(అవినీతి నిర్మూలన కఠినాతి కఠినమైన చట్టం వల్ల కేవలం అదుపు లోకి మాత్రమే వస్తుంది., దాని అంతం మన మనసుల్లో పరివర్తన వల్లనే సాధ్యమవుతుంది . ‘అన్నా’ సందేశాన్ని చాటే నాటిక ఇది.)
ఇందులోని పాత్రలు ----- ౧ . అశోక్, ౨. ఆశ. ౩. గౌరి. ౪. గోవిందయ్య.౫. ఒక డాక్టరు. ౬. ఒక జర్నలిస్టు. ౭. ఒక కూలీ.
పాత్ర పరిచయం --- గౌరి --- ఎనిమిదేళ్ల బాలిక : అశోక్ --- గౌరి తండ్రి, మధ్య తరగతి గృహస్థు : ఆశ --- గౌరి తల్లి: గోవిందయ్య – అశోక్ తండ్రి : ఇక తక్కిన పాత్రలు--- డాక్టర్, కూలీ, జర్నలిస్టు
(దృశ్యం - అశోక్ ఇల్లు. కుడి వైపు వింగు వీధిలోకి , ఎడమ వైపు వింగు ఇంటిలోని పడక గది లోకి .మధ్య నుండే వింగు వంట గదికి దార తీస్తాయి. వేదిక ఆ ఇంటి చావడి. కొన్ని మొక్కల గోలేలు , వంట ఇంటి గుమ్మం దగ్గర ఒక దొండ పాదు ఉంటాయి )
( సమయం --- ఉదయం ఎనిమిది గంటలు )
( అశోక్ గడ్డానికి షేవింగ్ క్రీము రాసుకొని , పడక గది గుమ్మం ముందు నిలబడి క్షవరం చేసుకొంటు ఉంటాడు. ఆశ వంటింటి గుమ్మం దగ్గర కూర్చొని , తన కూతురు గౌరికి జడలు వేస్తూ ఉంటుంది. గౌరి చేతిలో పలక పట్టుకొని బలపంతో దాని మీద ఏదో బొమ్మ గీస్తూ ఉంటుంది. వీధి గుమ్మం దగ్గర గోవిందయ్య నిలబడి జంధ్యాన్ని వడుకుతూ ఉంటాడు. ఇలా మూడు వింగుల దగ్గరా నలుగురు పనిలో పడి దీక్షగా చేస్తూ కనిపిస్తారు)
ఆశ ---- ఒక్క నిమిషం స్థిరంగా కూర్చోలేవా గౌరీ ! ఆ పిచ్చి బొమ్మలేవో ఇప్పుడే వెయ్యాలా ? ఇలా అయితే నేను నీ జడలు ఎలా వేస్తాను ? ఆదరా బాదరాగా జడ వేసి పంపిస్తే , చూసిన వాళ్లు , మీ అమ్మ ఎలాంటిది బాబూ, జడలు కూడా వెయ్యడం రాదు అని అనడానికా ?
గౌరి --- నేనెక్కడ కదుల్తున్నానే , నువ్వే నా జుత్తు పట్టకొని ఇటూ అటూ గుంఉతున్నావు.
ఆశ --- అమ్మో , నువ్వు మాటలు కూడా నేర్చావే ! పలక కింద పెట్టి నోరు మూసుకొని చేతుల మీద చేతులు వేసి కట్టుకొని కూర్చో , నేనే జుత్తు పట్టుకొని లాగుతున్నానో, నువ్వే కదుల్తున్నావో తెలుస్తుంది..
గౌరి --- అంటే వివేకానందుడి లాగానా ?
ఆశ ---- అవును అలాగే !
గౌరి --- ఊ హు , నేనీ బొమ్మ వేసి టీచర్’కి చూపించాలి. తరవాత వేయడానికి టైము లేదు.
అశోక్ – గౌరీ ! ఏమిటమ్మా ఆ బొమ్మ ?
గౌరి --- ( ఉత్సాహంగా) ఒక చెట్టు బొమ్మ నాన్నా ! చెట్టు ముదలు , కాండము, శాఖలు, ఆకులు, ఇంకా పువ్వులు కాయలు అన్నీ వేయాలి. ( ఆ మాటలని గౌరి వివేకానందుని భంగిమలో చెప్తుంది. ఆశ అదే అదనని గౌరి జడ అల్లి, రిబ్బన్లు కడుతుంది )
అశోక్ --- ఇంతకీ ఏ చెట్టు బొమ్మ వేస్తున్నావమ్మా ?
గౌరి --- రేగు చెట్టు బొమ్మ వేస్తున్నాను నాన్నా, నాన్నా, నాన్నా, నువ్వు ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు నా కోసం రేగు పళ్లు తీసుకొని వస్తావా, అవంటే నా కెంతో ఇష్టం.
అశోక్ – అలాగే తల్లీ, తప్పక తీసుకొని వస్తాను.
ఆశ – గౌరితో పాటు మీ బుర్ర కూడా పాడయి పోయిందా ఏం ? శ్రీ పంచమి నాడు సరస్వతీ పూజ చేయందే , రేగు పళ్లు తినవచ్చా ? ( అని గౌరిని లేవనెత్తి ) తప్పమ్మా గౌరీ, సరస్వతీ దేవి పూజ చేయందే రేగు పళ్లు తింటే చదువు రాదు, తెలిసిందా ?
అశొక్ --- అరే ఆశా , నువ్వు లక్ష్మీ దేవి పూజారిణివి కదా ! హఠాత్తుగా సరస్వతీ దేవి నీ బుర్రలో ఎలా దూరింది ?
ఆశ --- ఏం చెయ్యమంటారు, మిమ్మల్ని కట్టుకొన్నాక ఎలా తప్పుతుంది ? ( అని గోవిందయ్యతో ) చూసారా మావయ్యగారూ, కొంచెమైనా లక్ష్మీ దేవి ధ్యాస లేదితనికి ! లక్ష్మి వారం నాడే గడ్డం గీసుకోవడం మొదలు పెట్టారు. ఇక లక్ష్మిని రమ్మంటే ఎలా వస్తుంది ? నేను చెప్తే ఎలాగూ వినరు, కాస్త మీరైనా చెప్పండి.
గోవిందయ్య -- నిజమేన్రా అశోక్ ! అమ్మాయి చెప్పిన దాంట్లో అర్థం ఉంది. లక్ష్మి వారం నాడు , అదీ జీతాలిచ్చే రోజు క్షవరం చేసుకొంటే సిరి ఇంట నిలవదు.
అశోక్ --- ఎందుకని నాన్నగారూ ?
గోవిందయ్య --- ఎందుకని ఎదురు ప్రశ్న ఏమిట్రా ? అలా చేస్తే లక్ష్మీ దేవిని అవమానించినట్లు అవుతుంది, ఇక ఇంట్లో నిలవమంటే ఎలా ---?
అశోక్ – అవన్నీ కట్టు కథలు నాన్నగారూ, నిజం చెప్పాలంటే గడ్డం పెంచుకొని అసహ్యంగా ఉండడమే దరిద్ర లక్షణం.
గోవిందయ్య – నువ్వన్న మాటా నిజమేన్రా అబ్బాయ్ , కాని దేనికదే కరక్టు. గడ్డం గీసుకోవలసిందే, కాని లక్ష్మి వారం నాడు కాదు.
అశోక్ --- ( గడ్డం గీసుకోవడం ముగించి, ముఖానికి అంటిన సబ్బుని టవల్’తో తుడుచుకొంటూ ) నాన్నగారూ ! ఈ మాటలన్నీ మనుష్యులకి , ధనం పట్ల ఎరుక కలిగి ఉండడానికి ఏర్పరిచినవి. ధనాన్ని అపవ్యయం చేయడమే దరిద్రానికి కారణమవుతుంది. అంతే గాని గడ్డం గీసుకోవడానికీ దీనికీ సంబంధం లేదు..
ఆశ ---( ఆమెకీ సంవాదం నచ్చదు, తన విసుగుని గౌరి మీద చూపిస్తుంది. గౌరి రెక్క పట్టకొని లాగుతూ --) గౌరీ, పదవే లోపలికి వెళ్లి అన్నం తిందువు గాని, -- ( అంటూ గౌరిని తీసుకొని వంటింటి ద్వారం నుండి లోపలికి పంపిస్తుంది ) (గౌరి వెళ్లాక ) – ఏమండీ, ధనాన్ని అపవ్యయం చెయ్యడం తప్పని మీరు ఒప్పుకున్నట్లే కదా ?
అశోక్ --- అవును ఆశా !
గోవిందయ్య --- అపవ్యయం మాట అలా ఉంచరా, మితవ్యయం గురించి నీ అభీప్రాయం ఏమిటి ?
అశోక్ --- మితవ్యయం మంచిదే అంటే , లోభిని ప్రశంశించినట్లే అవుతుంది నాన్నగారూ !
ఆశ --- లోభ గుణం కూడా మంచిదేనండి. కాని అది ఖర్చు పట్ల కాక ఆదాయం పట్ల చూపించ గలగాలి.
అశోక్ --- అంటే నీ ఉద్దేశం ఏమిటి ఆశా ?
ఆశ --- నెలంతా ఆఫిసులో రెక్కలు ముక్కలు చేసుకొని కేవలం జీతపు రాళ్లు మాత్రం తెస్తున్నారు మీరు ----
అశోక్ --- ( ఆశ మాట మధ్యలో అడ్డుపడి ) అవును నిజమే, జీతం కాక మరేం వస్తుంది, ఇంకా ఏం తెమ్మంటావ్ ?
ఆశ --- ( గోముగా ) నేను చెప్పే మాట సరిగా అర్థం చేసుకోండి, జీతం ఎలాగూ వస్తుంది అది కాక పై సంపాదన ఏదీ రాదంటారా ?
అశోక్ – (కోపంగా ) ఆశా నువ్వు మాట్లాడేదేమిటో, నీకు అర్థమవుతోందా ?
గోవిందయ్య – (కలగ జేసుకొని ) అది కాదురా అబ్బాయి, కోడలు ఇప్పుడు కాని మాట ఏం అందని అలా కోపగిస్తావ్ ? నీ ఆఫీసు సీటు , ‘కామధేనువు ’ లాంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కనక వర్షం కురిపిస్తుంది , కాదంటావా ?
అశోక్ --- మీ మాటలు ఇప్పుడు అర్థమయ్యాయి. ( భావుకతతో ) లంచం, లంచం—లంచం , లంచం తీసుకోవడమే దరిద్రానికి ముగింపు అంటారా ?
( గోవిందయ్య, ఆశ , అశోక్ చెరో ప్రక్కా చేరి నిలబడతారు. ఆ తరువాత ఇద్దరూ ఒకే సారి మాట్లాడతారు )
గోవిందయ్య + ఆశ --- అవును లంచం పాపం కాదు, సమాజానికి సేవ చేసే పుణ్య కార్యం , ఆ సేవలో ఇచ్చి పుచ్చుకోవడం అందరూ చేస్తున్నదే !
అశొక్ – కాదు , కానే కాదిది పుణ్య కార్యం, ఆత్మాభిమానాన్ని హత్య చేస్తేనే కాని వీలుకాని పని. లంచం చేపట్టడానికి నేను నడుం కట్టలేను.
ఆశ --- ( నిరాశ చెంది విసుగుతో ) అయితే మీరు కూడా వినండి, నేను కూడా నా ఆత్మాభిమానాన్ని చంపుకొని మీతో సంసారం చెయ్యలేను.
అశోక్ --- అంటే ?
ఆశ --- ఏముంది, పెళ్లాన్ని అయినందుకు మీకు వండిపెట్టి సేవలు చేస్తాను, కాని భార్య మాత్రమే ఇవ్వ గలిగే అమూల్యమైన ప్రేమాభిమానాలు అందించలేను, భార్య ప్రేమని పొందడమనేది భర్త యొక్క అదనపు సంపాదన అర్థమయిందా ?
అశోక్ -- ఆశా, నువ్వేమంటున్నావో తెలుసా ?
ఆశ – నేను మీ భాషలోనే మాట్లాడుతున్నాను. ఇకు ఏది ఆదర్శమో నాకూ అదే ఆదర్శం , లంచం లేనిదే నా ఆత్మార్పణ చేసుకోలేను.( అంటూ వంటింటి లోకి వెళ్లిపోతుంది )
( అశోక్ ఆమె మాటలకి స్తబ్ఢుడై నిలబడి పోతాడు )
( గౌరి ఆశ వెళ్లిన ద్వారం నుండే వెలుపలికి వస్తుంది, ఆమె వీపుకి స్కూలు బేగు తగిలించి ఉంటుంది )
గౌరి --- నాన్నా ! మీ కోసం ఈ రోజు వేడి నీళ్లు పెట్టలేదంట, చన్నీళ్ల తోనే స్నానం చెయ్యమని అమ్మ చెప్పమంది. ( అంటూ వీధి లోకి వెళ్లిపోతుంది )
అశోక్ – (తనలో ) సరే ఆశా, ఈ రోజు నీకు లొంగక, చన్నీళ్లతోనే నా ఆత్మని శాంతింప చేసుకొంటాను.
( అంటూ అశోక్ పడక గదిలోకి వెళ్తాడు. ఆశ వంటింట్లోంచి వస్తుంది. రెండు నిండు సంచీలని రెండు చేతులతోనూ పట్టుకొని వస్తుంది. ఆ రెండు సంచీల లోనూ దొండకాయలు ఉంటాయి. ఆశ ఆ సంచీలని గోవిందయ్యకి అందిస్తుంది. గోవిందయ్య వాటిని అందుకొని క్రింద పెడతాడు. ఒక సంచీ లోంచి కొన్ని దొండాకాయలు చేతిలోకి తీసుకొంటాడు )
గోవిందయ్య --- దొండాకాయలు లేతగా దోరగా ఉన్నాయమ్మా ! వీటిని ఈ పట్నంలోనే అమ్మితే మంచి లాభం వస్తుంది.
ఆశ --- ఏం చేస్తాం మామయ్యగారూ ! ఈ పట్నం లోనే అమ్మితే , అతనికి తెలియకుండా ఉండదు. పెరట్లో కాచిన కూరగాయలు అమ్మడం అతని ఆదర్శాలకి విరుధ్ధం కదా ! మీరు వాటిని ----
( ఆశ ఆ మాటలు అంటూ ఉండగానే వంటింట్లోంచి కుక్కరు విజిల్ వేస్తుంది.
గోవిందయ్య --- చింతించకమ్మా ! ఈ రోజు దగ్గరలోని పల్లెలో సంత ఉంది. అశోక్ ఆఫీసుకి వెళ్ళిన వెంటనే నేను వీటిని తీసుకొని బస్సులో అక్కడికి వెళ్లి వీటిని అమ్మేస్తాను. అన్నట్లు వీటీని తూకం వేయించావా ?
( మళ్లీ వంటింట్లోంచి కుక్కరు విజిల్ వేస్తుంది )
ఆశ – మామయ్యగారూ ! కుక్కరులో పప్పు , కూర రెండూ పెట్టాను. పప్పులో నీళ్లు ఎక్కువే ఉన్నాయి.కాని కూర అడుగంటి పోతుందేమో ! వెళ్లి చూసి వస్తాను—( అంటూ లోపలికి వెళ్తుంది )
గోవిందయ్య --- ( తనలో ) ఇవి అశోక్ కంట పడకుండా దాచాలి, లేక పోతే గడబిడ అవుతుంది. ( గోవిందయ్య ఆ సంచీలని తన పై పంచె ఉత్తరీయంతో కప్పి, మొక్కల మాటున దాస్తాడు)
( మధ్య ద్వారం నుండి ఆశ వస్తుంది. ఆమె చేతిలో చిన్న ఖాళీ సంచీ ఉంటుంది )
ఆశ – మామయ్యగారూ ! కూర నేననుకొన్నట్లుగానే కుక్కరు గిన్నెకి అంటుకొని పోయింది. ఉత్త పప్పుతో అతనికి భోజనం ఎలా పెట్టను ?
గోవిందయ్య – కాసిన్ని దొండకాయలు తీసి వేయించెయ్యవమ్మా !
ఆశ --- అవి పది కిలోలకి కొంచెం తక్కువగా ఉన్నాయి మామయ్యగారూ ! మరికొన్ని తీసేస్తే అవి ఇంకా తగ్గిపోతాయి, మీకు వాటిని అమ్మడం కష్టమవుతుంది.
గోవిందయ్య --- అయితే ఇప్పుడేం చెయ్యమంటావ్ ?
ఆశ --- మామయ్యగారూ ! మనం పప్పు, ఆవకాయతో తినెయ్యవచ్చు, కాని అతనికి కూర కావాలిగా , అందుకని కొన్ని బంగాళా దుంపలు ఈ సంచీలో పట్టుకొని రండి .
గోవిందయ్య --- అలాగేనమ్మా ! ఆ మాత్రం దానికి దుంపలు కొనడం దేనికి, ప్రక్క ఇంట్లో అప్పు అడిగి తెస్తాను.
( అంటూ ఖాళీ సంచీ తీసుకొని వీధి లోకి వెళ్తాడు )
ఆశ--- (తనలో) కోడలిని అర్థం చేసుకొనే మీ లాంటి మామయ్య దొరకడం నా అదృష్టం . మీ అబ్బాయికి మీ బుధ్ధులు రాలేదెందుకో మరి ! అయినా నేను ఓటమిని అంగీకరించను , అనుకొన్నది సాధించి తీరుతాను. అతనిని మన దారికి తెస్తాను.
( గోవిందయ్య బయటీ నుంచి దుంపల సంచీతో వచ్చి , దానిని ఆశ చేతికి ఇస్తాడు. ఆశ దానిని తీసుకొని మధ్య ద్వారం లోకి వెళ్తుంది. అశోక్ పడక గదిలోంచి వస్తాడు. ఆఫీసు డ్రెస్సులో ఉంటాడు. )
ఆశోక్ --- ఆశా , నేను రెడీ !
ఆశ ---- ( వంటింట్లోంచే జవాబిస్తుంది.) కాస్త ఆగండి, కూర ఉడకగానే అన్నం వడ్డించేస్తాను.
అశోక్ ---ఆలస్యం అయిపోతుంది, ఆశా ! ఇవాల్టికి పప్పుతోనే తినేస్తాలే,
( అంటూ వంటింటి ద్వారం లోకి వెళ్తాడు. ఆశ అక్కడినుంచే వస్తుంది. )
ఆశ --- మామయ్యగారూ , రండి మీకు కూడా వడ్డించేస్తాను.
గోవిందయ్య --- అదేంటమ్మా , అశోక్’కి కూర వండ లేదా ?
ఆశ --- అవును మామాయ్యా , ఈ రోజు అతనికి పాపుతోనే అన్నం పెడతాను. ఈ రోజే కాదు అతను ఉత్త పప్పుతోనే భోజనం చేయడాని అలవాటు పడేలా చేస్తాను. అతని ఆదర్శాలు, సిధ్ధాంతాలు అన్నీ మంట కలిసే వరకూ ఈ అంతర్యుధ్ధం నడుస్తూనే ఉంటుంది.
Comments
Post a Comment