పితృతుల్యులు, గురుపాదులు అయిన, ఆదిరాజు భాస్కర మూర్తి గారు వ్రాసి ఇచ్చిన ఉత్తరాన్ని, దత్తాత్రేయ దక్ష ప్రజాపతి గారికి ఇచ్చాడు శ్రీనివాసుడు. అతనిని కూర్చోమని చెప్పి, ఆయన తన ఆపీసు గది లోపలికి వెళ్లి ఆ ఉత్తరాన్ని చదువుకొన్నారు.
శ్రీనివాసుడు తన దగ్గరకి ఎలా వచ్చాడో, తన దగ్గర ఎలా శిక్షణ , క్రమ శిక్షణ తీసుకొన్నాడో, ఎలా పెరిగాడో సవిస్తరంగా వ్రాసి ఉందా ఉత్తరంలో. ఇటు పైన ఆ యువకున్ని మీ చేతులలో పెడుతున్నానని, వాని సర్వతోముఖ అభివృద్ధికి సోపానం వెయ్య వలసిందనీ విన్నవింఛారు తిరిగి తన దగ్గరకి పంపించ వద్దనీ, అలా అడగడానికి చాలా కారణాలు ఉన్నాయనీ, వాటిలో ఆరోగ్య కారణం ముఖ్యమయినదనీ వ్రాసి స్పష్టమైన ఆదేశం కూడా ఇచ్చారు. మూర్తిగారు. ఆ ఉత్తరం చదివాక ,అతను శ్రీనివాసుని తన గదికి పిలిపించారు, “ శ్రీనివాస మూర్తి గారూ ---”
ప్రజాపతి మాటలకి , శ్రీనివాసుడు అడ్డుపడ్డాడు. “ నన్ను అంత పొడుగు పేరుతో పిలువకండి. శ్రీనూ అని పిలువండి చాలు,” అన్నాడు.
ప్రజాపతిగారు గుంభనగా నవ్వుకొన్నారు. “ సరే, శ్రీనూ, నీ కోరిక అదే అయితే అలాగే పిలుస్తాను. భాస్కర మూర్తి గారి అభ్యర్ధన వల్ల నీకు నా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. ఈ సంపూర్ణ భారత దేశ యాత్ర పూర్తి అయ్యాక ,ఉద్యోగం పొడిగించాలా లేదా అన్న విషయాన్ని, నీ ప్రవర్తనని బట్టి, నీ పనిని బట్టి నిర్ణయిస్తాను. నువ్వు ఒక ఆయుర్వేద వైద్యునిగా మా బృందంతో పాటు వస్తునావు కాబట్టి, నీకు కావలసిన మందులు, పరికరాలు అన్నీ సమకూర్చ వలసిన భాధ్యత నాది ! ఏవేవి కావాలో లిస్టు ఇయ్యి.”
“ గురువు గారి ఆదేశంతో మందులనీ,పరికరాలనీ నేనే తెచ్చుకొన్నాను.ఇంకేవీ అవసరం లేదు.”
“నువ్వు తెచ్చుకొన్నవి నీ స్వంతమవుతాయి.ఇంకేవీ అవసరం లేవంటున్నావు కాబట్టి, వాటి విలువ ఎంత అవుతుందో చెప్పు.ఆ సొమ్మును నేను చెల్లిస్తాను.”
“ ఇవన్నీగురువు గారు సేకరించిన మందులు. వాటి విలువ అతనికే చెందుతుంది. నేను సేవా భావంతో పని చేస్తాను.మీరు ఇస్తానన్నజీతం ఎంతైనా సరే,నాకు నిర్ద్వంద్వంగా సరి పోతుంది. ”
గురువు పట్ల అతని కున్న భక్తి శ్రద్ధలకి, అతని అల్ప సంతోషానికి ప్రజాపతి గారి మనసు పరవశించింది. “నీ మందుల విలువ భాస్కర మూర్తి గారికి పంపిస్తాను. నీ జీతం యాత్ర ముగిసాక నీ చేతికి ఇస్తాను. ఎంత అనేది ఇప్పట్లో నిర్ణయించను, సరేనా ?”
“ అలాగేనండి, మందుల విలువ ఎనిమిది వేల నాలుగు వందల డెభ్భయి రూపాయలు. పరికరాల విలువ మరో వెయ్యిన్నూట పదహార్లు . మొత్తం తొమ్మిది వేల అయిదు వందల ఏభయి ఆరు రూపాయలు అవుతుంది.”
“ సరే, ఆ సొమ్ముని భాస్కర మూర్తి గారికి పంపిస్తాం. నువ్వు వెళ్లి మా గెస్టు హౌసులో విశ్రాంతి తీసుకో. ఎల్లుండి ప్రయాణానికి సిద్ధంగా ఉండు.”
శ్రీనివాసుడు లేచాడు.
“ శ్రీనూ ! ఆఫీసు బయట ఈశాన్య మూలలో జ్యోతిష్కులు ఉంటారు. వారిని పూజార్లనీ కూడా తీసుకొని వెళ్లడం మాకు అలవాటు.అతని దగ్గర , నీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పి, నేను జాతకం వేయించ మన్నానని చెప్పు.”
తన జాతకం వేయించడం దేనికో శ్రీనివాసునికి అర్థం కాలేదు. ‘ అయినా పెద్ద వాళ్ల వ్యవహారం !నాకెందుకు?’ అనుకొని, ఆఫీసుకి ఈశాన్య దిశలో ఉన్న జ్యోతిష్కుని దగ్గరకు వెళ్లాడు.అతను వెళ్లిన వైపు చూస్తూ ,ఆలోచనలో పడ్డాడు ప్రజాపతి.
‘ యువకుడు స్ఫురద్రూపి, నల్లని వాడే‘ అయినా, ఆ నలుపులో కూడా మెరుపు ఉంది ! గుణవంతుడి లాగే ఉన్నాడు.జాతకం చూస్తే తక్కిన వివరాలు తెలుస్తాయి.అయినా ఇతని వివరాలు తెలుసుకోవాలని తానెందుకు ఆలోచిస్తున్నాడు ! ’ ప్రజాపతి మనసులోనే నవ్వుకొన్నాడు.
‘ ప్రణీత ’ అతని ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పుడే ‘ పోలియో ’వచ్చిఆమె రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి.ఇప్పుడే యుక్త వయస్కురాలు అయింది. తగిన వరుని కోసం అతని దృష్టి ఎప్పటి నుండో అన్వేషిస్తూనే ఉంది.ఆమె శారీరిక లోపంతో సంబంధం లేకుండా , ఆమెని ప్రేమించ గలిగే వాడు, తన సంపద కోసం ఆశ పడక, ఆమె కోసం, ఆమెని పెళ్లి చేసుకొనే వాడు అయిన యువకుడు కావాలి ! అలాంటి వాడు ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా పరవాలేదు. కులం కన్న గుణం ప్రధానమైన వాడు కావాలి.’
భాస్కర మూర్తి వ్రాసిన ఉత్తరం లోని చివరి వాక్యం అతని మనసులో ఆశా దీపం వెలిగించింది.
‘ ప్రజాపతి గారూ ! మన చిన్నారి చిరంజీవి ప్రణీతకి,ఈ శ్రీనివాసుడు సరి అయిన జోడీ అని నాకు అనిపిస్తోంది. మీరు అతనిని అన్ని విధాల పరిశీలించి చూసాకనే ఏ నిర్ణయానికైనా రండి. అందుకే నేను అతనిని మీకు అప్పగిస్తున్నాను’ అన్నదే ఆ వాక్యం.
సంపూర్ణ భారత దేశ యాత్ర , అహ్మదాబాదు లోని దర్శనీయ స్థలాలతో మొదలయింది. అక్కడ నుండి ప్రజాపతి ట్రేవల్సు వారి, ఆరు ఎ.సి. టురిస్టు బస్సులు , యాత్రీకులనీ, సిబ్బందినీ తీసుకొని ‘వీరావల్’ కి బయలు దేరింది.వీరావల్ నుండి శ్రీ సోమనాధుని జ్యోతిర్లింగ దర్శనం చేయించాక, ద్వారక, బెట్ ద్వారక ,తరువాత శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేయించి, తిరిగి అహ్మదాబాదు చేరుకొంది. ఆ బృందంలో సభ్యుడిగా శ్రీనివాసుడు దర్శనీయమైన ఆ పుణ్య స్థలాలని చూసి పులకించి పోయాడు.
అహ్మదాబాదు నుండి,ముంబయి చేరుకొన్నారు యాత్రీకులు.ముంబయి లోని సిద్ధి వినాయకునీ, మహాలక్ష్మినీ, హజీ అలీని దర్శించుకొని ,పూనా బయలు దేరారు.
పూనా నుండి శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగ దర్శనార్థం బృందం తరలి వెల్లింది. భీమ శంకర్ కొండ మీద బస్సు దిగిన యాత్రికులు దిగీ దిగగానే, ‘ డోలీ వాహకులు ’ వారిని చుట్టు ముట్టారు. డోలీలో దేవాలయం వరకు తీసుకొని వెళ్తాం, వంద రూపాయలు ఇవ్వండి, అంటూ.ప్రతీ వాహకుడి దగ్గర ‘బెత్తుతో చేసిన బుట్ట లాంటి’ డోలీ ఉంది.దానిలో ‘యాత్రీని’ ఎక్కించుకొని మెట్లు ఎక్కిస్తారు వాళ్లు ! యాత్రీకులు ఎవరూ వాళ్ల డోలీలు ఎక్క లేదు. దానికి కారణం వారి టూరిస్టు గైడు బస్సులోనే వారికి అక్కడ జరగ బోయే దానిని ముందుగానే తెలియ జేయడం. మెట్లు కేవలం మూడు వందల లోపే ఉన్నాయని, బల్ల పరుపుగా ఉండడం వల్ల ఎక్కడం కష్టం కాదనీ చెప్పారు.
చివరికి డోలీ వాహకులు ఏభయి రూపాయలకి రాజీ పడ్డారు. అయినా ఎవరూ వారి మాట విన లేదు. భీమ శంకరుని దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహంతో మెట్లెక్కడానికి ఎవరూ అలసి పోలేదు.కాని దిగేటప్పుడు మాత్రం,ఒక ముసలమ్మ మెట్ల మీద జారి పడింది. అంత కన్నవృద్ధురాలైన మరో యాత్రీకురాలిని చేయి పట్టుకొని మెట్లు దాటిస్తున్నశ్రీనివాసుడు ఆ దృశ్యం చూసి,అక్కడకి పరుగెట్టాడు.ఆమెని చేతుల మీద ఎత్తుకొని బస్సు నిలబడ్డ చోటికి తెచ్చి, తన బస్సులో ఎక్కించాడు.వెంటనే తన దగ్గరున్న ,శల్య చికిత్సా పరికరాలని తీసాడు. ఆమె మోకాలుని నాలుగు చోట్ల నొక్కి ఆ నొక్కడం వల్ల ఆమెకి కలిగిన బాధని గ్రహించి, ఎముక స్వల్పంగా విరిగిందని గ్రహించాడు. వెంటనే తన దగ్గరున్న చేతి సంచీలోని రెండు వెదురు బద్దలు తీసి, వాటిని ఇటు అటూ పెట్టి ప్లాస్టర్ వేసాడు. నొప్పి తగ్గించడానికి నాలుగు గుళికలు తీసి, ఆమెతో మింగించి, నిద్ర పట్టేందుకు కషాయం త్రాగించాడు.
యాత్రా బృందం తరువాత మజిలీ అయిన షిరిడీకి బయలు దేరింది.
షిరిడీ చేరుకొన్నాక తరువాత సాయిబాబా ఆస్పత్రిలోని ఎముకల డాక్టరుకు చూపించారు.అతను ముందు కాలుకు ఎక్స్ రే తీయించి, మైనర్ ఫ్రేక్చర్ అయిందని నిర్ధారించాడు. శ్రీనివాసుడు కట్టిన కట్టు చూసి, దానిని అలాగే ఉంచమని,పది రోజులలో ఎముక అతుక్కో గలదని చెప్పాడు.
ఆ సంఘటనతో యాత్రీకులందరికీ శ్రీనివాసుని వైద్యం పట్ల నమ్మకం కుదిరింది.అంత వరకు ఏవో జలుబులు, వాంతులు, జ్వరాలు వంటి రుగ్మతలకి మందులిచ్చే వానిగా, అతనిని భావించిన వారు, అటు పైన అతనిని గౌరవంగా చూడ సాగారు.
షిరిడీ నుంచి శని సింగణా పూరు ,తరువాత ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లారు వాళ్లు. అక్కడ నుంచి అహ్మద్ నగరు వచ్చి, ఉజ్జయిని వైపు ప్రయాణం సాగించారు.
ఉజ్జయిని యాత్రలో వంటవానికి జ్వరం వచ్చింది. ఆ వంట వానికి ఉన్నంత పాక కళా కౌశలం ఇంకెవరికీ లేక పోవడం వలన , స్థానికంగా ఎవరినైనా కొన్ని రోజుల పాటు, తమతో తిరుగుతూ వంట చేయడానికి సంప్రదించాలనుకొన్నారు యాత్రా నిర్వాహకులు.
శ్రీనివాసుడు వారికి అభయం ఇచ్చాడు.వంట తాను చేస్తానని అన్నాడు. ఆ మాట అందరినీ విస్మయంలో ముంచింది ‘సరే చూద్దాం ’అని, అతనికి పని అప్పగించి యాత్రీకులని మహాకాళేశ్వరుని దర్శనార్థం తీసుకెళ్లారు వాళ్లు.
ఆవురావురుమంటూ ఆకలితో వచ్చిన యాత్రీకులకి, పులి హోర, బూరెలు ,పనస పొట్టు కూర, కంద బచ్చలితో మరో కూర, పప్పు, ముక్కల పులుసుతో పాటు తయారయిన వంటలు చూసి వారికి నోరూరాయి,అందరూ శ్రీనివాసుని కొనియాడుతూ విందు ఆరగించారు.
ఉజ్జయిని తరువాత యాత్రీకుల బస్సు ,‘ఓంకారేశ్వరుని’.వద్దకి వెళ్తున్న సమయంలో ఒక బస్సు ,ఎత్తు ఎక్కనని మొరాయించి,ఆగి పోయింది.బస్సు డ్రైవర్లు,వారి సహాయకులకి ఏం చేయాలో తోచలేదు. ఎందుకంటే దాని బేటరీ రన్ డౌన్ అయినట్లు గుర్తించడమే ! స్పేరుపార్టులు ఏవేవో తెచ్చారు గాని, ‘బేటరీ’ తెచ్చుకోలేదు.
శ్రీనివాస్ వాళ్లకి ధైర్యం చెప్పాడు.బేటరీలోని ప్రతీ సెల్ నీ ,ఓల్టు మీటర్తో ,పరిశీలించాడు. ఆ బేటరీ బాక్సు లోని ఒక బేటరీలోని ఒకానొక సెల్ మాత్రమే చచ్చు బడిందని గ్రహించాడు. వెంటనే ఆ బేటరీని సర్క్యూటు నుండి. తొలగించి, మిగతా బేటరీలన్నీ క్రమ పద్ధతిలో జోడించాడు. ఆ తరువాత అన్ని సెల్లులలోనూ వడ కట్టిన నీరు నింపి, మిగతా బస్సుల బేటరీలతో వాటిని జోడించి ఛార్జ్ చేయించాడు. గంటన్నర నిరీక్షణ తరువాత , ఓల్టు మీటరు తగినంత ఓల్టేజి చూపించింది. వెంటనే బస్సు స్తార్టు అయింది.
ఆ విధంగా శ్రీనివాస్ తన బహుముఖ ప్రతిభని నిరూపించుకొంటూ, ఇరవై రోజుల అనంతరం సంపూర్ణ భరత దేశ యాత్ర ముగించుకొని, అహ్మదాబాదు చేరుకొన్నాడు.
ప్రజాపతి గారికి యాత్రా విశేషాలు ఎప్పటికప్పుడు, నిర్వాహకులు చెప్తూనే ఉన్నారు. శ్రీనివాసుని గురించిన్ అన్ని వివరాలు అతనికి తెలిసాయి.సాయంత్రం శ్రీనివాసు అక్కడికి వచ్చినప్పుడు ప్రజాపతి అతనిని తన ఆఫీసు గది లోనికి పిలిచారు. “ శ్రీనూ ! నువ్వు చెప్పిన మొత్తం భాస్కర మూర్తి గారికి పంపించాను. అందినట్లు ఆయన ఉత్తరం వ్రాసారు. ఆ ఉత్తరంలో నీకు కూడ ఒక జాబు ఉంది, చూసుకో !” అంటూ ఒక ఉత్తరాన్ని ఇచ్చారు.
“ గురువు గారు ఉత్తరం వ్రాసారా !?” ఆతృతతో అందుకొన్నాడు శ్రీనివాసుడు. వెంటనే దానిని విప్పి చదువుకొన్నాడు.
‘ ప్రియమైన శ్రీనివాసునికి, చిరాయురస్తుగా దీవించి వ్రాయునది.
ప్రజాపతి గారు , మందుల నిమిత్తం నువ్వు చెప్పిన మొత్తాన్ని, పంపించారు. పెద్ద మొత్తంలో లభించిన ఆ ధనం వల్ల,అనుకోని విధంగా కొన్ని అవసరాలు తీరాయి. ఆ మందులన్ని నువ్వు సేకరించి, శ్రమించి తయారు చేసినవే ! నీ స్వార్జితం క్రిందనే లెక్క. అయినా నువ్వు నా ఆవసరాన్ని గుర్తించి, నాకు సమయానికి అందేలా చేసావు. ఈ విధంగా నువ్వు గురుదక్షిణ సమర్పించినట్లే అయింది ! –” అంత వరకు చదివిన శ్రీనివాసుని కళ్లల్లో నీళ్లు తిరిగాయి.‘అయ్యయ్యో గురువు గారూ,నేను ఆ విధంగా భావించ లేదు.ఆ మందులు నా స్వార్జితం ఎలా అయ్యాయి.ఈ శరీరమే మీది అయినప్పుడు ! నేను గురు దక్షిణ సమర్పించి నట్లే నని , అంటున్నారేమటి ? మీకు నాకు ఇంతటితో సంబంధం తీరిపోయిందా !?
కన్నీటిని కొన గోటీతో మీటుకొంటూ, తిరిగి ఉత్తరం చదివాడు శ్రీనివాస్.
శ్రీనివాసా ! నువ్వు తీసుకొని వెళ్లిన మందులన్నీ యాత్రలో అయి పోయి ఉంటాయని నేను అనుకోవటం లేదు. వాటికి ధర చెల్లించడం జరిగింది. కాబట్టి అవి ప్రజాపతి గారి, సొత్తు అయినట్లే కదా ! వాటి అవసరం కూడా నీ ద్వారానే తీరాలి కదా ? అందు వల్ల అతను తలపెట్టే మరో తీర్థ యాత్రకి నువ్వు .వెళ్లక తప్పదు. అతని మరో తిర్థ యాత్ర ఎప్పుడు ప్రారంభ మవుతుందో , అంత వరకు నీ చేత ఏం పని చేయిస్తారో అతని ఇష్టం. ఆ ఋణం తీరే వరకు నువ్వు నా దగ్గరకు రావద్దు. ఇట్లు సదా నీ శ్రేయస్సు కోరే భాస్కర మూర్తి. వ్రాలు.
‘అయ్యో ! శ్రీనివాసుని మనస్సు బాధతో మూలిగింది’
.
“ భాస్కర మూర్తి గారు ఏం వ్రాసారు బాబూ ?” అడిగాడు ప్రజాపతి.
“ మీ దగ్గర పని చేయమని , ఇప్పుడిప్పుడే రానవసరం లేదని వ్రాసారు. ”
“ అలాగా ! మా మరో యాత్ర రెండు నెలల తరువాత గాని ప్రారంభమవదు. అంత వరకు నువ్వేం చేస్తావు.?” అని కాసేపటి వరకు ఆలోచించి, “ ఆ ! గుర్తుకి వచ్చింది, మా కంప్యూటర్ ఇంజనీయరు గారికి ఒక పి.ఎ అవసరం ఉంది. ఇంత వరకు ఆ స్థానంలో పని చేసిన అమ్మాయి పెళ్లి అయి అత్తవారింటికి వెళ్లి పోయింది. మళ్లీ మరో వ్యక్తి కుదిరే వరకు, నువ్వు సెలవిచ్చే ఉద్యోగం చేయవచ్చు.
“ సార్ ! నాకు కంప్యూటరు గురించి ఏమీ తెలియదు.అవగాహన కూడా లేదు.”
“ ఆ ఇంజనీయరు గారి పర్సనల్ పనులు చేయమనే నీకు చెప్పేది,ఇక కంప్యూటరు గురించి, అతనేమైనా నీకు నేర్పుతే నేర్చుకో !”
“ పర్సనల్ పనులంటే ఎలాంటివి సార్ ?”
“ నువ్వే వెళ్లి కనుక్కో !మా ఆపీసుకి బయట,కుడివైపు ఉన్నకేబిన్లో కంప్యూటరు ఉంది”
శ్రీనివాసుడు మారు మాట్లాడక గురువుగారు వ్రాసిన ఉత్తరాన్ని తన జేబులో గుండె దగ్గర పెట్టుకొని అక్కడనుండి లేచాడు,గురువు గారి ఆదేశం ప్రకారం ప్రజాపతి గారు చెప్పిన ఏ పనినైనా చేయక తప్పదు,అనుకొంటూ. ఆఫీసు బయట కుడివైపు ఉన్న కేబిన్ చూసి , అటు వైపు తిరిగాడు. ఆ రూము బయట తగిలించి ఉన్న, నామాంకిత పట్టికని చూసి, ఆశ్చర్య పోయాడు.
‘ మిస్ ప్రణీత, కంప్యూటరు ఇంజనీయరు’ అని వ్రాసి ఉందా పట్టిక మీద !
‘ ఈ కంప్యూటరు ఇంజనీయరు అమ్మాయా ! ఆమెకి నేను పర్సనల్ పనులు చేసి పెట్టాలా ? ఎలాంటి పనులు చెయ్యాలి ! లోపలికి ఎలాగూ వెళ్తున్నాను కదా, ఆమెనే కనుక్కుంటే సరి !’ అనుకొంటూ తలుపు తట్టాడు.
“ కమిన్ !” అన్న తీయని కంఠ స్వరం వినిపించింది.
తలుపు తెరచి, ఎదురుగా పడవ లాంటి టేబులు వెనుక నున్న ‘రివాల్వింగు కుర్చీలో కూర్చొన్న ఆమె వంక రెప్పార్ప కుండా చూసాడు శ్రీనివాసుడు.
ఆమె తను ఊహించినట్లు మధ్య వయస్సులో లేదు.ఇంకా కన్నెవయసే ! ఆమెముఖం ఒక మహాశిల్పి అద్భుతంగా మలచిన దేవీ మూర్తిలాగ ఉంది ! మీనాల్లాంటి కళ్లు, పొడవై నిటారుగా దర్పంగా నిలిచిన నాసిక. చిన్న పెదవులు, బూరె బుగ్గలు. గుండ్రని ముఖం, విశాలమైన నుదురు, ఒత్తైన నల్లని జుట్టు , తెల్లని శరీరచ్ఛాయ, ఎంత బాగుంది !! ’ అనుకొన్నాడు.
“ శ్రీనివాస్ అంటే మీరేనా ?” ఆ అమ్మాయి అతని నివ్వెరపాటుకి అంతరాయం కలిగిస్తూ అడిగింది.
“ అవునండీ ! నా పేరే శ్రీనివాస్ !” అన్నాడు అతను మైకం నుండి తేరుకొని
“ నా పీరు ప్రణీత ! నేను మీకంటే చిన్నదాన్ని,నన్ను ప్రణీతా! అని పిలువ వచ్చు. ముందు ఇలా వచ్చి కూర్చోండి,” అంది ప్రణీత.
శ్రీనివాస్ ఆమెకి ఎదురుగా కుర్చీలో కూర్చొంటూ అన్నాడు. “ అయ్యగారు నన్ను మీ పర్సనల్ పనులు చేయమన్నారు. నేను ఏయే పనులు చేయాలి ?”
“ మరీ కష్టమైన పనులేవీ కావు లెండి, నన్ను నా బైకు మీద కూర్చో బెట్టుకొని ఇంటికి చేర్చాలి. అలాగే ఇంటి నుండి ఆఫీసుకు తీసుకొని రావాలి,----”
” అంటే మీకు బైకు నడపడం రాదా ? నేను నేర్ప గలను.” అన్నాడు శ్రీనివాస్ ఆమె మాటలకి ఆడ్డుపడి.
“నా బైకుని నేను నడప గలను. కాని దాని మీద ఎక్కడం గాని, దిగడం గాని చెయ్యలేను.” ఆ మాటలు అని అతని వంక కొంటెగా చూసింది ప్రణీత.
“ మీరు చెప్పినది నాకు అర్థం కాలేదు. మీరు కుర్చీలో కూర్చొనే ఉన్నారు కదా ! కుర్చీ ఎక్కడం దిగడం చేస్తున్నారు కదా ? బైకు మీద అలాగే కూర్చోవాలి”
“ నిజమే ! ఈ కుర్చీ మీద నేను మరొకరి సహాయం లేనిదే కూర్చోలేను.” అంటూ తన కుర్చీ వెనకాల నున్న రెండు చేతి కర్రలను, చూపించడానికి, ఆమె ఆ రివాల్వింగు కుర్చీని కుడివైపు తిప్పింది.అప్పుడామె కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి.
శ్రీనివాసునికి పరిస్థితి అర్థమయింది. “ అలాగా ! క్షమించండి, మీకు వికలాంగత ఉంటుందని నేను ఊహించలేదు”
“ ఫరవాలేదు, విషయం మీకు తెలిసింది కదా , ఏ ఏ పనులు చేయాలో ?”
“ అర్థమయింది ప్రణీతగారూ ! నేనొక సారి మీ కాలుని చూడవచ్చా?” అడిగాడతను.
ఆశ్చర్యంతో ప్రణీత కళ్లు వెడల్పు అయ్యాయి. “ నా కాలుని చూస్తారా,? వీటిని ఎంతో మంది డాక్టర్లు ఛూశారు. మీరేం చెయ్యగలరు ?”
“ ఏం చెయ్యగలనో చూసిన తరువాతనే చెప్పగలను. ప్లీజ్ చూపించండి”
ప్రణీత మారు మాట్లాడక తన కుర్చీని మరి కాస్త కుడివైపుకి తిప్పింది.శ్రీనివాసుడు ఆమెకి అభిముఖంగా వచ్చి, క్రింద కూర్చొన్నాడు. ఆమె కాళ్లు చీర కుచ్చెళ్లు దాటి లేవు ! కుడి కాలి పాదం మాత్రం కాస్త వంకరగా కుచ్చెళ్లు దాటి కనిపించింది. ఎడమ కాలు చీర మరుగునే ఉండి పోయింది.
శ్రీనివాసు ఏమాత్రమూ సందేహించ లేదు.ఆమె కుడి పాదాన్నితన చేతిలోకి తీసు కొన్నాడు.చీర కుచ్చెళ్లని మీదకి జరిపి, చూసాడు. కుడి మోకాలు బట్ట పిండినట్లు ట్విస్ట్ అయి ఉంది. పాదం ఆ కాలికి వంకరగా అతికించినట్లు ఉంది.ఎడమ కాలు మెత్తగా తోలు తిత్తిలాగ వ్రేలాడుతోంది, పాదంతో సహా ! “ మీకు పోలియో వచ్చిందా ?” అని అడిగాడు.
“ అవునండీ !”
శ్రీనివాసు తన జేబులోంచి, ఒక సూది మొనగల ‘ ప్రోబ్’ ( సుజోక్ చికిత్సలో వాడే పరికరం ) తీసి, ఆమె కుడికాలి పాదం లోని బొటన వ్రేలు క్రింది భాగంలో పొడిచాడు. ప్రణీత, “ అమ్మా !” అంటూ పాదాన్ని వెనకకి తీసుకోబోయింది, కాని అది అతని చేతిలో ఉండడం వల్ల సాధ్యం కాలేదు. బాధ ఆమె ముఖంలో ప్రతిబింబించి, ముఖాన్ని అరుణ రంజితం చేసాయి !
“ ప్రణిత గారూ ! మీ ఎడమ కాలుని నేనేమీ చేయలేను, కాని కుడి కాలుని కొంత వరకు బాగు చేయగలను.”
“ ఎలా,--- ఎలా బాగు చేస్తారు ?”
“ మీ కుడి పాదం యొక్క బొటన వ్రేలుని నేను ప్రోబుతో పొడవగానే మీరు బాధతో విల విల లాడారు. అంటే మీ ‘ప్రిట్యూటరీ గ్లేండు’నుండి, కాలి బొటన వ్రేలు వరకు రక్త ప్రసరణ బాగానే ఉందని తెలుస్తోంది. అందువల్ల బాగయే అవకాశం ఉందని చెప్పగలను.”అన్నాడు శ్రీనివాసుడు.
చాలా బాగుంది....
ReplyDeleteమీకు నచ్చినందుకు సంతోషం ! ముగింపు వరకు తప్పక చదవండి. చాలా విలువలు , ఎన్నెన్నో యాత్రా స్థాలాలు తెలియ జెయ్యడం జరిగింది.
Delete