ఆదిరాజు భాస్కర మూర్తి తన దగ్గరకి వచ్చిన ఆ కుర్రవానిని , దైవరాతునిగా భావించి, తన గురుకులం లోని విద్యనంతా నేర్పించి , వారసత్వాన్ని కాపాడుకొన్నాడు. జీవితం లోని నిమ్నోన్నతాలనీ, ఒడి దుడుకులనీ ఎరిగిన అతడు, ఒకరోజు తన నిత్య పూజా విధానం లోని మంత్రాలని మననం చేసుకోంటూ , వాటిలో ఒక మంత్రం లోని కొన్ని అక్షరాలు సరిగా పలకక పోవడం గ్రహించాడు. అనుభవఙ్ఞుడైన అతనికి ఆ అక్షరాలు పలకక పోవడం లోని పరమార్థం తెలిసింది. తన జీవన యాత్ర ముగిసేందుకు ఇంకా కొన్ని సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉందని ఆకళింపు చేసుకున్నాడు.
అతనికి తన కన్న, ‘శ్రీనివాసుని చింత’ఎక్కువయింది. విషయం తెలుస్తే అతడు తనని వదలడు ! వాని భవిష్యత్తు కోసం వానిని తన నుండి వేరు చేయక తప్పదు అన్న నిర్ణయానికి వచ్చాడు.
కాకతాళీయమో , దైవ సంకల్పమో తెలియదు గాని , అదే సమయానికి ‘గుజరాతు ’ లోని ఒక ప్రముఖ టూర్స్ & ట్రేవల్స్ కంపెనీ నుంచి ,అతనికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ కంపెనీ పేరు ‘ప్రజాపతీ ట్రేవల్స్’ .దాని యజమాని ‘ శ్రీ దత్తాత్రేయ దక్ష ప్రజాపతి’ ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడే అయినా , జైన ‘ షా ’పరివారం లోని, ఒక కన్యా మణిని వివాహం చేసుకోవడం వలన అక్కడే స్థిరపడి పోయాడు. ఒక సంపూర్ణ భారత దేశ యాత్ర పరికల్పన చేస్తున్నాననీ , దానికి ఇంకా మూడు నెలల వ్యవధి ఉందనీ, భాస్కర మూర్తిని , తన మందులతో పాటు, బృంద వైద్యునిగా , ఆహ్వానిస్తూ వ్రాసిన ఉత్తరం అది. ఆ ఉత్తరాన్ని శ్రీనివాసునికి చూపించాడు అతను.
“ బాబుగారూ ! ఎవరండీ ఈ దత్తాత్రేయ దక్ష ప్రజాపతి గారు ?” కుతూహలంతో అడిగాడు శ్రీనివాసుడు.
“ జన్మతః అతను ఆంధ్ర బ్రాహ్మణుడే ! కాని ఇప్పుడొక సఫల గుజరాతీ వ్యాపారి.అన్ని భారతీయ భాషల లోనూ మాట్లాడ గలడు.శ్రీనివాసా నువ్వు ఎన్ని భాషలు నేర్చుకొన్నావు?”
“ తెలుగు ,సంస్కృతం, హిందీ ,భాషలు చదవడం వ్రాయడం వచ్చు.ఒరియా భాష మాట్లాడ గలను.”
“ ఇంగ్లీషు భాష వదిలేసావేం ?”
“ బాబుగారూ ! అది పరాయి భాష కదండీ ?”
“ కాదు శ్రీనివాసా, ఇంగ్లీషు భాష కూడ భారతీయ భాషే ! అది పరాయి భాష కాదు, ఫారశీ, ఉర్దూ భాషల లాగానే ఇంగ్లీషు భాష కూడా అలాగే మన దేశ భాషలలో చోటు చేసుకొంది.ఎంతో ప్రముఖమైన ఆ భాష గురించి తక్కువ చేసి మాట్లాడవద్దు.”
“ అలాగే బాబుగారూ ! ప్రజాపతి గారు అన్ని భాషలు ఎలా నేర్చుకొన్నారు ?”
“ తీర్థయాత్రలు నిర్వహించి, భారత దేశ మంతా, యాత్రీకులతో తిరగడం వల్ల అతనికి అన్ని భాషలు అలవడ్డాయి. అతనితో నా పరిచయం చాల గమ్మత్తుగా జరిగింది.”
“ అలాగా బాబుగారూ ! చాల కుతుహలంగా ఉంది, వివరాలు చెప్పండి.”
“ చెప్తాను, ఈ రోజు అతని గురించి నీకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది,” అంటూ చెప్ప సాగాడు అతను.
దత్తాత్రేయ దక్ష ప్రజాపతి తొలుదొల్త పదిమందిని వెంట బెట్టుకొని ఒక బస్సు అద్దెకి తీసుకొని గిన్నెలు గిద్దెలు వంట సామాన్లతో, స్థానిక గుజరాతీ పుణ్య క్షేత్రాల యాత్ర మొదలు పెట్టాడు. యాత్రలో భోజన వసతి సౌకర్యాలు ఎంతో శ్రద్ధతో చేసాడు. చిన్న చిన్న రిక్షాల లాంటి రవాణా ఖర్చులని సైతం పెట్టుకొని యాత్రని సమర్థ వంతంగా నిర్వహించి వారందరి ప్రశంసలు పొందాడు.లెక్క చూసుకొన్నాక నాలుగు వేలు నష్టం వచ్చింది !
తన రెండవ పర్యటనలో అతను రాజస్థానుని కూడా కలపడంతో యాత్రీకుల సంఖ్య పెరిగింది.తన కేటరింగు పరివారంతో పాటు, మూడు బస్సులు అవసర మయ్యాయి. తొలి యాత్రలో జరిగిన నిర్వహణా లోపాలని సర్దుకొని జాగ్రత్తగా ఖర్చు చేసాడు. పదివేలు లాభం పొందడంతో, అతనిలో ఉత్సాహం పెరిగింది. పర్యటనా స్థలాల్ని పెంచుకొంటూ గుజరాతు, రాజస్థాను , ఉత్తర ప్రదేశ్ లను కలిపాడు. అలా ఒక్కొక్క పర్యటనకి పెంచుతూ తాను పెరుగుతూ వచ్చాడు. అంతే, ఆ తరువాత అతను వెనుతిరిగి చూడలేదు.
అలాంటి ఒక యాత్రలో, ఆదిరాజు భాస్కర మూర్తి ఒక యాత్రికునిగా చేరాడు . వైద్యుడు కావడం వలన తన మందుల సంచీని సర్దుకొన్నాడు. కేదార, బదరీ యాత్రలలో వైద్యుని అవసరం ఎంత ఉందో తొలిసారిగా ప్రజాపతికి తెలిసి వచ్చేలా చేసాడు.
కొండలు ఎక్కలేక ఆయాస పడేవారిని, గుర్రాల మీద నుండి క్రింద పడి గాయపడిన వారిని, చెప్పులు లేకుండా దేవాలయాల చుట్టూ తిరిగి, అరికాలు మంటలెక్కిన వారిని, తన వైద్యంతో, ఉపచారాలతో ఆదుకొని ‘వైద్యో నారాయణో హరిః’ అన్ననానుడిని సార్థకం చేసాడు.
ఆ విధంగా దక్ష ప్రజాపతి దృష్టిలో పడ్డాడు. భాస్కర మూర్తి. తన తరువాత తీర్థ యాత్రలకి, భాస్కర మూర్తి ని ,మందుల సంచీతో సహా ఆహ్వానించి, రుసుము తీసుకోకుండా ,కార్య నిర్వాహక బృంద సభ్యునిగా చేసుకొని, ఎన్నో సఫలమైన యాత్రలు చేసాడు. అదే వారిద్దరి పరిచయం.
సంపూర్ణ భారత దేశ యాత్ర చేసిన తరువాత భాస్కర మూర్తి ప్రజాపతి పర్యటనలకి వెళ్ళడం విరమించు కొన్నాడు.దానికి కారణం స్థానికంగా అతని సేవలు అందుకొనే వారు ఎక్కువ కావడమే ! తిరిగి ఇన్నాళ్లకి ప్రజాపతి నుంచి ఆహ్వానం అందింది.
“ బాబుగారూ ! ఈ సారి నేను కూడా మీతో వస్తానండి,” అన్నాడు శ్రీనివాసుడు ఉత్సాహంతో.
“ నువ్వు కూడా కాదు, నువ్వు మాత్రమే వెళ్తున్నావు,” అన్నాడు భాస్కర మూర్తి.
“ అదేమిటి బాబుగారూ, నేను ఒక్కడినే ఎలా వెళ్తాను , వెళ్లి ఏం చేస్తాను ?”
“ ఎంత కాలం నా నీడలా తిరుగుతావు,స్వతంత్రంగా నీ ప్రతిభని చూపించాలనే ఆలోచనే లేదా నీకు?”కటువుగా అన్నాడు మూర్తి.
గురువు నోట అలాంటి కటువైన మాట మొదటిసారి విన్న శ్రీనివాసుడు అప్రతిభుడయాడు.అతనికి ఎదురు చెప్పడం మంచిది కాదని అనిపించింది. “ అలాగే బాబుగారూ ! మీ ఆఙ్ఞ శిరసా వహిస్తాను.నేను ఒంటరిగానే వెళ్తాను” అన్నాడు
“ నీతో పాటు ‘చూర్ణాలు, గుళికలు, శల్య చికిత్సకి కావలసిన పట్టీలు, లేపనాలు, తైలాలు అన్నీ తయారు చేసి తీసుకొని వెళ్లు. రెండు రోజుల లోనే నీ ప్రయాణం ! ఇక్కడ నుండి, నేరుగా ‘ అహమదాబాదు’ వరకు ట్రైను మీద వెళ్లాలి. అహ్మదాబాదులో ప్రజాపతి గారి టూరిస్టు కారు వచ్చి నిన్ను తీసుకొని వెళ్తుంది. అతని ఆదేశాలని తు.చ. తప్పకుండా అమలు పరచు. అతనితో మాట్లాడితే నువ్వు ,నన్ను మరచి పోగలవు తెలుసా ? వెళ్లే ముందు నేను అతనికి ఒక ఉత్తరం వ్రాసి ఇస్తాను, తీసుకెళ్లు”. అన్నాడు మూర్తి.
క్రైన్సు ఇండియా ప్రతినిధిగా ,వచ్చిన ,విష్ణు మాధవునీ, అతని కుటుంబాన్నీ, ‘ బరూచ్’ దగ్గరున్న సైటు ఆఫీసుకి స్వాగతం పలికాడు విరించి వర్మ.
విష్ణు మెడలోదండ వేసాడు విరించి.అపాల అతనికీ, వినతకీ బొకేలు ఇచ్చింది .తరువాత మిత్రులిద్దరూ ఆఫీసు రూముకి వెళ్లారు. అపాల, వినతనీ, పిల్లలనీ గెస్టుహౌసుకి తీసుకెళ్లింది. సైటుకి వచ్చి నాలుగు రోజులయినా, అపాల ముఖం అంతలా ఎప్పుడూ వికసించ లేదు. మధ్యలో సోమనాధ దేవాలయ దర్శనం కొంత రిలీఫ్ ఇచ్చిన మాట నిజమే అయినా , ఆ దర్శనం తృప్తి తీరా జరగనే లేదు. ఇప్పుడు వినత వచ్చాక అక్కడ అభిషేకం చేయింఛాలనే మొక్కు ఉందని తెలిసాక, అపాల మనస్సు చంద్రుని చూసిన నీలి కలువలాగ విప్పారి వికసించింది.
“అపాలా ! మాస శివరాత్రి నాడు,శ్రీ సోమనాధుని దర్శనంతో చాలా పుణ్యం సంపాదించావన్నమాట !”
“ ఏం పుణ్యమే? కరువు తీరా దర్శనం కాలేదే ! అత్తయ్య గారు,మామయ్య గారు బయట మంటపంలో అభిషేకం చెసారు.నేను, శ్రేయ మూగ ప్రేక్షకుల లాగ వెనకాలే కూర్చొని ఆ కార్యక్రమాన్ని చూసాం.”
“ అలాగా, అయితే నాతో పాటు వచ్చెయ్యవే ! మనం హాయిగా రెండు మూడు రోజుల పాటు అక్కడ వింతలు , వింతలు చూడవచ్చు.”
“ నేను కూడ అలాగే అనుకొన్నానే వినతా ! మరో రెండు రోజులలో దరణి, ప్రాంజలి కూడ వస్తున్నారు. అందరం కలిసి వెళ్దాం.”
“ ఏమిటీ !ఆశ్చర్యంతో అడిగింది వినత, “ధరణి,ప్రాంజలి కూడావస్తున్నారా ?” అంటూ.
‘ “ అవునే ,నలుగురు మిత్రులూ కలిసి ప్రోజెక్టు చెయ్యబోతున్నారు.ఈ విధంగా మనం కలిసి ఉండటం బహుశా ఇదే మొదటి సారేమో !”
“ నిజమే, మనం ముగ్గురం రవికాంత్ పెళ్లిలో కలిసి ఉంటాం ! ప్రాంజలి మరి పెళ్లి కూతురు కదా ,మనతో అంతగా మనసు విప్పి మాట్లాడ లేక పోయింది,దానిని వధువుగా తప్ప గృహిణిగా చూడనే లేదు, ఇప్పుడా గోల్డెన్ ఛాన్సు వచ్చింది.” అంది వినత.
“ వినతా , ఈ మగాళ్లు ఎలాగూ ఆఫీసులోనో, లేదా సైటు లోనో పడి ఉంటారు. వాళ్లని అలాగే వదిలేసి, మన మంతా కలిసి చక్కగా, ఎక్కడికైనా టూర్ కొడితే బాగుంటుందేమో !”
“ నేనా విషయం ఎప్పుడో ఆలోచించానే ! అయితే మరో ఇద్దరు మరదళ్లు వస్తున్నారనే విషయం నాకు తెలియదు కదా ?”
“ అంటే నువ్వు అక్కడనుంచే ఎవరైనా టూర్ ఆపరేటర్ తో మాట్లాడావా ?”
“ ఎవరో ఎందుకు ? ఉన్న వారిలో ‘బెస్ట్’ అయిన, ప్రజాపతి టూర్ & ట్రేవల్స్ వారి ఎం. డి.తోనే మాట్లాడాను. అతను మన తెలుగు వాడే కావడం అదనపు లాభం అనుకో !
“ నువ్వే నయమే ! దూర దేశంలో ఉన్నా ఇక్కడి తెలుగు వాళ్లని పట్టుకొన్నావు !”
“ ఇందులో ఆశ్చర్యం ఏముందే ! అంతర్జాలం ద్వారా అది సాధ్యమే !”
“ అమ్మో తెలుగు బాగానే మాట్లాడుతున్నావు ! ఇంతకీ అతని పేరు ఏమిటి ? ఎప్పుడు వచ్చి కలుస్తానన్నాడు, ఏయే ప్రదేశాలు చూపిసానన్నాడు ?”
“ అతని పెరు ’శ్రీనివాస్ ’ అట ! ప్రజాపతి పర్యటనా సంస్థకి ప్రొప్రయిటర్ కూడా అతనేనట ! వాళ్ల వ్యాపారం కొన్ని కోట్ల టర్నోవరుతొ సాగుతోందని తెలిసింది. మన కోసమని ప్రత్యేకంగా టూరు తయారు చేయమని చెప్పాను, మనకి ఇష్టమైనవి, పిల్లలు ఇష్ట పడేవి, ఇంకా మన పతిదేవుళ్లు ఇష్ట పడేవి అన్నీ చర్చించు కొన్నాక యాత్ర గురించి పరికల్పన చేసుకొందాం, ఏమంటావు ?”
“ మన వారందరి విషయం చెప్పలేను గాని, నా పతి దేవునికి మాత్రం ఇష్టమైన సైటు ఆ ఆపీసు సైటు మాత్రమే అని ఘంటాపధంగా చెప్ప గలను. అది చూపించడానికి వేరే ఎవరూ రానక్కర లేదు.”
“ అలా నిష్టూరాలాడకే ! ముందుగా మనం, మన పిల్లలూ చూడవలసిన వన్నీ చూసేసాక , చివర్లో వాళ్ల కోసం ఏదైనా టూరుని ప్లాను చేసుకొందాం. అన్ని స్థలాలకి వాల్లు రావడానికి ఒప్పుకోక పోయినా ఏదో ఒక టూరుకి ఒప్పుకొంటారు.”
“ నువ్వన్నది బాగానే ఉంది, కాని మన ఆఖరి టూరు గురించే నాకింకా అనుమానం దూరం కావడం లేదు.”
“ ఈ ప్రాజెక్టుకి పెద్ద బుర్ర మా ఆయనే కదా ! అతనితో చెప్పి ఒప్పిస్తాను లేవే ! టూరు చివర్లో, వాళ్లు కూడా కలిస్తే చాలా సరదాగా ఉంటుంది, ఏమంటావు ?”
“ నువ్వు చెప్పింది నిజమేనే ! పిల్లలకి కూడా డాడీ ఉంటే బాగుంటుంది !”
“ మన చిన్న మరదల్లిద్దరూ రాగానే శ్రీనివాసు గారిని పిలిపించి మాట్లాడుదాం, సరేనా ?”
“ సరేనే !” అంటూ అపాల కిల కిలా నవ్వింది, వినత కూడా ఆమెతో శృతి కలిపింది.
Comments
Post a Comment