప్పు డెప్పుడో చదివిన ఒక చైనా వేదాంతి కథ స్ఫురణకి రావడం అతనికి సర్వ సాధారణమైన అలవాటు.

ఆ చైనా వేదాంతి పేరు, ‘ చౌ~ కూ ~కూ’ అతని దగ్గర ఒక తెల్లని కంచర గాడిద ఉండేదట ! బయటకి వెళ్ల వలసి వచ్చినప్పుడల్లా తంబూరా లాంటి వాయిద్యాన్ని తీసుకొని, ఆ గాడిద మీద వెనక వైపుగా కూర్చొని ప్రయాణం చేసే వాడట ! అంటే గాడిద ముఖం వైపుగా, తన వీపు ఉండేలా కూర్చొనేవాడన్న మాట !

ఆ వింత చర్యకి వేదాంత పరంగా అతనిచ్చే సమాధానం ఏమయినప్పటికీ, `జీవితం అనే కంచర గాడిద ఏ దిక్కున వెళ్లినా, మనిషికి దానితో ప్రమేయం ఉండ కూడదనీ , దారిలో కలిగే కష్ట నష్టాలకి, ఏ మాత్రమూ చలించకుండా ఉన్నప్పుడే పరమార్థాన్ని సాధించే మార్గం సులభ మవుతుందని ’ ఆ చర్యకి అర్థంగా మనం ఊహించుకోవచ్చు!

ఈ వేదాంతాన్ని తనకి నచ్చిన విధంగా మలుచుకొని, తనను తాను ఓదార్చుకొనే వరద రాజులికి, ఈ రోజు ఎందుకో అది కూడా మనశ్శాంతి ప్రసాదించలేక పోయింది. నిజానికి,
‘చౌ~కూ~కూ’ వేదాంతం మాట ఎలా ఉన్నా ఉన్నన్నాళ్లూ తిని, మరొకరికి పెట్టగల కలిమి గాని అతని స్వంతం కాని పక్షంలో , అతని వేదాంతం ఎలా అడ్డు తిరిగి ఉండేదో !’ అనుకొన్నాడు వరద రాజులు కసిగా.

అయినా జీవితానికీ, ఉద్యోగానికీ మూడు ముళ్ల బాంధవ్యం ఉన్న ఈ రోజుల్లో జరిగిన వాటికి భాద్యత లేక పోయినా, చలించకుండా చూస్తూ ఊరుకోవడం ఎలాగో అతనికి అంతు పట్టలేదు.!

అప్పటికీ సూపర్ వైజర్ల , మిత్రుల సలహాతో, ఎ.ఇ. బంగళాకి వెళ్లాడతను. ఆ రోజు ‘ ఎఅందుకు వచ్చావ్?’ అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసిన అతని చూపులని తట్టుకోలేక, తల క్రిందకి వంచేసాడు .వరద రాజులు.

ఏమని అడగాలో , ఎలా చెప్పాలో స్ఫురించక తనక్కడికి వచ్చినందుకు శతధా తిట్టుకొన్నాడు వరద రాజులు.

ఆఖరికి ఆ ఆఫిసరే ముందుగా మాట్లాడాడు.“ చూడు వరద రాజులూ ! దొంగతనం గురించి సరైన ఆచూకీ తెలిసి, అందులో నీ నిర్దోషిత్వం బయట పడేటంత వరకూ, నేను చేయ గలిగింది ఏమీ లేదు . అయినా ఇప్పుడు నీకు వచ్చిన పెద్ద ఆపద మాత్రం ఏముంది ? సస్పెండులో ఉన్నంతకాలం సగం జీతం దొరుకుతూనే ఉంటుంది కదా ?”

ఎంత తేలికగాఅనేసాడు ఆ మాటలు ! పూర్తిజీతంతోనే సగం గడిచే బ్రతుకు, సగం జీతంతో ఎలా నడుస్తుందను కొన్నాడో !
ఏమయినా తనదాకా వస్తేనే గాని తెలిసేది ఎవరికి ?

‘ అయినా ఆ దొంగతనం ఆచూకీ తెలిసేది మాత్రం ఎప్పుడు ? ఇది వరకు ఎన్ని దొంగతనాలు జరిగిన వివరాలు ఆఫీసు రికార్డుల మూలల్లో పడి మూలగడం లేదు !

“ హే భగవాన్ ! ఆపద నుండి గట్టెక్కించమని అడగడం లేదు నిన్ను , ఆపదని చూసి అదిరి పడే నీరసత్వాన్ని మాత్రమే తొలగించు !”

వరద రాజులు బధ్ధకంగా లేచి ఒళ్లు విరుచుకొన్నాడు. ఎదురుగా గోడకి వ్రేలాడుతున్న పగిలిన అద్దం ముక్క అతని ముఖాన్ని వికృతంగా ప్రదర్శించింది..

అతను తనలో తనే నవ్వుకొన్నాడు. ఈ ఆలోచనలు సమస్యలు అనే విషవలయాలు మనస్సునే కాకుండా, శరీరాన్ని కూడా పిప్పి చేస్తున్నాయి !

‘ చదువుకొనే రోజుల్లో వరద రాజులు ఎలా ఉండే వాడు !’ అద్దంలో వికృతంగా కనిపిస్తున్న తన ప్రతి బింబాన్ని వికృతంగా వెక్కిరిస్తూ నవ్వుకొన్నాడు వరద రాజులు.

‘ ఇప్పుడు మాత్రం తన అందానికి వచ్చిన లోటేమిటి, ఆకలి తవ్విన గుంటలు, చెంపల మీద, పొడిచిన పోట్లు శరీరం మీద మినహాయిస్తే ! అయినా నాలో ఏ ఆకర్షణా లేక పోయినట్లయితే,ముత్తాలు ఎందుకంతలా వెంట పడుతుంది ?

ముత్తాలు తలపుకి రాగానే ఒళ్లు జలదరించింది వరద రాజులుకి. అతను ఉండే కాలనీకి ప్రక్కగానే, ఇంచు మించు అరవై చదరపు అడుగుల జాగాలోని పూరి గుడిశె ముత్తాలుది. కాలనీ అంటే రైల్వే కాలనీ మాత్రం కాదు. రెండు మూడు సిమెంటు రేకులతో కప్పిన ఆ పిచ్చిక గూళ్లు , ‘ మొదలియార్’ గారి స్వంత ఆస్తి !

మొదలియార్ హెడ్ గుమాస్తాగా సర్వీసు ఉండి రిటైరయి , ఆ వచ్చిన డబ్బుతో కట్టించిన పిచ్చుక గూళ్లు అవి. ఆ జాగాలోనే తనకోసం ప్రత్యేకంగా ఒక మిద్దె ఇల్లు, ఆ ఇంటికి ప్రక్కనే, ‘పప్పు, ఉప్పు వగైరా ’ సాదర దినుసుల అమ్మకానికి వీలుగా కొట్టు కట్టించుకొన్నాడు.

“రైల్వే రిటైర్డు గుమాస్తా కలిమి అంతటిదా ? ఆ కాలనీ తనకి వచ్చిన ప్రావిడెంటు ఫండ్’తోనే కట్టించాడా ?” అని ఎవరైనా ఆశ్చర్య పోతే , వాళ్లకి మాత్రం మొదలియారుని గురించి చాలా చెప్ప వలసి ఉంటుంది !

వరద రాజులు మాటల ప్రకారం ఇంజనీరింగ్ శాఖలో ఆ ఉద్యోగం కామధేనువు లాంటిది ! ఆ గోవు పాలతో పాటు, రక్త మాంసాలు కూడా పిండుకొనే హక్కు, కొందరికి మాత్రమే సంక్రమిస్తుంది ! పోతే వరద రాజులలో జీర్ణించుకొని పోయిన నమ్మకాల ప్రకారం చూస్తే అదంతా మొదలియారు అదృష్టం క్రింద వస్తుంది.

అతని సిధ్ధాంతం మీద నమ్మకం లేని మాత్రం, “ ఆ ! మొదలియారు సామాన్యుడా ? కరటక దమనకు లిద్దరినీ చంపి పుట్టిన వాడు ! అయినా అంతలా కంట్రాక్టర్ల దగ్గిర నిలబట్టి, అంత డబ్బు పుచ్చుకోక పోతే ఏం ! చచ్చేటప్పుడు కూడా వెళుతుందా ఏం ? ” అనుకొంటారు, తమ అసమర్థతని సమర్థించుకొంటూ.

పోతే మొదలియారు, అతని అర్థశాస్త్రమూ గురించి చెప్పుకోవాలంటే , ఒకంతట తెమిలేది , ముగిసేదీ కాదు !

నున్నగా పొన్నకాయలాంటి తల, పెద్ద బొజ్జ, దానికి బరువు సహించడానికి తగినట్లు వర్తులా కారంలో ఉన్న కాళ్లు, అయినా ,‘ కలిమికి’ అంత కాపీనం ఎందుకో ? అలాంటి వాళ్లనే ఏరి కోరి వరిస్తుంది అది !

మొదలియారు విగ్రహం గుర్తుకి రాగానే, నవ్వు ఏడుపు సమ పాళ్లలో మేళవించి తీసిన లిట్మస్ పేపరులా అయింది వరద రాజులు ముఖం !

‘ ఈ మనస్సు ఉన్నాదే ! దీని ఆలోచనలకి అంతు పొంతూ ఉండదు ! ’ అనుకొన్నాడు అతను కోపంతో పిడికిలి బిగిస్తూ. నిజమే మరి ! ముత్తాలు మీది ఆలోచన మొదలియారు మీద మళ్లడం విచిత్రంగా లేదూ ?

చేతినిండా గాజులు, కాళ్లకి కడియాలు, పసుపు పూసుకొన్న ముఖానికి హారతి నిస్తున్నట్లు, ఎర్రని కుంకుమ బొట్టు, మాయా మర్మాల కలుష రక్తం కలియని మంచి మనస్సూ, గజ్జెల గుర్రంలా ఉంటుంది ముత్తాలు.

విధి అనే శాసన సభలో సృష్టి మొదటి నుంచీ చేయబడ్డ పాత చట్టాన్నే అమలు పరుస్తూ, పాకులాడే విధాత రాజ్యంలో, ఒక పూట తిండి తిని పస్తులుంటూ, బ్రతికే వాడినైనా పర స్త్రీ వ్యామోహం వివశుణ్ని చేస్తుంది !

త్రాగుబోతు భర్త మాత్రమే ఆమె జీవితానికి సమస్య !

నిజానికి వరద రాజులు అనుకొన్నట్లు, ముత్తాలు అతని చేత ఆకర్షింప బడలేదు. అసలు వారిద్దరిలో ఎవరూ ఎవరినీ ఆకర్షించలేదు !

ఆమె తనంత తానుగా పిలిచి, ఆవు ఈనిన వైనం చెప్పి, పాలవాడు ఇచ్చే పాలకన్నా, మంచి పాలు ఇవ్వగలననీ, ఆ వాడిక తన దగ్గరే పెట్టమని చెప్పి, అరశేరు జున్నుపాలు ఉత్తినే ఇవ్వడమూ, ఆ పాలు ఇచ్చేటప్పుడు సున్నితమైన ఆమె చేతివ్రేళ్లు అతనికి తగలడమూ, దానికి తగిలించిన మూడుచుట్ల రాగి ఉంగరాన్ని చూసి అతను నవ్వడమూ, అతని నవ్వుని చూసి, ఆమె కూడా అమాయకంగా, తనని తాను మరచిపోయి, హాయిగా నవ్వుకోవడమూ, కేవలం కాకతాళీయంగా జరిగిన సంఘటనలే అయినా , వరద రాజులు ఆలోచనల సుడిలో పడి వాటికి వికృత రూపాలు ఏర్పడ్డాయి.

ముత్తాలు తన తాగుబోతు మొగుడితో విసిగిపోయిందనీ, వరద రాజులు దురభిప్రాయ పడ్డాడు.

కుతకుతమని ఉడుకుతున్న బియ్యపు చప్పుడు వరద రాజులు ఆలోచనలకి షడన్ బ్రేక్ వేసింది.

‘ లక్ష్మి ఎక్కడకి వెళ్లింది ? బహుశా మొదలియార్ ఇంటికి గాని వెళ్లిందేమో ! ’ అనుకొన్నాడు అతను, అన్నం
మెతుకుని పట్టి చూస్తూ.

‘ లక్ష్మి పాపం ! తనను కట్టుకొని ఏం సుఖపడింది ? నచ్చిన తిండి తిని, మెచ్చిన బట్ట కట్టి ఎరిగిన పాపాన పోలేదు ! అయినా తన లాంటి దౌర్భాగ్యుడు పెళ్లి చేసుకోవడమేమిటి ?”

నీరసంతో వడలిన శరీరం, లోతుకు పోయిన బుగ్గలలో, నల్లటి చారలు కట్టిన ముఖం , ఆమె కొడిగట్టిన దీపం లాగ పొడ గట్టింది. వరద రాజులుకి.

తాగుబోతు అయినందు వల్ల ముత్తాలు మొగుడు ఆమె అవసరాలు తీర్చలేక పోయాడు. అసమర్థుడయినందు వల్ల తను లక్ష్మిని సుఖ పెట్టలేక పోతున్నాడు.

అన్నం గిన్నె క్రిందకి దించి, చేతులు కడుగుకొన్నాడు వరద రాజులు.

‘ముత్తాలుకి మొగుడితో విసుగెత్తిపోయింది, లక్ష్మి కూడా ----

‘ ఛ ! ఏమిటీ ఇవాళ ఆలోచనలు ఇలా పరుగెడుతున్నాయి ?’

అయినా లక్ష్మి ఇంత సేపు మొదలియారు ఇంట్లో ఏం చేస్తోంది ?

వరద రాజులు వీధి గుమ్మం కేసి, దృష్టి నిలిపాడు.

పెరట్లో అరటి చెట్ల దగ్గర పిట్టగోడ నానుకొని ఎటో చూస్తున్న ముత్తాలు చిత్రంగా నవ్వింది. కాటుక రెప్పలు రెండు సార్లు టపటప లాడించింది, మెల్లగా తల ఊపింది.
నూట పది ఓల్టుల షాక్ తగిలినట్లయింది వరద రాజులికి.

ముత్తాలు తననే పిలుస్తోంది, సందేహం లేదు, అక్కడ మరెవ్వరూ లేరు !

వరద రాజులు ఒకసారి తన వైపు చూసుకొని, గబగబా అడుగులు వేస్తూ పిట్టగోడ దగ్గరకి చేరుకొన్నాడు.

“ పిలిచావా ముత్తాలూ ?”

ఉలిక్కిపడి తిరిగిన ముత్తాలు ఆశ్చర్యంగా చూసింది. “ ఎవరు, నేనా ! అబ్బే లేందే ?” అంది.

‘ హు ! ఎంత నెరజాణ !’ మనస్సులోనే అనుకొన్నాడు వరద రాజులు, కళ్లతోనే రమ్మని సైగ చేసి, పిలవలేదంటూ ఎంత అమాయకత్వం నటిస్తోంది ? “ నువ్వు ఇచ్చిన పాలతో జున్ను బాగా తయారయింది ముత్తాలూ !”

అబధ్ధం ! వరద రాజులు నిజంగా అబధ్ధమే ఆడాడు.జున్ను చేయడానికి, పంచదార గాని, బెల్లం గాని లేక ఆ పాలు అలమారా మీద పడి అఘోరిస్తూనే ఉన్నాయి. అయినా ఆ సమయంలో అంత కన్నా మరేమాట మాట్లాడాలో అతనికి స్ఫురించ లేదు.

“ అలాగా !” అంది ముత్తాలు తన శరీర సందుల్లో పడి ఉక్కిరి బిక్కిరి అవుతూన్న అతని చూపుల నుండి తప్పించు కోవడానికి పమిట నిండుగా కప్పుకొంటూ.

అంతే ! ఆ తరువాత వారిద్దరి మధ్య నిశ్శబ్దం ఘనీభవించింది. ఏం మాట్లాడుకోవాలో, ఇద్దరిలో ఎవరికీ తెలియక అలాగే నిలుచుండి పోయారు.

“ ఒసే ముత్తాలూ !”

ఇంట్లో నుంచి వినబడిన భర్త పిలుపు విని ,“ వస్తూన్నా !” అంటూ లోపలికి పరుగెత్తింది ముత్తాలు, తేలికగా ఊపిరి పీలుస్తూ.

నిరాశతో వెను తిరిగిన వరద రాజులకి పక్కగా చిన్న మేడ ఇంట్లోంచి, పంచె బిగించి కట్టుకుంటూ దుకాణం వైపు వెళ్తున్న మొదలియారు కనిపించాడు. మొదలియారు ముఖం ఎప్పుడూ ఎరుగని హాసరేఖతో వెలిగి పోతోంది.

‘ మొదలియారు ఇంత ఖుషీగా ఉన్నాడేమిటి చెప్మా !‘ అనుకొంటూ, ఇంటి లోపలి దారి పట్టాడు అతను.

తలుపులు రెండూ తీసే ఉన్నాయి. వరద రాజులు ఇంటికి చేరుకొనే సరికి ! ‘ వెళ్లేటప్పుడు తలుపులు వెయ్యడం మరిచిపోయానేమో ! ’ అని, ఆదరా బాదరాగా ఇంటికి చేరుకొని, వీధి గుమ్మంలోంచి ఇంట్లోకి తొంగి చూసాడు.

లోపల ఎప్పటిదో త్రుప్పు పట్టిన పాత ట్రంకు పెట్టిలో, ఏదో వస్తువు కుక్కడానికి ప్రయత్నిస్తోంది అనంత లక్ష్మి.

వరద రాజులు దృష్టి ఆ వస్తువు మీద పడింది.

ఎనిమిది అంగుళాలు వెడల్పు, పన్నెండు అంగుళాలు పొడవు , ఉన్న చిన్న అట్టపెట్టె అది !

“ ఏమిటది లక్ష్మీ ?” భీకరంగా అరిచాడు వరద రాజులు. వీధి గుమ్మానికి రెండు చేతులు ఆన్చి, బెబ్బులిలా తన వంకే చూస్తున్న భర్తని చూసి, బెదిరిన లేడిలా వణికింది అనంత లక్ష్మి.

“ చీర – మొదలియారు భార్య ఇచ్చింది, ఏదో నోము నోచిందట !”, అనంత లక్ష్మి కంఠ స్వరం తడబడింది. ముఖం నిండా స్వేద బిందువులు మంచి ముత్యాలయ్యాయి !

‘ మొదలియారు భార్యా ? పిల్లికి బిచ్చం పెట్టని ముత్తైదువ చీర ఎందుకు ఇస్తుంది ? మొదలియారే ఇచ్చి ఉంటాడు ! అతనైనా ఉత్తినే ఎందుకు ఇస్తాడు ? చీర ఇచ్చినందుకు బదులుగా లక్ష్మి మొదలియారుకి ఏమి ఇచ్చి ఉంటుంది ?’

నరాలు జివ్వుమని లాగాయి వరద రాజుల్ని. రక్తం వసంతం చిమ్మినట్లు శరీరం అంతా పరచుకొంది, కళ్లు ఎర్రబడ్డాయి.

“ లక్ష్మీ ! ” బిగ్గరగా కేక పెట్టి లోపలికి అడుగు వేసిన అతని అతని చెయ్యి తగిలి అలమరా మీద ఉన్న స్టీలు గిన్నె, పాలన్నీ నేల పాలయ్యాయి !

ఆవేశం చల్లబడి, తెలివి తెచ్చుకొన్న వరద రాజులుకి, నేల మీద పడి ఉన్న స్టీలు గిన్నె, నేలంతా పరచుకొన్న పాలు మాత్రమే కనిపించాయి.

గదిలో లక్ష్మి గాని, ఆమె చేతిలో పాకెట్ గాని ఏమీ లేవు !

‘ ఛ ! ఎంత భయంకరమైన ఆలోచనకి గురి అయ్యాను !’ తనలో తనే నవ్వుకొని వీధి గుమ్మం వైపు దృష్టి సారింఛాడు.

మొదలియారు ఇంటి మెట్లు దిగిన అనంత లక్ష్మి చేతిలో చిన్నఅట్ట పెట్టెతో చిరునవ్వు వెలుగుతో, దివ్యంగా మెరిసి పోతున్న ముఖారవిందంతో, అడుగులు తడబడుతూ ఉండగా, పరుగు లాంటి నడకతో ఇంటి వైపు వస్తూ, అతని దృష్టి పథానికి ఆడ్డు తగిలింది.

పవర్ హేమర్ ధన్ ధన్ మని తలమీద మ్రోదినట్లయింది వరద రాజులికి. చిరునవ్వు చిందిస్తూ వస్తూన్న లక్ష్మినీ, ఆమె చేతిలో, ఎనిమిది అంగుళాలు వెడల్పు, పన్నెండు అంగుళాలు పొడవు , ఉన్న చిన్న అట్టపెట్టెని చూడగానే !!

“ లక్ష్మీ !” పొలికేక పెట్టాడు అతను.

అప్పుడే ఇంటికి చేరుకొన్న లక్ష్మి అయోమయంగా చూసింది భర్త వంకా, కాలుతూన్న కొలిమిలా మార్పు చెందిన అతని ముఖం వంక !

“ లక్ష్మీ ! ” మారు మాట్లాడకుండా ఆమె చేతి లోని అట్టపెట్టె లాగేసి, దూరంగా విసిరేసాడు వరద రాజులు కోపంతో కంపించిపోతూ.

“ అదేమిటండీ అలా చేసారు ? శుభమా అంటూ పండుగ పూట ఇంటికి వచ్చిన సిరిని అలా బుగ్గిపాలు చేసారేం ? ఏమయింది మీకు ?”

“ ఏమయిందా ?” వరద రాజులు కంఠం బొంగురు పోయింది. “ ఇంత సేపూ మొదలియారు ఇంట్లో ఏం చేసావ్ ? ఈ చీర ఎక్కడి నుంచి వచ్చింది ?”

“ బావుందండీ ! జున్ను చేద్దామని పంచదార అడిగి పట్టుకు రావడానికి మొదలియారు గారి ఇంటికి వెళ్లాను. ఆవిడతో మాట్లాడుతూ ఉండగా, పోస్టు మేన్ వచ్చి, పార్శిల్ వచ్చిందంటూ చెప్పి, ఈ పాకెట్ నా చేతికి ఇచ్చాడు.విప్పి చూస్తే, చీర ! రౌర్ కెలా నుండి రంగడు పంపించాడు.”

ఆ పైన మరేమీ వినిపించలేదు వరద రాజులుకి. పొయ్యి మీద పరుచుకొని, భగ్గుమని అంటుకొన్న చీర ఒక అక్కయ్యకి , హృదయం నిండిన ప్రేమతో తన మొదటి సంపాదనతో ఒక తమ్ముడు పంపించిన చీర ! అతని అదృష్టం లాగ, కాలుతూన్న ‘ కలిమి’లాగ’ గోచరించి పూర్తిగా వివశుణ్ని చేసింది అతనిని.

( ఆంధ్ర ప్రభ ౨౬. ౦౨. ౧౯౬౯ )

******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద