Skip to main content

పడగ మీద మణి--౫



    ప్రణీత కళ్లు ఆనందంతో మెరిసాయి,ఈ సారి  ఆమె కళ్లల్లో  వైడూర్య కాంతులు  చోటు చేసుకొన్నాయి. “శ్రీనివాస్ గారూ !ఇంత వరకు నా కాలుని చూసిన వారెవరూ ఈ మాట  చెప్పలేదు. పెద్ద  పెద్ద  డాక్టర్లు కూడా పెదవి విరిచేసారు. మీరు బాగు చెయ్యగలిగితే –”

    “ మీరు నన్ను నమ్మాలి ! వైద్యుణ్ని నమ్మినప్పుడే  రోగికి  స్వస్థత చేకూరుతుంది. కాలు  బాగయితే  జరిగే బాగు  మీకే  కాబట్టి, మీరు నేను  చెప్పినట్లు  చేయాలి. నేను చెయ్యమన్న  వ్యాయామాలు  చెయ్యాలి. లేపనాలు, తైలాల  మాలీషులు  చేయించుకోవాలి. నాకు అన్ని  విధాలా  సహకరించాలి.

    ప్రణీత అబ్బురంతో  శ్రీనివాసుని  వంక  చూసింది. ఆ  చూపు ఎంత  అబ్బురంగా ఉందంటే, ఆ చూపులో, ప్రశంస ఉంది. ఇన్నాళ్లూ  తనకీ  మాట  చెప్పకుండా  వంచించిన  డాక్టర్ల  మీద కసి  కోపం ఉంది. కాలు  నిజంగా  బాగవుతుందా  అన్న ఆశ్చర్యం ఉంది.అతని  మాటలు  నిజమవుతే  బాగుంటుందన్న  ఆశ  ఉంది.అదేదో  వేగంగా  జరుగుతే  చూడాలన్న  ఆర్తి  ఉంది. ఇంకా  మాటలలో వర్ణించ లేని  ఎన్నో  భావాలు  ఇముడ్చుకొని ఉంది.

    ఆ చూపు , అదే  చూపు, మదనుని  పంచ శరాలైన  అశోక, పున్నాగ, చంపక, కుముద, మల్లీ సుమాల  పరాగాలు  శ్రీనివాసుని  ఎదలో  నాటాయి.

    ‘ దేవతామూర్తి  లాంటి  ఈమె  తనని ప్రేమిస్తుందా ! నాకు  అంత  అదృష్టం ఉందా !! ’ అనుకొన్నాడు అతను.ఆమె  పి. ఎ.కావడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకొన్నాడు. అలా  ఒప్పుకొన్నాక  అతనిని టూరు నుండి  తప్పించాడు  ప్రజాపతి.

    ప్రణీత  తన కూతురే నని తెలిస్తే, శ్రీనివాసుని  ప్రవర్తనలో  మార్పు  కలగ వచ్చుననే  ఆలోచనతో  అలా తెలియకుండా  చేసాడు  ప్రజాపతి. ఆమె  నిజంగానే  అతని  ఆఫీసులో  కంప్యూటరు  ఇంజనీయరు . అదే విధంగా  పరిచయం  చేసాడు. ఆమె  కోసం  దూరంగా  ఒక  ఇల్లు  తీసుకొని అక్కడ  ఆమెని నివసించమనీ, శ్రీనివాసునికి  తాను  సాధారణమైన  మధ్య తరగతి  వికలాంగురాలైన కన్నెపిల్ల  అనే  భ్రమలోనే  ఉంచమని  చెప్పాడు.

    ప్రణీత  తన విషయం  దాచడానికి  ఏ  మాత్రం  కష్టపడ  లేదు. శ్రీనివాసుడు,  ఆమెను,  ఆమెగానే మనస్సు  లోలోతులలో  ప్రేమించాడు.సిరి  సంపదలు  పట్ల అతనికి  ఏ నాడూ  అపేక్ష ,ఆకర్షణ లేవు.కనుక  ఆమెను  సామాన్యురాలిగానే  తలఛాడు. ఆమె  కాలుని  బాగు చేయడమే  తన కర్తవ్యంగా భావించాడు.

    ఆమెను ఇంటినుండి ఆఫీసుకి, దిగబెట్టేవాడు. ఆఫీసులో ఆమె దగ్గర  కంప్యూటింగు నేర్చుకొనేవాడు, తిరిగి  ఆమెను  ఆఫీసు నుండి  ఇంటికి దిగబెట్టేవాడు. వంటింట్లోకి వెళ్లి, ఆమె  కోసం  పథ్యంతో,  పద్ధతిగా వంట చేసేవాడు. ఆ పని  ముగిసాక  ఆమె  కాలికి  చికిత్స  మొదలు  పెట్టేవాడు.

    ఆమె కుడికాలు బొటనవ్రేలు క్రింద ,సుజోక్ ప్రోబుతో నొక్కి,దానిని స్పందించేలా  చేసాడు.ఆ తరువాత పాదానికి లేపనాలు,తైలాలు మర్దనాలు,మాలీషులు చేసి ,వెదురు బద్దలు కట్టి, వంకర  పోయేందుకు దానిని మోకాలుతో  స్క్రూలు బిగించి కట్టు  కట్టాడు.

    ప్రణీత మొదట్లో ఆ చెక్కలని భరించ లేక పోయేది.అయినా ఆమె అతనిని నమ్మింది. లేని ధైర్యం తెచ్చుకొని ఆ బాధని  పంటి బిగువున భరించేది.

    ఆమెకి చికిత్స చేసాక ,మంచం మీద  పడుకో బెట్టి, ఆ ఇంటికి  ఎదురుగా  ఉన్న మరొక ఇంటిలో  ఒక గది  తీసుకొని  అక్కడే పడుకొనే  వాడు. పాదాలని, అవసర మయితే  ఆమె  చేతులనీ, భుజాలనీ, ఆసరా  ఇచ్చేందుకు  నడుమునీ, తప్ప మరే  ఇతర భాగాలనీ  తాకేవాడు  కాడు.మనసు ఆమె పట్ల ఎంత  రాగ  రంజితమైనా, అల్లరి  చేసినా, దానిని  సంయమన  మంత్రంతో  వశ  పరచి,  నిగ్రహించే  వాడు.

    ఆమె  మనస్సు  శ్రీనివాసుని  వైద్యనిగానే  గుర్తించింది.  అతని  స్పర్శ  చికిత్స   ఆమెకి  ఒక  ఆప్త  బంధువు స్పర్శలాగే  అనిపించేది.

    కాని  ఒక రోజు, ఆరు నెలలు  దాటిన  ఆ రోజు,

    ఆమె కాలుకు కట్టిన చెక్కలు విప్పిన శ్రీనివాసుడు ఆనందంతో కేక పెట్టాడు. “ ప్రణీతా ! నీ  పాదం  తిన్నగా అయిపోయింది !” అంటూ, అలా అంటూనే  ఆమె పాదాన్నిఎత్తి ముద్దు పెట్టుకొన్నాడు.

    ప్రణీత  ముందుగా తన కుడికాలి పాదాన్ని చూసుకొంది.తన కళ్లని తానే నమ్మలేక  పోయింది !తరువాత,అతను తన పాదం మీద పెట్టిన ముద్దును సహజంగానే స్వీకరించింది  . “ ధన్యవాదాలు శ్రీనూ !” అంటూ  తన పాదాలని  పట్టుకొన్న  అతని  చేతులని ,తనచేతుల లోకి  తీసుకొని మీదకి  ఎత్తి  కళ్లకి  హత్తుకొంది. ఆ చర్యలో ఆమె మనసు ప్రకటించని, రాగ బీజాన్ని గుర్తెరిగిన శ్రీను మౌనంగానే ఉండి పోయాడు.

    శ్రీనివాసుని హృదయం ఆ సమయంలో మూగ పోయినా,తరువాత చాలా అలజడిని  రేపింది.దాని తుఫాను తీవ్రతకి తట్టుకో లేక, అతను వంటింట్లోకి  వెళ్లి, వంట చేసే నెపంతో, దానిని  శాంతింప చేసాడు, ఆ  తరువాత  తన  గదిలోకి  వెళ్లాక  వెక్కి వెక్కి  ఏడ్ఛాడు ! తండ్రి  చేత  చెయ్యని  నేరానికి  దెబ్బలు  తిన్నప్పుడు  కూడా  అతనంతలాగ  ఏడవ లేదు.

    ప్రణీత  పాదం  సరిగా  అయి  మార్పు  కనిపించగానే, శ్రీనివాసుడు  ఆమె కుడి  మోకాలు  వంకర  తీర్చడానికి  వైద్యం  ఛేయసాగాడు. ఈ సారి  చేసే  సపర్యలలో ,అతడు  తన భావోద్వేగాలను అదుపులోకి  తెచ్చుకొని  సేవ చేసాడు. ఆ పని  చేయడానికి  అతనికి ‘ పులికొవ్వు’ అవసర  మయింది. ఆ మాటే  ప్రణీతకు  చెప్పాడు.

    “ అదెంత సేపు !.మా  నాన్నగారితో  చెప్తే ,నిమిషాల మీద  తెప్పిస్తారు,” అంటూ నాలుక కరచుకొంది.

    “నీకు నాన్నగారు ఉన్నారా ప్రణీతా !ఇంత వరకు చెప్పలేదేం ?”అడిగాడు అతను.

     ప్రణీతకు తన తొందరపాటు తెలిసింది.తన తండ్రి సంగతి ఇప్పుడిప్పుడే చెప్పడం  మంచిది కాదనుకొంది. “ సందర్భం రాక చెప్పలేదు శ్రీనూ !అతనికి ఈ రోజే ఈమెయిల్ పంపిస్తాను. నా కాలు  బాగు  అవగానే  పిలిచి పరిచయం  చేస్తాను” అంది.

    శ్రీనివాసునికి  ఆమె  మాటలలో  ఏదో  మర్మమున్నట్లు  అనిపించింది. నిండు  కుండ  లాంటి  అతను  ఏ  మాత్రమూ తొణక  లేదు. ఆ క్షణంలోనే  అతనామె పైన  పెంచుకొన్న  ఆశలని  త్రుంచి వేసుకొన్నాడు. అతనికి  కావలసిన  పులికొవ్వు రెండు రోజుల లోనే దొరికింది. అతను  దానితో వైద్యం  మొదలు పెట్టాడు.

    ప్రణీత  కుడి మోకాలు  వంకర  తీరి  కాలు  నేల మీద  పెట్టడానికి  మరో  ఆరు నెలల  సమయం  పట్టింది.ఆ రోజు  ఆమెకి కలిగిన ఆనందం వర్ణనాతీతం ! తన కాలుని  మాటి మాటికీ నేల మీద ఆన్చి చిన్న పిల్లలాగ  కేరింతాలు  కొట్టింది.సంతోషంతో ఉప్పొంగి పోయింది. తన కుడికాలు  నయమయింది! ఇక  ఎడమ  కాలుకి  ‘జయపూరు  ఫుట్  అమర్చు కోవచ్చు’ అనుకొంది.

    ఆ మాటే శ్రీనివాసుని అడిగింది. “ నాతో  జయపూరు వస్తావా  శ్రీనూ ! ” అంటూ. శ్రీనివాసుడు కాదన లేదు.అతనికి ఆ వైద్య విధానం చూడాలని కుతూహలం కలిగింది.

    ప్రజాపతి  వారిద్దరికీ  సెలవు  మంజూరు  చేసాడు, జయపూరుకి తన  ఎ.సి  కారులో పంపించాడు.

    శ్రీనివాసునికి  అదేమీ  సందేహించ  వలసిన  విషయంగా అనిపించ  లేదు. దానిని తన యజమాని  సౌహార్ద్రతగానే  భావింఛాడు. కాని  మూడు  నెలల  తరువాత ,జయపూరు  నుండి,తిరిగి వచ్చి, తన కాలి మీద తానుగా నడుచుకొంటూ వచ్చిన కూతుర్నిచూసిన  ఆనందంలో  ఆమెని  కౌగలించుకొని ముద్దాడి నప్పుడు  మాత్రం, ఆ విషయం  అర్థం అయింది  శ్రీనివాసునికి.

    వెంటనే అక్కడి నుంచి తప్పుకొన్నాడు.

    “ ప్రాంజలీ ! ఏమిటే  అంత  ముభావంగా  ఉన్నావు , ఏదైనా  సమస్యా?”తమ మాటల  మధ్య దూరకుండా ఎటో శూన్యం లోకి చూస్తూ,ఆలోచిస్తూ  కూర్చొన్న ప్రాంజలిని అడిగింది  వినత.

    “ మాతమ్ముడు రవికాంత్ ఏమైనా అన్నాడా,మరదలా ?”మేల మాడింది  అపాల.

    “ మీ తమ్ముడు నన్నేమీ అనలేదు వదినా ! మా నాన్నగారినే ---” మాట పూర్తి చేయకుండా  గ్రుడ్ల వెంట కన్నీరు కుక్కుకొన్న ,ప్రాంజలిని చూసిన‘వినత, అపాల,ధరణి ,విషయం గంభీరమైనదేనని గ్రహించారు.

    “ ప్రాంజలీ ! మీ నాన్నగారికి  ఏమయిందే ? దుఃఖం చెప్పుకొంటే  తగ్గుతుందని అంటారు, అందుకని చెప్పవే !” ప్రాంజలి చెప్పింది.

    ప్రాంజలి తండ్రి గవర్నమెంటు ఉద్యోగి. ఎలాంటి  వారసత్వపు  సంపదలూ లేనివాడు. ప్రాంజలికి ,‘ రవికాంత్’ తో  సంబంధం  నిశ్చయమైనప్పుడు , వియ్యాల వారు  అడిగిన  వరకట్నం  ఏ విధంగానూ  ఇచ్చుకోలేని  పరిస్థితిలో  ఉన్నాడు.వాళ్లకి అమ్మాయి నచ్చింది, కాని  వరకట్నం కూడా  నచ్చాలి  కదా ! ఇద్దరికీ  కావలసిన  మధ్యవర్తి  చాల  చురుకుగా  వ్యవహరించి, సమస్యని  ఒక కొలిక్కి తెచ్చాడు. ముందుగా ఎలాంటి  దక్షిణా ఇచ్చుకో నక్కర  లేదు. పెళ్లి ఉభయ ఖర్చులూ  భరించి, ఘనంగా చేయాలి ! ఆ తరువాత  కన్యాదాత ఎలాగూ  సంవత్సరం  తరువాత  రిటైరవుతాడు  కనుక , అప్పుడు వచ్చే, ఆదాయం  నుండి, వర కట్నాన్ని పువ్వుల్లో  పెట్టి సమర్పించాలి. ఇదీ  ఆ సామరస్య పథకం !
    ప్రాంజలికి ఈ ఒడంబడిక ఎంత మాత్రంఇష్టం లేదు.ఆమె ఇష్టానిష్టాలు ఎవరికి కావాలి !

    ప్రాంజలి పెళ్లి సుసంపన్నమయింది.ఆ తరువాత  శోభనం కూడా  వైభాంగా జరిగింది. కోడలు అంద చందాలు  చూసిన  అత్త మామలు, ఆమె  సమ్మోహన  మంత్రం  వేయ గలదనే అనుమానంతో, శోభనం  అయ్యాక  ఆమెని, పుట్టింట్లోనే  ఉంచేసారు.

    పిల్లని  పుట్టింట్లో  ఉంచుతేనే తప్ప,కన్యాదాతకి, తన కర్తవ్యం గుర్తుకి  రాదనే, ప్రాథమికి సూత్రాన్ని  అమలులో  పెట్టారు. రవి  కాంత్  కొత్త  పెళ్లి కొడుకు, అందుకని మౌనం వహించాడు.ప్రాంజలి  మొదటి మూడు  రాత్రులూ  ముభావంగానే గడిపింది.సమ్మోహన మంత్రం వేయ గలిగే  సాహసమూ, చొరవ చేయలేక పోయింది !

    నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ  సేవానంతరం,నామ మాత్రంగా లభించిన, ప్రావిడెంటు ఫండు, గ్రేట్యుటీ, లీవు సేలరీ, కామ్యుటేషన్ రుసుము,ఇంకా తదితర రుసుములు  దొరికిన తక్షణం ,దశమ (జామాతా ) గ్రహం తన్నుకు పోయింది. రిక్త హస్తాలతో మిగిలి పోయిన  ప్రాంజలి  తండ్రి, అల్లుడు  ముచ్చట  పడిన బైకుని కొని ఇవ్వలేక పోయాడు. తన అశక్తతని అంజలి  ఘటించి  విన్నవించుకొన్నాడు అతను. ఆ సమస్యకి  కూడా , పెళ్లినాటి  పరిష్కారాన్నే  సూచించిన  దశమ గ్రహం, మాట నిలబెట్టుకో లేక పోయిన  అతనిని ,తన మాటలతో తూట్లు  చేసి, ప్రాంజలిని  తీసుకొని వెళ్లి పోయాడు. సంవత్సరం పాటు సమయం ఇచ్చి!.ప్రాంజలి  మనసు  ఎంతగానో  గాయ పడింది.

    అత్తవారింటికి వచ్చాక,  ప్రోజెక్టు  కోసం రవికాంతనే  ఎంపిక  చేసారు అతని యజమానులు ! దాంతో  ఉద్యోగ ధర్మమూ,, హానీమూను  రెండూ  కలసి  వచ్చాయని తలంచిన అతను, ఆమెను వెంట పెట్టుకొని  వచ్చాడు.

    అదే  ప్రాంజలి మనోవ్యధకి  కారణం.

    ధరణి ఆమెని ఓదార్చింది. “ ఊరుకో  ప్రాంజలీ ! అది  అందరి  ఆడ  పిల్లల  సమస్యే ! మూడేళ్లయితే  అన్నీమరచి పోతావు. ” అంటూ..ఆమె పెళ్లి అయి మూడేళ్లే అయింది  మరి !!

    వినత, అపాల  మౌనం వహించారు. వాళ్లు కూడా దానికి ఆ  సమస్యకి అతీతులు కారు. సంపదతో సంబంధం ఏర్పరుచుకొనే  ఏ ఇంటి కథైవా  అలాగే   ఉంటుంది !

    శ్రీనివాసుని  విషయంలోనూ అదే జరిగింది. రెండు  కాళ్లూ  బాగయి, ఇంటికి వచ్చిన కూతుర్ని, ఒక అనామకునికి ఇచ్చిచేయడానికి, ప్రణీత  తల్లి  అంగీకరించ  లేదు.ప్రజాపతి ఆమెకి సర్ది చెప్పలేక పోయాడు.ప్రణీతకి  కూడా  శ్రీను పైన గౌరవమే గాని, ప్రజాపతి గారు ఆశించిన  ప్రేమ కలుగక  పోవడం  వల్ల అతను మౌనం  వహించాడు.

    ప్రణీత వివాహం  రంగ రంగ వైభోగంగా జరిగింది. వరునిది  డ్రై ఫ్రూటు  బిజినెస్సు., సూరత్ లోనే  నివాసం .అన్ని విధాలుగానూ జోడీ  బాగుందని  అందరూ ప్రశంచించారు. శ్రీనివాసుడు కూడా మనసారా వధూ వరులని  అభినందించాడు.ప్రణీత  కొత్త కారులో,, అత్తవారింటికి వెళ్లింది

    వేడుకలన్నీ ముగిసాక శ్రీనివాసుడు ప్రజాపతి గారిని అడిగాడు “అయ్యగారూ ! నాకు కొన్ని రోజులు సెలవు ఇప్పించండి. నేను గురువుగారిని చూసి వస్తాను”

    ప్రజాపతి గారికి ఏం చెప్పాలో తోచలేదు.‘ శ్రీనివాసున్ని తాను అల్లునిగా చేసుకోవాలని  అనుకొన్నాడు.తన మిత్రుడు అయిన భాస్కర మూర్తిది కూడాఅదే అభిప్రాయం ! ఇప్పుడు అక్కడికే  వెళ్తానని అంటున్నాడు. భాస్కర మూర్తి గారికి విషయ మంతా తెలిసి పోతుంది ! అతను ఏమనుకొంటాడు ?శ్రీనుని పరీక్షించడానికి తాను ప్రణీత కలసి ఆడిన నాటకం  బయట పడి పోదూ ! అంతలా శల్య పరీక్షలు చేసి, కేవలం ఆమె కోసమే, ఆమెను ప్రేమించిన ,నిస్వార్థ  సేవకుడైన  తన శిష్యున్ని, ఎందుకు తిరస్కరించినట్లో,అర్థం కాక  భాస్కర మూర్తి ఏమైనా అనుకొంటే !అతనిని తిరిగి రానీయకుండా ఆపేస్తే !భగ్న ప్రేమికుడైన యీ యువకుడు ఆయన  మాటలకి కట్టుబడి ఆగిపోతే !తనకీ తన కుటుంబానికీ ఇంత మహోపకారాన్నిచేసిన ఇతనికి  తానేమిచ్చాడు ! నెల జీతం  రెండువేల రూపాయలు తప్ప ! ఆ ధనాన్నికూడా అతను తన దగ్గరే ఉంచాడు ! అతని మస్తిష్కంలో చిన్న  ఆలోచన వచ్చింది. “ శ్రీనూ ! అలాగే  వెళ్లి రా, వెళ్లే  ముందు  నీ  పదిహేను  నెలల  జీతం ముప్ఫైవేల రూపాయలు కూడా తీసుకొని  వెళ్లు. కాని ఒకమాట—”

    `` చెప్పండి  అయ్యగారూ !”

    “ నా కంపెనీ ‘ఎం.డి.సోలంకీ’మరో  నెల రోజులలోనే  రిటైరు కానున్నాడు.అతని స్థానంలో యోగ్యుడైన వ్యక్తి కోసం  చూస్తున్నాను---”

    ప్రజాపతి మాటలకి, మధ్యలోనే  అడ్డు పడ్డాడు శ్రీను. “ అయ్యగారూ ! ఆ పనికి  ‘గుజరాతీ’ గారు బాగుంటారు” అన్నాడు.

    “గుజరాతీని నేను మార్కెటింగ్ & అడ్వర్టైజింగ్ విభాగానికి మేనేజరుని చేసాను. అతను  దానికే సమర్థుడు, నా దృష్టిలో ఆ పనికి వేరే వ్యక్తి ఉన్నాడు”

    “ ఎవరు అయ్యగారూ ! ఆ వ్యక్తి ?”

    “ అతడు వేరెవరో కాదు,’నువ్వే! నిన్నేమా కంపెనీకి ఎం.డి.గా ప్రమోట్ చేయాలని అనుకొంటున్నాను.”

    శ్రీనివాసుడు అంత పెద్ద పదవికి తనని ఎంపిక చేసినందుకు ఎగిరి గెంతులు వెయ్య లేదు. తను ఆ భాద్యతని నిర్వహించ గలడా లేదా అనే ఆలోచించాడు. “అయ్యగారూ ! మీరేమీ  అనుకోక పోతే  నాదొక మనవి” అన్నాడు.

    “ ఏమిటది?”

    “ ఒకే సారి  నన్ను అంత  పెద్ద పదవిలో  కూర్చోబెట్టవద్దు. నేను  డిగ్రీ చదువులు చేయలేదు. నన్నుసీటులో’కూర్చో బెడితే  మీ కంపెనీ లోని సిబ్బంది, చాల  అసంతృప్తికి  లోనవుతారు.ఆ అసంతృప్తి వల్ల వారందరూ మీ మీద కోపాన్ని, మరో విధంగా ప్రదర్శిస్తారు. పనులు సక్రమంగా చేయక మొరాయిస్తారు.”

    శ్రీనివాసుని మాటలు విన్న ప్రజాపతి అప్రతిభుడయ్యాడు ! ‘ ఈ యువకుడు అన్న  మాటలు నిజమే ! ఏమీ చదువుకో లేదు అంటూనే ఎంత విఙ్ఞతని ప్రదర్శింఛాడు ! తను అంత దూరం ఆలోచించనే లేదు.అయినా ఏమిటీ యువకుడు ! ఇవ్వడం తప్ప  తీసుకోవడం తెలియదా వీనికి ? ” అనుకొన్నాడు.

    “ శ్రీనూ ! అయితే నువ్వే   చెప్పు,ఏమి చేయాలో ?”

    ‘ ఏం చేయాలని తననే  అడుగుతున్న ప్రజాపతిని చూసి, శ్రీనివాసుడు కూడా  ఆశ్చర్యపడ్డాడు. ఈ యజమాని ఎంత సహృదయుడు ! గురువుగారైన భాస్కర మూర్తిగారు,ఈ ప్రజాపతి గారు, ఇద్దరూ  ఒకే  వ్యక్తిత్వపు మూసలో  పోసి  తయారు చేసినట్లున్నారు ! ఇతనికి సరి అయిన సలహా ఇవ్వాలి.’

    “ అయ్యగారూ, దీనికి రెండు మార్గాలు ఉన్నాయి.”

    “ ఏమిటవి శ్రీనూ?”

    “ మీ అల్లుడిగారినే తాత్కాలికంగా, ఎం.డి.పదవిలో నియమించండి.దీనివల్ల అమ్మాయి కూడా కొంత కాలం ఇంట్లోనే ఉన్నట్లుంటుంది. అతనికి వ్యాపార అనుభవం కూడా ఉన్నాది కాబట్టి,పెద్ద కష్ట పడ నక్కర లేదు, మీ సిబ్బంది కూడా అల్లుడు గారే  కాబట్టి,ఏమీ అనుకోరు. నన్ను ప్రమోట్  చేస్తానంటున్నారు కాబట్టి,‘టూరింగు బృంద సభ్యునిగా కాకుండా, టూరింగు కార్య నిర్వాహక  అధికారిగా నియమించండి. నా వైద్య వృత్తిని నేను  ఏ పదవిలో ఉన్నా చేస్తాను. ఆ తరువాత కొంత కాలానికి  గుజరాతీ  గారిని ఎం.డి గా చేయండి. నాకు  ఆ విభాగాన్ని అప్పగించండి. అలా అంచెలంచెలుగా  చేస్తే  మీ అభిప్రాయాన్ని ఎవరూ తప్పు పట్టలేరు.”

    “ బాగానే ఉంది, రెండవ మార్గం ఏమిటి ?”’

    “ గుజరాతీ గారిని ఎం.డి.ని చేసి, ఆ స్థానంలో మరొక సమర్థుడైన వ్యక్తిని నియమించండి. నన్ను టూరింగు కార్య నిర్వాహణ అధికారిగా చిన్న పదోన్నతిని ఇవ్వండి.”
    “ అంటే  అంచెలంచెలుగా  నిన్ను ప్రమోట్ చేయమంటావు, అంతేనా ?”

    శ్రీనివాసుడు అతని మాటలకి జవాబివ్వలేదు. తల వంచి నిలబడ్డాడు.

    “ సరే, శ్రీనూ ! నీ జీతం  ముప్ఫ్యువేల రూపాయలు  కోశాధికారి దగ్గర   తీసుకొని , నువ్వు పార్వతీ పురం లోని శ్రీ భాస్కర మూర్తి గారిని  చూసి రా ! అతనిని అడిగినట్లు చెప్పు !  తిరిగి వచ్చాక  నీకు స్వల్ప పదోన్నతిని ఇస్తాను  సమయానికి  తిరిగి రా !”

    శ్రీను అంగీకారంగా తల ఊపాడు.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద