Skip to main content

వృక్ష విలాపం --- ౩

గోవిందయ్య --- అదేంటమ్మా , అలా అంటావు, మనిషి చెట్టు అయిపోవడామేమిటి,నీకు మతి గాని పోలేదు కదా ?

ఆశ --- లేదు మామయ్యగారూ , నేను నిజమే చెబుతున్నాను. కావాలంటే మీరే పరీక్షించి చూడండి.

గోవిందయ్య – నిజమా, తమాషా చేయడం లేదు కద !

(అంటూ అశోక్ దగ్గరకు వెళ్తాడు. వెళ్లి అశీక్’ని కదిపి, కుదిపి చాల రకాలుగా ప్రయత్నం చేసి చూస్తాడు. అశోక్ నిరుత్తరుడై ,స్థిరుడై , కదలక, మెదలక ఉంటాడు )

ఆశ – చూసారా మామయ్యగారూ, ఎంత అన్యాయం చేసారో, చెట్టునయి పోతానని మనకి చెబ్తూనే ఉన్నారు, ఏ మందు మాకూ తిన్నారో ఏమో చివరకి అన్నంత పనీ చేసారు.

గోవిందయ్య --- అమ్మా, నేనొక కాలు, నువ్వొక కాలూ పట్టుకొని గట్టీగా లాగుదాం పద, కదుల్తాడో లేదో చూద్దాం !

ఆశ --- అలాగే మామయ్యగారూ !

( గోవిందయ్య, ఆశ అశోక్ చెరొక కాలూ పట్టుకొని లాగుతారు. అశోక్’లో చలనం ఉండదు, కాని వారిద్దరూ స్టేజి మీద బొక్కా, బోర్లా పడతారు , అది చూసి గౌరి ఏడుస్తూ వాళ్ల దగ్గరకు వస్తుంది )

( అశోక్ పైన గ్రీన్ స్పాట్ లైటు పడుతుంది. తక్కిన స్టేజి లైటింగు డిమ్ అవుతుంది. గోవిందయ్య, ఆశ , గౌరి ఫ్రీజ్ అవుతారు. అశోక్’లో చలనం వస్తుంది , స్టిల్’లో ఉన్న వాళ్ల చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తాడు. గోవీమ్దయ్య ప్రక్కగా వెళ్లి నిలబడతాడు)

అశోక్ ---- గ్రామం లోని సంతలో దొండకాయలు అమ్మి వచ్చావా నాన్నా ! పది కిలోల కన్న తక్కువగా ఉన్న సరుకుని గ్రామస్థులని బురడీ కొట్టి అమ్మేసావా ? గొప్ప పని చేసావు నాన్నా ! పెద్దవాడవయి ఉండి కోడలికి గుణ పాఠం చెప్పడం అటుంచి, దానికే వత్తాసు పలికి, అవినీతికి అమ్ముడు పొమ్మంటావా ? మీ దురాశా యఙ్ఞంలో సమిధనయి, ఇలా చెట్టుగా మారాను. ఇప్పుడేం చేస్తావు ? కాయ, పండు, కలప చివరికి ఆకులు కూడా ఇవ్వని చెట్టునయ్యాను. నాతో ఏం సంపాదిస్తావ్, ఎలా సంపాదిస్తావ్ ? చూడాలని ఉంది నాన్నా !

( ఆ మాటలన్నాక అశోక్ తిరిగి వచ్చి చెట్టులాగ నిలబడతాడు. గ్రీన్ స్పాట్ ఆరిపోతుంది. స్టేజి లైట్లు ఎప్పటిలాగే ప్రకాశవంత మవుతాయి )

( గోవిందయ్య, ఆశ, గౌరి లలో చలనం వస్తుంది )

గోవిందయ్య – ఆశా , చింతించకు, వాడు తిన్న మందూ మాకూ ఏదైనా సరే డాక్టర్ని పిలిచి ఇప్పుడే కక్కిస్తాను. నువ్వు గౌరిని తీసుకొని లోపలికి వెళ్లు, పిల్ల పాపం బెదిరి పోయింది

ఆశ --- అలాగే మామయ్యా,!

గౌరి --- తాతగారూ ! డాక్టరు గారు వచ్చి మందు వేస్తే నాన్నగారు తిరిగి మామూలుగా అయిపోతారా ?

( దుఃఖంతో అడిగిన గౌరిని ఆశ దగ్గరకి తీసుకొంటుంది. )

ఆశ – అవునమ్మా ! నాన్న తప్పక మళ్లీ మనిషి అయిపోతారు. పద, ముఖం కడుక్కొని తయారవుదువు గాని.

( అంటూ గౌరిని తీసుకొని పడక గదిలోకి వెళ్తుంది )

( గోవిందయ్య వీధిలోకి వెళ్తాడు )

( అశోక్ ఒక్కడే స్టేజి మీద నిలబడి ఉంటాడు )

( గోవిందయ్య ఒక డాక్టరుతో వీదిలోంచి వస్తాడు )

గోవిందయ్య --- డాక్టరు గారూ ! అడుగోనండి వాడే నా కొడుకు, పేరు అశోక్ , ఇప్పుడు చూడండి , అశీకిల్లు వృక్షంలాగ అయిపోయాడు.

డాక్టరు – గాబరా పడకండి, నా సర్వీసులో చాల మంది రోగుల్ని చూసాను, ఇలా జడంలాగ మారిపోయిన వాళ్లని -----

గోవిందయ్య – నిజమా డాక్టరు గారూ !!

డాక్టరు – నిజమే , కాని వాళ్లకీ , ఇతనికీ కొంచెం తేడా ఉంది.

గోవిందయ్య --- ఏమిటి డాక్టర్ ఆ తేడా ?

డాక్టరు --- వాళ్లలో కొంత మంది నా ట్రీట్’మెంటు పూర్తయ్యాక జడులయ్యారు.

గోవిందయ్య – తక్కిన వాళ్లు డాక్టర్ ?

డాక్టర్ –మరికొంత మంది నా బిల్లు చూసాక చేష్టలుడిగి పోయారు.

గోవిందయ్య --- అంటే మీ బిల్లు అంత ఘాటుగా ఉంటుందా డాక్టర్ !

డాక్టర్ --- అవును, అప్పటి నుంచి నేను రోగుల దగ్గర ఫీజు అడగడం మానేసాను.

గోవిందయ్య--- ఈ మాట నాకు చాల సంటోషం కలిగించింది డాక్టరు గారూ ! అంటే మీరు ఫ్రీగా వైద్యం చేస్తారన్న మాట ?

డాక్టరు --- అలాగని నేను చెప్పానా గోవిందయ్యగారూ !

గోవిందయ్య --- ఇప్పుడేగా ఫీజు అడగడం మానేసానన్నారు ?

డాక్టరు – రోగుల దగ్గర అడగడం మానేసానన్నాను గాని రోగి బంధువులని అడగడ లేదని అనలేదే ! నిజానికి నేను ఫీజు అడగను, కాగితం మీద వ్రాసి క్లయింటుకి చూపిస్తాను.

గౌరి ---- డాక్టర్ అంకుల్ ! మీరు రండి , నాన్న గారిని త్వరగా చూడండి.

( అంటూ గౌరి డాక్టర్ని అశోక్ దగ్గరకి తీసుకొని వెళ్తుంది . డాక్టరు అశోక్’ని రకరకాలుగా పరీక్షగా చూస్తాడు.)

డాక్టర్ --- రోగి హృదయ గతి, నాడి శ్వాస అన్నీ సరిగానే ఉన్నాయి ! రోగ లక్షణలేవీ లేవే !?

ఆశ --- డాక్టరు గారూ ! ఇతని రోగమేమిటంటే , ఇతను చెట్టులాగ నిలబడి ఉండిపోయారు. కేవలం ఇతని నడక , కదలికలు స్తంభించిపోయాయి !

గౌరి ---- డాక్టర్ అంకుల్ ! ప్లీజ్, మా నానగారికి నయం చెయ్యండి, ఏదైనా ఇంజక్షన్ ఇవ్వండి.

డాక్టర్ --- నిజమేనమ్మా, నువ్వు నిజమే చెప్పావు, ఒక ఇంజక్షన్ ఇచ్చి చూద్దాం !

( అంటూ ఒక ఇంజక్షన్ ఇస్తాడు , అశోక్’లో చలనం ఉండదు )

డాక్టర్ --- ఇతనికి రోగమేదీ లేదమ్మా ! శారీరికంగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కేవలం కదలికలు లేవు అంతే !

ఆశ --- ఎందుకు లేవు డాక్టర్ ?

డాక్టర్--- ఎందుకంటే ఇతను మానసికంగా బాధ పడుతున్నాడు. ఇతను తనని తాను చెట్టునని అనుకొంటున్నాడు .అందుకే కదలడం మానేసాడు.

ఆశ – ఎలా అనుకొంటే అలా అయిపోతారా డాక్టర్ ?

డాక్టర్ – అది ఆలోచనా స్థాయిని బట్టి ఉంటుంది ఆశాదేవి గారూ ! సాధారణంగా మన ఆలోచనలు ఒక బిందువు చుట్టూ కేంద్రీకరించవు, అలా గాని జరిగితే దానినే ధ్యానం అంటారు. అలా ధ్యానంలో గంటల తరబడి ఉండిపో గలిగితే సమాధి స్థితి కలుగుతుంది. ఆ స్థితిలోనే బాహ్య ప్రపంచ స్మృతులు ఉండవు. అలాంటి సమాధి స్థితిలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. సమాధిలోకి వెళ్లే ముందు తను చెట్టునని అతను అనుకొన్నాడు, అంతే ! చెట్టు అయిపోయాడు.

గోవిందయ్య--- డాక్టరు గారూ ! మీరు యొగపుంగవుల లాగ మాట్లాడుతున్నారు. ముందు ఈ సంగతి చెప్పండి, అశోక్ బాగవుతాడా లేదా ?

డాక్టరు – బాగయే అవకాశం ఉంది. నా లాంటి ఫిజీయన్లు ఇతనిని బాగు చేయలేరు ! మానసిక లేక న్యూరో సర్జన్లు ఇతనిని బాగుచేయవచ్చు !

గోవిందయ్య --- అలాంటి డాక్టర్లెవరైనా మీకు తెలిసిన వారెవరైనా ఉన్నారా ?

డాక్టరు --- ఈ పట్నంలో లేరనే చెప్పాలి. మీరు ఇతనిని డాక్టరు దగ్గరకు తీసుకొని వెళ్లలేరు కదా, డాక్టరే ఇక్కడికి రావాలి కదా ? అందులోనూ ఈ రోగిని బాగు చేసేందుకు కొంతమంది డాక్టర్ల సమూహం అవసరమవుతుంది ! అందరూ ఒకేసారి ఈ చోటుకి రావడం కష్టసాధ్యం అవుతుంది. అందుకని పేపర్లో ప్రకటన వేయించండి.

గోవిందయ్య --- అర్థమయింది డాక్టర్ ! మీ ఫీజు ఎంతో చెప్తే---

డాక్టరు – అవసరం లేదు, బిల్లూ లేదు, సొమ్మూ అక్కర్లేదు ! వింతల్లోకల్లా వింతని చూసాను ఈ రోజు ! మనిషి చెట్టుగా మారడమనే వింత , అదీ ఫ్రీగా ! వెళ్తాను గోవిందయ్యగారూ !

( అంటూ డాక్టర్ వెళ్లిపోతాడు )

గోవిందయ్య --- విన్నావా ఆశా , డాక్టరు గారు చెప్పిన మాట !

ఆశ --- విన్నాను మామయ్యగారూ ! ఏముంది అర్థం కాక పోవడానికి !?ఇంక ఇతనికి ఈ రోగం నుండి విముక్తి లేనట్లేనని తెలిసి పోయింది. ( అంటూ ఏడుస్తుంది )

గోవిందయ్య --- అలా నిరాశపడకమ్మా ! డాక్టర్ చెప్పినదేంటంటే అశోక్’కి వైద్యం కొంతమంది స్పెషలిస్టుల బృందం ద్వారానే సాధ్యమవుతుందని , వాళ్లమ్దరూ ఒకేసారి వచ్చి రోగిని చూడాలంటే పత్రికలలో ప్రకటన ద్వారానే సాధ్య మవుతుందని ! వింటున్నావా ఆశా ?

ఆశ ---- వింటున్నాను మామయ్యగరూ ! ( ఆంటూ ఏడుస్తుంది )

గోవిందయ్య --- నేను ఇప్పుడే ప్రెస్సుకి వెళ్లి, ఒక జర్నలిస్టుని తీసుకొని వస్తాను.

గౌరి --- తాతయ్యా ! జర్నలిస్టు వస్తే నాన్నకి బాగయి పోతుందా ? ( అమాయకంగా అడుగుతుంది )

గోవిందయ్య --- అవునమ్మా , అత్అను వచ్చి నానా ఫోటోలు తీసి పత్రికలలో ప్రకటన ఇస్తాడు. అప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు పట్ణాల నుండి వచ్చి, నాన్నని చూసి, పరిక్షించి బాగుచేస్తారమ్మా !

గౌరి --- అలాగయితే వెంటనే వెళ్లండి తాతయ్యా, నాన్న పాపం ! టిఫిన్ కూడా తీసుకోలేదు. ఇంకా రాత్రి అయితే చలికి నాన్నాకి జలుబు కూడా చేసేస్తుంది !

( ఆశ గౌరి మాటలు విని ఆమెని ఒళ్లోకి తీసుకొని ఏడుస్తుంది )

గోవిందయ్య --- ధైర్యంగా ఉండండమ్మా ! ఇప్పుడే వెళ్లి వస్తాను.

( గోవిందయ్య బయటికి వెళ్తాడు. స్టేజి మీద ఆశ, గౌరి ఒకరి నొకరు ఓదార్చుకొంటూ ఉంటారు. ఇంతలో బయటి నుంచి గొవిందయ్య దారి చుపిస్తూ ఉండగా చేతిలో కెమేరాతో జర్నలిస్టు ప్రవేశిస్తాడు )

జర్నలిస్టు --- గోవిందయ్యగారూ ! ప్రెస్సు వాళ్లని పిలవడానికి వెళ్లనక్కర లేదు, ఎక్కడ సమాచరముందో అక్కడికి ప్రెస్సు ప్రత్యక్షమవుతుంది !

గోవిందయ్య --- అప్పుడే మీకెలా తెలిసిపోయిందండీ !?

జర్నలిస్టు --- మీ డాక్టరుగారే నాకు ఫోనులో నాకు సందేశం ఇచ్చేసారు.

గోవిందయ్య --- అలాగా ! చాల సంతోషం ఇదుగో ఇలా వచ్చి నా కొడుకుని చుడండి. వాడు నిజంగానే చెట్టుగా మారి పోయాడు. ( అంటూ అశోక్’ని చూపిస్తాడు )

( జర్నలిస్టు అశోక్ దగ్గరకి వచ్చి చూస్తాడు. అశోక్’ని కుదిపి, కుదిపి చూస్తాడు. గ్రుచ్చి గిల్లి చూస్తాడు. కితకితలు పెట్టి చూస్తాడు. ఇంకా రకరకాలుగా హిమ్సించి చూస్తాడు, కాని అశోక్’లో చలనం ఉండదు )

జర్నలిస్టు --- గోవిందయ్యగారూ ! నాకయితే మీ అబ్బాయి చెట్టుగా మారాడన్న విషయం తెలిసింది. ఇది నిజంగానే సంచలన వార్త అవుతుంది ! కాని ఇతని ఫొటో పేపర్లో వేస్తె, చూసిన జనాలకి ----

గోవిందయ్య – (సంభ్రమంతో ) జనాలు ఎగబడి వస్తారా సార్ ?

జర్నలిస్టు--- రారు అనే అనిపిస్తోంది ! ఎందుకంటే ఏ కోణం లోంచి చూసినా ఇతను మనిషి లాగే కనిపిస్తున్నాడు తప్ప చెట్టులాగ కనిపించడం లేదు.

గోవిందయ్య --- జనాలు రావాలంటే ఏం చేయాలి సార్ ?

జర్నలిస్టు – చెప్తానుండండి—(అంటూ ఆశ వైపు చూసి ) ఆశాదేవి గారూ ! ఏదీ ఒక చీపురు కట్ట తీసుకొని రండి

ఆశ --- చీపురు కట్ట ఎందుకండీ ?

జర్నలిస్టు--- అబ్బ, ప్రశ్నలు వేసి విసిగించకండి, చీపురుకట్ట తెండి.

( గౌరి ఇంట్లోకి వెళ్లి చీపురు కట్టతో వస్తుంది )

( జర్నలిస్టు ఆ చీపురుకట్టని అశోక్ కుడి చేతి వంపులొ పెడతాడు. అలా పెట్టాక కెమేరాలొంచి చూసి )

జర్నలిస్టు --- ఇప్పుడొక బాల్చీ , తాడుతో సహా తీసుకొని రండి.

( ఆశ లోపలికి వెళ్లి ఒక బాల్చిని తాడుతొ సహా పట్టుకొని వస్తుంది )

( జర్నలిస్టు ఆ బాల్చిని అశోక్ రెండు కాళ్ల సందున నిలబెట్టి , తాడుని అశోక్ నడుము కేసి చుడతాడు. తిరిగి కెమేరాలోంచి చూస్తాడు )

జర్నలిస్టు --- ఇప్పుడు ఒక అలుకు గుడ్డని, చిరిగి పొయిన తట్టని పట్టుకొని రండి .

( ఆశ లోపలికి వెళ్లి ఒక చింకి తట్టని, అలుకు గుడ్డని తెస్తుంది )

( జర్నలిస్టు చింకి తట్టని అశోక్ తలమీద పెడతాడు, అలుకు గుడ్డని ఎడమ చేతి వంపులో ఆర వేస్తాడు. మళ్ళి కెమేరాలోంచి చూస్తాడు )

జర్నలిస్టు --- గోవిందయ్యగారూ , ఏదైనా పాము ఉందా మీ ఇంట్లో ?

గోవిందయ్య --- పామా ! పాములు ఇళ్లల్లో ఉండవండీ , బొక్కల్లో ఉంటాయి !

జర్నలిస్టు – అసలైన పాము కాదండి, నకిలీదైనా ఫరవాలేదు, చచ్చినదైనా ఫరవాలేదు, తెచ్చి ఇతని మెడలో వెయ్యండి

గోవిందయ్య --- గౌరి బొమ్మల బుట్టలో ఒక ప్లాస్తిక్ బల్లి ఉమ్దండీ, తెమ్మంటారా ?

జర్నలిస్టు --- సరే, తెప్పించండి !

( గౌరి ఇంట్లోకి వెళ్లి ఒక బల్లిని తెచ్చి అతని చేతికి ఇస్తుంది )

( జర్నలిస్టు ఆ బల్లిని అశోక్ ఛాతీ మీద అంటిస్తాడు. తిరిగి కెమేరా లోంచి చూస్తాడు )

జర్నలిస్టు --(తృప్తితో ) ఇప్పుడు అలంకారాలన్నీ పూర్తి అయ్యాయండీ ! ఏ మానవ మాత్రుడూ ఇలాంటి అలంకారాలతో ఫొటో దిగడు కాబట్టి , ఇప్పుడీయన ఫొటో తీసి , క్రింద చెట్టు అని వ్రాసినా ఎవరైనా నమ్ముతారు ఏమంటారు గోవిందయ్య గారూ ?

గోవిందయ్య --- ఇంత సేపటికి మీ ఆశయం , అభిప్రాయం అర్థమయ్యాయండీ , నిజమే చెప్పారు.

జర్నలిస్టు --- ఆశాదేవిగారూ , రండి ! ఇలా వచ్చి మీ ఆయన ప్రక్కనే నిల్చోండి. మీ ఫొటోని కూడా వెయ్యాలిగా మరి !

( ఆశ ఒక పువ్వుల మొక్క దగ్గర నిలబడుతుంది. )

ఆశ --- నా ఫొటో ఈ పూల చెటు దగ్గరే తీయండి. ఆ చెట్టుతో వద్దు.

జర్నలిస్టు --- ఏమండీ, అసహ్యంగా కనిపిస్తుందనా, సందేహిస్తున్నారు ?

( ఆశ జవాబివ్వదు )

జర్నలిస్టు – అర్థమయింది లెండి. సరే, అక్కడే నిల్చోండి

( అంటూ చెట్టునీ ఆమెనీ ఫొటోలు తీస్తాడు అతనా ఫోటోలు తిస్తూ ఉండగా, నేపథ్యం లోంచి భజగోవింద శ్లోకాలు వినిపిస్తాయి)

శ్లోకం --- భజ గోవిందం, భజ గోవిందం / గోవిందం భజ మూఢ మతే !
యావత్పవనో నివసతి దేహే/ తావత్పృఛ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే / భార్యా భిభ్యతి తస్మిన్ కాయే !

( తాత్పర్యం --- ఎప్పటి వరకు జీవిలో ప్రాణ వాయు సంచారం ఉంటుందో అప్పటి వరకు , లోకులు అతని కుశల సమాచారాలు అడిగుతారు. ప్రాణం పోయిన మరుక్షణం , అతని భార్య సైతం అతనిని అసహ్యించుకొంటుంది )

జర్నలిస్టు --- గోవిందయ్య గారూ మీరు కూడా రండి. ఫొటో తీస్తాను.

గోవిందయ్య --- నా ఫొటో మాత్రం నా చెట్టుతోనే తియ్యండి.

( అంటూ అశోక్ దగ్గరకి వెళ్లి నిలబడతాడు. ఆశ గౌరిని తీసుకొని ఇంట్లోకి వెల్లిపోతుంది )

( జర్నలిస్టు గోవిందయ్య ఫొటోని అశోక్’’తో తీస్తాడు )

జర్నలిస్టు --- గోవిందయ్య గారూ ! నాకు సెలవిప్పించండి. ఈ ఫొటో వెంటనే పేపర్లో వేయిస్తాను. ఫొటో చుసిన మరు క్షణం నుండే మీ ఇంటికి జనాలు తండోప తండాలుగా వస్తారు. ఎందుకంటే ఇది అలౌకిక ఘటాన కదా ! నా సలహా ఏమిటంటే మీరు టికెట్టు పెట్టి జనాలకి ఈ వింత వృక్షం చూపించండి.

గోవిందయ్య ---పదహరణాల మాట సెలవిచ్చారండీ ! ఇప్పుడె మీతో పాటు వచ్చి, బిల్లు బుక్కులు మీ ప్రెస్సులోనే వేయిస్తాను.

( అంటూ గోవిందయ్య బయటి ద్వారం దగ్గరకి వెళ్తూ స్టేట్యూ అవుతాడు .తెరలోంచి భజ గోవింద శ్లోకాలు వినిపిస్తాయి.)

శ్లోకం --- భజ గోవిందం, భజ గోవిందం,/ భజ గోవిందం మూఢమతే !
మూఢ జహీహి ధనాగమ తృష్ణాం / కురు సద్భుధ్ధిం మనసి విత్రుష్ణాం,
యల్లభసే నిజ కర్మోపాత్తం / విత్తం తేన, వినోదయ చిత్తం !

( తాత్పర్యం – ఓ మూఢ మానవుడా ! ధనాన్ని కూడబెట్టాలనే లాలసని విడిచిపెట్టు ! నీవు నీ మనస్సులో తృప్తిని సంతోషాన్ని నిలుపుకో ! ధనాగమం అనేది నీ కర్మ ఫలితసన్ని బట్టి కలుగుతుందని తెలుసుకో ! )

( గోవిందయ్య బయటికి వెళ్తాడు )

( గౌరి మధ్యద్వారం నుండి ప్రవేశిస్తుంది. అశోక వృక్షం దగ్గరకి వెళ్తుంది.)

గౌరి --- ఎంత అసహ్యంగా అలంకరించారో డాడీని ! ఇలా చెయ్యడానికి వీళ్లకి మనసెలా ఒప్పిందో !

( అంటూ గౌరి ముందుగా అశోక్ ఎడమ చేతి వంపులొ ఆరేసిన అలుకు గుడ్డని తీసేస్తుంది. తరువాత చీపురు కట్టని , బాల్చీని తీసేస్తుంది. దాని తాడుని విప్పేసి దూరంగా పెడుతుంది. ఆ తరువాత ఇమ్ట్లోంచి ఒక స్టూలు తెచ్చుకొని , దాని మిద ఎక్కి, అశోక్ తలమీద పెట్టిన తట్టనీ, ఛాతీకి అంటించిన బల్లినీ తీసేస్తుంది. తరువాత స్టూలుని లోపలికి తీసుకొని వెళ్లి, మరల ఒక కప్పు టీతో వస్తుంది.)

గౌరి --- నాన్నా ! నీకు టీ అంటే ఇష్టం కదా నాన్నా , తాగు నాన్నా, తాగు !

( అంటూ టీని అశోక్ కాళ్ల మధ్యలొ, చెట్టుకి నీళ్లు పోసే విధంగా పోస్తుంది. ఆ తరువాత ఖాళీ కప్పు పట్టుకొని లోపలికి వెళ్లిపోతుంది )

( గౌరి వెళ్లిన తరువాత అశోక వృక్షం మీద గ్రీన్ కలర్ స్పాట్ లైటు పడుతుంది. స్టేజి లైట్లు డిమ్ అవుతాయి. అశోక్ కదుల్తాడు, స్టేజి మధ్యకి వచ్చి ప్రేక్షకులని ఉద్దేశించి మాట్లాడుతాడు )

అశోక్ --- రండి , మహానుభావులారా రండి, మీ అందరికీ ఈ అశోక్ సుస్వాగతం ! ( నమస్కరిస్తాడు ) ఈ వింతని చూడడానికి పని కట్టుకొని, పరుగెత్తుకొని , టిక్కెట్లు కొనుక్కొని మరీ రండి. నాకు తెలియక అడుగుతాను, మీకూ నాకూ తేడా ఎక్కడుంది ? మీరు కాళ్లూ చేతులూ కదిలించే చెట్లు అయితే నేను కదలలేని చెట్టుని ! ఏం మీలో వృక్ష లక్షణాలు లేవంటారా ? మీ ఆత్మ ఘోషని అణచివేసి, ధనార్జన కోసం, ఈ ప్రపంచం లోని అవినీతి అనే విష వాయువులని పీలుస్తూ, నైతికత అనబడే ప్రాణ వాయువులని విసర్జిస్తూ సంచరించే చెట్లు మీరందరూ ! కారంటారా ? అలా చెయ్యలేక, చేతకాక ఫక్తు చెట్టుగా మారిన వాణ్ని నేను ! ఇందులో వింత ఏముంది ? ఒక చెట్టుని మరొక చెట్టు చూసేందుకు రావడం వినోదం కాదా ఏం ? రండి నేనూ చూస్తాను, మీలో ఎందరు జడులో ,ఎందరు మహానుభావులో రండి, నేను కూడా గమనిస్తాను. ఎవరో ఒకరు ,‘ అన్నా హజారే’ లాంటి వారు వచ్చి సందర్శిస్తే నెను ధన్యుణ్ని అవుతాను, ఆ రోజే తిరిగి మనిషిగా మారుతాను. రండి , బాబూ రండి !

( అంటూ పక పకా నవ్వేసి తిరిగి తన స్థానం దగ్గరకి వెళ్లి చెట్టులా నిల్చొంటాడు )

( అశోక్ వచ్చి నిల్చోగానే స్పాటు లైటు ఆరిపోతుంది. స్టేజి లైట్లు కూడా ఆరిపోతాయి. అవి తిరిగి ప్రకాశవంత మవుతాయి. )

( ఆశ ఒక కుర్చీ మీద కూర్చొని కనబడుతుంది. అశోక్ ఎప్పటి లాగే చెట్టులాగ నిల్చొని ఉంటాడు. గోవిందయ్య ఆశ దగ్గరకి వస్తాడు )

గోవిందయ్య – ఆశా ! ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడడానికని వచ్చాను.

( ఆశ లేచి నిలబడుతుంది )

ఆశ --- చెప్పండి మామయ్యగారూ !

గోవిందయ్య – ఫరవాలేదు కూర్చోమ్మా !

ఆశ--- ( కూర్చొంటుంది ) విషయమేమిటో చెప్పండి.

గోవిందయ్య – చూడమ్మా, వీడు చెట్టుగా మారి ఏడాది పైన అయిపోయింది కదా ! ఎంతో మంది డాక్టర్లు, స్వామీజీలు వచ్చి చూసి వెళ్లి పోయరు కదా ! అయినా ఎవరూ అశోక్’ని మనిషిని చెయ్యలేక పోయారు. కదమ్మా ?

ఆశ --- అవును మామయ్యగారూ ! ఎవరూ అతనిని మామూలుగా చెయ్యలేక పోయరు ( అని నోట్లో చెంగు క్రుక్కుకొని ఏడుస్తుంది )

గోవిందయ్య – అదేనమ్మా, నేను కూడా చెప్తున్నది, ఇక పోతే ఈ చెట్టు కూడా ఇక మనుష్యులని ఆకర్షించ లేక పోతోంది. జనాలు రావడం దాదాపు మానేసారు. అందు వల్ల మన ఆదాయం కూడా పడి పోయింది, అవునా ?

ఆశ – నిజమే మామయ్యగారూ ! చెట్టు ఆదయం పడిపోయింది.

గోవిందయ్య --- అందుకే నేనొక బేరం పెట్టి వచ్చానమ్మా !

ఆశ ---బేరమా ! ఎలాంటి బేరం మామయ్యగారూ ?

గోవిందయ్య --- ఈ చెట్టునే బేరానికి పెట్టాను. పూర్తిగా దీన్ని అమ్మేయాలని నిశ్చయించుకొన్నాను.

ఆశ --- చెట్టుని అమ్మేస్తారా మామయ్యగారూ ?

( అలా అంటూనే ఆశ సంభ్రమాశ్చర్యాలతో నిలబడుతుంది )

గోవిందయ్య --- కూర్చోవమ్మా ఆశా ! గాభారా పడకు , ముందు నేను చెప్పేది విను. అశోక్ చనిపోయినట్లే భావించి, మన ప్రభుత్వం , అతని యొక్క ప్రావిడెంటు ఫండు, పెన్షను కూడా మనకి ఇస్తున్నారు కదా ! ఇప్పుడు దీన్ని అమ్మేస్తే వచ్చిన తప్పేమిటి ?

ఆశ --- మామయ్యగారూ , మరి నా మంగళ సూత్రం, నా సుమంగళీ తనం, ఏమవుతాయి ?

గోవిందయ్య --- నువ్వు నిత్య సుమంగళివమ్మా , దానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. నేను అమ్ముతానన్నది కట్టెలు కొట్టే వాళ్లకి కాదు, వాళ్లకి ఈ చెట్టు పనికి రాదు కదా !

ఆశ – మరి ఎవరికి అమ్ముతారు మామయ్యగారూ ? దీన్ని కొనే వాళ్లు ఎవరు ?

గోవిందయ్య --- అదెనమ్మా ఈ గోవిందయ్య వ్యాపార రహస్యం ! ఈ చెట్టుని కొనేది లండన్ లోని ఒక మ్యూజియం అధికారులు. దీనిని ఇలాగే తిసుకొని వెళ్లి అక్కడ గాజు తొట్టెలో పెడతారు. దాని వల్ల నీకు వైధవ్యమూ రాదు, అంతే కాదమ్మా, ఈ చెట్టు వల్ల మనకి మేడ మీద గది వేసుకోవడం ఇబ్బందిగా ఉంది కదా ? అది కూడా నెరవేరుతుంది.

ఆశ ---సరే, మామయ్యగారూ ! మీకు ఎలా సమ్మతమని తోస్తే అలాగే చెయ్యండి, ఎంతైనా ఈ చెట్టుకి యజమాని మీరే కదా ?

గోవిందయ్య --- అలాగంటావేమమ్మా ! నేను చేసేది నాకు ఒక్కడికే కాదు గదా., మేడ మీద గది కట్టిస్తే మ్రింద ఇంటిని మనం అద్దెకి ఇచ్చుకోవచ్చు, ఏమంటావు ?

ఆశ ---- సరదాకి అన్నాను మామయ్యగారూ , ఇంతకీ చెట్టుకి ఎంత బేరం పెట్టారు ?

గోవిందయ్య --- పది లక్షలు ఇస్తారమ్మా ! ఈ గోవిందయ్య ఏది చేసినా లాభానికే చేస్తాడు.

ఆశ – పది లక్షలా ! బేరం బాగుంది మామయ్యగారూ ! ఆ డబ్బు గౌరి పెళ్లికి పనికొస్తుంది.

గోవిందయ్య – నాకు తెలుసమ్మా, నువ్వు అంగీకరిస్తావని, అందుకే కూలీని కూడా పిలిపించాను. వాడు ఈ పాటికి వచ్చి ఉండాలే ! ఏమయ్యాడు చెప్మా ?

( వీధి వైపు వింగు లోంచి కూలీ ప్రవేశం )

కూలీ --- వచ్చేసానండి, ఏ పని చేయలో చెప్పండి.

( గోవిందయ్య కూలీ వంక అనుమానంగా చూస్తాడు )

గోవిందయ్య --- నేను పంపించమని అడిగింది నిన్నేనా ?

కూలీ --- నన్నేనండి, నేను సామాన్యమైన కూలీని కానండి, కూలోళ్లందరికీ లీడర్నండి, నా పేరు నరసింహంమండి !

గోవిందయ్య --- ఏమిటీ నువ్వు కూలీలకి నాయకుడివా ?

కూలీ ---అవునండి, నేను సామాన్యమైన కూలీని కాదండి.

గోవిందయ్య --- అంటే ఏమిటి నీ ఉద్దేశం ? నీకు కూలీ ఎక్కువ ముట్ట చెప్పాలా ?

కూలీ --- నేను న్యాయంగా అడిగిన కూలీ ఇచ్చెయ్యాలండి,

గోవిందయ్య --- అడీగినంతా ఇచ్చెయ్యాలా ?

కూలీ --- చెప్పాను కదండీ , నేను న్యాయంగానే అడుగుతానండి.

ఆశ --- ముందు పనేమిటో చెప్పండి మామయ్యగారూ ! వాడు ఎంత అడుగుతాడో చూద్దాం !

గోవిందయ్య --- సరేనమ్మా ! పనికి ముందే బేరాలు ఆడేవాళ్లంటే నాకు గిట్టదు, అయినా నువ్వు చెప్పేవు కాబట్టి--- ఇదుగో నరసింహం , ఈ చెట్టు చూసావా, దీన్ని వేళ్లతో సహా పెకలించి వేయాలి, అర్థమయిందా ?

( కూలీ నలుదిక్కులా చూస్తాడు, చెట్టు కోసం ! )

గోవిందయ్య – అలా దిక్కులు చూస్తావేం ? నీ రేటు ఏమిటో చెప్పు.

కూలీ --- చెట్టు ఎక్కడుంది బాబయ్యా ?

గోవిందయ్య --- ఓహో నికు తెలియదు కదూ ! ఇదుగో చెట్టులా నిలబడ్ద మా అబ్బాయి అశోకే నువ్వు కూల్చాల్సిన చెట్టు.

కూలీ --- తెలుసు బాబయ్యా ! ఆయన చెట్టుగా మారాడని తెలుసు, నేను టిక్కెట్టు కొని కూడా చూసాను. కాని----

గోవిందయ్య – ఇంకా కానీ ఏమిట్రా ? ముందు పని కానియ్యి.

కూలీ --- డబ్బులు సంపాదించే చెట్టుని కూల్చి వేయడం ఏమిటండీ ? దీన్ని కూల్చేయడం కాదు , దీని చుట్టూ గుడి కట్టించండి.. గుడి కట్టి పూజ చేయండి. బంగారు గ్రుడ్లు పెట్టే బాతుని ఎవరైనా చంపుకొంటారేంటండి ?

గోవిందయ్య --- ఒరేయ్ ! ఎక్కువగా మాట్లాడకు, నువ్వీ పని చెయ్యకపోతే పో ! నేను మరొకరిని పిలుచుకొంటాను.

కూలీ ---- అది జరగని పని బాబయ్యా ! ఈ నరసింహం పని చెయ్యకుండా దిగిన గడపని ఇంకే కూలీ ఎక్కడండీ ! నేను ముందే చెప్పాను కదండీ, లీడర్నని !

గోవిందయ్య --- అంటే నువ్వు పని చెయ్యవు, ఇంకొకరిని చెయ్యనివ్వవు, అంతేనా ?

కూలీ --- పని చెయ్యనని అనలేదండి. నాకు న్యాయంగా తోచిన దాన్నిచెప్పాను, అంతే ! చెట్టు రూపంలో ఉన్నా ఆయన మనిషేనండి. మనిషిని కూల్చడం మర్డర్ అవుతాదండి, నేను మర్డర్లు చేయనండి.

గోవిందయ్య --- మనిషి కాదురా , అది చెట్టు !

కూలీ --- కాదండీ , మనిషేనండి !

గోవిందయ్య --- కాదు, చెట్టు

కూలీ – మనిషి

గోవిందయ్య --- చెట్టు

కూలీ ---- మనిషి

ఆశ --- ( కల్పించుకొని ) మీరు ఆగండి మామయ్య గారూ ! నేను మాట్లాడుతాను, బాబూ నరసింహం ! నువ్వు న్యాయం మాట్లాడుతావని తెలిసింది. చాల సంతోషం ! మేము ఈ చెట్టుని కూల్చాలనుకొన్నది అతన్ని మర్డర్ చేయడానికి కాదు

గోవిందయ్య --- వాడితో మాటలేమిటమ్మా ?

కూలీ --- మీరు చెప్పండమ్మా ! చెట్టుని కొట్టాలని అనుకోవడం దాన్ని మర్డర్ చెయ్యడమే కదమ్మా ?

ఆశ --- కాదు బాబూ ! ఈ చెట్టుకి మన దేశంలో వైద్యం జరగదు , అందుకని దీనిని సమూలంగా పెకలించి లండన్ పంపాలని అనుకొంటున్నాం, అక్కడయితే అతన్ని మ్యూజియంలో పెడతారు. ఎందరో శాస్త్రఙ్ఞులు అతన్ని చూసి ఏం చేస్తే తిరిగి మామూలుగా అవుతారో పరిశోధిస్తారు. ఇప్పుడు తెలిసింది కదా, పని చేస్తావో లేదో చెప్పు.

( గౌరి ప్రవేశం మధ్య ద్వారం లోంచి )

గౌరి ---- వద్దమ్మా ! నాన్నని చంపెయ్య వద్దు. నీళ్లు నేను పోస్తాగా, ఇక్కడి నుంచి ఎక్కడికీ పంపెయ్యొద్దు !

కూలీ --- చూసావమ్మా ! చిన్న పిల్లకి అర్థమయింది కూడా నీకు తెలియడం లేదు. చెట్టుని కూల్చేయడం దాన్ని మర్డర్ చేయడమే అవుతుంది. మర్డర్ జరిగాక దానిని ఎక్కడకి పంపినా అది నమూనా వే అవుతుంది గాని, అసలు సిసలు పంపించినట్లు అవదు. నమూనల పైన ప్రయోగాలు చెయ్యడం ఏమిటి తల్లీ ? అది జరగని పని.

( కూలీ మాటలకి ఆశ గోవిందయ్యలకీ ఇద్దరికి కోపం వస్తుంది )

గోవిందయ్య --- నీ ధర్మ పన్నాలు ఎవడికి కావాల్రా ? చేతనయితే చెయ్యి, లేదా వెళ్లి పో ! చెట్టు నాది , నరుక్కొంటానో నాటుకొంటానో నా ఇష్టం !

కూలీ --- అర్థమయింది బాబయ్యా ! ఈ చెట్టు నమూనాని విదేశాలకి పంపి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నావు. ఈ కూలీ నరసింహం అలాంటి తప్పుడు పనులు చెయ్యడు.

గోవిందయ్య --- అయితే ఇంకా నిలబడే ఉన్నావేం ?

కూలీ --- సర్లే, వెళ్తాను, ఒక్క విషయం గుర్తుంచుకో, నరసింహం పని చెయ్యనని దిగిన గడప ఇంకొక కూలీ ఎక్కడు ! కూల్చడానికయితే మాలో ఎవుడూ ముందుకు రాడు, మందిరం కట్టేటట్లయితే చెప్పు, వచ్చి ఫ్రీగా పని చేస్తాం.

( కూలీ వెల్లిపోతాడు. ఆశ, గోవిందయ్య ముఖాముఖాలు చూసుకొంటారు)

ఆశ --- కూలీ వెల్లిపోయాడు, ఇంకెవరూ రారు అంటున్నాడు, ఇప్పుడు ఏం చేస్తారు మామయ్య గారూ ?

గోవిందయ్య --- ఈ కూలీ వెధవలు చేసే పని నేను చెయ్యలేనని అనుకొంటున్నావా , కాకపోతే కాస్త సమయమ్ పట్టవచ్చు అంతే !

ఆశ--- అంటే మీరే కూల్చేస్తారా ?

గోవిందయ్య --- అవును.

( గోవిందయ్య గునపం అందుకొని చెట్టు మొదలుకేసి , గురి పెడతాడు . గౌరి ఆ దృశ్యాన్ని చూస్తుంది. చెట్టుని కౌగలించుకొని ఏడుస్తుంది )

గౌరి --- వద్దు తాతయ్యా, నాన్నని చంపెయ్యవద్దు,

గోవిందయ్య – అమ్మా ఆశా ! గౌరిని లోపలికి తీసుకొనొ పో ! ఇది ఇక్కడే ఉంటే పని జరగనివ్వదు.

( ఆశ గౌరి చెయ్యి పట్టుకొని లోపలికి ఈడ్చుకొంటూ వెళ్తుంది. గౌరి గింజుకొంటూ , “నాన్నని చంపొద్దు తాతయ్యా ” అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆశ ఆమెని బలవంతంగా తీసుకొని పోతుంది )

( గోవిందయ్య గునపాన్ని చెట్టు మొదలుకేసి కొట్టి త్రవ్వబోతాడు.)

( అదే సమయానికి చెట్టు పైన గ్రీన్ కలర్ స్పాట్ లైటు పడుతుంది. చెట్టులో చలనం వస్తుంది చెట్టు గోవిందయ్య చెయ్యిని పట్టుకొంటుంది)

అశోక్ --- ఆగండి నాన్నగారూ !

(గోవిందయ్య ఆశ్చర్యంతో అశోక్ వంక చూస్తాడు.)

గోవిందయ్య – నువ్వు బ్రతికే ఉన్నావా అశోక్ !!

అశోక్ – అవును నాన్నగారూ ! నేను చెట్టునుండి తిరిగి మనిషిగా మారిపోయాను నాన్నగారూ ! నేను మామూలు మనిషిగా మారడం మీకు సంతోషంగా లేదా నాన్నగారూ ?

( గోవిందయ్య అశోక్ మాటలకి క్షణం సేపు కొయ్యబారి పోయి, తిరిగి వెంటనే తేరుకొంటాడు)

గోవిందయ్య --- లేదురా నా కొడకా !! నువ్వు మనిషిగా మారేందుకు వీలులేదు. నీ చరిత్రకి చెట్టుగానే ముగింపు పెడతాను.

( గోవిందయ్య అశోక్ కాలికేసి గునపంతో త్రవ్వబోతాడు )

( అంతలో స్టేజి లైట్లు ఆరిపోతాయి. గ్రీన్ స్పాటు కూడా ఆరిపోతుంది. స్టేజి క్షణకాలం అంధకారంలో మునిగిపోతుంది )

( తిరిగి లైట్లు వెలగగానే అశోక్ యహ్తాప్రకారం చెట్టుగానే నిలబడి ఉంటాడు. గౌఇరి అశోక్ దగ్గరే నిలబడి ఉంటుంది. )

గౌరి --- నాన్నా, ఏమయింది నాన్నా ? ఆట పూర్తయి పోయింది నాన్నా ! మీరు మళ్లీ మనిషిగా మారిపోండి.

అశోక్--- అవునమ్మా, ఆట ముగిసి పోయింది ! ఈ ఆట ద్వారా కొన్ని జీవిత సత్యాలు నేర్చుకొన్నానమ్మా !

( ఆశ మధ్య ద్వారం నుండి, గోవిందయ్య బయటీనుంచి ప్రవేశిస్తారు. గోవిందయ్య చేతిలో ఖాళీ సంచీలు ఉంటాయి )

ఆశ – ఏమండీ మీరు అలా ఉండిపోయరేం ! కలగాని కనడం లేదు కదా ?

అశోక్ --- అవును ఆశా ! నిల్చొని నిల్చొని కలగన్నాను. ఆ కలలో జీవితంలో మరచిపోలేని నిజాలు చూసి న్బిలువునా వణికాను !! ( అని గోవిందయ్య వంక చూసి ) నాన్నగారూ, మీరు దొండకాయలు సంతలో అమ్మేసి వచ్చారా ? సంచీలు ఖాళీగా ఉన్నాయి ( అని అడుగుతాడు )

( గోవిందయ్య తల దించుకొంటాడు )

అశోక్ --- నాన్నగారూ ! ఇందులో తప్పేముంది, లంచం తీసుకొని ఆదాయం పెంచుకొనే దాని కన్నా, ఈ పని ఎన్నో రెట్లు ఆమోద యోగ్యమయినది . ఈ రోజు నుండి మనం మన కుటుంబ ఆదాయాన్ని నిజాయితీగా, పట్టుదలతో పని చేసి, పెంచుకొందాం.

గోవిందయ్య – అశోక్ ! ఏమయిందిరా, నీకు, ఏమేమో మాట్లాడుతున్నావు ?

అశోక్ – నాన్నా, ఆశా, గౌరీ అందరూ వినండి ! నా కల గురించి చెప్తాను శ్రధ్ధగా వినండి . అది విన్నాక నేను ఎలా మసలుకోవాలో, మనం ఎలా మనుగడ సాగించాలో తేల్చి చెప్పండి.

( అంటూ అశోక్ ఆశ , గోవిందయ్యల భూజల మీదుగా చేతులు వేసి, గౌరి అనుసరిస్తూ ఉండగా మధ్య ద్వారం వైపు వెల్తూ ఉండగా స్టిల్ --)

( తెరలోంచి భజ గోవింద శ్లోకాలు వినబడతాయి )

శ్లోకం --- భజ గోవిందం, భజ గోవిందం / భజ గోవిందం మూఢమతే !
సస్సంగత్వే నిస్సంగత్వం / నిస్సంగత్వే నిర్మోహిత్వం
నిర్మోహిత్వే నిశ్చల తత్వం / నిశ్చల తత్వే నిర్మల బుధ్ధిః

తాత్పర్యం --- సజ్జనులారా ! సత్సంగత్వం ద్వారా , జీవితంలో భ్రమలని తొలగించుకొని , నిశ్చల బుధ్ధిని పొందవచ్చు.

( తెర పడుతుంది )

*************
************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద